17, ఫిబ్రవరి 2016, బుధవారం

మేడారం జాతర మొదలైందహో...


అరణ్యం జనారణ్యంగా మారింది. మేడారం భక్తజన సంద్రమైంది. సమ్మక్క-సారలమ్మ నామస్మరణతో, శివసత్తుల పూనకాలతో జంపన్న వాగు మార్మోగిపోయింది. జాతర తొలిరోజు భక్తి పారవశ్యం పొంగిపొర్లింది.

    తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్ గఢ్, జార్ఖండ్ నుంచి లక్షలాదిగా భక్తులు అమ్మల దర్శనానికి పోటెత్తారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలాచరించి.. అమ్మవారికి బెల్లంతో బంగారం మొక్కు తీర్చుకున్నారు.

    కార్యక్రమంలో అత్యంత కీలక ఘట్టమైన సారలమ్మ గద్దెకు చేరే వేడుక అత్యంత కోలాహలంగా సాగింది. తొలుత కొత్తగూడెం మండలం పూనుకొండ్ల నుంచి పగిడిద్దరాజును, కొండాయి నుంచి గోవిందరాజులును మేడారం గ్రామంలోని గద్దెల వద్దకు తీసుకొచ్చారు. వరంగల్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో కన్నెపల్లిలో సారలమ్మకు ప్రత్యేక పూజలు చేసిన పూజారులు.. ఊరేగింపుగా వనదేవతను మేడారం తీసుకొచ్చారు.  గద్దెమీదికి చేరిన సారలమ్మ.. భక్తుల్ని అనుగ్రహించడంతో మేడారం జాతర ఊపందుకుంది.

    భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీసు యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. గంటకు నాలుగు వేలకు పైగా వాహనాలు వస్తుండడంతో.. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. నార్లాపూర్ నుంచి వాహనాలను అనుమతిస్తూ.. భూపాల్ పల్లి మీదుగా బయటకు పంపుతున్నారు. మరోవైపు.. భక్తులు గుర్తించేలా ప్రభుత్వ అధికారులకు డ్రెస్ కోడ్ విధించారు. తాగునీరుసహా భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించామని, భక్తులు కూడా అధికారులకు సహకరించాలని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ కోరారు. జాతరను మొత్తం 38 సెక్టార్లుగా విభజించి సెక్టోరియల్ అధికారుల్ని నియమించారు.

    జాతరలో భాగంగా గిరిజనులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు భక్తుల్ని విశేషంగా అలరిస్తున్నాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి