ఎంఎల్‌ఏల బహిష్కరణ ఎత్తివేత
ఎంఎల్‌ఏల అనర్హత వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ ఎంఎల్‌ఏలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లకు హైకోర్టులో ఊరట లభించింది. వారిపై తెలంగాణ అసెంబ్లీ విధించిన బహిష్కరణ వేటును రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఎత్తేసింది. వారి శాసనసభ సభ్యత్వాలను పునరుద్ధరించాలని ఆదేశాలు జారీచేసింది. వారు తప్పు చేశారని భావిస్తే ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు గానీ, అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం సరికాదని ప్రభుత్వానికి న్యాయస్థానం మొట్టికాయలు వేసింది.
తెలంగాణ బడ్జెట్ సమావేశాల తొలి రోజున గవర్నర్ ప్రసంగం సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు సభలో ఆందోళన చేశారు. గవర్నర్ ప్రసంగం ప్రతులను చించేశారు. అదే సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెడ్‌ఫోన్‌ను విసరగా అది శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కంటికి తగిలినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం సభలో క్రమశిక్షణా రాహిత్యంగా ప్రవర్తించా రంటూ కాంగ్రెస్ ఎంఎల్‌ఏలు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, సంపత్‌కుమార్‌పై బహిష్కరణ విధించింది. వారి శాసన సభ్యత్వాలు రద్దయినట్లు అధికారిక ప్రకటన జారీచేసింది. మరో అడుగు ముందుకేసి ఎంఎల్‌ఏల బహిష్కరణతో ఖాళీ అయిన నల్గొండ, అలంపూర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సిందిగా ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసింది. అంతేకాకుండా బడ్జెట్ సమావేశాలకు హాజరుకాకుండా జానారెడ్డి సహా కాంగ్రెస్ శాసనసభ్యులందరిపై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే ఈ బహిష్కరణ ఉదంతంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లు హైకోర్టును ఆశ్రయించారు. తమను అసెంబ్లీ నుంచి బహిష్కరించడం ప్రజాస్వామ్య విరుద్ధమని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం చేసిన ఆరోపణలకు సంబం ధించిన ఆధారాలను ఇవ్వాలని కోర్టు ఎన్నిసార్లు కోరినా ప్రభుత్వం ఇవ్వలేదు. దీంతో పలుమార్లు వాదనలు విన్న హైకోర్టు కాంగ్రెస్ సభ్యులకు ఊరట కలిగిం చేలా తీర్పు వెలువరించింది. కోమ టిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్‌లు యథా విథిగా తమ పదవుల్లో కొనసాగొచ్చని స్పష్టం చేసింది. కోర్టు తీర్పుతో ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలన్నీ రద్దయ్యాయి. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు.
మరోవైపు హైకోర్టు సింగిల్‌బెంచ్ తీర్పుపై టిఆర్‌ఎస్ అప్పీల్‌కు వెళ్లింది. రాజకీయ కోణంలో భాగంగా అధికార పార్టీకి చెందిన 12 మంది ఎంఎల్‌ఏలతో తీర్పును సమీక్షించాలంటూ రిట్ పిటిషన్ దాఖలు చేయించింది. హైకోర్టు తీర్పును డివిజన్ బెంచ్ సమీక్షించాలని కోరుతూ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ‘సభ్యుల కంటే సభ గౌరవం అత్యంత ముఖ్యం. సభ గౌరవానికి ఎవరు భంగం కలిగించినా చర్యలు ఉండాల్సిందే. భవిష్యత్‌కు ఆ మేరకు సంకేతం ఉండాలి’ అని టిఆర్‌ఎస్ వాదిస్తోంది. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి కెసిఆర్ గవర్నర్ నరసింహన్‌తో రాజ్‌భవన్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కాంగ్రెస్ సభ్యుల బహిష్కరణ, హైకోర్టు తీర్పు, ప్రభుత్వ ఆలోచనలపై గవర్నర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సభ్యులపై వేటు నిర్ణయం సభ తీసుకుంది కాబట్టి న్యాయస్థానం తీర్పును చర్చించడానికి అసెంబ్లీని సమావేశపరచా లన్న ఆలోచన కూడా వచ్చినట్లు చెబుతున్నారు.
కోదండరాం సభకు కోర్టు అనుమతి
తెలంగాణ జనసమితి పార్టీకి కూడా హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 29న ఆ పార్టీ నిర్వహించే సభకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూడు రోజుల్లోగా అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. టిజెఎస్ వ్యవస్థాపకుడు కోదండరాం ఏప్రిల్ 29న సరూర్‌నగర్ గ్రౌండ్‌లో తెలంగాణ జనసమితి పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఆ సభకు అనుమతి ఇవ్వలే మని పోలీసులు, సరూర్‌నగర్ గ్రౌండ్ నిర్వాహకులు చెప్పారు. నగరంలో ఏదో ఒక స్టేడియంలో గానీ, ఖాళీస్థలంలో గానీ అనుమతి ఇచ్చినా సరేనని టిజెఎస్ కోరినా ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో తెలంగాణ జనసమితి నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు సభకు అనుమతి ఇవ్వాలని ఆదేశించింది.
కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో స్టేడియంలో ఏర్పాట్లకు టిజెఎస్ నేతలు సిద్ధ మయ్యారు. పార్టీ ఆవిర్భావ సభ ద్వారా రాజకీయ మార్పుకు శ్రీకారం చుట్టాలని కోదండరాం కార్య కర్తలకు విజ్ఞప్తి చేశారు. సభ నిర్వహణ బాధ్యతలను చూసేందుకు పలు కమిటీలను సైతం ఏర్పాటు చేశారు.
పంచాయతీ ఎన్నికల కసరత్తు షురూ
గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రంలో గ్రామ పంచాయతీల ఎన్నికల కసరత్తును తెలంగాణ ఎన్నికల కమిషన్ వేగవంతం చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పంచాయతీల పరిధిలో ఓటర్ల జాబితా కార్యాచరణను మే 17కల్లా సిద్ధం చేయాలని స్పష్టం చేసింది. దాని ప్రకారం ఈ నెల 30న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటిస్తారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. మే నెల 1న ఎన్నికల సంఘం అధికారులు జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీలతో, 3న మండల స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తారు. ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు మే 1 నుంచి 8వ తేదీ వరకు అవకాశం కల్పిస్తారు. ఈ అభ్యంతరాలను మే 10వ తేదీలోపు పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. వార్డుల విభజనతో సహా ఫొటోలతో కూడిన తుది ఓటర్ల జాబితాను మే 17న ప్రకటిస్తారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు మార్పులు, చేర్పులకు అవకాశం ఉంటుంది. పంచాయతీరాజ్ చట్టం-2018కి అనుగుణంగా ఈ ఎన్నికలుంటాయని తెలంగాణ ఎన్నికల సంఘం పేర్కొంది.
– సప్తగిరి (http://www.jagritiweekly.com/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b2%e0%b1%87%e0%b0%b7%e0%b0%a3/%e0%b0%b9%e0%b1%88%e0%b0%95%e0%b1%8b%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81-%e0%b0%ae%e0%b1%8a%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%bf%e0%b0%95%e0%b0%be%e0%b0%af%e0%b0%b2%e0%b1%81/)
(Index, latestnews, ప్రాంతీయం, విశ్లేషణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి