సొంత కవిత్వం

నవ యువకుడు

22 జనవరి 2012 17:56



మేలుకో.. మేలుకో నవ యువకా మేలుకో
దేశసేవనుద్డరించ నీవు మేలుకో                  {మేలుకో}

అన్యాయం అక్రమాలనెదుర్కొంటూ అడ్డునిలిచి
నవసమాజ నిర్మాణం స్థాపించగ కదలిరా
అవినీతి దౌర్జన్యం లంచగొండితనాలనూ
తరిమి తరిమి కొట్టుతూ అడుగుముందుకేయరా  {మేలుకో} 

స్వార్థపరుల చేతుల్లో నలిగిపోయె సామాన్యుల
కన్నేటిని చూసి నీవు జాతిని మేల్కొలపరా
ఇకనైనా నిద్రలేచి నీ తప్పును తెలుసుకొనీ
రాజకీయ రాబందుల ఆటలు కట్టించరా            {మేలుకో}

గాంధీజీ కలలుగన్న రామరాజ్యానికీ
ఈ రాజకీయ ద్రోహాన్ని చీల్చి చెండాడరా
రేపటి మన జాతి బ్రతుకు ఏమౌతుందో ఊహించి
రామరాజ్య స్థాపనకై నడుం కట్టి నడవరా          {మేలుకో}

                       - సర్దార్   
                         3.9.97 బుధవారం  


పారాహుషార్

22 జనవరి 2012 18:01


పాశ్చాత్య కోరల్లో విలవిల్లాడుతున్న జీవితం
భాషా సంస్కృతుల ఆవశ్యకతను విస్మరిస్తున్న దారుణం
ఆప్యాయత అనురాగాలకు దూరమవుతున్న పసిబాల్యం
కంప్యుటర్ తప్ప కథలకు తీరిక లేని విద్యార్థి లోకం
'అమ్మ ' అంటే ఏమిటంటూ..
మమ్మీనే ప్రశ్నిస్తున్న చిన్నారి అమాయకత్వం
నాగరికత మోజులో భాషను తాకట్టు పెడుతున్న దైన్యం
తెలుగు భాష టెల్గు అయిన నిజం
భాష సంస్కృతి అంతే నేటి తరానికి తెలియని వాస్తవం
ఒకప్పటి తెలుగు సంస్కృతి వైభవం ఘనం
దానికి నేడు అవుతోంది గాయం
స్మైలీ, హనీ, పింకీ, స్వీటీల ఊబిలో..
చిట్టి, నాని వంటి తెలుగు పేర్లు మాయం
వంద తెలుగు మాటలు మాట్లాడినా ఉండదు ఆదరం
నాలుగు ఆంగ్ల ముక్కలతోనే పదిమందిలో గౌరవం
సంస్కృతి సంప్రదాయలు ఇప్పటి యువతకు అపరిచితం
పురాతన కళలు కనుమరుగవుతున్న నైజం
భాషలోని కమ్మదనం.. యాసలోని నిండుదనం
ముందు తరాలకు కథలుగా చెప్పాల్సిన వైనం
తెలుగు సంస్కృతి భావితరాలకు..
అవుతుంది గతించిన యుగం
అలక్ష్యానికి చెల్లించాల్సి వస్తుంది..
తగిన మూల్యం
పారా హుషార్ !

              - 05-11-2005.

నిలదీయ్ !

22 జనవరి 2012 18:00


అప్పుడు...

రక్తాన్ని చెమటగా మారుస్తున్నప్పుడు
నీ శరీరం కృషించిపోయినా
రసాయనాలూ, యంత్రాలూ నీ ఆరోగ్యాన్ని తినేసినా
నువ్వు అధికారం నిర్లక్ష్యం కాళ్లకింద నలిగిపోయావు
మనుగడ కోసం పరితపిస్తూ...
నమ్ముకున్న కర్మాగారాన్ని తల్లిలా భావిస్తూ....
నీవు దోచబడుతూ కూడా...
అన్నదాత దోపిడీ పాలవకుండా చూశావు
నీ కష్టానికి ఫలితం దక్కకపోయినా
వచ్చిన దాంతో సంతృప్తి చెందుతూ
ముందున్న అగథాన్ని తెలుసుకోలేక పోయావు

ఇప్పుడు...

ఆపద రానే వచ్చింది
మూసివేత వేటు బతుకు మీద పోటెత్తింది
గతాన్ని నెమరు వేసుకుంటున్న క్షణం...
గడచిన అనుభవాలు
అనుభవాల మధ్య ఇంకేదో మూల.. కొడిగడుతున్న ఆశ
చివరికేం మిగిలింది..?
కమ్ముకున్న కన్నీటి పరవళ్లు తప్ప
అవసరానికి ముందు దోపిడీ
అవసరం తీరిన తర్వాత పీడన
ఇదే కదా వ్యవస్థ మనస్తత్వం
వాళ్లంతా అక్కర తీర్చుకొని
ఈ నీడను తలొదిక్కుకి తన్నేసి పోతారు
నువ్వొక్కడివే దీన్ని నమ్ముకున్నందుకు
ఏ దిక్కూ లేక ఈ చక్రాలకి.. పెళ్లాం పిల్లలతొ
బల్లిపాతర్లా పట్టుకొని వేలాడుతూంటావు
అవసరం ఊన్నప్పుడూ మొదటగా నువ్వే కావలసి వచ్చావు
అవసరం తీరిన తర్వాత కూడా మొదటగా నువ్వే..
తరిమివేయబడుతున్నావు

ఇంకా...

ఎవరొస్తారని ఆ ఎదురు చూపులు
ఇప్పటికైనా ప్రశ్నించు..
వాళ్లు ఒరగబెట్టిందేంటని..?
వాళ్లు నీకు చేసిన ద్రోహానికీ...
తడిగుడ్డ మెడచుట్టూ బిగించిన కుట్రకూ...
జవాబేంటని..
నిలదీయ్.. నిగ్గదీయ్ !
ఈ ప్రశ్న వాళ్ల వెన్నులో గునపంలా దిగెయ్
ఈ ప్రశ్న వ్యవస్థ గుండెల్లో గుబులెత్తించేలా దిగెయ్

(మూసివేసిన కర్మాగారాల్లోని అసంఘటిత కార్మికుల గురించి)


                    - 26.01.2000.

 

తప్పెవరిది..?

22 జనవరి 2012 17:59



తప్పెవరిది..?
తల్లిదండ్రులదా..?
స్నేహితులదా..?
రెచ్చగొట్టే అమ్మాయిలదా..?
దిశా నిర్దెశం ఇవ్వని సమాజానిదా..?

(ప్రేమ పేరిట దారుణాలపై)
         - 18-12-2008.


 

నిరసన పెద్ద నేరం

22 జనవరి 2012 17:58


ఇప్పుడు నిరసన పెద్ద నేరం
ఇప్పుడు నిరసన ఓ నిషేధింపబడిన హక్కు
అధికారం కమ్ముకున్న కళ్లకు
నిరసన ఓ జాతి విద్రోహ చర్య
నియంతలను గుర్తుకు తెస్తున్న ఏకపక్ష చర్యలు
నేలకు ఆమడ దూరంలో నాట్యం చేస్తున్న ధరలు
బడుగువాడి నడ్డి విరుస్తున్న విద్యుత్ ఛార్జీలు
వాస్తవానికి ప్రజల జీవనస్థితి వారికనవసరం
అందరూ తలొంచుకొని పెంచిన ఛార్జీలు కట్టాల్సిందే
ఎదురు తిరిగితే బుల్లెట్లతో ప్రాణభక్షన చేస్తున్న
ప్రజా రక్షకభటులు
ప్రజల నిరసన వాళ్ల దృష్టిలో రిగ్గింగ్ కంటే పెద్దనేరం
మనిషి మనిషిగా మసలడం కష్టం
లఠీలు, భాష్పవాయుగోళాలు, కాల్పులు
అధికార అత్యవసర ఆయుధాలు
స్త్రీల విషయంలో నాటి దుశ్శాసన పర్వాన్ని
రూపు గట్టిస్తున్న దృశ్యాలు
ఇక్కడ దృశ్యాన్ని నిరోధించడం నేరం
దృశ్యాలు ఫొటో తీయడం అంతకన్నా పెద్దనేరం
వారి బూటకపు విధానాల్ని గొప్పగా తెరకెక్కించడం తప్ప
ఏది చేసినా నేరం.. నేరం...


(బషీర్ బాగ్ కాల్పుల ఘటనతో)

              - 30.07.2000.

చిరునామా ఎక్కడ ?

22 జనవరి 2012 17:58


సంబరాల సరదాల సంక్రాంతి
ఎక్కడమ్మా నీ చిరునామా !
కనబడవేం సంక్రాంతి భోగి మంటలు
అగుపడవేం డూడూ బసవన్నల ఆటలు
వాకిళ్లలో కనుమరుగవుతున్న రంగురంగుల ముగ్గులు
గోప్యమై పోతున్న గొబ్బెమ్మలు
జీవన విధానాన్ని పూర్తిగా ఆవహిస్తున్న నవ నాగరికత
మాయల్లో కనుమరుగవుతున్న సంప్రదాయాలూ, సంబరాలు
ఫ్యాషన్ మోజులో విలవిల్లాడుతున్న విలువలు
అంతరించాలి ఈ మాయాజాలం
మల్లీ రావాలి మంచి కాలం
మనసున్న మనసుల ఎదలు కోలాహలంగా
జరుపుకునే సంక్రాంతి సంబరాలు
మళ్లీ రావాలి మా వాకిళ్లకు
నవశోభను తేవాలి మా లోగిళ్లకు
పట్నాలూ పల్లెలూ వాడలూ మేడలూ
సమంగా పంచుకోవాలి..
సంక్రాంతి లక్ష్మి అందించే భోగాలు
అవే మాతరం కోరుకునే వరాలు

              -13.01.2001.