19, అక్టోబర్ 2015, సోమవారం

ఎన్నాళ్లీ మరణమృదంగం?

ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. అయితే.. రాష్ట్ర ఏర్పాటుతో సంబంధం లేని అతిపెద్ద సమస్య ప్రస్తుతం రాష్ట్రాన్ని పట్టి పీడిస్తోంది. అదే అన్నదాత ఆత్మహత్య సమస్య. ’కర్ణుడి చావుకు కారణాలనేకంఅన్నట్లు తెంగాణలో రైతు అకాల మరణాలకు కారణాలు క్యూ కడుతున్నాయి. వాటిని గుర్తించడం, అధిగమించడం కష్టసాధ్యమే అయినా.. పక్కా ప్రణాళికతో ప్రయత్నిస్తే అసాధ్యమేమీ కాదు. రైతుల ఆత్మహత్యలు గతంలోనూ ప్రభుత్వాలకు సవాల్ విసిరిన సందర్భాున్నాయి. అయితే.. ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్న మరణాల సంఖ్య మరీ ఎక్కువగా ఉంటోంది. రైతు ఆత్మహత్యలే కాదు.. కళ్లముందు కనిపిస్తున్న పరిస్థితులు, భవిష్యత్తుపై భయాన్ని పెంచడం మూలంగా గుండెపోటుతో మరణిస్తున్న వాళ్ల సంఖ్య కూడా నమోదవుతోంది. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరినీ సందేహం తొలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలోకన్నా.. తెలంగాణ స్వయం పాలిత రాష్ట్రం సమృద్ధిగా ఉంటుందనుకుంటే గతంలో కన్నా తీవ్ర ప్రతికూల పరిస్థితులు నెలకొనడం ఇటు రైతులను, అటు విశ్లేషకులను ఆవేదనకు గురిచేస్తోంది. మరోవైపు.. కేసీఆర్ ప్రకటనలు, హామీలు, ప్రణాళికలు ఏవీ రైతుకు భరోసా ఇచ్చేందుకు దోహదపడటంలేదు భూగర్భ జలాలు అడుగంటడం, వరుణుడు కరుణించకపోవడం, నాసిరకం విత్తనాలు వంటి సమస్యకు తోడు.. రైతు రుణమాఫీ పథకం కూడా గందరగోళంగా తయారవడం అన్నదాతకు శరాఘాతంగా పరిణమించింది. ఇప్పటివరకు రైతుల రుణమాఫీ మిస్టరీ గానే మారింది. పెట్టుబడులు భారీగా పెరిగిపోవడం, పంటకు ప్రతికూల పరిస్థితులు నెలకొనడం అన్నదాతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫలితంగా అకాల మరణాలు, ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి.
ఆత్మహత్య నివారణకు ఏమేం చర్యలు తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్న ప్రభుత్వం..చనిపోయిన రైతు కుటుంబాలకు 6లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అయినా.. ఆత్మహత్యలు ఆగడం లేదు. వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతులు.. ఇప్పుడు క్షేత్రస్థాయిలో వ్యవసాయమే దండగ అనే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం అంశంలో ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు దీనిపై విస్తృతంగా చర్చించాల్సి ఉంది.  ఆత్మహత్యల నివారణకు పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో పాటు.. నిధిని ఏర్పాటుచేస్తే ఆర్థికంగా తోడ్పాటుగా ఉంటుంది. అలాగే. ఆత్మహత్యలపై ప్రభుత్వం పూర్థిస్థాయిలో విచారణ కమిటీ వేసి కారణాలను విశ్లేషించాల్సి ఉంది. రైతు వ్యవసాయాన్నే నమ్ముకుంటున్నారా... వారి కుటుంబ, ఆర్థిక, రాజకీయ పరిస్థితు ఏమిటన్న వాటిపై సమగ్ర విచారణ జరిపించాల్సి ఉంది. చనిపోయిన వారి కుటుంబనేపథ్యం, ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపైనా అధ్యయనం చేయాల్సి ఉంది. తెలంగాణ తేవడమొక్కటే తమ లక్ష్యమన్నట్టుగా.. లక్ష్యాన్ని సాధించామన్నట్టుగా.. ప్రభుత్వ పెద్దలు వ్యవహరించడం కూడా సరైంది కాదు. మరోవైపు.. ఇలాంటివి వెలుగులోకి వచ్చినప్పుడు అప్పటికేదో సానుభూతి ప్రకటించి మమ అనిపించుకోవడం, తర్వాత అంశాన్ని పూర్తిగా మర్చిపోవడం సర్వసాధారణమైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో శాశ్వతమైన పరిష్కారం కనుగొనే దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో రైతన్నకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసాను కూడా కలిగించాల్సి ఉంది. తెలంగాణను సస్యశ్యామలంగా మార్చే విధంగా బుర్రకు పదును పెట్టాల్సిన అవసరం ఉంది.
- హంసిని సహస్ర సాత్విక

బతుకమ్మ వైభవం.. తెలంగాణలో వైభోగం


    తెలంగాణలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ప్రముఖమైన పండుగ బతుకమ్మ. ఆశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి మహర్నవమి వరకు తొమ్మిది రోజుల పాటు ఈ వేడుకలు జరుపుకుంటారు. ప్రతియేటా సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ మాసాల్లో జరుపుకునే జంట పండుగలు బతుకమ్మ, దసరా (విజయదశమి). తెలంగాణలో ఇవే అతిపెద్ద పండుగలు. అందుకే ఈ పండుగల సమయంలో ఇక్కడి సమాజమంతా కోలాహలంగా మారిపోతుంది.

    శిబ్బి అని పిలవబడే పాత్రలో గానీ, తాంబాలం అని పిలవబడే పెద్ద రాగిపళ్లెంలో గానీ రంగు రంగుల పూలను త్రికోణాకారంలో.. ఒక్కో వరుసలో రంగులు మారుస్తూ పేర్చి బతుకమ్మను అలంకరిస్తారు. సాయంత్రం వేళ కూడళ్లలో బతుకమ్మలన్నీ ఉంచి వాటి చుట్టూ చప్పట్లు కొడుతూ వలయాకారంలో తిరుగుతూ లయబద్దంగా పాడే పాటలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. ఆ తతంగాన్ని స్వయంగా చూసి తీరాల్సిందేగానీ, వర్ణించడం కష్టం. తొలుత బొడ్డెమ్మతో మొదలై తొలిరోజు పేర్చే బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అని పిలుస్తారు. చివరి రోజు అంటే దసరా ముందు రోజు గానీ, రెండ్రోజుల ముందుగానీ సద్దుల బతుకమ్మగా వర్ణిస్తారు. సద్దుల బతుకమ్మలు ఎత్తులో, అందంలో ఒకదానితో ఒకటి పోటీ పడతాయి. చివరిరోజు బతుకమ్మలను ఎంత భారీగా పేరిస్తే అంత గొప్పగా భావిస్తుంటారు. బతుకమ్మలు ఆడిన తర్వాత చివరగా వాటిని నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు. నీటి ప్రవాహం అందుబాటులో లేని ప్రదేశాల్లో, నగరాల్లో బతుకమ్మలు నిమజ్జనం చేసేందుకే ప్రత్యేకంగా ట్యాంకులు నిర్మిస్తారు.

    బతుకమ్మ పండుగ వర్షాకాలం చివరిలో.. శీతాకాలపు తొలిరోజుల్లో వస్తుంది. అప్పటికే చెరువులన్నీ నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు, రంగు రంగులలో అలరిస్తూ ఉంటాయి. వీటిలో గునగ పూలు, తంగేడు పూలు, బంతి, చేమంతి, నందివర్ధనం వంటి పూలతో బతుకమ్మలను పేరుస్తారు. గునగపూలకు ఆకర్షణీయమైన రంగులు కూడా అద్దుతారు. చివరిగా పసుపుతో చేసిన గౌరమ్మను గానీ, గుమ్మడి పూల గౌరమ్మను గానీ బతుకమ్మపై అలంకరిస్తారు. ఆఖరున బతుకమ్మపై అగరువత్తులు ముట్టించి కూడళ్లకు తీసుకెళ్తారు. ఆ తర్వాత దీపాలతోనూ బతుకమ్మను అలంకరిస్తారు. దాదాపు అర్థరాత్రి దాకా వలయాకారంలో తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడతారు. సద్దుల బతుకమ్మ నాడు పెద్ద పెద్ద బతుకమ్మలు పేర్చడం వల్ల మగవారు వాటిని నిమజ్జనం చేస్తారు. ఆతర్వాత మహిళలు వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు. ఇదే క్రమంలో ఇళ్ల నుంచి తీసుకొచ్చిన సత్తుపిండిని, మలీద ముద్దలను పంచుకుంటారు. మొక్కజొన్నలు, పల్లీలు, పెసలను వేయించి నెయ్యి కలిపి... చక్కెర పాకంతో గానీ, బెల్లం పాకంతో గానీ సత్తుపిండి తయారు చేస్తారు.

    కూడళ్లలో బతుకమ్మలు ఆడటం పూర్తయిన తర్వాత వాటిని తలపై పెట్టుకొని చెరువులుగానీ, నీటి ప్రవాహాల దగ్గరకు గానీ పాటలు పాడుతూనే తీసుకెళ్తారు. భక్తిశ్రద్ధలతో బతుకమ్మలను నీళ్లల్లో నిమజ్జనం చేస్తారు. సాయంత్రం కూడళ్ల నుంచి మొదలు.. నిమజ్జనం చేసేదాకా బతుకమ్మ పాటలు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులూ  ఈ తతంగం కొనసాగుతుంది. ఇప్పుడు నగరాల్లో, పట్టణాల్లో ఎక్కువగా తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ, చివరిరోజు సద్దుల బతుకమ్మలు మాత్రమే పేరుస్తున్నారు.

    బతుకమ్మ పాటల్లో కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు పల్లవిస్తాయి. చాలా వినసొంపుగా ఉండే బతుకమ్మ పాటలు వింటూంటే మైమరిచిపోవడం ఖాయం. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ.

    బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే అతిపెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృద్ధిగా పొంగిపొర్లే సమయంలో బతుకమ్మ పండుగ భూమితో, జలంతో చిరకాలం ఉండే మానవ అనుబంధాన్ని చాటిచెబుతుంది.

