26, జూన్ 2019, బుధవారం

పోరుబాట వదిలి పోటీకి…


పోరుబాట వదిలి పోటీకి…

పోరుబాట వదిలి పోటీకి…

పోరుబాట వదిలి పోటీకి…
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల హడావుడి మొదలైంది. రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లాకు చెందిన రైతులు తమ డిమాండ్‌ల సాధనకు ఈ ఎన్నికలనే అస్త్రంగా ఎంచుకున్నారు. పండించిన పంటకు గిట్టుబాట ధర కల్పించాలనే డిమాండ్‌తో తీవ్రస్థాయిలో ఆందోళనలు చేసినా ఫలితం లేకపోయేసరికి పసుపు, ఎర్రజొన్న రైతులు ఎన్నికల బాటపట్టారు. పెద్దఎత్తున నామినేషన్ల పర్వానికి తెరదీశారు. గతంలో వీరు తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నాయకులకు తమ గోడును వినిపించేందుకు అసెంబ్లీ ముట్టడికీ విఫలయత్నం చేశారు. రహదారులను నిర్బంధించి వంటా వార్పూ చేపట్టారు. అయినా ఫలితం దక్కలేదు. దీంతో ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని తమ నిరసన తెలపాలనుకున్నారు.
నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి మొత్తం 245 నామినేషన్లు రాగా, అందులో అత్యధిక భాగం (దాదాపు 80 శాతం) రైతులవే కావడం విశేషం. ప్రస్తుతం ఎన్నికల సంఘం ఉపయోగిస్తున్న ఈవీఎంల ద్వారా 93 మంది అభ్యర్థులకే పోలింగ్‌ నిర్వహించే అవకాశం ఉన్నందున ఇక్కడ బ్యాలెట్‌ విధానంలో పోలింగ్‌ జరగనున్నట్లుగా తెలుస్తోంది. నామినేషన్ల ఉపసంహరణకు ఇంకా గడువు (మార్చి 28) ఉంది. అనంతరం అభ్యర్థుల సంఖ్యను బట్టి ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోనుంది. దీంతో రాజకీయ పార్టీలు రైతు డిమాండ్ల పట్ల సానుకూల వైఖరి చూపిస్తూ వారికి హామీలిస్తూ నామినేషన్లను వెనక్కి తీసుకోవాలని బుజ్జగిస్తున్నాయి. ఖమ్మం జిల్లా సొబాబుల్‌ సాగు రైతులు సైతం ఇదే తరహా నామినేషన్ల ప్రక్రియకు తెరదీశారు. అయితే.. అక్కడ రాజకీయ నాయకులు వారిని శాంతింపజేసి డిమాండ్ల సాధనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
నిజామాబాద్‌లోని ఆర్మూర్‌, కోరుట్ల, జగిత్యాల ప్రాంతాల్లో పసుపు, ఎర్రజొన్న పంటలు ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తుంటారు. ఈ సంవత్సరం ఒక్క నిజామాబాద్‌ జిల్లాలోనే 36 వేల ఎకరాల్లో పసుపు, 49 వేల ఎకరాల్లో ఎర్రజొన్న సాగు చేశారు. ఈ రెండు పంటలు ప్రభుత్వం కొనుగోలు చేసే జాబితాలో లేవు. వ్యాపారులు మార్కెట్‌ డిమాండ్‌ ఆధారంగా ధరలు నిర్ణయించి కొంటారు. దీంతో రైతులు గిట్టుబాటు ధర లభించక మోసపోతున్నారు.
వ్యవసాయాధారిత ప్రాంతమైన నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో మొత్తం 3.5 లక్షల మంది రైతులున్నారు. ఎన్నికల్లో వీరి ప్రభావం అధికం. దీంతో రాజకీయ పార్టీలు ఎన్నికల సమయాల్లో వీరందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రచారాస్త్రాలు సిద్ధం చేసుకుంటుంటాయి. అయితే ఈసారి రైతులే నామినేషన్ల ద్వారా తమ నిరసనను తెలుపు తూండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ నేపథ్యంలో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ వెల్లడించారు. పసుపు, ఎర్రజొన్న, చెరుకు పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని ఇటీవల ఆర్మూర్‌లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ప్రకటించారు. నిజామాబాద్‌ ఎంపీ కవిత రైతుల సమస్యల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చి ఉంటే సమస్యలు ఎప్పుడో పరిష్కారమయ్యేవన్నారు.
ఎందుకీ దాహం..
మరోవైపు రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇంతకు ముందెన్నడూ చూడని పరిణామాలు ప్రస్తుతం చోటు చేసుకుంటున్నాయి. అవసరమున్నా లేకపోయినా పార్టీ ఫిరాయింపులు కొత్త కోణాలను ఆవిష్క రిస్తున్నాయి. ఇటీవల అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకుంది. మొత్తం 88 అసెంబ్లీ స్థానాల్లో ఘనవిజయం సాధించింది. మేజిక్‌ ఫిగర్‌ను కూడా అధిగమించి విపక్షాలు అందుకోలేని స్థాయిలో దూసుకుపోయింది.
ఈ క్రమంలో దాదాపు 3 నెలల తర్వాత రాష్ట్ర మంత్రివర్గం కొలువుదీరింది. కానీ ప్రతిపక్షాలకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు అవసరం లేకున్నా తెరాసలో చేరుతున్నారు. ఆలిండియా ఫార్వార్డ్‌ బ్లాక్‌ పార్టీ నుంచి టికెట్‌ తెచ్చుకొని అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఒక ఎమ్మెల్యే వారం తిరక్కుండానే గులాబీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలకు చెందిన కొంతమంది నేతలు కూడా టీఆర్‌ఎస్‌లో చేరేందుకు క్యూలు కట్టారు. దీంతో అసెంబ్లీలో తెరాస పార్టీ బలం 88 నుంచి ఏకంగా వంద (సెంచరీ)కి చేరింది.
ఒకప్పుడు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారంటే రాజకీయ పార్టీలు మేజిక్‌ ఫిగర్‌ కోసం పడే తాపత్రయం కనిపించేది. కానీ ఇప్పుడు అలాంటి సందర్భం అవసరం లేదు. విస్తత, సామాజిక కోణం అన్న అంశాల ప్రస్తావనే లేదు. ఇవాళ సాయంత్రం ప్రత్యర్థి పార్టీ అధినేతను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన ఒక నాయకుడు.. మరుసటిరోజు ఉదయం అదే ప్రత్యర్థిపార్టీ అధినేత చేతుల మీదుగా ఆ పార్టీ కండువా కప్పుకుంటున్నాడు. ఆరోజు సాయంత్రానికి ఆ పార్టీ కండువా పక్కన పడేసి.. మరుసటిరోజు ఉదయానికి ఇంకో పార్టీ జెండా చేతిలో పట్టు కుంటాడు. ఎన్నికల సమయాల్లో ఇది సాధారణం. అయితే.. ఎన్నికల తర్వాత కూడా అవసరం ఉన్నా లేకున్నా పార్టీ కండువాలు మార్చడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఇప్పటికే సగానికి సగం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ వైపు ఆకర్షితులు అయ్యారు. ఈ వలసలు ఇంతటితో ఆగవని, లోక్‌సభ ఎన్నికలు ముగిసేలోపు మరికొన్ని ఫిరాయింపులు ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే.. ఏకంగా కాంగ్రెస్‌ శాసనసభా పక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేసే ప్రయత్నాలు కూడా తెరవెనుక సాగుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలను కాపాడుకో లేని పరిస్థితిలో కాంగ్రెస్‌ ఉండగా ఓడిపోయిన పలువురు సీనియర్‌ నేతలు, కీలక నాయకులు.. మంత్రి పదవులు కూడా చేపట్టిన వాళ్లు ఇతర పార్టీల వైపు చూస్తున్నారన్న వార్తలు ఆ పార్టీ అధినాయ కత్వాన్ని కలవర పెడుతున్నాయి. కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిని టీఆర్‌ఎస్‌ ఎగరేసుకు పోతుండగా, ఓడినప్పటికీ గతంలో ఓ వెలుగు వెలిగిన నేతలను తనవైపు లాక్కోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. ఏవేవో కారణాల రీత్యా టీఆర్‌ఎస్‌లో చేరలేని వారిని కమలదళం పిలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు డీకే అరుణ ఢిల్లీ వెళ్లి కాషాయ కండువా కప్పుకున్నారు. మహబూబ్‌ నగర్‌ ఎంపీ స్థానానికి ఆమె పోటీ చేస్తున్నారు.
– సప్తగిరి. జి, 9885086126

ఆరంభశూరత్వం.. ‘ఫెడరల్‌ ఫ్రంట్‌’


ఆరంభశూరత్వం.. ‘ఫెడరల్‌ ఫ్రంట్‌’

ఆరంభశూరత్వం.. ‘ఫెడరల్‌ ఫ్రంట్‌’

ఆరంభశూరత్వం.. ‘ఫెడరల్‌ ఫ్రంట్‌’
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల కరీంనగర్‌ జిల్లాలో లోక్‌సభ ఎన్నికల సమర శంఖారావం మోగించారు. మొన్నటిదాకా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఊసే ఎత్తని ఆయన ఆ వేదికపై తిరిగి కాంగ్రెస్‌, భాజపాలను తిట్టే కార్యక్రమానికి తెరదీశారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో తెరాసకు 16 సీట్లు ఇచ్చి గెలిపిస్తే భారత్‌ దశ, దిశ మారుస్తానని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్‌, భాజపాలు దేశాన్ని అంధకారంలోకి నెట్టాయని విమర్శించారు. భారతావనిని ప్రగతి పథంలో నడిపేందుకు ఈ ఎన్నికల తర్వాత అవసరమైతే జాతీయ పార్టీని సైతం ఏర్పాటు చేస్తానని కొత్తరాగం అందుకున్నారు.
పురిటిలోనే సంధి
రాష్ట్రాలపై ఢిల్లీ పెత్తనమేంటని ప్రశ్నించారు. జాతీయ పార్టీలతో దేశానికి నష్టమన్నారు. ఢిల్లీ గద్దెనెక్కుతున్న జాతీయ పార్టీలకు రాష్ట్రాల బాధలు తెలియవన్నారు. క్షేత్రస్థాయిలో అభివృద్ధిని విస్మరించడం వల్ల దేశం దుర్భర స్థితికి చేరుతోంద న్నారు. ఇప్పటికైనా మేల్కొనకపోతే రాష్ట్రాల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారవుతుందని ప్రాంతీయ పార్టీలను ఎగదోసే ప్రయత్నం చేశారు. ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీకి ప్రత్యామ్నాయం అవసరమని మైకుల్లో హోరెత్తించారు. ప్రాంతీయ పార్టీలన్నింటినీ కలిపి ఢిల్లీ నేతల్లో వణుకు పుట్టిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అప్పటికప్పుడు ప్రత్యేక విమానాల్లో ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలు తిరిగారు. ప్రాంతీయ పార్టీలతో ప్రకంపనలు పుట్టిస్తాం చూడండంటూ మీడియా ముందు ధీమాగా చెప్పారు. దాదాపు రెండు, మూడు నెలల పాటు పర్యటనలు, ప్రకటనలు, లీకులతో ఊదరగొట్టారు. అసలేం జరుగుతుందో అన్న ఆసక్తిని రేకెత్తించారు. ఆయా రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు, ప్రజల అటెన్షన్‌ కూడా ఇటువైపు పడేలా చేశారు. ఇవన్నీ చేసింది తెలంగాణ సీఎం కేసీఆర్‌ అయితే.. జాతీయ స్థాయిలో తీసుకొస్తానన్నది ఫెడరల్‌ ఫ్రంట్‌..
ఏడాది క్రితం కేసీఆర్‌ ఈ సరికొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల్లో ఆలోచన రేకెత్తించారు. ఎప్పటికో కాదు.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనే తమ సత్తా చూపిస్తామని, ప్రాంతీయ పార్టీల బలమేంటో తెలిసేలా చేస్తానని కూడా కేసీఆర్‌ చెప్పుకొచ్చారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు తిరిగి ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొస్తానని, ఢిల్లీ పెత్తనానికి అడ్డుకట్ట వేసి రాష్ట్రాలకే నిర్ణయాధికారం వచ్చేలా చేసి చూపిస్తానన్నారు. కానీ అది ఆరంభ శూరత్వంగానే మారిపోయిందన్నది తర్వాత పరిణామాలతో తేటతెల్లమైంది.
ఈ క్రమంలోనే ఆగమేఘాల మీద కోల్‌కతా వెళ్లిన కేసీఆర్‌ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిశారు. జాతీయ పార్టీలకు దీటుగా ప్రాంతీయ పార్టీలు ఏకం కావాల్సిన అవసరాన్ని చెప్పారు. అయితే మొదటినుంచీ కాంగ్రెస్‌, బీజేపీలకు వ్యతిరేకంగా థర్డ్‌ ఫ్రంట్‌ పైనే దష్టిపెట్టి ఏకంగా ప్రధాని సీటుపైనే కన్నేసిన మమతా బెనర్జీ కేసీఆర్‌ ప్రతిపాదనపై చర్చించారు. ఆ తర్వాత తమిళనాడు వెళ్లిన గులాబీ అధినేత డీఎంకే నాయకుడు స్టాలిన్‌, ఆ పార్టీ ఎంపీ కనిమొళి తదితరులను కలిసి వచ్చారు. అయితే కేసీఆర్‌ తిరుగుపయనమైన తర్వాత మీడియాతో మాట్లాడిన కనిమొళి అసలు తమ మధ్య ఫెడరల్‌ ఫ్రంట్‌ చర్చే రాలేదని చెప్పడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. భువనేశ్వర్‌ వెళ్లి ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తోనూ ఫెడరల్‌ ఫ్రంట్‌పై చర్చించారు కేసీఆర్‌. ఫెడరల్‌ ఫ్రంట్‌పై చర్చ జరుగుతున్న సమయంలోనే గతేడాది మే నెలలో ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ ఏకంగా హైదరాబాద్‌ వచ్చి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఆ పరిణామం కూడా విస్తృత చర్చకు దారితీసింది.
కేటీఆర్‌ను పీఠమెక్కించడానికేనా?
ఫెడరల్‌ ఫ్రంట్‌, ఢిల్లీపై యుద్ధం అంటూ కేసీఆర్‌ చేసిన హడావుడి వెనుక అంతర్గతంగా మరో అంశం కూడా ఇమిడి ఉందని సొంతపార్టీలోనే గుసగుసలు వినిపించాయి. తన కుమారుడు కేటీఆర్‌ను సీఎం పీఠంపై చూడాలన్న కేసీఆర్‌ కోరికలో భాగంగానే ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రతిపాదన తీసుకొచ్చారని ప్రచారం జరిగింది. కేసీఆర్‌ తెలంగాణ రాజకీయాలకే పరిమితమైనన్ని రోజులు.. కేటీఆర్‌ను సీఎం చేసే ప్రతిపాదన కార్యరూపం దాల్చే అవకాశం లేదు. అందుకే ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో జాతీయ స్థాయి రాజకీయాలపై దష్టి పెట్టి అటువైపు బిజీ అయితే రాష్ట్రంలో కేటీఆర్‌కు సీఎం సీటు అప్పగించడం సులువవుతుందన్న ఆలోచనలో భాగమే ఈ ప్రతిపాదన అని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేశారు.
అంతేకాదు, కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ వ్యూహం బీజేపీకి, ప్రధాని నరేంద్రమోదీకి అనుకూలమని కూడా అప్పట్లో విమర్శలు వచ్చాయి. మోదీ వ్యతిరేక శక్తులను మాత్రమే కేసీఆర్‌ ఏకం చేసే బాద్యత తీసుకున్నారని కూడా ఆరోపణలు వినిపించాయి.
ఈ నేపథ్యంలోనే సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా ఏడాది క్రితం వ్యూహాత్మకంగా ఈ డిమాండ్‌ వినిపించిన కేసీఆర్‌ గతేడాది డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన తర్వాత మీడియాకు కొన్ని లీకులిచ్చారు. చాలా రోజుల పాటు కేసీఆర్‌ ప్రగతిభవన్‌, ఫామ్‌హౌజ్‌కే పరిమితమైన సమయంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రయత్నాలను ముమ్మరం చేశారని, దానికి సంబం ధించిన కార్యాచరణలో నిమగ్నమైనందునే బయటకు రావడం లేదని వార్తలొచ్చాయి. కానీ అదేమీ లేదన్నది తర్వాత తేలిపోయింది.
ఇప్పుడు ఎన్నికలొచ్చాయి. పోలింగ్‌ దగ్గర పడుతోంది. కానీ.. ఆ ఊసుమాత్రం లేదు. కనీస చర్చ లేదు. కానీ మరో కొత్త నినాదం ఎత్తుకున్నారు కేసీఆర్‌. జాతీయస్థాయి పార్టీలన్నింటినీ ఏకం చేసి బీజేపీ, కాంగ్రెసేతర ఫ్రంట్‌ను తెరపైకి తెస్తానని చెప్పిన కేసీఆర్‌.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో చేస్తున్న ప్రకటనలు తెలంగాణకే పరిమితమవుతున్నాయి. తెలంగాణలోని 16 లోక్‌సభ సీట్లలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులను గెలిపిస్తే ఢిల్లీని శాసించగలుగు తామని ప్రగల్భాలు పలుకుతున్నారు. అవసరమైతే జాతీయ పార్టీని సైతం స్థాపిస్తానని చెబుతున్నారు. అయితే.. కేసీఆర్‌కు ఫెడరల్‌ ఫ్రంట్‌ విషయంలో స్పష్టత లేదని.. కేవలం ప్రజల్ని మభ్యపెట్టేందుకే ఇలా మాట్లాడుతున్నారని.. తెరాస 16 స్థానాల్లో గెలిచినా ఆయన ఢిల్లీలో చక్రం తిప్పలేరని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
బెడిసికొట్టిన వ్యూహం
ఫ్రంట్‌ పేరిట జాతీయ స్థాయి వ్యూహం అన్న కేసీఆర్‌… హఠాత్తుగా తెలంగాణకే పరిమితం కావడం వెనుక పలు కారణాలున్నాయంటున్నారు విశ్లేషకులు. కేసీఆర్‌ ఫ్రంట్‌ ప్రతిపాదనకు ఆయనతో కలిసి రావడానికి చాలా ప్రాంతీయ పార్టీలు సిద్ధంగా లేవని తెలుస్తోంది. ఆయన ప్రతిపాదన చేసిన సమయంలో ఊహించిన ప్రతిస్పందన రాకపోవడమే ఈ మార్పుకు కారణమంటున్నారు. పైగా ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి, నరేంద్రమోదీకి ఇప్పటికీ ఆదరణ తగ్గలేదన్న విషయం కూడా కేసీఆర్‌ ప్రతిపాదన మార్పుకు దోహదం చేసిందని చెబుతున్నారు.
కాంగ్రెస్‌లో కలవరం
మరోవైపు అధికార తెరాస తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని కనుమరుగు చేసేందుకు ప్రయత్నా లను ముమ్మరం చేసింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తెరాసలో చేరుతున్నట్లు ప్రకంటించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), చిరుమర్తి లింగయ్య (నకిరేకల్‌), ఆత్రం సక్కు (ఆసిఫాబాద్‌), రేగా కాంతారావు (పినపాక), సుధీర్‌ రెడ్డి (ఎల్బీనగర్‌), హరిప్రియ (ఇల్లెందు), వనమా వెంకటేశ్వరరావు (కొత్తగూడెం), కందాల ఉపేందర్‌ రెడ్డి (పాలేరు) తెరాసలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మరికొంత మంది సీనియర్‌ నేతలు సైతం కాంగ్రెస్‌ను వీడనున్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల వేళ ఎమ్మెల్యేల ఫిరాయింపులు కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు బెడసి కొట్టడంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా పార్టీ మారుతున్న నేతల్ని అధిష్టానం బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది. కేసీఆర్‌ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ తమ ఎమ్మెల్యేలకు డబ్బు ఆశ చూపి తెరాసలో చేర్చుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
– సప్తగిరి.జి, 9885086126

ఎన్నికల నగారా మోగింది..


ఎన్నికల నగారా మోగింది..

ఎన్నికల నగారా మోగింది..

ఎన్నికల నగారా మోగింది..
అందరికీ తెలిసిందే.. అనివార్యంగా జరగాల్సిందే. కానీ రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు ఇప్పుడో టెన్షన్‌ మొదలైంది. అవే లోక్‌సభ ఎన్నికలు.. ఒక్క అధికార పార్టీ మినహాయిస్తే అన్ని పార్టీలూ ఈ ఎన్నికలను ఓ రకంగా కాలంగాని కాలంలో వచ్చిన వర్షాలుగానే భావిస్తున్నాయి. మొన్నటికి మొన్న మూడు నెలల ముందే అసెంబ్లీ ఎన్నికల బరిలో బొక్కబోర్లాపడినంత పనయ్యింది. పైగా ఇంకా ఆ ఝలక్‌ నుంచి తేరుకోలేదు. అందుకే లోక్‌సభ ఎన్నికలు ఇంకాస్త ఆలస్యమైతే బాగుండునన్న ఆలోచనలోనే అన్ని పార్టీలు ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కానీ.. సమయానుకూలంగా ఎన్నికలను ఎదుర్కోలేక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో.. తమ సర్వశక్తులూ ఒడ్డి.. అసెంబ్లీ ఎన్నికల నష్టాన్ని లోక్‌సభ ఎన్నికలతో పూడ్చుకోవాలన్న ఆలోచనలో ప్రధాన రాజకీయ పార్టీలు మునిగి పోయాయి.
ఉన్నట్టుండి లోక్‌సభ ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల్లో సందడి మొదలైంది. డిసెంబరు ఏడో తేదీన శాసనసభ ఎన్నికలు జరగగా.. నాలుగు నెలల వ్యవధిలోనే.. ఏప్రిల్‌ 11న లోక్‌సభ ఎన్నికలకు రంగం సిద్ధం కావడంతో ఎన్నికల వాతావరణం నెలకొంది. పోలింగ్‌కు నెల రోజులే గడువు ఉండటంతో పార్టీలు యుద్ధప్రాతిపదికన ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి? అభ్యర్థులను ఎలా ఖరారు చేయాలి? వంటి అంశాలపై ప్రత్యేకంగా దష్టిసారించాయి.
తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పటికే ఎన్నికల సన్నాహాల్లో ఉంది. సీఎం కేసీఆర్‌ ఇదివరకే అభ్యర్థులపై ఓ విడత కసరత్తు చేశారు. కేసీఆర్‌ కుమారుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆధ్వర్యంలో పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గాల ఎన్నికల సన్నాహక సమావేశాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికలకు టికెట్లను ఆశించే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకొని ఢిల్లీలో అధిష్టానానికి పంపింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ నెల 9న హైదరాబాద్‌ శివారులో భారీ బహిరంగ సభ నిర్వహించారు. కేంద్రంలో అధికార ఎన్డీయేను నడిపిస్తోన్న భారతీయ జనతాపార్టీ కూడా లోక్‌సభ ఎన్నికలపై సీరియస్‌గా దష్టిపెట్టింది. మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీకి సై అంటున్నది బీజేపీ. ముఖ్యనేతలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ఎంఐఎం షరామామూలుగానే అధికార టీఆర్‌ఎస్‌ సహకారంతో హైదరాబాద్‌ నుంచి పోటీకి సన్నద్ధ మయింది. అటు.. టీడీపీ శ్రేణులు లోక్‌సభ బరికి సిద్ధమవుతున్నాయి. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ పార్టీలు కలిసి ‘ప్రజా కూటమి’ పేరుతో పొత్తు కుదుర్చుకుని బరిలోకి దిగాయి. లోక్‌సభ బరిలో మాత్రం పార్టీలన్నీ ఒంటరిగానే పోటీకి దిగుతున్నాయి.
ఈనెల 11న తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలకు సంబంధించి నేతలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. మిత్రపక్షం ఎంఐఎంతో కలిసి లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ క్లీన్‌ స్వీప్‌ చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలనే ఈ ఎన్నికల్లోనూ రిపీట్‌ చేయాలని గులాబీ పార్టీ భావిస్తోంది. ఇందుకోసం అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనుసరించిన వ్యూహాలనే అమలు చేస్తోంది. ప్రత్యర్థి కంటే ముందే లోక్‌సభ ఎన్నికల సన్నాహాక సదస్సు పేరుతో ప్రచార పర్వంలో దిగిన టీఆర్‌ఎస్‌.. ఇప్పుడు దాన్ని మరింత వేగవంతం చేసే ఆలోచనలో ఉంది. ఈ నేపథ్యంలో గులాబీ బాస్‌ కేసీఆర్‌ నేరుగా ప్రచార బరిలోకి దిగనున్నారు. పలు నియోజకవర్గాల పరిధిలో జరిగే బహిరంగ సభల్లో స్వయంగా కేసీఆర్‌ పాల్గొననున్నారు. ఎప్పటిలాగే తనకు కలిసొచ్చిన కరీంనగర్‌ నుంచే ఆయన మరోసారి ప్రచారాన్ని ప్రారంభి స్తున్నారు. లోక్‌సభ నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో జన సమీకరణ భారీగా ఉండాలని.. 2లక్షలకు మించి జనం తగ్గవద్దని సూచించారు. ప్రతీ లోక్‌సభ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కష్టపడి పనిచేయాలని.. అభ్యర్థుల గెలుపు బాధ్యతలను భుజాన వేసుకోవాలని కేసీఆర్‌ వారితో చెప్పారు.
మరోవైపు.. లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచే విషయంలో రాష్ట్రంలోని పలు చిన్న పార్టీలు తర్జనభర్జన పడుతున్నాయి. తెలంగాణ జనసమితి, జనసేన, సీపీఐ, సీపీఎంలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. పోటీ విషయమై ఇప్పటివరకు సీపీఐ నుంచి మాత్రమే స్పష్టత వచ్చింది. ఖమ్మం, భువనగిరి స్థానాల్లో తాము పోటీ చేస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. సీపీఎం నల్లగొండ, మహబూబాబాద్‌ స్థానాల్లో అభ్యర్థులను రంగంలోకి దించి, ఇతర ప్రాంతాల్లో బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించిందని సమాచారం. కోదండరాం నేతత్వంలోని టీజేఎస్‌లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ విషయమై స్పష్టత వచ్చేందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న నేతలు పోటీ చేసే స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో నిలపకూడదని తెలంగాణ ఇంటి పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయిం చింది. అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉంటామని, పార్లమెంటు బరిలో మాత్రం నిలుస్తామని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ గతంలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థులకు సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే.. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈ లోక్‌సభ ఎన్నికలకు కూడా సమయం చాలా తక్కువగా ఉంది. అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టోల ప్రకటన.. ఈలోపు జంపింగ్‌లు, జోస్యాలు చెప్పడాలు ఇలా చాలా చాలా ఉంటాయి. అయితే.. వీటన్నింటికి ఇప్పుడు సమయం చాలా తక్కువగా ఉందని రాజకీయ పార్టీలు భయపడుతున్నాయి. ఏ నియోజక వర్గానికి ఏ అభ్యర్థిని ఎంచుకోవాలనేది వివిధ పార్టీలకు ఇంకా కన్ఫ్యూజన్‌గానే ఉంది. ఇక గోడ దూకేవారికి కూడా ఏ పార్టీకి వెళ్లాలా అనే సందిగ్ధం నెలకొంది. అన్ని పార్టీలకు ప్రతి నిమిషం, ప్రతి క్షణం ఎంతో విలువైంది. నేతలందరూ నిద్రలేకుండా కష్టపడాల్సిందే. అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేయాల్సిందే. లేకపోతే.. వ్యూహాలు పనిచేసే అవకాశం ఇసుమంతైనా లేదు.
మరోకోణంలో చూస్తే.. పార్టీలకు, పోటీచేస్తున్న నాయకులకు ఆర్థికంగా కలిసొస్తుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ రోజుల్లో ఎన్నికల ప్రచారమంటే మాటలు కాదు. లక్షలకు లక్షలు ధారపోయాల్సిందే. ప్రచార వ్యవధి తక్కువగా ఉన్నందున ఈ ఎన్నికల్లో ఖర్చు మిగులుతుంది. ఏప్రిల్‌ 9వ తేదీ సాయంత్రానికే ప్రచార గడువు ముగుస్తుంది. అంటే మండే ఎండల ‘మే’ నుంచి నాయకులు తప్పించుకున్నట్లే.
అయితే.. ప్రచార వ్యవధి తక్కువగా ఉండటం వల్ల ఓటర్లను విస్తతంగా కలవడం కుదరదు. తొలినుంచీ ప్రజల్లో లేని అభ్యర్థులకు ఇది ఇబ్బందికర పరిణామం. మరోవైపు పోలింగ్‌ ముగిశాక ఫలితాల కోసం 42 రోజులపాటు ఉత్కంఠగా ఎదురు చూడాల్సిందే. మన రాష్ట్ర చరిత్రలో ఇప్పటిదాకా ఫలితాల కోసం ఇంత సుదీర్ఘంగా నిరీక్షించిన దాఖలాలు లేవు. ఈ సమయాన్ని బెట్టింగ్‌ రాయుళ్లు బాగా సద్వినియోగం చేసుకునే అవకాశముందని చెప్పవచ్చు. ఏప్రిల్‌ 11వ తేదీతోనే రాష్ట్రంలో ఎన్నికలు ముగిసినప్పటికీ.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దాదాపు రెండున్నర నెలలు – 74 రోజులు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుంది. గతంతో పోలిస్తే పోలింగ్‌ 9 నుంచి ఏడు విడతలకు తగ్గినప్పటికీ, ఎన్నికల కోడ్‌ కాలం, ఫలితాల కోసం నిరీక్షణ సమయం పెరిగాయి. అయితే 2014 మార్చిలో షెడ్యూల్‌ విడుదల చేసి తొమ్మిది విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ఏడు, ఎనిమిదో విడతల్లో ఏపీ, తెలంగాణల్లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభకు తొలి విడతలోనే రెండు దఫాలుగా ఎన్నికలు జరిగాయి. అప్పట్లో పోలింగ్‌కు, ఓట్ల లెక్కింపునకు మధ్య 30 రోజుల విరామం ఉంది. 2004లో నాలుగో విడత కింద ఒకేసారి రాష్ట్రమంతా ఎన్నికలు జరిపారు. అప్పుడు 18 రోజుల వ్యవధిలోనే ఫలితాలు వెలువడ్డాయి. అయితే, ఈసారి ఏపీ, తెలంగాణకు తొలివిడతలోనే పోలింగ్‌ ముగుస్తోంది. ఏపీలో లోక్‌సభతో పాటు అసెంబ్లీకీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ముందస్తుకు వెళ్లినందున ఇక్కడ లోక్‌సభ ఎన్నికలు మాత్రమే జరగనున్నాయి. హైదరాబాద్‌లో స్థిరపడిన చాలా మంది సీమాంధ్రులకు సొంతూళ్లలోనూ ఓట్లు ఉన్నాయని వేర్వేరు రోజుల్లో ఎన్నికలు జరిపితే రెండు చోట్లా ఓటు వేస్తారని ఎన్నికల కమిషన్‌కు వైసీపీ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఒకేవిడతలో, ఒకే రోజు పోలింగ్‌ ముగించాలని ఈసీ నిర్ణయించినట్లు భావిస్తున్నారు.
– సప్తగిరి.జి, 9885086126

చారిత్రక వైభవం.. ఆధ్యాత్మిక వైభోగం…