ఆత్మవిశ్వాసమా? అతివిశ్వాసమా?
అసెంబ్లీ
ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన సంతోషంలో ఉన్న కేసీఆర్ ఇప్పుడు..
లోక్‌సభ ఎన్నికల్లో తనదైన జోరును కొనసాగిస్తు న్నారు. మాటల దాడిని పెంచారు.
ఎదుటి పార్టీలపై విమర్శల స్థాయికి కూడా పదును పెంచారు. కేంద్రంలో
అధికారంలో ఉన్న ఎన్డీఏలో కీలక పార్టీ అయిన బీజేపీపై తనదైన శైలిలో విమర్శలు
కురిపిస్తున్నారు. మరో అడుగు ముందుకేసి అసలు కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే
చక్రం తిప్పబోతు న్నాయని, వాటికి తానే నేతృత్వం వహిస్తానని కూడా
చెప్పుకుంటున్నారు.
ఉద్యమకాలంలో కేసీఆర్ ప్రసంగాలకు జనం
నుంచి భారీగా రియాక్షన్ ఉండేది. భావోద్వేగ అంశం కావడంతో తెలంగాణ ప్రత్యేక
రాష్ట్రం కోసం సాగుతున్న పోరాటం సమయంలో కేసీఆర్ తనదైన భాషలో
విరుచుకుపడేవారు. తెలంగాణ మాండలికంలో ఉద్వేగంగా చేసే ప్రసంగం జనాల్లోకి
నేరుగా చొచ్చుకుపోయేది. రెచ్చగొట్టే ప్రసంగాలతో ముఖ్యంగా యూత్‌లో
ఫాలోయింగ్ సంపాదించు కున్నారు. అయితే.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత
తొలిసారిగా టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ తెచ్చిన
పార్టీగా జనం ప్రత్యేక రాష్ట్ర పగ్గాలు కేసీఆర్‌కు అప్పగించారు. ఆ తర్వాత
ఒక ముఖ్యమంత్రిగా హుందాగా ప్రసంగించే ప్రయత్నాలు చేసినా.. అప్పుడప్పుడూ
ఉద్యమ కాలంనాటి ప్రసంగం ఆనవాళ్లు కూడా కనిపించేవి. అయితే.. ఇప్పుడు తెలంగాణ
అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విజయం సొంతం చేసుకున్న తర్వాత.. మిగిలిన ఇతర
పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీవైపు తిప్పుకొనే ప్రయత్నాలు విజయవంతంగా
సాగిస్తున్న నేపథ్యంలో.. అసెంబ్లీలో టీఆర్‌ఎస్ బలం సెంచరీ దాటి పోవడంతో
కేసీఆర్‌లో ఉత్సాహం మరింత పెరిగింది. ఒక్క కేసీఆర్ మాత్రమే కాదు..
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మాటల దాడికి పదును
పెంచారు.
ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల ప్రచారం మారుమోగి
పోతోంది. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా
నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్న కేసీఆర్,
కేటీఆర్ తమకు ఎదురే లేదన్న ధీమాతో ప్రసంగాలు సాగిస్తున్నారు. విపక్షాలతో
పాటు.. కేంద్రంలో పాలక పక్షమైన బీజేపీపైనా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ పైనా
నేరుగా విమర్శలు కురిపిస్తు న్నారు. అంతేకాదు.. విమర్శల స్థాయి కాస్త
శ్రుతి మించుతోందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశంలో ప్రాంతీయ
పార్టీలదే హవా అని, ఫెడరల్ ఫ్రంట్‌లో టీఆర్‌ఎస్‌దే కీలకపాత్ర అని
చెప్పుకుంటున్నారు. కానీ.. ఎన్నికల ప్రచారం తెలంగాణ రాష్ట్రం దాటిపోవడం
లేదు. తెలంగాణలో తప్ప మరెక్కడా ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ గానీ కేటీఆర్
గానీ పాల్గొనడం లేదు. కేవలం తెలంగాణలోని 16 లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎస్
అభ్యర్థులను గెలిపించాలని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సంఖ్యతో ఏం
చేయలేమన్న సందేహం అవసరం లేదని, దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని
ప్రాంతీయ పార్టీలన్నీ తమతోనే కలిసి వస్తాయని జనంలో నమ్మకం కలిగించే
ప్రయత్నం చేస్తున్నారు.
ఈక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా
తెలంగాణలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనడాన్ని ప్రస్తావిస్తూ.. విమర్శలు
చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని బీజేపీ పగటి కలలు
కంటోందని కూడా ఎద్దేవా చేస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఈ ఐదేళ్లలో
దేశానికి బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు..
ప్రధాని మోదీ స్థాయిని దిగజార్చేలా విమర్శలు చేస్తున్నారు. నరేంద్రమోదీ
మాట్లాడినట్లు ఓ గ్రామంలో ఉండే సర్పంచ్ కూడా మాట్లాడరంటూ ఘాటుగా
విమర్శిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ స్థాయి ఏంటో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల
ఫలితాలే నిదర్శమని ఎటాక్ చేస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో 118
సీట్లలో బీజేపీ ఒక్క స్థానంలో మాత్రమే గెలిచిందని, 103 స్థానాల్లో
డిపాజిట్ దక్కలేదని ఆరోపించారు.
అంతేకాదు.. సర్జికల్ దాడుల గురించి
కేసీఆర్ సరికొత్త వాదన తెరపైకి తెచ్చారు. బీజేపీ ప్రభుత్వం సర్జికల్
దాడుల గురించి గొప్పగా చెప్పుకుంటుందని విమర్శించారు. యూపీఏ హయాంలో తాను
కేంద్రంమంత్రిగా ఉన్న సమయంలో 11 సార్లు సర్జికల్ దాడులు జరిగాయంటున్నారు.
సర్జికల్ దాడులను మోదీ తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని కేసీఆర్
ఆరోపించారు. ఇటీవల జరిగిన మెరుపుదాడుల్లో 300 మంది ఉగ్రవాదులు చనిపోయారంటూ
డొల్ల ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్
మసూద్ అజర్ అక్కడ చీమ కూడా చావలేదంటు న్నాడని ఎద్దేవా చేశారు. ‘ఇలాంటి
ప్రచారాలతో మీరు ఓట్లు అడుగుతారా? ఇదేనా దేశాన్ని నడిపించే తీరు’ అని
మోదీని ఉద్దేశించి కేసీఆర్ ప్రశ్నించారు.
ఇక..
హిందూత్వ అంశాన్ని కూడా వివాదం చేసేలా కేసీఆర్ ప్రసంగాలు సాగుతున్నాయి.
మొన్నటికి మొన్న నిజమైన హిందువులం తామే అని ప్రకటించిన ఆయన.. మరుసటిరోజు
హిందూగాళ్లు – బొందూగాళ్లు ఓట్లడిగేందుకు వస్తున్నారంటూ వివాదాస్పద
వ్యాఖ్యలు చేశారు. ఆ అంశంపై విమర్శల దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు. తామే
హిందువులమని గొప్పలు చెప్పుకోవడం కాదని.. బీజేపీ వారు చెబితేనే ఇళ్లల్లో
ప్రజలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారా? చనిపోతే తద్దినాలు పెట్టుకుంటారా? అంటూ
ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు.. కేసీఆర్ కుమారుడు, టీఆర్‌ఎస్
వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అదేస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
ఢిల్లీ గులాములు కావాలో తెలంగాణ గులాబీలు కావాలో నిర్ణయించు కోవలసింది
ప్రజలేనంటూ ఎదుటిపార్టీలపై విమర్శల దాడిని తీవ్రం చేశారు. 16 లోక్‌సభ
స్థానాల్లో గెలిపిస్తే ఢిల్లీ మెడలు వంచుతామంటూ తనదైన రీతిలో వ్యాఖ్యలు
చేస్తున్నారు. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ, ఒడిశాలో నవీన్
పట్నాయక్, యూపీలో మాయావతి, అఖిలేష్‌యాదవ్, ఏపీలో జగన్ తమకే మద్దతు
ఇస్తున్నారని ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరో అడుగు
ముందుకేసి.. బీజేపీ సాగిస్తున్న చౌకీదార్ క్యాంపెయిన్‌ను కూడా ఎద్దేవా
చేసేలా ప్రసంగిస్తు న్నారు. ఈ దేశానికి కావాల్సింది చౌకీదారో.. టేకీదారో
కాదని.. ఒక జోర్దార్, ఒక ధమ్‌దార్, ఒక ఇమామ్‌దార్.. ఒక్క మాటలో
చెప్పాలంటే ఈ దేశానికి ఒక కేసీఆర్ కావాలంటూ కేటీఆర్ పేర్కొంటున్నారు.
అయితే.. కేటీఆర్ ఓటర్లను తప్పుదారి
పట్టిస్తున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి దత్తాత్రేయ
ప్రకటించారు. కేటీఆర్ ఎన్నికల ప్రచారాల్లో చెబుతున్న మమత బెనర్జీ, నవీన్
పట్నాయక్, మాయావతి, అఖిలేశ్ యాదవ్, జగన్ వంటి నేతల్లో అత్యధికులు మోదీ
ప్రధానిగా ఏర్పడే ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతిచ్చే అవకాశం ఉందని
చెప్పారు. హిందుత్వ అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని
విమర్శించారు. యూపీఏ ప్రభుత్వంలో తాను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు 11 సార్లు
మెరుపు దాడులు జరిగాయన్న కేసీఆర్ వ్యాఖ్యలను ఆక్షేపించారు.
‘కేంద్రమంత్రిగా ఒక్క కేబినెట్ సమావేశానికి వెళ్లలేదు. పార్లమెంట్‌లో ఒక్క
ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. ఆ దాడుల గురించి నీకేం తెలుసు? భాజపా నేతలు
దొంగ హిందువులు అంటున్నావు. నువ్వు హిందుత్వవాదివి అయితే అయోధ్యలో రామమందిర
నిర్మాణం కట్టాలా? వద్దా? నీ వైఖరి చెప్పు. ఇంకా నీ మాటల గారడి చెల్లదు’
అంటూ దత్తాత్రేయ ధ్వజమెత్తారు. తెలంగాణ అభివృద్ధిని ప్రధాని విస్మరించారన్న
తెరాస వ్యాఖ్యల్లో నిజం లేదని, తెలంగాణకు మోదీ ప్రభుత్వం రూ.2.25లక్షల
కోట్లు ఇవ్వడం అభివృద్ధి కాదా? అని ప్రశ్నించారు. ‘తెరాసను 16 సీట్లలో
ఎందుకు గెలిపించాలి. కేంద్రంలో వచ్చేది భాజపా ప్రభుత్వం. భాజపా అభ్యర్థులను
16 సీట్లలో గెలిపిస్తే ఎవరి మెడలూ వంచాల్సిన అవసరం లేకుండా కేంద్రం నుంచి
అత్యధిక నిధులు తెస్తాం’ అని దత్తాత్రేయ భరోసా ఇచ్చారు.
అయితే.. ప్రస్తుత ఎన్నికల్లో ఓ వైపు
కేసీఆర్, మరోవైపు కేటీఆర్ సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో చూపిస్తున్నది
ఆత్మవిశ్వాసం కాదని, అతివిశ్వాసం అని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఆ
అతివిశ్వాసం కాస్తా బోల్తాకొట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
– సప్తగిరి.జి, 9885086126
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి