వరుస ఎన్నికల కోలాహలం..
తెలంగాణలో
వరుసగా ఎన్నికల పండుగలు వస్తున్నాయి. మొన్నటికి మొన్న డిసెంబర్‌లో రాష్ట్ర
అసెంబ్లీకి ఎన్నికలు పూర్తయ్యాయి. అధికార టీఆర్‌ఎస్ అత్యధిక మెజార్టీతో
మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. నిన్నటికి నిన్న లోక్‌సభ ఎన్నికలు
పూర్తయ్యాయి. ఫలితాలు ఇంకా వెలువడలేదు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు
జరుగుతున్నందున జాతీయ స్థాయిలో అన్ని దశల పోలింగ్ ముగిసిన తర్వాత మే 23వ
తేదీన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే.. ఇదే సమయంలో ఇప్పుడు
స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ,
జెడ్పీటీసీ ఎన్నికల తంతు మొదలైంది.
తెలంగాణ వ్యాప్తంగా 538 జెడ్పీటీసీ
స్థానాలు; 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ నున్నాయి. మొత్తం మూడు
విడతల్లో పోలింగ్ ప్రక్రియ సాగనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్
నాగిరెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు. మే 6వ తేదీన తొలివిడత పోలింగ్, మే
10వ తేదీన మలి విడత పోలింగ్, మే 14వ తేదీన తుది విడత పోలింగ్
జరుగుతుంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు
విడుదల చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మే 23వ తేదీన
వెలువడనుండగా.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఎన్నికల ఫలితాలు మే 27వ తేదీన
విడుదల చేయనున్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు పూర్తిస్థాయిలో
ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఈవీఎంలతో నిర్వహించగా.. స్థానిక సంస్థల ఎన్నికలు
మాత్రం బ్యాలెట్ పద్ధతిలో చేపడుతున్నారు. జెడ్పీటీసీ ఎన్నికకు గులాబీ రంగు
బ్యాలెట్ పేపర్, ఎంపీటీసీ ఎన్నికకు తెలుపురంగు బ్యాలెట్ పేపర్
కేటాయించారు.
మూడుదశల పోలింగ్ ఇలా…
మొదటి విడత పోలింగ్ కోసం ఈనెల 22వ తేదీన
నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మే 6వ తేదీన మొదటి విడత ఎన్నికకు పోలింగ్
నిర్వహించ నున్నారు. మొదటి విడతలో 212 జడ్పీటీసీలు, 2వేల 365 ఎంపీటీసీ
స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా ఏప్రిల్ 26వ తేదీన రెండో దశ
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. మే 10వ తేదీన రెండో విడత పోలింగ్
నిర్వహిస్తారు. ఈ విడతలో 199 జెడ్పీటీసీ, 2వేల 109 ఎంపీటీసీ స్థానాలకు
పోలింగ్ చేపట్టనున్నారు. ఇక ఏప్రిల్ 30న మూడోదశ ఎన్నికల నోటిఫికేషన్
విడుదల చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి తుదివిడత పోలింగ్ మే 14వ
తేదీన జరగనుంది. ఈ విడతలో 127 జెడ్పీటీసీ, ఒక వెయ్యి 343 ఎంపీటీసీ
స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. జెడ్పీటీసీ అభ్యర్థులు 4 లక్షల రూపాయల వరకు
ఎన్నికల్లో ఖర్చు చేయవచ్చు. ఎంపీటీసీ అభ్యర్థులు గరిష్టంగా ఒక లక్షా 50 వేల
రూపాయల వరకు ఖర్చు చేసేందుకు అవకాశం ఉంది.
స్థానిక సంస్థలకు జరుగుతున్న ఎన్నికల్లో
ఓటు హక్కు వినియోగించుకోబోతున్న మొత్తం ఓటర్ల సంఖ్య 1,56,11,474 మంది.
వీరిలో పురుష ఓటర్లు 77,34,800 కాగా.. మహిళా ఓటర్లు 78,76,361, ఇతరులు 313
మంది ఉన్నారు. వీళ్లంతా ఈ మూడుదశల్లో జరిగే ఎన్నికల్లో ఓటుహక్కు
వినియోగించుకునేందుకు మొత్తం 32,042 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌కు లక్షా 47వేల మంది సిబ్బందిని
వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా 54 వేల మంది భద్రతా సిబ్బంది ఎన్నికల
విధుల్లో పాల్గొంటున్నారు. ప్రజలు ప్రత్యక్ష పద్ధతిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ
సభ్యులను ఎన్ను కుంటారు. ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీనీ, జెడ్పీటీసీ
సభ్యులు జెడ్పీ చైర్మన్‌ను ఎన్నుకుంటారు.
ఒక జెడ్పీటీసీ, 40 ఎంపీటీసీ స్థానాలు మినహా…
రాష్ట్రంలో ఇటీవల కొత్తగా ఏర్పాటైన నాలుగు
మండలాలకు కూడా రిజర్వేషన్లు ఖరారవ్వడంతో.. అక్కడ కూడా ఎన్నికలు
నిర్వహిస్తున్నారు. నిజామా బాద్ జిల్లాలోని చండూరు మండల జెడ్పీటీసీ,
ఎంపీపీ స్థానాలను ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. మోస్రా మండలం జెడ్పీటీసీ,
ఎంపీపీ స్థానాలను జనరల్ క్యాటగిరీ చేశారు. అటు సిద్ధిపేట జిల్లా నారాయణ
రావుపేట మండల జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు, మేడ్చల్ జిల్లా మూడుచింతపల్లి
మండలం జెడ్పీటీసీ స్థానాన్ని జనరల్ క్యాటగిరీకి కేటాయించారు. ఇక ఎంపీపీ
స్థానాన్ని బీసీ జనరల్‌కు కేటాయిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ
చేసింది. కొత్తగా ఏర్పాటైన ములుగు జిల్లా మంగపేట ప్రాంతంలో రిజర్వేషన్ల
వివాదం కోర్టు పరిధిలో ఉన్నందున అక్కడ ఎన్నికలను వాయిదా వేశారు. మంగపేట
జెడ్పీటీసీ స్థానంతో పాటు ములుగు జిల్లాలోని 14 ఎంపీటీసీ స్థానాలకు
ఎన్నికలు నిర్వహించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 40 ఎంపీటీసీ
స్థానాలకు పోలింగ్ నిర్వహించట్లేదని ఎన్నికల కమిషనర్ తెలిపారు.
మహబూబ్‌నగర్ జిల్లా… జడ్చర్లలోని 15 ఎంపీటీసీ స్థానాలకు వచ్చే ఏడాది మే
నెలలో గడువు ముగుస్తుందని.. భద్రాచలం జిల్లాలోని బుర్గంపాడులో 11 ఎంపీటీసీ
స్థానాలకు వచ్చే ఏడాది జులైతో పదవీకాలం ముగుస్తుందని.. ఆ స్థానాల్లో
ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం లేదని స్పష్టం చేశారు.
ఆన్‌లైన్‌లోనూ నామినేషన్లు
ఎన్నికలకు సంబంధించిన ఓటరు జాబితా,
రిజర్వేషన్ల ప్రక్రియ, బందోబస్తు, సిబ్బంది తదితర ఏర్పాట్లన్నీ ఇప్పటికే
పూర్తి చేశారు. స్థానికంగా రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్
అధికారులు, ఎన్నికల సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు ఇప్పటికే పూర్తిచేసిన
రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఎన్నికల సన్నద్ధతపైనా పూర్తి క్లారిటీతో
నోటిఫికేష్ జారీచేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీచేసే
అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనూ నామినేషన్ దాఖలు చేసే అవకాశాన్ని ఈసారి ఎన్నికల
సంఘం కల్పిస్తోంది. అయితే, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన అభ్యర్థులు.. ఓ
కాపీని రిటర్నింగ్ అధికారికి తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.
లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగియగానే
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతించా లని రాష్ట్ర ఎన్నికల
సంఘం ఇదివరకే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. భారత ఎన్నికల సంఘం స్థానిక
సంస్థల ఎన్నికల నిర్వాహణకు సుముఖత వ్యక్తం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈ కోడ్ ముగిసేలోగానే స్థానిక సంస్థలకు కూడా
ఎన్నికలు నిర్వహించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు
నిర్వ హించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసింది.
ప్రస్తుతం కొనసాగుతున్న స్థానిక సంస్థల పదవీకాలం వచ్చే జూన్‌లో ముగియనుంది.
జెడ్పీ చైర్మన్ పదవికి తీవ్రపోటీ
మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలను సైతం
అధికార పార్టీ సీరియస్‌గా తీసుకున్న నేపథ్యంలో ఆ పార్టీలో జెడ్పీ చైర్మన్
పదవికి తీవ్ర పోటీ నెలకొన్న ట్లుగా తెలుస్తోంది. గత సంవత్సరం డిసెంబర్
నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నాయకులు, టిక్కెట్
ఆశించి భంగపడ్డ ఆశావహులు, ఇతర పార్టీల నుంచి ఫిరాయించిన పలువురు సీనియర్
నేతలు సైతం తమకు జెడ్పీ చైర్మన్ పదవి ఇవ్వాలని పార్టీ అధిష్టానం చుట్టూ
ప్రదక్షిణలు చేస్తున్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు.
2014లో టీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధించి
ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత పలు సంచలన నిర్ణయాలు
తీసుకున్నారు. అందులో జిల్లాల విస్తరణ కూడా ఒకటి. తెలంగాణ ప్రత్యేక
రాష్ట్రంగా ఏర్పడే నాటికి 10 జిల్లాలు మాత్రమే ఉండగా, 2016 కేసీఆర్
జిల్లాల సంఖ్య 31కి పెంచారు. ఇటీవల డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో
మరో రెండు జిల్లాల (ములుగు, నారాయణపేట) ఏర్పాటుకు సైతం ముఖ్యమంతి ఆమోదం
తెలిపారు. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం జిల్లాల సంఖ్య 33కి చేరింది. ప్రతి
జిల్లాకు ఒక జెడ్పీ చైర్మన్ ఉంటారు. వీరిని జెడ్పీటీసీ సభ్యులు
ఎన్నుకుంటారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది జెడ్పీటీసీలను గెలుపించుకొని
రాష్ట్రంలోని అన్ని జెడ్పీ చైర్మన్ స్థానాలను దక్కించుకోవాలని టీఆర్‌ఎస్
భావిస్తోంది.
ఒకప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ పదవులకు
పెద్దగా పోటీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఏ
పదవీ లేకుండా ఖాళీగా ఉండి ప్రజలకు దూరంగా ఉండటం కంటే ఏదో ఒక పదవిలో ఉండి
ప్రజాక్షేత్రంలో ఉంటూ తమ అస్థిత్వాన్ని కాపాడుకోవాలని రాజకీయ నాయకులు
భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
– సప్తగిరి.జి, 9885086126
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి