26, జూన్ 2019, బుధవారం

ఆరంభశూరత్వం.. ‘ఫెడరల్‌ ఫ్రంట్‌’

ఆరంభశూరత్వం.. ‘ఫెడరల్‌ ఫ్రంట్‌’

ఆరంభశూరత్వం.. ‘ఫెడరల్‌ ఫ్రంట్‌’
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల కరీంనగర్‌ జిల్లాలో లోక్‌సభ ఎన్నికల సమర శంఖారావం మోగించారు. మొన్నటిదాకా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఊసే ఎత్తని ఆయన ఆ వేదికపై తిరిగి కాంగ్రెస్‌, భాజపాలను తిట్టే కార్యక్రమానికి తెరదీశారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో తెరాసకు 16 సీట్లు ఇచ్చి గెలిపిస్తే భారత్‌ దశ, దిశ మారుస్తానని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్‌, భాజపాలు దేశాన్ని అంధకారంలోకి నెట్టాయని విమర్శించారు. భారతావనిని ప్రగతి పథంలో నడిపేందుకు ఈ ఎన్నికల తర్వాత అవసరమైతే జాతీయ పార్టీని సైతం ఏర్పాటు చేస్తానని కొత్తరాగం అందుకున్నారు.
పురిటిలోనే సంధి
రాష్ట్రాలపై ఢిల్లీ పెత్తనమేంటని ప్రశ్నించారు. జాతీయ పార్టీలతో దేశానికి నష్టమన్నారు. ఢిల్లీ గద్దెనెక్కుతున్న జాతీయ పార్టీలకు రాష్ట్రాల బాధలు తెలియవన్నారు. క్షేత్రస్థాయిలో అభివృద్ధిని విస్మరించడం వల్ల దేశం దుర్భర స్థితికి చేరుతోంద న్నారు. ఇప్పటికైనా మేల్కొనకపోతే రాష్ట్రాల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారవుతుందని ప్రాంతీయ పార్టీలను ఎగదోసే ప్రయత్నం చేశారు. ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీకి ప్రత్యామ్నాయం అవసరమని మైకుల్లో హోరెత్తించారు. ప్రాంతీయ పార్టీలన్నింటినీ కలిపి ఢిల్లీ నేతల్లో వణుకు పుట్టిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అప్పటికప్పుడు ప్రత్యేక విమానాల్లో ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలు తిరిగారు. ప్రాంతీయ పార్టీలతో ప్రకంపనలు పుట్టిస్తాం చూడండంటూ మీడియా ముందు ధీమాగా చెప్పారు. దాదాపు రెండు, మూడు నెలల పాటు పర్యటనలు, ప్రకటనలు, లీకులతో ఊదరగొట్టారు. అసలేం జరుగుతుందో అన్న ఆసక్తిని రేకెత్తించారు. ఆయా రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు, ప్రజల అటెన్షన్‌ కూడా ఇటువైపు పడేలా చేశారు. ఇవన్నీ చేసింది తెలంగాణ సీఎం కేసీఆర్‌ అయితే.. జాతీయ స్థాయిలో తీసుకొస్తానన్నది ఫెడరల్‌ ఫ్రంట్‌..
ఏడాది క్రితం కేసీఆర్‌ ఈ సరికొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల్లో ఆలోచన రేకెత్తించారు. ఎప్పటికో కాదు.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనే తమ సత్తా చూపిస్తామని, ప్రాంతీయ పార్టీల బలమేంటో తెలిసేలా చేస్తానని కూడా కేసీఆర్‌ చెప్పుకొచ్చారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు తిరిగి ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొస్తానని, ఢిల్లీ పెత్తనానికి అడ్డుకట్ట వేసి రాష్ట్రాలకే నిర్ణయాధికారం వచ్చేలా చేసి చూపిస్తానన్నారు. కానీ అది ఆరంభ శూరత్వంగానే మారిపోయిందన్నది తర్వాత పరిణామాలతో తేటతెల్లమైంది.
ఈ క్రమంలోనే ఆగమేఘాల మీద కోల్‌కతా వెళ్లిన కేసీఆర్‌ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిశారు. జాతీయ పార్టీలకు దీటుగా ప్రాంతీయ పార్టీలు ఏకం కావాల్సిన అవసరాన్ని చెప్పారు. అయితే మొదటినుంచీ కాంగ్రెస్‌, బీజేపీలకు వ్యతిరేకంగా థర్డ్‌ ఫ్రంట్‌ పైనే దష్టిపెట్టి ఏకంగా ప్రధాని సీటుపైనే కన్నేసిన మమతా బెనర్జీ కేసీఆర్‌ ప్రతిపాదనపై చర్చించారు. ఆ తర్వాత తమిళనాడు వెళ్లిన గులాబీ అధినేత డీఎంకే నాయకుడు స్టాలిన్‌, ఆ పార్టీ ఎంపీ కనిమొళి తదితరులను కలిసి వచ్చారు. అయితే కేసీఆర్‌ తిరుగుపయనమైన తర్వాత మీడియాతో మాట్లాడిన కనిమొళి అసలు తమ మధ్య ఫెడరల్‌ ఫ్రంట్‌ చర్చే రాలేదని చెప్పడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. భువనేశ్వర్‌ వెళ్లి ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తోనూ ఫెడరల్‌ ఫ్రంట్‌పై చర్చించారు కేసీఆర్‌. ఫెడరల్‌ ఫ్రంట్‌పై చర్చ జరుగుతున్న సమయంలోనే గతేడాది మే నెలలో ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ ఏకంగా హైదరాబాద్‌ వచ్చి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఆ పరిణామం కూడా విస్తృత చర్చకు దారితీసింది.
కేటీఆర్‌ను పీఠమెక్కించడానికేనా?
ఫెడరల్‌ ఫ్రంట్‌, ఢిల్లీపై యుద్ధం అంటూ కేసీఆర్‌ చేసిన హడావుడి వెనుక అంతర్గతంగా మరో అంశం కూడా ఇమిడి ఉందని సొంతపార్టీలోనే గుసగుసలు వినిపించాయి. తన కుమారుడు కేటీఆర్‌ను సీఎం పీఠంపై చూడాలన్న కేసీఆర్‌ కోరికలో భాగంగానే ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రతిపాదన తీసుకొచ్చారని ప్రచారం జరిగింది. కేసీఆర్‌ తెలంగాణ రాజకీయాలకే పరిమితమైనన్ని రోజులు.. కేటీఆర్‌ను సీఎం చేసే ప్రతిపాదన కార్యరూపం దాల్చే అవకాశం లేదు. అందుకే ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో జాతీయ స్థాయి రాజకీయాలపై దష్టి పెట్టి అటువైపు బిజీ అయితే రాష్ట్రంలో కేటీఆర్‌కు సీఎం సీటు అప్పగించడం సులువవుతుందన్న ఆలోచనలో భాగమే ఈ ప్రతిపాదన అని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేశారు.
అంతేకాదు, కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ వ్యూహం బీజేపీకి, ప్రధాని నరేంద్రమోదీకి అనుకూలమని కూడా అప్పట్లో విమర్శలు వచ్చాయి. మోదీ వ్యతిరేక శక్తులను మాత్రమే కేసీఆర్‌ ఏకం చేసే బాద్యత తీసుకున్నారని కూడా ఆరోపణలు వినిపించాయి.
ఈ నేపథ్యంలోనే సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా ఏడాది క్రితం వ్యూహాత్మకంగా ఈ డిమాండ్‌ వినిపించిన కేసీఆర్‌ గతేడాది డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన తర్వాత మీడియాకు కొన్ని లీకులిచ్చారు. చాలా రోజుల పాటు కేసీఆర్‌ ప్రగతిభవన్‌, ఫామ్‌హౌజ్‌కే పరిమితమైన సమయంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రయత్నాలను ముమ్మరం చేశారని, దానికి సంబం ధించిన కార్యాచరణలో నిమగ్నమైనందునే బయటకు రావడం లేదని వార్తలొచ్చాయి. కానీ అదేమీ లేదన్నది తర్వాత తేలిపోయింది.
ఇప్పుడు ఎన్నికలొచ్చాయి. పోలింగ్‌ దగ్గర పడుతోంది. కానీ.. ఆ ఊసుమాత్రం లేదు. కనీస చర్చ లేదు. కానీ మరో కొత్త నినాదం ఎత్తుకున్నారు కేసీఆర్‌. జాతీయస్థాయి పార్టీలన్నింటినీ ఏకం చేసి బీజేపీ, కాంగ్రెసేతర ఫ్రంట్‌ను తెరపైకి తెస్తానని చెప్పిన కేసీఆర్‌.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో చేస్తున్న ప్రకటనలు తెలంగాణకే పరిమితమవుతున్నాయి. తెలంగాణలోని 16 లోక్‌సభ సీట్లలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులను గెలిపిస్తే ఢిల్లీని శాసించగలుగు తామని ప్రగల్భాలు పలుకుతున్నారు. అవసరమైతే జాతీయ పార్టీని సైతం స్థాపిస్తానని చెబుతున్నారు. అయితే.. కేసీఆర్‌కు ఫెడరల్‌ ఫ్రంట్‌ విషయంలో స్పష్టత లేదని.. కేవలం ప్రజల్ని మభ్యపెట్టేందుకే ఇలా మాట్లాడుతున్నారని.. తెరాస 16 స్థానాల్లో గెలిచినా ఆయన ఢిల్లీలో చక్రం తిప్పలేరని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
బెడిసికొట్టిన వ్యూహం
ఫ్రంట్‌ పేరిట జాతీయ స్థాయి వ్యూహం అన్న కేసీఆర్‌… హఠాత్తుగా తెలంగాణకే పరిమితం కావడం వెనుక పలు కారణాలున్నాయంటున్నారు విశ్లేషకులు. కేసీఆర్‌ ఫ్రంట్‌ ప్రతిపాదనకు ఆయనతో కలిసి రావడానికి చాలా ప్రాంతీయ పార్టీలు సిద్ధంగా లేవని తెలుస్తోంది. ఆయన ప్రతిపాదన చేసిన సమయంలో ఊహించిన ప్రతిస్పందన రాకపోవడమే ఈ మార్పుకు కారణమంటున్నారు. పైగా ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి, నరేంద్రమోదీకి ఇప్పటికీ ఆదరణ తగ్గలేదన్న విషయం కూడా కేసీఆర్‌ ప్రతిపాదన మార్పుకు దోహదం చేసిందని చెబుతున్నారు.
కాంగ్రెస్‌లో కలవరం
మరోవైపు అధికార తెరాస తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని కనుమరుగు చేసేందుకు ప్రయత్నా లను ముమ్మరం చేసింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తెరాసలో చేరుతున్నట్లు ప్రకంటించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), చిరుమర్తి లింగయ్య (నకిరేకల్‌), ఆత్రం సక్కు (ఆసిఫాబాద్‌), రేగా కాంతారావు (పినపాక), సుధీర్‌ రెడ్డి (ఎల్బీనగర్‌), హరిప్రియ (ఇల్లెందు), వనమా వెంకటేశ్వరరావు (కొత్తగూడెం), కందాల ఉపేందర్‌ రెడ్డి (పాలేరు) తెరాసలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మరికొంత మంది సీనియర్‌ నేతలు సైతం కాంగ్రెస్‌ను వీడనున్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల వేళ ఎమ్మెల్యేల ఫిరాయింపులు కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు బెడసి కొట్టడంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా పార్టీ మారుతున్న నేతల్ని అధిష్టానం బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది. కేసీఆర్‌ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ తమ ఎమ్మెల్యేలకు డబ్బు ఆశ చూపి తెరాసలో చేర్చుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
– సప్తగిరి.జి, 9885086126

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి