18, మే 2016, బుధవారం

యుపిఎకు అగస్టా గండం

                                 -    సోనియా మెడకు వేలాడుతున్న హెలికాప్టర్లు

(సప్తగిరి గోపగోని)


అగస్టా ఒప్పందం :

ఇటలీకి చెందిన అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ అనేది హెలికాప్టర్ల తయారీ సంస్థ. వివిధ దేశాలకు అవసరమైన హెలికాప్టర్లను, వాళ్ల డిజైనింగ్‌కు అనుగుణంగా తయారుచేసి ఇవ్వడంలో పేరున్న ఈ సంస్థతో నాటి యూపీఏ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ఇప్పుడు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 2010 ఫిబ్రవరిలో అప్పటి యూపీఏ సర్కారు అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో  ఒప్పందం కుదుర్చుకుంది. దేశానికి అవసరమైన 12 వీవీఐపీ హెలికాప్టర్లను సరఫరా చేసేందుకు రూ.3,600 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే.. ఈ వ్యవహారంలో హెలికాప్టర్ల తయారీ కంపెనీ అగస్టా రూ.360 కోట్ల రూపాయల ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఒప్పందం కోసం యూపీఏ ప్రభుత్వం నిబంధనలను కూడా సడలించింది. వాస్తవానికి అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో రక్షణశాఖ ఈ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే.. అప్పటి యూపీఏ పెద్దల హస్తంతోనే ఈ ఒప్పందం, ముడుపుల వ్యవహారం సాగినట్లు తెలుస్తోంది. తాజాగా దేశాన్ని, పార్లమెంటును కుదిపేస్తున్న అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కుంభకోణం కాంగ్రెస్‌ నేతలను వదిలేలా కనిపించడం లేదు.

బయటపడిన గుట్టు – ఇటలీకోర్టు తీర్పు :

    అగస్టా వ్యవహారంలో భారీగా ముడుపులు చేతులు మారినట్లు ఒప్పందంలో మధ్యవర్తి క్రిస్టియన్‌ మైకేల్‌ 2008లో ఆ కంపెనీ భారత విభాగం చీఫ్‌ పీటర్‌ హ్యూలెట్‌కు రాసిన లేఖ ఇటీవలే వెలుగు చూడటంతో అగస్టా తేనెతుట్టె కదిలింది. ఈ లేఖను విచారణాధికారులు ఇటీవలే ఇటలీ కోర్టుకు సమర్పించారు. డీల్‌ కుదరాలంటే సోనియాను ప్రసన్నం చేసుకోవాల్సిందేనంటూ మధ్యవర్తి ఆ లేఖలో సూచించడం పెద్ద దుమారాన్ని లేపింది.  అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ సహా అహ్మద్‌ పటేల్‌, ప్రణబ్‌ ముఖర్జీ, వీరప్ప మొయిలీ, ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌ తదితరులు సోనియాకు అత్యంత దగ్గరివారుగా ఆలేఖలో మైకేల్‌ పేర్కొన్నాడు. ఈ స్కాంకు సంబంధించి స్వట్జర్లాండ్‌కు చెందిన మరో దళారి గిడోరాల్ఫ్‌ హష్కే వద్ద దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్న కీలక పత్రాల్లో మైకేల్‌ రాసిన లేఖ కూడా ఉండటం అందరినీ నివ్వెర పరిచింది. ఈ రహస్యఫైళ్లు గత నెలలోనే వెలుగులోకి వచ్చాయి. ఇటలీలోని కోర్టు అగస్టా ఛాపర్ కేసు లావాదేవీలపై విచారణ జరిపి భారత్‌లోని రాజకీయ నాయకులకు ఈ సంస్థ ముడుపులు సమర్పించిందని తీర్పు చెప్పింది. ఇటలీలోని మిలన్‌ కోర్టు 250 పేజీలతో ఈ తీర్పు వెలువరించింది. ముడుపులు సమర్పించిన ఇటలీ సంస్థకు ఐదువేల డాలర్ల జరిమానా విధించింది. ఇటలీ కోర్టు తీర్పు 193వ పేజీలో సోనియాగాంధీ పేరు, 163-164 పేజీల్లో మన్మోహన్ సింగ్ పేరు ఉంది. 165వ పుటలో ఎస్.పి. త్యాగి సోదరుల పేర్లు ఉదహరించబడ్డాయి. ఇటలీ ప్రధాని మారియో మోంటే, రాయబారి టెర్రా షియానో పేర్లు కూడా జడ్జిమెంట్ కాపీలో ఉన్నాయి.

డ్రాఫ్ట్‌ బడ్జెట్‌..?

    అగస్టా హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకునేందుకు మధ్యవర్తులు భారత్‌లో అనేక మందికి భారీగా ముడుపులు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు బయటపడ్డ పత్రాల ఆధారంగా ప్రభుత్వంలోని పెద్దలు, రాజకీయ నేతలు, రక్షణ శాఖ అధికారులకు సుమారు రూ.430 కోట్ల మేర డబ్బులు చేతులు మారినట్లు బయటపడింది. ఎవరెవరికి ఎంతెంత చెల్లించారన్న వివరాలతో మధ్యవర్తి మైకేల్‌ రూపొందించిన కీలక పత్రం కూడా దర్యాప్తు అధికారులకు చిక్కింది. అయితే.. దానిపై డ్రాఫ్ట్‌ బడ్జెట్‌ అని రాసి ఉంది. ఇందులో సంక్షిప్త నామాలతో ముడుపుల వివరాలను పేర్కొన్నారు. పివోల్‌ అంటే పొలిటిషియన్స్‌ అనే శీర్షిక కింద ఏపీ అన్న అక్షరాలున్న వ్యక్తికి రూ.25కోట్లు ముట్టినట్లు రాశారు. ఎఫ్‌ఏఎం అంటే ఫ్యామిలీ అనే శీర్షిక కింద రూ.126 కోట్లు ముట్టజెప్పినట్లు పేర్కొన్నారు. సోనియా పేరును సంక్షిప్త నామంలో సిగ్మోరా గాంధీగా పేర్కొన్నారు.

ఇక.. 2011-12మధ్య మైకేల్‌ భారత్‌కు 31సార్లు వచ్చి వెళ్లినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఒప్పందం కుదరడానికి ముందుకూడా నేతలను ప్రసన్నం చేసుకునే లక్ష్యంతో 1993 నుంచి క్రిస్టియన్ మైఖేల్ దాదాపు వందసార్లు ఇండియాకు వచ్చి కాంగ్రెస్ నాయకులతో డీల్ కుదుర్చుకున్నట్లు కూడా గుర్తించారు.

శరవేగంగా దర్యాప్తు :

    అగస్టాపై దుమారం చెలరేగుతుండటంతో సీబీఐ ఈ వ్యవహారంపై శరవేగంగా దర్యాప్తు చేస్తోంది. ఇటాలియన్ ప్రాసిక్యూటర్లు విడుదల చేసిన లక్షా అరవై అయిదువేల డాక్యుమెంట్ల ఆధారంగా సిబిఐ ఛార్జ్‌షీటు తయారు చేస్తున్నది. అప్పటి ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ ఎస్పీ త్యాగి, అతని సోదరులతో పాటు.. పలువురిని సీబీఐ సుదీర్ఘంగా విచారించింది. ప్రస్తుతం లండన్‌లో ఉన్న క్రిస్టియన్‌ మైకేల్‌ను అప్పగించాల్సిందిగా ఇంటర్‌పోల్‌ను కూడా సీబీఐ కోరింది.

హెలికాప్టర్ల స్కాం విచారణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ - ఈడీ కీలక ఆధారాలు సంపాదించింది. ఒప్పంద మధ్యవర్తి క్రిస్టియన్ మిచెల్ కారు డ్రైవర్ నారాయణ బహదూర్‌ను విచారించిన ఈడీకి కేసుకు సంబంధించిన కీలక వివరాలు దొరికాయి. మిచెల్‌కు భారతీయ అధికారులు, రాజకీయ నేతలతో ఉన్న సంబంధాల వివరాలు ఈడీ సంపాదించింది. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి డ్రైవర్ నారాయణ బహదూర్‌కు డబ్బులు వచ్చేవని తెలిసింది.   లావాదేవీలను   విశ్లేషించటం ద్వారా మిచెల్‌కు ఏయే దేశాల్లో వ్యాపారాలున్నాయో స్పష్టత వస్తుందని ఈడీ భావిస్తోంది. ఢిల్లీలోని హోటల్‌నుంచి మిచెల్‌ను పికప్ చేసుకునే బహదూర్.. ఢిల్లీలోని భారత, విదేశీ సంస్థలు, వ్యక్తుల దగ్గరకు తీసుకెళ్లేవారు. దీంతో మిచెల్ ఎక్కడెక్కడ, ఎవరెవరిని కలిశారనే విషయాలు బయటపడనున్నాయి.

మరోవైపు.. అగస్టా కుంభకోణంలో తాను ముడుపులు స్వీకరించినట్లు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ మాజీ అధిపతి ఎస్పీ త్యాగికి వరుసకు సోదరుడైన సంజీవ్‌ త్యాగి అంగీకరించినట్లు సిబిఐ వెల్లడించింది. అగస్టా హెలికాప్టర్ల డీల్‌లో మధ్యవర్తులైన గిడో హాష్కె, కార్లో గెరోసాలనుంచి తాను డబ్బు స్వీకరించినట్లు సంజీవ్‌ త్యాగి చెప్పినట్లు సిబిఐ  పేర్కొంది. త్యాగి సోదరులు ఎస్పీ త్యాగితో తమకు ఆస్తుల విషయంలో సంబంధాలున్నాయని చెప్పారు. మధ్యవర్తులైన హాష్కె, గెరోసాలతో తాను ఆర్థిక లావాదేవీలను నిర్వహించానని సంజీవ్‌ త్యాగి చెప్పారని సిబిఐ వర్గాలు పేర్కొన్నాయి.

పెయిడ్‌ జర్నలిస్టు..?

అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంలో ఒక హిందీ చానెల్ కు చెందిన సీనియర్ జర్నలిస్టు పాత్రపై కూడా ఈడీ దృష్టి సారించింది.   సదరు జర్నలిస్టు అగస్టా వెస్ట్ ల్యాండ్ ఖర్చుతో తన భార్యతో కలిసి ఇటలీలో పర్యటించినట్లు ఈడీ కనుగొంది. ఈ జర్నలిస్టు, అతని కుటుంబంపై అగస్టా వెస్ట్ ల్యాండ్ 28 లక్షలు ఖర్చుచేసినట్లు ఈడీ పేర్కొంది. ఈ సీనియర్ జర్నలిస్టుకు అగస్టా వెస్ట్ ల్యాండ్ తో ఉన్న సంబంధంపై దర్యాప్తు చేస్తున్నది. ఈ కుంభకోణానికి సంబంధించి సదరు సీనియర్ జర్నలిస్టును ఈడీ గత ఏడాది   కూడా ప్రశ్నించింది. ఇలా ఉండగా బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఒక ట్వీట్ లో అగస్టావెస్ట ల్యాండ్ కుంభకోణంలో తొలి పెయిడ్ జర్నలిస్టును విచారించాలనడం కూడా చర్చకు దారితీసింది.

పార్లమెంటులో దుమారం !

         అగస్టా వెస్ట్‌ల్యాండ్ వ్యవహారంపై పార్లమెంట్‌లో దుమారం చెలరేగింది. లోక్‌సభలో దీనిపై సుదీర్ఘ చర్చ జరిగింది.  కావాలనే కాంగ్రెస్ పార్టీ అగస్టాతో ఒప్పందం కుదుర్చుకుందని రక్షణ మంత్రి పారికర్ లోకసభలో ఆరోపించారు. వీవీఐపీ చాపర్ల కొనుగోలు కోసం నిబంధనలు సైతం మార్చివేసిందన్నారు. ఒప్పందంలో కుదుర్చుకున్న బెంచ్‌ మార్క్‌ కంటే- కంపెనీ కోసం ధరను ఆరు రెట్లు పెంచడం జరిగిందన్నారు. 12 హెలికాప్టర్ల కోసం కాంగ్రెస్ ఆర్డర్ చేసిందని, ముడుపుల వ్యవహారం బయటపడడంతో ఆ డీల్‌ను రద్దు చేసుకున్నట్లు మంత్రి తెలిపారు. అంతేకాదు.. ఈ స్కాంలో ప్రభుత్వానికి సహకరించిన అధికారులకు రిటైర్మెంట్ తర్వాత మంచి స్థానాలు (గవర్నర్లుగా, అంబాసిడర్లుగా) లభించాయని రక్షణ మంత్రి పరీకర్ చెప్పారు. నమ్మకంగా ఉన్నందుకే వీరందరికీ అప్పటి ప్రభుత్వం రాజ్యాంగ పదవులు ఇచ్చిందన్నారు.

అయితే.. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో అగస్టా వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రక్షణ మంత్రి పారికర్ ఆరోపణలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ సభ నుంచి వాకౌట్ చేసింది. 

బోఫోర్స్‌లా సాగదు..!

బోఫోర్స్ స్కాం విషయంలో మాదిరి కాకుండా అగస్టా వివాదంలో పకడ్బందీగా ముందుకెళ్తామని రక్షణమంత్రి పరీకర్ లోక్‌సభలో తెలిపారు. ఈ కేసు విచారణలో ఇప్పటివరకు బయటపడ్డ ఎస్పీ త్యాగి, గౌతమ్ ఖైతాన్‌ల పాత్ర తక్కువేనన్నారు. యూపీఏ హయాంలో, వారి సహకారంతోనే అగస్టాకు హెలికాప్టర్ డీల్ దక్కిందనేది వాస్తవం. త్యాగి, గౌతమ్ కేవలం గంగానది (అవినీతి) లో చేతులు మాత్రమే కడుక్కున్నారు. అసలు గంగ ఎక్కడికెళ్లిందో గుర్తించే పనిలో ప్రభుత్వం ఉంది’ అని అన్నారు. ఈ కుంభకోణంలో త్యాగి పాత్ర చాలా చిన్నదన్నారు. ఈ కేసులో ఏపీ, సిగ్నోరా పదాలకు అర్థమేంటో ప్రపంచమంతటికీ తెలుసని ఆ పేర్లను ప్రస్తావించి తన పేరు పాడుచేసుకోదలచుకోలేదన్నారు.

మరోవైపు.. అగస్టా కేసులో ఇటలీ కోర్టు తీర్పుకు అనుగుణంగా కాంగ్రెస్ నేతలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్న పిటిషన్‌పై ఏం చేయాలో చెప్పాలని కేంద్ర ప్రభుత్వం, సీబీఐలకు సుప్రీం కోర్టు ఆదేశించింది. దర్యాప్తులో దూకుడు, కేంద్రం పట్టుదల చూస్తూంటే అగస్టా వ్యవహారం త్వరలోనే తేలే పరిస్థితి కనబడుతోంది.

సప్తగిరి గోపగోని

98850 86126.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి