అడుగుజాడ

పేజీలు

  • హోమ్
  • సొంత కవిత్వం
  • రైలుమిత్ర
  • వెబ్‌సైట్‌

2, జులై 2016, శనివారం

విశ్వమంతా ఒక్కటైన వేళ...

సరిహద్దులు చెరిగిపోయిన సమయం
ఆసనమేసిన యావత్ ప్రపంచం

                                                                                               - హంసిని సహస్ర సాత్విక



యోగా కోసం సరిహద్దులు చెరిగిపోయాయి. విశ్వమంతా ఒక్కటైంది. భారత ప్రధాని నరేంద్రమోదీ చొరవతో ప్రపంచస్థాయిలో పండుగ జరుపుకుంది. అంతర్జాతీయ వేదికలపై ఆసన విన్యాసాలు చేసింది. యావత్ ప్రపంచం ఆసనమేసింది. కోట్లాది మంది వీధుల్లోకి వచ్చి క్రమశిక్షణతో ఆసనాలు వేయడం కన్నుల పండువ అయ్యింది. గత యేడాదే ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించగా.. ఈసారి రెండో యేడాది మరింత ఉత్సాహంగా సాగింది. ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం కలిగిన 193 దేశాలకు గాను లిబియా, యెమెన్‌ మినహా అన్ని దేశాలు యోగా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాయి. వీటిలో అరబ్ దేశాలు కూడా ఉండటం నిజంగా విశేషం. భారతీయ చరిత్రలోనే ప్రత్యేక స్థానం ఉన్న యోగా.. ఇప్పుడు ప్రపంచం మొత్తానికి హాట్ ఫేవరేట్ అయ్యింది. ప్రాణాలను నిలబెట్టేదే కాదు.. నిత్యయన్వనాన్ని తెచ్చిపెట్టేది కూడా యోగా.

మోదీ ప్రతిపాదన.. ఐరాస ప్రకటన :
-----------------------------------
2014 సెప్టెంబర్ 27న ఐక్యరాజ్యసమితిలో చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ యోగా ప్రాధాన్యతను వివరిస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆవశ్యకతను వివరించారు. అంతేకాదు.. జూన్‌ 21నే యోగా దినంగా ఎందుకు జరుపుకోవాలన్న దానిపైనా మోదీ స్పష్టత ఇచ్చారు. ఉత్తరార్థగోళంలో నమోదయ్యే అతిపెద్ద రోజు జూన్‌ 21. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆ తేదీకి ప్రాధాన్యత ఉంది. అందువల్లే యోగా దినోత్సవం ఆరోజు జరుపుకుంటే బాగుంటుందని ప్రతిపాదించారు. తదుపరి యేడాదే ఐక్యరాజ్యసమితి ఈమేరకు ప్రకటన చేసింది. అంతర్జాతీయ సమాజాన్ని యోగా వేదికపైకి తీసుకొచ్చింది. ఈయేడాది.. ''అభివృద్ధి ల‌క్ష్యాలు సాధించాలంటే ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌నం అవ‌స‌రం'' అన్న నినాదంతో యోగా దినోత్సవాన్ని నిర్వహించింది ఐక్యరాజ్యసమితి.


ఢిల్లీలో ప్రణబ్‌, చండీగఢ్‌లో మోదీ...
---------------------------------------
ఐక్యరాజ్యసమితి యోగా వేడుకల్లో 139 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు జగ్గీ వాసుదేవ్ యోగాసనాలు వేయించారు. దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్‌ముఖర్జీ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు జరిగాయి. యోగా ఒక రోజు లాంఛనం కాకూడదని.. యోగా దైనందిన జీవతంలో భాగం కావాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆకాంక్షించారు. ఇక.. చండీగఢ్‌లో ప్రధాని మోదీ పాల్గొన్న కార్యక్రమంలో 30వేల మంది యోగా చేశారు. నరేంద్రమోదీ వందరకాల యోగాసనాలు ప్రదర్శించారు. యోగాకు ఒక మతం లేదని, యోగా వల్ల జీవితంలో క్రమశిక్షణ అలవాటు చేసుకునే వీలు కలుగుతుందని మోదీ గుర్తు చేశారు. ఇహలోక సుఖం కోసం ప్రతీ ఒక్కరూ యోగాను ప్రాక్టీస్ చేయాలని ఆయన సూచించారు. ఫరీదాబాద్ లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్.. యోగాసనాలు వేసి జనాన్ని ప్రోత్సహించారు. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ యోగా చేశారు. భారత సైన్యం, సరిహద్దు భద్రతాధళాలు కూడా యోగాలో భాగస్వాములయ్యాయి. భారత యుద్ద నౌక ఐఎన్ఎస్ విరాట్ సిబ్బంది కూడా యోగాసనాలు వేశారు. దేశవ్యాప్తంగా 391 వర్శిటీలు, 16 వేల కాలేజీలు, 12 వేల పాఠశాలల్లో యోగా దినోత్సవం నిర్వహించారు. మనదేశంలోనే లక్షకు పైగా యోగా కార్యక్రమాలు నిర్వహించారు. అమెరికా వ్యాప్తంగా ఏర్పాటుచేసిన యోగా కార్యక్రమాల్లో 36 మిలియన్ల మంది యోగాసనాలు వేశారు. ప్రపంచ వ్యాప్తంగా 250 మిలియన్ల జనం యోగాసనాలు వేసినట్లు భావిస్తున్నారు. భారతదేశానికి చెందిన 173 సంస్థలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో యోగా కార్యక్రమాల్లో ప్రజలచేత ఆసనాలు వేయించాయి.

గర్భిణీల యోగా రికార్డు :
--------------------------
గుజరాత్ లోని రాజ్ కోట్ లో రెండువేల మంది గర్భిణీ మహిళలు ఏకకాలంలో యోగా చేయడం ద్వారా యోగా ప్రాముఖ్యతను చాటిచెప్పారు. యోగా చేస్తున్న వాళ్లకే కాదు.. కడుపులోని బిడ్డకూ ఆరోగ్యకరమే అని ప్రబోధించారు. అంతేకాదు.. సుఖప్రసవానికి కూడా యోగా దోహదం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం గిన్నిస్ రికార్డు సృష్టించింది. మరోవైపు.. హైదరాబాద్ లోనూ వందమంది గర్భిణీలు యోగాసనాలు వేశారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు.

యోగా పోస్టల్ స్టాంప్ :
------------------------
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం సూర్య నమస్కారాలతో కూడిన ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది.

విశ్వవిద్యాలయాల్లో యోగా కోర్సులు :
-------------------------------------------
అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతియేడాదీ అట్టహాసంగా జరుగుతున్నందున.. ఇదే స్ఫూర్తితో దేశంలోని విశ్వవిద్యాలయాల్లో యోగాను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. యోగా డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్ని నిర్వహించాలంటూ యూజీసీని ఆదేశించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయించింది.

- హంసిని సహస్ర సాత్విక


(Published in LOKAHITHAM Monthly Magazine)
వీరిచే పోస్ట్ చేయబడింది Sapthagiri వద్ద 12:51 PM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

21, జూన్ 2016, మంగళవారం

ఆరోగ్యానికి యోగ

ఆరోగ్యానికి యోగ

జూన్‌ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకం

పుట్టుక నుంచి చావు వరకు వెంట వచ్చేది మన శరీరమే. ఇంకేవైనా మధ్యలో వచ్చి మధ్యలో పోయేవే. ఎన్నోసార్లు దుస్తులు, ఇండ్లు, ఉద్యోగాలు మార్చుతాం, ఊర్లు, ఆహారాన్ని కూడా మారుస్తాం. సృష్టిలో అన్నీ మార్చగలం. శరీరం మాత్రం మనతోనే వస్తుంది. మనతోనే మట్టిలో కలిసిపోతుంది. అలాంటి శరీరాన్ని, మనసును రోగాలు లేకుండా జాగ్రత్తగా కాపాడుకుంటేనే మన లక్ష్యాలు, ఆశయాలు సాధించగలుగుతాం. శారీరిక, మానసిక ఆరోగ్యానికి ఏకైక సాధనం యోగా.
యోగా
యోగ అంటే వ్యాయామ, ఆధ్యాత్మికతల సమాహారం. ఇది హిందూత్వ ఆధ్యాత్మిక సాధనలో ఒక భాగం. అంతఃదృష్టి, పరమానంద ప్రాప్తి వంటి సాధనలకు పునాది. ధ్యానం ఆధ్యాత్మిక సాధనకు, మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతుంది. హఠయోగం శరీరారోగ్యానికి తోడ్పడుతుంది. నిజానికి యోగమంటే ఇంద్రియాలను వశపరచుకొని ఏకాగ్రత సాధించడమే. నిత్యం యోగా సాధన చేస్తుంటే శారీరక, మానసిక సమస్యలు దరిచేరవు. ఒక్క మాటలో చెప్పాలంటే సంపూర్ణ ఆరోగ్యదాయిని యోగా.
యోగాసనాలు
ఆసనం అనేది ఒక భంగిమ. మన శరీరం అసంఖ్యాకమైన భంగిమలను తీసుకోగలదు. వీటిలో కొన్ని భంగిమలను ‘యోగాసనాలు’గా గుర్తించారు. మనం అనుభవించే వివిధ మానసిక, భావోద్వేగ స్థితులకు శరీరం సహజంగానే ఒక భంగిమను తీసుకుంటుంది. ఆనందంగా ఉంటే ఒక విధంగా, కోపంగా ఉన్నప్పుడు మరోలా ఉంటాం. యోగాసనాల ద్వారా శరీరాన్ని ఒక నిర్దిష్ట భంగిమలోకి తీసుకు వెళ్లడం ద్వారా శరీరంలో చైతన్యం పెరుగుతుంది. యోగ సాధనలో ప్రావీణ్యత సంపాదిస్తే ఈ సృష్టిలో తెలుసుకోదగినవన్నీ తెలుసుకోవచ్చు.
యోగాతో లాభాలు
యోగా, ప్రాణాయామం ద్వారా లాభాలే ఎక్కువ. సందర్భం, అవసరాన్ని బట్టి కొన్ని పరిమితులు తప్పితే నష్టాలనేవి ఉండవు. నిత్యం యోగా చేయడం వల్ల శరీరం కాంతివంతమౌతుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఏకాగ్రత పెరుగుతుంది. బద్ధకం తగ్గుతుంది. రక్తం శుభ్రపడుతుంది. రక్త సరఫరా సక్రమంగా జరిగి, ఆక్సిజన్‌ బాగా అందుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. నాడీ మండలం, మెదడు చైతన్యవంతమై శరీరం చురుకుగా తయారవు తుంది. కుండలినీ శక్తి మేలుకుంటుంది. రజోగుణం, తమోగుణం నశిస్తాయి. ధైర్యం, ఉత్సాహం కలుగుతాయి.
జీర్ణశక్తి పెరగడానికి..
జీవక్రియలను క్రమబద్ధం చేయడానికి యోగా తోడ్పడుతుంది. బాలాసనం లేదా అధోముఖ శ్వానాసనం, వజ్రాసనం, సర్వాంగాసనం, సుప్త వజ్రాసనం జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. పొట్ట తగ్గేందుకు, జీర్ణశక్తి పెరిగేందుకు పశ్చిమోత్తానాసనం వేశాక పూర్వోత్తానాసనం వేయాలి. కొన్ని ఆసనాలను రెండు పక్కల (ఎడమ-కుడి, ముందుకు-వెనక్కు) చేయాలి. వీటిని కౌంటర్‌ ఆసనాలు అంటారు.
స్థూలకాయం తగ్గడానికి..
స్థూలకాయం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవు తాయి. బీపీ, మధుమేహం వంటి రోగాలు చుట్టు ముడతాయి. అందుకే ఎప్పుడూ ఫిట్‌గా ఉండేందుకు యోగా ఒక్కటే సరైన మార్గం. శరీర బరువును తగ్గించడానికి యోగా అద్భుతంగా పనిచేస్తుంది. అబ్డామినల్‌ ఎక్సర్‌సైజ్‌లకి కూడా ఇది బాగా వర్తిస్తుంది. కొవ్వును కరిగించి, పొట్టను తగ్గించే ఆసనాల్లో త్రికోణాసనం, పరివృత్త త్రికోణాసనం ప్రధానమైనవి. డైట్‌ ప్లాన్‌తో పాటు నిత్య యోగ సాధన చేస్తే తప్పనిసరిగా సన్నగా, నాజూగ్గా, ఆకర్షణీయంగా తయావరవచ్చు.
వివిధ ఆరోగ్య సమస్యలకు..
వైట్‌కాలర్‌, ఐటి ఉద్యోగులు, ప్రధానంగా కూర్చుని పనిచేసే వారు, కంప్యూటర్‌, లాప్‌టాప్‌లతో కుస్తీపట్టేవారికి కూర్చోవడం, నిలబడడంలో సమస్యలు లేక సయాటికా వంటి నొప్పులు వస్తాయి. వీటికి భుజంగాసనం చక్కగా పనిచేస్తుంది. విరామ స్థితిలో ఉన్నప్పుడు, నింపాదిగా ఈ భుజంగాసనాన్ని ప్రయత్నించాలి. భుజంగాసనాన్ని శలభాసనం, ధనురాసనాలతో కలిపి వేయాలి. రుతుక్రమం సకాలంలో రాకుండా బాధపడుతున్న మహిళలకు భుజంగాసనం చక్కని ఔషధం. అండాశయం, మూత్రాశయానికి సంబంధించిన పలు సమస్యలను ఇది నివారిస్తుంది. గర్భసంచిని, చుట్టుపక్కల ఉన్న కటి ప్రాంతాలను ఇది క్రమబద్ధంగా పనిచేసేలా చూస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు సైతం ఈ ఆసనం వేయడం ద్వారా మంచి ఫలితాలు పొంద వచ్చు. పెద్దప్రేగు, పొట్టలోని వాయువును భుజంగాసనం వెలుపలకు నెడుతుంది. మెడ, వీపుకు సంబంధించిన అన్నిరకాల నొప్పులకు భుజంగాసనం దివ్యంగా పనిచేస్తుంది.
ఒత్తిడి నివారణకు..
ఆహారపు అలవాట్లు, అధిక శ్రమ వల్ల ఒత్తిడి పెరుగుతుంది. దానివల్ల అనేక రుగ్మతలు ఎదురవు తాయి. ఒంట్లో రోగ నిరోధకశక్తి తగ్గిపోతుంది. నాడీవ్యవస్థ దెబ్బతింటుంది. యోగ సాధన ద్వారా మానసిక ఒత్తిడిపై ఒకేసారి కాకుండా క్రమంగా పైచేయి సాధిస్తాం. వజ్రాసనం, శుప్త వజ్రాసనం, పరిపూర్ణ వజ్రాసనం వంటివి ఇందుకు బాగా పనిచేస్తాయి. విద్యార్థులకూ ప్రశాంతత, ఏకాగ్రత కోసం యోగా సరైన సాధనం. పరీక్షలనగానే విద్యార్థులు ఆందోళన పడుతుంటారు. మానసిక ఒత్తిడి వల్ల చాలా మంది పిల్లలు చదివింది కూడా మర్చిపోతుంటారు. వీరికి యోగా చక్కని పరిష్కారం చూపిస్తుంది.
జ్ఞాపకశక్తిని కాపాడేందుకు..
ప్రస్తుత ఉరుకులూ పరుగుల యుగంలో కాలాన్ని అధిగమించి పరుగులు పెట్టాలన్న ఆలోచన పలు అనర్థాలకు కారణమవుతోంది. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మతిమరుపు. దీనికి మంచి ఔషధం యోగసాధన. ఈ విషయం పరిశోధనల్లో కూడా తేలింది. వృద్ధాప్యంలో కలిగే మతిమరుపుకు కూడా యోగా ఓక సాధనం. సేతుబంధాసనం మెదడుకు కావాల్సిన విశ్రాంతినిస్తుంది. హలాసనం శరీరాన్ని, మెదడును శాంతపరుస్తుంది. యోగాభ్యాసం చేసే టప్పుడు శరీరాన్ని వివిధ భంగిమల్లోకి తీసుకెళ్తూనే, శ్వాసను పీల్చుకోవటం, వదలటం చేస్తాం. మానసిక ఏకాగ్రతను కూడా సాధిస్తాం.
ఆయువు పెరిగేందుకు..
దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధులు ఉన్న వాళ్లు యోగా చేస్తే నిరాశా నిస్పృహలనుంచి బయటపడ వచ్చు. వ్యాధి నిరోధకతను పెంచుకోవచ్చు. జీవిత కాలాన్ని పొడిగించుకోవచ్చు. అనేక అధ్యయనాలు, సర్వేల ప్రకారం యోగా క్రమం తప్పకుండా చేయడం వల్ల క్యాన్సర్‌, మనోవైకల్యం, ఉబ్బసం, గుండె సంబంధించిన సమస్యలు దరిచేరకుండా దూరంగా ఉంచుతుంది. మనసూ ఆరోగ్యంగా ఉంటుంది. వ్యాధి లక్షణాలను కూడా నియంత్రణలోకి తేవచ్చు. కాయకల్ప అనే యోగ ప్రక్రియ జీవన శక్తిని మెరుగు పరుస్తుంది. దీని ప్రాథమిక లక్ష్యం శరీర విధానాన్ని ఒక గాడిలో పెట్టడం. వృద్ధాప్య వేగం తగ్గించడమే.
సౌందర్యానికి యోగా..
అమ్మాయిలు ఎంత అందంగా ఉన్నప్పటికీ మరింత అందంగా ఉండాలంటూ తహతహ లాడుతుంటారు. అంతేకాదు కోమలమైన శరీరం కావాలనుకునే అమ్మాయిలు చాలామందే ఉంటారు. ఇలాంటివారికి యోగా చాలా యోగదాయకమైందని అంటున్నారు యోగా గురువులు. యోగా చేయడం వలన అమ్మాయిలు అందంగా కూడా ఉంటారంటు న్నారు. యోగాతో ముఖం, శరీరంలో కాంతి వస్తుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటే ఆకర్షణీయంగా కూడా కనపడుతుంటారు. దీంతో శరీరం అందంగా కనపడుతుంది. శరీర సౌందర్యం మన వెన్నెముక, శరీర కండరాలపై ఆధారపడి ఉంటుంది. శరీర సౌందర్యానికి ప్రాణాయామంతో పాటు తాడాసనం, త్రికోణాసనం, పశ్చిమోత్తాసనం, ఉష్ట్రాసనం, ధనురాసనం, నౌకాసనం బాగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
yogaకోపం అదుపులో ఉంచేందుకు
కొందరు తరచూ కోపం తెచ్చుకుంటారు. చిన్న చిన్న కారణాలకే ఆగ్రహంతో ఊగిపోతుంటారు. అలాంటివారికోసం యోగా మంచి సాధనం. కోపాన్ని అదుపు చేసుకోవాలంటే యోగాలో అగ్ని ముద్రను ప్రయత్నించండి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో మాత్రమే ఈ ముద్రను చెయ్యాలి.
సూర్య నమస్కారాలతో అనారోగ్యానికి చెక్‌
ఆరోగ్యానికి సూర్యనమస్కారాలు ఎంతో మేలు చేస్తాయి. ఇవి పలు యోగాసనాల కలయిక. సూర్యనమస్కారాలను ఏ వయస్సు వారైనా చేయ వచ్చు. సూర్యనమస్కారాలను చేయడం వల్ల శరీరంలోని 638 కండరాలకు శక్తి వస్తుంది. ఈ సూర్య నమస్కారాలను 12 భంగిమల్లో చేస్తారు. వీటికి 12 మంత్రాలు కూడా ఉన్నాయి. మంత్రోచ్ఛారణతో సూర్యనమస్కారాలు చేస్తే మరింత ఉపయోగం ఉంటుంది.
మిత్ర, రవ, సూర్య, భాను, ఖగ, పూష్ణ, హిరణ్యగర్భ, మరీచ, ఆదిత్య, సవితృ, అర్క, భాస్కర అనేవి ఈ 12 మంత్రాలు. మంత్రానికి ముందు ‘ఓం’ అని, చివర ‘య నమః’ అని చేర్చి మంత్రం ఉచ్ఛరించాలి.
పతంజలి అష్టాంగ యోగ సూత్రాలు :
హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయంలో భాగమైన యోగాన్ని శాస్త్రీయంగా క్రోడీకరించిన ఆద్యుడు పతంజలి. అందుకే వీటిని పతంజలి యోగసూత్రాలు అంటారు. సూత్రము అంటే దారము. దారములో మణులను చేర్చినట్లు యోగ లోని అన్ని పద్ధతుల్ని పతంజలి ఒకచోట చేర్చారు. ప్రపంచవ్యాప్తంగా అందరు ఇప్పుడు వీటిని అనుసరిస్తున్నారు.
పతంజలి యోగసూత్రాలు నాలుగు అధ్యాయాల సంకలనం. సమాధి పద, సాధన పద, విభూతి పద, కైవల్య పద అనేవి ఆ నాలుగు అధ్యాయాలు. ఇవి మానసిక శుద్ధికి కావలసిన యోగాలు. సమాధిపద ఏకాగ్రతతో చిత్తవృత్తులను నిరోధించి పరమానంద స్థితిని సాధించడాన్ని వివరిస్తుంది. సాధనపద కర్మయోగాన్ని, రాజయోగాన్ని సాధన చేయడం ఎలాగో వివరిస్తుంది. ఎనిమిది అవయవాలను స్వాధీనపరచుకోవడం ఎలాగో రాజయోగంలో వివరించారు. విభూతి యోగం జాగరూకత, యోగ సాధనలో నిపుణత సాధించడమెలాగో చెబుతుంది. మోక్షం ఎలా పొందాలో కైవల్యపద విశదీకరిస్తుంది. జీవికి మోక్షప్రాప్తిని కలిగించడమే యోగశాస్త్రం ప్రధాన ఉద్దేశ్యం.
1. యమ, 2. నియమ, 3. ఆసన, 4. ప్రాణాయామ, 5. ప్రత్యాహార, 6. ధారణ, 7. ధ్యానము, 8. సమాధి అనేవి పతంజలి యోగసూత్రా లలోని అష్టాంగాలు.
యోగా – పరిమితులు
యోగా చేయడానికి ఒక విధానం ఉంది. ముఖ్యంగా యోగా పరకడుపున చేయాలి. తేలికపాటి ఆహారం తీసుకుని ఉన్నా పర్వాలేదు. నేరుగా నేలపై కాక, దుప్పటి లేక చాప పరచుకొని దానిపై యోగసాధన చేయాలి. యోగ సాధన సమయంలో సౌకర్యంగా ఉండే తేలికపాటి దుస్తులు ధరించాలి, ఉదయం లేదా సాయంత్రం వేళల్లో చేయవచ్చు. ఆ ప్రదేశంలో మంచి గాలి, వెలుతురు ప్రసరించాలి. ఆనారోగ్య సమయాల్లోనూ, మహిళలు గర్భిణిలుగా ఉన్నప్పుడు యోగ చేయరాదు. ప్రారంభంలో ఎక్కువసేపు చేయడానికి ప్రయత్నించకూడదు. క్రమంగా సమయం పెంచుకోవాలి. ఉచ్వాస నిశ్వాసలు సాధారణంగానే ఉండాలి. యోగాను మొదట గురువు వద్ద అభ్యసించాలి. తరువాత స్వంతంగా సాధన చేయవచ్చు. యోగసాధన ముగిశాక 20-30 నిమిషాల తర్వాత స్నానం చేయడం, ఆహారం తీసుకోవడం చేయవచ్చు.
జూన్‌ 21 అంతర్జాతీయ యోగ దినోత్సవం. ఇప్పటివరకు యోగ గురించి తెలియని వారు ఆ రోజు నుండి అయినా యోగసాధన ప్రారంభిద్దాం. శరీరాన్ని, మనసును ఆరోగ్యంగాను, అందంగాను ఉంచుకుందాం.
– సప్తగిరి గోపగోని, 9885086126

జాగృతి వారపత్రికలో ప్రచురితం  : http://www.jagritiweekly.com/slider-news/%E0%B0%AF%E0%B1%8B%E0%B0%97yoga/
వీరిచే పోస్ట్ చేయబడింది Sapthagiri వద్ద 8:50 AM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

18, మే 2016, బుధవారం

యుపిఎకు అగస్టా గండం

                                 -    సోనియా మెడకు వేలాడుతున్న హెలికాప్టర్లు

(సప్తగిరి గోపగోని)


అగస్టా ఒప్పందం :

ఇటలీకి చెందిన అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ అనేది హెలికాప్టర్ల తయారీ సంస్థ. వివిధ దేశాలకు అవసరమైన హెలికాప్టర్లను, వాళ్ల డిజైనింగ్‌కు అనుగుణంగా తయారుచేసి ఇవ్వడంలో పేరున్న ఈ సంస్థతో నాటి యూపీఏ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ఇప్పుడు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 2010 ఫిబ్రవరిలో అప్పటి యూపీఏ సర్కారు అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో  ఒప్పందం కుదుర్చుకుంది. దేశానికి అవసరమైన 12 వీవీఐపీ హెలికాప్టర్లను సరఫరా చేసేందుకు రూ.3,600 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే.. ఈ వ్యవహారంలో హెలికాప్టర్ల తయారీ కంపెనీ అగస్టా రూ.360 కోట్ల రూపాయల ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఒప్పందం కోసం యూపీఏ ప్రభుత్వం నిబంధనలను కూడా సడలించింది. వాస్తవానికి అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో రక్షణశాఖ ఈ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే.. అప్పటి యూపీఏ పెద్దల హస్తంతోనే ఈ ఒప్పందం, ముడుపుల వ్యవహారం సాగినట్లు తెలుస్తోంది. తాజాగా దేశాన్ని, పార్లమెంటును కుదిపేస్తున్న అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కుంభకోణం కాంగ్రెస్‌ నేతలను వదిలేలా కనిపించడం లేదు.

బయటపడిన గుట్టు – ఇటలీకోర్టు తీర్పు :

    అగస్టా వ్యవహారంలో భారీగా ముడుపులు చేతులు మారినట్లు ఒప్పందంలో మధ్యవర్తి క్రిస్టియన్‌ మైకేల్‌ 2008లో ఆ కంపెనీ భారత విభాగం చీఫ్‌ పీటర్‌ హ్యూలెట్‌కు రాసిన లేఖ ఇటీవలే వెలుగు చూడటంతో అగస్టా తేనెతుట్టె కదిలింది. ఈ లేఖను విచారణాధికారులు ఇటీవలే ఇటలీ కోర్టుకు సమర్పించారు. డీల్‌ కుదరాలంటే సోనియాను ప్రసన్నం చేసుకోవాల్సిందేనంటూ మధ్యవర్తి ఆ లేఖలో సూచించడం పెద్ద దుమారాన్ని లేపింది.  అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ సహా అహ్మద్‌ పటేల్‌, ప్రణబ్‌ ముఖర్జీ, వీరప్ప మొయిలీ, ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌ తదితరులు సోనియాకు అత్యంత దగ్గరివారుగా ఆలేఖలో మైకేల్‌ పేర్కొన్నాడు. ఈ స్కాంకు సంబంధించి స్వట్జర్లాండ్‌కు చెందిన మరో దళారి గిడోరాల్ఫ్‌ హష్కే వద్ద దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్న కీలక పత్రాల్లో మైకేల్‌ రాసిన లేఖ కూడా ఉండటం అందరినీ నివ్వెర పరిచింది. ఈ రహస్యఫైళ్లు గత నెలలోనే వెలుగులోకి వచ్చాయి. ఇటలీలోని కోర్టు అగస్టా ఛాపర్ కేసు లావాదేవీలపై విచారణ జరిపి భారత్‌లోని రాజకీయ నాయకులకు ఈ సంస్థ ముడుపులు సమర్పించిందని తీర్పు చెప్పింది. ఇటలీలోని మిలన్‌ కోర్టు 250 పేజీలతో ఈ తీర్పు వెలువరించింది. ముడుపులు సమర్పించిన ఇటలీ సంస్థకు ఐదువేల డాలర్ల జరిమానా విధించింది. ఇటలీ కోర్టు తీర్పు 193వ పేజీలో సోనియాగాంధీ పేరు, 163-164 పేజీల్లో మన్మోహన్ సింగ్ పేరు ఉంది. 165వ పుటలో ఎస్.పి. త్యాగి సోదరుల పేర్లు ఉదహరించబడ్డాయి. ఇటలీ ప్రధాని మారియో మోంటే, రాయబారి టెర్రా షియానో పేర్లు కూడా జడ్జిమెంట్ కాపీలో ఉన్నాయి.

డ్రాఫ్ట్‌ బడ్జెట్‌..?

    అగస్టా హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకునేందుకు మధ్యవర్తులు భారత్‌లో అనేక మందికి భారీగా ముడుపులు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు బయటపడ్డ పత్రాల ఆధారంగా ప్రభుత్వంలోని పెద్దలు, రాజకీయ నేతలు, రక్షణ శాఖ అధికారులకు సుమారు రూ.430 కోట్ల మేర డబ్బులు చేతులు మారినట్లు బయటపడింది. ఎవరెవరికి ఎంతెంత చెల్లించారన్న వివరాలతో మధ్యవర్తి మైకేల్‌ రూపొందించిన కీలక పత్రం కూడా దర్యాప్తు అధికారులకు చిక్కింది. అయితే.. దానిపై డ్రాఫ్ట్‌ బడ్జెట్‌ అని రాసి ఉంది. ఇందులో సంక్షిప్త నామాలతో ముడుపుల వివరాలను పేర్కొన్నారు. పివోల్‌ అంటే పొలిటిషియన్స్‌ అనే శీర్షిక కింద ఏపీ అన్న అక్షరాలున్న వ్యక్తికి రూ.25కోట్లు ముట్టినట్లు రాశారు. ఎఫ్‌ఏఎం అంటే ఫ్యామిలీ అనే శీర్షిక కింద రూ.126 కోట్లు ముట్టజెప్పినట్లు పేర్కొన్నారు. సోనియా పేరును సంక్షిప్త నామంలో సిగ్మోరా గాంధీగా పేర్కొన్నారు.

ఇక.. 2011-12మధ్య మైకేల్‌ భారత్‌కు 31సార్లు వచ్చి వెళ్లినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఒప్పందం కుదరడానికి ముందుకూడా నేతలను ప్రసన్నం చేసుకునే లక్ష్యంతో 1993 నుంచి క్రిస్టియన్ మైఖేల్ దాదాపు వందసార్లు ఇండియాకు వచ్చి కాంగ్రెస్ నాయకులతో డీల్ కుదుర్చుకున్నట్లు కూడా గుర్తించారు.

శరవేగంగా దర్యాప్తు :

    అగస్టాపై దుమారం చెలరేగుతుండటంతో సీబీఐ ఈ వ్యవహారంపై శరవేగంగా దర్యాప్తు చేస్తోంది. ఇటాలియన్ ప్రాసిక్యూటర్లు విడుదల చేసిన లక్షా అరవై అయిదువేల డాక్యుమెంట్ల ఆధారంగా సిబిఐ ఛార్జ్‌షీటు తయారు చేస్తున్నది. అప్పటి ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ ఎస్పీ త్యాగి, అతని సోదరులతో పాటు.. పలువురిని సీబీఐ సుదీర్ఘంగా విచారించింది. ప్రస్తుతం లండన్‌లో ఉన్న క్రిస్టియన్‌ మైకేల్‌ను అప్పగించాల్సిందిగా ఇంటర్‌పోల్‌ను కూడా సీబీఐ కోరింది.

హెలికాప్టర్ల స్కాం విచారణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ - ఈడీ కీలక ఆధారాలు సంపాదించింది. ఒప్పంద మధ్యవర్తి క్రిస్టియన్ మిచెల్ కారు డ్రైవర్ నారాయణ బహదూర్‌ను విచారించిన ఈడీకి కేసుకు సంబంధించిన కీలక వివరాలు దొరికాయి. మిచెల్‌కు భారతీయ అధికారులు, రాజకీయ నేతలతో ఉన్న సంబంధాల వివరాలు ఈడీ సంపాదించింది. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి డ్రైవర్ నారాయణ బహదూర్‌కు డబ్బులు వచ్చేవని తెలిసింది.   లావాదేవీలను   విశ్లేషించటం ద్వారా మిచెల్‌కు ఏయే దేశాల్లో వ్యాపారాలున్నాయో స్పష్టత వస్తుందని ఈడీ భావిస్తోంది. ఢిల్లీలోని హోటల్‌నుంచి మిచెల్‌ను పికప్ చేసుకునే బహదూర్.. ఢిల్లీలోని భారత, విదేశీ సంస్థలు, వ్యక్తుల దగ్గరకు తీసుకెళ్లేవారు. దీంతో మిచెల్ ఎక్కడెక్కడ, ఎవరెవరిని కలిశారనే విషయాలు బయటపడనున్నాయి.

మరోవైపు.. అగస్టా కుంభకోణంలో తాను ముడుపులు స్వీకరించినట్లు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ మాజీ అధిపతి ఎస్పీ త్యాగికి వరుసకు సోదరుడైన సంజీవ్‌ త్యాగి అంగీకరించినట్లు సిబిఐ వెల్లడించింది. అగస్టా హెలికాప్టర్ల డీల్‌లో మధ్యవర్తులైన గిడో హాష్కె, కార్లో గెరోసాలనుంచి తాను డబ్బు స్వీకరించినట్లు సంజీవ్‌ త్యాగి చెప్పినట్లు సిబిఐ  పేర్కొంది. త్యాగి సోదరులు ఎస్పీ త్యాగితో తమకు ఆస్తుల విషయంలో సంబంధాలున్నాయని చెప్పారు. మధ్యవర్తులైన హాష్కె, గెరోసాలతో తాను ఆర్థిక లావాదేవీలను నిర్వహించానని సంజీవ్‌ త్యాగి చెప్పారని సిబిఐ వర్గాలు పేర్కొన్నాయి.

పెయిడ్‌ జర్నలిస్టు..?

అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంలో ఒక హిందీ చానెల్ కు చెందిన సీనియర్ జర్నలిస్టు పాత్రపై కూడా ఈడీ దృష్టి సారించింది.   సదరు జర్నలిస్టు అగస్టా వెస్ట్ ల్యాండ్ ఖర్చుతో తన భార్యతో కలిసి ఇటలీలో పర్యటించినట్లు ఈడీ కనుగొంది. ఈ జర్నలిస్టు, అతని కుటుంబంపై అగస్టా వెస్ట్ ల్యాండ్ 28 లక్షలు ఖర్చుచేసినట్లు ఈడీ పేర్కొంది. ఈ సీనియర్ జర్నలిస్టుకు అగస్టా వెస్ట్ ల్యాండ్ తో ఉన్న సంబంధంపై దర్యాప్తు చేస్తున్నది. ఈ కుంభకోణానికి సంబంధించి సదరు సీనియర్ జర్నలిస్టును ఈడీ గత ఏడాది   కూడా ప్రశ్నించింది. ఇలా ఉండగా బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఒక ట్వీట్ లో అగస్టావెస్ట ల్యాండ్ కుంభకోణంలో తొలి పెయిడ్ జర్నలిస్టును విచారించాలనడం కూడా చర్చకు దారితీసింది.

పార్లమెంటులో దుమారం !

         అగస్టా వెస్ట్‌ల్యాండ్ వ్యవహారంపై పార్లమెంట్‌లో దుమారం చెలరేగింది. లోక్‌సభలో దీనిపై సుదీర్ఘ చర్చ జరిగింది.  కావాలనే కాంగ్రెస్ పార్టీ అగస్టాతో ఒప్పందం కుదుర్చుకుందని రక్షణ మంత్రి పారికర్ లోకసభలో ఆరోపించారు. వీవీఐపీ చాపర్ల కొనుగోలు కోసం నిబంధనలు సైతం మార్చివేసిందన్నారు. ఒప్పందంలో కుదుర్చుకున్న బెంచ్‌ మార్క్‌ కంటే- కంపెనీ కోసం ధరను ఆరు రెట్లు పెంచడం జరిగిందన్నారు. 12 హెలికాప్టర్ల కోసం కాంగ్రెస్ ఆర్డర్ చేసిందని, ముడుపుల వ్యవహారం బయటపడడంతో ఆ డీల్‌ను రద్దు చేసుకున్నట్లు మంత్రి తెలిపారు. అంతేకాదు.. ఈ స్కాంలో ప్రభుత్వానికి సహకరించిన అధికారులకు రిటైర్మెంట్ తర్వాత మంచి స్థానాలు (గవర్నర్లుగా, అంబాసిడర్లుగా) లభించాయని రక్షణ మంత్రి పరీకర్ చెప్పారు. నమ్మకంగా ఉన్నందుకే వీరందరికీ అప్పటి ప్రభుత్వం రాజ్యాంగ పదవులు ఇచ్చిందన్నారు.

అయితే.. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో అగస్టా వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రక్షణ మంత్రి పారికర్ ఆరోపణలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ సభ నుంచి వాకౌట్ చేసింది. 

బోఫోర్స్‌లా సాగదు..!

బోఫోర్స్ స్కాం విషయంలో మాదిరి కాకుండా అగస్టా వివాదంలో పకడ్బందీగా ముందుకెళ్తామని రక్షణమంత్రి పరీకర్ లోక్‌సభలో తెలిపారు. ఈ కేసు విచారణలో ఇప్పటివరకు బయటపడ్డ ఎస్పీ త్యాగి, గౌతమ్ ఖైతాన్‌ల పాత్ర తక్కువేనన్నారు. యూపీఏ హయాంలో, వారి సహకారంతోనే అగస్టాకు హెలికాప్టర్ డీల్ దక్కిందనేది వాస్తవం. త్యాగి, గౌతమ్ కేవలం గంగానది (అవినీతి) లో చేతులు మాత్రమే కడుక్కున్నారు. అసలు గంగ ఎక్కడికెళ్లిందో గుర్తించే పనిలో ప్రభుత్వం ఉంది’ అని అన్నారు. ఈ కుంభకోణంలో త్యాగి పాత్ర చాలా చిన్నదన్నారు. ఈ కేసులో ఏపీ, సిగ్నోరా పదాలకు అర్థమేంటో ప్రపంచమంతటికీ తెలుసని ఆ పేర్లను ప్రస్తావించి తన పేరు పాడుచేసుకోదలచుకోలేదన్నారు.

మరోవైపు.. అగస్టా కేసులో ఇటలీ కోర్టు తీర్పుకు అనుగుణంగా కాంగ్రెస్ నేతలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్న పిటిషన్‌పై ఏం చేయాలో చెప్పాలని కేంద్ర ప్రభుత్వం, సీబీఐలకు సుప్రీం కోర్టు ఆదేశించింది. దర్యాప్తులో దూకుడు, కేంద్రం పట్టుదల చూస్తూంటే అగస్టా వ్యవహారం త్వరలోనే తేలే పరిస్థితి కనబడుతోంది.

సప్తగిరి గోపగోని

98850 86126.


వీరిచే పోస్ట్ చేయబడింది Sapthagiri వద్ద 10:58 AM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

11, మే 2016, బుధవారం

జాగృతి వారపత్రికలో ప్రచురితమైన ప్రపంచ పత్రికా దినోత్సవ వ్యాసం























వీరిచే పోస్ట్ చేయబడింది Sapthagiri వద్ద 7:55 AM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

పరిణామ క్రమంలో సంప్రదాయ మీడియా

                                  నాలుగో స్తంభానికి స్వేచ్ఛ


                                             -    మే ౩ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం




పత్రికారంగం రూపులు మార్చుకుంటోంది. కొత్తపుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు పత్రికలే ప్రధాన సమాచార వారధులు. తొలినాళ్లలో ఒక పత్రిక ముద్రితమైన తేదీ నుంచి వారం రోజుల తర్వాత కూడా పాఠకునికి చేరే పరిస్థితి ఉండేది. అప్పటి పరిస్థితులు, మౌలిక వసతులు అలా ఉండేవి. కానీ.. రాను రాను ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న సాంకేతికతను అత్యంత వేగంగా అందిపుచ్చుకోవడంలో పత్రికారంగం పాత్ర అమోఘమని చెప్పవచ్చు. ఒకప్పుడు మెయిన్ పేపర్ కే పరిమితమైన పత్రికలు క్రమంగా జిల్లా అనుబంధాలు, మండల, డివిజన్ స్థాయి అనుబంధాలను ప్రచురిస్తున్నాయి. అంతేకాదు.. జిల్లా స్థాయిలో ఎడిషన్లు నిర్వహిస్తున్నాయి. దీంతో సమాచారం మరింత విస్తృతంగా ప్రజల్లోకి చేరవేయడంలో పత్రికలు ముందడుగు వేశాయి. ఆ తర్వాత వచ్చిన రేడియో.. ఆకాశవాణి పేరిట సమాచారాన్ని మారుమూల ప్రాంతాలకూ చేరవేయడంలో ప్రముఖ పాత్ర పోషించింది. ఇక సమాచార రంగంలో టెలివిజన్ విప్లవాత్మక మార్పులను తెచ్చింది. తొలుత దూరదర్శన్, ఎంటర్ టైన్ మెంట్ చానెళ్ల స్థాయిని దాటి.. ప్రత్యేకంగా వార్తా చానెళ్లే ఉనికిలోకి వచ్చాయి. 24 గంటల పాటు వార్తలనే ప్రసారం చేసే టీవీ చానెళ్లు రావడంతో సమాచారం గణనీయమైన వేగాన్ని అందుకుంది. ఆ తర్వాత వచ్చిన ఇంటర్నెట్, వెబ్ చానెళ్లు సమాచారం రూపాన్నే మార్చేశాయి. ఇక.. ఇప్పుడు స్మార్ట్ సెల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక.. సోషల్ మీడియా సైట్లు అయితే.. ప్రతి ఒక్కరినీ జర్నలిస్టుగా మార్చేశాయి. ఇప్పుడు సోషల్ మీడియాను వినియోగిస్తున్న ప్రతి ఒక్కరూ అప్రకటిత జర్నలిస్తుగానే భావించాల్సి ఉంటోంది.

పత్రికా స్వేచ్ఛ :

పత్రికలను లేదా ప్రసార మాధ్యమాలను ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా (ఫోర్త్‌ ఎస్టేట్‌) పేర్కొంటారు. ప్రభుత్వానికి ఉండే మూడు అంగాలైన శాసన వ్యవస్థ, అధికార వ్యవస్థ, న్యాయ వ్యవస్థ (లెజిస్లేచర్‌, ఎగ్జిక్యూటివ్‌, జుడిషియరీ) తో పాటు ప్రజాస్వామ్యవ్యవస్థ ఆరోగ్యానికి అత్యావశ్యకమైనది పత్రికాస్వేచ్ఛ. అందుకే దాన్ని నాల్గవ అంగంగా, నాలుగవ స్తంభంగా పేర్కొన్నారు. 1729-1797 సంవత్సరాల నడుమ జీవించిన ఆంగ్లోఐరిష్‌పొలిటికల్‌థియరిస్ట్‌ఎడ్మండ్‌బ్రూక్‌మొదటిసారిగా పత్రికలను ఉద్దేశించి పౌరుష పదజాలంతో శక్తి అన్న పదాన్ని ప్రయోగించాడు. ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించడంలోనూ, మలచడంలోనూ మీడియా నిర్వహించే పాత్ర కీలకమైంది. మీడియా శక్తిమంతమైందనడానికి దాని మీద జరిగే దాడులే నిదర్శనం. అనేకదేశాలలో మీడియా మీద ఇంకా ఆంక్షలున్నాయి. ప్రభుత్వాలు పెట్టే ఆంక్షలు ఒకెత్తయితే మాఫియా ముఠాలు పెంచే ఒత్తిడి ఇంకొకెత్తు. విధినిర్వహణలో బలైన జర్నలిస్టులెందరో ఉన్నారు. వారంతా పత్రికాస్వేచ్ఛకు పట్టిన దివిటీలు. యూనివర్సల్‌ డిక్లరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌లోని 19వ అధికరణం భావప్రకటన స్వేచ్ఛని గురించి చెబుతుంది. పత్రికాస్వేచ్ఛకు అదే ఆధారభూమిక.

ప్రపంచ పత్రికాస్వేచ్ఛ దినోత్సవం :

1991లో ఆఫ్రికన్‌జర్నలిస్టులు ఏప్రిల్‌నుండి మే 3 వరకూ నమీబియాలోని విండ్‌హాక్‌లో ఒక సమావేశం నిర్వహించారు. అనంతరం పత్రికాస్వేచ్ఛపై కీలకమైన ప్రకటన చేశారు. దీనినే విండ్‌ హక్‌ డిక్లరేషన్‌ అంటారు. ఆఫ్రికాలోని అనేక దేశాలలో సెన్సార్‌షిప్‌వుండేది. పత్రికాస్వేచ్చ మీద ఆంక్షలుండేవి. వాటికి నిరసనగా ఆఫ్రికన్‌జర్నలిస్టులు ప్రకటన చేసిన మే 3 నాడే ప్రపంచ పత్రికాస్వేచ్ఛ దినోత్సవం జరపాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. ఆ నిర్ణయం మేరకు 1993 నుండి ఏటా మే 3న వరల్డ్‌ప్రెస్‌ఫ్రీడమ్‌డేను జరుపుకుంటున్నాము. పత్రికా స్వేఛ్చ పట్ల ప్రజలలో అవగాహన కల్పించడానికి ఇది దోహదపడుతుంది.

ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం ఉద్దేశ్యాలు :

-    పత్రికా స్వేఛ్చ, విలువల పట్ల అవగాహనా కల్పించడం
-     ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేఛ్చ యొక్క స్థితిగతులను పర్యవేక్షించడం
-     స్వేచ్ఛ కలిగిన మీడియాను దాడుల నుంచి రక్షించడం
-     విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పాత్రికేయులకు నివాళి ఘటించడం

వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడం అవార్డ్‌ :

1997 నుండి యునెస్కో ఏటా మే 3వ తేదీ నాడు గుల్లెర్మోకేనో వరల్డ్‌ప్రెస్‌ఫ్రీడమ్‌అవార్డును ప్రదానం చేస్తూ వస్తోంది. ప్రమాదం అంచుల్లో సైతం నిర్భయంగా వ్యవహరించి పత్రికాస్వేచ్ఛకు ప్రతీకగా నిలచిన జర్నలిస్టులకు, ఈ అవార్డు ప్రదానం చేస్తారు. అవార్డు కింద 25,000 అమెరికన్‌డాలర్ల నగదు బహుమతి ఉంటుంది. గుల్లెర్మోకేనో ఒక కొలంబియన్‌న్యూస్‌పేపర్‌కు ఎడిటర్‌గా ఉండేవారు. కేనో తన రాతలతో డ్రగ్‌మాఫియా కన్నెర్రకు గురయ్యారు. 1986 డిసెంబర్‌న ఆయన దారుణంగా తన న్యూస్‌పేపర్‌ఆఫీసు ఎదుటే హత్య చేయబడ్డాడు. ఆయన బలిదానం పత్రికాస్వేచ్ఛకు స్ఫూర్తి. ఆయన పేరిటనే ప్రెస్‌ ఫ్రీడమ్‌ డే నాడు అవార్డు అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఒక గుల్లెర్మోకేనో మాత్రమే కాదు.. జర్నలిస్టు విధినిర్వహణలో చంపబడ్డాడంటే, అది వ్యక్తిగతమైన దాడి కానే కాదు, అది భావప్రకటన స్వేచ్ఛ మీద జరిగిన దాడే! పత్రికా స్వేచ్ఛను పత్రికలు కాదు, ప్రజలే కాపాడుకోవాలి.


డిజిటల్‌కమ్యూనికేషన్‌ – సాంకేతిక విప్లవం :

డిజిటల్‌ కమ్యూనికేషన్‌ ఆగమనంతో రిపోర్టింగ్‌ విధానం మారింది. జవాబుదారీతనంతో కూడిన లక్ష్యాలు, సమతుల రిపోర్టింగ్‌ తక్షణావసరంగా గుర్తించాల్సిన అవసరం ఉంది. హింసాత్మక ఘటనల్లాంటివి కవర్‌ చేసేందుకు జర్నలిస్టులు వారి ప్రాణాలనే పణంగా పెడుతు సాహసోపేతంగా పనిచేస్తున్నారు. మానవతా విలువలు అణచివేసే పరిస్థితులు ఎదురైనపుడు వాటికి వ్యతిరేకంగా ప్రపంచం దృష్టిని ఆకర్షించే సత్తా మీడియాకు ఉంది. సంప్రదాయ మీడియాకు తోడు.. సోషల్ మీడియా.. చరిత్రలో ఓ సంచలనం. ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసిన మాధ్యమం. సమాచార మార్పిడిలో విప్లవాత్మక మార్పులకు దారి తీసిన మాధ్యమం. ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియాదే రోజువారి జీవితంలో కీలక సాధనంగా మారింది. సమాచార మార్పిడి మొదలై భావ ప్రకటన స్వేచ్ఛకు ఆయుధంగా మారుతోంది. సమాచార మార్పిడికి ఉత్తరాలపై ఆధారపడిన కాలం నుంచి టెలిగ్రామ్, టెలిఫోన్, సెల్‌ఫోన్ ఇలా ఎన్నో మార్పులు వచ్చాయి. అలాగే సమాచార మాధ్యమాల్లో రేడియో, టీవీ, పత్రికల స్థానాన్ని ఇంటర్నెట్ ఆక్రమించింది. ఇది ప్రపంచాన్ని డిజిటల్ యుగంగా మార్చిన దశ. ఇంటర్నెట్‌తో పాటు పలు సామాజిక మాధ్యమాలు పుట్టుకొచ్చాయి. ఉత్తర ప్రత్యుత్తరాల స్థానంలో మొయిల్స్ వచ్చాయి. టెలిగ్రామ్‌ల స్థానంలో మెసేజ్‌లు వచ్చాయి. క్రమంగా అది ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్, లింక్ట్‌ఇన్, వాట్సప్ వంటి సామాజిక మాధ్యమాల వరకు విస్తరించింది. ఇవే ఇప్పుడు సమాచార మార్పిడిలో కీలకంగా మారాయి.

దుష్ప్రభావాలు :

సామాజిక మాధ్యమాల వల్ల ఎంత ఉపయోగముందో అంతే స్థాయిలో దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. సమాచార మార్పి డి, భావజాల ప్రచారం కోసం వినియోగించేవారు కొందరైతే.. కొందరు దుర్వినియోగం చేస్తుండడం కూడా గమనించవచ్చు. వ్యక్తిగత దుష్ప్రచారం, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడడం వంటివి ఇందులో భాగమే. సోషల్ మీడియా వినియోగంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల పిల్లలు సెక్సువల్ అబ్యూజ్‌కి గురైన సందర్భాలు లేకపోలేదు. సోషల్ మీడియా ద్వారా అపరిచితులతో సైతం సంబంధాలు ఏర్పడడుతుండ డంతో వాళ్లని నమ్మి మోసపోతున్న వాళ్లు వేల సంఖ్యలో ఉంటా రు. ఇలా సైబర్ క్రైం శాతం పెరిగింది కూడా కాదనలేని నిజం. ప్రభుత్వం, ఇంటర్నెట్ ప్రొవెడైర్స్, సామాజిక మాధ్యమ సంస్థలు ఉమ్మడిగా... ఆన్‌లైన్ మీడియాపై విశ్వాసం పెరిగేలా చర్యలు తీసుకోవాలి. అప్పుడు మాత్రమే.. సాంకేతిక ప్రగతికి అర్థం ఉంటుంది.

విస్తృతార్థంలో ప్రెస్‌ ఫ్రీడమ్‌ డే :

ఎలక్ట్రానిక్ మీడియా ఉనికిలోకి రాకముందే పత్రికా స్వేచ్ఛను కాపాడే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి ప్రకటించిన ఈ దినోత్సవం ఇప్పటికీ పత్రికా స్వేచ్ఛా దినోత్సవంగానే పరిగణింపబడుతోంది. రేడియో, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియా ఉధృతరూపం దాల్చిన నేటి పరిస్థితుల్లో పత్రికా రంగాన్ని విస్తృతార్థంలో మీడియాగా పరిగణిస్తున్నారు. అంటే.. దీనిని మనం పత్రికా స్వేచ్ఛా దినోత్సవంగా కాక.. మీడియా స్వేచ్ఛా దినోత్సవంగా అనువదించుకోవాల్సిన అవసరం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో స్వేచ్ఛ :

     మన తెలుగు రాష్ట్రాల విషయానికే వస్తే.. ఇటు.. తెలంగాణలో అటు.. ఆంధ్రప్రదేశ్‌లోనూ రాష్ట్ర విభజన తర్వాత కొంతకాలం పాటు మీడియాపై ఆంక్షలు, బెదిరింపులు అనేవి బహిరంగంగానే వెలుగు చూశాయి. ఏపీలో ప్రతిపక్ష నేతకు చెందిన ఓ చానెల్‌, పత్రిక పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది. సాక్షి టివి, సాక్షి దినపత్రిక పట్ల ఒకవిధంగా అప్రకటిత ఆంక్షలు కొనసాగాయి. జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నిరసనల మూలంగా క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఇక.. తెలంగాణలోనైతే సాక్షాత్తూ ముఖ్యమంత్రే మీడియాపై ఆంక్షలు విధించడం, ఫలితంగా రెండు మీడియాలపై అప్రకటిత నిషేధం విధించడం కూడా జరిగింది. టీవీ-9, ఏబీఎన్‌వార్తా చానెళ్ల పట్ల సాక్షాత్తూ చట్టసభ అయిన అసెంబ్లీలోనే తన ఆక్రోశాన్ని వెల్లగక్కారు కేసీఆర్. అంతేకాదు.. వరంగల్‌లో జరిగిన ఓ సభలో తెలంగాణకు అనుకూలంగా లేని ‘’మీడియాను పది అడుగుల లోతున పాతిపెడతామంటూ’’ బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం జాతీయ స్థాయిలో కలకలం రేపింది. జాతీయ మీడియా కూడా కేసీఆర్‌వైఖరిని చీల్చి చెండాడింది. చివరకు ఏబీఎన్‌మీడియా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కి.. పత్రికా స్వాతంత్ర్యాన్ని న్యాయస్థానం ద్వారా సంపాదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేయడంతో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలోని ఎంఎస్‌వోలు దిగిరాక తప్పలేదు.

(సప్తగిరి గోపగోని – 98850 86126)


వీరిచే పోస్ట్ చేయబడింది Sapthagiri వద్ద 7:04 AM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

24, మార్చి 2016, గురువారం

కాలుష్య నియంత్రణతోనే మనుగడ




-     వాతావరణ పరిరక్షణతోనే మానవ రక్షణ
-     మార్చి 23 ప్రపంచ వాతావరణ దినోత్సవం
సప్తగిరి గోపగోని
98850 86126

వాతావరణమంటే గాలి. భూమి పైపొర. జీవ జాలానికి అనువైన భూ గ్రహంపై దాదాపు వెయ్యి కిలోమీటర్ల ఎత్తు వరకూ వ్యాపించి ఉన్న గాలి పొరను వాతావరణం అని పిలుస్తారు. భూమిపై మనుషులు, జీవజాలం బతకడానికి అవసరమైన ఆక్సిజన్‌ గానీ, చెట్లకు అవసరమైన కార్బన్‌డై ఆక్సైడ్‌  గానీ గాలిలోనే ఉంటాయి.  గాలి ఓ మిశ్రమ పదార్థం. వాతావరణంలో 78శాతం నైట్రోజన్‌, 21శాతం ఆక్సిజన్‌ ఉంటాయి. వీటితో పాటు.. కార్బన్‌ డయాక్సైడ్‌, హైడ్రోజన్‌, హీలియం, నియాన్‌, క్రిప్టాన్‌, జినాన్‌ వంటి జడవాయువులు కూడా ఉంటాయి. గాలిలో నీటిఆవిరి కూడా ఉంటుంది. వీటన్నింటిని ఇముడ్చుకున్న గాలికి బరువు ఉంటుంది. స్థలాన్ని కూడా ఆక్రమిస్తుంది. వాతావరణం భూమిపై కొంత పీడనాన్ని కూడా కలుగజేస్తుంది.

వాతావరణమంటే జీవ కారకం. భూమిపై జీవులకు ఆధారం. కానీ వాతావరణానికే ఓ ప్రత్యేకమైన దినోత్సవాన్ని నిర్వహించుకోవాల్సి వస్తుందంటేనే ఏదో ఓమూల కీడు శంకిస్తోంది. అంటే.. వాతావరణానికి ముప్పు పొంచి ఉందనే హెచ్చరిక స్ఫురిస్తోంది.

గాలి కాలుష్యం – కారకాలు :
గాలిలో హానికర పదార్థాలు ఎక్కువగా ఉండటాన్ని గాలి కాలుష్యం అంటారు. గాలి కాలుష్యం అంటే.. వాతావరణ కాలుష్యం అన్నమాటే…  ఇంధనాల వినియోగం, అడవుల నరికివేత, వాహనాల నుంచి వెలువడే వాయువులు, పారిశ్రామికీ కరణ, ఆధునిక వ్యవసాయ విధానాలు, అణు ధార్మికత, ధ్వని కాలుష్యం వంటి అనేక కారణాల వల్ల వాతావరణ కాలుష్యం పెరిగిపోతోంది.

పరిశ్రమల వ్యర్థాలు – పారిశ్రామిక కాలుష్యం :
ఏ పరిశ్రమ ఏర్పాటు చేయాలన్నా… ఆ పరిశ్రమ స్వభావాన్ని బట్టి  కొన్ని నిబంధనలు, తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు రూపొందించబడి ఉంటాయి. ప్రధానంగా కాలుష్యాలు వెదజల్లే పరిశ్రమల విషయంలో ప్రత్యేకంగా కాలుష్య నియంత్రణ మండలి పనిచేస్తుంది. కాలుష్య నియంత్రణ మండలి పరిధిలోకి వచ్చే పరిశ్రమలన్నీ విధిగా మండలి నిబంధనలు పాటించడంతో పాటు.. కాల వ్యవధిని బట్టి ఎప్పటికప్పుడు కాలుష్యంపై నివేదికలను మండలికి అందజేయాల్సి ఉంటుంది. నియంత్రణకు లోబడి కాకుండా కాలుష్యం పెరిగిందనిపిస్తే వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే ఆ పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకునే అధికారం కాలుష్య నియంత్రణ మండలికి ఉంటుంది. కానీ ఇటీవలి కాలంలో పరిశ్రమల కాలుష్యంపైనా.. కాలుష్య నియంత్రణ మండలి పనితీరుపైనా తరచూ విమర్శలు రావడం పరిపాటైంది.

