24, మార్చి 2016, గురువారం

కాలుష్య నియంత్రణతోనే మనుగడ




-     వాతావరణ పరిరక్షణతోనే మానవ రక్షణ
-     మార్చి 23 ప్రపంచ వాతావరణ దినోత్సవం
సప్తగిరి గోపగోని
98850 86126

వాతావరణమంటే గాలి. భూమి పైపొర. జీవ జాలానికి అనువైన భూ గ్రహంపై దాదాపు వెయ్యి కిలోమీటర్ల ఎత్తు వరకూ వ్యాపించి ఉన్న గాలి పొరను వాతావరణం అని పిలుస్తారు. భూమిపై మనుషులు, జీవజాలం బతకడానికి అవసరమైన ఆక్సిజన్‌ గానీ, చెట్లకు అవసరమైన కార్బన్‌డై ఆక్సైడ్‌  గానీ గాలిలోనే ఉంటాయి.  గాలి ఓ మిశ్రమ పదార్థం. వాతావరణంలో 78శాతం నైట్రోజన్‌, 21శాతం ఆక్సిజన్‌ ఉంటాయి. వీటితో పాటు.. కార్బన్‌ డయాక్సైడ్‌, హైడ్రోజన్‌, హీలియం, నియాన్‌, క్రిప్టాన్‌, జినాన్‌ వంటి జడవాయువులు కూడా ఉంటాయి. గాలిలో నీటిఆవిరి కూడా ఉంటుంది. వీటన్నింటిని ఇముడ్చుకున్న గాలికి బరువు ఉంటుంది. స్థలాన్ని కూడా ఆక్రమిస్తుంది. వాతావరణం భూమిపై కొంత పీడనాన్ని కూడా కలుగజేస్తుంది.

వాతావరణమంటే జీవ కారకం. భూమిపై జీవులకు ఆధారం. కానీ వాతావరణానికే ఓ ప్రత్యేకమైన దినోత్సవాన్ని నిర్వహించుకోవాల్సి వస్తుందంటేనే ఏదో ఓమూల కీడు శంకిస్తోంది. అంటే.. వాతావరణానికి ముప్పు పొంచి ఉందనే హెచ్చరిక స్ఫురిస్తోంది.

గాలి కాలుష్యం – కారకాలు :
గాలిలో హానికర పదార్థాలు ఎక్కువగా ఉండటాన్ని గాలి కాలుష్యం అంటారు. గాలి కాలుష్యం అంటే.. వాతావరణ కాలుష్యం అన్నమాటే…  ఇంధనాల వినియోగం, అడవుల నరికివేత, వాహనాల నుంచి వెలువడే వాయువులు, పారిశ్రామికీ కరణ, ఆధునిక వ్యవసాయ విధానాలు, అణు ధార్మికత, ధ్వని కాలుష్యం వంటి అనేక కారణాల వల్ల వాతావరణ కాలుష్యం పెరిగిపోతోంది.

పరిశ్రమల వ్యర్థాలు – పారిశ్రామిక కాలుష్యం :
ఏ పరిశ్రమ ఏర్పాటు చేయాలన్నా… ఆ పరిశ్రమ స్వభావాన్ని బట్టి  కొన్ని నిబంధనలు, తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు రూపొందించబడి ఉంటాయి. ప్రధానంగా కాలుష్యాలు వెదజల్లే పరిశ్రమల విషయంలో ప్రత్యేకంగా కాలుష్య నియంత్రణ మండలి పనిచేస్తుంది. కాలుష్య నియంత్రణ మండలి పరిధిలోకి వచ్చే పరిశ్రమలన్నీ విధిగా మండలి నిబంధనలు పాటించడంతో పాటు.. కాల వ్యవధిని బట్టి ఎప్పటికప్పుడు కాలుష్యంపై నివేదికలను మండలికి అందజేయాల్సి ఉంటుంది. నియంత్రణకు లోబడి కాకుండా కాలుష్యం పెరిగిందనిపిస్తే వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే ఆ పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకునే అధికారం కాలుష్య నియంత్రణ మండలికి ఉంటుంది. కానీ ఇటీవలి కాలంలో పరిశ్రమల కాలుష్యంపైనా.. కాలుష్య నియంత్రణ మండలి పనితీరుపైనా తరచూ విమర్శలు రావడం పరిపాటైంది.

