అడుగుజాడ

పేజీలు

  • హోమ్
  • సొంత కవిత్వం
  • రైలుమిత్ర
  • వెబ్‌సైట్‌

29, నవంబర్ 2018, గురువారం

హైదరాబాద్‌ పోలీసుల అనూహ్య నిర్ణయాలు



హైదరాబాద్‌ పోలీసుల అనూహ్య నిర్ణయాలు

హైదరాబాద్‌ పోలీసుల అనూహ్య నిర్ణయాలు
గడిచిన వారం హైదరాబాద్‌లో ఒకే రోజు చోటు చేసుకున్న రెండు పరిణామాలు తీవ్ర చర్చను లేవనెత్తాయి. చూడటానికి అవి వేరే అంశాలుగా కనిపించినా రాజకీయంగానూ కలకలం సష్టించాయి. వాటిలో ఒకటి హైదరాబాద్‌ నుంచి కత్తి మహేష్‌ బహిష్కరణ. రెండోది స్వామి పరిపూర్ణానంద ధర్మాగ్రహ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో పాటు స్వామీజీని గహ నిర్బంధంలో ఉంచడం. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిపై కత్తి మహేష్‌ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ స్వామి పరిపూర్ణానంద హైదరాబాద్‌ నుంచి యాదాద్రికి ధర్మాగ్రహ యాత్ర పేరిట పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఆ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. అటు కత్తి మహేష్‌ నగర బహిష్కరణ, ఇటు ధర్మాగ్రహ యాత్రకు అనుమతి నిరాకరణతో హైదరాబాద్‌లో కలకలం చెలరేగింది. అయితే ఈ రెండు పరిణామాలకు సంబంధం ఉండటం ఇక్కడ ప్రస్తావనార్హం.
కత్తి మహేష్‌ నగర బహిష్కరణ
ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై హైదరాబాద్‌ నగర బహిష్కరణ విధించారు. ఆరు నెలల పాటు ఆయన హైదాబాద్‌లో అడుగు పెట్టకూడదంటూ తెలంగాణ పోలీసు శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ‘ది తెలంగాణ ప్రివెన్షన్‌ ఆఫ్‌ యాంటీ సోషల్‌ అండ్‌ హజార్డస్‌ యాక్టివిటీస్‌ యాక్ట్‌ 1980 సెక్షన్‌ – 3’ కింద ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నగర బహిష్కరణే కాదు ఆయన్ను తన స్వస్థలమైన చిత్తూరు జిల్లాలో వదిలేసి వచ్చారు టాస్స్‌ఫోర్స్‌ పోలీసులు.
హైదరాబాద్‌ పోలీసుల నిర్ణయంపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. సాధారణంగా రౌడీషీటర్లపైనో, శాంతి భద్రతలను చేతుల్లోకి తీసుకునే అరాచకులపైనో పోలీసులు నగర బహిష్కరణ వంటి శిక్ష విధిస్తారు. చట్టంలో ఉన్న సెక్షన్లను వాటికోసం ఉపయోగించుకుంటారు. కత్తి మహేష్‌ను హైదరాబాద్‌ నుంచి బహిష్కరిస్తారని ఏ ఒక్కరూ ఊహించలేదు. అయితే అతను ఎంతటి ప్రమాదకరమైన వ్యక్తో పోలీసులే తేల్చేశారు. బయటకు కనిపించే అరాచకులు ఆయుధాలతో చెలరేగిపోతారు. అలజడులు సష్టిస్తారు. కానీ కత్తి మహేష్‌ తన వ్యాఖ్యలు, చేష్టలతో సమాజాన్ని రెచ్చగొడుతున్నాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రత్యేకంగా తెలంగాణ డిజిపి మహేందర్‌ రెడ్డి సీనియర్‌ పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు
ఇటీవల ఓ టీవీ ఛానల్లో జరిగిన చర్చలో శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు కత్తి మహేష్‌. దీంతో ఆయనపై హిందూ సంఘాల నేతలు, మఠాధిపతులు, పీఠాధిపతులు ధ్వజమెత్తారు. చట్ట పరంగా కఠినచర్యలు తీసుకోవాలంటూ స్వామి పరిపూర్ణానందతో పాటు పలువురు పీఠాధిపతులు ఏపి, తెలంగాణ ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. మరోవైపు కత్తి మహేష్‌ వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో పెద్ద యుద్ధమే సాగింది. అనుకూల, వ్యతిరేక వర్గాల పోస్టులు, కౌంటర్లతో పరిస్థితి చేయి దాటే సూచనలు కనిపించాయి. దీన్ని గ్రహించిన పోలీసులు కత్తిపై నగర బహిష్కరణ వేటు వేశారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలోనే కొన్ని నెలలుగా కత్తి మహేష్‌ టీవీ చర్చల్లో సాగించే వాదనలు, చేసే వివాదాస్పద వ్యాఖ్యలను పోలీసులు విశ్లేషించారు. టీవీ చర్చల్లో ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు, దానిపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న రచ్చపై పోలీసులు ప్రత్యేకదష్టి పెట్టారు. కత్తి మహేష్‌ డిస్కషన్లు, చర్చా వేదికల్లో ఆయన చేస్తున్న ప్రసంగాలు, ప్రకటనలు, వ్యాఖ్యలను విశ్లేషించారు. అంతేకాదు ఏకంగా రాముడిపైనే విద్వేష పూరిత వ్యాఖ్యలు చేయడంతో తలెత్తిన పరిణామాలపైనా చర్చించారు. హిందూ సంఘాల నుంచి విమర్శలు వెల్లువెత్తిన తర్వాత కూడా కత్తి మహేష్‌ తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ వ్యాఖ్యలు చేయడాన్ని డిజిపి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. సోషల్‌ మీడియాలో కామెంట్లు, కౌంటర్లపైనా కన్నెర్రజేశారు. ఈ పరిస్థితులకు కారకుడైన కత్తి మహేష్‌పై ఇప్పటికే హైదరాబాద్‌ బంజారాహిల్స్‌తో పాటు పలు పోలీస్‌ స్టేషన్లలో పలువురు కేసులు పెట్టారు. నోటీసులు జారీచేశారు. ఆ తర్వాత కూడా కత్తి రియాక్షన్‌ను పరిశీలించారు.
నిర్ణయం వెనుక కారణాలు
తెలంగాణ ఆవిర్భావం తర్వాత హైదరాబాద్‌ లోనూ, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా సాఫీగా ఉందని డిజిపి మహేందర్‌ రెడ్డి ప్రకటించారు. దేశంలోనే ప్రశాంత నగరాల్లో హైదరాబాద్‌ ముందు వరుసలో నిలిచిందన్నారు. అయితే హిందువుల ఆరాధ్య దైవమైన రాముడిపై కత్తి మహేష్‌ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో అలజడి సష్టించేలా ఉన్నాయని సోషల్‌ మీడియాల పోస్టులు, చర్చల ద్వారా తెలుస్తోందని చెప్పారు. ప్రశాంత నగరమైన హైదరాబాద్‌లో ఈ పరిణామం కల్లోలం సష్టించే అవకాశం కనిపించ డంతో ఆయనపై బహిష్కరణ వేటు వేశామని డిజిపి మహేందర్‌ రెడ్డి స్పష్టం చేశారు. నిషేధం సమయంలో కత్తి మహేష్‌ హైదరాబాద్‌కు వస్తే అరెస్ట్‌ చేస్తామన్నారు. వేరే ఎక్కడి నుంచైనా విద్వేష పూరితంగా సోషల్‌ మీడియాలో పోస్టులు చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. పరిస్థితులను బట్టి అవసరమైతే ఈ నిషేధాన్ని తెలంగాణ అన్ని జిల్లాల్లోనూ అమలు చేస్తామన్నారు. అయితే కత్తి మహేష్‌ను చిత్తూరు జిల్లాలోని స్వగ్రామానికి తరలించడంపై ఏపి పోలీసులు కూడా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఇన్నాళ్లూ సాగించిన విద్వేషపూరిత కార్యకలాపాలు ఇకపై కత్తి మహేష్‌ చిత్తూరు కేంద్రంగా సాగించే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తపరిచినట్లు తెలుస్తోంది. దీనికి బదులు కర్నాటక వంటి పక్క రాష్ట్రాలకు పంపిస్తే ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడినట్లు కూడా చెప్పుకుంటున్నారు.
కొంతకాలం క్రితం వరకు కత్తి మహేష్‌ అంటే ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే బిగ్‌బాస్‌ షోలో సెలెక్ట్‌ అయ్యాడో అప్పటి నుంచి ఆయన కాస్త పాపులర్‌ అయ్యాడు. సబ్జెక్ట్‌తో సంబంధం లేకుండా టీవీ చర్చల్లో పాల్గొనడం.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలతో పబ్లిసిటీ స్టంట్‌ను అనుసరించాడు.
స్వామి పరిపూర్ణానంద గహ నిర్బంధం
ఇక అదేరోజు స్వామి పరిపూర్ణానంద తలపెట్టిన ధర్మాగ్రహ యాత్రకు పోలీసులు చివరి నిమిషంలో అనుమతి నిరాకరించారు. స్వామి పరిపూర్ణానంద బస చేసిన గహానికి పలువురు పోలీసు అధికారులు పెద్ద ఎత్తున చేరుకొని స్వామీజీని గహ నిర్బంధం చేశారు. కత్తి మహేష్‌ ఓ టీవీ ఛానల్‌ చర్చలో శ్రీరాముడిని దూషించడంతో పాటు సీతమ్మ పట్ల అత్యంత హేయంగా మాట్లాడటంపై స్వామి పరిపూర్ణానంద తీవ్రంగా స్పందించారు. సీనీ నటుడు నాగబాబు కూడా కత్తి వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌ నుంచి యాదాద్రికి పాదయాత్రను తలపెట్టారు పరిపూర్ణానంద. అటు కత్తి మహేష్‌కు నగర బహిష్కరణ శిక్ష విధించిన హైదరాబాద్‌ పోలీసులు ఇటు స్వామీజీ పాదయాత్రను కూడా అడ్డుకున్నారు.
స్వామి ససేమిరా..
ఈ వివాదానికి అసలు కారకుడైన కత్తి మహేష్‌కు నగర బహిష్కరణ విధించామని ఈ సమయంలో ధర్మాగ్రహ యాత్ర చేస్తే పరిస్థితులు ఉద్రిక్తంగా మారొచ్చని స్వామీజీకి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు. కానీ తాను తలపెట్టిన యాత్ర ఒక్క కత్తి మహేష్‌ను ఉద్దేశించి కాదని, హిందూమతంపై కుట్రపూరితంగా జరుగుతున్న దాడులను నివారించేలా స్వామివారిని వేడుకునేందుకు ఈ యాత్ర చేపట్టానని స్వామి పరిపూర్ణానంద స్పష్టం చేశారు. కానీ పోలీసులు మాత్రం స్వామీజీని యాత్రకు అనుమతించలేదు. అయితే.. తాను దీక్షలో ఉన్నందున సెక్రటేరియట్‌ పక్కనున్న మింట్‌ కాంపౌండ్‌ వద్ద గల పవర్‌ హనుమాన్‌ దేవాలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకుంటానన్న స్వామి పరిపూర్ణానంద ఆకాంక్షకు పోలీసులు సమ్మతించారు. అయితే.. పోలీసు పహారా మధ్యే స్వామీజీని దేవాలయానికి తీసుకెళ్లి తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. ఓ దశలో తన పాదయాత్రకు అనుమతించకుంటే ఆమరణ దీక్ష చేపడతానని స్వామి పరిపూర్ణానంద హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. అయితే పోలీసులు స్వామీజీని సంయమనం పాటించాలని అభ్యర్థించినట్లు సమాచారం.
అటు పరిపూర్ణానంద స్వామి హౌస్‌ అరెస్టును నిరసిస్తూ విహెచ్‌పి, భజరంగదళ్‌ కార్యకర్తలతో పాటు స్వామీజీ శిష్యులు, అభిమానులు ఆందోళనకు దిగారు. స్వామీజీ ఇంటికి చేరుకుని తమ నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో నిరసనకారుల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు.
కత్తికి ఆ శిక్ష సరిపోదు
వాస్తవానికి కత్తి మహేష్‌ శ్రీరాముడు, సీతాదేవిపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటి నుంచే సోషల్‌ మీడియాలో అతనిపై ముప్పేట దాడి మొదలైంది. అయితే స్వామి పరిపూర్ణానంద పాదయాత్ర ప్రకటన చేయడంతో కత్తిపై వాగ్యుద్ధం ప్రకటించిన వాళ్లల్లో సంతోషం పెల్లుబికింది.
హిందూ మతంపై జరుగుతున్న దాడిని స్వామీజీ నాయకత్వంలో సమర్థవంతంగా ఎదుర్కోవచ్చన్న ధీమాలో పడిపోయారు సోషల్‌ మీడియా ఫాలోవర్లు. కానీ పోలీసుల తాజా చర్యలతో విమర్శలు విని పిస్తున్నాయి. కత్తి మహేష్‌కు తెలంగాణ పోలీసులు విధించిన శిక్ష చిన్నదే అని అతని తీరు, కుల, మతాలను రెచ్చగొట్టేలా ఉండే అతని వ్యాఖ్యలు, విద్వేషాలు రగిలించే మాదిరిగా చేసే ప్రసంగాలకు ఈ శిక్ష సరిపోదన్న వాదనలూ వ్యక్తమవుతున్నాయి.
– సప్తగిరి
 Index, latestnews, ప్రాంతీయం, విశ్లేషణ16-22 July 2018
http://www.jagritiweekly.com/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87%E0%B0%B7%E0%B0%A3/%E0%B0%B9%E0%B1%88%E0%B0%A6%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AC%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D%E2%80%8C-%E0%B0%AA%E0%B1%8B%E0%B0%B2%E0%B1%80%E0%B0%B8%E0%B1%81%E0%B0%B2-%E0%B0%85%E0%B0%A8%E0%B1%82%E0%B0%B9%E0%B1%8D/

వీరిచే పోస్ట్ చేయబడింది Sapthagiri వద్ద 3:46 AM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

రాష్ట్రంలో ‘మార్పు కోసం’ – బిజెపి జన చైతన్య యాత్ర



రాష్ట్రంలో ‘మార్పు కోసం’ – బిజెపి జన చైతన్య యాత్ర

రాష్ట్రంలో ‘మార్పు కోసం’ – బిజెపి జన చైతన్య యాత్ర
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కమలదళం వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే క్షేత్రస్థాయిలోకి దూసుకెళ్లింది. 14 రోజుల పాటు తొమ్మిది జిల్లాల పరిధిలోని 26 నియోజకవర్గాలు చుట్టొచ్చింది. జాతీయ నాయకత్వం దిశానిర్దేశంతో, వ్యూహాత్మక కార్యాచరణతో పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎట్టకేలకు సమరశంఖం పూరించింది.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి భాజపా దక్షిణాదిలో పట్టు సాధించింది. దాంతో అక్కడ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఉపయోగించిన ఎన్నికల ప్రచార రథాన్నే తెలంగాణలో నాయకులు జనచైతన్య యాత్రకు ఉపయోగిస్తున్నారు. తొలివిడత బస్సుయాత్ర పూర్తి అయింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ నేతృత్వంలో జనచైతన్య యాత్ర సక్సెస్‌ఫుల్‌గా సాగినట్లుగా తెలుస్తోంది.
జూన్‌ 23వ తేదీన మొదలైన ఈ జన చైతన్య యాత్ర ఈ నెల 6వ తేదీ వరకూ కొనసాగింది. హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని దుర్గామాత అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఈ యాత్ర మొదలైంది. అక్కడి నుంచి నేరుగా యాదాద్రి కొండకు చేరుకున్న డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ లక్ష్మీ నర్సింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత సాయంత్రం భువనగిరికి చేరుకొని బహిరంగసభ నిర్వహించారు. ఆ సభలో కేంద్ర, రాష్ట్ర ప్రముఖులు పాల్గొని బస్సుయాత్రకు పచ్చజెండా ఊపారు.
పటిష్ట వ్యూహంతో :
టిఆర్‌ఎస్‌ పాలన వైఫల్యాలు, హామీలను విస్మరించడంపై ధ్వజమెత్తుతూ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ వైఖరిని ఎండగడుతూ, తాము అధికారం లోకి వస్తే ఎలాంటి పరిపాలన అందిస్తామో వివరిస్తూ కమలనాథుల జనచైతన్యయాత్ర ముందుకు సాగింది. ముఖ్యంగా టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలకే పార్టీ నాయకులు ప్రాధాన్యం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం, తన పథకాలుగా ప్రచారం చేస్తోందని మొదటినుంచి విమర్శిస్తోన్న బిజెపి ఈ యాత్ర ద్వారా తమ వాదనను గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మరింత విడమరచి వివరించింది. రాష్ట్రంలో ‘మార్పు కోసం’ అంటూ సాగిన బస్సుయాత్రకు గ్రామీణ ప్రాంతాల్లో మంచి స్పందన వచ్చింది.
అవినీతి పాలన అంతమే లక్ష్యం :
టిఆర్‌ఎస్‌ అవినీతి పాలనను అంతమొం దించేందుకే బిజెపి జనచైతన్య యాత్రను చేపట్టిందని యాత్రలో డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ ఉద్ఘాటించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పనుల్లో అవినీతి కొనసాగు తుందని ఆరోపించారు. దళిత సిఎం మొదలుకొని, ఎన్నికల హామీలు, పరిపాలనా హామీలు తుంగలో తొక్కి తెలంగాణ ప్రజలను మోసం చేసిన సిఎం కెసిఆర్‌్‌ మాటలను ఎవరూ నమ్మే స్థితిలో లేరన్నారు. కుటుంబ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని దుయ్యబట్టారు. కెసిఆర్‌ కేవలం ప్రగతి భవన్‌, ఫాంహౌస్‌కు మాత్రమే పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి ప్రజల సంక్షేమం కోసం పని చేయడం లేదని తన కుటుంబ సంక్షేమం కోసం పని చేస్తున్నారని విమర్శించారు. సిఎం జవాబుదారితనంతో లేకుండా మాటల గారడీతో మభ్య పెడుతున్నారన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకు రావడానికే జనచైతన్య యాత్రను చేపట్టామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి సత్తా చూపిస్తామని, పార్టీ నాయకులు, కార్యకర్తలు శాయశక్తులా కృషి చేసి రాష్ట్రంలో బిజెపి జెండా ఎగురవేయాలని సూచించారు.
రూ.2 లక్షల రుణమాఫీ :
2019 ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం తోపాటు.. బ్యాంకుల్లో తీసుకున్న రుణాల వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందని లక్ష్మణ్‌ చెప్పారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసినా సిఎం అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. బీసీలకు గొర్రెలు, బర్రెలు, చేపలు పంపిణీ చేసి వాటిని మేపుకుని బతకాలని చెబుతూనే ఓసీలు మాత్రం రాజ్యమేలు తున్నారని విమర్శించారు. కొందరు బీసీ నాయకులు కెసిఆర్‌కు భజనలు చేస్తున్నారన్నారు. ఎంబిసి కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి వెయ్యి కోట్లు కేటాయించి నట్టు చెప్పి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయ లేదన్నారు. రజకులను ఎస్‌సి జాబితాలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో 4వేల 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. టిఆర్‌ఎస్‌ పతనానికి బిజెపి జన చైతన్యయాత్ర నాంది పలుకుతుందన్నారు.
బహిరంగ సభలు, రోడ్‌షోలు, సమావేశాలు, భారీ ర్యాలీలతో తెలంగాణ జిల్లాల్లో సాగిన ఈ జన చైతన్య యాత్రతో బిజెపి శ్రేణుల్లో కదనోత్సాహం ఉరకలు వేస్తోంది. ఈ బస్సుయాత్ర వచ్చే ఎన్నికల విజయయాత్ర కావాలనే జోష్‌ కనిపిస్తోంది.
జనచైతన్య కమిటీలు :
జనచైతన్య యాత్ర కోసం బిజెపి ప్రత్యేకంగా 17 కమిటీలను ఏర్పాటు చేసింది. ఇందులో కీలకమైన సలహా కమిటీని నలుగురితో ఏర్పాటు చేసింది. వీరిలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, ఎంపి బండారు దత్తాత్రేయ, బిజెఎల్పీ నేత కిషన్‌రెడ్డి, శాసన మండలిలో పార్టీ నేత రామచంద్రరావులు ఉన్నారు.
యాత్ర ప్రముఖ్‌, సహ ప్రముఖ్‌లుగా మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఆచారి, మనోహర్‌రెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, హెడ్‌ క్వార్టర్స్‌ ఇన్‌ఛార్జిగా చింతా సాంబమూర్తి వ్యవహరించారు. ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యేలు ఇంద్రసేనారెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, యెండల లక్ష్మీనారాయణ సహా 20 మందితో ఆర్గనైజింగ్‌ కమిటీ ఏర్పాటు చేశారు. ఆర్థిక విభాగం, రూట్‌ ఇన్‌ఛార్జి విభాగం, భోజన విభాగం, రాత్రి వసతి, ప్రోటోకాల్‌, మీడియా, ప్రకటనలు, రోడ్‌షోలు, మీటింగ్స్‌ వేదికలు, రథం, రక్షణ విభాగం, మహిళా విభాగం, సాంస్కృతిక జట్టు, వైద్య విభాగం, పబ్లిసిటీ మెటీరియల్‌, యాత్ర వాహన శ్రేణి జట్టు.. ఇలా పలు విభాగాలను ఏర్పాటు చేశారు.
కొనసాగనున్న యాత్ర :
రాష్ట్రంలో మార్పు కోసం అంటూ.. బిజెపి చేపట్టిన జనచైతన్య యాత్రలు ఎన్నికల వరకూ దశల వారీగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. తొలిదశ యాత్ర 14 రోజుల పాటు విజయవంతంగా పూర్తి చేసుకోగా తర్వాత కూడా మరిన్ని నియోజకవర్గాల్లో యాత్రకు రాష్ట్ర నాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
– సప్తగిరి
 Index, latestnews, ప్రాంతీయం, విశ్లేషణ09-15 July 2018
http://www.jagritiweekly.com/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87%E0%B0%B7%E0%B0%A3/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AA%E0%B1%81-%E0%B0%95%E0%B1%8B%E0%B0%B8%E0%B0%82-%E0%B0%AC/
వీరిచే పోస్ట్ చేయబడింది Sapthagiri వద్ద 3:42 AM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి


తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి
రాజకీయ పార్టీల హడావిడి

ముందస్తుకు సై అంటే  సై :
-----------------------------
ముందస్తు ఎన్నికలకు సై అంటున్నారు కేసీఆర్‌. కేంద్రంలో ముందస్తు ఎన్నికలు ఖాయమన్న ప్రచారం ఊపందుకోవడంతో కేసీఆర్‌ కూడా కదన రంగంలో కాలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమా అంటూ కాంగ్రెస్‌ నేతలకు సవాల్‌ విసిరారు. ముఖ్యమంత్రి సవాలుకు కాంగ్రెస్‌ కూడా దీటుగానే స్పందించింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కేసీఆర్‌ సవాల్‌కు సై అన్నారు. తాము ఎప్పుడైనా ఎన్నికలకు సిద్ధమే అని ప్రకటించారు. దీంతో.. తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.

మొదట కేసీఆర్‌ సభలో ఆవేశంలో అలా వ్యాఖ్యానించాడేమో అనుకున్నారు. కానీ.. పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్యులు తనను కలిసినప్పుడు ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని సూచనలు చేశారు. అంతేకాదు.. ముందస్తు ఎన్నికలతో పార్టీకి గానీ.. ప్రస్తుత ప్రజా ప్రతినిధులకు గానీ.. ఏమాత్రం భయం అవసరం లేదని భరోసా ఇచ్చారు. దీంతో.. ఇది సీరియసే అని అందరికీ అర్థమైపోయింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. వందకు పైగా సీట్లు టీఆర్‌ఎస్‌వే అని కేసీఆర్‌తో పాటు.. కేటీఆర్‌, మంత్రులు పలు సందర్భాల్లో ప్రకటనలు చేస్తున్నారు.

అంతేకాదు.. కేసీఆర్‌ ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా ప్లాన్లు సిద్ధం చేసుకున్నారు. గద్వాలలో భారీ బహిరంగ సభతో ఎన్నికల ఊపును తెచ్చేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్‌ తాము బలంగా ఉన్నామని భావించే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆ పార్టీ కీలక నేత డీకే అరుణ నియోజకవర్గమైన గద్వాలలోనే టీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభతో వేడి మరింత పెరిగింది.

కాంగ్రెస్‌పార్టీలో ప్రక్షాళన షురూ :
--------------------------------
అటు.. కాంగ్రెస్‌ పార్టీలోనూ ప్రక్షాళన షురూ అయ్యింది. పార్టీని చక్కదిద్దేందుకు ఏకంగా అధిష్ఠానమే రంగంలోకి దిగింది. ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులను రాష్ట్రానికి పంపించింది. కేసీఆర్‌ ముందస్తు సవాల్‌ నేపథ్యంలో ఆగమేఘాలపై తెలంగాణలో దృష్టిపెట్టింది. ప్రధానంగా హస్తం పార్టీలో నేతల మధ్య విభేదాలు, సమన్వయ లోపమే ప్రధాన సమస్య. వీటిపై దృష్టి సారించిన హైకమాండ్.. పార్టీని గాడిలో పెట్టేందుకు సిద్ధమైంది. ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాసన్ కృష్ణన్, సలీమ్ అహ్మద్‌లను తెలంగాణకు ఇంచార్జ్‌లుగా నియమించింది. ఈ ముగ్గురికి పార్టీని చక్కబెట్టే బాధ్యతలను అప్పగించారు. ఒక్కొక్కరు నలభై నియోజక వర్గాల బాధ్యతలను చూడనున్నారు.

బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీకి సంబంధించిన అన్ని కమిటీలను నియమించడంలో ఇంచార్జి కార్యదర్శులదే కీలకపాత్ర. ఆయా నియోజకవర్గాల స్థాయిలో నాయకుల మధ్య విభేదాలు, సమన్వయలోపాల్ని పరిష్కరించడం.. అసంతృప్తులను బుజ్జగించడం, పార్టీలో చేరికలు ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపడతారు. వీళ్లు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే అభ్యర్థులకు టికెట్ల కేటాయింపు ఆధారపడి ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏ జిల్లాలో చూసినా ఒకే  వర్గం ఆధిపత్యం కొనసాగుతుందని కాంగ్రెస్‌పార్టీలో ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మొదట జిల్లాల్లో ఉన్న వర్గ విభేదాలకు పరిష్కారం జరిగితేనే పార్టీ బలోపేతం అవుతుందని కొత్తగా వచ్చిన ఇంచార్జ్‌లకు నేతలు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. మరోవైపు.. పార్టీని క్షేత్ర స్థాయి నుండి బలోపేతం చేస్తామని కొత్తగా వచ్చిన కార్యదర్శులు పార్టీ నేతలకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గంలో గెలిచే అభ్యర్ధులకే టికెట్స్ ఇస్తామని, అభ్యర్థుల రికమండేషన్స్ కు ఎలాంటి ప్రాధాన్యతను ఇవ్వమని భరోసా ఇచ్చినట్లు సమాచారం.

బీజేపీలో ప్రజా చైతన్య యాత్ర జోష్‌ :
----------------------------------
అటు.. కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తోన్న బీజేపీ కూడా తెలంగాణలో పాగా వేసేందుకు వ్యూహాలకు పదును పెడుతోంది. బిజెపి ప్రజా క్షేత్రం లోకి వెళ్లి తమ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది. ఈనెల 23వ తేదీన బీజేపీ ప్రజా చైతన్య యాత్ర పేరిట బస్సుయాత్ర మొదలైంది. పలు నియోజకవర్గాలన్నీ చుడుతూ బస్సుయాత్ర పరుగులు పెడుతోంది. కర్నాటక ఎన్నికల్లో ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, ఉపయోగించిన బస్సులోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ యాత్రను చేపడుతున్నారు. ఆయనతో పాటు పలువురు నేతలు కూడా బస్సుయాత్రలో పాల్గొంటున్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల‌ను ప్రజ‌ల‌కు వివ‌రిస్తూనే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌పై ప్రజ‌ల్లో అవ‌గాహన క‌లిగే విధంగా యాత్ర చేస్తున్నట్లు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ల‌క్ష్మణ్ చెబుతున్నారు. ఈ యాత్ర జూలై 6వ తేదీ వరకు 14 రోజుల పాటు కొనసాగనుంది. ప్రతిరోజూ రెండు నియోజకవర్గాలు కవర్‌ అయ్యేలా బీజేపీ బస్సుయాత్రను షెడ్యూల్‌ చేశారు. క్షేత్ర స్థాయిలో పార్టీ ని బలోపేతం చెయ్యటానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు. క్షేత్ర పార్టీని పటిష్టం చేయడంతో పాటు.. అధికార టీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ఎండగడుతూ బస్సుయాత్ర సాగుతోంది. బహిరంగ స‌భ‌లు, రోడ్ షోలు, స‌మావేశాలతో సాగుతున్న ఈ యాత్రతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ బస్ యాత్ర  వచ్చే ఎన్నికల విజయ యాత్ర కావాలనే జోష్ కనిపిస్తోంది.

- సప్తగిరి.జి
98850 86126
వీరిచే పోస్ట్ చేయబడింది Sapthagiri వద్ద 3:40 AM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

రాహుల్‌ సీక్రెట్‌ సర్వే తెలంగాణలో స్పెషల్ యాక్షన్ ప్లాన్



రాహుల్‌ సీక్రెట్‌ సర్వే తెలంగాణలో స్పెషల్ యాక్షన్ ప్లాన్

రాహుల్‌ సీక్రెట్‌ సర్వే తెలంగాణలో స్పెషల్ యాక్షన్ ప్లాన్
ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా, గత ఎన్నికల్లో ఊహించని రీతిలో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్‌ పార్టీ 2019లో మాత్రం స్పెషల్‌ యాక్షన్‌ ప్లాన్‌తో బరిలోకి దిగాలని యోచిస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ పెద్దలు టిపిసిసి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. రాహుల్‌ గాంధీ నేతత్వంలోని సర్వే టీమ్‌ రిపోర్ట్‌తో నేతల కదలికలపై, పార్టీ పరిస్థితిపై ఓ అంచనాకు వచ్చారని సమాచారం. టిపిసిసిలో బిసి నేతలకు పెద్దపీట వేసి గులాబి పార్టీకి చెక్‌ పెట్టేందుకు సిద్ధమవుతోందని ఢిల్లీ నుంచి లీకులు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీలో ఎన్నికలకు రథ సారధ్యం వహించేది ఎవరన్న దానిపైనా పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. కులాల వారీగా ఓట్లను విభజిస్తూ, టిఆర్‌ఎస్‌ ముందుకు సాగుతుండటంతో కాంగ్రెస్‌ ఢిల్లీ పెద్దలు సైతం బిసి కార్డుతో ముందుకు సాగేందుకు రెడీ అయ్యారు. వర్గపోరుతో గాంధీ భవన్‌, హైదరాబాద్‌కే పరిమితమవుతున్న నేతలను నియోజకవర్గ బాట పట్టేలా ప్లానింగ్‌ చేస్తున్నారు. పదికి పైగా సిఎం అభ్యర్థులమంటూ చెప్పుకునే కాంగ్రెస్‌లో నేతలను సమన్వయం చేస్తూ ముందుకు సాగేలా రాహుల్‌ టీమ్‌ కసరత్తు చేస్తోందని సమాచారం. యువరక్తం పేరిట ముందుకు సాగితే తెలంగాణలో సీనియర్‌ నేతల అలకలతో అసలుకే ఎసరు వస్తుందన్న భయంతో.. బిసి కార్డును తెరపైకి తెచ్చే యోచనలో ఉన్నారని చెబుతున్నారు. అలాగే.. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రచార కమిటీలో యువకులకు భాగస్వామ్యం కల్పించేలా పలువురి పేర్లు పరిశీలించి నట్లు తెలుస్తోంది.
119 నియోజకవర్గాల్లో 50 మంది అభ్యర్థుల లిస్టును ఉత్తమ్‌ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అభ్యర్థులను ఎన్నికలకు ఆరునెలల ముందుగానే ప్రకటిస్తే ఫలితాలు మెరుగవుతాయన్న ప్రతిపాదనను ఎఐసిసి ముందుంచినట్లు చెబుతున్నారు. మరోవైపు టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌పై సీనియర్లు గుర్రుగా ఉన్నట్లు పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి కోమటిరెడ్డి అయితే బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. మరికొందరు నేతలు ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. అటు రేవంత్‌రెడ్డి ప్రచార కమిటీ కన్వీనర్‌గా బాధ్యతలు తీసుకునేందుకు ఉత్సాహంగా ఉన్నా, ఉత్తమ్‌ చెక్‌ పెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మాజీ మంత్రులను ప్రచార కమిటీలోకి తీసుకొని జిల్లాల బాధ్యతలు అప్పగించాలని రాహుల్‌ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తమ్‌ కెప్టెన్సీలో ఎన్నికలకు వెళ్తే సీనియర్లు సహకరిస్తారా లేదా అన్న అంశంపై రాహుల్‌గాంధీ టీమ్‌ ఆరా తీసిందని, ఆ రిపోర్ట్‌ రాహుల్‌కు చేరడంతో తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారని సమాచారం. అయితే ఎన్నికల ఆర్థిక అవసరాలను సీనియర్‌ నేతలు ఎంతవరకు భరిస్తారన్న దానిపైనా నేతల నుంచి ఢిల్లీ దూతలు ఆరా తీశారన్న ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తానికి ఎన్నికల రథ సారథ్యం చివరకు జానాకు దక్కనుందని చెప్పుకుంటున్నారు. జానా వర్గంలో రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్‌ కీలకంగా మారనున్నారన్న ప్రచారం జరుగుతోంది.
మరోవైపు.. కెసిఆర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఆసక్తికర విధానంతో ముందుకెళుతోంది. ప్రజల్లో పెద్ద ఇమేజ్‌ను బిల్డప్‌ చేసుకున్న కెసిఆర్‌ను ఢీకొట్టేందుకు కీలక అంశాలను ఎంచుకుంది. అందుకు కెసిఆర్‌ నోటి మాటలనే ఆయుధాలుగా ఎంచుకుంది. గత ఎన్నికల సమయంలో కెసిఆర్‌ ఇచ్చిన హామీల్లో ఏవి నెరవేరలేదు, వేటిని అస్సలు పట్టించుకోనేలేదనే అంశాలను తీసుకుని వాటినే ఆయుధాలుగా చేసుకుంటున్నది. ఈ క్రమంలోనే ఎస్‌.సి., ఎస్‌.టి.ల విషయంలో కెసిఆర్‌ సీఎం కాకముందు అన్న ఒక మాటను పట్టుకుంది.
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ఎస్‌.సి.ని సిఎం చేస్తానని మొదట్లో చెప్పిన కెసిఆర్‌ మాట తప్పారంటూ దాడి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కెసిఆర్‌పై సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకురాలు, మాజీ లోక్‌సభ స్పీకర్‌ అయిన మీరా కుమార్‌ ఎస్‌.సి., ఎస్‌.టి. వ్యతిరేకి అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆమె ఎస్‌.సి., ఎస్‌.టి. నాయకురాలు కూడా కావడంతో అవి ఎస్‌.సి., ఎస్‌.టి. వర్గానికి నేరుగా తగులుతా యని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఎస్‌.సి., ఎస్‌.టి. వ్యక్తిని సిఎంగా చేస్తానని చెప్పిన కెసిఆర్‌ మాట తప్పి తానే ఎందుకు సిఎం అయ్యారని మీరా కుమార్‌ ప్రశ్నించారు.
దీనికి టిఆర్‌ఎస్‌ నుంచి సమాధానం లేదు. సమాధానం చెప్పడం కూడా కొద్దిగా కష్టమే. ఇక కాంగ్రెస్‌ కెసిఆర్‌పై ప్రయోగిస్తున్న రెండో ఆయుధం మైనార్టీలు. దీనికి కూడా మూలాన్ని ఎన్నికల హామీల నుంచే తీసుకున్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తానని చెప్పిన కెసిఆర్‌ ఎందుకు మాట నిలబెట్టుకోలేదని ప్రశ్నిస్తున్నారు. ఇది ముస్లింలను మోసం చేయడమేనని అంటున్నారు. దీంతో పాటు మరో అంశాన్ని కూడా కాంగ్రెస్‌ చెబుతోంది. బిజెపితో టిఆర్‌ఎస్‌ లోపాయికారీ ఒప్పందాన్ని చేసుకుందని, అలాంటి టిఆర్‌ఎస్‌తో ఎంఐఎం పొత్తు కొనసాగిస్తున్నదని విమర్శించారు.
ఇలా ఈ రెండు ప్రధానాంశాలతో కెసిఆర్‌పై కాంగ్రెస్‌ దాడి చేస్తోంది. అయితే కాంగ్రెస్‌ ఎక్కువగా ఆధారపడుతోంది మాత్రం తాను రైతులకిచ్చిన రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామనే హామీ పైనే. అంతపెద్ద మొత్తంలో రైతుకు రుణమాఫీ రాష్ట్రవ్యాప్తంగా ఎలా సాధ్యం చేస్తారని, వాస్తవంగా సాధ్యమవ్వదని టిఆర్‌ఎస్‌ అంటోంది. ఈ హామీ తమకు ఓట్లు రాబడుతుందని భావిస్తున్న కాంగ్రెస్‌ రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని, వారికి రుణ పరిమితి పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నది.
ఈ విధంగా ఎస్‌.సి., ఎస్‌.టి.లు, ముస్లింలు, రైతులే లక్ష్యంగా కాంగ్రెస్‌ ముందుకెళుతోంది. ఈ వ్యూహాలు వచ్చే ఎన్నికల్లో టి-కాంగ్రెస్‌కు ఎంతవరకు ఉపయోగపడతాయో చూడాలి.
– సప్తగిరి, 9885086126
 Index, latestnews, ప్రాంతీయం, విశ్లేషణ25 June - 01 July 2018
http://www.jagritiweekly.com/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87%E0%B0%B7%E0%B0%A3/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B9%E0%B1%81%E0%B0%B2%E0%B1%8D%E2%80%8C-%E0%B0%B8%E0%B1%80%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D%E2%80%8C-%E0%B0%B8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B1%87/
వీరిచే పోస్ట్ చేయబడింది Sapthagiri వద్ద 3:37 AM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

టీ కాంగ్రెస్‌లో గందరగోళం



టి-కాంగ్రెస్‌లో గందరగోళం

టి-కాంగ్రెస్‌లో గందరగోళం
‘ఎవరికి వారే యమునా తీరే’ అన్న చందంగా మారిన తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో ఎవరి వాదనలు వారే వినిపిస్తున్నారు. అధిష్టానానికి ఎవరు ఇచ్చే నివేదికలు వాళ్లు ఇచ్చేస్తున్నారు. దీంతో పార్టీలో గందరగోళం నెలకొంటోంది. ఏకంగా పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్‌ కూడా అసహనం వ్యక్తం చేసే పరిస్థితి రావడం ఇప్పుడు ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
మూడు విడతల బస్సుయాత్ర తర్వాత ఇటీవల జరిగిన ఆ పార్టీ కీలక సమావేశంలో టిపిసిసి కార్యవర్గంతో పాటు, అన్ని జిల్లాల డిసిసి అధ్యక్షులు పాల్గొన్నారు. సమావేశానికి పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్‌ కుంతియా కూడా హాజరయ్యారు. అయితే ఆయన సమక్షంలోనే టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన ప్రసంగం కొంతమంది సీనియర్లు, ఇతర నాయకులకు మింగుడు పడలేదని చెబుతున్నారు. పార్టీ ప్రయోజనాల దష్ట్యా నాయకులంతా సర్దుకుపోవాల్సిందేనని ఉత్తమ్‌ చెప్పడం సీనియర్లకు ఆగ్రహం తెప్పించిందంటున్నారు.
బస్సుయాత్ర వంటి పెద్ద కార్యక్రమం చేపట్టి నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయని, వాటిని పట్టించుకోవద్దని నాయకులకు ఈ సమావేశంలో ఉత్తమ్‌ సూచించారు. బస్సుయాత్ర సహా పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. మూడు విడతల్లో బస్సుయాత్ర జరిగిన తీరు, పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధత, టిఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రైతుబంధు పథకం అమలు తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. బస్సుయాత్రలో భాగంగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కటే సభ నిర్వహించడం సరికాదని, ఒక్కరిపైనే ఆర్థిక భారం పడుతోందని ఓ నాయకుడు సమావేశం దష్టికి తీసుకొచ్చారు. ఇక బస్సుయాత్రలో పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించటాన్ని మరోనేత తప్పుపట్టగా, కష్టపడుతున్న వారిని ప్రోత్సహిస్తే తప్పేమిటని మరికొందరు అభిప్రాయపడ్డారు.
అయితే టికెట్ల కేటాయింపు అంశం పూర్తిగా అధిష్టానమే చూసు కుంటుందని కుంతియా సర్దిచెప్పారు. బస్సుయాత్ర ద్వారా టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తేగలిగామని వ్యాఖ్యానించినట్లు సమాచారం. నాలుగో విడత బస్సు యాత్రకు ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రానున్నట్లు వెల్లడించారు. ప్రధానంగా బస్సు యాత్రపైనే ఎక్కువగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

కుంతియా
మరోవైపు.. అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు కూడా టి-కాంగ్‌ నేతలకు మింగుడు పడడం లేదని తెలుస్తోంది. జిల్లా కాంగ్రెస్‌ కమిటీల ప్రకటన అంశం కూడా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలను మరింత కలవరానికి గురిచేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 31 జిల్లాలు ఉన్నాయి. కాంగ్రెస్‌ పార్టీ 10 ఉమ్మడి జిల్లాలకు మాత్రమే అధ్యక్షులను ప్రకటించింది. పాత 10 జిల్లాలకే అధ్యక్షులను ప్రకటిస్తే పార్టీ బలోపేతం చేయడం ఎలా సాధ్యం ? అని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. పైగా ఒక్క హైదరాబాద్‌ మినహా మిగతా 9 జిల్లాలకు పాత అధ్యక్షులనే ప్రకటించడంపై కూడా చాలామంది నేతలు అసంతప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. డిసిసిలను పూర్తిగా ప్రక్షాళన చేయాలని, 31 జిల్లాలన్నింటికి డిసిసి కమిటీలు నియమించాలని డిమాండ్‌ చేస్తున్నారు. కేవలం పాత జిల్లాలకే అధ్యక్షులను నియమిస్తే పార్టీలో సమన్వయం దెబ్బతింటుందని జిల్లాల నేతలు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు.
అటు.. తెలంగాణ కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌ను మారుస్తారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరగడంపై ఈ సమావేశంలో కుంతియా అసంతప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కొత్త ఇంఛార్జ్‌గా గులాంనబీ ఆజాద్‌ వస్తున్నారని సోషల్‌ మీడియాలో హడావుడి చేస్తుండడంపై కుంతియా తీవ్ర అసహనం ప్రదర్శించారని తెలుస్తోంది. హైకమాండ్‌ నుంచి అధికారిక ప్రకటన రాకముందే సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఆయన ఆవేశంగా వ్యాఖ్యానించి నట్లు తెలుస్తోంది. ఇది తనను అవమానించడమే అని కుంతియా ఆవేదన చెందారని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఒకవేళ ఇదే ప్రచారం నిజమై ఆజాద్‌ను తెలంగాణ ఇంఛార్జ్‌గా నియమిస్తే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
– సప్తగిరి
Index, latestnews, ప్రాంతీయం, విశ్లేషణ11-17 June 2018
http://www.jagritiweekly.com/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87%E0%B0%B7%E0%B0%A3/%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D%E2%80%8C%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%97%E0%B0%82%E0%B0%A6%E0%B0%B0%E0%B0%97%E0%B1%8B%E0%B0%B3%E0%B0%82/
వీరిచే పోస్ట్ చేయబడింది Sapthagiri వద్ద 3:34 AM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

7, జూన్ 2018, గురువారం

పరిస్థితులు సృష్టించుకున్నారా ? యాదృచ్ఛిక నిర్ణయమేనా ?


వీరిచే పోస్ట్ చేయబడింది Sapthagiri వద్ద 4:19 AM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి

పరిస్థితులు సృష్టించుకున్నారా ? యాదృచ్ఛిక నిర్ణయమేనా ?

పరిస్థితులు సృష్టించుకున్నారా ? 

యాదృచ్ఛిక నిర్ణయమేనా ?

పరిస్థితులు సృష్టించుకున్నారా ? యాదృచ్ఛిక నిర్ణయమేనా ?
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. ఎన్నో సార్లు అది నిరూపితం అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలోనూ జంపింగ్‌ జపాంగ్‌ల చరిత్ర ఇదే విషయాన్ని రుజువు చేసింది కూడా. ముందురోజు ఎదుటి పార్టీ వాళ్లను మాటలతోనే చీల్చి చెండాడిన ఓ నాయకుడు మరుసటిరోజే ఆ పార్టీ కండువాను జనం సమక్షంలో కప్పుకోవడం తెలుగునాట సర్వసాధారణమే. అలాంటి నాయకుల గురించి సందర్భం వచ్చినప్పుడల్లా జనమే మాట్లాడుకుంటారు.
తానుండే పార్టీలో మాట చెల్లుబడి అయితేనే సరి.. తన డిమాండ్లు నెరవేర్చితేనే మంచిది.. అతని మాటను పార్టీ పెడచెవిన పెట్టిందా..? ఇక అప్పటిదాకా తనకిచ్చిన ప్రాధాన్యమంతా మరుగున పడిపోతుంది. కొన్నిసార్లు ఎదుటి పార్టీ ఆపరేషన్‌ ఆకర్ష్‌ కూడా ఇలాంటి పరిణామాలకు కారణ మవుతుంది.
ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత అయిన మోత్కుపల్లి కొద్ది నెలలుగా సొంతపార్టీపైనే యుద్ధం ప్రకటించారు. ఎడమొహం, పెడమొహంగా ఉంటూ సందర్భం వచ్చినప్పుడల్లా పార్టీపై విమర్శల వర్షం కురిపించారు.
కొన్నిరోజుల క్రితం ఎన్టీఆర్‌ వర్థంతి నాడు తెలంగాణలో టిడిపి యాత్ర ముగిసిపోయిందని పార్టీని టిఆర్‌ఎస్‌లో విలీనం చేస్తే బాగుంటుందని ఓ సంచలన కామెంట్‌ చేశారు మోత్కుపల్లి. అసలే తెలంగాణలో చావుతప్పి కన్ను లొట్టపోయిన సందర్భంగా కొనసాగుతున్న టిడిపికి ఆ పార్టీ సీనియర్‌ నేత మోత్కుపల్లి ఈ విధంగా షాక్‌ ఇవ్వడం పెద్ద దుమారం రేపింది.
ఇక ఎన్టీఆర్‌ జయంతి రోజున ఏకంగా పార్టీ అధినేత చంద్రబాబునే టార్గెట్‌ చేశారాయన. ఎన్టీఆర్‌ మ¬న్నత ఆశయంతో పెట్టిన పార్టీని చంద్రబాబు నాశనం చేస్తున్నారని, తెలుగుదేశం పార్టీ పగ్గాలను ఎన్టీఆర్‌ వంశస్తులైన నందమూరి కుటుంబానికి అప్పగించాలంటూ మరో సంచలన ప్రతిపాదన చేశారు. అంతేకాదు టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఎన్టీఆర్‌ ఘాట్‌ సాక్షిగా ప్రశంసలతో ముంచెత్తారు. అదే సందర్భంలో తనకు అన్యాయం జరిగిందంటూ వెక్కి వెక్కి ఏడ్చారు.
తెలుగుదేశం పార్టీ ప్రధాన పండగ ‘మహానాడు’ ఓ వైపు విజయవాడలో జరుగుతున్న సందర్భంలోనే మోత్కుపల్లి ఇలాంటి సంచలన కామెంట్స్‌ చేయడంతో అప్పటికప్పుడు పార్టీ జాతీయ కమిటీ భేటీ అయి మోత్కుపల్లి నర్సింహులును పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది.
టిడిపిని టిఆర్‌ఎస్‌లో విలీనం చేయాలన్న మోత్కుపల్లి వ్యాఖ్యల తర్వాతే పార్టీలో ఆయనకు ప్రాధాన్యం తగ్గించారు. ఏ సమావేశానికి కూడా ఆయన్ను ఆహ్వానించలేదు. అది మోత్కుపల్లిని మరింత కుంగిపోయేలా చేసిందని, అందుకే ఎన్టీఆర్‌ జయంతినాడు ఫైనల్‌ కామెంట్స్‌తో చంద్రబాబును టార్గెట్‌ చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఏదైనా ఓ రాష్ట్రానికి గవర్నర్‌ కావాలన్నది మోత్కుపల్లి నర్సింహులు ఆశయం. చంద్రబాబుకు ప్రతి సమావేశంలోనూ ఈ విషయాన్ని గుర్తుచేసేవారు మోత్కుపల్లి. చంద్రబాబు కూడా సీనియర్‌ అయిన మోత్కుపల్లి కోరికను కాదనేవారు కాదని, కేంద్రంలోని భాగస్వామ్య పార్టీతో చెపితే బిజెపి నేతలు ఆ ప్రతిపాదనలను పక్కన బెట్టారని వినికిడి.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత డీలా పడిపోయిన టిడిపిలో టిఆర్‌ఎస్‌కు కరెక్ట్‌ కౌంటర్‌ ఇచ్చేవాళ్లంటే ఇద్దరి పేర్లే వినిపించేవి. ఒకటి రేవంత్‌రెడ్డి కాగా రెండో వ్యక్తి మోత్కుపల్లి. రేవంత్‌రెడ్డి ఇప్పటికే టిడిపిని వీడి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న మోత్కుపల్లి ఇప్పుడు పార్టీకి దూరమయ్యారు. దీంతో ఆ పార్టీలో ఇప్పుడు వాయిస్‌ ఉన్న నాయకుడే లేడన్న చర్చ సాగుతోంది.
ఆ రోజుల్లో మోత్కుపల్లి ప్రెస్‌మీట్‌ పెడితే చాలు టిఆర్‌ఎస్‌, కెసిఆర్‌పై ఒంటికాలిపై లేచేవారు. దీంతో టిటిడిపికి మోత్కుపల్లి ఓ అసెట్‌గా భావించేవాళ్లు. మొదట్లో మోత్కుపల్లి సందర్భం సృష్టించుకొని మరీ కెసిఆర్‌పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టేవారు. గవర్నర్‌ పదవి మీది ఆశతో చంద్రబాబు డైరెక్షన్‌లోనే మోత్కుపల్లి అలా రెచ్చిపోయేవారని చెప్పుకునే వారు. కానీ ఇప్పుడు ఏకంగా పార్టీ నుంచే బహిష్కారానికి గురయ్యారు.
అయితే మోత్కుపల్లి టిఆర్‌ఎస్‌లో చేరేందుకు లైన్‌ క్లియర్‌ చేసుకునేందుకే ఇంతకాలం ఇలా వ్యవహరించారని, పార్టీ నుంచి బహిష్కారానికి గురయ్యేలా పరిస్థితులు సృష్టించుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. టిఆర్‌ఎస్‌లో చేరికకు ఆల్‌ రెడీ ప్రణాళిక సిద్ధమైందని, పంచాయతీరాజ్‌, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఆయన ఆ పార్టీలో చేరే అవకాశం ఉందని అరటున్నారు.
– సప్తగిరి
Index, latestnews, ప్రాంతీయం, విశ్లేషణ04-10 June 2018
http://www.jagritiweekly.com/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b2%e0%b1%87%e0%b0%b7%e0%b0%a3/%e0%b0%aa%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a5%e0%b0%bf%e0%b0%a4%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-%e0%b0%b8%e0%b0%b7%e0%b1%8d%e0%b0%9f%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b1%81%e0%b0%95%e0%b1%81%e0%b0%a8/
వీరిచే పోస్ట్ చేయబడింది Sapthagiri వద్ద 4:18 AM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి
కొత్త పోస్ట్‌లు పాత పోస్ట్‌లు హోమ్
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి: కామెంట్‌లు (Atom)

Stat counter

View My Stats

మొత్తం పేజీ వీక్షణలు

బ్లాగు ఆర్కైవ్

  • ▼  2022 (1)
    • ▼  సెప్టెంబర్ (1)
      • MOUNT ABU MEMORIESమరపురాని మౌంట్‌ అబూ(జ్ఞాపకాల దొం...
  • ►  2020 (1)
    • ►  జనవరి (1)
  • ►  2019 (78)
    • ►  డిసెంబర్ (10)
    • ►  నవంబర్ (2)
    • ►  అక్టోబర్ (1)
    • ►  సెప్టెంబర్ (11)
    • ►  జులై (4)
    • ►  జూన్ (44)
    • ►  ఏప్రిల్ (6)
  • ►  2018 (47)
    • ►  నవంబర్ (18)
    • ►  జూన్ (2)
    • ►  మే (12)
    • ►  ఏప్రిల్ (7)
    • ►  మార్చి (4)
    • ►  ఫిబ్రవరి (4)
  • ►  2017 (11)
    • ►  నవంబర్ (1)
    • ►  అక్టోబర్ (7)
    • ►  సెప్టెంబర్ (2)
    • ►  ఏప్రిల్ (1)
  • ►  2016 (17)
    • ►  ఆగస్టు (4)
    • ►  జులై (1)
    • ►  జూన్ (1)
    • ►  మే (3)
    • ►  మార్చి (2)
    • ►  ఫిబ్రవరి (5)
    • ►  జనవరి (1)
  • ►  2015 (17)
    • ►  డిసెంబర్ (3)
    • ►  నవంబర్ (3)
    • ►  అక్టోబర్ (3)
    • ►  సెప్టెంబర్ (2)
    • ►  జూన్ (1)
    • ►  ఏప్రిల్ (3)
    • ►  ఫిబ్రవరి (2)
  • ►  2014 (35)
    • ►  డిసెంబర్ (6)
    • ►  నవంబర్ (1)
    • ►  సెప్టెంబర్ (4)
    • ►  ఆగస్టు (10)
    • ►  జులై (2)
    • ►  జూన్ (1)
    • ►  ఏప్రిల్ (1)
    • ►  మార్చి (5)
    • ►  ఫిబ్రవరి (4)
    • ►  జనవరి (1)
  • ►  2013 (17)
    • ►  డిసెంబర్ (1)
    • ►  అక్టోబర్ (2)
    • ►  సెప్టెంబర్ (2)
    • ►  ఆగస్టు (3)
    • ►  జులై (9)
  • ►  2012 (9)
    • ►  మార్చి (1)
    • ►  జనవరి (8)
  • ►  2011 (4)
    • ►  మే (1)
    • ►  ఏప్రిల్ (1)
    • ►  మార్చి (2)

నా గురించి

Sapthagiri
నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి

FLAG Counter

Flag Counter

ప్రముఖ పోస్ట్‌లు

  • ఇస్లాం తొలిప్రవక్త శివుడే...!
            ఓవైపు ఇస్లాం తీవ్రవాదులు కొత్తకొత్త పేర్లతో ఉగ్రవాద సంస్థలను నెలకొల్పుతూ ఇతర మతాలపై... ప్రధానంగా హిందూమతాన్ని టార్గెట్ చ...
  • ఇటు జల తరంగ వైభోగం.. అటు ఆధ్యాత్మిక వైభవం (జాగృతి కృష్ణా పుష్కర సంచిక)
    ఇటు జల తరంగ వైభోగం.. అటు ఆధ్యాత్మిక వైభవం                         - గోపగోని సప్తగిరి, 98850 86126.     భారత దేశంలోని ఇతర నదుల మాదిరిగానే...
  • Journalism & Media Glossary
    Journalism, like any profession, has its own language and specialist words which practitioners need to know. The following gl...
  • రాఖీ పండుగ అంటే రక్షా బంధనం.. అనుబంధాల ఆలింగనం
        సోదర సోదరీమణుల పవిత్ర బంధానికి అసలైన నిర్వచనం రక్షాబంధనం. రాఖీ పౌర్ణమి, రక్షా బంధన్‌, రాఖీల పండుగ ఎలా పిలిచినా.. అన్నా చెల్లెళ్ల...
  • ఓయు తేనెతుట్టెను కదిపిన కేసీఆర్‌ రహస్య వ్యూహంలో భాగమేనా?
        తెలంగాణ   ముఖ్యమంత్రి   కె .  చంద్రశేఖర్ ‌ రావు   మానసపుత్రికగా   చెప్పుకుంటున్న డబుల్ ‌   బెడ్ ‌ రూమ్ ‌   ప్లాట్స్ ‌   పథకం  ...
  • రూపాయి - పాపాయి
    ఇదీ వాస్తవం ! చేతులు కాలాక ఆకులు పట్టుకుందాం అదిగో పిలుస్తున్నారు ప్రధాని మన్మోహన్ ఇదే యూపీఏ తాజా నినాదమట కానీ చేతులు ఇప్పటికే బొబ...
  • (శీర్షిక లేని)
    పార్లమెంటు సమావేశాల్లోపే కేబినెట్‌ నోట్‌ కేబినెట్‌ నోట్‌పై వేగంగా కసరత్తు సాగుతోంది. పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపే నోట్‌ పూర్తయ్యే అవకాశా...
  • అమ్మ..!!?
    అంతరిక్షంలోకి దూసుకెళ్తున్న ఈ రోజుల్లోనూ అమ్మాయిలంటే వివక్ష తగ్గడం  లేదు. భ్రూణ హత్యలు ఒకవైపు.. పుట్టిన శిశువులను వదిలించుకునే  దుస్సంప్...
  • శ్రీ జయనామ సంవత్సర పంచాంగం, రాశి ఫలాలు (2014-15)
    పంచాంగ పీఠిక కలియుగ ప్రమాణము 4 లక్షల 32 వేల సంవత్సరములు. శ్వేత వరాహకల్పమునందలి ఏడవదైన వైవస్వత మన్వంతరములోని 28వ మహాయుగమునందలి కలియు...
  • సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు
              506 రోజుల పాటు సాగిన చెరకు తెరపడింది. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతికి సంకెళ్లు తెగిపోయాయి. తెలంగాణలో కొనసాగిన అనధికార నిషేధంపై సర్వోన్న...
వాటర్‌మార్క్ థీమ్. Blogger ఆధారితం.