14, జనవరి 2014, మంగళవారం

అమ్మ..!!?


అంతరిక్షంలోకి దూసుకెళ్తున్న ఈ రోజుల్లోనూ అమ్మాయిలంటే వివక్ష తగ్గడం  లేదు. భ్రూణ హత్యలు ఒకవైపు.. పుట్టిన శిశువులను వదిలించుకునే  దుస్సంప్రదాయం మరోవైపు.. సాధారణమైపోయాయి. ఇదేం కసాయి  లోకమని ప్రశ్నిస్తున్నాయి. మానవజాతి పురోగతిని వెక్కిరిస్తున్నాయి.

 స్త్రీలను దైవంగా పూజించే క్రమం నుంచి ఆడజాతి మనుగడనే శాసించే స్థాయికి  దిగజారిపోయాం. ఇప్పుడు అమ్మాయి వద్దంటే.. భావితరానికి అమ్మ  ఎక్కడ దొరుకుతుంది. అప్పుడు డబ్బులిచ్చి అమ్మను  కొనుక్కుందామా... మనసుపెట్టి ఆలోచించండి.. మనుగడకే ఎసరు  తెచ్చుకోకండి.

21, డిసెంబర్ 2013, శనివారం

పార్టీల మధ్య సంకుల సమరం

ఇదీ వాస్తవం !
 
 
ఐదు రాష్ట్రాల ఎన్నికలు
పార్టీల మధ్య సంకుల సమరం
2014 పీఠమే పార్టీలకు ప్రధానం
సెమి ఫైనల్స్ లా తలపడుతున్న దృశ్యం
ఓడితే బొక్కబోర్లా పడటం తథ్యం

యూపిఎ ప్రచార బరిలో రాహుల్
ఎన్డీఎ పక్షాన మోడీ
ఎవరిని వరిస్తుందో సెమీఫైనల్ కిరీటం
ఇరు పక్షాల్లో నెలకొన్న సందిగ్ధం

అధికార పక్షంపై మోడీ విమర్శల వర్షం
అదేస్థాయిలో యూపిఏ నేతల ధ్వజం
ప్రచారంలో హద్దులు దాటుతున్న విమర్శల పర్వం
ఎన్నికల్లో గెలవడమే ముందున్న ఏకైక లక్ష్యం

మోడీ సభలపై బుసకొడుతున్న ఉగ్రవాదం
పాట్నాలో పేలుళ్లు...  జమ్మూలో దాడుల పుకార్లు
ఎన్డీఏ అస్తిత్వాన్ని దెబ్బతీయాలన్న నైజం
ఏనాటినుంచో వేళ్లూనుకున్నదన్నది సత్యం

- హంసినీ సహస్ర

28, అక్టోబర్ 2013, సోమవారం

దేశానికి ఎవరు దిక్కు?


ప్రధానమంత్రి...
భారత ఔన్నత్యాన్ని చాటే పదవి
దేశ ప్రజలందరికీ ప్రతినిధి
పాలనాపరంగా ఉండాలి...
ప్రజలందరికీ జవాబుదారీ

పెద్దదిక్కు...

అవినీతి ఆరోపణలు వస్తే...
ఆర్థిక వ్యవస్థ పతనమైతే...
సమస్యలతో సందిగ్ధం నెలకొంటే...
దారిలో పెట్టడం ఆయన విధి

తగ్గారు...

నేర చరితులపై వేటుకు...
సుప్రీంకోర్టు ఆదేశం
దీనిపై ఆర్టినెన్స్‌కు ప్రయత్నించిన ప్రభుత్వం
రాత్రికి రాత్రే వెనక్కి తగ్గిన మన్మోహన్‌

లోగుట్టు...

ఆర్డినెన్స్‌ను చింపేయాలన్న రాహుల్‌
శరవేగంగా స్పందించిన పీఎం
ఆలోచన విరమించుకున్న UPA సర్కార్‌
చివరకు బుట్టదాఖలైన ఆర్డినెన్స్‌

కోల్‌గేట్...

దేశాన్ని కుదిపేసిన కోల్‌ కుంభకోణం
ప్రత్యక్ష సంబంధం లేదన్న మన్మోహన్‌
తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నం
ఒడిశా సీఎంపైకి నెపం నెట్టేందుకు యత్నం

కాలింది...

 మాజీ కోల్‌సెక్రెటరీపై CBI కేసు
తనతో పాటు ప్రధానినీ ప్రశ్నించాలన్న పరేఖ్‌
ఉలిక్కిపడ్డ ప్రధాని మన్మోహన్‌
ప్రశ్నిస్తే సిద్ధమేనంటూ మాట మార్చిన వైనం

జవాబుదారీ...

కొన్నాళ్లనుంచి వరుస పరిణామాలు
అయినా.. మౌనమే నాదారి అంటున్నారు
ఓ పార్టీ చేతిలో కీలుబొమ్మగా మారారన్న వాదనలు
సోనియాకు జవాబుదారీగా ఉంటున్నారన్న ఆరోపణలు

మన్మోహన్‌ జీ...

సమర్థుడు, సౌమ్యుడు అన్న అభిప్రాయం
వ్యక్తిగతంగా అందరికీ గౌరవం
వ్యవహారశైలితో మారుతోంది గళం
అసమర్థుడంటూ విమర్శల వర్షం

- హంసినీ సహస్ర

23, అక్టోబర్ 2013, బుధవారం

దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు...

ఇదీ వాస్తవం !



దొంగలు, దొంగలు ఊళ్లు పంచుకున్నారట
దానికి రాజకీయ పార్టీలూ పోటీ పడుతున్నాయట
'నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు' అన్న చందంగా
ఎవరికి వారే సర్ది చెప్పుకుంటున్నారట

రాజకీయాలను గాడిలో పెట్టాలన్నారు జనం
ఆ ఆకాంక్షకు న్యాయస్థానం ఇచ్చిందో రూపం
నేర చరితులకు చెక్ పెట్టే కీలక ఆయుధం
కోర్టు ఆదేశాలనూ ధిక్కరించిన నాయకగణం

పణంగా పెడుతున్నారు పార్లమెంటు గౌరవం
ఆర్డినెన్స్ రూపంలో తప్పించుకునే ప్రయత్నం
చట్టసభల అధికారాన్ని చేస్తున్నారు దుర్వినియోగం
సుప్రీం తీర్పు పైనా వెళ్లగక్కారు ఉక్రోషం

రాష్ట్రపతి తీసుకున్నారు భేషైన నిర్ణయం
ఆర్డినెన్స్ ను వెనక్కు తిప్పి పంపిన వైనం
ఆర్డినెన్స్ చింపేయాలంటూ రాహుల్ అసహనం
ఎట్టకేలకు వెనక్కు తగ్గిన ప్రభుత్వం

ప్రజలకు తెలుసు నాయకుల పగటివేషం
మూడోకన్ను తెరుస్తారు ఎన్నికలవేళ ఇది నిజం
 

- హంసినీ సహస్ర

18, సెప్టెంబర్ 2013, బుధవారం

హుస్సేన్‌సాగర్‌కు కంఠాభరణంలా గణపయ్యలు



హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ తీరాన్ని గణనాథులు ఆక్రమించేశారు. సాగర్‌ చుట్టూ విఘ్నేశ్వరుని విగ్రహాలు కంఠాభరణంలా కనిపిస్తున్నాయి. జంటనగరాల్లోని కాలనీలు, వీధులు, రోడ్లన్నీ గణేశుని శోభాయాత్రలో మునిగిపోయాయి. హుస్సేన్‌ సాగర్‌ వద్ద ఏర్పాటు చేసిన భారీ క్రేన్లకు తోడు.. మొబైల్‌ క్రేన్లతో వినాయకుడి విగ్రహాలను హుస్సేన్ ‌సాగర్‌లో నిమజ్జనం చేస్తున్నారు. ఉదయం నుంచి కాస్త మందకొడిగా తరలివచ్చిన గణనాథులు.. సాయంత్రానికి హైదరాబాద్‌ రోడ్లను ఆక్రమించేశారు. ప్రధాన శోభాయాత్ర మార్గం ఇసకేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. భక్తుల భజనలు, యువతుల కోలాటాలు, యువకుల సందడి మధ్య గణేశులు ముందుకు సాగుతున్నారు. మరోవైపు.. సాయంత్రం హైదరాబాద్‌ నగరాన్ని కుండపోత వర్షం ముంచెత్తింది. రోడ్లన్నీ వరద నీటితో నదులను తలపించాయి. అయినా.. భారీ వర్షంలోనే భక్తులు శోభాయాత్రలో పాల్గొన్నారు. తెల్లవార్లూ గణేశ నిమజ్జనోత్సవం ఉధృతంగా సాగనుంది. ఇటు.. నిమజ్జనం సందర్భంగా నగరంలోని అన్ని రోడ్లలో ట్రాఫిక్‌ను మళ్లించారు. ప్రత్యేకంగా కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటుచేశారు. శోభాయాత్రలోని ప్రధాన కూడళ్లు, హుస్సేన్‌సాగర్‌ చుట్టూ సిసి కెమెరాలు అమర్చిన పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

17, సెప్టెంబర్ 2013, మంగళవారం

రూపాయి - పాపాయి


ఇదీ వాస్తవం !


చేతులు కాలాక ఆకులు పట్టుకుందాం
అదిగో పిలుస్తున్నారు ప్రధాని మన్మోహన్
ఇదే యూపీఏ తాజా నినాదమట
కానీ చేతులు ఇప్పటికే బొబ్బలెక్కాయి

ప్రధాని వయసుతో పరుగుతు తీస్తోన్న రూపాయి
అంతుచిక్కని అగాథం వైపు జారిపోతున్న పాపాయి
మేకపోతు గాంభీర్యం భరోసా ఇవ్వడం లేదోయి
మొత్తానికి పరిస్థితులు గాలిలో దీపంగా మారాయి

గతమెంతో ఘనమని మన్మోహన్ కు పేరు
1991లో ముంచెత్తిన ఆర్థిక సంక్షోభం ఆనాడు
సంస్కరణలతో అదుపులోకి వచ్చిన పగ్గాలు
దీర్ఘకాలంలో చూపిస్తున్నాయి ప్రతికూల ఫలితాలు

రూపాయి పతనానికి చిహ్నం ఒక కారణమట
ఆ చిహ్నం మారిస్తే ఫలితం ఉంటుందట
వాస్తు నిపుణుల పరిశీలనలో తేలిన వాస్తవమట
నష్ట నివారణ దిశగా ఉద్ధండుల మథనమట
 

- హంసినీ సహస్ర

16, ఆగస్టు 2013, శుక్రవారం

వర్షాంధ్రప్రదేశ్‌

బంగాళాఖాతంలో ఏర్పడినఅల్పపీడన ద్రోణి ప్రభావంతో  రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. వరదల ధాటికి నాలుగు జిల్లాల్లో ఐదుగురు గల్లంతయ్యారు. చత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు  కోస్తాంధ్ర మీదుగా అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుండటంతో మరో రెండు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతారణ శాఖ అధికారులు తెలిపారు.