స్పీకర్ సంచలన నిర్ణయం
తెలంగాణలో గడిచిన వారం అనూహ్య పరిణా మాలు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మొదటిరోజు గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్‌పార్టీ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి టేబుల్ ఎక్కి హెడ్‌ఫోన్ విసరడంతో ఆ హెడ్‌ఫోన్ తగిలి శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ కుడికంటికి గాయమైంది. దీంతో ఆయనకు సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో చికిత్స అందించారు. మొదట 24 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచిన వైద్యులు ఆపరేషన్ అవసరం లేదని ప్రకటించి డిశ్చార్జ్ చేశారు.
స్పీకర్ సంచలన నిర్ణయం
ఈ పరిణామం తర్వాత అసెంబ్లీ స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ కుమార్‌ల అసెంబ్లీ సభ్యత్వం రద్దు చేస్తూ గెజిట్ జారీచేశారు. దాన్ని ఎలక్షన్ కమిషన్‌కూ పంపించారు. అంతేకాదు, గవర్నర్ ప్రసంగానికి ఆటకం కలిగిస్తూ నినాదాలు చేశారంటూ అసెంబ్లీలో విపక్షనేత జానారెడ్డితో సహా 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బడ్జెట్ సమావేశాలు ముగిసేదాకా సస్పెండ్ చేశారు. వారిలో జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, చిన్నారెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, మాధవరెడ్డి, డీకే అరుణ, భట్టి విక్రమార్క, రామ్మోహన్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి, పద్మావతిరెడ్డి ఉన్నారు.
అటు శాసన మండలిలోనూ విపక్ష నేత షబ్బీర్ అలీతో పాటు మరో ఐదుగురు సభ్యులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, సంతోష్, దామోదర్ రెడ్డి, ఆకుల లలిత, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలను ఈ సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేశారు.
ఇదే ప్రథమం
అయితే ఎమ్మెల్యేల సభ్యత్వాలను స్పీకర్ రద్దు చేయడం దక్షిణాది రాష్ట్రాల్లో ఇదే ప్రథమమని చెబుతున్నారు. గతంలో ఇలాంటి పరిణామం ఎక్కడా చోటు చేసుకోలేదని అంటున్నారు. ఈ చర్యను అసెంబ్లీలో అన్ని ప్రతిపక్షాలు తప్పుబట్టాయి.
అలా ఎందుకు చేయలేదు ?
తెలంగాణ ప్రభుత్వం ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ సభ్యత్వం రద్దయిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లు గాంధీభవన్‌లో 48 గంటల పాటు ప్రజాస్వామ్య పరిరక్షణ నిరాహార దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ సీనియర్లు, ముఖ్యనేతలంతా ఈ దీక్షకు సంఘీభావం తెలిపారు. తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరాం కూడా దీక్షా శిబిరానికి వచ్చి తన మద్దతు ప్రకటించారు. ప్రజాస్వామ్యం దెబ్బతినే విధంగా ప్రభుత్వం వ్యవహరించొద్దని టిజెఎసి చైర్మన్ కోదండరామ్ సూచించారు. ఒకవేళ శాసన సభ్యులు సభా సంప్రదాయాలకు విరుద్దంగా ప్రవర్తిస్తే ఎథిక్స్ కమిటికి ఎందుకు సిఫారస్ చేయలేదని, ఏకపక్షంగా సభ్యుల సభ్యత్వాలను రద్దు చేయడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు.
దీక్ష అనంతరం ఢిల్లీలో జరిగిన ఎఐసిసి ప్లీనరీకి తెలంగాణ నుంచి ముఖ్యనేతలంతా తరలివెళ్లారు. అయితే.. అసెంబ్లీ సభ్యత్వం రద్దయిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ కుమార్‌లకు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యేల కోటాలో గదులు కేటాయించొ ద్దంటూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లడం ఈ వివాదాన్ని మరింత పెంచింది. వాళ్లను మాజీ ఎమ్మెల్యేలుగా పరిగణించాలని అప్పటికప్పుడు ఆదేశాలు జారీచేయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.
హైకోర్టులో పిటిషన్
ఇదే పరిణామంపై కాంగ్రెస్ నేతలు ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో హైకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ తన పరిధిని దాటి నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ నేతల తరపు న్యాయవాది హైకోర్టులో వాదించారు. సభలో గవర్నర్ ఉన్న సమయంలో గవర్నర్ నేతత్వంలో సభ నడుస్తుందని, సమావేశాలు మొదలయ్యాక సభ స్పీకర్ అధీనంలోకి వస్తుందని, కానీ ఈ వ్యవహారంలో సభ్యత్వాలు రద్దు చేసే నిర్ణయం స్పీకర్ తీసుకున్నారని పాయింట్ లేవనెత్తారు. పైగా ముందస్తు హెచ్చరిక లేకుండా, నోటీసులు ఇవ్వకుండా, వివరణ కోరకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని న్యాయస్థానం దష్టికి తీసుకెళ్లారు. గవర్నర్ ప్రసంగం సమయంలో ఆయనను సాగనంపిన సమయంలో బాగానే ఉన్న మండలి చైర్మన్ ఆ తర్వాత ఆస్పత్రిలో ప్రత్యక్షమయ్యారని తెలిపారు. ఎమ్మెల్యే సంపత్ వీడియోలో లేకున్నా అతనిపై కూడా చర్యలు తీసుకున్నారని వాదించారు. మొత్తానికి సభ్యత్వాల రద్దు వెనుక రాజకీయ దురుద్దేశ్యం కనిపిస్తోందని కోర్టు దష్టికి తీసుకెళ్లారు. వీరి వాదనలు విన్న హైకోర్టు మరో 6 వారాల వరకు నల్గొండ, ఆలంపూర్ నియోజకవర్గాల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వొద్దని స్పష్టం చేసింది. గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన సంఘటనల సిడిని 22వ తేదీ లోగా కోర్టుకు సీల్డ్ కవర్‌లో పెట్టి ఇవ్వాలని ఆదేశిస్తూ, కేసు తదుపరి విచారణను 26కు వాయిదా వేసింది.
ఎవరి వ్యూహాల్లో వారు..
ఈ పరిణామాలు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రధాన ప్రతిపక్ష సభ్యులు లేకుండానే బడ్జెట్ సమావేశాలు కొనసాగించింది టిఆర్‌ఎస్ ప్రభుత్వం. ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే గడువుండటంతో కాంగ్రెస్ పార్టీని ఆత్మరక్షణలో పడేయడంలో భాగంగానే అదను చూసి టిఆర్‌ఎస్ సర్కారు గతంలో ఎప్పుడూ లేని నిర్ణయం తీసుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకొని ప్రజల్లోకి వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇటు భారతీయ జనతాపార్టీ తన వ్యూహాల్లో నిమగ్నమైంది.
ఈ నేపథ్యంలోనే బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటించారు. బిజెపి రాష్ట్ర పదాధికారులు, ఒబిసి మోర్చా, సోషల్‌మీడియా సమావేశాల్లో ప్రసంగించారు. 2014 తర్వాత దేశంలో 14 రాష్ట్రాల్లో బిజెపి అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. త్రిపురలో సంస్థాగతంగా ఎలాంటి బలం లేకపోయినా అధికారంలోకి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. కర్నాటక ఎన్నికల తర్వాత దక్షిణాది రాష్ట్రాల రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటా యని, తెలంగాణలోనూ సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తామని ప్రకటించారు. దీంతో అప్పుడే తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
– సప్తగిరి
http://www.jagritiweekly.com/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87%E0%B0%B7%E0%B0%A3/%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AA%E0%B1%80%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D%E2%80%8C-%E0%B0%B8%E0%B0%82%E0%B0%9A%E0%B0%B2%E0%B0%A8-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A3%E0%B0%AF%E0%B0%82/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి