15, సెప్టెంబర్ 2022, గురువారం

MOUNT ABU MEMORIES

మరపురాని మౌంట్‌ అబూ

(జ్ఞాపకాల దొంతర-1)


                       

మౌంట్‌ అబూ.. చాలాసార్లు విన్నపేరు. అబూ పర్వతము.. అప్పుడప్పుడూ తారసపడ్డ నామం. ఉత్తరాదిలో అదికూడా ఎడారి రాష్ట్రమైన రాజస్తాన్‌లో ఉన్న పర్వతం ఇది. చెప్పుకోవడానికి ఎడారి రాష్ట్రమే అయినా.. అబూ పర్వత ప్రాంతం కావడంతో రాత్రివేళ చలి భలేగా గిలిగింతలు పెడుతుంది. పగటివేళ భానుడు తలను ఓ రకంగా బాదేస్తాడు. అలవాటు లేకపోవడం వల్ల ఎండలో పట్టుమని పది నిమిషాలు ఏకధాటిగా ఉంటే చాలు.. మాడు పగిలిపోతుంది. ఇదీ అక్కడి పరిస్థితి. అలాంటి మౌంట్‌ అబూను మరచిపోలేం. ఒక్కసారి వెళ్తే చాలు.. జీవితాంతం ఈ జ్ఞాపకాల దొంతర మనల్ని తడుముతూనే ఉంటుంది. అందుకే మరపురాని మౌంట్‌ అబూ.

అక్కడికి వెళ్తానని, ఎనిమిది రోజులు పూర్తిగా అక్కడే ఉంటానని, అక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తానని, పరిసరాలను చూసి మురిసిపోతానని ఎప్పుడూ అనుకోలేదు. సీనియర్‌ జర్నలిస్టు శేషగిరి రావు (శేషన్న) దాదాపు పదేళ్ల నుంచి చెబుతూనే ఉన్నాడు. కానీ, ఇన్నాళ్లకు అక్కడికి వెళ్లడానికి కుదిరింది. వీలు కుదిరింది అనేకన్నా.. ఓ రకంగా బలవంతంగానే వీలు కుదుర్చుకున్నా. అనుకుంటూంటే రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు కూడా గడుస్తూనే ఉన్నాయి. దీనికి తోడు నాకు అన్నివేళలా అండదండగా ఉండే, నాకు పెద్దన్నలా వ్యవహరించే సీనియర్‌ జర్నలిస్టు దేశబోయిన శ్రీనివాస్‌ (డీఎస్‌ఆర్‌) అన్న కూడా ఈసారి వెళ్దాం అని హుకుం జారీచేశాడు. ఆయన కూడా.. నాలాగే... ఎన్నిసార్లు వెళ్లేందుకు వీలుచిక్కినా పెద్దగా పట్టించుకోలేదు. ఇక, వెళ్లడమే అని గట్టిగా నిర్ధారించుకున్నాక, మానసికంగా కూడా సన్నద్ధమయ్యాను. ఒకరకంగా చెప్పాలంటే డీఎస్‌ఆర్‌ అన్న పట్టుబట్టడం వల్లే ఆయన మూలానే నేను మౌంట్ అబూకు పయనమయ్యాను. తోటి ఫ్రెండ్స్‌తో కలిసి ప్రయాణం చేయడం, అక్కడ అందాలను ఆస్వాదించడం అనేది మరపురాని అనుభూతి. శేషన్న, డీఎస్‌ఆర్‌ అన్న పూర్తిగా నాతోనే ఉన్నారు.

మౌంట్‌ అబూ వెళ్లే రోజు కోసం దాదాపు నెలరోజులుగా కౌంట్‌డౌన్‌ కొనసాగింది. ఎప్పుడెప్పుడు వెళ్తానా? అని నాలో నేనే ఆ రోజుకోసం ఎదురుచూశా. ఇక, వెళ్లాల్సిన రోజు రానే వచ్చింది. ఆ రోజు ఉదయాన్నే ఓ రకమైన థ్రిల్లింగ్‌. ఇవాళే నేను మౌంట్‌ అబూ వెళ్లబోతున్నానన్న ఆనందం మనసునిండా నిండిపోయింది. ఆరోజు కూడా ఎప్పటిలాగే ఉదయం ఆఫీసుకు వెళ్లాను. రోజువారీ విధులు నిర్వర్తించాను. సాయంత్రం ఇంటికి వచ్చి.. రెడీ అయి రాత్రి తొమ్మిది గంటలకు ఇంట్లో నుంచి బయలుదేరాను. పది గంటల కల్లా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ చేరుకున్నాను. అప్పటికే డీఎస్‌ఆర్‌ అన్న స్టేషన్‌కు వచ్చేశాడు.

ఇక, పదిహేనేళ్లక్రితం జెమిని న్యూస్‌ ఛానెల్‌లో నాతో కలిసి పనిచేసిన యాంకర్‌ కృష్ణమోహన్‌ మౌంట్‌అబూకు బయలుదేరే ముందే మా టీమ్‌లో ఉన్నాడని తెలిసింది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లోనే ఇద్దరం చాలాయేళ్ల తర్వాత కలుసుకున్నాం. ఆ పరిణామం కూడా నాలో మంచి అనుభూతిని కలిగించింది. అలాగే, తెలుగు యూనివర్సిటీలో నేను జర్నలిజం స్టూడెంట్స్‌కు స్పెషల్‌ క్లాసులు చెప్పిన సమయంలో నాతో పాటు క్లాసులు చెప్పిన సుజాత గారు కూడా మౌంట్‌అబూకు పయనమయ్యారు. అలా.. ఒక్కొక్కరుగా స్టేషన్‌కు చేరుకున్నారు. మరికొందరు కూడా అప్పటికప్పుడు పరిచయమయ్యారు. అలా.. పాత, కొత్త పరిచయాలతో మౌంట్ అబూ ప్రయాణం ప్రారంభమయ్యింది.

- సప్తగిరి గోపగాని

26, డిసెంబర్ 2019, గురువారం

వీర నారీమణులు లక్ష్మీబాయి, ఝుల్కారీ బాయి - శిశుమందిర్‌ స్ఫూర్తి మాసపత్రిక నవంబర్‌ 2017



దేశమాత విముక్తి కోసం మత విశ్వాసాలనే త్యజించిన భగత్‌సింగ్‌ - శిశుమందిర్‌ స్ఫూర్తి మాసపత్రిక అక్టోబర్‌ 2017




నినాదం మారుతోంది - రెచ్చగొట్టే వ్యాఖ్యలూ మారాలి (Jagrithi 30th December 2019)


కేంద్రంతో కుస్తీ - ఎంఐఎంతో దోస్తీ (Jagrithi 23rd December)


ఇద్దరు మంత్రులను ఇంటికి పంపేయనున్నారా ? (Jagrithi 16th December)