పోరుబాట వదిలి పోటీకి…
దేశవ్యాప్తంగా
లోక్‌సభ ఎన్నికల హడావుడి మొదలైంది. రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాకు
చెందిన రైతులు తమ డిమాండ్‌ల సాధనకు ఈ ఎన్నికలనే అస్త్రంగా ఎంచుకున్నారు.
పండించిన పంటకు గిట్టుబాట ధర కల్పించాలనే డిమాండ్‌తో తీవ్రస్థాయిలో
ఆందోళనలు చేసినా ఫలితం లేకపోయేసరికి పసుపు, ఎర్రజొన్న రైతులు ఎన్నికల
బాటపట్టారు. పెద్దఎత్తున నామినేషన్ల పర్వానికి తెరదీశారు. గతంలో వీరు
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నాయకులకు తమ గోడును
వినిపించేందుకు అసెంబ్లీ ముట్టడికీ విఫలయత్నం చేశారు. రహదారులను
నిర్బంధించి వంటా వార్పూ చేపట్టారు. అయినా ఫలితం దక్కలేదు. దీంతో ప్రత్యక్ష
ఎన్నికల్లో పాల్గొని తమ నిరసన తెలపాలనుకున్నారు.
నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి మొత్తం
245 నామినేషన్లు రాగా, అందులో అత్యధిక భాగం (దాదాపు 80 శాతం) రైతులవే కావడం
విశేషం. ప్రస్తుతం ఎన్నికల సంఘం ఉపయోగిస్తున్న ఈవీఎంల ద్వారా 93 మంది
అభ్యర్థులకే పోలింగ్ నిర్వహించే అవకాశం ఉన్నందున ఇక్కడ బ్యాలెట్ విధానంలో
పోలింగ్ జరగనున్నట్లుగా తెలుస్తోంది. నామినేషన్ల ఉపసంహరణకు ఇంకా గడువు
(మార్చి 28) ఉంది. అనంతరం అభ్యర్థుల సంఖ్యను బట్టి ఎన్నికల సంఘం నిర్ణయం
తీసుకోనుంది. దీంతో రాజకీయ పార్టీలు రైతు డిమాండ్ల పట్ల సానుకూల వైఖరి
చూపిస్తూ వారికి హామీలిస్తూ నామినేషన్లను వెనక్కి తీసుకోవాలని
బుజ్జగిస్తున్నాయి. ఖమ్మం జిల్లా సొబాబుల్ సాగు రైతులు సైతం ఇదే తరహా
నామినేషన్ల ప్రక్రియకు తెరదీశారు. అయితే.. అక్కడ రాజకీయ నాయకులు వారిని
శాంతింపజేసి డిమాండ్ల సాధనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
నిజామాబాద్‌లోని ఆర్మూర్, కోరుట్ల,
జగిత్యాల ప్రాంతాల్లో పసుపు, ఎర్రజొన్న పంటలు ఎక్కువ విస్తీర్ణంలో
పండిస్తుంటారు. ఈ సంవత్సరం ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 36 వేల ఎకరాల్లో
పసుపు, 49 వేల ఎకరాల్లో ఎర్రజొన్న సాగు చేశారు. ఈ రెండు పంటలు ప్రభుత్వం
కొనుగోలు చేసే జాబితాలో లేవు. వ్యాపారులు మార్కెట్ డిమాండ్ ఆధారంగా ధరలు
నిర్ణయించి కొంటారు. దీంతో రైతులు గిట్టుబాటు ధర లభించక మోసపోతున్నారు.
వ్యవసాయాధారిత ప్రాంతమైన నిజామాబాద్
పార్లమెంట్ పరిధిలో మొత్తం 3.5 లక్షల మంది రైతులున్నారు. ఎన్నికల్లో వీరి
ప్రభావం అధికం. దీంతో రాజకీయ పార్టీలు ఎన్నికల సమయాల్లో వీరందరిని
ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రచారాస్త్రాలు సిద్ధం చేసుకుంటుంటాయి. అయితే ఈసారి
రైతులే నామినేషన్ల ద్వారా తమ నిరసనను తెలుపు తూండటంతో సర్వత్రా ఆసక్తి
నెలకొంది.
ఈ నేపథ్యంలో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం
మళ్లీ అధికారంలోకి వస్తే పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని భాజపా జాతీయ
ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ వెల్లడించారు. పసుపు, ఎర్రజొన్న, చెరుకు
పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని ఇటీవల ఆర్మూర్‌లో జరిగిన ఎన్నికల
బహిరంగ సభలో ప్రకటించారు. నిజామాబాద్ ఎంపీ కవిత రైతుల సమస్యల్ని కేంద్ర
ప్రభుత్వం దృష్టికి తెచ్చి ఉంటే సమస్యలు ఎప్పుడో పరిష్కారమయ్యేవన్నారు.
ఎందుకీ దాహం..
మరోవైపు రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇంతకు
ముందెన్నడూ చూడని పరిణామాలు ప్రస్తుతం చోటు చేసుకుంటున్నాయి. అవసరమున్నా
లేకపోయినా పార్టీ ఫిరాయింపులు కొత్త కోణాలను ఆవిష్క రిస్తున్నాయి. ఇటీవల
అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి తిరుగులేని
విజయాన్ని నమోదు చేసుకుంది. మొత్తం 88 అసెంబ్లీ స్థానాల్లో ఘనవిజయం
సాధించింది. మేజిక్ ఫిగర్‌ను కూడా అధిగమించి విపక్షాలు అందుకోలేని
స్థాయిలో దూసుకుపోయింది.
ఈ క్రమంలో దాదాపు 3 నెలల తర్వాత రాష్ట్ర
మంత్రివర్గం కొలువుదీరింది. కానీ ప్రతిపక్షాలకు చెందిన కొంతమంది
ఎమ్మెల్యేలు అవసరం లేకున్నా తెరాసలో చేరుతున్నారు. ఆలిండియా ఫార్వార్డ్
బ్లాక్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకొని అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఒక
ఎమ్మెల్యే వారం తిరక్కుండానే గులాబీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత
కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన కొంతమంది నేతలు కూడా టీఆర్‌ఎస్‌లో
చేరేందుకు క్యూలు కట్టారు. దీంతో అసెంబ్లీలో తెరాస పార్టీ బలం 88 నుంచి
ఏకంగా వంద (సెంచరీ)కి చేరింది.
ఒకప్పుడు ఎమ్మెల్యేలు పార్టీ
ఫిరాయించారంటే రాజకీయ పార్టీలు మేజిక్ ఫిగర్ కోసం పడే తాపత్రయం
కనిపించేది. కానీ ఇప్పుడు అలాంటి సందర్భం అవసరం లేదు. విస్తత, సామాజిక
కోణం అన్న అంశాల ప్రస్తావనే లేదు. ఇవాళ సాయంత్రం ప్రత్యర్థి పార్టీ
అధినేతను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన ఒక నాయకుడు.. మరుసటిరోజు ఉదయం
అదే ప్రత్యర్థిపార్టీ అధినేత చేతుల మీదుగా ఆ పార్టీ కండువా
కప్పుకుంటున్నాడు. ఆరోజు సాయంత్రానికి ఆ పార్టీ కండువా పక్కన పడేసి..
మరుసటిరోజు ఉదయానికి ఇంకో పార్టీ జెండా చేతిలో పట్టు కుంటాడు. ఎన్నికల
సమయాల్లో ఇది సాధారణం. అయితే.. ఎన్నికల తర్వాత కూడా అవసరం ఉన్నా లేకున్నా
పార్టీ కండువాలు మార్చడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఇప్పటికే సగానికి సగం కాంగ్రెస్
ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ వైపు ఆకర్షితులు అయ్యారు. ఈ వలసలు ఇంతటితో ఆగవని,
లోక్‌సభ ఎన్నికలు ముగిసేలోపు మరికొన్ని ఫిరాయింపులు ఉండే అవకాశం ఉందని
ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే.. ఏకంగా కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని
టీఆర్‌ఎస్‌లో విలీనం చేసే ప్రయత్నాలు కూడా తెరవెనుక సాగుతున్నాయన్న వాదనలు
వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలను కాపాడుకో లేని పరిస్థితిలో కాంగ్రెస్
ఉండగా ఓడిపోయిన పలువురు సీనియర్ నేతలు, కీలక నాయకులు.. మంత్రి పదవులు కూడా
చేపట్టిన వాళ్లు ఇతర పార్టీల వైపు చూస్తున్నారన్న వార్తలు ఆ పార్టీ అధినాయ
కత్వాన్ని కలవర పెడుతున్నాయి. కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన
వారిని టీఆర్‌ఎస్ ఎగరేసుకు పోతుండగా, ఓడినప్పటికీ గతంలో ఓ వెలుగు వెలిగిన
నేతలను తనవైపు లాక్కోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. ఏవేవో కారణాల రీత్యా
టీఆర్‌ఎస్‌లో చేరలేని వారిని కమలదళం పిలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్
సీనియర్ నాయకురాలు డీకే అరుణ ఢిల్లీ వెళ్లి కాషాయ కండువా కప్పుకున్నారు.
మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి ఆమె పోటీ చేస్తున్నారు.
– సప్తగిరి. జి, 9885086126
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి