తెలంగాణ జన సమితి వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ కోదండరాం ఈ నెల 29వ తేదీన హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ గ్రౌండ్‌లో భారీ ఎత్తున పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సభకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిని నిరాకరించింది. దీంతో సభకు అనుమతి కోసం ఆ పార్టీ ప్రారంభంలోనే కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది.
టి జెఏసి ఆధ్వర్యంలో ఆ మధ్యన ‘కొలువుల కొట్లాట’ పేరుతో ఓ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని కోదాండరాం భావించారు. అయితే దానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో జెఏసి నేతలు కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నారు. ట్యాంక్ బండ్‌పై ‘మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభ’ ను వేలాది మందితో నిర్వహించాలని ఆయన భావించారు. దీనికి కూడా ప్రభుత్వం అడ్డుపడింది. ఆ సభ నిర్వహిస్తే నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతా యని నాయకులను ముందుస్తు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా రాజకీయ స్వేచ్ఛ లభించడం లేదని, రాష్ట్రంలో రాచరికపుపాలన రాజ్యమేలుతోందని తెలంగాణ జన సమితి పార్టీ నేతలతో సహా పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నాడు సమైక్య రాష్ట్రంలో టిజెఏసి ఉద్యమ సంస్థగా ఉన్నప్పుడు అనుమతులు నిరాకరించడం గురించి అంతగా చర్చ జరగకున్నా ఒక రాజకీయ పార్టీ సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపై తెలంగాణ వ్యాప్తంగా తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని ప్రజలు భావిస్తున్నారు.
టిజెఏసి నేతలు కోర్టులకు వెళ్లడం.. అను మతులుతెచ్చుకోవడం.. కొత్తేమీకాదు. కాని తెలం గాణ రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి కొన సాగుతోండటం ఆక్షేపణీ య మంటున్నారు టిజెఏసిని మద్దతుదార్లు.
సమైక్య రాష్ట్రంలో ఎదుర్కొన్న సమస్యలే సొంత రాష్ట్రం లోనూ మరింత ఎక్కువ కావడంతో టిఆర్‌ఎస్‌ను రాజకీయంగానే ఢీకొనాలని కోదండరాం భావించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ జన సమితి పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 29వ తేదీన సరూర్‌నగర్ గ్రౌండ్‌లో ఆవిర్భావ సభను గ్రాండ్‌గా నిర్వహించా లనుకున్నారు. హైదరాబాద్‌లో సభ నిర్వహిస్తే ట్రాఫిక్, వాతావరణ సమస్యలు తలెత్తుతాయని పోలీసులు పలు కారణాలు చెప్పి సభకు అనుమతిని నిరాకరిం చారు. అయితే ఇటీవల ఎల్బీ స్టేడియంలో ఓ సినిమా ఫంక్షన్‌ను గ్రాండ్‌గా నిర్వహించారని, అప్పుడు జరగని పొల్యూషన్ తాము నిర్వహించే సభ వల్లే జరుగుతుందా ? అని కోదండరాం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం తమకు ఇష్టం లేనివారి పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదని, సభలు, మీటింగ్‌లు పెట్టుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కని, ఆ హక్కును కెసిఆర్ కాలరాస్తున్నారని పలువురు తెలంగాణ జన సమితి నాయకులు మండిపడుతున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కోర్టులకు వెళ్లి సభలకు అనుమతులు తెచ్చుకుంటే ఇపుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అదే తంతు కొనసాగడంపై పలువురు ఉద్యమకారులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ భూముల్లో సభ నిర్వహణకు సంబంధించి సాధ్యా సాధ్యాలను కూడా టిజెఎస్ నేతలు పరిశీలిస్తున్నారు.
మరోవైపు పరేడ్ గ్రౌండ్స్‌లో ఆవిర్భావ సభ నిర్వహించుకునేందుకు కేంద్ర రక్షణ శాఖకు దరఖాస్తు చేసింది టిజెఎస్. కేంద్రం నుంచి అనుమతి వస్తే పరేడ్‌గ్రౌండ్స్‌లో ఈ నెల 29న తెలంగాణ జనసమితి పార్టీ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించాలను కుంటున్నారు.
ఇదిలా ఉంటే టిజెఎస్ ఆవిర్భావ సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరణపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందించారు. తెలంగాణలో దొరల పాలన నడుస్తుందని ఆయన ఆరోపించారు. సినిమా వాళ్ళ సభలకు అనుమతి ఇచ్చి తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి సభకు అనుమతి ఇవ్వరా? అని విహెచ్ టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
– సప్తగిరి
(http://www.jagritiweekly.com/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b2%e0%b1%87%e0%b0%b7%e0%b0%a3/%e0%b0%95%e0%b1%8b%e0%b0%a6%e0%b0%82%e0%b0%a1%e0%b0%b0%e0%b0%be%e0%b0%82-kodandaram-2/)(Index, latestnews, ప్రాంతీయం, విశ్లేషణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి