11, మే 2016, బుధవారం

పరిణామ క్రమంలో సంప్రదాయ మీడియా

                                  నాలుగో స్తంభానికి స్వేచ్ఛ


                                             -    మే ౩ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం




పత్రికారంగం రూపులు మార్చుకుంటోంది. కొత్తపుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు పత్రికలే ప్రధాన సమాచార వారధులు. తొలినాళ్లలో ఒక పత్రిక ముద్రితమైన తేదీ నుంచి వారం రోజుల తర్వాత కూడా పాఠకునికి చేరే పరిస్థితి ఉండేది. అప్పటి పరిస్థితులు, మౌలిక వసతులు అలా ఉండేవి. కానీ.. రాను రాను ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న సాంకేతికతను అత్యంత వేగంగా అందిపుచ్చుకోవడంలో పత్రికారంగం పాత్ర అమోఘమని చెప్పవచ్చు. ఒకప్పుడు మెయిన్ పేపర్ కే పరిమితమైన పత్రికలు క్రమంగా జిల్లా అనుబంధాలు, మండల, డివిజన్ స్థాయి అనుబంధాలను ప్రచురిస్తున్నాయి. అంతేకాదు.. జిల్లా స్థాయిలో ఎడిషన్లు నిర్వహిస్తున్నాయి. దీంతో సమాచారం మరింత విస్తృతంగా ప్రజల్లోకి చేరవేయడంలో పత్రికలు ముందడుగు వేశాయి. ఆ తర్వాత వచ్చిన రేడియో.. ఆకాశవాణి పేరిట సమాచారాన్ని మారుమూల ప్రాంతాలకూ చేరవేయడంలో ప్రముఖ పాత్ర పోషించింది. ఇక సమాచార రంగంలో టెలివిజన్ విప్లవాత్మక మార్పులను తెచ్చింది. తొలుత దూరదర్శన్, ఎంటర్ టైన్ మెంట్ చానెళ్ల స్థాయిని దాటి.. ప్రత్యేకంగా వార్తా చానెళ్లే ఉనికిలోకి వచ్చాయి. 24 గంటల పాటు వార్తలనే ప్రసారం చేసే టీవీ చానెళ్లు రావడంతో సమాచారం గణనీయమైన వేగాన్ని అందుకుంది. ఆ తర్వాత వచ్చిన ఇంటర్నెట్, వెబ్ చానెళ్లు సమాచారం రూపాన్నే మార్చేశాయి. ఇక.. ఇప్పుడు స్మార్ట్ సెల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక.. సోషల్ మీడియా సైట్లు అయితే.. ప్రతి ఒక్కరినీ జర్నలిస్టుగా మార్చేశాయి. ఇప్పుడు సోషల్ మీడియాను వినియోగిస్తున్న ప్రతి ఒక్కరూ అప్రకటిత జర్నలిస్తుగానే భావించాల్సి ఉంటోంది.

పత్రికా స్వేచ్ఛ :

పత్రికలను లేదా ప్రసార మాధ్యమాలను ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా (ఫోర్త్‌ ఎస్టేట్‌) పేర్కొంటారు. ప్రభుత్వానికి ఉండే మూడు అంగాలైన శాసన వ్యవస్థ, అధికార వ్యవస్థ, న్యాయ వ్యవస్థ (లెజిస్లేచర్‌, ఎగ్జిక్యూటివ్‌, జుడిషియరీ) తో పాటు ప్రజాస్వామ్యవ్యవస్థ ఆరోగ్యానికి అత్యావశ్యకమైనది పత్రికాస్వేచ్ఛ. అందుకే దాన్ని నాల్గవ అంగంగా, నాలుగవ స్తంభంగా పేర్కొన్నారు. 1729-1797 సంవత్సరాల నడుమ జీవించిన ఆంగ్లోఐరిష్‌పొలిటికల్‌థియరిస్ట్‌ఎడ్మండ్‌బ్రూక్‌మొదటిసారిగా పత్రికలను ఉద్దేశించి పౌరుష పదజాలంతో శక్తి అన్న పదాన్ని ప్రయోగించాడు. ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించడంలోనూ, మలచడంలోనూ మీడియా నిర్వహించే పాత్ర కీలకమైంది. మీడియా శక్తిమంతమైందనడానికి దాని మీద జరిగే దాడులే నిదర్శనం. అనేకదేశాలలో మీడియా మీద ఇంకా ఆంక్షలున్నాయి. ప్రభుత్వాలు పెట్టే ఆంక్షలు ఒకెత్తయితే మాఫియా ముఠాలు పెంచే ఒత్తిడి ఇంకొకెత్తు. విధినిర్వహణలో బలైన జర్నలిస్టులెందరో ఉన్నారు. వారంతా పత్రికాస్వేచ్ఛకు పట్టిన దివిటీలు. యూనివర్సల్‌ డిక్లరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌లోని 19వ అధికరణం భావప్రకటన స్వేచ్ఛని గురించి చెబుతుంది. పత్రికాస్వేచ్ఛకు అదే ఆధారభూమిక.

ప్రపంచ పత్రికాస్వేచ్ఛ దినోత్సవం :

1991లో ఆఫ్రికన్‌జర్నలిస్టులు ఏప్రిల్‌నుండి మే 3 వరకూ నమీబియాలోని విండ్‌హాక్‌లో ఒక సమావేశం నిర్వహించారు. అనంతరం పత్రికాస్వేచ్ఛపై కీలకమైన ప్రకటన చేశారు. దీనినే విండ్‌ హక్‌ డిక్లరేషన్‌ అంటారు. ఆఫ్రికాలోని అనేక దేశాలలో సెన్సార్‌షిప్‌వుండేది. పత్రికాస్వేచ్చ మీద ఆంక్షలుండేవి. వాటికి నిరసనగా ఆఫ్రికన్‌జర్నలిస్టులు ప్రకటన చేసిన మే 3 నాడే ప్రపంచ పత్రికాస్వేచ్ఛ దినోత్సవం జరపాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. ఆ నిర్ణయం మేరకు 1993 నుండి ఏటా మే 3న వరల్డ్‌ప్రెస్‌ఫ్రీడమ్‌డేను జరుపుకుంటున్నాము. పత్రికా స్వేఛ్చ పట్ల ప్రజలలో అవగాహన కల్పించడానికి ఇది దోహదపడుతుంది.

ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం ఉద్దేశ్యాలు :

-    పత్రికా స్వేఛ్చ, విలువల పట్ల అవగాహనా కల్పించడం
-     ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేఛ్చ యొక్క స్థితిగతులను పర్యవేక్షించడం
-     స్వేచ్ఛ కలిగిన మీడియాను దాడుల నుంచి రక్షించడం
-     విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పాత్రికేయులకు నివాళి ఘటించడం

వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడం అవార్డ్‌ :

1997 నుండి యునెస్కో ఏటా మే 3వ తేదీ నాడు గుల్లెర్మోకేనో వరల్డ్‌ప్రెస్‌ఫ్రీడమ్‌అవార్డును ప్రదానం చేస్తూ వస్తోంది. ప్రమాదం అంచుల్లో సైతం నిర్భయంగా వ్యవహరించి పత్రికాస్వేచ్ఛకు ప్రతీకగా నిలచిన జర్నలిస్టులకు, ఈ అవార్డు ప్రదానం చేస్తారు. అవార్డు కింద 25,000 అమెరికన్‌డాలర్ల నగదు బహుమతి ఉంటుంది. గుల్లెర్మోకేనో ఒక కొలంబియన్‌న్యూస్‌పేపర్‌కు ఎడిటర్‌గా ఉండేవారు. కేనో తన రాతలతో డ్రగ్‌మాఫియా కన్నెర్రకు గురయ్యారు. 1986 డిసెంబర్‌న ఆయన దారుణంగా తన న్యూస్‌పేపర్‌ఆఫీసు ఎదుటే హత్య చేయబడ్డాడు. ఆయన బలిదానం పత్రికాస్వేచ్ఛకు స్ఫూర్తి. ఆయన పేరిటనే ప్రెస్‌ ఫ్రీడమ్‌ డే నాడు అవార్డు అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఒక గుల్లెర్మోకేనో మాత్రమే కాదు.. జర్నలిస్టు విధినిర్వహణలో చంపబడ్డాడంటే, అది వ్యక్తిగతమైన దాడి కానే కాదు, అది భావప్రకటన స్వేచ్ఛ మీద జరిగిన దాడే! పత్రికా స్వేచ్ఛను పత్రికలు కాదు, ప్రజలే కాపాడుకోవాలి.


డిజిటల్‌కమ్యూనికేషన్‌ – సాంకేతిక విప్లవం :

డిజిటల్‌ కమ్యూనికేషన్‌ ఆగమనంతో రిపోర్టింగ్‌ విధానం మారింది. జవాబుదారీతనంతో కూడిన లక్ష్యాలు, సమతుల రిపోర్టింగ్‌ తక్షణావసరంగా గుర్తించాల్సిన అవసరం ఉంది. హింసాత్మక ఘటనల్లాంటివి కవర్‌ చేసేందుకు జర్నలిస్టులు వారి ప్రాణాలనే పణంగా పెడుతు సాహసోపేతంగా పనిచేస్తున్నారు. మానవతా విలువలు అణచివేసే పరిస్థితులు ఎదురైనపుడు వాటికి వ్యతిరేకంగా ప్రపంచం దృష్టిని ఆకర్షించే సత్తా మీడియాకు ఉంది. సంప్రదాయ మీడియాకు తోడు.. సోషల్ మీడియా.. చరిత్రలో ఓ సంచలనం. ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసిన మాధ్యమం. సమాచార మార్పిడిలో విప్లవాత్మక మార్పులకు దారి తీసిన మాధ్యమం. ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియాదే రోజువారి జీవితంలో కీలక సాధనంగా మారింది. సమాచార మార్పిడి మొదలై భావ ప్రకటన స్వేచ్ఛకు ఆయుధంగా మారుతోంది. సమాచార మార్పిడికి ఉత్తరాలపై ఆధారపడిన కాలం నుంచి టెలిగ్రామ్, టెలిఫోన్, సెల్‌ఫోన్ ఇలా ఎన్నో మార్పులు వచ్చాయి. అలాగే సమాచార మాధ్యమాల్లో రేడియో, టీవీ, పత్రికల స్థానాన్ని ఇంటర్నెట్ ఆక్రమించింది. ఇది ప్రపంచాన్ని డిజిటల్ యుగంగా మార్చిన దశ. ఇంటర్నెట్‌తో పాటు పలు సామాజిక మాధ్యమాలు పుట్టుకొచ్చాయి. ఉత్తర ప్రత్యుత్తరాల స్థానంలో మొయిల్స్ వచ్చాయి. టెలిగ్రామ్‌ల స్థానంలో మెసేజ్‌లు వచ్చాయి. క్రమంగా అది ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్, లింక్ట్‌ఇన్, వాట్సప్ వంటి సామాజిక మాధ్యమాల వరకు విస్తరించింది. ఇవే ఇప్పుడు సమాచార మార్పిడిలో కీలకంగా మారాయి.

దుష్ప్రభావాలు :

సామాజిక మాధ్యమాల వల్ల ఎంత ఉపయోగముందో అంతే స్థాయిలో దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. సమాచార మార్పి డి, భావజాల ప్రచారం కోసం వినియోగించేవారు కొందరైతే.. కొందరు దుర్వినియోగం చేస్తుండడం కూడా గమనించవచ్చు. వ్యక్తిగత దుష్ప్రచారం, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడడం వంటివి ఇందులో భాగమే. సోషల్ మీడియా వినియోగంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల పిల్లలు సెక్సువల్ అబ్యూజ్‌కి గురైన సందర్భాలు లేకపోలేదు. సోషల్ మీడియా ద్వారా అపరిచితులతో సైతం సంబంధాలు ఏర్పడడుతుండ డంతో వాళ్లని నమ్మి మోసపోతున్న వాళ్లు వేల సంఖ్యలో ఉంటా రు. ఇలా సైబర్ క్రైం శాతం పెరిగింది కూడా కాదనలేని నిజం. ప్రభుత్వం, ఇంటర్నెట్ ప్రొవెడైర్స్, సామాజిక మాధ్యమ సంస్థలు ఉమ్మడిగా... ఆన్‌లైన్ మీడియాపై విశ్వాసం పెరిగేలా చర్యలు తీసుకోవాలి. అప్పుడు మాత్రమే.. సాంకేతిక ప్రగతికి అర్థం ఉంటుంది.

విస్తృతార్థంలో ప్రెస్‌ ఫ్రీడమ్‌ డే :

ఎలక్ట్రానిక్ మీడియా ఉనికిలోకి రాకముందే పత్రికా స్వేచ్ఛను కాపాడే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి ప్రకటించిన ఈ దినోత్సవం ఇప్పటికీ పత్రికా స్వేచ్ఛా దినోత్సవంగానే పరిగణింపబడుతోంది. రేడియో, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియా ఉధృతరూపం దాల్చిన నేటి పరిస్థితుల్లో పత్రికా రంగాన్ని విస్తృతార్థంలో మీడియాగా పరిగణిస్తున్నారు. అంటే.. దీనిని మనం పత్రికా స్వేచ్ఛా దినోత్సవంగా కాక.. మీడియా స్వేచ్ఛా దినోత్సవంగా అనువదించుకోవాల్సిన అవసరం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో స్వేచ్ఛ :

     మన తెలుగు రాష్ట్రాల విషయానికే వస్తే.. ఇటు.. తెలంగాణలో అటు.. ఆంధ్రప్రదేశ్‌లోనూ రాష్ట్ర విభజన తర్వాత కొంతకాలం పాటు మీడియాపై ఆంక్షలు, బెదిరింపులు అనేవి బహిరంగంగానే వెలుగు చూశాయి. ఏపీలో ప్రతిపక్ష నేతకు చెందిన ఓ చానెల్‌, పత్రిక పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది. సాక్షి టివి, సాక్షి దినపత్రిక పట్ల ఒకవిధంగా అప్రకటిత ఆంక్షలు కొనసాగాయి. జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నిరసనల మూలంగా క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఇక.. తెలంగాణలోనైతే సాక్షాత్తూ ముఖ్యమంత్రే మీడియాపై ఆంక్షలు విధించడం, ఫలితంగా రెండు మీడియాలపై అప్రకటిత నిషేధం విధించడం కూడా జరిగింది. టీవీ-9, ఏబీఎన్‌వార్తా చానెళ్ల పట్ల సాక్షాత్తూ చట్టసభ అయిన అసెంబ్లీలోనే తన ఆక్రోశాన్ని వెల్లగక్కారు కేసీఆర్. అంతేకాదు.. వరంగల్‌లో జరిగిన ఓ సభలో తెలంగాణకు అనుకూలంగా లేని ‘’మీడియాను పది అడుగుల లోతున పాతిపెడతామంటూ’’ బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం జాతీయ స్థాయిలో కలకలం రేపింది. జాతీయ మీడియా కూడా కేసీఆర్‌వైఖరిని చీల్చి చెండాడింది. చివరకు ఏబీఎన్‌మీడియా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కి.. పత్రికా స్వాతంత్ర్యాన్ని న్యాయస్థానం ద్వారా సంపాదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేయడంతో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలోని ఎంఎస్‌వోలు దిగిరాక తప్పలేదు.

(సప్తగిరి గోపగోని – 98850 86126)


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి