26, జూన్ 2019, బుధవారం

ఎన్నికల నగారా మోగింది..

ఎన్నికల నగారా మోగింది..

ఎన్నికల నగారా మోగింది..
అందరికీ తెలిసిందే.. అనివార్యంగా జరగాల్సిందే. కానీ రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు ఇప్పుడో టెన్షన్‌ మొదలైంది. అవే లోక్‌సభ ఎన్నికలు.. ఒక్క అధికార పార్టీ మినహాయిస్తే అన్ని పార్టీలూ ఈ ఎన్నికలను ఓ రకంగా కాలంగాని కాలంలో వచ్చిన వర్షాలుగానే భావిస్తున్నాయి. మొన్నటికి మొన్న మూడు నెలల ముందే అసెంబ్లీ ఎన్నికల బరిలో బొక్కబోర్లాపడినంత పనయ్యింది. పైగా ఇంకా ఆ ఝలక్‌ నుంచి తేరుకోలేదు. అందుకే లోక్‌సభ ఎన్నికలు ఇంకాస్త ఆలస్యమైతే బాగుండునన్న ఆలోచనలోనే అన్ని పార్టీలు ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కానీ.. సమయానుకూలంగా ఎన్నికలను ఎదుర్కోలేక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో.. తమ సర్వశక్తులూ ఒడ్డి.. అసెంబ్లీ ఎన్నికల నష్టాన్ని లోక్‌సభ ఎన్నికలతో పూడ్చుకోవాలన్న ఆలోచనలో ప్రధాన రాజకీయ పార్టీలు మునిగి పోయాయి.
ఉన్నట్టుండి లోక్‌సభ ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల్లో సందడి మొదలైంది. డిసెంబరు ఏడో తేదీన శాసనసభ ఎన్నికలు జరగగా.. నాలుగు నెలల వ్యవధిలోనే.. ఏప్రిల్‌ 11న లోక్‌సభ ఎన్నికలకు రంగం సిద్ధం కావడంతో ఎన్నికల వాతావరణం నెలకొంది. పోలింగ్‌కు నెల రోజులే గడువు ఉండటంతో పార్టీలు యుద్ధప్రాతిపదికన ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి? అభ్యర్థులను ఎలా ఖరారు చేయాలి? వంటి అంశాలపై ప్రత్యేకంగా దష్టిసారించాయి.
తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పటికే ఎన్నికల సన్నాహాల్లో ఉంది. సీఎం కేసీఆర్‌ ఇదివరకే అభ్యర్థులపై ఓ విడత కసరత్తు చేశారు. కేసీఆర్‌ కుమారుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆధ్వర్యంలో పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గాల ఎన్నికల సన్నాహక సమావేశాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికలకు టికెట్లను ఆశించే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకొని ఢిల్లీలో అధిష్టానానికి పంపింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ నెల 9న హైదరాబాద్‌ శివారులో భారీ బహిరంగ సభ నిర్వహించారు. కేంద్రంలో అధికార ఎన్డీయేను నడిపిస్తోన్న భారతీయ జనతాపార్టీ కూడా లోక్‌సభ ఎన్నికలపై సీరియస్‌గా దష్టిపెట్టింది. మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీకి సై అంటున్నది బీజేపీ. ముఖ్యనేతలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ఎంఐఎం షరామామూలుగానే అధికార టీఆర్‌ఎస్‌ సహకారంతో హైదరాబాద్‌ నుంచి పోటీకి సన్నద్ధ మయింది. అటు.. టీడీపీ శ్రేణులు లోక్‌సభ బరికి సిద్ధమవుతున్నాయి. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ పార్టీలు కలిసి ‘ప్రజా కూటమి’ పేరుతో పొత్తు కుదుర్చుకుని బరిలోకి దిగాయి. లోక్‌సభ బరిలో మాత్రం పార్టీలన్నీ ఒంటరిగానే పోటీకి దిగుతున్నాయి.
ఈనెల 11న తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలకు సంబంధించి నేతలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. మిత్రపక్షం ఎంఐఎంతో కలిసి లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ క్లీన్‌ స్వీప్‌ చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలనే ఈ ఎన్నికల్లోనూ రిపీట్‌ చేయాలని గులాబీ పార్టీ భావిస్తోంది. ఇందుకోసం అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనుసరించిన వ్యూహాలనే అమలు చేస్తోంది. ప్రత్యర్థి కంటే ముందే లోక్‌సభ ఎన్నికల సన్నాహాక సదస్సు పేరుతో ప్రచార పర్వంలో దిగిన టీఆర్‌ఎస్‌.. ఇప్పుడు దాన్ని మరింత వేగవంతం చేసే ఆలోచనలో ఉంది. ఈ నేపథ్యంలో గులాబీ బాస్‌ కేసీఆర్‌ నేరుగా ప్రచార బరిలోకి దిగనున్నారు. పలు నియోజకవర్గాల పరిధిలో జరిగే బహిరంగ సభల్లో స్వయంగా కేసీఆర్‌ పాల్గొననున్నారు. ఎప్పటిలాగే తనకు కలిసొచ్చిన కరీంనగర్‌ నుంచే ఆయన మరోసారి ప్రచారాన్ని ప్రారంభి స్తున్నారు. లోక్‌సభ నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో జన సమీకరణ భారీగా ఉండాలని.. 2లక్షలకు మించి జనం తగ్గవద్దని సూచించారు. ప్రతీ లోక్‌సభ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కష్టపడి పనిచేయాలని.. అభ్యర్థుల గెలుపు బాధ్యతలను భుజాన వేసుకోవాలని కేసీఆర్‌ వారితో చెప్పారు.
మరోవైపు.. లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచే విషయంలో రాష్ట్రంలోని పలు చిన్న పార్టీలు తర్జనభర్జన పడుతున్నాయి. తెలంగాణ జనసమితి, జనసేన, సీపీఐ, సీపీఎంలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. పోటీ విషయమై ఇప్పటివరకు సీపీఐ నుంచి మాత్రమే స్పష్టత వచ్చింది. ఖమ్మం, భువనగిరి స్థానాల్లో తాము పోటీ చేస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. సీపీఎం నల్లగొండ, మహబూబాబాద్‌ స్థానాల్లో అభ్యర్థులను రంగంలోకి దించి, ఇతర ప్రాంతాల్లో బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించిందని సమాచారం. కోదండరాం నేతత్వంలోని టీజేఎస్‌లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ విషయమై స్పష్టత వచ్చేందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న నేతలు పోటీ చేసే స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో నిలపకూడదని తెలంగాణ ఇంటి పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయిం చింది. అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉంటామని, పార్లమెంటు బరిలో మాత్రం నిలుస్తామని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ గతంలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థులకు సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే.. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈ లోక్‌సభ ఎన్నికలకు కూడా సమయం చాలా తక్కువగా ఉంది. అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టోల ప్రకటన.. ఈలోపు జంపింగ్‌లు, జోస్యాలు చెప్పడాలు ఇలా చాలా చాలా ఉంటాయి. అయితే.. వీటన్నింటికి ఇప్పుడు సమయం చాలా తక్కువగా ఉందని రాజకీయ పార్టీలు భయపడుతున్నాయి. ఏ నియోజక వర్గానికి ఏ అభ్యర్థిని ఎంచుకోవాలనేది వివిధ పార్టీలకు ఇంకా కన్ఫ్యూజన్‌గానే ఉంది. ఇక గోడ దూకేవారికి కూడా ఏ పార్టీకి వెళ్లాలా అనే సందిగ్ధం నెలకొంది. అన్ని పార్టీలకు ప్రతి నిమిషం, ప్రతి క్షణం ఎంతో విలువైంది. నేతలందరూ నిద్రలేకుండా కష్టపడాల్సిందే. అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేయాల్సిందే. లేకపోతే.. వ్యూహాలు పనిచేసే అవకాశం ఇసుమంతైనా లేదు.
మరోకోణంలో చూస్తే.. పార్టీలకు, పోటీచేస్తున్న నాయకులకు ఆర్థికంగా కలిసొస్తుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ రోజుల్లో ఎన్నికల ప్రచారమంటే మాటలు కాదు. లక్షలకు లక్షలు ధారపోయాల్సిందే. ప్రచార వ్యవధి తక్కువగా ఉన్నందున ఈ ఎన్నికల్లో ఖర్చు మిగులుతుంది. ఏప్రిల్‌ 9వ తేదీ సాయంత్రానికే ప్రచార గడువు ముగుస్తుంది. అంటే మండే ఎండల ‘మే’ నుంచి నాయకులు తప్పించుకున్నట్లే.
అయితే.. ప్రచార వ్యవధి తక్కువగా ఉండటం వల్ల ఓటర్లను విస్తతంగా కలవడం కుదరదు. తొలినుంచీ ప్రజల్లో లేని అభ్యర్థులకు ఇది ఇబ్బందికర పరిణామం. మరోవైపు పోలింగ్‌ ముగిశాక ఫలితాల కోసం 42 రోజులపాటు ఉత్కంఠగా ఎదురు చూడాల్సిందే. మన రాష్ట్ర చరిత్రలో ఇప్పటిదాకా ఫలితాల కోసం ఇంత సుదీర్ఘంగా నిరీక్షించిన దాఖలాలు లేవు. ఈ సమయాన్ని బెట్టింగ్‌ రాయుళ్లు బాగా సద్వినియోగం చేసుకునే అవకాశముందని చెప్పవచ్చు. ఏప్రిల్‌ 11వ తేదీతోనే రాష్ట్రంలో ఎన్నికలు ముగిసినప్పటికీ.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దాదాపు రెండున్నర నెలలు – 74 రోజులు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుంది. గతంతో పోలిస్తే పోలింగ్‌ 9 నుంచి ఏడు విడతలకు తగ్గినప్పటికీ, ఎన్నికల కోడ్‌ కాలం, ఫలితాల కోసం నిరీక్షణ సమయం పెరిగాయి. అయితే 2014 మార్చిలో షెడ్యూల్‌ విడుదల చేసి తొమ్మిది విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ఏడు, ఎనిమిదో విడతల్లో ఏపీ, తెలంగాణల్లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభకు తొలి విడతలోనే రెండు దఫాలుగా ఎన్నికలు జరిగాయి. అప్పట్లో పోలింగ్‌కు, ఓట్ల లెక్కింపునకు మధ్య 30 రోజుల విరామం ఉంది. 2004లో నాలుగో విడత కింద ఒకేసారి రాష్ట్రమంతా ఎన్నికలు జరిపారు. అప్పుడు 18 రోజుల వ్యవధిలోనే ఫలితాలు వెలువడ్డాయి. అయితే, ఈసారి ఏపీ, తెలంగాణకు తొలివిడతలోనే పోలింగ్‌ ముగుస్తోంది. ఏపీలో లోక్‌సభతో పాటు అసెంబ్లీకీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ముందస్తుకు వెళ్లినందున ఇక్కడ లోక్‌సభ ఎన్నికలు మాత్రమే జరగనున్నాయి. హైదరాబాద్‌లో స్థిరపడిన చాలా మంది సీమాంధ్రులకు సొంతూళ్లలోనూ ఓట్లు ఉన్నాయని వేర్వేరు రోజుల్లో ఎన్నికలు జరిపితే రెండు చోట్లా ఓటు వేస్తారని ఎన్నికల కమిషన్‌కు వైసీపీ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఒకేవిడతలో, ఒకే రోజు పోలింగ్‌ ముగించాలని ఈసీ నిర్ణయించినట్లు భావిస్తున్నారు.
– సప్తగిరి.జి, 9885086126

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి