nayeem ONE
-------------
నయీముద్దీన్ అలియాస్ భువనగిరి నయీం. అతడి
పేరు చెప్తే రాజకీయ నాయకులు హడలెత్తిపోతారు. హక్కుల సంఘాల నేతలు సైతం
ఉలిక్కిపడతారు. మాజీ నక్సలైట్లకు, మావోయిస్టులకు కంటిపై కునుకే ఉండదు.
అలాంటి నయీమ్ నేర చరిత్రపై రెడ్ అలర్ట్ స్పెషల్ డాక్యుమెంటరీ...
voice over
---------
నల్గొండ
జిల్లా కనగల్ మండల కేంద్రం.... గ్యాంగ్‌స్టర్ నయీం పుట్టింది ఇక్కడే...
కానీ.. అతని బాల్యం, విద్యాభ్యాసం, పెరిగింది.. అంతా ఇదే జిల్లాలోని
భువనగిరి.
స్పాట్...(భువనగిరి వ్యూషాట్స్ వేసుకోండి.)
నయీం
తండ్రి ఖాజా నసీరుద్దీన్ అప్పటి ఏపీఎస్‌ఈబీ.. అంటే ఎలక్ట్రిసిటీ
డిపార్ట్‌మెంట్‌లో డ్రైవర్. అందుకే.. అతని ఉద్యోగ రీత్యా కుటుంబం కనగల్
నుంచి భువనగిరికి మారింది. అక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకుందీ కుటుంబం.
నయీం తల్లి తాహెరాబేగం. అతనికి ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు.
స్పాట్...
కనగల్‌లో
ఉద్యోగం చేస్తున్న సమయంలో నయీం జన్మించాడు. భువనగిరికి మకాం మార్చిన
సమయంలో నయీం బుడి బుడి అడుగులు వేస్తున్న వయసులో ఉన్నాడు. ఇక.. బాల్యమంతా
అక్కడే గడిచింది. భువనగిరిలోనే చదివాడు. పరిసరాల్లో ఆడుకున్నాడు. చెట్టూ,
పుట్టా తిరిగాడు. తన ఏజ్ వాళ్లతో కలిసి ఆడి పాడాడు. కాలేజీ చదువు కూడా
అక్కడే సాగింది.
స్పాట్...
1991లో ఇంటర్మీడియట్ చదివాడు నయీం.
కాలేజీలో చేరినప్పటినుంచే నయీం వ్యక్తిత్వంలో మార్పు కనిపించింది.
ఆలోచనల్లో విభిన్నత గోచరించింది. తోటివాళ్లకు, నయీంకు మధ్య తేడా స్పష్టంగా
ఉండటాన్ని అప్పటి పెద్దలు గమనించారు.
స్పాట్...
నయీం మరోకోణం
చిన్నప్పుడు అతనితో కలిసి తిరిగిన వాళ్లకే తెలుసు. అతనిది విచిత్ర
మనస్తత్వమని.. వాటి గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకోవడం కొందరికి
ఒళ్లు జలదరించేలా చేస్తుంది.
స్పాట్...
పాములు, తేళ్లతో ఆడుకునే
వాడు నయీం... అతని రాక్షస మనస్తత్వానికి ఇదో మచ్చు తునక. అసలు వాటిని
చూస్తేనే భయపడి ఆమడదూరం పరుగెత్తే వయసులోనే.. వాటిని పట్టుకొని ఆడుకోవడం
చూస్తే అతనిలోని తెగింపు అర్థం చేసుకోవచ్చు.
స్పాట్...
విద్యార్థి
దశలోనే సీపీఎం అనుబంధం స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా- SFI లో
పనిచేశాడు నయీం. ఆ తర్వాత పీపుల్స్‌వార్ అనుబంధ రాడికల్ స్టూడెంట్
యూనియన్ - RSU లో చేరాడు. ఆర్‌ఎస్‌యూలో క్రియాశీలకంగా పనిచేశాడు. ఆ
సమయంలోనే ప్రత్యేకంగా ఓ గ్రూప్‌ను మెయింటెయిన్ చేశాడు. అనుచరులను
వెంటేసుకొని తిరిగాడు. అప్పుడే పీపుల్స్‌వార్ సిద్ధాంతాలకు, కార్యకలాపాలకు
ఆకర్షితుడయ్యాడు నయీం.
స్పాట్...
అది 1991వ సంవత్సరం.
ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలోనే పీపుల్స్‌వార్‌తో అనుబంధాలు
పెంచుకొన్నాడు నయీమొద్దీన్. అంతేకాదు.. ఓ తపంచాను కూడా సమీకరించుకున్నాడు.
దాన్ని చూపించి భువనగిరిలోని కొందరు వ్యాపారవేత్తలను బెదిరించాడు. దీంతో..
వ్యాపారులు పోలీసుల శరణుజొచ్చారు. అప్పటికే ఓ గ్యాంగ్‌ను మెయింటెయిన్
చేస్తున్న నయీంతోపాటు.. అతని అనుచరులను కూడా అరెస్టు చేశారు పోలీసులు.
అంటే.. ఇంటర్ చదువుతున్నప్పుడే పోలీసులతో తొలివైరం మొదలైంది.
స్పాట్...
అదే
యేడాది... నల్గొండ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్టలో
కలకలం. యాదగిరిగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి. ఆసమయంలో
గుట్టపైనే నయీం అరెస్టయ్యాడు. నాటు తుపాకీతో పాటు గ్రెనేడ్‌తో హల్‌చల్
సృష్టించి.. భక్తుల్లో భయాందోళనలు రేకెత్తించాడు నయీం,. అంతేకాదు..
బ్రహ్మోత్సవ విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై దాడికి ప్రయత్నించాడు. దీంతో..
అప్పుడే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
స్పాట్...
ఆర్‌ఎస్‌యూలో
పనిచేసిన అనుభవంతో.. ఆ భావాలతో పెరిగిన నయీం.. అప్పటికే పీపుల్స్‌వార్‌తో
సంబంధాలు పెంచుకున్నాడు. యాదగిరి గుట్ట కేసులో అరెస్ట్ అయి.. చంచల్‌గూడ
జైలులో ఉన్నప్పుడే పీపుల్స్‌వార్ నేత శాఖమూరి అప్పారావుతో అనుబంధం
పెంచుకున్నాడు. సమ సమాజ స్థాపన కోసమంటూ మూడు దశాబ్దాల క్రితం అప్పటి
పీపుల్స్ వార్‌లో చేరాడు. వార్ అగ్రనేతలు పటేల్ సుధాకర్‌రెడ్డి, శాఖమూరి
అప్పారావుల వద్ద శిష్యరికం చేశాడు. వారికి సన్నిహితుడిగా మెలిగి.. నమ్మిన
బంటుగా మారాడు కూడా.
స్పాట్...
స్వతహాగా భిన్న ఆలోచనలతో
సంచలనాలు సృష్టించడమంటే సరదా పడే.. నయీమొద్దీన్.. ఎప్పటికప్పుడు
విభిన్నంగా ఆలోచించేవాడు. దాడులు, బెదిరింపులు, సెటిల్‌మెంట్‌లంటే ముందుండే
వాడు. దీంతో.. పీపుల్స్ వార్‌లో కూడా నయీమ్‌కు ప్రత్యేక స్థానం
లభించింది.
స్పాట్...
=================================================
=================================================
nayeem TWO
-------------
ఒక
డీఐజీ స్థాయి పోలీసును టార్గెట్ చేయడమంటే మాటలు కాదు. అందుకు ఎంతో నేర్పు
అవసరం. పలు సార్లు రెక్కీలు తప్పనిసరి. టార్గెట్ అయిన వ్యక్తి
మూవ్‌మెంట్స్‌పై కన్నేయాలి. అప్‌టూ డేట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఉండాలి. ఏ
సమయంలో ఎక్కడెక్కడికెళ్తున్నాడన్న దినచర్యను గమనిస్తూ ఉండాలి. ఇంతటి
క్లిష్టమైన పనిని నయీంకు అప్పగించింది పీపుల్స్‌వార్ గ్రూప్.
voice over
----------
స్పాట్...
అప్పటికే
పీపుల్స్‌వార్‌లో ఎంతోమంది సీనియర్లున్నా.. రెండుమూడేళ్ల నుంచే తమతో
సంబంధం ఉన్న... అప్పుడప్పుడే ఎదుగుతున్న నయీంనే ఈ పనికి ఎంచుకుంది
పీపుల్ష్‌వార్.
స్పాట్..
గురిపెట్టానంటే తప్పదన్న పేరు
ప్రతిష్టలు తనకే దక్కాలన్న ఉత్సుకతతో ఉండే నయీం.. కూడా సరేనంటూ తలూపాడు.
పీపుల్స్‌వార్ నాయకత్వం తనకు అప్పగించిన పనిని పూర్తిచేసేందుకు
అంగీకరించాడు.
స్పాట్...
1993 జనవరి 27వ తేదీ ఉదయం. హైదరాబాద్
ఎల్బీ స్టేడియం. ఎందరో ప్రముఖులు, పోలీసు అధికారులు, సామాన్యులు కూడా
మార్నింగ్ వాక్‌కు వచ్చారు. కాసేపట్లోనే కాల్పుల శబ్దం. స్టేడియం అంతా
కలకలం. అంతా తేరుకునేలోగానే రక్తపు మడుగులో మూడు మృతదేహాలు. అందులో డీఐజీ
వ్యాస్ డెడ్‌బాడీ. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు.
స్పాట్...
పోలీసు
డిపార్ట్‌మెంట్లో గ్రేహౌండ్స్ విభాగానికి ఆద్యుడు డీఐజీ వ్యాస్. అలాంటి
డీఐజీనే చంపిన నయీం.. ఆ తర్వాత కాలంలో గ్రేహౌండ్స్‌కే కావాల్సిన వ్యక్తిలా
మారాడు. తర్వాత పరిణామాలు అలాంటి పరిస్థితులకు వీలు కల్పించాయి.
స్పాట్....
డీఐజీ
వ్యాస్‌ను హత్య చేసిన తర్వాత నయీం పోలీసులకు లొంగిపోయాడు. షరా మామూలుగా
పోలీసులు జైలుకు పంపించారు. తెరవెనుక ఏం జరిగిందో ఏమోగానీ.. అప్పటినుంచి
పీపుల్స్‌వార్‌కు, నయీంకు శత్రుత్వం పెరిగిపోయింది. అతి కొద్ది కాలానికే
పీపుల్స్‌వార్‌కు దూరమయ్యాడు నయీం. వ్యాస్ కేసులో జైలులో ఉన్న సమయంలో
నయీంకు, పీపుల్స్‌వార్ అగ్రనేతలకు మధ్య విభేదాలు తలెత్తాయని చెబుతారు.
స్పాట్...
ఆ
తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు నయీమొద్దీన్. తన పంథా మార్చుకున్నాడు.
ఆలోచనలకు పదును పెట్టాడు. మొదట ఎవరైతే తనను ఆదరించారో వాళ్లే తన
శత్రువులుగా చెప్పుకున్నాడు.
స్పాట్...
నక్సలైట్‌గా జీవితం
ప్రారంభించిన నయీం.. ఆ తరవాత నక్సల్స్‌ను అంతం చేయడమే తన జీవితాశయమని
ప్రకటించాడు. వాళ్లపైనే యుద్ధం ప్రకటించాడు. ప్రభుత్వం ముందు లొంగిపోయాడు.
నక్సలైట్లను సమూలంగా నిర్మూలిస్తానని శపథం చేశాడు. అందుకోసం ఏ పనైనా
చేస్తానన్నాడు.
స్పాట్...
మావోయిస్టులపై పగబట్టినట్లు
ప్రకటించుకుని కింగ్ కోబ్రాలను సృష్టించాడు. ఒక్క కింగ్‌కోబ్రాలే కాదు..
నల్లమల కోబ్రాస్, కాకతీయ కోబ్రాస్, నర్సా కోబ్రాస్, క్రాంతిసేన పేరిట
చెలరేగి పోయాడు.
స్పాట్...
నయీం లక్ష్యాలు, కార్యకలాపాలను
నిశితంగా గమనిస్తూ వచ్చిన పోలీసులు.. అతన్ని చేరదీశారు. తమ అజ్ఞాత
కార్యకలాపాల్లో ఉపయోగించుకున్నారన్న ఆరోపణలు ఇప్పటికీ ఉన్నాయి. ఓ దశలో
కోవర్టుగా మారి నక్సలైట్ల రహస్యాలను పోలీసులకు చేరవేసేవాడని కూడా చెబుతారు.
నయీం ఇచ్చిన సమాచారంతోనే అనేక ఎన్‌కౌంటర్లలో పీపుల్స్‌వార్, మావోయిస్టు
నేతల్ని ఖాకీలు మట్టుపెట్టారని కథలు కథలుగా చెప్పుకుంటారు. కోవర్టు జీవితం
గడిపిన నయీం పోలీసుల చేతిలో ఆయుధంగా కూడా మారాడంటారు. చట్ట పరిధిలో చేయలేని
అనేక పనుల్ని పోలీసులు అతడితో చేయించుకున్నారని సమాచారం. ఇదే అతడి బలంగా
మారిందని కూడా కొందరు అధికారులంటారు.
స్పాట్...
=================================================
=================================================
nayeem Three
-------------
ఓ
సందర్భంలో నక్సల్స్ నుంచి ముప్పు ఉందన్న కారణంగా నయీమ్‌కు ప్రభుత్వమే
భద్రత కూడా కల్పించిన సందర్భాలున్నాయి. ఆ తర్వాత భూ దందాలు, సెటిల్‌మెంట్ల
కేసుల్లో నిండా మునిగిపోయాడు. మాఫియా సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు.
voice over
----------
స్పాట్...
పోలీసుల
నుంచి రహస్యంగా తోడ్పాటు అందడంతో.. నయీమొద్దీన్‌కు వేయి ఏనుగుల బలం
వచ్చినట్లయ్యిందన్న వాదన ఉంది. పీపుల్స్‌వార్‌లో ఉన్నప్పుడు నయీం పాల్పడిన
అరాచకాల కన్నా.. వాళ్లపై యుద్ధం ప్రకటించాక సృష్టించిన మారణహోమమే ఎక్కువ.
స్పాట్...
వ్యాస్
హత్య కేసులో బెయిల్‌పై బయటకు వచ్చాక.. చిన్నప్పటినుంచి తనకు అనుబంధం ఉన్న
భువనగిరికి మకాం మార్చాడు నయీం.. కొంతకాలం అటు.. పీపుల్స్‌వార్‌తో, ఇటు
పోలీసులతో సంబంధాలు కొనసాగించిన దిట్ట నయీం. అప్పటికే ఓ ధృఢమైన
అభిప్రాయానికి వచ్చినందున.. పీపుల్స్‌వార్ కదలికలను, వాళ్ల అరాచక
ప్లాన్‌లను ఎప్పటికప్పుడు తనకు అండగా ఉండే పోలీసులకు చేరవేశాడన్న ప్రచారం
ఉంది.
స్పాట్...
నయీం ఇచ్చిన సమాచారంతోనే అనేక ఎన్‌కౌంటర్లలో
పీపుల్స్‌వార్, మావోయిస్టు నేతల్ని ఖాకీలు మట్టుపెట్టారని కథలు కథలుగా
చెప్పుకుంటారు. కోవర్టు జీవితం గడిపిన నయీం పోలీసుల చేతిలో ఆయుధంగా కూడా
మారాడంటారు. చట్ట పరిధిలో చేయలేని అనేక పనుల్ని పోలీసులు అతడితో
చేయించుకున్నారని సమాచారం. ఇదే అతడి బలంగా మారిందని కూడా కొందరు
అధికారులంటారు.
స్పాట్...
ఒకటి కాదు, రెండు కాదు.. 40కి పైగా
హత్య కేసులు... వందకు పైగా బెదిరింపుల కేసులు. లెక్కలేనన్ని భూ దందాలు,
సెటిల్‌మెంట్లతో సాగిన నయీం జీవితమే హింసాత్మకం.
స్పాట్...
కొన్నేళ్లపాటు
నేరసామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు. ఆ సామ్రాజ్యానికి మకుటంలేని
మహారాజుగా తయారయ్యాడు. తన దారికి ఎవరైనా అడ్డొస్తే నిర్దాక్షిణ్యంగా
నరికేశాడు.
స్పాట్...
1993లో ఐపీఎస్ వ్యాస్‌ను కాల్చి చంపడంతో
మొదలు.. నయీం ఎన్‌కౌంటర్ జరిగిన ముందురోజు.. అతని అనుచరుడు వాజిద్ హత్య
దాకా నయీం పాత్రపై అనేక ఆరోపణలు వచ్చాయి.
స్పాట్...
2000
డిసెంబర్‌లో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పౌర హక్కుల నేత పురుషోత్తంను
హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో పట్టపగలే నరికిచంపిన కేసుతో పాటు.. మరో
హక్కుల సంఘం నేత కరుణాకర్‌ను చంపిన కేసులోనూ నయీం నిందితుడు.
స్పాట్...
మరుసటి
యేడాది అంటే.. 2001 ఫిబ్రవరిలో నల్గొండకు చెందిన ఏపీసీఎల్సీ నేత ఆజం అలీని
నయీం గ్యాంగ్ కత్తులతో నరికి చంపేసిన ఘటనపై నల్గొండలో పోలీసు కేసు
నమోదైంది. నయీమ్ జైలులో ఉండగానే ఈ హత్యకు కుట్ర చేశాడని ఆరోపణలున్నాయి.
స్పాట్...
అదే
యేడాది డిసెంబర్‌లో శ్రీరాములు యాదవ్, బద్దుల మల్లేష్ యాదవ్, ఇక్కిరి
సిద్దులు అనేముగ్గురిని మల్కాపూర్ శివారులో దారుణంగా హత్య చేశారు. పాత
కక్షలతో నయీం గ్యాంగే ఈ హత్యలు చేసినట్లు కేసు చౌటుప్పల్
పోలీస్‌స్టేషన్‌లో నమోదైంది.
స్పాట్...
2011లో నయీమొద్దీన్
ఆదేశాలతోనే అతని అనుచరులు.. మాజీ మావోయిస్టు, టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో
మెంబర్ అయిన కోనాపురి అయిలయ్య అలియాస్ సాంబశివుడును గొడ్డలితో నరికి
చంపినట్లు వలిగొండ పోలీస్‌స్టేషన్‌లో కేసు ఉంది.
స్పాట్...
2014లో
వలిగొండకు చెందిన అఫ్జల్ అహ్మద్ ఖాన్‌ను నయీం అనుచరులు కిడ్నాప్ చేసి
హత్య చేసినట్లు కేసు నమోదైంది. నయీం సూచనలతో అతని అనుచరులు షేక్ షకీల్,
పాశం శ్రీను తదితరులు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.
స్పాట్...
అలాగే..
కోనాపురి అయిలయ్య తమ్ముడైన మాజీ మావోయిస్టు, టీఆర్‌ఎస్ నాయకుడు కోనాపురి
రాములును కూడా నల్గొండలో నయీం ముఠా హత్య చేసింది. ఈ ఘటనపైనా నల్గొండ
టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
స్పాట్...
ఇవే కాదు..
మావోయిస్టు కార్యకర్త, ప్రజా గాయకురాలు బెల్లి లలిత హత్య కేసులోనూ
నయీమే కీలక నిందితుడు. మాజీ మావోయిస్టులు గణేశ్, ఈదన్న హత్య వెనకా నయీమే
మాస్టర్‌మైండ్ అని పోలీసులు చెప్తుంటారు. ఎల్‌బీ నగర్‌కు చెందిన రియల్టర్
రాధాకృష్ణ, రివల్యూషనరీ పేట్రియాటిక్ టైగర్స్ వ్యవస్థాపకుడు పటోళ్ల
గోవర్ధన్‌రెడ్డి.. ఇలా అనేక దారుణ హత్యలకు నయీం, అతడి గ్యాంగ్ కేరాఫ్
అడ్రస్‌గా మారిపోయాయి. అనేక కోర్టుల్లో నయీంపై నాన్‌బెయిలబుల్ వారెంట్లు
పెండింగ్‌లో ఉన్నాయి. వివిధ కేసుల్లో పట్టుబడి 11సార్లు పోలీసుల నుంచి
తప్పించుకున్నాడు నయీం.
స్పాట్...
సైబరాబాద్, హైదరాబాద్‌లకు
చెందిన కొందరు యువకులను, నేరగాళ్లను చేరదీసి నయీం తన సామ్రాజ్యాన్ని
విస్తరించాడు. ఈ ముఠా ప్లాన్లు అత్యంత పకడ్బందీగా ఉంటాయి. నేరాలు చేసే
స్టయిల్ వెరైటీగా ఉంటుంది. నేరాలకు ప్లాన్ చేసేది ఒక గ్రూప్ అయితే.. ఆ
నేరం చేసేది మరొక గ్రూప్. ఆ సంఘటన జరిగాక 48 గంటల్లోనే లొంగిపోయేది ఇంకో
గ్రూప్. దీంతో.. పోలీసులు కూడా పక్కా సాక్ష్యాలు ఛేధించలేకపోయిన కేసులు
ఎన్నో ఉన్నాయని చెబుతారు.
స్పాట్...
నయీం అరాచకాలు రాష్ట్రం
దాటి జాతీయ స్థాయిలోనూ పెట్రేగిపోయాయి. రాష్ట్రంలోనే కాక చత్తీస్‌గఢ్,
జార్ఖండ్, వెస్ట్‌బెంగాల్‌లోనూ తననెట్‌వర్క్‌ను పెంచుకున్నాడు. గుజరాత్‌లో
ఆయుధాల స్మగ్లింగ్ కేసులో మోస్ట్‌వాంటెడ్ లిస్టులో ఉన్నాడు. 2008
ఏప్రిల్‌లో చోటారాజన్ అనుచరుడు అజీజ్‌రెడ్డి ఎన్‌కౌంటర్ వెనుక కూడా నయీం
గ్యాంగ్‌తో విభేదాలే కారణమని సమాచారం. అంతేకాదు.. బంగ్లాదేశ్ నుంచి
పాకిస్థాన్‌కు వెళ్లి ఐఎస్ఐతో చేతులు కలిపినట్లు పోలీసువర్గాలు
గుర్తించాయి.
స్పాట్....
=================================================
=================================================
nayeem Four
-------------
నక్సల్స్‌పై
యుద్ధం ప్రకటించాక భూదందాలు, సెటిల్‌మెంట్లనే ప్రధాన వ్యాపకంగా
మార్చుకున్న నయీం.. గ్యాంగ్‌స్టర్ అవతారమెత్తాడు. తనకంటూ ఓ గ్యాంగ్‌ను
రూపొందించుకున్నాడు. ఇక.. వెనుదిరిగి చూడలేదు. మాఫియా లెవెల్‌లో
చెలరేగిపోయాడు.
స్పాట్...
voice over
----------
మొదట్లో
హత్యల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న నయీమ్.. ఆ తర్వాత రూట్ మార్చాడు. తన
గ్యాంగ్ ఫామ్‌లోకి వచ్చిందని నిర్ధారించుకున్నాక.. బాధ్యతలన్నీ గ్యాంగ్‌కు
అప్పగించాడు. అందుకే నయీమ్ ప్రత్యర్థుల హత్య కేసుల్లో అతని అనుచర గణమే
ప్రధాన నిందితులుగా ఉన్నారు.
స్పాట్...
భూ దందాలు,
సెటిల్‌మెంట్లపై కన్నేసిన గ్యాంగ్‌స్టర్.. వివాదాస్పద భూముల్లోకి ఎంటరై
అరాచకాలు సృష్టించాడు. సెటిల్‌మెంట్లలో తనదైన ముద్ర వేసుకున్నాడు.
స్పాట్...
ఎన్‌కౌంటర్లలో
పలువురిని హతమార్చేందుకు తమకు సహకరించిన నయీమ్‌ను కొందరు పోలీసు అధికారులు
బాగానే ఉపయోగించుకున్నారన్న వాదన ఉంది. ఓ దశలో పోలీసులు తమవల్ల కాని
సివిల్ మ్యాటర్లు, భూ దందాలు, సెటిల్‌మెంట్లను నయీంతో చేయించారన్న
ప్రచారమూ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో షికార్లు చేస్తోంది. ఫలితంగా
ప్రతిఫలాన్ని కూడా పొందారని చెప్పుకుంటారు.
స్పాట్...
అందుకే
నయీం దందాకు పలువురు పోలీసు అధికారులే పరోక్ష సహకారం అందించారన్న
ఆరోపణలున్నాయి. అంతేకాదు.. పోలీస్ డిపార్ట్‌మెంట్ కదలికలూ ఎప్పటికప్పుడు
నయీమ్‌కు చేరేవన్న ప్రచారం ఉంది. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ అతని ఇంట్లో
ఏకంగా శాటిలైట్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు దర్యాప్తు అధికారులు.
స్పాట్...
ఇంతింతై..
వటుడింతై అన్నట్లుగా ఎదిగిన నయీం నేరసామ్రాజ్యం శాఖోపశాఖలుగా
విస్తరించింది. రాను రానూ నయీం కాదు.. నయీం పేరు చెబితేనే వణుకు పుట్టే
పరిస్థితులు దాపురించాయి.
స్పాట్...
నయీమ్ అంటే ఓ పేరు కాదు,
మాఫియాకి అదో బ్రాండ్ నేమ్.. అన్నట్లుగా కార్యకలాపాలు కొనసాగాయి. 2007లో
ఐపీఎస్ అధికారి వ్యాస్ హత్యకేసులో నాంపల్లి క్రిమినల్ కోర్టులో
హాజరుపరిచిన సమయంలో.. పోలీసుల నుంచి తప్పించుకున్న నయీమొద్దీన్.. కొందరు
పోలీసుల అండతో తన హవా నడిపించాడని చెబుతారు.
స్పాట్...
నయీమ్
పారిపోవడానికి పొలీసులే సహకరించారన్న వాదనలు కూడా అప్పట్లో బలంగా
వినిపించాయి. అప్పటి నుంచి నయీమ్ పూర్తిగా అజ్ఞాతంలో వుంటూనే
గ్యాంగ్‌స్టర్‌గా కార్యకలాపాలు కొనసాగిస్తూ వచ్చాడు. గతంలో సాగించిన
సెటిల్‌మెంట్లు కంటిన్యూ చేశాడు. అయితే.. అదే అదనుగా ఆయన పేరిట కొందరు
అనుచరులు, దగ్గరి బంధువుల దౌర్జాన్యాలు కూడా పెరిగిపోయాయని బాధితులు ఆవేదన
వ్యక్తంచేసిన సందర్భాలున్నాయి.
స్పాట్...
అరాచకానికి కేరాఫ్
అడ్రస్‌గా మారిపోయాడు. భాయ్ పేరుతో అతని గ్యాంగ్ ఊళ్లమీద పడింది.
నియంతృత్వ పరిష్కారాలు, ఆదేశాలు.. కాదంటే చిత్రహింసలు పెట్టి ఖతం చేయడాలు
కొనసాగాయి.
స్పాట్...
ఎవరిని టార్గెట్ చేసినా.. ముందు వాళ్ల
చరిత్ర మొత్తం తెలుసుకుంటాడు. ఆస్తిపాస్తులు, కుటుంబ సభ్యులు, బలహీనతల
చిట్టా మొత్తం గ్యాంగ్ సహకారంతో చేతికి అందుతుంది. ఇక.. భాయ్ చెప్పిందే
ఫైనల్. మరో మాటకు తావుండదు.
స్పాట్...
భూ దందా అయితే చెప్పిన
రేటుకు అమ్మేయాలి. పంపకాలు, సెటిల్‌మెంట్లు అయితే.. రెండు పార్టీలూ భాయ్
చెప్పినంత సమర్పించుకోవాల్సిందే... లేకుంటే బతుకు బేజారే...
స్పాట్...
భాయ్
టార్గెట్ చేసిన వాళ్లకు మొదట ఫోన్ కాల్స్ వెళ్తాయి. ఆ తర్వాత
ఎస్‌ఎంఎస్‌లతో వేధింపులు కొనసాగుతాయి. మూవ్‌మెంట్స్ క్షణక్షణం వల్లెవేయడం
ఎదుటివాళ్లను నిలువెల్లా వణికిస్తుంది. అంతే.. చేతనైతే డిమాండ్ చేసినంతా
చేతుల్లో పెట్టాలి. లేకుంటే.. కాళ్లా వేళ్లాపడి ఎంతో కొంత బేరమాడుకోవాలి.
కానీ.. ఊరికే వదిలేయడం మాత్రం అసంభవం.
స్పాట్...
తనకు ఎదురు
తిరిగారనో, తన దందాకు అడ్డువచ్చారనో తెలిస్తే.. భాయ్ ఎట్టిపరిస్థితుల్లో
వదిలిపెట్టడు. నీడలా వెంటాడుతాడు. భయమంటే ఏంటో.. చావు ఎలా ఉంటుందో
ఎదుటివాళ్లకు ప్రత్యక్షంగా చూపిస్తూ.. తాను చూస్తూ పైశాచిక ఆనందం
పొందుతాడు. అతని చేతిలో హతమై.. గుర్తు తెలియని మృతదేహాలుగా నమోదైన
సందర్భాలూ అనేకం ఉన్నాయంటారు అతని మనుషులు.
స్పాట్...
మొత్తానికి
సమాంతర ప్రభుత్వాన్నే నడిపిన నయీమ్.. అరాచకాలకు ఫుల్‌స్టాప్
పెట్టాలనుకున్న పోలీసులు.. ఆరేళ్లుగా తీవ్రస్థాయిలో గాలిస్తున్నారు.
ఎప్పటికప్పుడు నిఘా వేస్తున్నారు. పోలీసులు తనగురించి వేట
కొనసాగిస్తున్నారని కూడా ముందే పసిగట్టాడు నయీమ్. పోలీస్ టెక్నిక్స్ వంట
బట్టించుకున్న ఈ గ్యాంగ్‌స్టర్.. తనదైన శైలిలో అండర్ వరల్డ్‌ను
ఏర్పరచుకున్నాడు. పోలీసులు పసిగట్టలేనంత పకడ్బందీ వ్యూహాలు అమలు చేశాడు.
స్పాట్...
చివరి
రోజుల్లో చీకటి సామ్రాజ్యాన్ని ఏలిన నయీం భాయ్.. తన సెక్యూరిటీ గురించి
చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అనుచరులుగా తన అడుగులకు మడుగులొత్తిన
వాళ్లను కొంతకాలమే చేరదీసి తర్వాత దూరం చేశాడు. గన్‌మెన్లనూ ఎప్పటికప్పుడు
మార్చేసేవాడు. తన ఉనికి దొరక్కుండా జాగ్రత్తపడేవాడు.
స్పాట్...
మెదక్
జిల్లా జహీరాబాద్‌లో జరిగిన అనుచరుడి హత్యలో నయీం ప్రమేయం ఉందన్న
అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం.. జహీరాబాద్ నుంచి
తెల్లవారుజామున నయీం.. తన గ్యాంగ్‌తో కలిసి హైదరాబాద్ మీదుగా..
మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్‌షిప్‌కు చేరుకున్నాడు.
స్పాట్...
పోలీస్
రికార్డుల ప్రకారం.. జూలై 15వ తేదీన నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి
జెడ్పీటీసీ భర్తను సెల్‌ఫోన్‌లో బెదిరించింది నయీం గ్యాంగ్. యాంటీ
నక్సలైట్ గ్రూప్ అయిన తమ అవసరాలకోసం కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్
చేసింది. మరుసటిరోజు కూడా ఫోన్‌చేసి బెదిరించడంతో పాటు.. అదేరోజు 'ఇది
భాయ్‌సాబ్ హుకుం' అని మెస్సేస్ కూడా పంపింది. షాద్‌నగర్ వచ్చి ఆ మొత్తం
సమర్పించుకోవాలని కూడా హుకుం జారీ చేసింది. ఈ సమయానికి నయీం షాద్‌నగర్
చేరుకున్నాడు.
స్పాట్...
తాను అంతమొత్తం ఇచ్చుకోలేనన్న
జెడ్పీటీసీ భర్త గంగాధర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సెల్‌ఫోన్
సిగ్నల్స్ ఆధారంగా.. రంగంలోకి దిగిన పోలీసులు నయీం ఆట కట్టించారు.
ఎన్‌కౌంటర్‌లో హతం చేశారు.
స్పాట్...
నక్సలైట్ల ఆనుపానులు
తెలుసుకొని వాళ్లకే ఎసరుపెట్టాడు. తర్వాత పోలీసులకు కోవర్టుగా మారి వాళ్ల
పేరును ఉపయోగించుకొని చెలరేగిపోయాడు. మొత్తానికి మోస్ట్ వాంటెడ్‌గా మారి..
ఆపరేషన్ నయీంతో హతమైపోయాడు.
స్పాట్...
=================================================
=================================================
nayeem Five
-------------
ఆపరేషన్
నయీమ్ సక్సెస్ అయ్యింది. అతనికి టార్గెట్‌గా మారిన వాళ్లంతా ఊపిరి
పీల్చుకున్నారు. పోలీసులూ.. అతని నేర సామ్రాజ్యంపై దృష్టిపెట్టారు. మరి.. ఈ
పరిణామాలతో పని పూర్తయినట్లేనా..? నయీం పీడ విరగడైనట్లేనా..?
voice over
----------
కారణమేదైనా..
ఉసిగొల్పింది ఎవరైనా.. నయీమ్.. ఓ నయా దందాకు మార్గం కనిపెట్టాడు. ఎవరి
అవసరాలకు వారు వాడుకున్నా.. ఎదుటి వాళ్ల బలహీనతలను ఆసరాగా చేసుకొని ఆ
తర్వాత చెలరేగిపోయాడు. తనకు మొదట్లో అండగా ఉన్నవాళ్లకే ఏకు మేకై
కూర్చున్నాడు.
స్పాట్...
కాలక్రమంలో ఆత్మవిశ్వాసం హద్దులు
దాటింది. అత్యాశ మితిమీరిపోయింది. తనకు ఎదురేదీ లేదన్న ఆలోచన వక్రబుద్ధి
పట్టించింది. ఎదుటివాళ్లు ఎవరైనా లెక్కచేయని తత్వం పెరిగిపోయింది.
స్పాట్...
ఎన్‌కౌంటర్‌కు
దారితీసిన పరిణామాలను పక్కనబెడితే.. పెట్రేగిపోయిన నయీం అరాచకాలకు
అడ్డుకట్ట వేయాలన్న ఆలోచన ఎవరు అవునన్నా కాదన్నా.. హర్షించదగినదే...
ఆరునెలలుగా పోలీసులు వేటాడటం నిజమే అయితే.. ఇన్నాళ్లూ అతని జాడ
కనుక్కోలేకపోవడం వెనుక లోపాలను సమీక్షించుకోవాల్సిందే... పోలీసు వ్యూహం
గురించి నయీమ్‌కు ముందే ఉప్పందినట్లు గ్రహిస్తేమాత్రం.. అలాంటి ఆలోచనలను
కూకటివేళ్లతో పెకిలించి వేయాల్సిందే...
స్పాట్...
నయీం డైరీ.. ఓ
మాఫియా పుట్ట. అందులో ప్రతి పంక్తిలోనూ అమాయకులను వేధించిన
ఆనవాళ్లున్నాయి. పేజీ పేజీలోనూ అరాచకాల మూలాలున్నాయి. తాను చేసిన దందాలకు
సాక్ష్యాలున్నాయి. తనకు సహకరించిన వాళ్ల బండారం ఉంది. బినామీల వ్యవహారం
ఉంది. తాను పెంచి పోషించిన మాఫియా గ్యాంగ్ చిట్టా ఉంది.
స్పాట్...
గ్యాంగ్‌స్టర్
ఖతమైపోయాడు. మరి.. జనంతో ఆడుకున్న మాఫియా డాన్ ఒక్క నయీమేనా..? జనాన్ని
పీడిస్తూ.. అరాచకాలకు పదును పెడుతూ.. చెలరేగిపోతున్న మిగతావాళ్ల
సంగతేంటి..? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు సమాధానం వెతకాలి. ఇలాంటి విష
సంస్కృతిని మొక్కలోనే తుంచి వేయాలి.
స్పాట్...