గుట్టువిప్పిన కాగ్
తెలంగాణ ధనిక రాష్ట్రమని ఊదరగొడుతున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి కాగ్ నివేదిక చెంపపెట్టు లాంటిదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతోందని తాము చెప్పిన మాటలను అపహాస్యం చేశారని తమ ఆరోపణలన్నీ కాగ్ నివేదికతో బహిర్గతమయ్యాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ మిగులు ఉన్న రాష్ట్ర మంటూ ఇన్నాళ్లూ ప్రజలను మోసం చేశారని ఆయన విమర్శించారు.
ఏజి రాజీనామా
గతవారం తెలంగాణ అసెంబ్లీలో జరిగిన పరిణామాలతో నెలకొన్న ప్రకంపనలు మరుసటి వారం కూడా కొనసాగాయి. రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ప్రకాష్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామా ప్రభుత్వ పరంగా, రాజ కీయంగా తీవ్ర చర్చను లేవనెత్తింది. ప్రభుత్వానికి, ఏజికి మధ్య సమన్వయం కొరవడిందన్న సంకేతాలు వెలువడ్డాయి. తన మాటకు ప్రభుత్వం పెద్దగా విలువ ఇవ్వడం లేదన్న అభిప్రాయంతో అడ్వకేట్ జనరల్ ప్రభుత్వ వైఖరికి భిన్నంగా వ్యవహరిస్తున్నారన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందన్న చర్చ న్యాయవర్గాల్లో సాగుతోంది.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మొదటిరోజున సభలో కాంగ్రెస్ సభ్యులు వ్యవహరించిన తీరును తప్పుబడుతూ ఎంఎల్‌ఎలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ శాసన సభ్యత్వాలను స్పీకర్ రద్దు చేశారు. ఈ ఘటన మార్చి 12న జరగగా వారి సభ్యత్వాల రద్దుకు సంబంధించిన బులెటిన్‌ను అసెంబ్లీ 13వ తేదీన విడుదల చేసింది. అయితే ఆ రెండు సీట్లు ఖాళీ అయినట్లు ఇచ్చిన నోటిఫికేషన్ గవర్నర్ ఆమోద ముద్రతో జారీ చేయాల్సి ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాని సభ్యత్వ రద్దు నుంచి నోటిఫికేషన్ వరకూ సచివాల యమే నిర్ణయం తీసుకుంది. ఇందులోని లోపాలనే ప్రధానంగా ప్రస్తావిస్తూ ఎంఎల్‌ఎలు కోమటిరెడ్డి, సంపత్‌కుమార్ హైకోర్టులో సవాల్ చేశారు. దీంతో ఆరు వారాల వరకూ షెడ్యూలు విడుదల చేయవద్దని ఎన్నికల కమిషన్‌కు హైకోర్టు మార్చి 19న ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీలో జరిగిన గందరగోళానికి సంబంధించిన సిసి ఫుటేజీని మార్చి 27వ తేదీలోగా తమకు సీల్డ్ కవర్లో అందజేయాలని అదేరోజు అడ్వకేట్ జనరల్‌ను ఆదేశించింది. ఆయన అంగీక రించారు. అయితే తమ అనుమతి తీసుకోకుండానే సిసి ఫుటేజీలు కోర్టుకు ఇస్తామని ఏజి హామీ ఇవ్వడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు తనకు తెలియకుండానే ఈ కేసును వాదించే బాధ్యతలు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వేకు ప్రభుత్వం అప్పగిం చిందన్న నిర్ణయం ఏజిని మనస్తాపానికి గురిచేసిందం టున్నారు.
కొత్త పంచాయతీరాజ్ బిల్లు
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పంచాయతీరాజ్ కొత్త బిల్లు, మున్సిపల్ సవరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో కాలం చెల్లిన పాత చట్టం స్థానంలో కొత్త అంశాలు వచ్చి చేరాయి. సభ ఆమోదించటానికి ముందు పంచాయతీరాజ్ బిల్లులోని కొన్ని అంశాలపై బిజెపి, తెలుగుదేశం, సిపిఎం సభ్యులు కొన్ని సందేహాలను వ్యక్తం చేయగా వాటికి ముఖ్యమంత్రి కెసిఆర్ సమాధానమిచ్చారు. బిల్లును సెలక్టు కమిటీకి పంపాలని బిజెపి, తెలుగు దేశం, సిపిఎంలు కోరాయి. ఈ బిల్లు ఆదరా బాదరాగా తెచ్చిందేమీ కాదని, రెండేళ్లుగా వందల సంఖ్యలో సమావేశాలను నిర్వహించి అనేక మంది నిపుణుల నుంచి అభిప్రాయాలను తెలుసుకొన్న తర్వాతే వివిధ అంశాలను పొందుపర్చామని సిఎం వెల్లడించారు. త్వరలో మున్సిపాలిటీల సమగ్రచట్టం కూడా తీసుకొస్తామని ప్రకటించారు.
ఈ భేటీ వెనక మర్మమేంటి ?
కేంద్రంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ప్రకటన నేపథ్యంలో సిఎం కెసిఆర్‌ను సినీ నటుడు ప్రకాష్‌రాజ్ కలిశారు. దాదాపు నాలుగు గంటల పాటు పలు దఫాలుగా ప్రకాష్‌రాజ్ కెసిఆర్‌తో చర్చించారు. గతంలోనే సిఎంను కలిసేందుకు ప్రకాష్‌రాజ్ సమయం కోరగా మార్చి 29వ తేదీన ప్రగతిభవన్‌కు రావాల్సిందిగా సిఎం కార్యాలయం నుంచి వచ్చిన సమాచారంతో ప్రకాష్‌రాజ్ వెళ్లారు. మొదట రెండు గంటలపాటు ప్రకాష్‌రాజ్‌తో భేటీ అయిన కెసిఆర్ అసెంబ్లీకి తనతో పాటు ఆయనను కూడా తీసుకెళ్లారు. తిరిగి అసెంబ్లీ నుంచి ప్రగతి భవన్‌కు వెళ్లే సమయంలోనూ వెంట తీసుకెళ్లారు. ఆ తర్వాత మరో రెండు గంటల పాటు ప్రకాష్‌రాజ్‌తో చర్చలు జరిపారు. ఈ పరిణామం రాజకీయంగా చర్చను లేవనెత్తింది. దేశంలో కొత్త జాతీయ కూటమి ఏర్పాటుకు సిఎం కెసిఆర్ తీసుకున్న చొరవను ప్రకాశ్‌రాజ్ ప్రశంసించినట్లు తెలిసింది.
– సప్తగిరి
( jagrithi
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి