9, ఫిబ్రవరి 2018, శుక్రవారం

పాఠశాల వార్షికోత్సవంలో హంసిని సహస్ర డ్యాన్స్‌ ప్రోగ్రాం (2018)


పాఠశాల వార్షికోత్సవంలో హంసిని సహస్ర డ్యాన్స్‌ ప్రోగ్రాం (2018)


పాఠశాల వార్షికోత్సవంలో హంసిని సహస్ర డ్యాన్స్‌ ప్రోగ్రాం (2017)


8, ఫిబ్రవరి 2018, గురువారం

కంటూ.. కడతేరుస్తున్నారు...

     పసిమొగ్గలను తుంచేస్తున్నారు. చిన్ని ప్రాణాలను చిదిమేస్తున్నారు. పగవాళ్లు కాదు.. తమ వాళ్ళే. కన్నవాళ్లే పిల్లల ఉసురు తీస్తున్నారు. పిల్లలను బలిపీఠమెక్కిస్తున్నారు. పేగు బంధంపై ఎందుకీ పగ? చిన్నారులకి ఎందుకీ శిక్ష?  పసివాళ్ల ఆత్మలు సమాజానికి సంధిస్తున్న ప్రశ్నలివి.

    భార్యపై కోపంతో కూతురిని కూడా చంపేశాడో వ్యక్తి. భార్య తనతో గొడవ పడిందని ఇంట్లో నిత్యం సందడి చేసే పసిపిల్లల ఊపిరి ఆపేశాడో తండ్రి. ఇంట్లో సమస్య పరిష్కరించుకోలేక.. ఇద్దరు కూతుళ్లకు విషం తాగించిమరీ చెరువులో దూకి చనిపోయారు దంపతులు. వారం రోజుల వ్యవధిలో హైదరాబాద్‌ పరిసరాల్లోనే జరిగిన మూడు విషాద ఘటనలు ఇవి. ఈ అరాచకం ఇప్పటిది కాదు. తరచూ కన్నవాళ్ల చేతుల్లో బలవుతున్న పసికందుల అరుపులు అరణ్యరోదనలవుతున్నాయి.

    పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య. పసివాళ్లకు ఉరేసి తల్లి బలవన్మరణం. ఇలాంటి సంఘటనలు తరచూ వార్తలవుతున్నాయి. అందరినీ కదిలించి వేస్తున్నాయి. భార్యపై కోపంతో పసివాళ్లను చంపేస్తున్న భర్త. భర్త వేధిస్తున్నాడంటూ పసివాళ్ల ప్రాణాలు తీసిమరీ చనిపోతున్న భార్య. ఇంకేదో సమస్య ఎదురైతే.. పిల్లలను కూడా కడతేర్చి.. బలవన్మరణాలకు పాల్పడుతున్న దంపతులు. వింటేనే గుండెలను పిండేస్తున్న ఇలాంటి సంఘటనలు.. అయినవాళ్లనే కాదు.. అందరినీ విషాదంలో ముంచేస్తున్నాయి.

    సమస్యలుంటే పరిష్కారం చూపే దారికోసం ఆరాతీయాలి. ఇబ్బందులొస్తే.. అధిగమించే అండను వెతుక్కోవాలి. కుటుంబంలో గొడవలైతే.. కావాల్సిన వాళ్ల మధ్యవర్తిత్వంతో మనస్పర్థలు రూపుమాపే అవకాశం కోసం అన్వేషించాలి. అంతేగానీ.. ప్రతి సమస్యకూ చావే పరిష్కారంగా భావిస్తున్నారు ఈ కాలం దంపతులు.  పెద్దలమధ్య గొడవలతో.. సమస్యలను పరిష్కరించుకోలేని పరిస్థితులతో.. బలవన్మరణాలకు పాల్పడటం అటుంచితే.. ఏ పాపం తెలియని చిన్నారులను కూడా బలవంతంగా బలిపీఠమెక్కిస్తున్నారు నేటి తల్లిదండ్రులు. ముద్దులొలికే పసివాళ్ల ప్రాణాలు గాలిలో కలిపేస్తున్నారు. చేతులారా కన్న పేగులను తెంచేస్తున్నారు. గడిచిన రెండేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు పదిహేను దాకా జరిగాయి. పదుల సంఖ్యలో పసికందులు కన్నవాళ్ల కాఠిన్యానికి బలయ్యారు.

    తాము లేకుండా.. తమ పిల్లల భవిష్యత్తు ఆగమవుతుందనో, వాళ్లను పోషించే వాళ్లు లేక.. జీవితాంతం కష్టాల పాలవుతారనో తల్లిదండ్రులు ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నారు. సూసైడ్‌ నోట్‌లలోనో, అయిన వాళ్ల దగ్గర చెప్పుకున్న మాటల్లోనో ఉద్దేశ్యం తెలిసిపోతున్నా.. పసిపిల్లల ప్రాణాలు తీసేందుకు చేతులెలా వస్తున్నాయో తెలియడం లేదు.
(07.02.2018) (పసిమొగ్గలను తుంచేస్తున్న కన్నవాళ్ల కాఠిన్యంపై మనసు ఉండబట్టలేక...)

17, నవంబర్ 2017, శుక్రవారం

నేటి చదువుల లక్ష్యమేమిటి ? మన చిన్నారుల పయనమెటు ?



పోటీ ప్రపంచాన్ని ధైర్యంగా ఎదుర్కోలేక పోతున్నారా..? ఉన్నత చదువులను తట్టుకోలేక పోతున్నారా..? ఒత్తిళ్లను జయించలేకపోతున్నారా..? విద్యార్థుల అదశ్యాలు, ఆత్యహత్యలు ఏం చెబుతున్నాయి..? ఈ పరిస్థితులు ఎలాంటి పరిణామాలకు కారణమవుతున్నాయి..? తప్పు విద్యార్థులదా..? చదువు చెప్పే ఉపాధ్యాయులదా..? లేదంటే.. ఓరకమైన వాతావరణం ఆవరించిన కార్పొరేట్‌ కాలేజీలదా..? కొన్నేళ్లుగా ఈ చర్చ సాగుతున్నా.. గడిచిన నెలరోజులుగా మాత్రం తీవ్రమైంది. ఆందోళనకరస్థాయిలో విద్యార్థుల ఆత్మహత్యలు, అద శ్యాలు కొనసాగు తున్నాయి. అటు.. పేరెంట్స్‌ను మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి. 

ఏం జరుగుతోంది ?
గడిచిన నెలరోజుల్లోనే చదువు ఒత్తిడి భరించలేక ఏడెనిమిది మంది విద్యార్థులు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. అమ్మాయిలే కాదు.. అబ్బాయిలు కూడా చదువు చట్రంలో నుంచి బయటపడేందుకు ఇళ్ల నుంచి పలాయనం చిత్తగిస్తున్నారు. అందరూ కార్పొరేట్‌ కాలేజీల్లో చదువుతున్న వాళ్లే. లక్షలు పోసి చదివిస్తున్న తల్లి దండ్రులు.. పిల్లలు ఇలా ప్రవర్తిస్తుంటే తట్టుకోలేక పోతున్నారు. వాళ్ల భవిష్యత్తు ఏమైపోతోందన్న భయంలో పడిపోతున్నారు. 
అదశ్యమే కాదు.. ఆత్మహత్యలు కూడా...
ఇళ్లలోనుంచి అదశ్యమవడం ఒక్కటే కాదు.. లోకంపోకడ కూడా తెలియని వయసులోనే బలవన్మరణాలకూ పాల్పడుతున్నారు విద్యార్థులు. కొందరు ఇళ్లల్లోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొందరైతే కాలేజీల్లో, కాలేజీ హాస్టళ్లలోనే బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. కన్న వాళ్లకు కడుపుకోత మిగిలిస్తున్నారు. అప్పటికప్పుడు అలజడి చెలరేగడం, పేరెంట్స్‌, బంధువులు నిలదీయడం, దేనికైనా రెడీ అనుకునే కాలేజీలు సెటిల్‌మెంట్స్‌ చేసుకోవడం గుట్టుగా జరిగిపోతు న్నాయి. పేరున్న, పెద్ద కార్పొరేట్‌ విద్యాసంస్థల్లోనే ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగు తుండటంతో.. ఈవార్తలు మీడియాలోకూడా రావడం లేదు. ఎందుకంటే లక్షల రూపాయల వ్యాపార ప్రకటనలు ఈ వాస్తవాలను కమ్మేస్తున్నా యన్నది ఎవరూ కాదనలేని వాస్తవం.

ఏది చదువు..? 
చదువంటే సమాజాన్ని అర్థం చేసుకోవాలి. చదువంటే భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలి. చదువంటే.. ఆ మనిషి వ్యక్తిత్వానికి పరిపూర్ణతను తీసుకురావాలి. మొత్తానికి వాళ్ల జీవితానికి ఓ అర్థంగా మారాల్సింది చదువు. కానీ.. ఇప్పుడు ఈ పరిస్థితులు లేవు. వీటికి అర్థమేంటో కూడా ఇప్పటి విద్యార్థులకు తెలియదంటే అతిశయోక్తి కాదు. 
ఇప్పుడెలా ఉన్నాయి..? 
ఇప్పుడు.. చదువంటే పాఠ్యపుస్తకాలు, చదువంటే పరీక్షల్లో వస్తాయనుకున్న ప్రశ్నలకు జవాబులను మాత్రమే బట్టీ పట్టడం, చదువంటే రోజులో 18 గంటలు కేవలం పుస్తకాలతో కుస్తీ పట్టడం, చదువంటే పరీక్షలయ్యేదాకా ఓ భవనంలో బందీగా మారడం, చదువంటే బయటి ప్రపంచాన్నే కాదు.. కనీసం సూర్యుడి వెలుగు కూడా చూడకపోవడం, చదువంటే విద్యార్థి చదివే విద్యాసంస్థ కబంధ హస్తాల్లో నలిగిపోవడం, మొత్తానికి చదువంటే పరమార్థం ర్యాంకులు... ఇదీ ఇప్పుడున్న విద్యావిధానం. 
బాధ్యులెవరు..?
పోటీ ప్రపంచమే లోకంగా వ్యాపార సామ్రాజ్యంలో మనుగడ సాగిస్తున్న కార్పొరేట్‌ సంస్థలు ర్యాంకులు మినహా ఏమీ పట్టించుకోవడం లేదు. విద్యార్థులను కనీసం కంటినిండా నిద్ర కూడా పోనివ్వడం లేదు. హాస్టళ్లలో నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం కూడా ఇవ్వడం లేదు. నిద్ర లేచింది మొదలు తిరిగి రాత్రి పడుకునే దాకా.. చదువు.. చదువు.. చదువు.. తప్ప ఇంకే అంశానికీ చోటివ్వడం లేదు. మార్కులు, ర్యాంకులు అంటూ చిన్నారులపై తమ లక్ష్యాలను రుద్దుతున్నారు. విద్యార్థుల పరిస్థితి, పరిజ్ఞానం గుర్తించకుండా ర్యాంకులకోసం వేధింపులవల్లే.. ఇలాంటి సంఘట నలు జరుగుతున్నాయన్నది కాదనలేని నిజం. 
తిలాపాపం.. తలా పిడికెడు..!
ఇదే సమయంలో తల్లిదండ్రుల బాధ్యత కూడా చర్చనీయాంశంగా మారుతోంది. కేవలం సంస్థల పేరు ప్రఖ్యాతులు చూడటం, ఎంత ఎక్కువ ఫీజు వసూలు చేస్తే.. అక్కడ అంత బాగా చదువు చెబుతారన్న ఓ తప్పుడు ఆలోచనల్లో మునిగిపోవడం చిన్నారులకు గండంగా మారుతోంది. మొత్తానికి ఇలాంటి సంఘటనలు తీవ్ర కలకలం                సష్టిస్తున్నాయి. కళాశాలల్లో వ్యవహారశైలి, ఇళ్లల్లో పేరెంట్స్‌ బాధ్యతపై చర్చను లేవనెత్తుతున్నాయి. 
- హంసిని సహస్ర సాత్విక
లోకహితం నవంబర్‌ నెల సంచికలో ప్రచురితం 
http://www.lokahitham.net/2017/11/blog-post_35.html

21, అక్టోబర్ 2017, శనివారం

సిపాయిల తిరుగుబాటులో వీరనారీలు లక్ష్మీబాయి, ఝల్కారీబాయి (స్ఫూర్తి మాసపత్రిక నవంబర్‌ 2017)

సిపాయిల తిరుగుబాటులో వీరనారీలు
లక్ష్మీబాయి, ఝల్కారీబాయి
--------------------------------------------

                            - సప్తగిరి M.Phil (Journalistm)
                            సీనియర్‌ జర్నలిస్టు
                            శిశుమందిర్‌ పూర్వ విద్యార్థి

    భారతమాత స్వేచ్ఛావాయువుల కోసం పరితపించిన చరితార్థుల గురించి స్ఫూర్తిలో చెప్పుకుంటున్నాం. ఆ దారిలో ఇది మూడో అడుగు. నవంబర్‌ నెల రాగానే.. చాచా నెహ్రూ గుర్తొస్తారు. బాలల దినోత్సవం ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటాం. దేశానికి దాస్యశృంఖలాలు తొలగిపోయిన తర్వాత తొలి ప్రధానిగా పనిచేసిన జవహర్‌లాల్‌నెహ్రూ గురించి ప్రతియేటా చెప్పుకుంటున్నాం. అయితే.. అందుకు భిన్నంగా ఈసారి ఇద్దరు మహిళా మణిమకుటాల గురించి తెలుసుకుందాం. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, ఆమె సైన్యంలోని 'దుర్గావాహిని' మహిళా సాయుధ దళానికి నేతృత్వం వహించిన ఝల్కారీ బాయి గురించి తెలుసుకుందాం. ఎందుకంటే.. ఈ ఇద్దరు పుణ్య మాతలు జన్మించింది నవంబర్‌ నెలలోనే...

ఝాన్సీ రాణి లక్ష్మీబాయి :
-------------------------
    మరాఠా యోధుల పరిపాలన కింద ఉన్న ఉత్తర భారతదేశంలోని ఝాన్సీ అనే రాజ్యానికి రాణి లక్ష్మీబాయి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామం తొట్టతొలిగా వినిపించే పేరు లక్ష్మీబాయి.

    ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఆమె 1828వ సంవత్సరములో మహారాష్ట్ర కు చెందిన ఒక కర్హాడీ బ్రాహ్మణుల వంశంలో వారణాసిలో జన్మించింది. పరాస్నిస్ అనే చరిత్రకారుడు రాణీ నవంబర్ 19, 1835వ సంవత్సరంలో జన్మించినట్లు ఆమె జీవిత చరిత్రలో పేర్కొన్నాడు. ఈమె తల్లిదండ్రులు మోరోపంత్ తాంబే, భాగీరథీబాయి. వీళ్ళది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం.  మణికర్ణిక నాలుగేళ్ళ ప్రాయంలో ఉండగానే తల్లి కన్ను మూసింది. తండ్రి సంరక్షణలో కత్తిసాము, గుర్రపుస్వారీ, తుపాకీ పేల్చడం వంటి విద్యల్లో ఆరితేరింది.

    లక్ష్మీబాయికి 13 ఏళ్ళ వయసులోనే 1842లో ఝాన్సీ పట్టణానికి రాజైన గంగాధరరావు నెవల్కార్‌తో వివాహం జరిగింది. దీంతో ఆమె ఝాన్సీ పట్టణానికి మహారాణి అయింది. 1857లో లక్ష్మీబాయి స్వచ్చంద సైన్యాన్ని సమీకరించడం ద్వారా ఆత్మరక్షణ బలోపేతం చేసింది. మహిళలను కూడా సైన్యంలో చేర్చుకుని వారికి ఆయుధ శిక్షణను ఇచ్చింది. బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా పోరాటం మొదలెట్టింది.  ఆమె దగ్గర సైన్యాధ్యక్షులుగా ఉన్న వారంతా ఆమె యుద్ధం చేస్తున్న కారణానికి మద్దతుగా స్వచ్చందంగా ముందుకు వచ్చిన వారే. జనవరి 1858లో బ్రిటిష్ సైన్యం ఝాన్సీని ముట్టడించడం ప్రారంభించింది. రెండు వారాల పోరాటం తర్వాత ఆంగ్లేయులు నగరాన్ని చేజిక్కించుకోగలిగారు. రాణి లక్ష్మీబాయి 1858, జూన్ 17వ తేదీన గ్వాలియర్ యుద్ధంలో మరణించింది. ఈమె మరణానికి కారణమైన పరిస్థితుల గురించి చాలా వాదనలున్నాయి. ఇప్పటి బ్రిటీష్ రిపోర్టులను బట్టి ఆమె బుల్లెట్ గాయాలు తగిలి మరణించిందని తెలుస్తోంది. టి.ఎ మార్టిన్ రాసిన లేఖ ఆధారంగా ఈ విషయం తెలుస్తోంది.

ఝల్కారీబాయి :
------------------
    ఇక..  ఇప్పటిదాకా మనం వినని ఝల్కారీబాయి గురించి తెలుసుకుందాం... ఝల్కారీబాయి భారతీయ మహిళా సైనికురాలు. 1857 సిపాయి తిరుగుబాటు సందర్భంగా జరిగిన ఝాన్సీ యుద్ధంలో ప్రముఖపాత్ర పోషించింది. ఈమె ఝాన్సీ లక్ష్మీబాయికి అత్యంత ప్రీతిపాత్రమైన 'దుర్గావాహిని' మహిళాసాయుధ దళ నాయకురాలు.

    భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో సిపాయి తిరుగుబాటుగా, 'ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం'గా ప్రసిద్ధిగాంచిన 1857-58 నాటి వీరోచిత పోరాట ఘట్టంలో ఝాన్సీరాణి లక్ష్మీబాయికి ప్రతిరూపంగా కీలక భూమికను పోషించిన ఘనత దళిత బహుజన భూమిపుత్రిక ఝల్కారిబాయికే దక్కుతుంది. బుందేల్‌ఖండ్ ప్రాం తంలో ప్రజలు పాడుకునే జానపద బాణీల్లో ఝాన్సీలక్ష్మీబాయి సరసన ఝల్కారిబాయి సాహసాలను పాటల రూపంలో ఇప్పటికీ గుర్తుచేసుకోవడం విశేషం.

    ఝాన్సీ సమీపంలోని భోజ్‌లా గ్రామంలో కోరీ కులానికి చెందిన నిరుపేద వ్యవసాయ కూలీలైన సదోవర్ సింగ్, జమునాదేవి దంపతులకు 1830 నవంబర్ 22న జన్మించింది ఝల్కారిబాయి. వీరనారిగా ఎదిగి, నేడు ఆ ప్రాంతంలో దళిత బహుజనుల ఆత్మగౌరవ పతాకగా మారింది. చిన్న వయసులోనే తల్లి మరణించడంతో తండ్రి పెంపకంలో గుర్రపుస్వారీ, కత్తిసాము వంటి యుద్ధ విద్యలు నేర్చుకుంది. అడవిలో పశువులను మేపుతున్న ఝల్కారిపై దాడి చేసిన చిరుత పులిని కేవలం చేతికర్రతో చాకచక్యంగా హతమార్చిన ఘటన సంచలనం రేపింది. ఝాన్సీలక్ష్మీబాయి సైన్యంలో ఆయుధ విభాగంలో పనిచేస్తున్న పూరణ్‌సింగ్‌ను వివాహం చేసుకుంది ఝల్కారిబాయి.

    1858 ఏప్రిల్ 3న బ్రిటిష్ జనరల్ హగ్‌రోజ్ నాయకత్వంలో బ్రిటిష్ సేనలు ఝాన్నీ రాజ్యాన్ని చుట్టుముట్టాయి. ఆ దాడి నుంచి లక్ష్మీబాయి సురక్షితంగా తప్పించుకుని కల్పి ప్రాంతంలో పోరాడుతున్న తిరుగుబాటు నాయకులను కలుసుకోవడానికి అనువుగా, ఝల్కారీబాయి తానే ఝాన్సీలక్ష్మీబాయినంటూ కోట ముందు ప్రత్యక్షమై బ్రిటిష్ సేనలను ముప్పుతిప్పలు పెట్టింది. ఆ దాడిలో ఝాన్సీలక్ష్మీబాయి రూపంలో బందీగా పట్టుబడ్డ ఝల్కారిబాయిని గుర్తుపట్టిన బ్రిటిష్ సేనలు, తదనంతర కాలంలో ఆమెను విడిచిపెట్టారా లేదా చంపేశారా అన్నది చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. భారత ప్రభుత్వం, ఆమె జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేసింది.

                            - సప్తగిరి M.Phil (Journalistm)
                            సీనియర్‌ జర్నలిస్టు
                            శిశుమందిర్‌ పూర్వ విద్యార్థి
 

దేశమాత విముక్తి కోసం.. మత విశ్వాసాలనే త్యజించిన భగత్‌సింగ్‌ (స్ఫూర్తి మాసపత్రిక అక్టోబర్‌ 2017)


దేశమాత విముక్తి కోసం..  మత విశ్వాసాలనే త్యజించిన భగత్‌సింగ్‌

- సప్తగిరి, ఎం.ఫిల్‌ (జర్నలిజం)

    మానవులు పుడతారు.. చనిపోతారు. కొంతమంది మాత్రమే తమ కుటుంబం కంటే సమాజం కోసం ఎక్కువగా శ్రమిస్తారు. కొందరు తమ జీవితాన్ని కూడా ఫణంగా పెట్టి చిరస్థాయిగా నిలిచిపోతారు. వాళ్లను 'మహానుభావులు' అంటాం. వందల కోట్ల మందిలో పదుల సంఖ్యలో మాత్రమే ఇలాంటివాళ్లు ఉంటారు.

    1947లో స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత.. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించింది మన భారతదేశం. భారతావనికి స్వేచ్ఛా వాయువులు అందించేందుకు వందల సంవత్సరాలు పోరాటం జరిగింది. లక్షల మంది మహనీయులు ఈ పవిత్ర కార్యంలో సమిధలయ్యారు. ప్రధానంగా బ్రిటిష్‌ పాలన సమయంలో భారతీయులు స్వాతంత్ర్యం కోసం ఎక్కడికక్కడ చేసిన పోరాటాలు మహోన్నతమైనవి. వాటిని కొనియాడకుండా ఉండలేం. వారిలో కొందరైతే చిన్న వయసులోనే స్వాతంత్ర్యోద్యమంలోకి దూకారు.

    ఈ నెల స్వాతంత్ర్య సమరయోధుడు షహీద్‌ భగత్‌సింగ్‌ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. భారత స్వాతంత్ర్యోద్యమంలో పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులలో భగత్‌సింగ్‌ ఒకరు. ఈ కారణంగానే ఆయనను షహీద్ భగత్‌సింగ్ అని గర్వంగా పిలుచుకుంటున్నాం. భగత్ సింగ్ ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉన్న లాయల్ జిల్లా బంగా గ్రామంలో కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు  1907 సెప్టెంబరు 28వ తేదీన జన్మించాడు. భారత్‌లో బ్రిటీషు పాలనను వ్యతిరేకిస్తూ విప్లవాత్మక ఉద్యమాలను చేపట్టిన కుటుంబంలో ఆయన జన్మించారు.

    భారత మరియు బ్రిటన్ రాజకీయ ఖైదీలకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ జైలులో 64 రోజుల పాటు నిరాహారదీక్షను చేపట్టడం ద్వారా భగత్‌సింగ్‌ అన్నివర్గాల నుంచి విస్తృతంగా మద్దతును కూడగట్టుకున్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజ్‌పత్ రాయ్ హత్య నేపథ్యంలో ఒక పోలీసు అధికారిని కాల్చినందుకు భగత్‌సింగ్‌ను బ్రిటిష్‌ పాలకులు ఉరితీశారు. ఈ పరిణామాలు భారత స్వాతంత్ర్య సిద్ధికి పోరాడేలా భారత యువతను ప్రేరేపించాయి.

    విద్యార్థి దశలో స్కూల్లో చదువుతో పాటు.. ఆటపాటల్లోనూ చురుగ్గా ఉండేవాడు భగత్‌సింగ్‌. అందరితో కలివిడిగా ఉండేవాడు. బాబాయి సర్దార్ అజిత్ సింగ్ ఆంగ్లేయులతో పోరాడుతూ విదేశాల్లో ఉంటున్న సమయంలో, కంట నీరు పెట్టుకొనే చిన్నమ్మ హర్నామ్ కౌర్ ను చూసి నాలుగేళ్ళ భగత్ సింగ్ " పిన్నీ ఏడవొద్దు. నేను ఆంగ్లేయులపై ప్రతీకారం తీర్చుకుంటా" అని ప్రతిజ్ఞలు చేసేవాడు. పాలుగారని ఆ పసి వయసులోనే భగత్‌సింగ్‌ అవగాహన, వ్యక్తిత్వం అందరినీ ముగ్ధులను చేసేవి.

     13 ఏళ్ల ప్రాయంలోనే మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమానికి భగత్‌సింగ్ ప్రభావితుడయ్యాడు. ఆ సమయంలో బ్రిటీష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగిన భగత్.. ప్రభుత్వ పాఠశాల పుస్తకాలు మరియు బ్రిటీషు దిగుమతి దుస్తులను తగులబెట్టడం ద్వారా గాంధీ సిద్ధాంతాలను అనుసరించాడు. ఉత్తరప్రదేశ్‌ లోని చౌరీ చౌరా గ్రామస్తులు పోలీసులను హింసాత్మకంగా హతమార్చిన నేపథ్యంలో ఉద్యమాన్ని గాంధీ ఉపసంహరించుకున్నాడు. ఆయన అహింసావాదంపై అసంతృప్తి చెందిన భగత్‌సింగ్ యువ విప్లవోద్యమంలో చేరి, తెల్లదొరలకు వ్యతిరేకంగా హింసాత్మక ఉద్యమాన్ని ఉధృతం చేశాడు.

    భగత్‌సింగ్‌కు మొదటినుంచీ అధ్యయనమంటే చాలా ఇష్టం. రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం, సామాజిక శాస్త్ర విషయాలను ప్రబోధించే అనేక గ్రంథాలను ఆయన అధ్యయనం చేశాడు. అంతేకాదు.. తనకు ఉరిశిక్ష ఖాయమన్న సంగతి తెలిసిన తర్వాత.. అంతకు ముందు జైల్లోనూ భగత్ సింగ్ ఒక అధ్యయనశీలిగా కాలాన్ని గడిపాడు. పుస్తకం చదువుతూ మధ్యలో హఠాత్తుగా లేచి అటూ ఇటూ తిరుగుతూ.. స్వాతంత్ర్యోద్యమ గీతాలు పాడేవాడు.

    భారత స్వాతంత్ర్యోద్యమంలో దేశమాత విముక్తి కోసం పోరాడిన భగత్‌సింగ్‌.. ఓ బ్రిటిష్‌ పోలీసు అధికారిని కాల్చి చంపాడు. ఆ తర్వాత లాహోర్‌ పారిపోయి.. తనను ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు స్వాతంత్ర్య సమరంలో భాగంగా తన మత విశ్వాసాలను కూడా త్యజించిన త్యాగజీవి భగత్‌సింగ్‌. గడ్డాన్ని గీసుకోవడం, వెంట్రుకలు కత్తిరించుకోవడం ద్వారా సిక్కు మత విశ్వాసాల ఉల్లంఘనకు పాల్పడి.. నిజమైన దేశభక్తుడిగా పేరు తెచ్చుకున్నాడు.

    23 మార్చి 1931న భగత్ సింగ్‌తో పాటు ఆయన సహచరులు రాజ్‌గురు మరియు సుఖ్‌దేవ్‌లను లాహోర్‌లో ఉరితీశారు. సింగ్ ఉరిని వ్యతిరేకిస్తూ నిరసన చేపడుతున్న ఆయన మద్దతుదారులు ఆయన్ను ఆ క్షణమే షహీద్ అంటే.. అమరవీరుడుగా ప్రకటించారు. సాధారణంగా ఉరిశిక్షను ఉదయం 8 గంటలకు అమలు చేసేవారు. అయితే.. ఏం జరిగిందో ప్రజలు తెలుసుకునే లోగానే ఆయన్ను ఉరితీయాలని అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం నిర్ణయించింది. జనం నుంచి తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఉందన్న సమాచారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సుమారు రాత్రి 7 గంటల ప్రాంతంలో జైలు లోపల నుంచి ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు వినిపించాయి. సింగ్‌ జీవితానికి చివరగా తెర దించబోతున్నారన్న విషయానికి అది సంకేతమయింది. సట్లెజ్ నది ఒడ్డున ఉన్న హుస్సేనివాలా వద్ద భగత్‌సింగ్‌‌ను దహనం చేశారు. భగత్ సింగ్ స్మారకచిహ్నం నేడు భారత స్వాతంత్ర్య సమరయోధులను గుర్తుకు తెస్తుంది.

- సప్తగిరి,
ఎం.ఫిల్‌ (జర్నలిజం)
శిశుమందిర్‌ పూర్వ విద్యార్థి