పారిశ్రామిక కాలుష్యం పర్యవసానాలు :
          భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన దేశ ప్రజలెవరికీ తెలియనిది కాదు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ సమీపంలోని యూనియన్‌ కార్బైడ్‌ పరిశ్రమలో సంభవించిన విస్ఫోటం కారణంగా టన్నుల కొద్దీ మిథైల్‌ ఐసోసైనేట్‌ అనే ప్రమాదకర వాయువు లీకైంది. క్షణాల్లో అక్కడి వాతావరణంలో కలిసిన ఈ మృత్యు వాయువు.. వేలాది నిండు ప్రాణాల్ని కబళించింది. కంటిచూపు పోయినవారు, వూపిరితిత్తులకు తూట్లు పడ్డవాళ్లు, జీవచ్ఛవాలుగా మిగిలినవాళ్లెందరో లెక్కే లేదు.  పాతికవేలమంది నేల రాలిపోయారు. అయిదున్నర లక్షల మందికిపైగా అనారోగ్య పీడితులయ్యారు. నేటికీ అక్కడి గాలిలో, నీటిలో, భూగర్భంలో విషపదార్థ నిక్షేపాలు పుట్టబోయేవారినీ శాపగ్రస్తులు చేస్తున్నాయి.
          ఇక.. తెలుగు రాష్ట్రాలకు వస్తే.. హైదరాబాద్‌ పరిసరాల్లో నగరం నలుమూలలా స్థాపించబడిన వేలాది కాలుష్య కారక పరిశ్రమలు వెదజల్లుతున్న విషపు వాయువులు నిత్యం ఆ పరిసర ప్రాంతాల ప్రజలకు సుపరిచితమే. అంతేకాదు.. తెలుగు రాష్ట్రాల్లోని అనేక పారిశ్రామిక వాడల్లో ఇదే పరిస్థితి ఉంది.  కాలుష్య నియంత్రణ మండలి కళ్లకు గంతలు కడుతున్న పరిశ్రమలు.. స్థానికుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. జీడిమెట్ల, బొల్లారం లాంటి పారిశ్రామిక వాడలకు వెళ్లిన కొత్తవారికి కొద్దిసేపు తొలుత ఊపిరాడదంటే.. అక్కడి వాతావరణం ఎంతగా కలుషితమైందో అర్థమైపోతుంది.
          ఏ పరిశ్రమ నెలకొ్ల్పినా. ఆ పరిశ్రమ స్వభావాన్ని బట్టి పలు నిబంధనలు రూపొందించబడి ఉన్నాయి. ప్రధానంగా పరిశ్రమల నుంచి వెలువడే విషవాయువులు, వ్యర్థవాయువులతో కూడిన పొగను బాహ్య వాతావరణంలో కలిపే ముందు పొగకు సరైన ఫిల్డర్లు వాడాలి. నిబంధనల మేరకు  అవి వాడాల్సి ఉన్నా.. వ్యయంతో కూడినవి అయినందున కంపెనీలు ఈ నిబంధనను అంతగా పట్టించుకోవడం లేదు. ఫలితంగా పరిశ్రమలు ఉండే పరిసరాలు, గ్రామాల్లో కలుషిత వాయువులు కరాళనృత్యం చేస్తున్నాయి.

జల కాలుష్యం :
వాతావరణంలో మరో ముఖ్యమైనది జలం. భూమిపై జీవనానికి గాలి తర్వాత నీరు కూడా అంతే ప్రధానమైనది. పెరుగుతున్న జనాభా కారణంగా జలం కూడా కాలుష్యానికి గురవుతోంది. జలకాలుష్యం కారణంగా జనాన్ని అనేక వ్యాధులు పట్టి పీడిస్తున్నాయి. తాగడానికి నీళ్లు కూడా దొరకని పరిస్థితిలో కొన్ని ప్రాంతాల్లో కలుషిత జలమే దిక్కవుతోంది. మరోవైపు.. పరిశ్రమలనుంచి వెలువడే వ్యర్థ జలాలు పరిసరాలను కలుషితం చేస్తున్నాయి. కొన్ని కంపెనీల నుంచి వెలువడే విష వ్యర్థాలు జలంలో కలిసి బయటికి వదిలివేయబడుతుండటంతో ఆ పరిసరాల్లో కనీసం చెట్లు కూడా మొలకెత్తే పరిస్థితి ఉండదు.

ఓజోన్‌ పొరపై ప్రభావం :
          ఓవైపు పారిశ్రామిక కాలుష్యం, మరోవైపు.. వాహన కాలుష్యం.. ఓజోన్‌ పొరకు ముప్పు వాటిల్లేలా పరిణమించాయి. సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలను భూమిపైకి చేరకుండా మహత్తర పాత్రను పోషిస్తోంది ఓజోన్‌ పొర. అయితే.. కాలుష్యం కారణంగా ఓజోన్‌ పొరకు చిల్లులు పడితే భూగోళంపై ఉండే జీవులు హాహాకారం చేయడం తప్పదు.

అటవీ నిర్మూలన :
వాతావరణానికి చెట్లు మిత్రులు. ఎందుకంటే వాతావరణంలో ఎప్పటికప్పుడు చేరే కలుషిత వాయువును గ్రహించి ప్రాణవాయువులను ఉత్పత్తిచేయగల గొప్ప శక్తి చెట్లకు మాత్రమే ఉంది. కానీ.. ప్రస్తుత కాలంలో సహజసిద్ధంగా ఏర్పడిన అడవుల్లోని చెట్లను నరకడం,  కాల్చివేయడం నిరంతరాయంగా సాగుతోంది. చెట్లు లేదా వాటి నుంచి తీసే బొగ్గును మానవులు ఉపయోగించే ఒక సరుకుగా విక్రయిస్తున్నారు. చెట్లను నరికిన తరువాత ఏర్పడిన ఖాళీ ప్రదేశాన్ని పచ్చిక బయలు, పంట భూములు, మానవ నివాసాలకు ఉపయోగించుకుంటున్నారు. తగిన మోతాదులో మళ్లీ చెట్ల పెంపకం లేకుండా అడవులను నిర్మూలించడంతో సహజావరణం దెబ్బతినడంతోపాటు, జీవవైవిధ్యానికి నష్టం జరుగుతుంది. అటవీ నిర్మూలన జరిగిన ప్రదేశాల్లో భూమి కోతకు గురవడంతోపాటు, తరచుగా ఇటువంటి ప్రదేశాలు బంజరుభూమిగా రూపాంతరం చెందుతాయి.  అటవీ నిర్మూలనకు అనేక కారణాలు ఉన్నాయి, అవి ప్రభుత్వ సంస్థల అవినీతి, అధికారం మరియు సంపద యొక్క అసమాన పంపిణీ, జనాభా పెరుగుదల, అధిక జనాభా, మరియు పట్టణీకరణ ఇందులో ముఖ్యమైనవి. "అటవీ నిర్మూలన జనాభా ఒత్తిడి, నిశ్చేష్టమైన ఆర్థిక, సామాజిక మరియు సాంకేతిక పరిస్థితుల వంటి వివిధ అంశాల కలయిక ద్వారా జరుగుతుందని" 2000లో ఐక్యరాజ్యసమితిఆహార మరియు వ్యవసాయ సంస్థ (FAO) గుర్తించింది.

అటవీ నిర్మూలన - పర్యావరణ సమస్యలు
అటవీ నిర్మూలన కొనసాగుతుండటం వలన వాతావరణం మరియు భూగోళం ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. చెట్లు మరియు ఇతర మొక్కలు వాటి సాధారణ శ్వాసప్రక్రియలో భాగంగా కిరణజన్య సంయోగక్రియ ద్వారా వాతావరణంలోని కార్బన్‌ను  తొలగించి ఆక్సిజన్‌ను తిరిగి వాతావరణంలోకి విడుదల చేస్తాయి. చెట్ల క్షయం జరగడం లేదా వాటిని కాల్చడం వలన అది నిల్వచేసుకున్న కార్బన్‌లో ఎక్కువ భాగం తిరిగి వాతావరణంలో కలుస్తుంది. అడవులు కార్బన్‌ను గ్రహించేలా చేయడానికి, చెట్లను తిరిగి నాటడం చేయాలి. భూమిలో నిక్షిప్తమైన కార్బన్ వాతావరణంలోకి విడుదల కావడానికి కూడా అటవీ నిర్మూలన కారణమవుతుంది. భూమి కోసం అడవుల్లోని చెట్లను భస్మీకరణం చేయడం మరియు కాల్చివేయడం ద్వారా టన్నులకొద్ది కార్బన్‌డయాక్సైడ్‌ వాతావరణంలోకి విడుదలవుతుంది, ఇది భూతాపానికి కారణమవుతుంది.

అటవీ నిర్మూలన వలన జల చక్రం కూడా ప్రభావితమవుతుంది. చెట్లు వాటి యొక్క వేర్లు ద్వారా భూగర్భజలాలను గ్రహించి, వాతావరణంలోకి విడిచిపెడతాయి. అటవీ ప్రాంతం నిర్మూలించబడినప్పుడు, చెట్లు నీటిని గాలిలోకి చేర్చలేవు, దీని వలన పొడి వాతావరణం ఏర్పడుతుంది. అటవీ నిర్మూలన వలన వాతావరణంలో తేమ తగ్గిపోవడంతోపాటు, భూమిలో నీటి శాతం మరియు భూగర్భజలాల పరిమాణం కూడా తగ్గిపోతుంది.అటవీ నిర్మూలన భూమి సంయోగాన్ని కూడా తగ్గిస్తుంది, దీని వలన క్రమక్షయం, వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రమాదాలు జరుగుతాయి.

వాహన కాలుష్య నియంత్రణ :
నాగరిక ప్రపంచంలో పెరుగుతున్న ఆధునికత వాహన వినియోగం విపరీతంగా పెరిగేందుకు కారణమవుతోంది. ఫలితంగా చిన్నపాటి నగరాల్లోనూ ట్రాఫిక్‌ సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఇక నగరాలు, మెట్రో నగరాల పరిస్థితి చెప్పే అవసరమే లేదు. ప్రధాన రహదారిపై ఓ నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన వాహనదారుడు కనీసం  అరగంట, ముప్పావుగంట ముందు ఇంటినుంచి బయలుదేరాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఫలితంగా సమయం పెరగడంతో పాటు.. అదే స్థాయిలో గాలిలో కలిసే కాలుష్యం కూడా పెరుగుతోంది. అంతసేపూ వాహనం ఇంజన్‌ ఆన్‌లోనే ఉండటం వల్ల నిరంతరాయంగా పొగ వాతావరణంలో కలుస్తోంది.  దేశ రాజధాని ఢిల్లీ నగరంలో రోడ్లపై నడిచే కార్లకు సంబంధించి ‘సరి-బేసి’ విధానం అమలు చేయాలనే ఆలోచన వచ్చిందంటే.. పరిస్థితి ఎంత ప్రమాదకర స్థాయికి చేరిందో ఊహించవచ్చు. సరిసంఖ్య ఉన్న వాహనాలు తిరగాల్సిన రోజు.. బేసి సంఖ్య ఉన్న వాహనాలు రోడ్లపైకి వచ్చాయంటే ట్రాఫిక్‌ అధికారులు చలానా వేయడం తప్పదు. అదే.. బేసి సంఖ్య ఉన్న వాహనాలు తిరగాల్సిన రోజు.. సరిసంఖ్య ఉన్న కార్లు బయటికి తీస్తే అదే ట్రీట్‌మెంట్‌ ఉంటుంది. కార్లు ఉన్నవారికి ఇది ఇబ్బందికరమే అయినా.. న్యాయస్థానం కూడా ఈ ప్రయోగాత్మక విధానాన్ని విమర్శించకపోవడం గమనించదగ్గ విషయం.

          కార్లు వాడటం స్టేటస్‌గా భావించే ఈరోజుల్లో రోడ్లన్నీ కార్లతో నిండిపోతున్నాయి. ఫలితంగా వాతావరణ కాలుష్యం నిత్యం పెరుగుతూనే ఉంది. దీనిని నియంత్రించేందుకు ఎవరికి వారు బాధ్యతగా వ్వవహరిస్తే కొంతయినా కాలుష్యాన్ని తగ్గించడం ఖాయంగా చెప్పవచ్చు. ప్రధానంగా ఒకే ఆఫీసులో పనిచేసేవారు గానీ, ఒకే మార్గంలో ప్రయాణించే వారు గానీ.. ఒకే కాలనీకి చెందిన వారుగానీ.. ‘కార్‌ పూలింగ్‌’, ‘బైక్‌ పూలింగ్‌’ ను పాటిస్తే సగం కాలుష్యాన్ని తగ్గించినట్లే.. ఒకే పనితో ‘స్వామి కార్యం స్వకార్యం ‘ నెరవేరుతుందన్నట్లు.. కార్‌ పూలింగ్‌ , బైక్‌ పూలింగ్‌ వల్ల సామాజిక బాధ్యతగా ఇటు కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు.. అటు ఇంధన వ్యయాన్ని కూడా పొదుపు చేసినవాళ్లవుతారు.

కాలుష్య నివారణకు మార్గాలు :
          కాలుష్యం కోరల్లో మనిషి జీవితం అతలాకుతలమవుతోంది. పర్యావరణాన్ని పరిరక్షించడం తద్వారా కాలుష్యాన్ని తగ్గించి వాతావరణానికి మేలు జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదీ… అటవీ నిర్మూలనకు ఫుల్‌స్టాప్‌పడాలి. చెట్లు, అడవుల పెంపకం నిరంతరాయంగా సాగాలి. ప్రతిఒక్కరూ మొక్కలు నాటడాన్ని అలవాటుగా చేసుకోవాలి. చెట్లు లేని ఇళ్లు ఉండకుండా ప్రతి ఇంట్లోనూ చెట్లుఉండేలా కంకణం కట్టుకోవాలి. పెట్రోల్‌, డీజిల్‌ వినియోగించే వాహనాలకు బదులు సీఎన్‌జీతో నడిచే వాహనాలను వాడాలి. ఫ్యాక్టరీల్లో వెలువడే వ్యర్థ, కాలుష్య, ప్రమాదకర వాయువులతో కూడిన పొగకు సరైన ఫిల్టర్‌లు ఉపయోగించాలి. దీనికోసం నిరంతర నిఘా వ్యవస్థ పనిచేయాలి. ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ప్రోత్సహించాలి. ఇది ఉద్యమస్థాయిలో కొనసాగాల్సిన అవసరం ఉంది. సౌరశక్తి, బయోగ్యాస్‌, బయోమాస్‌ ఎనర్జీ వంటి వాడకం పెరగాలి. సౌరశక్తితో విద్యుత్‌ ఉత్పత్తి ఇప్పుడిప్పుడే ఉధృతంగా మొదలవుతోంది. దీనికి ప్రభుత్వాలు ప్రోత్సాహకాలను అందిస్తే.. పరోక్షంగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడినట్లు అవుతుంది.

Publised in Jaagriti Magazine
వీరిచే పోస్ట్ చేయబడింది Sapthagiri వద్ద 2:30 AM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

COVERPAGE ARTICLE IN JAAGRITI MAGAZINE








వీరిచే పోస్ట్ చేయబడింది Sapthagiri వద్ద 2:27 AM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి
కొత్త పోస్ట్‌లు పాత పోస్ట్‌లు హోమ్
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి: కామెంట్‌లు (Atom)

Stat counter

View My Stats

మొత్తం పేజీ వీక్షణలు

బ్లాగు ఆర్కైవ్

  • ▼  2022 (1)
    • ▼  సెప్టెంబర్ (1)
      • MOUNT ABU MEMORIESమరపురాని మౌంట్‌ అబూ(జ్ఞాపకాల దొం...
  • ►  2020 (1)
    • ►  జనవరి (1)
  • ►  2019 (78)
    • ►  డిసెంబర్ (10)
    • ►  నవంబర్ (2)
    • ►  అక్టోబర్ (1)
    • ►  సెప్టెంబర్ (11)
    • ►  జులై (4)
    • ►  జూన్ (44)
    • ►  ఏప్రిల్ (6)
  • ►  2018 (47)
    • ►  నవంబర్ (18)
    • ►  జూన్ (2)
    • ►  మే (12)
    • ►  ఏప్రిల్ (7)
    • ►  మార్చి (4)
    • ►  ఫిబ్రవరి (4)
  • ►  2017 (11)
    • ►  నవంబర్ (1)
    • ►  అక్టోబర్ (7)
    • ►  సెప్టెంబర్ (2)
    • ►  ఏప్రిల్ (1)
  • ►  2016 (17)
    • ►  ఆగస్టు (4)
    • ►  జులై (1)
    • ►  జూన్ (1)
    • ►  మే (3)
    • ►  మార్చి (2)
    • ►  ఫిబ్రవరి (5)
    • ►  జనవరి (1)
  • ►  2015 (17)
    • ►  డిసెంబర్ (3)
    • ►  నవంబర్ (3)
    • ►  అక్టోబర్ (3)
    • ►  సెప్టెంబర్ (2)
    • ►  జూన్ (1)
    • ►  ఏప్రిల్ (3)
    • ►  ఫిబ్రవరి (2)
  • ►  2014 (35)
    • ►  డిసెంబర్ (6)
    • ►  నవంబర్ (1)
    • ►  సెప్టెంబర్ (4)
    • ►  ఆగస్టు (10)
    • ►  జులై (2)
    • ►  జూన్ (1)
    • ►  ఏప్రిల్ (1)
    • ►  మార్చి (5)
    • ►  ఫిబ్రవరి (4)
    • ►  జనవరి (1)
  • ►  2013 (17)
    • ►  డిసెంబర్ (1)
    • ►  అక్టోబర్ (2)
    • ►  సెప్టెంబర్ (2)
    • ►  ఆగస్టు (3)
    • ►  జులై (9)
  • ►  2012 (9)
    • ►  మార్చి (1)
    • ►  జనవరి (8)
  • ►  2011 (4)
    • ►  మే (1)
    • ►  ఏప్రిల్ (1)
    • ►  మార్చి (2)

నా గురించి

Sapthagiri
నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి

FLAG Counter

Flag Counter

ప్రముఖ పోస్ట్‌లు

  • ఇస్లాం తొలిప్రవక్త శివుడే...!
            ఓవైపు ఇస్లాం తీవ్రవాదులు కొత్తకొత్త పేర్లతో ఉగ్రవాద సంస్థలను నెలకొల్పుతూ ఇతర మతాలపై... ప్రధానంగా హిందూమతాన్ని టార్గెట్ చ...
  • ఇటు జల తరంగ వైభోగం.. అటు ఆధ్యాత్మిక వైభవం (జాగృతి కృష్ణా పుష్కర సంచిక)
    ఇటు జల తరంగ వైభోగం.. అటు ఆధ్యాత్మిక వైభవం                         - గోపగోని సప్తగిరి, 98850 86126.     భారత దేశంలోని ఇతర నదుల మాదిరిగానే...
  • Journalism & Media Glossary
    Journalism, like any profession, has its own language and specialist words which practitioners need to know. The following gl...
  • రాఖీ పండుగ అంటే రక్షా బంధనం.. అనుబంధాల ఆలింగనం
        సోదర సోదరీమణుల పవిత్ర బంధానికి అసలైన నిర్వచనం రక్షాబంధనం. రాఖీ పౌర్ణమి, రక్షా బంధన్‌, రాఖీల పండుగ ఎలా పిలిచినా.. అన్నా చెల్లెళ్ల...
  • ఓయు తేనెతుట్టెను కదిపిన కేసీఆర్‌ రహస్య వ్యూహంలో భాగమేనా?
        తెలంగాణ   ముఖ్యమంత్రి   కె .  చంద్రశేఖర్ ‌ రావు   మానసపుత్రికగా   చెప్పుకుంటున్న డబుల్ ‌   బెడ్ ‌ రూమ్ ‌   ప్లాట్స్ ‌   పథకం  ...
  • రూపాయి - పాపాయి
    ఇదీ వాస్తవం ! చేతులు కాలాక ఆకులు పట్టుకుందాం అదిగో పిలుస్తున్నారు ప్రధాని మన్మోహన్ ఇదే యూపీఏ తాజా నినాదమట కానీ చేతులు ఇప్పటికే బొబ...
  • (శీర్షిక లేని)
    పార్లమెంటు సమావేశాల్లోపే కేబినెట్‌ నోట్‌ కేబినెట్‌ నోట్‌పై వేగంగా కసరత్తు సాగుతోంది. పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపే నోట్‌ పూర్తయ్యే అవకాశా...
  • అమ్మ..!!?
    అంతరిక్షంలోకి దూసుకెళ్తున్న ఈ రోజుల్లోనూ అమ్మాయిలంటే వివక్ష తగ్గడం  లేదు. భ్రూణ హత్యలు ఒకవైపు.. పుట్టిన శిశువులను వదిలించుకునే  దుస్సంప్...
  • శ్రీ జయనామ సంవత్సర పంచాంగం, రాశి ఫలాలు (2014-15)
    పంచాంగ పీఠిక కలియుగ ప్రమాణము 4 లక్షల 32 వేల సంవత్సరములు. శ్వేత వరాహకల్పమునందలి ఏడవదైన వైవస్వత మన్వంతరములోని 28వ మహాయుగమునందలి కలియు...
  • సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు
              506 రోజుల పాటు సాగిన చెరకు తెరపడింది. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతికి సంకెళ్లు తెగిపోయాయి. తెలంగాణలో కొనసాగిన అనధికార నిషేధంపై సర్వోన్న...
వాటర్‌మార్క్ థీమ్. Blogger ఆధారితం.