    బతుకమ్మ పండుగకు ఆడపడుచులంతా అత్తింటినుంచి పుట్టింటికి వెళ్లడం ఆనవాయితీ. పుట్టింట్లోనే తొమ్మిదిరోజులూ బతుకమ్మ వేడుకలు జరుపుకొని, దసరా పండుగ జరుపుకొని తిరిగి వెళ్తారు.

    బతుకమ్మ పండుగను తెలంగాణలో శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. అయితే.. ఈ సంప్రదాయం ఎలా మొదలైందన్న దానికి మాత్రం రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. నవాబులు, భూస్వాముల పెత్తందారీ తనంలో నలిగిపోయిన తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి ఆకృత్యాలకు నలిగిపోయిన వారిని తలచుకొని..తోటి మహిళలు  వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకవమ్మా.. బతుకు అమ్మా.. అని దీవిస్తూ పాటలు పాడేవారని చెబుతారు. ఓ బాలిక భూస్వాముల ఆకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటే.. ఆమెను ఆ ఊరి ప్రజలు చిరకాలం బతుకమ్మా అని ఆశీర్వదించారట. ప్రతియేడూ ఆమెను తలచుకుంటూ బతుకమ్మ పండుగ జరుపుకునే వారని అంటారు. స్త్రీలు ఎటువంటి ఆపదలూ రావొద్దనీ, తమ పతులు, కుటుంబం చల్లగా ఉండాలని గౌరమ్మను ప్రార్థిస్తారు. మరో కథలో.. దక్షిణ భారతాన్ని పాలించిన చోళ వంశ చక్రవర్తి ధర్మాంగదుడు సంతానం లేక అనేక పూజలు చేయగా.. ఆయన భార్య లక్ష్మీదేవి అనుగ్రహంతో ఓ కూతుర్ని కన్నది. పసిబిడ్డ అయిన లక్ష్మి అనేక గండాలు గట్టెక్కిందని.. ఆమె తల్లిదండ్రులు బతుకమ్మ అని నామకరణం చేశారు. అప్పటినుంచి యువతులు మంచి భర్తను ప్రసాదించాలని కోరుతూ బతుకమ్మను కొలవడం ఆనవాయితీ అయ్యిందని కూడా కథ నానుడిలో ఉంది. ఇక మరో కథ చూస్తే.. ఓ ముద్దుల చెల్లికి ఏడుగురు అన్నదమ్ములున్నారు. అందరూ వీరాధివీరులే. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. అన్నలకు చెల్లెలంటే పంచ ప్రాణాలు కానీ.. వదినలకు మాత్ర అసూయ.ఆ బంగారు బొమ్మను బాధపెట్టేవారు. ఓరోజు వేటకెళ్లిన అన్నలు ఎంతకాలమైనా తిరిగి రాలేదు. అదే సమయంలో వదినలు సూటిపోటి మాటలతో వేధించడంతో చెల్లెలు ఇల్లు వదిలి వెళ్లిపోయింది. ఆ తర్వాత అన్నలు వచ్చి చెల్లెలు ఎక్కడని భార్యల్ని నిలదీశారు. విషయమై అర్థమైన అన్నలు.. తిండీ తిప్పలు లేకుండా, నిద్రాహారాల్లేకుండా చెల్లె కోసం వెదుకుతారు. ఓ ఊరి పొలిమేర దగ్గర బావిలో దాహం తీర్చుకుంటుండగా పెద్ద తామర పూవు కనిపించింది. వాళ్లను చూడగానే నీటిలో తేలుతూ వచ్చింది. ఆ తర్వాత కొంతసేపటికి ఆ రాజ్యాన్ని ఏలే రాజు వచ్చాడు. ఆ పూవును తీసుకెళ్లి తన తోటలోని కొలనులో వేశాడు. కొలనుచుట్టూ దట్టంగా తంగేడు మొక్కలు మొలిచాయి. కొంతకాలానికి విష్ణుమూర్తి దిగొచ్చి తామరను మనిషిగా చేశాడు. ఆమె శ్రీలక్ష్మి అవతారమని ప్రకటించాడు. పువ్వులకు బతుకుదెరువు చూపింది కాబట్టి బతుకమ్మ అయ్యింది. ఇదో జానపద గాథ. మహిషాసురుని చంపిన తర్వాత అలసి సొలసి మూర్చపోయిన అమ్మవారికి మహిళలంతా కలిసి పాటలతో స్పృహ తెప్పించే ప్రయత్నం చేశారని మరో ఐతిహ్యం. ఆత్మ త్యాగంతో తెలంగాణలోని ఓ పల్లెను వరద బారి నుంచి కాపాడిన త్యాగమూర్తే బతుకమ్మ అనేవారూ ఉన్నారు.

    తెలంగాణ ఉద్యమంలోనూ బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైంది. ఉద్యమంలో బతుకమ్మతో చేసిన ఊరేగింపులు, కార్యక్రమాలు తెలంగాణ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించాయి.

    ఇక సద్దుల బతుకమ్మ మరుసటిరోజు జరుపుకునే దసరా పండుగరోజు వాహనాలను కడిగి పూలు, కంకణాలతో అలంకరిస్తారు. వృత్తిపనుల వారు పనిముట్లకు పూజలు చేస్తారు. కొత్తవ్యాపారాలు కూడా మొదలు పెడతారు. ఇళ్ల నిర్మాణానికి ముగ్గు పోయడం, గృహప్రవేశాలు,దుకాణాల ప్రారంభం కూడా దసరా నాడు చేస్తారు.

16, సెప్టెంబర్ 2015, బుధవారం

ఇంకెన్నాళ్లీ విద్వేషాలు?

తెలుగువారికి రెండు రాష్ట్రాలు,  ప్రభుత్వాలు ఏర్పడ్డాయన్న సంతోషం  ఇంకాయేడాది కూడా కాలేదురెండు ప్రభుత్వాల వైఖరి పోటాపోటీ వ్యూహాలు,అంతకుమించి కేసు నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య పచ్చగడి వేస్తేభగ్గుమనే పరిస్థితి నెలకొందినిజానికి పార్టీ పరంగా చూస్తే టీఆర్ఎస్టీడీపీ మధ్యేఅధిపత్య పోరు కాగా... తెంగాణలో టీఆర్ఎస్ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోఉండటంతో  వ్యవహారం ఉభయ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పోరాటంలాతయారైందిఫలితంగా ఎవరి అనుకూల ప్రకటనలు వారు చేసుకుంటున్నారు.అధికారులను అడ్డుపెట్టుకొని రాజకీయ వికృత క్రీడ సాగిస్తున్నారుమొత్తానికి వ్యవహారం తెలుగు ప్రజల మనోభావాల మధ్య చిచ్చు పెట్టేదిగా ముందుకుసాగుతోంది.
విభజన జరిగినప్పటినుంచీ పంపకాలుకేటాయింపుల్లో  మాత్రం సర్దుబాటుధోరణి వ్యక్తం చేయని ప్రభుత్వాలు.. వీలైనప్పుడల్లా కయ్యానికే కాలుదువ్వుతున్నాయిపైగా  అభిప్రాయాలను ప్రజల అభిప్రాయాలుగాఆత్మగౌరవసమస్యుగా చిత్రీకరిస్తూ ప్రజలకు కూడా ఇందులో  పాత్ర కల్పించేందుకుపాలకులు ప్రయత్నిస్తున్నారుఇక్కడ వాగ్బాణాలు వదలడం... ఢల్లీలో వెళ్లి కేంద్రంసమక్షంలో చర్చలంటూ పట్టుబట్టడం యేడాది కాలంగా సర్వసాధారణంగామారిందిరాష్ట్ర విభజన నేపథ్యంలో ఆస్తులుఅప్పులుపంపకాలుకేటాయింపుసామరస్యపూర్వకంగా... ఉమ్మడి అభిప్రాయాలను  గౌరవిస్తూ  పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉండగా... నాయకులు మాత్రం ‘ఎవరికి వారే... యమునాతీరే’ అన్న మాదిరిగా ప్రవర్తిస్తున్నారుఫలితంగా తెలుగు ప్రజల మధ్య ఒక లోతైనఅగాధం ఏర్పడుతున్నది.
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వెలుగు చూసిన ఓటుకు నోటు కేసుతో ఇరు రాష్ట్రప్రభుత్వాల వ్యవహారశైలి రచ్చకెక్కింది కేసులో రేవంత్రెడ్డి  ప్రత్యక్షంగా పట్టుబడగా... ఏపీ సీఎం  చంద్రబాబు  నాయుడు  వెనుక ఉండి నడిపించారంటూతెలంగాణ ప్రభుత్వం ప్రచారం  చేసింది.  చంద్రబాబు  గొంతుగా చెబుతున్నఆడియో టేపునూ బయటపెట్టిందిఏకంగా  ముఖ్యమంత్రే లక్ష్యంగా పక్క  రాష్ట్రప్రభుత్వం పావులు కదపడాన్ని... ఆంధ్రప్రదేశ్ సర్కారు తీవ్రంగా పరిగణించింది.పోటీగా ఏపీలో కేసీఆర్పై ఆయా సందర్భాల్లో నమోదైన 87 కేసులనుతవ్వితీసిందిఅంతేకాదు...  కేసులను ఆగమేఘాల మీద సీఐడీకిఅప్పగించింది కూడాతమకు ఏదైనా హాని తలపెడితే.. తామేంటో చూపిస్తామన్నస్థాయిలో కౌంటర్ ఇచ్చేందుకు మానసికంగా ఏపీ ప్రభుత్వం సిద్ధమైందినేపథ్యంలోనే చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కేసులో తెంగాణ ప్రభుత్వంనోటీసులు ఇవ్వబోతుందన్న ప్రచారంతో రెండుమూడు రోజులు హైదరాబాద్లో తీవ్రఉత్కంఠభరిత పరిస్థితులు నెలకొన్నాయిఅటు.. ఆత్మరక్షణలో బడ్డ టీడీపీపార్టీతోపాటు... సీఎంకు రక్షణగామంత్రులకు రక్షణగా ఏపీ ప్రభుత్వం తమబలగాలను దింపిందిమంత్రుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది.ఇంకా నిత్యం విమర్శ ల జోరు కొనసాగుతూనే ఉంది.
తెలుగు రాష్ట్రాల మధ్య రగడతో మీడియా కూడా రెండుగా చీలిన సందర్భంగోచరిస్తోందిపత్రికలు తిరగేసినా..  టీవీ  చూసినా... ఎందులో  వచ్చింది వాస్తవమో,  దేన్ని పరిగణనలోకి తీసుకోవాలో తెలియక సాధారణ పాఠకులు,ప్రేక్షకులు అయోమయంలో పడిపోతున్నారుతెలంగాణ అనుకూల పత్రికల్లోవస్తున్న వార్తలుఆంధ్రప్రదేశ్ అనుకూల మీడియాలో ప్రసారమవుతున్న వార్తల్లోతేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోందిచివరకు సెక్షన్`8 విషయంలో కేంద్రాన్నీమధ్యలోకి దింపింది వర్గం మీడియాఒకే వార్త రెండు భిన్న పత్రికల్లో రెండువిభిన్న పార్శ్వాల్లో వస్తుండటంతో ఏది వాస్తవమో   తెలియక   జనం  జుట్టుపీక్కుంటున్నారుమీడియాలో వస్తున్న గందరగోళ సమాచారానికి ముగింపుపలికేలా... కేంద్రం జోక్యం  చేసుకోవాని  ఎవరికి   వారు అంటున్నారుకేంద్రంప్రత్యక్ష జోక్యానికి సిద్ధంగా లేదు.
రాష్ట్రం విడిపోక ముందు రాజకీయపార్టీలు ప్రజలను ఎలా పావుగావాడుకున్నాయో.. ఇప్పుడు విభజన జరిగిన తర్వాత కూడా వాటి వ్యవహారశైలిఅలాగే కొనసాగుతున్నదని విశ్లేషకులు ఘంటాపథంగా చెబుతున్నారుఇప్పటికైనా రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు సమసిపోయి సామరస్యంనెలకొనాలని ఆశిద్దాంఇరు రాష్ట్రాల ప్రజల మధ్య ఐకమత్య భావనపెంపొందించాల్సిన ఆవశ్యకత ఉంది.
హంసిని సహస్ర సాత్విక
(లోకహితం మాసపత్రిక June-15లో ప్రచురితం)

14, సెప్టెంబర్ 2015, సోమవారం

ఓయు తేనెతుట్టెను కదిపిన కేసీఆర్‌ రహస్య వ్యూహంలో భాగమేనా?




    తెలంగాణ ముఖ్యమంత్రి కెచంద్రశేఖర్రావు మానసపుత్రికగా చెప్పుకుంటున్నడబుల్ బెడ్రూమ్ ప్లాట్స్ పథకం ఆచరణ పక్కన బెట్టి... ఆదిలోనే తీవ్రవిమర్శలకుఅనుమానాలకు కారణమవుతోందిఇటీవలి కాలంలో కేసీఆర్ఎక్కడికి వెళ్లినా పేదలకుమధ్యతరగతి ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించిప్రధానంగా ప్రస్తావిస్తున్నారుముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో ఒకరకంగా డబుల్బెడ్రూమ్ ప్రచారం ఎక్కువగా చేస్తున్నారుఇప్పటికే పలు కాలనీలు,మురికివాడల్లో గుడిసెలురేకుల షెడ్లు వేసుకొని జీవిస్తున్న పేదలు.. ముందయితేతమ ఇళ్లకు పట్టాలు ఇప్పించమంటూ వేడుకుంటున్న వేదన.. అరణ్యరోదనేఅవుతోందికొన్ని సందర్భాల్లో కేసీఆర్ను వివిధ కాలనీల్లో జనం నేరుగా నిలదీసినపరిస్థితులున్నాయిఅయితే వారిపై అసహనం వ్యక్తం చేస్తూనే తెలివిగాసమాధానం దాటవేస్తున్న సీఎం.. డబుల్ బెడ్ రూమ్ ఆశచూపి నిప్పుపై నీళ్లుచలుతున్నారు.
హైదరాబాద్లో ఇళ్లుఅపార్ట్మెంట్లు నిర్మిస్తామంటున్న ప్రభుత్వం..అందుకుఅవసరమైన స్థలం ఎక్కడుందన్న విషయాన్ని విస్మరిస్తోందిత్వరలోజీహెచ్ఎంసీకి ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా రాష్ట్ర రాజధానిలో పాగా వేయడంపైనేపూర్తిస్థాయిలో దృష్టిపెడుతున్న కేసీఆర్.. ఓటర్లను ఆకర్షించేందుకే  ప్రకటననుచేస్తున్నారన్న వాదనలో అతిశయమేమీ లేదుఅయితేఇదే సమయంలోఅనుకున్నంత వేగంగా డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు పూర్తి కావన్న వాస్తవమూగుర్తెరిగిన కేసీఆర్ వ్యూహాత్మకంగా ఓయూ భూము ప్రతిపాదనను తెరపైకితెచ్చారని తొస్తోందిఫలితంగా అంశాన్ని పక్కదారి పట్టించొచ్చన్నది టీఆర్ఎస్ బాస్ఆలోచనగా చెబుతున్నారు.  ఓయూ విద్యార్థుల శక్తి యుక్తులేమిటన్నదికేసీఆర్కు తెలియనివి కాదు... తెంగాణ రాష్ట్రం ఆవిర్భావంలో ఉస్మానియాయూనివర్సిటీ పాత్రే కీలకమన్నది కూడా జగమెరిగిన సత్యం ప్రకటనవివాదాస్పదమవుతుందని తెలిసీ కేసీఆర్  ఆలోచనకు పదును పెట్టారు.మొత్తానికి జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచి గట్టెక్కేదాకా... డబుల్బెడ్రూమ్పథకాన్ని కొంతకాలం అటకెక్కించేందుకు  తరహా వ్యూహం పన్నారని తొస్తోంది.అందుకే.. యూనివర్సిటీకి అంత స్థలమెందుకని బహిరంగంగా ప్రకటించివిద్యార్థులను మరింత రెచ్చగొట్టాలని భావిస్తున్నారు.
కేసీఆర్ ముందస్తు వ్యూహమోవిద్యార్థుల ఆగ్రహ జ్వాలో కానీ... తేనెతుట్టెకదిపినట్లయ్యిందితమ మౌనాన్ని చేతగాని తనంగా భావిస్తున్నారంటూ విద్యార్థిలోకం కదం తొక్కిందిచారిత్రాత్మక యూనివర్సిటీ స్థలాను వదులుకునేదే లేదనితెగేసి చెప్పారు విద్యార్థులుఇప్పటిదాకా ఆక్రమణకు గురైన స్థలాలను కూడావదలబోమని స్పష్టం చేశారుఉస్మానియా యూనివర్సిటీ స్థలాలనుఆక్రమించినట్లు ఆరోపణలున్న  టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చెందిన హోటల్పైనా,మరో పెట్రోల్ బంకుపైనా ఓయూ విద్యార్థులు దాడులు చేశారుఫర్నీచర్ ధ్వంసంచేశారుఓయూ భూమిని అంగుళం కూడా వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.విద్యార్థుల ఆగ్రహానికి పోలీసులు రంగంలోకి దిగి బవంతంగా అరెస్టు చేయాల్సినపరిస్థితి నెలకొంది.
 మరోవైపు... ఓయూ భూముల రగడ అటు రాజకీయంగానూ దుమారం లేపింది.కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారనిరాచరిక పాలనను గుర్తుకుతెస్తున్నారంటూ ఇటు ప్రతిపక్షలు అటు ప్రజాసంఘాలు ముక్త కంఠంతోవిమర్శించాయికేసీఆర్ ఖబడ్దార్ అంటూ హెచ్చరికలు జారీచేశాయి.అంతేకాదు... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా విద్యార్థులజోలికెళ్లొద్దంటూ సుతిమెత్తగా తెంగాణ సీఎంను హెచ్చరించారంటే కేసీఆర్ దూకుడు స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చుఎట్టకేలకు నాయిని నర్సింహారెడ్డివిశ్వవిద్యాలయ భూముల జోలికి రాము అని ప్రకటించారుఇది తాత్కాలికమా?

- హంసిని సహస్ర సాత్విక

(లోకహితం మాసపత్రికలో ప్రచురితం)

22, జూన్ 2015, సోమవారం

విశ్వ'యోగా' భవ


  • మీ ఆరోగ్యం బాగుపడాలంటే యోగా చేయండి - ఒక డాక్టర్‌ సూచన...
  • మీ మనసు స్థిమితంగా ఉండాలంటే యోగ సాధన చేయండి - ఒక సైకాలజిస్ట్‌ సలహా...
  • మీరు అందంగా ఉండాలనుకుంటున్నారా? మంచి శరీరాకృతి కావాలనుకుంటున్నారా... అయితే యోగా చేయండి - ఒక బ్యుటీషియన్‌ సమాధానం...
  • మీ కంపెనీలో ఉద్యోగులు చక్కగా, సమర్థంగా పని చేయాలంటే వారికి యోగా నేర్పించండి - ఒక వ్యక్తిత్వ వికాస నిపుణుడి మాట...
  • మీ విద్యాసంస్థలో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలంటే వారికి యోగ నేర్పించండి - ఒక ఉన్నత విద్యా నిపుణుడి సూచన...
  • మీరు మీ ఆటలో ఏకాగ్రతతో ఉంటూ విజయం సాధించాలంటే యోగ సాధన ఒక్కటే మార్గం - క్రీడాకారులకు ఒక కోచ్‌ హెచ్చరిక...



ఇలా ఆరోగ్యానికి, అందానికి, సంపాదనకు, విద్యకు అన్ని వర్గాల వారికి నేడు యోగ అవసరమైంది. అందరూ యోగ చేయమంటున్నారు. ఏదైనా పని సమర్థంగా జరగాలన్నా, ఎవరైనా వారి వారి పనులలో నిపుణు లవ్వాలన్నా యోగను ఆశ్రయిస్తున్నారు. ఇన్ని రకాలుగా నేడు యోగ ప్రాచుర్యం పొందింది.
అసలు యోగ అంటే ఏమిటి? అది ఎలా వచ్చింది? ఎవరు కనిపెట్టారు? ఎక్కడ ఆవిర్భవించింది? ఈ యోగ చేయడం వలన అంత శక్తి ఎందుకు వస్తుంది? వంటి ప్రశ్నలన్నిటికి సమాధానం కావాలంటే మనం కూడా యోగ సాధన చేయాల్సిందే.
యోగ అంటే ఏమిటి?
యోగ అనేది మనిషి మనుగడలో ఒక భాగం. మనిషిని వత్తిడి నుంచి దూరం చేసి, శరీరానికి విశ్రాంతి నిచ్చి, మనస్సును స్థిరం చేసే ఒక ప్రక్రియ. వత్తిడికి గురైతే వ్యవస్థలు సక్రమంగా పనిచేయక శరీరం రోగమయం అవుతుంది. శరీరం రోగమయం అయితే మనస్సు అల్లకల్లోలం అవుతుంది. అప్పుడు ఏ పనిమీద మనసు లగ్నం చేయలేక, ఏ పనిలోను నైపుణ్యం సాధించలేక వెనుకబడిపోతాం. కొంతమంది దురలవాట్లకు బానిసై తమ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. వీటన్నింటికి విరుగుడు యోగ సాధన.
యోగ ఎక్కడ పుట్టింది? దీనికి కర్త ఎవరు?
యోగ భారతీయుల మానసపుత్రిక. భారతీయుల జీవన విధానం. ప్రపంచానికి మనమిచ్చిన ఒక వరం. ప్రాచీనకాలం నుండి మనదేశంలో విలసిల్లింది. పతంజలి మహర్షి యోగకు కర్త అని చెబుతారు. ఎందుకంటే పతంజలి మహర్షి అంతకుముందే ఉన్న యోగ సూత్రాలను ఒక క్రమపద్ధతిలో కూర్చి, సామాన్య మానవునికి అర్థమయ్యే రీతిలో భాష్యాలను వ్రాసి, దానికి ఒక క్రియను ఏర్పరచారు.
యోగ సాధన అంటే ఏం చేయాలి ?
‘యోగ’ నిజానికి ‘అష్టాంగ యోగ’ నుండి వచ్చింది. ఈ అష్టాంగ యోగలో 8 రకాల విభాగాలు, అభ్యాసాలు ఉన్నాయి. వీటిని విభాగాలు అనటం కన్నా ‘స్థాయి’ (మెట్లు) అనటం బాగుంటుంది. ఒక్కొక్క స్థాయి యోగసాధకుడిని ఒక్కొక్క మెట్టు పైకి తీసుకెళుతుంది. యోగ సాధకుడు పైస్థాయికి చేరుకున్నప్పుడు సాక్షాత్తూ పరమపదాన్ని చేరుకున్నట్లే.
అష్టాంగ యోగ 
  1. యమ : అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము. ఈ ఐదు కలిగినట్టిది యమ. యోగసాధకుడు అనుసరించవలసిన మొదటిమెట్టు ఇది.
  2. నియమ : శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిదానము. ఇది రెండవ మెట్టు. అంటే యోగసాధకుడు మొదట తన మనస్సును అదుపులో పెట్టుకోవాలని అర్థం. అంటే యమ, నియమాలను పాటించాలి.
  3. ఆసన : ఇది శారీరిక క్రియ. దీనిలో ఆసనాలు అభ్యాసం చేయాలి. నిలుచుని, కూర్చుని, వెల్లకిలా పడుకొని, బోర్లా పడుకొని ఇలా అనేక స్థితుల్లో చేసే 100 రకాల ఆసనాలను పతంజలి మహర్షి చెప్పారు. వీటిలో నుంచి నిత్యం అభ్యాసం చేయడానికి కొన్ని ఆసనాలను కలిపి ‘సూర్యనమస్కారాలు’ అనే క్రియ తయారైంది. ఆసన ప్రక్రియనే హఠయోగ అని కూడా అంటారు. కేవలం ఈ హఠయోగ సాధన నిత్యం చేసే మానవుడు 200 సంవత్సరాలపాటు ఎటువంటి రోగాలు లేకుండా జీవించగలడని స్వామి వివేకానంద చెప్పారు. ఆసన అభ్యాసం వలన అనేక రోగాలు తగ్గుముఖం పడతాయి.
  4. ప్రాణాయామం : ఇది శ్వాసకు సంబంధించిన ఉచ్చ్వాస, నిశ్వాసల ప్రక్రియ. మన శ్వాసను నియంత్రించడం ద్వారా శరీరాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించడమే ఈ ప్రాణాయామ ఉద్దేశ్యం. ప్రాణాయామం కూడా అనేక రోగాలకు విరుగుడుగా పనిచేస్తుంది. ఈ ఆసన ప్రాణాయామాలు శరీరానికి బలం చేకూర్చుతాయి. యోగ సాధకునికి ఇవి మూడు, నాల్గవ మెట్లు.
  5. ప్రత్యాహార : ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడం. ఆరోగ్యంగా ఉన్న మానవుడు ఇంద్రియాలను అదుపులో పెట్టుకోగలడు. ఇది ఐదవ మెట్టు.
  6. ధారణ : మనస్సును స్థిరపరచడం. ఇంద్రియాలను అదుపులో పెట్టుకొన్నవారికి మనస్సు స్థిరమవుతుంది. ఇది ఆరవ మెట్టు.
  7. ధ్యాన : మనస్సును ఒక బిందువుపై లగ్నం చేయడం. దీనినే ధ్యానం అంటారు. ఇది ఏడవ మెట్టు.
  8. సమాధి : పై ఏడు స్థితులలోను (మెట్లు) అంతరాయం లేకుండా ఉన్న యోగసాధకునికి ఈ ఎనిమిదవ స్థితి సాధ్యమవుతుంది. సమాధి స్థితిలోకి వెళ్ళడమంటే యోగసాధకునికి ఇది పరాకాష్ట అవుతుంది. అంటే ఇదే ఆధ్యాత్మిక సాధనలో చివరిమెట్టు. ఇది మనసును నిశ్చల స్థితిలోకి తీసుకెళ్ళి మనిషిని తన బాహ్య స్పృహ కోల్పోయేటట్లు చేస్తుంది. ఇదే పరమపద స్థితి అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ మనిషిలోని జ్ఞాన చక్షువు తెరచుకుంటుంది. సహస్రారం పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈ స్థితిలో మానవుడు తాను ఎక్కడ నుంచి వచ్చినదీ, ఎక్కడికి పోతున్నదీ, ఆత్మ, పరమాత్మ, దైవం ఇత్యాది ఆధ్యాత్మిక విషయాలన్నీ అతనికి అవగతమౌతాయి. దీనినే నిశ్చల స్థితి అనీ, నిర్వికార స్థితి అనీ అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మానవునికి దైవత్వం సిద్ధించినట్లే.
ఈ 8 అంగములతో కూడినది అష్టాంగ యోగ. ఈనాడు అందరూ పై 8 అంగాలలోని ఆసన్‌, ప్రాణాయామం, ధ్యానం వంటి మూడిరటిని మాత్రమే చేస్తూ కేవలం ఇదే యోగ అని భావిస్తుంటారు. ఇవి కేవలం బాహ్య క్రియలు మాత్రమే. వీటికి అంతరక్రియలైన మిగతావి తోడైతే యోగసాధకుడు పరిపూర్ణుడవుతాడు.
చరిత్రలో సంధికాలం
ఇంత మహత్తరమైన యోగ విద్యను ప్రాచీనకాలం నుండి మన గురుకులాల ద్వారా ప్రతి విద్యార్థికి, ప్రతి పౌరునికి గురువులు నేర్పేవారు. ఆధునిక యుగం 7వ శతాబ్దం తరువాత విదేశీయుల దండయాత్రల వలన భారతదేశ చరిత్రలో వచ్చిన విపరిణామాలతో యోగకు ప్రాధాన్యం తగ్గింది. మనిషి ప్రాణానికే భద్రత కరువైంది. బ్రిటిష్‌వారి రాకతో, వారి కుట్రలతో, కుతంత్రాలతో, మెకాలే విద్యావిధానంతో మన ప్రాచీన సంస్కృతి, సంప్రదాయ విద్య మరుగున పడిరది. దానితో యోగవిద్య కూడా కొందరికే పరిమితమైంది. సంస్కారాలకు సంధికాలం ఏర్పడిరది. దానితో ప్రపంచమే శాంతికి దూరమైంది.
మళ్ళీ పూర్వ వైభవం


భారతదేశం స్వతంత్రమైన తరువాత మరల యోగకు ప్రాధాన్యం ఏర్పడిరది. యోగవిద్య అందరికి చేరువలోకి వచ్చింది. భారతీయుల మానస పుత్రిక నేడు ప్రపంచం మొత్తానికి మార్గదర్శనం చేస్తోంది.
ఐక్యరాజ్యసమితి గుర్తింపు
యోగకు ప్రపంచ సమర్ధన కూడా లభించింది. ప్రధాని నరేంద్రమోది సెప్టెంబరు 27, 2014న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తూ యోగ విశిష్టతను తెలియపరచి అంతర్జాతీయ యోగ దినం జరుపవలసిన ఆవశ్యకతను విపులీకరించారు. ఆ సూచనను ఐక్యరాజ్యసమితి గుర్తించింది. జూన్‌ 21 అంతర్జాతీయ యోగ దినోత్సవంగా 170 సభ్యదేశాల ఆమోదంతో ప్రకటించింది.
ఇటువంటి మహత్తర సమయంలో భారతీయుల మానస పుత్రిక యోగకు పూర్వవైభవం తేవాలంటే దీనిని అందరం సాధన చేయాలి. యోగ సాధన వలన పోయేదేముంది, అనారోగ్యం, విచారం, ఈతిబాధలు తప్ప. కాబట్టి భారతీయులారా, లేవండి, యోగ సాధన చేయండి. జూన్‌ 21 నాడు ప్రతి ఇంటినుండి, ప్రతి వీథి నుండి, ప్రతి పాఠశాల నుండి, కళాశాల నుండి, ప్రతి ఒక్కరూ యోగసాధన చేయండి. ఆ రోజున ప్రపంచానికి మన యోగ అంటే చూపించండి. విజయోస్తు.
జై యోగ దివస్‌..! జై భారత్‌..!
- సూర్యతేజ