పారిశ్రామిక కాలుష్యం పర్యవసానాలు :
          భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన దేశ ప్రజలెవరికీ తెలియనిది కాదు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ సమీపంలోని యూనియన్‌ కార్బైడ్‌ పరిశ్రమలో సంభవించిన విస్ఫోటం కారణంగా టన్నుల కొద్దీ మిథైల్‌ ఐసోసైనేట్‌ అనే ప్రమాదకర వాయువు లీకైంది. క్షణాల్లో అక్కడి వాతావరణంలో కలిసిన ఈ మృత్యు వాయువు.. వేలాది నిండు ప్రాణాల్ని కబళించింది. కంటిచూపు పోయినవారు, వూపిరితిత్తులకు తూట్లు పడ్డవాళ్లు, జీవచ్ఛవాలుగా మిగిలినవాళ్లెందరో లెక్కే లేదు.  పాతికవేలమంది నేల రాలిపోయారు. అయిదున్నర లక్షల మందికిపైగా అనారోగ్య పీడితులయ్యారు. నేటికీ అక్కడి గాలిలో, నీటిలో, భూగర్భంలో విషపదార్థ నిక్షేపాలు పుట్టబోయేవారినీ శాపగ్రస్తులు చేస్తున్నాయి.
          ఇక.. తెలుగు రాష్ట్రాలకు వస్తే.. హైదరాబాద్‌ పరిసరాల్లో నగరం నలుమూలలా స్థాపించబడిన వేలాది కాలుష్య కారక పరిశ్రమలు వెదజల్లుతున్న విషపు వాయువులు నిత్యం ఆ పరిసర ప్రాంతాల ప్రజలకు సుపరిచితమే. అంతేకాదు.. తెలుగు రాష్ట్రాల్లోని అనేక పారిశ్రామిక వాడల్లో ఇదే పరిస్థితి ఉంది.  కాలుష్య నియంత్రణ మండలి కళ్లకు గంతలు కడుతున్న పరిశ్రమలు.. స్థానికుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. జీడిమెట్ల, బొల్లారం లాంటి పారిశ్రామిక వాడలకు వెళ్లిన కొత్తవారికి కొద్దిసేపు తొలుత ఊపిరాడదంటే.. అక్కడి వాతావరణం ఎంతగా కలుషితమైందో అర్థమైపోతుంది.
          ఏ పరిశ్రమ నెలకొ్ల్పినా. ఆ పరిశ్రమ స్వభావాన్ని బట్టి పలు నిబంధనలు రూపొందించబడి ఉన్నాయి. ప్రధానంగా పరిశ్రమల నుంచి వెలువడే విషవాయువులు, వ్యర్థవాయువులతో కూడిన పొగను బాహ్య వాతావరణంలో కలిపే ముందు పొగకు సరైన ఫిల్డర్లు వాడాలి. నిబంధనల మేరకు  అవి వాడాల్సి ఉన్నా.. వ్యయంతో కూడినవి అయినందున కంపెనీలు ఈ నిబంధనను అంతగా పట్టించుకోవడం లేదు. ఫలితంగా పరిశ్రమలు ఉండే పరిసరాలు, గ్రామాల్లో కలుషిత వాయువులు కరాళనృత్యం చేస్తున్నాయి.

జల కాలుష్యం :
వాతావరణంలో మరో ముఖ్యమైనది జలం. భూమిపై జీవనానికి గాలి తర్వాత నీరు కూడా అంతే ప్రధానమైనది. పెరుగుతున్న జనాభా కారణంగా జలం కూడా కాలుష్యానికి గురవుతోంది. జలకాలుష్యం కారణంగా జనాన్ని అనేక వ్యాధులు పట్టి పీడిస్తున్నాయి. తాగడానికి నీళ్లు కూడా దొరకని పరిస్థితిలో కొన్ని ప్రాంతాల్లో కలుషిత జలమే దిక్కవుతోంది. మరోవైపు.. పరిశ్రమలనుంచి వెలువడే వ్యర్థ జలాలు పరిసరాలను కలుషితం చేస్తున్నాయి. కొన్ని కంపెనీల నుంచి వెలువడే విష వ్యర్థాలు జలంలో కలిసి బయటికి వదిలివేయబడుతుండటంతో ఆ పరిసరాల్లో కనీసం చెట్లు కూడా మొలకెత్తే పరిస్థితి ఉండదు.

ఓజోన్‌ పొరపై ప్రభావం :
          ఓవైపు పారిశ్రామిక కాలుష్యం, మరోవైపు.. వాహన కాలుష్యం.. ఓజోన్‌ పొరకు ముప్పు వాటిల్లేలా పరిణమించాయి. సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలను భూమిపైకి చేరకుండా మహత్తర పాత్రను పోషిస్తోంది ఓజోన్‌ పొర. అయితే.. కాలుష్యం కారణంగా ఓజోన్‌ పొరకు చిల్లులు పడితే భూగోళంపై ఉండే జీవులు హాహాకారం చేయడం తప్పదు.

అటవీ నిర్మూలన :
వాతావరణానికి చెట్లు మిత్రులు. ఎందుకంటే వాతావరణంలో ఎప్పటికప్పుడు చేరే కలుషిత వాయువును గ్రహించి ప్రాణవాయువులను ఉత్పత్తిచేయగల గొప్ప శక్తి చెట్లకు మాత్రమే ఉంది. కానీ.. ప్రస్తుత కాలంలో సహజసిద్ధంగా ఏర్పడిన అడవుల్లోని చెట్లను నరకడం,  కాల్చివేయడం నిరంతరాయంగా సాగుతోంది. చెట్లు లేదా వాటి నుంచి తీసే బొగ్గును మానవులు ఉపయోగించే ఒక సరుకుగా విక్రయిస్తున్నారు. చెట్లను నరికిన తరువాత ఏర్పడిన ఖాళీ ప్రదేశాన్ని పచ్చిక బయలు, పంట భూములు, మానవ నివాసాలకు ఉపయోగించుకుంటున్నారు. తగిన మోతాదులో మళ్లీ చెట్ల పెంపకం లేకుండా అడవులను నిర్మూలించడంతో సహజావరణం దెబ్బతినడంతోపాటు, జీవవైవిధ్యానికి నష్టం జరుగుతుంది. అటవీ నిర్మూలన జరిగిన ప్రదేశాల్లో భూమి కోతకు గురవడంతోపాటు, తరచుగా ఇటువంటి ప్రదేశాలు బంజరుభూమిగా రూపాంతరం చెందుతాయి.  అటవీ నిర్మూలనకు అనేక కారణాలు ఉన్నాయి, అవి ప్రభుత్వ సంస్థల అవినీతి, అధికారం మరియు సంపద యొక్క అసమాన పంపిణీ, జనాభా పెరుగుదల, అధిక జనాభా, మరియు పట్టణీకరణ ఇందులో ముఖ్యమైనవి. "అటవీ నిర్మూలన జనాభా ఒత్తిడి, నిశ్చేష్టమైన ఆర్థిక, సామాజిక మరియు సాంకేతిక పరిస్థితుల వంటి వివిధ అంశాల కలయిక ద్వారా జరుగుతుందని" 2000లో ఐక్యరాజ్యసమితిఆహార మరియు వ్యవసాయ సంస్థ (FAO) గుర్తించింది.

అటవీ నిర్మూలన - పర్యావరణ సమస్యలు
అటవీ నిర్మూలన కొనసాగుతుండటం వలన వాతావరణం మరియు భూగోళం ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. చెట్లు మరియు ఇతర మొక్కలు వాటి సాధారణ శ్వాసప్రక్రియలో భాగంగా కిరణజన్య సంయోగక్రియ ద్వారా వాతావరణంలోని కార్బన్‌ను  తొలగించి ఆక్సిజన్‌ను తిరిగి వాతావరణంలోకి విడుదల చేస్తాయి. చెట్ల క్షయం జరగడం లేదా వాటిని కాల్చడం వలన అది నిల్వచేసుకున్న కార్బన్‌లో ఎక్కువ భాగం తిరిగి వాతావరణంలో కలుస్తుంది. అడవులు కార్బన్‌ను గ్రహించేలా చేయడానికి, చెట్లను తిరిగి నాటడం చేయాలి. భూమిలో నిక్షిప్తమైన కార్బన్ వాతావరణంలోకి విడుదల కావడానికి కూడా అటవీ నిర్మూలన కారణమవుతుంది. భూమి కోసం అడవుల్లోని చెట్లను భస్మీకరణం చేయడం మరియు కాల్చివేయడం ద్వారా టన్నులకొద్ది కార్బన్‌డయాక్సైడ్‌ వాతావరణంలోకి విడుదలవుతుంది, ఇది భూతాపానికి కారణమవుతుంది.

అటవీ నిర్మూలన వలన జల చక్రం కూడా ప్రభావితమవుతుంది. చెట్లు వాటి యొక్క వేర్లు ద్వారా భూగర్భజలాలను గ్రహించి, వాతావరణంలోకి విడిచిపెడతాయి. అటవీ ప్రాంతం నిర్మూలించబడినప్పుడు, చెట్లు నీటిని గాలిలోకి చేర్చలేవు, దీని వలన పొడి వాతావరణం ఏర్పడుతుంది. అటవీ నిర్మూలన వలన వాతావరణంలో తేమ తగ్గిపోవడంతోపాటు, భూమిలో నీటి శాతం మరియు భూగర్భజలాల పరిమాణం కూడా తగ్గిపోతుంది.అటవీ నిర్మూలన భూమి సంయోగాన్ని కూడా తగ్గిస్తుంది, దీని వలన క్రమక్షయం, వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రమాదాలు జరుగుతాయి.

వాహన కాలుష్య నియంత్రణ :
నాగరిక ప్రపంచంలో పెరుగుతున్న ఆధునికత వాహన వినియోగం విపరీతంగా పెరిగేందుకు కారణమవుతోంది. ఫలితంగా చిన్నపాటి నగరాల్లోనూ ట్రాఫిక్‌ సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఇక నగరాలు, మెట్రో నగరాల పరిస్థితి చెప్పే అవసరమే లేదు. ప్రధాన రహదారిపై ఓ నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన వాహనదారుడు కనీసం  అరగంట, ముప్పావుగంట ముందు ఇంటినుంచి బయలుదేరాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఫలితంగా సమయం పెరగడంతో పాటు.. అదే స్థాయిలో గాలిలో కలిసే కాలుష్యం కూడా పెరుగుతోంది. అంతసేపూ వాహనం ఇంజన్‌ ఆన్‌లోనే ఉండటం వల్ల నిరంతరాయంగా పొగ వాతావరణంలో కలుస్తోంది.  దేశ రాజధాని ఢిల్లీ నగరంలో రోడ్లపై నడిచే కార్లకు సంబంధించి ‘సరి-బేసి’ విధానం అమలు చేయాలనే ఆలోచన వచ్చిందంటే.. పరిస్థితి ఎంత ప్రమాదకర స్థాయికి చేరిందో ఊహించవచ్చు. సరిసంఖ్య ఉన్న వాహనాలు తిరగాల్సిన రోజు.. బేసి సంఖ్య ఉన్న వాహనాలు రోడ్లపైకి వచ్చాయంటే ట్రాఫిక్‌ అధికారులు చలానా వేయడం తప్పదు. అదే.. బేసి సంఖ్య ఉన్న వాహనాలు తిరగాల్సిన రోజు.. సరిసంఖ్య ఉన్న కార్లు బయటికి తీస్తే అదే ట్రీట్‌మెంట్‌ ఉంటుంది. కార్లు ఉన్నవారికి ఇది ఇబ్బందికరమే అయినా.. న్యాయస్థానం కూడా ఈ ప్రయోగాత్మక విధానాన్ని విమర్శించకపోవడం గమనించదగ్గ విషయం.

          కార్లు వాడటం స్టేటస్‌గా భావించే ఈరోజుల్లో రోడ్లన్నీ కార్లతో నిండిపోతున్నాయి. ఫలితంగా వాతావరణ కాలుష్యం నిత్యం పెరుగుతూనే ఉంది. దీనిని నియంత్రించేందుకు ఎవరికి వారు బాధ్యతగా వ్వవహరిస్తే కొంతయినా కాలుష్యాన్ని తగ్గించడం ఖాయంగా చెప్పవచ్చు. ప్రధానంగా ఒకే ఆఫీసులో పనిచేసేవారు గానీ, ఒకే మార్గంలో ప్రయాణించే వారు గానీ.. ఒకే కాలనీకి చెందిన వారుగానీ.. ‘కార్‌ పూలింగ్‌’, ‘బైక్‌ పూలింగ్‌’ ను పాటిస్తే సగం కాలుష్యాన్ని తగ్గించినట్లే.. ఒకే పనితో ‘స్వామి కార్యం స్వకార్యం ‘ నెరవేరుతుందన్నట్లు.. కార్‌ పూలింగ్‌ , బైక్‌ పూలింగ్‌ వల్ల సామాజిక బాధ్యతగా ఇటు కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు.. అటు ఇంధన వ్యయాన్ని కూడా పొదుపు చేసినవాళ్లవుతారు.

కాలుష్య నివారణకు మార్గాలు :
          కాలుష్యం కోరల్లో మనిషి జీవితం అతలాకుతలమవుతోంది. పర్యావరణాన్ని పరిరక్షించడం తద్వారా కాలుష్యాన్ని తగ్గించి వాతావరణానికి మేలు జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదీ… అటవీ నిర్మూలనకు ఫుల్‌స్టాప్‌పడాలి. చెట్లు, అడవుల పెంపకం నిరంతరాయంగా సాగాలి. ప్రతిఒక్కరూ మొక్కలు నాటడాన్ని అలవాటుగా చేసుకోవాలి. చెట్లు లేని ఇళ్లు ఉండకుండా ప్రతి ఇంట్లోనూ చెట్లుఉండేలా కంకణం కట్టుకోవాలి. పెట్రోల్‌, డీజిల్‌ వినియోగించే వాహనాలకు బదులు సీఎన్‌జీతో నడిచే వాహనాలను వాడాలి. ఫ్యాక్టరీల్లో వెలువడే వ్యర్థ, కాలుష్య, ప్రమాదకర వాయువులతో కూడిన పొగకు సరైన ఫిల్టర్‌లు ఉపయోగించాలి. దీనికోసం నిరంతర నిఘా వ్యవస్థ పనిచేయాలి. ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ప్రోత్సహించాలి. ఇది ఉద్యమస్థాయిలో కొనసాగాల్సిన అవసరం ఉంది. సౌరశక్తి, బయోగ్యాస్‌, బయోమాస్‌ ఎనర్జీ వంటి వాడకం పెరగాలి. సౌరశక్తితో విద్యుత్‌ ఉత్పత్తి ఇప్పుడిప్పుడే ఉధృతంగా మొదలవుతోంది. దీనికి ప్రభుత్వాలు ప్రోత్సాహకాలను అందిస్తే.. పరోక్షంగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడినట్లు అవుతుంది.

Publised in Jaagriti Magazine

COVERPAGE ARTICLE IN JAAGRITI MAGAZINE








17, ఫిబ్రవరి 2016, బుధవారం

దక్షిణాది కుంభమేళా... మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర


         దక్షిణాది కుంభమేళాగా వినుతికెక్కిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర  హోరు రెండేళ్లకోసారి తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తుంది. యేడాది విడిచి యేడాది జరిగే మేడారం జాతర ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రధానంగా మూడు రోజుల పాటు సాగే ఈ జాతరలో విపరీతమైన జనం రద్దీ కారణంగా జాతర రోజులకు ముందు నెలరోజులు, తర్వాత నెలరోజులు మేడారం రోడ్లన్నీ జనసంద్రంగా మారుతాయి. ఇక జాతర కొనసాగే మూడు రోజుల్లో అయితే.. ఇసుక వేస్తే రాలని జనంతో మేడారం జన దిగ్భంధమవుతుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్దదిగా చెప్పుకునే ఈ గిరిజన జాతరపై జనంలో ఉన్న విశ్వాసం, ప్రాముఖ్యతను గుర్తించిన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. 1996లో మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది.

వన దేవతలు
----------

         వరంగల్‌ జిల్లాలోని అత్యంత మారుమూల గ్రామం మేడారం. వరంగల్ జిల్లా కేంద్రానికి 110 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలోని దట్టమైన అడవులు, కొండలమధ్య మేడారం నెలవై ఉంది.  సాధారణ రోజుల్లో అటువైపు జనం వెళ్లే పరిస్థితి ఉండదు. కానీ జాతర సమయంలో మాత్రం ఒక్కసారిగా భూమి ఈనిందా అన్నట్లు జనం.. మేడారంలో కనిపిస్తారు. వనంలో వెలిసిన దేవతా మూర్తులు సమ్మక్క-సారలమ్మ. అందుకే వీరిని వనదేవతలుగా పిలుస్తారు. ఇది వనదేవతల జాతర, ప్రకృతితో మమేకమైన జాతర.. మేడారం జాతర. విగ్రహాలు లేకుండా సాగే ఈ జాతరలో కేవలం గద్దెలకు మాత్రమే జనం మొక్కులు అప్పగిస్తారు. ఈ జాతర గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. సుమారు  900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940 వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునేవాళ్లు. 1940 తర్వాత యేడాదికేడాది జనం భారీగా పెరుగుతుండటంతో జాతరను కొండ కింద జరుపుకోవడం ప్రారంభించారు. అమ్మవార్ల చిహ్నంగా గద్దెలను ఏర్పాటు చేశారు. జాతర జరిగే మూడు రోజుల్లో అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరిణెలను చిలుకలగుట్ట నుంచి గిరిజన కోయ పూజారులు కిందికి తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు. తిరిగి కుంకుమ భరిణెలను గద్దెలపై నుంచి తరలించడంతో జాతర ముగుస్తుంది. సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు, కష్టాలను కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్భాంధవులుగా, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. భారతదేశ వ్యాప్తంగా వనదేవతలుగా పూజలందుకుంటున్న సమ్మక్క, సారలమ్మల జాతర.. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందింది. కోటిమందికి పైగా భక్తులు తరలివచ్చే మహాజాతర మేడారం.

మేడారం చరిత్ర
-------------

           వరంగల్‌ జిల్లాకు చెందిన మేడారం జాతరకు కరీంనగర్‌ జిల్లాతో సంబంధం ఉంది. ఈ జాతరకు మూల అమ్మవారైన సమ్మక్క పుట్టిల్లు కరీంనగర్‌ జిల్లా. జగిత్యాల సమీపంలోని పొలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు ఏకైక కూతురు సమ్మక్క. తన మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకు మేడరాజు తనకూతురు సమ్మక్కను ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ రాజు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తాడు. కాకతీయుల దండయాత్రను తట్టుకోలేని మేడరాజు.. మేడారం పారిపోయి తలదాచుకుంటాడు.  అదే సమయంలో కాకతీయుల సామంతుడిగా ఉన్న  మేడారం పాలకుడు కోయరాజు పగిడిద్దరాజు..  కరువు కాటకాల కారణంగా కాకతీయులకు కప్పము కట్టలేకపోతాడు.  ఇటు కప్పం కట్టక పోవడం.. అటు మేడరాజుకు ఆశ్రయం కల్పించడంపై ఆగ్రహోదగ్రుడైన కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు మేడారంపై దండెత్తుతాడు. సంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్దరాజు, సమ్మక్క, సారలమ్మ, నాగమ్మ, గోవిందరాజులు వేర్వేరు ప్రాంతాల నుంచి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభిస్తారు. వీరోచితంగా సాగిన యుద్ధంలో కాకతీయ సేనల ధాటికి తాళలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు చనిపోతారు. తమ వాళ్లందరూ చనిపోయారని, యుద్ధంలో తాము ఓడిపోయామన్న వార్త విన్న జంపన్న అవమానం తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. అప్పటినుంచి సంపెంగవాగు.. జంపన్నవాగుగా ప్రసిద్ధిచెందింది. మరోవైపు.. సమ్మక్క.. యుద్ధభూమిలో కాకలు తీరిన కాకతీయులను ముప్పు తిప్పలు పెడుతుంది. భారీగా తరలివచ్చిన కాకతీయ సైన్యంతో వీరోచితంగా పోరాడిన సమ్మక్క.. తీవ్రంగా గాయపడి రక్తపు ధారతలతోనే యుద్ధభూమి నుంచి తప్పుకొని చిలుకలగుట్ట వైపు వెళ్తూ.. దారి మధ్యలోనే అదృశ్యమవుతుంది. సమ్మక్కను వెదుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు. కానీ.. ఆ ప్రాంతంలో ఓ పుట్ట దగ్గర పసుపు, కుంకుమ ఉన్న భరిణె దొరికింది. దాన్ని సమ్మక్కగా భావించిన అనుచరులు.. భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అప్పటినుంచి ప్రతి రెండేళ్లకోసారి.. మాఘ శుద్ధ పూర్ణిమ రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహిస్తున్నారు.

నాలుగు రోజుల వైభవం - తనివి తీరని జనం
---------------

             ఈయేడాది ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మేడారం జాతర కోలాహలంగా సాగనుంది. జాతర మొదటిరోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకొస్తారు. రెండోరోజున చిలుకల గుట్టలో కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపైకి తెచ్చి ప్రతిష్టిస్తారు. మూడోరోజున అమ్మవార్లు ఇద్దరూ గద్దెలపై పూజలందుకుంటారు. భక్తుల మొక్కులు స్వీకరిస్తారు. నాలుగోరోజు.. సాయంత్రం ఆవాహన పలికి  దేవేరులనిద్దరినీ.. తిరిగి యుద్ధస్థానంలో చేరుస్తారు. అమ్మవార్లు గద్దెపై ప్రతిష్టించే సమయంలో పూజారులు, భక్తులు పూనకంతో ఊగిపోతారు. భక్తి పారవశ్యంలోనృత్యాలు చేస్తారు.  వంశపారం పర్యంగా వస్తున్న గిరిజనులే ఈ జాతరలో పూజారులుగా ఉంటారు. మేడారం జాతర సమయంలో ప్రభుత్వ జిల్లా యంత్రాంగం మొత్తం వారం రోజుల పాటు.. జిల్లా కేంద్రాన్ని వదిలి మేడారం తరలివెళ్లడం ఈ జాతరకు ఉన్న ప్రాధాన్యతను ప్రస్ఫుటిస్తుంది. 

నిలువెత్తు బంగారం - అమ్మవార్లకు ప్రియం
-------------

            మేడారం జాతరకు మాత్రమే ప్రత్యేక మైనది బంగారం. బెల్లంను సమ్మక్క జాతరలో బంగారంగా పిలుస్తారు. భక్తులు తమ నిలువెత్తు బంగారాన్ని అమ్మవారికి సమర్పించడం మేడారం జాతరలో ఆనవాయితీ. కోరికలు తీరిన వాళ్లు.. అమ్మవార్లకు మొక్కుకున్న వాళ్లు.. నిలువెత్తు బంగారం పంచిపెడతారు. అందుకే మేడారం జాతరలో బంగారం (బెల్లం) గుట్టలు గుట్టలుగా అవసరమవుతుంది. జాతర జరిగినన్ని రోజులు తాడ్వాయి అటవీప్రాంతమంతా సమ్మక్క-సారలమ్మల నామస్మరణతో మారుమోగిపోతుంది. లక్షలాది వాహనాలు, కోట్ల సంఖ్యలో జనంతో పరిసర ప్రాంతాలన్నీ కిటకిటలాడుతాయి. శివసత్తుల పూనకాలు, భక్తుల మొక్కులతో మేడారం పులకించిపోతుంది. ఆధ్యాత్మిక శోభ ఉట్టి పడుతుంది. సమ్మక్కకు యాటమొక్కు, సారలమ్మకు సుంకువడ్లు సమర్పించడం గిరిజనుల ఆనవాయితీ. ధాన్యం పండించే గిరిజనులు సారలమ్మకు ముందుగా సుంకువడ్లు సమర్పించాకే ధాన్యాన్ని అమ్ముకోవడం ఆనవాయితీ.

తెలంగాణ వచ్చాక తొలిజాతర
--------------------

              తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఈ మేడారం జాతరను ప్రభుత్వం.. ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈయేడాది మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం.. అమ్మవార్ల గద్దెలకుకోట్ల రూపాయలను ఖర్చుచేస్తోంది.  ఈసారి జాతరకు ఆధునిక సొబగులు అద్దుతున్నారు. భక్తుల సహకారంతో సమ్మక్క-సారలమ్మ గద్దెలపై గ్రానైట్‌తో ఫ్లోరింగ్‌ చేశారు. మేడారం వెళ్లే దారులను నాలుగు లైన్ల రోడ్లుగా తీర్చిదిద్దారు. అంతేకాదు.. ఈరోడ్లలోనూ.. వచ్చే రోడ్లు, వెళ్లే రోడ్లు వేర్వేరుగా ఏర్పాట్లు చేశారు.  దీంతో ట్రాఫిక్‌ సమస్య తలెత్తకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కోటిమందికి పైగా భక్తులు జాతరకు తరలివస్తారన్న అంచనాలతో స్నాన ఘట్టాలు, బారికేడ్లు, క్యూలైన్లు, తాత్కాలిక షెడ్లు నిర్మించడంతో పాటు.. మంచినీటి సరఫరా, నిరంతర విద్యుత్‌ సదుపాయాలు కల్పించారు. ఆసక్తి కలిగిన భక్తులు హెలికాప్టర్‌లో కూడా జాతరకు వెళ్లివచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మేడారం జాతరకు తరలివెళ్లే భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ నెలరోజుల ముందు నుంచే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నాలుగు వేల బస్సులను మేడారానికి మళ్లిస్తున్నారు. అంతేకాదు.. బృందాలుగా వెళ్లే భక్తులకోసం ఆర్టీసీ బస్సులను అద్దెకు కూడా ఇచ్చే ఏర్పాట్లు చేశారు. బస్సు పూర్తిగా నిండే జనం ఉంటే.. ఆ కాలనీ నుంచే బస్సులను నడిపించడమూ కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. లెక్కప్రకారం జాతర ఇంకా ప్రారంభం కాకున్నా.. నెలరోజుల ముందు నుంచే మేడారానికి భక్తజనం తాకిడి భారీగా ఉంటోంది. నిత్యం 50 వేలకు తగ్గకుండా జనం వనదేవతలను దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు.

తెలుగువారికే కాదు.. ఇతర రాష్ట్రాల ప్రజలకూ ఇలవేల్పులు
---------------------------------------

                సమ్మక్క, సారలమ్మలు ఒక్క మేడారం అటవీప్రాంత గిరిజనులకు, తెలుగు ప్రజలకే కాదు.. దేశంలోని చాలా రాష్ట్రాలలోని జనం సమ్మక్క-సారలమ్మలను దైవాలుగా పూజిస్తారు. జాతర జరిగే సమయంలో అందుకే మేడారం జనసంద్రమవుతుంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఒడిషా, చత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ తదితర రాష్ట్రాల నుంచి కూడా జనం అత్యధిక సంఖ్యలో తరలివస్తారు. ఒక్క హిందువులే కాదు.. ఇతర మతాల వారూ మేడారం జాతరకు తరలిరావడం అమ్మవార్ల మహత్మ్యానికి ప్రతీకగా చెప్పవచ్చు.

ఆధునిక సొబగులు
-------------

            ఎంతో ఘనత కలిగిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర కూడా ఆధునికతను సంతరించుకుంటోంది. భక్తుల తాకిడి పెరిగిన కొద్దీ, ఏర్పాట్లు, హంగులు, ఆర్భాటాలు ఎక్కువవుతున్నాయి. ఫలితంగా అడవిలో కొలువైన మేడారం సమ్మక్క, సారలమ్మలు మరికొద్ది రోజుల్లోనే ఆ అటవీ వాతావరణం నుంచి జనారణ్యం, అధునాతన కాలనీ మధ్య కొలువైనట్లు దర్శనమిస్తారనడంలో అతిశయోక్తి లేదు. దశాబ్దం క్రితం మేడారంలో పరిస్థితి, వాతావరణం, తాజా పరిస్థితికి భారీ తేడాను ప్రతిఒక్కరూ గమనించవచ్చు.

- సప్తగిరి గోపగోని
   98850 86126.


మేడారం జాతర మొదలైందహో...


అరణ్యం జనారణ్యంగా మారింది. మేడారం భక్తజన సంద్రమైంది. సమ్మక్క-సారలమ్మ నామస్మరణతో, శివసత్తుల పూనకాలతో జంపన్న వాగు మార్మోగిపోయింది. జాతర తొలిరోజు భక్తి పారవశ్యం పొంగిపొర్లింది.

    తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్ గఢ్, జార్ఖండ్ నుంచి లక్షలాదిగా భక్తులు అమ్మల దర్శనానికి పోటెత్తారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలాచరించి.. అమ్మవారికి బెల్లంతో బంగారం మొక్కు తీర్చుకున్నారు.

    కార్యక్రమంలో అత్యంత కీలక ఘట్టమైన సారలమ్మ గద్దెకు చేరే వేడుక అత్యంత కోలాహలంగా సాగింది. తొలుత కొత్తగూడెం మండలం పూనుకొండ్ల నుంచి పగిడిద్దరాజును, కొండాయి నుంచి గోవిందరాజులును మేడారం గ్రామంలోని గద్దెల వద్దకు తీసుకొచ్చారు. వరంగల్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో కన్నెపల్లిలో సారలమ్మకు ప్రత్యేక పూజలు చేసిన పూజారులు.. ఊరేగింపుగా వనదేవతను మేడారం తీసుకొచ్చారు.  గద్దెమీదికి చేరిన సారలమ్మ.. భక్తుల్ని అనుగ్రహించడంతో మేడారం జాతర ఊపందుకుంది.

    భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీసు యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. గంటకు నాలుగు వేలకు పైగా వాహనాలు వస్తుండడంతో.. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. నార్లాపూర్ నుంచి వాహనాలను అనుమతిస్తూ.. భూపాల్ పల్లి మీదుగా బయటకు పంపుతున్నారు. మరోవైపు.. భక్తులు గుర్తించేలా ప్రభుత్వ అధికారులకు డ్రెస్ కోడ్ విధించారు. తాగునీరుసహా భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించామని, భక్తులు కూడా అధికారులకు సహకరించాలని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ కోరారు. జాతరను మొత్తం 38 సెక్టార్లుగా విభజించి సెక్టోరియల్ అధికారుల్ని నియమించారు.

    జాతరలో భాగంగా గిరిజనులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు భక్తుల్ని విశేషంగా అలరిస్తున్నాయి.

14, ఫిబ్రవరి 2016, ఆదివారం

వ్యవసాయానికి మోదీ సర్కారు ధీమా



వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా చెప్పుకునే భారతదేశాన్ని ప్రస్తుతం కర్షకుల కొరత పట్టి పీడిస్తోందనడంలో అతిశయోక్తి లేదు. వ్యవసాయం చేయాలన్న ఆలోచన రోజు రోజుకూ మన మస్తిష్కా ల్లోంచి కనుమరుగైపోతోంది. కర్ణుడి చావుకు కారణాలానేకం అన్నట్లు.. మనదేశంలో వ్యవసాయానికి ఆదరణ తగ్గడానికి సవాలక్ష కారణాలున్నాయి. కానీ.. ఆహారం లేకుండా మానవ మనుగడ అసాధ్యం. నేపథ్యంలో వ్యవసాయాన్ని అంటిపెట్టుకొని, సేద్యంపైనే ఆధారపడి జీవిస్తున్న అతికొద్ది మందికైనా అందరం అండగా, ఆసరాగా నిలవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలకైతే బాధ్యత మరింత ఎక్కువ అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం రైతు పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరి చేందుకు ప్రయత్నించడం ఆహ్వానించదగ్గ పరిణామం. అందులో భాగంగానే తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినప్రధానమంత్రి పంటల బీమా పథకంఒకటి. దేశంలోని రైతుల్లో భరోసా నింపేదిగా పథకాన్ని రూపొందించారు. పంటల బీమా పథకం రైతు జీవితాల్లో భారీ మార్పు తీసుకువస్తుందని స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్ ద్వారా మన్కీబాత్ ద్వారా ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (ూవీఖీద్)
నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీమా పథకం కర్షకులకు ఊరట నిచ్చేదిగా ఉంది. ఆహారధాన్యాలు, నూనె గింజలతో పాటు.. వాణిజ్యపంటలు, ఉద్యాన పంటలను భీమా పరిధిలోకి తెచ్చారు. అయితే..రైతు భరించాల్సిన ప్రీమియం వేర్వేరుగా ఉంది.  ఆహార ధాన్యాలు, నూనె గింజల  పంటలకు ఖరీఫ్ అయితే.. బీమా కంపెనీలు నిర్ణయించిన ప్రీమియంలో రైతు 2శాతం చెల్లిస్తే సరిపోతుంది. అదే రబీలో అయితే రైతు చెల్లించాల్సిన వాటా 1.5 శాతం మాత్రమే. మిగతా ప్రీమియం మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా చెల్లిస్తాయి. ఇక.. వాణిజ్య పంటలు, ఉద్యాన పంటల బీమాకు రైతు 5శాతం బీమా ప్రీమియాన్ని చెల్లించాలి. ఇది కూడా అతి తక్కువే కదా.. యేడాది జూన్ నుంచి మొదలయ్యే ఖరీఫ్ సీజన్లో వేసే పంట నుంచి బీమా అమలులోకి వస్తుంది. ప్రకృతి వైపరీత్యాల  వల్ల కలిగే పంట నష్టానికి పూర్తి భీమాను రైతుకు చెల్లిస్తారు. స్వతంత్ర భారత చరిత్రలో రైతు అతిక్కువ ప్రీమియం చెల్లించే పంటల బీమాదే అవుతుందని హోం మంత్రి రాజానాథ్ సింగ్ ప్రకటించారు. కౌలు రైతుకు కూడా బీమా పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీచేస్తామని చెప్పారు.  ప్రస్తుతం రెండు పంటల బీమా పథకాల కింద రైతు చెల్లించాల్సిన ప్రీమియం పంటలు, ప్రాంతాలను బట్టి 15శాతం నుంచి 57శాతం వరకు ఉంది. ఇప్పటిదాకా అమలవుతోన్న జాతీయ వ్యవసాయ బీమా పథకం స్థానంలో ూవీఖీద్ అమవుతుంది. కొత్త బీమా పథకం కోసం కేంద్రం తయారుచేసిన అంచనా ప్రకారం 19,440 లక్షల హెక్టార్ల పంట విస్తీర్ణంలో సగం పంట బీమా ప్రీమియం చెల్లించడానికి కేంద్రం సుమారు 9,500 కోట్ల రూపాయలు భరించనుంది
 
 
కొత్త పంటలభీమా పథకం తీరుతెన్ను :
  • పొలంలో ఉన్న పంటకు జరిగిన నష్టంతో పాటు.. విత్తు/నాట్లు వేయలేక పోవడం, పంట కోత తర్వాత జరిగే నష్టాలకూ బీమా వర్తిస్తుంది.
  • వరద ముంపువంటి విపత్తుకు బీమా వర్తిస్తుంది.
  • పంట నష్టం జరిగిందని తెలియగానే బీమా మొత్తంలో 25శాతాన్ని నేరుగా రైతు బ్యాంకు ఖాతాకు జమ చేస్తారు.
  • క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం పంట నష్టాన్ని అంచనా వేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడతారు. స్మార్ట్ ఫోన్ ద్వారా పంటకోత సమాచారాన్ని ఫోటోలు తీసి, అప్లోడ్ చేస్తారు. పంట కోతతో పరిశీలనను తగ్గించేందుకు రిమోట్ సెన్సింగ్ను వినియోగిస్తారు.
  •  బ్యాంకు రుణాలు తీసుకున్నవారికి పంట బీమా తప్పనిసరి చేశారు.
  • ప్రభుత్వ రాయితీపై గరిష్ట పరిమితి లేదు. ప్రీమియం 90శాతం ఉన్నప్పటికీ ప్రభుత్వం భరిస్తుంది.
  • ప్రీమియం ధరపై పరిమితిని విధిస్తున్న నిబంధనల మూలంగా రైతుకు తక్కువ క్లెయిము చెల్లిస్తున్నారన్న ఫిర్యాదుతో నిబంధనను ప్రభుత్వం తొలగించింది.  బీమా చేసిన పూర్తి మొత్తాన్ని ఎలాంటి మినహాయింపు లేకుండా రైతుకు చెల్లిస్తారు.
  •  వచ్చే మూడేళ్లలో మొత్తం పంట విస్తీర్ణంలో బీమా కవరేజీని 50శాతానికి పెంచుతారు. ఇందుకు యేడాదికి 17,600 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈమొత్తాన్ని కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి.
  •   తొలియేడాది 2016-17లో మొత్తం పంట విస్తీర్ణంలో 30 శాతానికి బీమా వర్తింపజేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు 5వేల 700 కోట్లు అవుతుందని అంచనా వేశారు.
  • మొత్తం రాష్ట్రానికి ఒక బీమా కంపెనీ ఉంటుంది. విపత్తుతో జరిగే నష్టానికి, కోత తర్వాత జరిగే నష్టానికి పొలం స్థాయిలో అంచనా వేస్తారు. భారత వ్యవసాయ బీమా సంస్థతో పాటు ప్రైవేటు బీమా కంపెనీలు కూడా పథకాన్ని అమలు చేస్తాయి.
     
     - లోకహితం మాసపత్రికలో ప్రచురితం  (ఫిబ్రవరి, 2016)
     http://www.lokahitham.net/2016/02/blog-post_41.html