20, ఆగస్టు 2014, బుధవారం

భారీగా నమోదైన తెలంగాణ జనాభా



              తెలంగాణలో కుటుంబాల సంఖ్య ఒక కోటి ఐదు లక్షలుగా నమోదైంది. జనాభా ఐదుకోట్లకు పైగానే ఉంటుందని తేలుతోంది. 2011 జనాభా లెక్కలను మించి కుటుంబాలు నమోదయ్యాయి. సమగ్ర కుటుంబ సర్వే.. రాష్ట్రంలోని కుటుంబాల లెక్కని పక్కా చేసింది. మొత్తం 1,05,76,922 కుటుంబాలను నమోదు చేసింది. 2011 జనగణనను అధిగమించి.. ఐదు కోట్లకు పైగా జనాభాను లెక్కలేసి చూపించింది. తెలంగాణలో 2011 గణాంకాల ప్రకారం 86.85 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఈ మూడేళ్లలో 19 లక్షలకు పైగా కుటుంబాలు పెరిగినట్టు సమగ్ర సర్వేలో తేలింది. హైదరాబాద్‌ను కలుపుకొని తెలంగాణ జిల్లాలన్నింటా ఇంకా  2 లక్షల 30 వేల 655 కుటుంబాలను సర్వే చేయాల్సి ఉంది.  ఇక సర్వే ద్వారా సేకరించిన డేటా ఎంట్రీ కోసం జీహెచ్‌ఎంసీ మినహా తొమ్మిది జిల్లాల్లో 17 వేల 140 కంప్యూటర్‌లను వినియోగించుకోనున్నారు. 381 కేంద్రాల్లో డేటా ఎంట్రీ జరగనుంది.  అయితే.. హైదరాబాద్‌లో మాత్రం సర్వే లెక్క తప్పింది. 2011 జనాభాలెక్కల ప్రకారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 15,24,392 కుటుంబాలు నివసిస్తున్నాయి. జనాభాపరంగా 68,09,970 మంది ఉన్నట్టు జనగణన తేల్చింది. కానీ.. సమగ్రసర్వే పూర్తయితే హైదరాబాద్‌లో కుటుంబాల సంఖ్య 22,28,818కు చేరుకునే అవకాశం ఉంది. నగర జనాభా కోటి దాటుతున్న ఛాయలు కనిపిస్తున్నాయి.

19, ఆగస్టు 2014, మంగళవారం

తెలంగాణలో సమగ్ర సర్వే సక్సెస్‌... సూపర్‌ హిట్‌! హైదరాబాద్‌లో లెక్క తప్పిన అంచనాలు










    తెలంగాణ సమగ్ర సర్వే విజయవంతమైంది..! జిల్లాల్లో ప్రజలు 95శాతానికి పైగా వివరాలు నమోదు చేసుకున్నారు.. ఎన్యుమరేటర్లకు సమాచారం ఇచ్చేందుకు ప్రజలందరూ ఆసక్తి చూపించారు. చిన్న చిన్న సమస్యలు ఎదురైనా జిల్లాల్లో ఎన్ రోల్ మెంట్  భారీగా నమోదైంది. ఉదయం నుంచి రాత్రి వరకూ సర్వే కొనసాగింది. దేశ విదేశాల నుంచి సొంత పల్లెలకు తరలివచ్చిన జనం తమ వివరాలు నమోదు చేసుకున్నారు. మంగళవారం తెలంగాణ మొత్తం సర్వేమయమైంది. అందరి సహకారంతో గొప్ప అద్భుతం ఆవిష్కృతమైందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. సర్వేలో పాల్గొనని వారికి మరోసారి అవకాశం కల్పిస్తామని చెప్పారు. సర్వే వివరాల ఆధారంగానే భవిష్యత్ పథకాలు రూపొందిస్తామని తెలిపారు. మరోవైపు.. ఇవాళ కూడా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

    సర్వే ద్వారా  ఇటు హైదరాబాద్‌లో, మొత్తం తెలంగాణలో జనాభా భారీగా పెరిగిందన్న విషయం వెల్లడైంది. ఇప్పటిదాకా 70  నుంచి 80లక్షల జనాభా ఉంటుందనుకుంటున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ జనాభా కోటి 20 లక్షల దాకా ఉండొచ్చని సమగ్ర సర్వే ద్వారా వెల్లడవుతోంది. అలాగే.. మొత్తం తెలంగాణ రాష్ట్రం జనాభా నాలుగున్నర కోట్లుగా నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.

    రాష్ట్రంలోని దాదాపు కోటి కుటుంబాల వివరాలు ఒక్కరోజే నమోదు చేశారు. సర్వే సమాచారాన్ని వారం రోజుల్లో కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తారు. ఆ తర్వాత ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించే వెబ్‌సైట్లో వివరాలు ఉంచుతారు. సెప్టెంబర్‌ ఆరోతేదీ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

    అయితే.. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మాత్రం అర్థరాత్రి దాటాక కూడా వివరాల నమోదు కొనసాగింది. ఉదయం నుంచి ఎన్యూమరేటర్లకోసం ఎదురుచూసిన జనం.. వాళ్లు కనిపించగానే ఆయా ప్రాంతాల్లో తమ వివరాలన్నీ నమోదు చేసుకునేదాకా ఎన్యూమరేటర్లను కదలనీయలేదు. దీంతో.. అర్థరాత్రి అయినా ఎన్యుమరేటర్లు అందరి వివరాలు నమోదు చేసుకోక తప్పలేదు.

18, ఆగస్టు 2014, సోమవారం

సకల జనుల సర్వే.. సమగ్ర కుటుంబ సర్వే తెలంగాణ మొత్తం సర్వేమయం







    సమగ్ర కుటుంబ సర్వే. తెలంగాణలోని పల్లెపల్లెనా.. ఇంటింటా ఇదే ముచ్చట! ఏ నలుగురు  కలిసినా.. ఇదే మాట! తెలంగాణ సర్కార్‌  ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సర్వేకు సర్వం సిద్ధమైంది. పల్లె లోగిళ్లు  కొత్త కళ  సంతరించుకున్నాయి. సుమారు కోటి కుటుంబాలను సర్వే చేసేందుకు 4లక్షల మంది ఎన్యుమరేటర్లు సిద్ధమయ్యారు.  సర్వేకోసం రాష్ట్రంలో, దేశంలో ఎక్కడెక్కడో ఉన్న తెలంగాణవాసులంతా అష్టకష్టాలు పడి మరీ సొంత ఊళ్లకు చేరుకున్నారు.  రైళ్లు,  బస్సులు సర్వే జనంతో కిటకిటలాడాయి.

    ఆదిలాబాద్‌ జిల్లాలో 747 లక్షల కుటుంబాల సర్వేకు 30వేల మంది ఎన్యుమరేటర్లు పనిచేస్తున్నారు.  మెదక్‌ జిల్లాలో 7.56లక్షల కుటుంబాల వివరాలు నమోదు చేసేందుకు 30వేల మంది ఎన్యుమరేటర్లను నియమించారు.  వరంగల్‌ జిల్లాలోని 10.15లక్షల కుటుంబాల సర్వేకోసం 43వేల మంది ఎన్యుమరేటర్లు, కరీంనగర్‌ జిల్లాలోని 9.86  లక్షల కుటుంబాల వివరాలు సేకరించేందుకు 34వేల మంది ఎన్యుమరేటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే  మహబూబ్‌నగర్‌ జిల్లాలో 9.74 లక్షల కుటుంబాల నమోదుకు 39వేల మంది ఎన్యుమరేటర్లు, నిజామాబాద్‌ జిల్లాలోని  7.5లక్షల కుటుంబాల సమాచార సేకరణకు 28వేల మంది ఎన్యుమరేటర్లు అవసరమవుతున్నారు. నల్గొండ జిల్లాలోని  10.42 లక్షల కుటుంబాల నమోదుకు 35వేల మంది ఎన్యుమరేటర్లు, రంగారెడ్డి జిల్లాలోని 7.89లక్షల  కుటుంబాలకు సంబంధించిన సమాచారం క్రోడీకరించేందుకు 28వేల మంది ఎన్యుమరేటర్లు, ఖమ్మం జిల్లాలోని 8.77  లక్షల కుటుంబాల వివరాల నమోదుకు 29వేల మంది ఎన్యుమరేటర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌  పరిధిలో 20లక్షల కుటుంబాల వివరాలు సేకరించేందుకు 75వేల మంది ఎన్యుమరేటర్లను నియమించారు. సమగ్ర సర్వేలో  హైదరాబాద్ పోలీసులు కూడా భాగస్వాములు అవుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో నాలుగు వేల మంది పోలీసులు  ఎన్యూమరేటర్లుగా విధులు నిర్వహించనున్నారు.

    సకల జన సర్వే సందర్భంగా తెలంగాణలో సర్వం బంద్‌ కానున్నాయి. గుళ్లు, బళ్లు, బస్సులు,  సినిమా హాళ్లు, ఇంటర్నెట్‌ ప్రొవైడర్లు, రైతు బజార్లు సహా  కోర్టుల దాకా అన్నింటికీ బంద్‌ ప్రకటించారు. నిత్యావసరాలైన  గ్యాస్‌, రేషన్‌ దుకాణాలూ మూత పడుతున్నాయి. అయితే.. ఆర్టీసీ బస్సులు నడుస్తాయా, లేదా అన్నవిషయంలో  మాత్రం సందిగ్ధం నెలకొంది. కార్మికులు తాము సర్వేలో పాల్గొనేందుకు స్వస్థలాలకు వెళ్లాలని, సెలవు ప్రకటించాలని  కోరినా.. పై అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు కరువయ్యాయి. హైదరాబాద్‌లో మాత్రం ఉదయం 5నుంచి  10గంటల వరకు, సాయంత్రం బస్సులు నడవనున్నాయి.

    సర్వే పూర్తికాగానే రికార్డులన్నీ రాత్రికి రాత్రే  సీజ్‌ చేసి, భద్రపరుస్తారు.  సర్వే  పూర్తికాగానే... డేటా  ఎంట్రీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్‌ 6వ తేదీలోగా గ్రామాల వారీగా చిట్టా  తీయనున్నారు. ఈ డేటా  ఆధారంగా సెప్టెంబర్‌లో పథకాలపై వ్యూహ రచన చేస్తారు.

    మరోవైపు.. రాష్ట్ర విభజనలో ఆంధ్రావైపు వెళ్లిన ఖమ్మం జిల్లాలోని ఏడు ముంపు మండలాల్లో  సమగ్ర  కుటుంబ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఖమ్మం జిల్లా యంత్రాంగం ముంపు మండలాల్లో సర్వే  నిర్వహించేందుకు  సమగ్ర ఏర్పాట్లు చేసింది. సోమవారం ఉదయం ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కలెక్టర్‌  చింతూరు, కూనవరం,  వరరామచంద్రాపురం, వేలేరుపాడు, కుక్కునూరు, భద్రాచలం పట్టణం మినహా మండలం,  బూర్గంపాడు  మండలంలోని ఆరు గ్రామపంచాయతీల్లో సర్వేను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

10, ఆగస్టు 2014, ఆదివారం

రాఖీ పండుగ అంటే రక్షా బంధనం.. అనుబంధాల ఆలింగనం







    సోదర సోదరీమణుల పవిత్ర బంధానికి అసలైన నిర్వచనం రక్షాబంధనం. రాఖీ పౌర్ణమి, రక్షా బంధన్‌, రాఖీల పండుగ ఎలా పిలిచినా.. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల బంధం మరింత ధృడంగా మార్చే పర్వదినం. చిన్న వయసులో ఒకే ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రుల చెంతన ఒకే గూటి పక్షులుగా.. కలిసి మెలిసి, ఆడుతూ, పాడుతూ పెరిగిన అక్కలు, చెల్లెండ్లు, అన్నలు, తమ్ముళ్లు.. ఆ తర్వాత తలో దిక్కుకు వెళ్లడం అనివార్యమవుతుంది. పెద్దయ్యాక ఎవరి జీవితాలు వారివిగా మారతాయి. కుటుంబాలు మారిపోతాయి. అన్నా తమ్ముళ్లు పుట్టింట్లోనే ఉంటే.. అక్కా చెల్లెళ్లు మెట్టినింటికి పంపించబడతారు. దాదాపు 20యేళ్లు ఒక్కచోట, ఒక్కింట్లో, తల్లిదండ్రుల చెంతన బతికిన వాళ్లు.. ఆ జ్ఞాపకాలను నెమరేసుకోవడం, పండుగలు, శుభకార్యాలకు గానీ కలవక పోవడం సర్వసాధారణమవుతుంది. ఎవరి జీవితాలు వాళ్లవి, ఎవరి బరువు బాధ్యతలు వాళ్లవి, ఎవరి కుటుంబం వాళ్లకు వేర్వేరవుతాయి. అయితే.. సోదర సోదరీమణుల మధుర జ్ఞాపకాలను నెమరేసుకునే అద్భుత సందర్భం రాఖీ పండుగ. చిన్నప్పుడు అల్లరిగా, బాధ్యతలు తెలియని సమయంలో చేసిన సహవాసం.. పెద్దయ్యాక బరువు బాధ్యతలు తెలిశాక కలిగే ఆప్యాయత మాటల్లో చెప్పలేం. ఆ అనుభూతులను వర్ణించలేం. ఆ మధుర క్షణాలను స్వయంగా అనుభవించాల్సిందే...

    రాఖీ పౌర్ణమి ప్రాశస్త్యంపై అనేక కథనాలు నానుడిలో ఉన్నా వాటి అంతిమ లక్ష్యం మాత్రం సోదరీ సోదరుల మధ్య ప్రేమ, ఆప్యాయతలే. నీవు నాకు రక్ష.. నేను నీకు రక్ష అంటూ సోదరీమణులు రాఖీలు కడతారని, సోదరికి ఎల్లవేళలా సోదరులు రక్షగా ఉండాలన్నది ఇందులోని పరమార్థం అని చెబుతారు. ప్రత్యేకంగా రాఖీ పండుగ ప్రాముఖ్యతపై చారిత్రక కథనాలు, రాజుల కాలం నాటి కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఎనీ హౌ.. రాఖీ పండుగ శుభాకాంక్షలు.

    ఇక.. ఇవాళ రాఖీ పండుగ అనగానే చిన్నారులు హంసిని, సహస్ర ఉత్సాహంగా నిద్ర లేచారు. నిన్న రాత్రి తెచ్చిన డోరేమాన్‌ రాఖీలు చూపించా. మరి.. చోటా భీమ్‌ రాఖీలెందుకు తేలేదన్న వాళ్ల ప్రశ్నలకు ఖంగు తినడం నావంతైంది. ఎందుకంటే.. వాళ్లు డోరేమాన్‌ కన్నా.. చోటాభీమ్‌ ప్రోగ్రామ్స్‌లోనే నిత్యం మునిగి తేలతారు. డోరేమాన్‌ ప్రోగ్రామ్స్‌ చూడటం అంతంతమాత్రమే. అయినా.. నా అంచనా పిల్లల ఆలోచనలకు కాస్త దగ్గరగానే ఉన్నందుకు సంతోషం అనిపించింది. ఎందుకంటే.. ఆఫీసునుంచి ఇంటికెళ్లే సమయంలో రాత్రి 11 గంటలకూ.. మార్కెట్లో చాలా రకాల రాఖీలున్నా... సంప్రదాయ రాఖీలను కాదని డోరేమాన్‌ రాఖీలు కనిపించగానే తీసుకెళ్లా... పిల్లలు సంబరపడతారని.  కానీ.. చోటాభీమ్‌ రాఖీలకోసం ప్రశ్నిస్తారని మాత్రం ఊహించలేకపోయా...


24, జులై 2014, గురువారం

చిద్రమైన చిన్నారుల జీవితాలు

మెదక్‌ జిల్లా ఘొల్లుమంది. తూప్రాన్‌ తల్లడిల్లింది. అభం శుభం తెలియని చిన్నారులు తన ఒడిలో నిర్జీవంగా పడి ఉన్నారన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక ఆనేల అల్లాడిపోయింది. మెదక్‌ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం దుర్ఘటనలో 16మంది చిన్నారులు చనిపోయారు. 21మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు.

23, జులై 2014, బుధవారం

కార్యాచరణ సరే... భరోసా కల్పిస్తారా?






           మాతృగడ్డకు తిరిగి వెళ్తున్నామని సంబరపడాలో లేక తమ రక్షణకు భరోసా ఉంటుందో లేదో అన్న భయం మధ్య బిక్కు బిక్కుమంటూ గడపాలో తెలియని సందిగ్ధ పరిస్థితి వారిది. ఒకప్పుడు దర్జాగా బతికినవాళ్లు, రాజ్యాలు ఏలిన వాళ్లు బతుకుజీవుడా అంటూ వలసల బాట పట్టి జన్మభూమికి దూరంగా, భారంగా బతుకులు వెళ్లదీస్తున్నారు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వారిపై ప్రత్యేక దృష్టి సారించింది. స్వస్థలాలకు తిరిగి పంపించేలా ఏర్పాట్లు కూడా చేస్తోంది. వాళ్ళే కాశ్మీరీ పండిట్లు. సొంత దేశంలోనే కాందిశీకుల మాదిరిగా బతుకులు వెళ్ళదీస్తున్నారు.

           దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత కాశ్మీర్ పండిట్లకు మంచి రోజులు వచ్చాయనే చెప్పుకోవాలి. దేశ నిర్మాణంలో, ప్రధానంగా కాశ్మీరీ ప్రాంతంలో తమదైన ప్రత్యేక చరిత్రను కలిగి ఉన్న కాశ్మీరీ పండిట్ల సమస్యను నరేంద్రమోది నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకంగా భావించింది. ఉగ్రవాదుల దాడుల కారణంగా నిరాశ్రయులైన కాశ్మీరీ పండిట్ల కోసం మూడు అనుబంధ నగరాలు నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం మూడు జిల్లాల్లో 2100 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించాల్సిందిగా జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కాశ్మీర్ పర్యటనలో భాగంగా సిఎం ఒమర్ అబ్దుల్లాతో భేటి సందర్భంగా ఈ ప్రతిపాదన చేశారు. అనంతనాగ్, బారాముల్లా, శ్రీనగర్ జిల్లాల్లో ఈ నగరాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ప్రతి నగరంలో 75 వేల నుంచి లక్షమందికి ఆవాసం కల్పించేందుకు రెండు పడక గదుల ఫ్లాట్లతో అపార్ట్ మెంట్లు నిర్మిస్తారు. అత్యాధునిక రవాణా సౌకర్యంతోపాటు సాంకేతిక వసతులు కల్పిస్తారు. ప్రతి నగరంలో ఒక మెడికల్ కాలేజి, రెండు ఇంజినీరింగ్ కాలేజీలు, నాలుగు డిగ్రీ కాలేజీలతో పాటు 12 పాఠశాలలు నిర్మిస్తారు. సాయుధ పోలీస్ స్టేషన్లతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలు, రైతులకు పంట రుణాలు, వలసలకు ముందు పండిట్లు తీసుకున్న రుణాలపై వడ్డీ మాఫీ తదితర సంక్షేమ చర్యలు తీసుకుంటారు.

             కేంద్రప్రభుత్వం చేపట్టే ఈ పునరావాస పథకంపై అంతర్జాతీయ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ హర్షం వ్యక్తం చేసింది. ఈ కీలక పరిణామం భరోసా కరువైన పండిట్ల మోముల్లో సంతోషాన్ని కురిపించడం సర్వసాధారణమే. 

              అయితే వీటిని కాశ్మీర్ వేర్పాటువాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జమ్మూకాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జె.కె.ఎల్.ఎఫ్.) ఏకంగా రాష్ట్ర బందుకు పిలుపునిచ్చింది. 

            నిజానికి బిజెపి ఎన్నికల మేనిఫెస్టోలోనే ఈ అంశాన్ని పొందుపరిచారు. అధికారంలోకి రాగానే యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ ప్రారంభించారు. తీవ్రవాదుల దాడుల కారణంగా 1990 తరువాత కాశ్మీర్ లోయ నుంచి పండిట్లు వలసబాట పట్టడం అనివార్యమైంది. దాదాపు నిర్వాసితులైన పండిట్ల సంఖ్య 7 లక్షలపైనే ఉంటుంది. వీళ్లంతా ప్రక్క రాష్ట్రాల్లో అభద్రత మధ్య జీవిస్తున్నారు.

            ప్రస్తుతం బిజెపి ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రయత్నం దేశ ప్రజలందరూ హర్షించదగినదే అయినా ఆచరణలో ముళ్లకిరీటంగానే చెప్పవచ్చు. ఓవైపు పండిట్లలో ఇప్పటికీ నెలకొన్న అభద్రతా భావం, మరోవైపు కాశ్మీర్ వేర్పాటువాదుల నిరసనలు, ఇంకోవైపు ఉగ్రవాద కార్యకలాపాలు ఈ బృహత్తర ఆశయానికి అవరోధాలు కల్పించబోవని నమ్మకంగా చెప్పలేం. మరోవైపు ఈ అతిభారీ ప్రాజెక్టు ఎంత సమయంలో పూర్తవుతుందన్న సంశయం వెంటాడుతుంది. ఇక పునరావాస నగరాల నిర్మాణం జరిగినా పండిట్ల రక్షణకు అత్యంత పటిష్టమైన వ్యవస్థ అవశ్యం. అసలే ఒక తరంలో సగం జీవితం నిర్వాసితులుగానే ముగిసింది. కనీసం తర్వాత తరానికైనా గట్టి భరోసా అవసరం. వాళ్ళ భద్రతను సవాల్ గా తీసుకోవడం అత్యావశ్యకం.

- హంసినీ సహస్ర

27, జూన్ 2014, శుక్రవారం

గెయిల్‌ గ్యాస్‌ ఘోరంతో కుదేలైన నగరం - అగ్నికీలల్లో మాడిమసైపోయిన జనం




సహజ వాయువు అసహజ మరణాలకు కారణమైంది. కొబ్బరి చెట్ల కోనసీమలో లీకైన గ్యాసు అరకిలో మీటరంత బాంబై భయంకరంగా బద్దలైంది. తెలతెలవారే సమయంలో 15 బతుకులు తెల్లారిపోయాయి. రాకాసి నాలుకలు సాచిన అగ్నికీలలు ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే నిండు జీవితాలను నిలువునా కబళించాయి. ఉషోదయాన విషాద జ్వాలలు వికటాట్టహాసం చేశాయి. ఆకుపచ్చ నేలలో అగ్గి పుట్టింది. జీవితాల్లో వెలుగు నింపే సహజ వాయువే మనుషులను బొగ్గుల్లా మార్చేసింది. అధికారిక నిర్లక్ష్యం సామాన్యులకు మరణశాసనం లిఖించింది. తూర్పు గోదావరి జిల్లా మామిడి కుదురు మండలం నగరం గ్రామం నిప్పు గుప్పిట చిక్కుకొని నిలువునా మాడిపోయింది. ఊరు ఊరంతా వణికిపోయింది. తెల తెల వారుతుండగానే.. మొత్తం 15 మంది సజీవ దహనమయ్యారు. 30మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పదిమంది చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఇది గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా గెయిల్‌ కేజీ బేసిన్‌ చరిత్రలోనే అత్యంత ఘోరమైన ప్రమాదం. గెయిల్‌ గ్యాస్‌ పైప్‌ లైన్ పేలుడుతో నగరం గ్రామం స్మశానంలా మారింది. నలుదిక్కుల నుంచి మంటలు చుట్టుముట్టడంతో పడుకున్నోళ్లు పడుకున్నట్లే మాడి మసైపోయారు. మెలకువతో ఉన్న వారు ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగెత్తినా.. మృత్యువును తప్పించుకోలేకపోయారు. అయినవాళ్లు కళ్లెదుటే మంటల్లో కాలిపోవడం ప్రమాదం నుంచి బయటపడ్డవాళ్ల గుండెల్ని పిండేశాయి. నగరంలోని  టీకొట్టు యజమాని వాసు ఒక్క కుటుంబంలోనే మొత్తం ఆరుగురు చనిపోయారు. మరో కుటుంబం ముగ్గురిని కోల్పోయింది. ఎగసిపడ్డ అగ్ని కీలల ఎత్తుకు గుర్తుగా కాలిన కొబ్బరి చెట్టు కనిపిస్తున్నాయి.  దాదాపు రెండువేల కొబ్బరి చెట్లు పూర్తిగా కాలిపోయాయి.  కిలకిలరాగాలతో ఊరికి సంగీతాన్ని పంచిన వేలాది పక్షులు మంటల్లో మాడి మసైపోయాయి. అస్తిపంజరాల్లా మిగిలాయి. మరికొన్ని పక్షులు కాలిన గాయాలతో  రోదిస్తున్నాయి.