8, మార్చి 2018, గురువారం

హైద‌రాబాద్ పారిశ్రామిక య‌వ‌నిక‌పై మ‌రో మ‌ధుర జ్ఞాప‌కం

                                 -  వ‌రల్డ్ ఐటీ కాంగ్రెస్ స‌ద‌స్సుతో పెరిగిన తెలంగాణ ప్ర‌తిష్ట‌

                                    
    హైద‌రాబాద్‌లో మొట్ట‌మొద‌టి సారిగా జ‌రిగిన వ‌ర‌ల్డ్ ఐటీ కాంగ్రెస్ స‌ద‌స్సుతో ఇన్ఫ‌ర్‌మేష‌న్ టెక్నాల‌జీలో తెలంగాణ ప్రతిష్ట పెరిగింది. హైద‌రాబాద్ పారిశ్రామిక యవనికపై మ‌రో మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది. కొత్త రాష్ట్రంలో తొలి ప్ర‌భుత్వం అంత‌ర్జాతీయ స్థాయి స‌ద‌స్సుల‌కు హైద‌రాబాద్‌ను వేదిక‌ను రూపొందించ‌డంలో ఇంకో మెట్టెక్కింది.  2018 తొలినాళ్ల‌లోనే ఐటీ కాంగ్రెస్ నిర్వ‌హ‌ణ‌తో తెలంగాణ ప్ర‌తిష్ట మ‌రోసారి ఖండాంత‌రాల‌కు తీసుకెళ్లేందుకు దోహ‌ద‌ప‌డింది.  అంతర్జాతీయ ఐటీ మార్కెట్‌లో మహానగరానికి ప్రత్యేక స్థానం దక్కింది. ఈ ప్రతిష్టాత్మక సదస్సు ద్వారా రాష్ట్రానికి బహుళ ప్రయోజనాలు లభించనున్నాయి. కొత్తగా వచ్చే ఐటీ సంస్థల ద్వారా భవిష్యత్తులో లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ఇక్కడున్న మౌలిక సదుపాయాలు, ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలతో ఐటీ రంగంలో పెట్టుబడిదారులకు ఆసక్తి పెరిగింది. 35దేశాల నుంచి తరలి వచ్చిన ఐటీ సంస్థల అధిపతులు, నిపుణులు, ప్రతినిధులు హైద‌రాబాద్‌లో మౌళిక స‌దుపాయాలు చూసి ఫిదా అయ్యారు. వచ్చే నాలుగేళ్ళలో 15 లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా శిక్షణ ఇచ్చేందుకు నాస్కామ్.. కేంద్ర‌ప్ర‌భుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 2022 నాటికి దేశవ్యాప్తంగా అన్ని మారుమూల గ్రామా లకు సైతం సాంకేతిక పరిజ్ఞానం చేరవేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నాస్కామ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.ఈ రంగంలో సుమారు లక్ష మందికి శిక్షణ ఇచ్చే లక్ష్యంతో హైదరాబాద్‌లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ నెలకొల్పేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ కూడా కుదిరింది. దీంతో వచ్చే రెండేళ్ళలో విరివిగా పెట్టుబడులు వస్తాయని భరోసా కుదిరింది.

    తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గడిచిన మూడున్నరేళ్ళలోనే ప్రభుత్వం ప్రకటించిన ఐటి పాలసీ, టి-హబ్‌తో రాష్ట్ర ప్రతిష్ట ఎంతో పెరిగింది. వేలకోట్ల రూపాయల పెట్టుబడులతో ఇక్కడ నెలకొల్పబడిన ఐటి కంపెనీల ద్వారా లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు మెరుగయ్యాయి. పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలు, రాయితీలు, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, మానవ వనరులు ప్ర‌పంచ దేశాల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. ఫిబ్రవరి 19 నుంచి మూడు రోజులపాటు జరిగిన ఐటి కాంగ్రెస్‌లో 30 దేశాల నుంచి సుమారు 500 మంది వివిధ ఐటి కంపెనీల అధిపతులు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారు 2,500 మంది ఐటిరంగ నిపుణులు పాల్గొన్నారు.   టాప్‌ 500 ఐటీ కంపెనీల నుంచి కనీసం 20 మంది సీఈఓలు, మరో 100 మంది ఎగ్జిక్యూటివ్‌లు వీరిలో ఉన్నారు. ఈ సదస్సులో 50కి పైగా చర్చాగోష్టిలు, మరో 50కి పైగా అత్యాధునిక ఐటీ రంగ ఉత్పత్తులపై ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. కేంద్ర సాంకేతిక విజ్ఞానశాఖ, నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీస్‌ (నాస్కామ్‌), ప్రపంచ ఐటీ సర్వీసుల అలయెన్స్‌ (డబ్ల్యుఐటిఎఫ్‌)ల సంయుక్త భాగస్వామ్యంతో ఈ సదస్సు విజయవంతంగా ముగిసింది. 

    మొదటిరోజు ప్రధాని నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సదస్సును ప్రారంభించి  ప్రసంగించారు. డిజిటల్‌ ఇండియా లక్ష్యాలను నెరవేర్చే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం, బాధ్యతలను గుర్తుచేశారు. అదే సమయంలో ఐటి సంస్థలకు ఇస్తున్న ప్రోత్సాహకాలు, తద్వారా టెక్నాలజీ అభివ ద్ధి, ఆ పరిజ్ఞానాన్ని గ్రామీణ ప్రాంతాలకు చేరవేసే అంశాలపై ప్రధాని మార్గనిర్దేశం చేశారు. అనంతరం కేంద్ర ఐటిశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌, నాస్కామ్‌ అధ్యక్షుడు ఆర్‌.చంద్రశేఖర్‌, కేంద్ర ఐటిశాఖ కార్యదర్శి ఏపి సహాని, తెలంగాణ‌ ఐటిశాఖ మంత్రి కేటీ రామారావు తదితరులు తమ ప్రసంగాలతో ఐటి ప్రపంచాన్ని ఆకట్టు కున్నారు. అత్యంత మేధో సంపత్తి కలిగిన ఐటిరంగ నిపుణులు తమ విధి నిర్వహణలో పని ఒత్తిడిని తట్టుకునే విధానంపై ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు జగ్గి వాసుదేవ్‌ గంటపాటు ప్రసంగించి ఐటి దిగ్గజాలను ఆనందపరవశంలో ముంచెత్తారు.

    కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం స్టార్టప్‌ స్టేట్‌గా ఎదుగుతుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స‌ద‌స్సు చివ‌రిరోజు ప్ర‌సంగంలో ఆశాభావం వ్య‌క్తం చేశారు.  విద్య, వైద్య, వ్యవసాయ శాఖల్లో టెక్నాలజీని ఉపయోగించుకొని ముందుకెళ్తున్నామని తెలిపారు. టెక్నాలజీతో ఎన్నో అద్భుతాలు చేయొచ్చని చెప్పారు. భారత్‌లో తొలిసారి టెలి మెడిసిన్‌ను ఇక్కడే ప్రారంభించామని గుర్తు చేశారు. టీ ఫైబర్‌తో ఇండ్లు, స్కూళ్లు, పిహెచ్‌సిలను అనుసంధానం చేస్తామని వెల్లడించారు. ఆరోగ్య రంగంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నాణ్యమైన వైద్యులు అందుబాటులో ఉన్నారన్నారు. గ్రామాల్లో కూడా నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నామని, ప్రతి ఆస్పత్రిలో మెరుగైన వైద్య సౌకర్యాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. రైతులకు ఉపయోగపడేలా టెక్నాలజీని తీర్చిదిద్దాలని సూచించారు. ఫిన్‌ల్యాండ్‌లో విద్యుత్‌తో పంటలు పండిస్తున్నారని, భవిష్యత్‌లో ఎలాంటి పరిస్థితుల్లోనైనా పంటలు పండించే సాంకేతికత వస్తుందని చెప్పారు. ఆహార కొరత ప్రపంచాన్ని వేధిస్తున్న ఒక సమస్య అని, కొత్త టెక్నాలజీతో ఆహార సమస్య లేకుండా చేయుచ్చు అని తెలిపారు. రాష్ట్రంలో పాఠశాలల డిజిటలైజేషన్‌ ప్రారంభించామని తెలిపారు. మైక్రోసాఫ్ట్‌తో కలిసి రాష్ట్రంలో ప్రతి పాఠశాల, కళాశాలలో విద్యార్థులకు కంటి పరీక్షలు చేయనున్నామని వెల్లడించారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు పోతున్నదని ఉద్ఘాటించారు. ప్రభుత్వంతో పాటు ప్రయివేటు సెక్టార్‌ కంపెనీలు కూడా సామాజిక బాధ్యత కింద ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రెండో దశ టీ హబ్ త్వరలో ఏర్పాటు చేస్తామన్న కేటీఆర్.. మహిళా పారిశ్రామిక వేత్తల కోసం మార్చి 8న వీ హబ్ ప్రారంభిస్తామన్నారు.

    సాంకేతిక పరిజ్ఞానాన్ని పరస్పరం మార్పిడి చేసుకునేందుకు తైవాన్‌లోని టాయుఆన్ నగరంతో తెలంగాణ‌ ప్రభుత్వం పరస్పర అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. పెట్టుబడులను ఆకట్టుకోవడం, పరిపాలనలో సాంకేతిక సహకారం, సార్టప్‌లకు మద్దతు, విద్యా సంస్థలతో ఒప్పందాలు, అత్యాధునిక సాంకేతిక ఉత్పత్తులపై ప్రదర్శనల ఏర్పాటు విషయంలో పరస్పర సహకారం కోసం మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.

    తెలంగాణలో డాటాసైన్స్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ఎక్సలెన్స్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు మంత్రి కేటీఆర్‌ సమక్షంలో నాస్కామ్‌ అంగీకారం తెలిపింది. ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఐటీ సదస్సులో రెండోరోజు రోబో సాఫియా ప్రసంగం, ఇంటర్వ్యూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతిష్టాత్మకమైన చౌమహాలా ప్యాలెస్‌లో ప్రతినిధులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ సంస్క తి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా సంగీత విభావరి వారిని అలరించింది. ఐటీ కాంగ్రెస్ చివ‌రిరోజున హెచ్‌ఐసీసీలో ప్రముఖ నటి దీపికా పదుకునే ప్రసంగం, కళాకారుల జానపద గేయాలు, ఆటలు, పాటలతో ఆనందోత్సాహాలతో సదస్సును ముగించారు.

    వచ్చే ఏడాది అక్టోబర్‌ 6వ తేదీ నుంచి 9 వరకు అర్మేనియాలో ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ 23వ సదస్సును నిర్వహిస్తామని డబ్ల్యూఐటీఎస్‌ఏ ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ ఐటీ, పరిశ్రమల ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా బాటన్‌ను అందుకున్నారు.
(జాగృతి వారపత్రిక కోసం 27.02.2018)
================

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి