26, జూన్ 2019, బుధవారం

వరుస ఎన్నికల కోలాహలం..

వరుస ఎన్నికల కోలాహలం..

వరుస ఎన్నికల కోలాహలం..
తెలంగాణలో వరుసగా ఎన్నికల పండుగలు వస్తున్నాయి. మొన్నటికి మొన్న డిసెంబర్‌లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు పూర్తయ్యాయి. అధికార టీఆర్‌ఎస్‌ అత్యధిక మెజార్టీతో మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. నిన్నటికి నిన్న లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాయి. ఫలితాలు ఇంకా వెలువడలేదు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నందున జాతీయ స్థాయిలో అన్ని దశల పోలింగ్‌ ముగిసిన తర్వాత మే 23వ తేదీన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే.. ఇదే సమయంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తంతు మొదలైంది.
తెలంగాణ వ్యాప్తంగా 538 జెడ్పీటీసీ స్థానాలు; 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ నున్నాయి. మొత్తం మూడు విడతల్లో పోలింగ్‌ ప్రక్రియ సాగనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. మే 6వ తేదీన తొలివిడత పోలింగ్‌, మే 10వ తేదీన మలి విడత పోలింగ్‌, మే 14వ తేదీన తుది విడత పోలింగ్‌ జరుగుతుంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు విడుదల చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మే 23వ తేదీన వెలువడనుండగా.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఎన్నికల ఫలితాలు మే 27వ తేదీన విడుదల చేయనున్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు పూర్తిస్థాయిలో ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో ఈవీఎంలతో నిర్వహించగా.. స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం బ్యాలెట్‌ పద్ధతిలో చేపడుతున్నారు. జెడ్పీటీసీ ఎన్నికకు గులాబీ రంగు బ్యాలెట్‌ పేపర్‌, ఎంపీటీసీ ఎన్నికకు తెలుపురంగు బ్యాలెట్‌ పేపర్‌ కేటాయించారు.
మూడుదశల పోలింగ్‌ ఇలా…
మొదటి విడత పోలింగ్‌ కోసం ఈనెల 22వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. మే 6వ తేదీన మొదటి విడత ఎన్నికకు పోలింగ్‌ నిర్వహించ నున్నారు. మొదటి విడతలో 212 జడ్పీటీసీలు, 2వేల 365 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా ఏప్రిల్‌ 26వ తేదీన రెండో దశ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేశారు. మే 10వ తేదీన రెండో విడత పోలింగ్‌ నిర్వహిస్తారు. ఈ విడతలో 199 జెడ్పీటీసీ, 2వేల 109 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ చేపట్టనున్నారు. ఇక ఏప్రిల్‌ 30న మూడోదశ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి తుదివిడత పోలింగ్‌ మే 14వ తేదీన జరగనుంది. ఈ విడతలో 127 జెడ్పీటీసీ, ఒక వెయ్యి 343 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. జెడ్పీటీసీ అభ్యర్థులు 4 లక్షల రూపాయల వరకు ఎన్నికల్లో ఖర్చు చేయవచ్చు. ఎంపీటీసీ అభ్యర్థులు గరిష్టంగా ఒక లక్షా 50 వేల రూపాయల వరకు ఖర్చు చేసేందుకు అవకాశం ఉంది.
స్థానిక సంస్థలకు జరుగుతున్న ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోబోతున్న మొత్తం ఓటర్ల సంఖ్య 1,56,11,474 మంది. వీరిలో పురుష ఓటర్లు 77,34,800 కాగా.. మహిళా ఓటర్లు 78,76,361, ఇతరులు 313 మంది ఉన్నారు. వీళ్లంతా ఈ మూడుదశల్లో జరిగే ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు మొత్తం 32,042 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌కు లక్షా 47వేల మంది సిబ్బందిని వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా 54 వేల మంది భద్రతా సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ప్రజలు ప్రత్యక్ష పద్ధతిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను ఎన్ను కుంటారు. ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీనీ, జెడ్పీటీసీ సభ్యులు జెడ్పీ చైర్మన్‌ను ఎన్నుకుంటారు.
ఒక జెడ్పీటీసీ, 40 ఎంపీటీసీ స్థానాలు మినహా…
రాష్ట్రంలో ఇటీవల కొత్తగా ఏర్పాటైన నాలుగు మండలాలకు కూడా రిజర్వేషన్లు ఖరారవ్వడంతో.. అక్కడ కూడా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. నిజామా బాద్‌ జిల్లాలోని చండూరు మండల జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. మోస్రా మండలం జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను జనరల్‌ క్యాటగిరీ చేశారు. అటు సిద్ధిపేట జిల్లా నారాయణ రావుపేట మండల జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు, మేడ్చల్‌ జిల్లా మూడుచింతపల్లి మండలం జెడ్పీటీసీ స్థానాన్ని జనరల్‌ క్యాటగిరీకి కేటాయించారు. ఇక ఎంపీపీ స్థానాన్ని బీసీ జనరల్‌కు కేటాయిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా ఏర్పాటైన ములుగు జిల్లా మంగపేట ప్రాంతంలో రిజర్వేషన్ల వివాదం కోర్టు పరిధిలో ఉన్నందున అక్కడ ఎన్నికలను వాయిదా వేశారు. మంగపేట జెడ్పీటీసీ స్థానంతో పాటు ములుగు జిల్లాలోని 14 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 40 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించట్లేదని ఎన్నికల కమిషనర్‌ తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లా… జడ్చర్లలోని 15 ఎంపీటీసీ స్థానాలకు వచ్చే ఏడాది మే నెలలో గడువు ముగుస్తుందని.. భద్రాచలం జిల్లాలోని బుర్గంపాడులో 11 ఎంపీటీసీ స్థానాలకు వచ్చే ఏడాది జులైతో పదవీకాలం ముగుస్తుందని.. ఆ స్థానాల్లో ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం లేదని స్పష్టం చేశారు.
ఆన్‌లైన్‌లోనూ నామినేషన్లు
ఎన్నికలకు సంబంధించిన ఓటరు జాబితా, రిజర్వేషన్ల ప్రక్రియ, బందోబస్తు, సిబ్బంది తదితర ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి చేశారు. స్థానికంగా రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు, ఎన్నికల సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు ఇప్పటికే పూర్తిచేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఎన్నికల సన్నద్ధతపైనా పూర్తి క్లారిటీతో నోటిఫికేష్‌ జారీచేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనూ నామినేషన్‌ దాఖలు చేసే అవకాశాన్ని ఈసారి ఎన్నికల సంఘం కల్పిస్తోంది. అయితే, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన అభ్యర్థులు.. ఓ కాపీని రిటర్నింగ్‌ అధికారికి తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.
లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ముగియగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతించా లని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇదివరకే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. భారత ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణకు సుముఖత వ్యక్తం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ఈ కోడ్‌ ముగిసేలోగానే స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వ హించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీచేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న స్థానిక సంస్థల పదవీకాలం వచ్చే జూన్‌లో ముగియనుంది.
జెడ్పీ చైర్మన్‌ పదవికి తీవ్రపోటీ
మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలను సైతం అధికార పార్టీ సీరియస్‌గా తీసుకున్న నేపథ్యంలో ఆ పార్టీలో జెడ్పీ చైర్మన్‌ పదవికి తీవ్ర పోటీ నెలకొన్న ట్లుగా తెలుస్తోంది. గత సంవత్సరం డిసెంబర్‌ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నాయకులు, టిక్కెట్‌ ఆశించి భంగపడ్డ ఆశావహులు, ఇతర పార్టీల నుంచి ఫిరాయించిన పలువురు సీనియర్‌ నేతలు సైతం తమకు జెడ్పీ చైర్మన్‌ పదవి ఇవ్వాలని పార్టీ అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు.
2014లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో జిల్లాల విస్తరణ కూడా ఒకటి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే నాటికి 10 జిల్లాలు మాత్రమే ఉండగా, 2016 కేసీఆర్‌ జిల్లాల సంఖ్య 31కి పెంచారు. ఇటీవల డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరో రెండు జిల్లాల (ములుగు, నారాయణపేట) ఏర్పాటుకు సైతం ముఖ్యమంతి ఆమోదం తెలిపారు. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం జిల్లాల సంఖ్య 33కి చేరింది. ప్రతి జిల్లాకు ఒక జెడ్పీ చైర్మన్‌ ఉంటారు. వీరిని జెడ్పీటీసీ సభ్యులు ఎన్నుకుంటారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది జెడ్పీటీసీలను గెలుపించుకొని రాష్ట్రంలోని అన్ని జెడ్పీ చైర్మన్‌ స్థానాలను దక్కించుకోవాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది.
ఒకప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ పదవులకు పెద్దగా పోటీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఏ పదవీ లేకుండా ఖాళీగా ఉండి ప్రజలకు దూరంగా ఉండటం కంటే ఏదో ఒక పదవిలో ఉండి ప్రజాక్షేత్రంలో ఉంటూ తమ అస్థిత్వాన్ని కాపాడుకోవాలని రాజకీయ నాయకులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
– సప్తగిరి.జి, 9885086126

గణనీయంగా తగ్గిన పోలింగ్‌ శాతం


గణనీయంగా తగ్గిన పోలింగ్‌ శాతం

గణనీయంగా తగ్గిన పోలింగ్‌ శాతం

గణనీయంగా తగ్గిన పోలింగ్‌ శాతం
– రాజధాని చరిత్రలోనే అత్యల్పం !
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ శాతం ఈసారి గణనీయంగా తగ్గిపోయింది. ఈ నెల 11వ తేదీన దేశవ్యాప్తంగా జరిగిన మొదటి విడత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించారు. 2014 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే.. 9శాతం తక్కువగా.. నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ శాతంతో పోలిస్తే.. ఏకంగా 13శాతం తగ్గిపోయింది. పోలింగ్‌ శాతాల్లో ఈ స్థాయిలో తేడా నమోదు కావడం వెనుక అనేక కారణాలున్నాయి.
ఐదేళ్ల క్రితం రాష్ట్రంలో అసెంబ్లీకి, లోక్‌సభకు ఒకేసారి జరిగిన ఎన్నికల్లో 69శాతం పోలింగ్‌ నమోదయ్యింది. 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 73.37శాతం పోలింగ్‌ నమోదయ్యింది. అయితే.. ఇప్పుడు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం.. పోలింగ్‌ 60.57 శాతానికే పరిమితమైంది. దీంట్లో ఖమ్మం నియోజకవర్గంలో అత్యధికంగా పోలింగ్‌ నమోదు కాగా.. రాష్ట్ర రాజధాని కేంద్రంలోని సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో అత్యల్ప పోలింగ్‌ నమోదయ్యింది.
ఎన్నికల కమిషన్‌ అధికారికంగా వెలువరించిన నివేదిక ప్రకారం చూస్తే.. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లోనూ గతంలో కంటే ఈసారి తక్కువ మంది ఓటేసినట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రవ్యాప్త నిష్పత్తి చూస్తే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు, ఇప్పటికీ కూడా చాలా వ్యత్యాసం నమోదయ్యింది. రాజధాని లోని రెండు నియోజకవర్గాల్లో 40శాతం లోపే పోలింగ్‌ నమోదు కావడం ఓటర్ల నైరాశ్యానికి అద్దం పట్టింది. హైదరాబాద్‌లో 39. 49శాతం, సికింద్రా బాద్‌లో 39.20శాతం మంది మాత్రమే ఓటేశారు. అంటే, వందలో దాదాపు 40మంది కూడా ఓటు హక్కును వినియోగించుకోలేదు. అదీ ఎక్కడో మారుమూల ప్రాంతంలోనో, రిమోట్‌ ఏరియాలోనో కాదు.. రాష్ట్ర రాజధాని నగరంలోని రెండు ప్రధాన నియోజకవర్గాలు ఇవి. అంతర్జాతీయ నగరంగా పేరొందిన హైదరాబాద్‌ మహానగరంలో నివసిస్తున్న ఓటర్లు మరీ ఇంత హీనస్థితిలో ఓటుహక్కును వినియోగించుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇక పోలింగ్‌ శాతం పక్కనబెడితే.. ఎన్నికలు మాత్రం ప్రశాంతంగా ముగిశాయి. ఎక్కడా ఏ చిన్న సంఘటన కూడా తలెత్తకుండా, ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పోలింగ్‌ ముగిసింది. దీంతో అధికార యంత్రాంగం, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే, ఒకరకంగా రాష్ట్రంలో దాదాపు ఎన్నికల వాతావరణమే కనిపించలేదు. సాధారణంగా ఎన్నికలంటే నెలరోజుల ముందు నుంచే హడావుడి.. ప్రచార పర్వం.. పోటాపోటీ సభలు, ర్యాలీలు వేడిని పెంచేవి. కానీ.. ఈసారి మాత్రం పెద్దగా ప్రచారం పర్వం సాగలేదు. అడపాదడపా సభలు, ప్రచారాలు తప్ప ఇంటింటి ప్రచారాలు దాదాపుగా కనిపించలేదు.
రాష్ట్రంలో గత డిసెంబర్‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లు ఉత్సాహం చూపించారు. గతంలో కన్నా ఎక్కువగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. అభ్యర్థుల ప్రచారం ¬రెత్తించింది. కానీ.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు కావడం, నియోజకవర్గాల సంఖ్యా తక్కువే కావడం ఓటింగ్‌ శాతం తగ్గడానికి కారణమన్న వాదన లున్నాయి. అంతేకాకుండా.. లోక్‌సభ నియోజక వర్గాల పరిధి ఎక్కువగా ఉండటం.. అభ్యర్థులు తమ నియోజకవర్గం మొత్తం తిరిగే అవకాశం లేకపోవడం, ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటం వంటి పరిణామాలు కూడా ఓటింగ్‌ శాతంపై ప్రభావం చూపాయి. ఇందులోనూ పల్లెల్లో ఉత్సాహంగా ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల బాట పట్టగా.. నగరాల్లోనే పోలింగ్‌ శాతం భారీగా తగ్గింది. నగర ఓటర్లు ఓటేసేందుకు అంతగా ఉత్సాహం చూపించలేదు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నియోజకవర్గాల్లో చరిత్రలోనే తొలిసారిగా అతితక్కువ పోలింగ్‌ శాతం నమోదయ్యింది.
భానుడి ప్రభావం
ఎండ తీవ్రత కూడా పోలింగ్‌పై ప్రభావం చూపింది. కొద్దిరోజులుగా ఎండలు మండిపోతుండ టంతో నగరాల్లో ఉండే ఓటర్లు ఓటు వేసేందుకు అంతగా ఉత్సాహం చూపించలేదు. పైగా నగరాలు, పట్టణాల్లోనే ఎక్కువగా నివసించే ప్రైవేటు రంగాల ఉద్యోగులు.. ఓటు వేసేందుకు ఆసక్తి కనబరచలేదు. హైదరాబాద్‌ శివార్లలోని పోలింగ్‌ కేంద్రాలైతే ఓటర్లు లేక బోసిపోయాయనే చెప్పాలి. ఈ పరిస్థితి పోలింగ్‌ సిబ్బందిని సైతం నిరాశకు గురిచేసినట్లుగా తెలుస్తోంది. అయితే.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఓటర్లు ఎండ తీవ్రత తగ్గిన తర్వాత పోలింగ్‌ కేంద్రాల బాట పట్టడం కనిపించింది. పోలింగ్‌ వాస్తవానికి ఐదు గంటల వరకే కొనసాగినా.. కొన్ని కేంద్రాల్లో ఆ సమయంలోగా వచ్చిన ఓటర్లు రాత్రి ఎనిమిది గంటల దాకా తమ ఓటుహక్కును వినియోగించు కున్నారు.
నగరం ఖాళీ.. ఖాళీ..
ఆంధ్రప్రదేశ్‌లో ఓటుహక్కు ఉన్నవాళ్లు.. ఓటేసేందుకు తమ స్వరాష్ట్రం వెళ్లడం కూడా హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి నియోజక వర్గాల్లో పోలింగ్‌ శాతం భారీగా తగ్గిపోవడానికి ప్రధాన కారణంగా నిలిచింది. ఏపీలో ఓటు హక్కు కలిగి ఉండి హైదరాబాద్‌లో నివసిస్తున్న దాదాపు 13 లక్షల మంది వారి సొంత ఊళ్లో ఓటు వేసేందుకు వెళ్లారని లెక్కగట్టారు. దీంతో ఈ ప్రభావం పోలింగ్‌ శాతంపై పడింది.
ఇక పోలింగ్‌ సరళి ప్రధాన పార్టీల్లో గెలుపు అంచనాలపై సందిగ్ధానికి కారణమైంది. ఓటర్లు ఎటువైపు మొగ్గారో తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది. పోలింగ్‌శాతం తగ్గడం అధికార పార్టీకి మైనస్‌ అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పోలింగ్‌ కేంద్రానికి ఓటర్లను రప్పించడంలో అన్ని రాజకీయ పార్టీలు విఫలమయ్యాయని చెబుతున్నారు. ఈ క్రమంలోనే పోలింగ్‌శాతం తగ్గడంపై అన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అందరి దృష్టి అటువైపే!
దేశంలోనే అత్యధికంగా 185 మంది అభ్యర్థులు బరిలో దిగిన నిజామాబాద్‌ లోక్‌సభ నియోజక వర్గంలో గంటసేపు అదనంగా సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది. ఆ లోపు క్యూలైన్లలో నిలుచున్న వారికి ఓటేసే అవకాశం కల్పించారు. నిజామాబాద్‌ పోలింగ్‌ను ఛాలెంజ్‌గా తీసుకున్నామని ఎన్నికల అధికారులు చెప్పారు. ఉన్న వనరులను వినియోగించుకొని భారీస్థాయిలో అభ్యర్థులు పోటీ పడినా.. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించామని తెలిపారు. దీన్ని గిన్నిస్‌ రికార్డు పరిశీలనకు నివేదిస్తున్నట్లు ప్రకటించారు.
గెలుపుపై ధీమా!
మరోవైపు.. పోలింగ్‌ ముగియడంతో రాజకీయ నాయకులు ఎవరికి వారు గెలుపుపై ధీమాగా ఉన్నట్లుగా తెలుస్తోంది. పోలింగ్‌ శాతం తగ్గడాన్ని గమనిస్తే అధికార పార్టీ పట్ల ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టమవుతోందని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు తప్పకుండా అత్యధిక సీట్లు కట్టబెడతారని ఆ పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్‌ శాతం తగ్గినా.. పెరిగినా ప్రజలు టీఆర్‌ఎస్‌ అమలుపరచే సంక్షేమ పథకాల పట్ల సంతృప్తికరంగా ఉన్నారని.. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు చీకటి రోజులొచ్చాయని.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర ఓటమి పాలవుతుందని, మరోసారి రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరబోతోందని టీఆర్‌ఎస్‌ భరోసాగా ఉంది.
……………………………………………………….
నియోజకవర్గాల వారీగా నమోదైన పోలింగ్‌శాతం
………………………………………………….
లోక్‌సభ                     2014         2019
ఆదిలాబాద్‌                75.4%       66.76%
భువనగిరి                  81.2%       68.25%
చేవెల్ల                        60.2%      53.80%
హైదరాబాద్‌               53.3%      39.49%
కరీంనగర్‌                  72.6%      68%
ఖమ్మం                     82.1%      67.96%
మహబూబాబాద్‌       81.0%      59.9%
మహబూబ్‌నగర్‌        71.5%      64.99%
మల్కాజ్‌గిరి              50.9%      42.75%
మెదక్‌                      77.5%       68.60%
నాగర్‌కర్నూల్‌           75.1%        57.12%
నల్గొండ                    79.5%       66.11%
నిజామాబాద్‌            69.1%       54.20%
పెద్దపల్లి                    71.7%        59.24%
సికింద్రాబాద్‌             53.0%       39.20%
వరంగల్‌                   76.4%       60%
జహీరాబాద్‌              75.8%      67.80%
తెలంగాణ వ్యాప్తంగా   69%        60.57%
……………………………………………
– సప్తగిరి.జి, 9885086126

సంచలన ప్రకటనలు ఓట్లు రాలుస్తాయా?


సంచలన ప్రకటనలు ఓట్లు రాలుస్తాయా?

సంచలన ప్రకటనలు ఓట్లు రాలుస్తాయా?

సంచలన ప్రకటనలు ఓట్లు రాలుస్తాయా?
సమయం చూసి, సందర్భాన్ని బట్టి జనం నాడిని పట్టుకొని ప్రసంగించడంలో దిట్టగా పేరున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచార సభల్లో బాంబుల మీద బాంబులు పేల్చారు. అధికార వర్గాల్లో కలకలం సృష్టించారు. రెవెన్యూ వ్యవస్థనే రద్దు చేస్తామని, అవసరమైతే పేరును మారుస్తామని ప్రకటించారు. అంతేకాదు కలెక్టర్‌ల వ్యవస్థ కూడా అవసరం లేదని.. కలెక్టర్‌ పేరును జిల్లా పాలనాధి కారిగా మారుస్తామన్నారు. తానే ప్రతి జిల్లాలో ప్రజా దర్బార్‌లు నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు.
దేశమే ఆశ్చర్యపోయేలా కొత్త చట్టాన్ని తెలంగాణలో అమలులోకి తీసుకొస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాక.. జూన్‌ తర్వాత కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి తీసుకు రానున్నామని చెప్పారు. ప్రతి గుంట లెక్క తేలేలా రైతులకు పూర్తి యాజమాన్య హక్కు కల్పించ బోతున్నామని తెలిపారు. గిరిజనులు, పోడు భూముల సమస్యలు పరిష్కారం కావాలని అన్నారు. భూ సమస్యల పరిష్కారానికి రైతులు ఎవరికీ లంచం ఇవ్వొద్దని సూచించారు. పహాణి నకలు మార్చేశా మన్నారు. మొత్తానికి లంచం ఇచ్చే పరిస్థితి లేకుండా కొత్త రెవెన్యూ చట్టం తెస్తామని కేసీఆర్‌ చెప్పారు. తొలుత నిర్మల్‌ జిల్లా కేంద్రంలో జరిగిన సభలో కేసీఆర్‌ ఈ ప్రకటన చేశారు. అయితే.. ఈ ప్రకటన రెవెన్యూ వర్గాల్లో పెనుచర్చకు దారితీసింది. ఆ విభాగంలో భయాందోళనకు బీజం వేసింది.
అంతకుముందే మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ రైతు కుటుంబానికి సంబంధించిన భూ వివాదంపై కేసీఆర్‌ స్పందించారు. ఎన్నడూ లేని విధంగా.. రైతుకు నేరుగా ఫోన్‌చేసి మాట్లాడారు. క్షేత్రస్థాయిలో తాను పడుతున్న ఇబ్బందులను పేర్కొంటూ ఓ రైతు.. ఫేస్‌బుక్‌లో వీడియోను పోస్ట్‌ చేస్తే.. దానికి స్పందించిన సీఎం కేసీఆర్‌.. నేరుగా ఆ రైతుకు ఫోన్‌ చేసి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. స్వయంగా జిల్లా కలెక్టర్‌ను రైతు ఇంటికి పంపించి సమస్యను పరిష్కరించేలా ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరిణామం చర్చనీయాంశమైంది. అయితే ఆ రైతుతో మాట్లాడుతున్న సమయంలో రెవెన్యూ విభాగంలో నెలకొన్న అవినీతిపై సీఎం పలు విమర్శలు చేశారు. దానిపై రెవెన్యూ అధికారులు, ఉద్యోగ సంఘాలు నిరసన ప్రకటించాయి. వర్క్‌ టు రూల్‌ చేపట్టాయి. కేసీఆర్‌ వైఖరిపై బహిరంగంగానే తమ అసంతృప్తి వెళ్లగక్కారు రెవెన్యూ అధికారులు.
నిర్మల్‌ సభలో పై ప్రకటన చేసిన తర్వాత మరికొన్ని సభల్లోనూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేసీఆర్‌. రాష్ట్రంలో గుంటభూమి కూడా వివాదాస్పదం కాకుండా సంపూర్ణంగా భూప్రక్షాళన చేయాలని నిర్ణయించామన్నారు. రెవిన్యూశాఖనే ప్రక్షాళన చేస్తానని.. అసలు ఆ పేరే మార్చివేస్తానని కేసీఆర్‌ ప్రకటించారు. రెవిన్యూ కలెక్షన్‌లే లేనప్పుడు కలెక్టర్‌ వ్యవస్థ కూడా అక్కరలేదని కలెక్టర్‌ పేరును జిల్లా పరిపాలన అధికారిగా మారుస్తామన్నారు. తనకు ఎవరిపైనా నమ్మకం లేదని అవసరమైతే జిల్లాకు రెండు, మూడు రోజులు కేటాయించి తానేస్వయంగా ప్రజా దర్బార్‌ నిర్వహిస్తానని కేసీఆర్‌ వెల్లడించారు. ప్రతి రైతుకు అది పోడుభూమి అయినా, వారసత్వంగా సంక్రమించిందైనా మరేరకమైన భూమి అయినా కంక్లూజివ్‌ టైటిల్‌ను అందజేస్తానని ప్రకటించారు.
అయితే, ఇక్కడ మనం ఒక విషయం గమనించాల్సి ఉంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మొదటి సారి అధికారం చేపట్టిన తర్వాత పెద్ద ఎత్తున భూముల ప్రక్షాళన చేపట్టింది. ఇందులో భాగంగానే రైతుల పట్టాదారు పాసుపుస్తకాలను డిజిటలైజేషన్‌ చేసింది. ఈ క్రమంలోనే రెవెన్యూ అధికారులు తమ చేతివాటం చూపించి అక్రమ వసూళ్లకు పాల్పడి నట్లుగా తెలుస్తోంది. కొంతమంది రెవెన్యూ అధికారులు అవినీతి సొమ్ముకు ఆశపడి డిజిటలైజేషన్‌ పేరుతో వేల సంఖ్యలో పట్టాలను రికార్డుల్లోంచి తొలగించినట్లుగా అప్పట్లో కొన్ని వార్తలు వినిపించాయి. దీంతో రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. పాసుపుస్తకంలో తప్పులు దొర్లాయని ఒకరు, తమ భూమిని రికార్డుల నుంచి తొలగించారని మరొకరు ఇలా.. ఎందరో రైతులు ఎమ్మార్వో ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగు తున్నారు. అసలు దీనంతటికి కారణం కేసీఆర్‌ ప్రభుత్వం చేపట్టిన భూ ప్రక్షాళనే అని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. భూ ప్రక్షాళన సమయం లోనే ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకొని ఉండి ఉంటే రైతులకు ఇలాంటి సమస్యలు తలెత్తేవి కావని చెబుతున్నారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారుల వాదన మరో రకంగా ఉంది. భూ ప్రక్షాళన సమయంలో తాము శ్రమకు మించి.. నిద్రాహారాలు మానుకొని కష్టించి పనిచేశామని.. పాసుపుస్తకాలను డిజిటలైజేషన్‌ చేసే క్రమంలో పూర్తిగా సాంకేతికతపైనే ఆధారపడటం వల్ల కొన్ని తప్పులు దొర్లి ఉండవచ్చని.. అంతేకాని తాము అవినీతి సొమ్ముకి ఆశపడి ఉద్దేశపూర్వకంగా ఏ తప్పులూ చేయలేదని చెబుతున్నారు. తమ కష్టానికి గుర్తింపు ఇవ్వకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రే రెవెన్యూ శాఖపై ఆరోపణలు చేయడాన్ని వారు తీవ్రంగా తప్పుపట్టారు.
ఇక కేసీఆర్‌ ఇటీవల చేసిన మరో సంచలన ప్రటకన.. జిల్లా కలెక్టరు పేరును జిల్లా పరిపాలనాధి కారిగా మార్చడం. ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లుగా సేవలందిస్తున్న వారు కేంద్రం నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌ ద్వారా ఉత్తీర్ణులైన ఐఏఎస్‌ అధికారులు.. అంటే వారి అధికారాల్ని గానీ.. అధికార హోదాని గాని మార్చడం అనేది పూర్తిగా కేంద్రం పరిధిలోని అంశం. రాష్ట్రాలకు ఎటువంటి అధికారాలు ఉండవు. ఇది అందరికీ తెలిసిన విషయమే.. కానీ కేసీఆర్‌ కలెక్టర్‌ పేరును మారుస్తానని చెప్పడం ప్రజా స్వామ్యాన్ని అవహేళన చేసి ప్రజల్ని గందరగోళంలోకి నెట్టడమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో కేసీఆర్‌ మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తనకు ఓటు వేయలేదని, సామాన్య, మధ్యతరగతి ఓటర్లే తెలంగాణ రాష్ట్రసమితికి అండగా నిలబడ్డారని, వాళ్ల ఓట్ల వల్లే గెలిచామని ప్రకటించి మరో చర్చకు కారణ మయ్యారు. అంతేకాదు.. నిర్మల్‌ సభలోనే మరో వివాదాస్పద ప్రకటన చేశారు కేసీఆర్‌. తెలంగాణకు ఆదిలాబాద్‌ జిల్లా కశ్మీర్‌ లాంటిదన్నారు. ఈ వ్యాఖ్యలు కూడా రాజకీయంగా చర్చకు దారితీశాయి.
మరోవైపు.. కేంద్రంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ నినాదాన్ని ఎత్తుకున్న కేసీఆర్‌ కాంగ్రెస్‌, బీజేపీలపై తనదైన శైలిలో విమర్శల వర్షం కురిపించారు. కనీసం ఇప్పటిదాకా ఓ రూపు కూడా లేకున్నా ఫెడరల్‌ ఫ్రంట్‌ వస్తే జాతీయస్థాయిలోనూ టీఆర్‌ఎస్‌దే హవా అని జనంలో ఉత్తేజం నింపే ప్రయత్నం చేశారు. దేశానికి దిక్సూచిలా తెలంగాణను రూపొందిస్తామని ప్రకటించారు.
అయితే.. ఇటీవల కాలంలో సీఎం కేసీఆర్‌కు రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులు చిత్తుగా ఓడిపోయారు. ఆ పరిణామం టీఆర్‌ఎస్‌కు తగ్గిన ఆదరణకు నిదర్శనంగా నిలిచిందని రాజకీయ చర్చలు నడిశాయి. అయితే… ఓటర్లు కొట్టిన ఆ దెబ్బ నుంచి బయటపడేందుకు మంచిర్యాల జిల్లాకు చెందిన రైతుతో ఫోన్లో మాట్లాడి పత్రికల్లో పతాక శీర్షికల్లో నిలిచారు. ఆ రైతు సమస్యను ఒక్కరోజులోనే పరిష్కరించారు. కానీ.. మరుసటిరోజే.. ఎదుటి పక్షానికి చెందిన వాళ్లు ఆడియో రికార్డును సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి.. కేసీఆర్‌ ఏకపక్షంగా వ్యవహరించిన తీరును ఎండగట్టారు. ఒకరి వాదనే విని అదే న్యాయమని ఎలా నిర్ధారిస్తారని నేరుగా సీఎంనే ప్రశ్నించారు. ఇలా.. ఈ పరిణామం కూడా కేసీఆర్‌కు బూమరాంగ్‌ అయ్యిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
ఈ రెండు పరిణామాల తర్వాత క్షేత్రస్థాయిలో ప్రచారం అత్యావశ్యకమని గ్రహించిన కేసీఆర్‌.. ఎన్నికల వేళ తెలంగాణ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు సాగించారు. ఆరు రోజుల్లో 13 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 11 సభలు నిర్వహిం చేందుకు ప్రణాళికలు రూపొందించారు. అయితే.. హైదరాబాద్‌లో మాత్రం కేసీఆర్‌ తలపెట్టిన సభను రద్దు చేసుకున్నారు. ఆశించినంత జనం రాలేదన్న కారణంగా ఆ సభను రద్దు చేసినట్లుగా తెలుస్తోంది. కారు.. సారు.. పదహారు నినాదంతో రాష్ట్రంలోని 16 లోక్‌సభ స్థానాల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా రూపొందించుకున్న కార్యాచరణ మేరకు కేసీఆర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే అంతటా తానై ప్రచార సభల్లో పాల్గొన్నారు. కానీ.. జనం నాడి ఎలా ఉండబోతోందో మే 23 దాకా ఆగితే గానీ తేలే పరిస్థితి లేదు.
– సప్తగిరి.జి, 9885086126

ఆత్మవిశ్వాసమా? అతివిశ్వాసమా?


ఆత్మవిశ్వాసమా? అతివిశ్వాసమా?

ఆత్మవిశ్వాసమా? అతివిశ్వాసమా?

ఆత్మవిశ్వాసమా? అతివిశ్వాసమా?
అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన సంతోషంలో ఉన్న కేసీఆర్‌ ఇప్పుడు.. లోక్‌సభ ఎన్నికల్లో తనదైన జోరును కొనసాగిస్తు న్నారు. మాటల దాడిని పెంచారు. ఎదుటి పార్టీలపై విమర్శల స్థాయికి కూడా పదును పెంచారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో కీలక పార్టీ అయిన బీజేపీపై తనదైన శైలిలో విమర్శలు కురిపిస్తున్నారు. మరో అడుగు ముందుకేసి అసలు కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే చక్రం తిప్పబోతు న్నాయని, వాటికి తానే నేతృత్వం వహిస్తానని కూడా చెప్పుకుంటున్నారు.
ఉద్యమకాలంలో కేసీఆర్‌ ప్రసంగాలకు జనం నుంచి భారీగా రియాక్షన్‌ ఉండేది. భావోద్వేగ అంశం కావడంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సాగుతున్న పోరాటం సమయంలో కేసీఆర్‌ తనదైన భాషలో విరుచుకుపడేవారు. తెలంగాణ మాండలికంలో ఉద్వేగంగా చేసే ప్రసంగం జనాల్లోకి నేరుగా చొచ్చుకుపోయేది. రెచ్చగొట్టే ప్రసంగాలతో ముఖ్యంగా యూత్‌లో ఫాలోయింగ్‌ సంపాదించు కున్నారు. అయితే.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలిసారిగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ తెచ్చిన పార్టీగా జనం ప్రత్యేక రాష్ట్ర పగ్గాలు కేసీఆర్‌కు అప్పగించారు. ఆ తర్వాత ఒక ముఖ్యమంత్రిగా హుందాగా ప్రసంగించే ప్రయత్నాలు చేసినా.. అప్పుడప్పుడూ ఉద్యమ కాలంనాటి ప్రసంగం ఆనవాళ్లు కూడా కనిపించేవి. అయితే.. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విజయం సొంతం చేసుకున్న తర్వాత.. మిగిలిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీవైపు తిప్పుకొనే ప్రయత్నాలు విజయవంతంగా సాగిస్తున్న నేపథ్యంలో.. అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌ బలం సెంచరీ దాటి పోవడంతో కేసీఆర్‌లో ఉత్సాహం మరింత పెరిగింది. ఒక్క కేసీఆర్‌ మాత్రమే కాదు.. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా మాటల దాడికి పదును పెంచారు.
ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల ప్రచారం మారుమోగి పోతోంది. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్న కేసీఆర్‌, కేటీఆర్‌ తమకు ఎదురే లేదన్న ధీమాతో ప్రసంగాలు సాగిస్తున్నారు. విపక్షాలతో పాటు.. కేంద్రంలో పాలక పక్షమైన బీజేపీపైనా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ పైనా నేరుగా విమర్శలు కురిపిస్తు న్నారు. అంతేకాదు.. విమర్శల స్థాయి కాస్త శ్రుతి మించుతోందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశంలో ప్రాంతీయ పార్టీలదే హవా అని, ఫెడరల్‌ ఫ్రంట్‌లో టీఆర్‌ఎస్‌దే కీలకపాత్ర అని చెప్పుకుంటున్నారు. కానీ.. ఎన్నికల ప్రచారం తెలంగాణ రాష్ట్రం దాటిపోవడం లేదు. తెలంగాణలో తప్ప మరెక్కడా ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ గానీ కేటీఆర్‌ గానీ పాల్గొనడం లేదు. కేవలం తెలంగాణలోని 16 లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సంఖ్యతో ఏం చేయలేమన్న సందేహం అవసరం లేదని, దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలన్నీ తమతోనే కలిసి వస్తాయని జనంలో నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా తెలంగాణలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనడాన్ని ప్రస్తావిస్తూ.. విమర్శలు చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని బీజేపీ పగటి కలలు కంటోందని కూడా ఎద్దేవా చేస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. ఈ ఐదేళ్లలో దేశానికి బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు.. ప్రధాని మోదీ స్థాయిని దిగజార్చేలా విమర్శలు చేస్తున్నారు. నరేంద్రమోదీ మాట్లాడినట్లు ఓ గ్రామంలో ఉండే సర్పంచ్‌ కూడా మాట్లాడరంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ స్థాయి ఏంటో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శమని ఎటాక్‌ చేస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో 118 సీట్లలో బీజేపీ ఒక్క స్థానంలో మాత్రమే గెలిచిందని, 103 స్థానాల్లో డిపాజిట్‌ దక్కలేదని ఆరోపించారు.
అంతేకాదు.. సర్జికల్‌ దాడుల గురించి కేసీఆర్‌ సరికొత్త వాదన తెరపైకి తెచ్చారు. బీజేపీ ప్రభుత్వం సర్జికల్‌ దాడుల గురించి గొప్పగా చెప్పుకుంటుందని విమర్శించారు. యూపీఏ హయాంలో తాను కేంద్రంమంత్రిగా ఉన్న సమయంలో 11 సార్లు సర్జికల్‌ దాడులు జరిగాయంటున్నారు. సర్జికల్‌ దాడులను మోదీ తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని కేసీఆర్‌ ఆరోపించారు. ఇటీవల జరిగిన మెరుపుదాడుల్లో 300 మంది ఉగ్రవాదులు చనిపోయారంటూ డొల్ల ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ చీఫ్‌ మసూద్‌ అజర్‌ అక్కడ చీమ కూడా చావలేదంటు న్నాడని ఎద్దేవా చేశారు. ‘ఇలాంటి ప్రచారాలతో మీరు ఓట్లు అడుగుతారా? ఇదేనా దేశాన్ని నడిపించే తీరు’ అని మోదీని ఉద్దేశించి కేసీఆర్‌ ప్రశ్నించారు.
ఇక.. హిందూత్వ అంశాన్ని కూడా వివాదం చేసేలా కేసీఆర్‌ ప్రసంగాలు సాగుతున్నాయి. మొన్నటికి మొన్న నిజమైన హిందువులం తామే అని ప్రకటించిన ఆయన.. మరుసటిరోజు హిందూగాళ్లు – బొందూగాళ్లు ఓట్లడిగేందుకు వస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ అంశంపై విమర్శల దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు. తామే హిందువులమని గొప్పలు చెప్పుకోవడం కాదని.. బీజేపీ వారు చెబితేనే ఇళ్లల్లో ప్రజలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారా? చనిపోతే తద్దినాలు పెట్టుకుంటారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు.. కేసీఆర్‌ కుమారుడు, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా అదేస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఢిల్లీ గులాములు కావాలో తెలంగాణ గులాబీలు కావాలో నిర్ణయించు కోవలసింది ప్రజలేనంటూ ఎదుటిపార్టీలపై విమర్శల దాడిని తీవ్రం చేశారు. 16 లోక్‌సభ స్థానాల్లో గెలిపిస్తే ఢిల్లీ మెడలు వంచుతామంటూ తనదైన రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ, ఒడిశాలో నవీన్‌ పట్నాయక్‌, యూపీలో మాయావతి, అఖిలేష్‌యాదవ్‌, ఏపీలో జగన్‌ తమకే మద్దతు ఇస్తున్నారని ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరో అడుగు ముందుకేసి.. బీజేపీ సాగిస్తున్న చౌకీదార్‌ క్యాంపెయిన్‌ను కూడా ఎద్దేవా చేసేలా ప్రసంగిస్తు న్నారు. ఈ దేశానికి కావాల్సింది చౌకీదారో.. టేకీదారో కాదని.. ఒక జోర్దార్‌, ఒక ధమ్‌దార్‌, ఒక ఇమామ్‌దార్‌.. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దేశానికి ఒక కేసీఆర్‌ కావాలంటూ కేటీఆర్‌ పేర్కొంటున్నారు.
అయితే.. కేటీఆర్‌ ఓటర్లను తప్పుదారి పట్టిస్తున్నారని బీజేపీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి దత్తాత్రేయ ప్రకటించారు. కేటీఆర్‌ ఎన్నికల ప్రచారాల్లో చెబుతున్న మమత బెనర్జీ, నవీన్‌ పట్నాయక్‌, మాయావతి, అఖిలేశ్‌ యాదవ్‌, జగన్‌ వంటి నేతల్లో అత్యధికులు మోదీ ప్రధానిగా ఏర్పడే ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతిచ్చే అవకాశం ఉందని చెప్పారు. హిందుత్వ అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. యూపీఏ ప్రభుత్వంలో తాను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు 11 సార్లు మెరుపు దాడులు జరిగాయన్న కేసీఆర్‌ వ్యాఖ్యలను ఆక్షేపించారు. ‘కేంద్రమంత్రిగా ఒక్క కేబినెట్‌ సమావేశానికి వెళ్లలేదు. పార్లమెంట్‌లో ఒక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. ఆ దాడుల గురించి నీకేం తెలుసు? భాజపా నేతలు దొంగ హిందువులు అంటున్నావు. నువ్వు హిందుత్వవాదివి అయితే అయోధ్యలో రామమందిర నిర్మాణం కట్టాలా? వద్దా? నీ వైఖరి చెప్పు. ఇంకా నీ మాటల గారడి చెల్లదు’ అంటూ దత్తాత్రేయ ధ్వజమెత్తారు. తెలంగాణ అభివృద్ధిని ప్రధాని విస్మరించారన్న తెరాస వ్యాఖ్యల్లో నిజం లేదని, తెలంగాణకు మోదీ ప్రభుత్వం రూ.2.25లక్షల కోట్లు ఇవ్వడం అభివృద్ధి కాదా? అని ప్రశ్నించారు. ‘తెరాసను 16 సీట్లలో ఎందుకు గెలిపించాలి. కేంద్రంలో వచ్చేది భాజపా ప్రభుత్వం. భాజపా అభ్యర్థులను 16 సీట్లలో గెలిపిస్తే ఎవరి మెడలూ వంచాల్సిన అవసరం లేకుండా కేంద్రం నుంచి అత్యధిక నిధులు తెస్తాం’ అని దత్తాత్రేయ భరోసా ఇచ్చారు.
అయితే.. ప్రస్తుత ఎన్నికల్లో ఓ వైపు కేసీఆర్‌, మరోవైపు కేటీఆర్‌ సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో చూపిస్తున్నది ఆత్మవిశ్వాసం కాదని, అతివిశ్వాసం అని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఆ అతివిశ్వాసం కాస్తా బోల్తాకొట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
– సప్తగిరి.జి, 9885086126