గణనీయంగా తగ్గిన పోలింగ్ శాతం
– రాజధాని చరిత్రలోనే అత్యల్పం !
……………………………………………
– సప్తగిరి.జి, 9885086126
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ శాతం
ఈసారి గణనీయంగా తగ్గిపోయింది. ఈ నెల 11వ తేదీన దేశవ్యాప్తంగా జరిగిన మొదటి
విడత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్
నిర్వహించారు. 2014 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే.. 9శాతం తక్కువగా.. నాలుగు
నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతంతో పోలిస్తే.. ఏకంగా
13శాతం తగ్గిపోయింది. పోలింగ్ శాతాల్లో ఈ స్థాయిలో తేడా నమోదు కావడం వెనుక
అనేక కారణాలున్నాయి.
ఐదేళ్ల క్రితం రాష్ట్రంలో అసెంబ్లీకి,
లోక్‌సభకు ఒకేసారి జరిగిన ఎన్నికల్లో 69శాతం పోలింగ్ నమోదయ్యింది. 2018
డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 73.37శాతం పోలింగ్ నమోదయ్యింది.
అయితే.. ఇప్పుడు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం.. పోలింగ్ 60.57
శాతానికే పరిమితమైంది. దీంట్లో ఖమ్మం నియోజకవర్గంలో అత్యధికంగా పోలింగ్
నమోదు కాగా.. రాష్ట్ర రాజధాని కేంద్రంలోని సికింద్రాబాద్ లోక్‌సభ
నియోజకవర్గంలో అత్యల్ప పోలింగ్ నమోదయ్యింది.
ఎన్నికల కమిషన్ అధికారికంగా వెలువరించిన
నివేదిక ప్రకారం చూస్తే.. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లోనూ గతంలో కంటే
ఈసారి తక్కువ మంది ఓటేసినట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రవ్యాప్త నిష్పత్తి
చూస్తే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు, ఇప్పటికీ కూడా చాలా వ్యత్యాసం
నమోదయ్యింది. రాజధాని లోని రెండు నియోజకవర్గాల్లో 40శాతం లోపే పోలింగ్
నమోదు కావడం ఓటర్ల నైరాశ్యానికి అద్దం పట్టింది. హైదరాబాద్‌లో 39. 49శాతం,
సికింద్రా బాద్‌లో 39.20శాతం మంది మాత్రమే ఓటేశారు. అంటే, వందలో దాదాపు
40మంది కూడా ఓటు హక్కును వినియోగించుకోలేదు. అదీ ఎక్కడో మారుమూల
ప్రాంతంలోనో, రిమోట్ ఏరియాలోనో కాదు.. రాష్ట్ర రాజధాని నగరంలోని రెండు
ప్రధాన నియోజకవర్గాలు ఇవి. అంతర్జాతీయ నగరంగా పేరొందిన హైదరాబాద్
మహానగరంలో నివసిస్తున్న ఓటర్లు మరీ ఇంత హీనస్థితిలో ఓటుహక్కును
వినియోగించుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇక పోలింగ్ శాతం పక్కనబెడితే.. ఎన్నికలు
మాత్రం ప్రశాంతంగా ముగిశాయి. ఎక్కడా ఏ చిన్న సంఘటన కూడా తలెత్తకుండా,
ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పోలింగ్ ముగిసింది. దీంతో అధికార యంత్రాంగం,
పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే, ఒకరకంగా రాష్ట్రంలో దాదాపు ఎన్నికల
వాతావరణమే కనిపించలేదు. సాధారణంగా ఎన్నికలంటే నెలరోజుల ముందు నుంచే
హడావుడి.. ప్రచార పర్వం.. పోటాపోటీ సభలు, ర్యాలీలు వేడిని పెంచేవి. కానీ..
ఈసారి మాత్రం పెద్దగా ప్రచారం పర్వం సాగలేదు. అడపాదడపా సభలు, ప్రచారాలు
తప్ప ఇంటింటి ప్రచారాలు దాదాపుగా కనిపించలేదు.
రాష్ట్రంలో గత డిసెంబర్‌లోనే అసెంబ్లీ
ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లు ఉత్సాహం చూపించారు.
గతంలో కన్నా ఎక్కువగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. అభ్యర్థుల ప్రచారం
¬రెత్తించింది. కానీ.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు కావడం, నియోజకవర్గాల
సంఖ్యా తక్కువే కావడం ఓటింగ్ శాతం తగ్గడానికి కారణమన్న వాదన లున్నాయి.
అంతేకాకుండా.. లోక్‌సభ నియోజక వర్గాల పరిధి ఎక్కువగా ఉండటం.. అభ్యర్థులు తమ
నియోజకవర్గం మొత్తం తిరిగే అవకాశం లేకపోవడం, ఎన్నికలకు సమయం తక్కువగా
ఉండటం వంటి పరిణామాలు కూడా ఓటింగ్ శాతంపై ప్రభావం చూపాయి. ఇందులోనూ
పల్లెల్లో ఉత్సాహంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాల బాట పట్టగా.. నగరాల్లోనే
పోలింగ్ శాతం భారీగా తగ్గింది. నగర ఓటర్లు ఓటేసేందుకు అంతగా ఉత్సాహం
చూపించలేదు. హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో చరిత్రలోనే
తొలిసారిగా అతితక్కువ పోలింగ్ శాతం నమోదయ్యింది.
భానుడి ప్రభావం
ఎండ తీవ్రత కూడా పోలింగ్‌పై ప్రభావం
చూపింది. కొద్దిరోజులుగా ఎండలు మండిపోతుండ టంతో నగరాల్లో ఉండే ఓటర్లు ఓటు
వేసేందుకు అంతగా ఉత్సాహం చూపించలేదు. పైగా నగరాలు, పట్టణాల్లోనే ఎక్కువగా
నివసించే ప్రైవేటు రంగాల ఉద్యోగులు.. ఓటు వేసేందుకు ఆసక్తి కనబరచలేదు.
హైదరాబాద్ శివార్లలోని పోలింగ్ కేంద్రాలైతే ఓటర్లు లేక బోసిపోయాయనే
చెప్పాలి. ఈ పరిస్థితి పోలింగ్ సిబ్బందిని సైతం నిరాశకు గురిచేసినట్లుగా
తెలుస్తోంది. అయితే.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఓటర్లు ఎండ తీవ్రత తగ్గిన
తర్వాత పోలింగ్ కేంద్రాల బాట పట్టడం కనిపించింది. పోలింగ్ వాస్తవానికి
ఐదు గంటల వరకే కొనసాగినా.. కొన్ని కేంద్రాల్లో ఆ సమయంలోగా వచ్చిన ఓటర్లు
రాత్రి ఎనిమిది గంటల దాకా తమ ఓటుహక్కును వినియోగించు కున్నారు.
నగరం ఖాళీ.. ఖాళీ..
ఆంధ్రప్రదేశ్‌లో ఓటుహక్కు ఉన్నవాళ్లు..
ఓటేసేందుకు తమ స్వరాష్ట్రం వెళ్లడం కూడా హైదరాబాద్, సికింద్రాబాద్,
మల్కాజ్‌గిరి నియోజక వర్గాల్లో పోలింగ్ శాతం భారీగా తగ్గిపోవడానికి ప్రధాన
కారణంగా నిలిచింది. ఏపీలో ఓటు హక్కు కలిగి ఉండి హైదరాబాద్‌లో నివసిస్తున్న
దాదాపు 13 లక్షల మంది వారి సొంత ఊళ్లో ఓటు వేసేందుకు వెళ్లారని
లెక్కగట్టారు. దీంతో ఈ ప్రభావం పోలింగ్ శాతంపై పడింది.
ఇక పోలింగ్ సరళి ప్రధాన పార్టీల్లో
గెలుపు అంచనాలపై సందిగ్ధానికి కారణమైంది. ఓటర్లు ఎటువైపు మొగ్గారో
తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది. పోలింగ్‌శాతం తగ్గడం అధికార పార్టీకి
మైనస్ అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పోలింగ్ కేంద్రానికి
ఓటర్లను రప్పించడంలో అన్ని రాజకీయ పార్టీలు విఫలమయ్యాయని చెబుతున్నారు. ఈ
క్రమంలోనే పోలింగ్‌శాతం తగ్గడంపై అన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం
చేస్తున్నాయి.
అందరి దృష్టి అటువైపే!
దేశంలోనే అత్యధికంగా 185 మంది అభ్యర్థులు
బరిలో దిగిన నిజామాబాద్ లోక్‌సభ నియోజక వర్గంలో గంటసేపు అదనంగా సాయంత్రం 6
గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఆ లోపు క్యూలైన్లలో నిలుచున్న వారికి
ఓటేసే అవకాశం కల్పించారు. నిజామాబాద్ పోలింగ్‌ను ఛాలెంజ్‌గా తీసుకున్నామని
ఎన్నికల అధికారులు చెప్పారు. ఉన్న వనరులను వినియోగించుకొని భారీస్థాయిలో
అభ్యర్థులు పోటీ పడినా.. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించామని తెలిపారు.
దీన్ని గిన్నిస్ రికార్డు పరిశీలనకు నివేదిస్తున్నట్లు ప్రకటించారు.
గెలుపుపై ధీమా!
మరోవైపు.. పోలింగ్ ముగియడంతో రాజకీయ
నాయకులు ఎవరికి వారు గెలుపుపై ధీమాగా ఉన్నట్లుగా తెలుస్తోంది. పోలింగ్
శాతం తగ్గడాన్ని గమనిస్తే అధికార పార్టీ పట్ల ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉందో
స్పష్టమవుతోందని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు తప్పకుండా అత్యధిక
సీట్లు కట్టబెడతారని ఆ పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
పోలింగ్ శాతం తగ్గినా.. పెరిగినా ప్రజలు టీఆర్‌ఎస్ అమలుపరచే సంక్షేమ
పథకాల పట్ల సంతృప్తికరంగా ఉన్నారని.. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు చీకటి
రోజులొచ్చాయని.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి పాలవుతుందని, మరోసారి
రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరబోతోందని టీఆర్‌ఎస్ భరోసాగా ఉంది.
……………………………………………………….
నియోజకవర్గాల వారీగా నమోదైన పోలింగ్‌శాతం
………………………………………………….
లోక్‌సభ 2014 2019
ఆదిలాబాద్ 75.4% 66.76%
భువనగిరి 81.2% 68.25%
చేవెల్ల 60.2% 53.80%
హైదరాబాద్ 53.3% 39.49%
కరీంనగర్ 72.6% 68%
ఖమ్మం 82.1% 67.96%
మహబూబాబాద్ 81.0% 59.9%
మహబూబ్‌నగర్ 71.5% 64.99%
మల్కాజ్‌గిరి 50.9% 42.75%
మెదక్ 77.5% 68.60%
నాగర్‌కర్నూల్ 75.1% 57.12%
నల్గొండ 79.5% 66.11%
నిజామాబాద్ 69.1% 54.20%
పెద్దపల్లి 71.7% 59.24%
సికింద్రాబాద్ 53.0% 39.20%
వరంగల్ 76.4% 60%
జహీరాబాద్ 75.8% 67.80%
తెలంగాణ వ్యాప్తంగా 69% 60.57%……………………………………………
– సప్తగిరి.జి, 9885086126
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి