హైదరాబాద్ పోలీసుల అనూహ్య నిర్ణయాలు
గడిచిన వారం హైదరాబాద్‌లో ఒకే రోజు చోటు చేసుకున్న రెండు పరిణామాలు తీవ్ర చర్చను లేవనెత్తాయి. చూడటానికి అవి వేరే అంశాలుగా కనిపించినా రాజకీయంగానూ కలకలం సష్టించాయి. వాటిలో ఒకటి హైదరాబాద్ నుంచి కత్తి మహేష్ బహిష్కరణ. రెండోది స్వామి పరిపూర్ణానంద ధర్మాగ్రహ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో పాటు స్వామీజీని గహ నిర్బంధంలో ఉంచడం. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిపై కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ స్వామి పరిపూర్ణానంద హైదరాబాద్ నుంచి యాదాద్రికి ధర్మాగ్రహ యాత్ర పేరిట పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఆ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. అటు కత్తి మహేష్ నగర బహిష్కరణ, ఇటు ధర్మాగ్రహ యాత్రకు అనుమతి నిరాకరణతో హైదరాబాద్‌లో కలకలం చెలరేగింది. అయితే ఈ రెండు పరిణామాలకు సంబంధం ఉండటం ఇక్కడ ప్రస్తావనార్హం.
కత్తి మహేష్ నగర బహిష్కరణ
ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై హైదరాబాద్ నగర బహిష్కరణ విధించారు. ఆరు నెలల పాటు ఆయన హైదాబాద్‌లో అడుగు పెట్టకూడదంటూ తెలంగాణ పోలీసు శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ‘ది తెలంగాణ ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ సోషల్ అండ్ హజార్డస్ యాక్టివిటీస్ యాక్ట్ 1980 సెక్షన్ – 3’ కింద ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నగర బహిష్కరణే కాదు ఆయన్ను తన స్వస్థలమైన చిత్తూరు జిల్లాలో వదిలేసి వచ్చారు టాస్స్‌ఫోర్స్ పోలీసులు.
హైదరాబాద్ పోలీసుల నిర్ణయంపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. సాధారణంగా రౌడీషీటర్లపైనో, శాంతి భద్రతలను చేతుల్లోకి తీసుకునే అరాచకులపైనో పోలీసులు నగర బహిష్కరణ వంటి శిక్ష విధిస్తారు. చట్టంలో ఉన్న సెక్షన్లను వాటికోసం ఉపయోగించుకుంటారు. కత్తి మహేష్‌ను హైదరాబాద్ నుంచి బహిష్కరిస్తారని ఏ ఒక్కరూ ఊహించలేదు. అయితే అతను ఎంతటి ప్రమాదకరమైన వ్యక్తో పోలీసులే తేల్చేశారు. బయటకు కనిపించే అరాచకులు ఆయుధాలతో చెలరేగిపోతారు. అలజడులు సష్టిస్తారు. కానీ కత్తి మహేష్ తన వ్యాఖ్యలు, చేష్టలతో సమాజాన్ని రెచ్చగొడుతున్నాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రత్యేకంగా తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి సీనియర్ పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు
ఇటీవల ఓ టీవీ ఛానల్లో జరిగిన చర్చలో శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు కత్తి మహేష్. దీంతో ఆయనపై హిందూ సంఘాల నేతలు, మఠాధిపతులు, పీఠాధిపతులు ధ్వజమెత్తారు. చట్ట పరంగా కఠినచర్యలు తీసుకోవాలంటూ స్వామి పరిపూర్ణానందతో పాటు పలువురు పీఠాధిపతులు ఏపి, తెలంగాణ ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మరోవైపు కత్తి మహేష్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే సాగింది. అనుకూల, వ్యతిరేక వర్గాల పోస్టులు, కౌంటర్లతో పరిస్థితి చేయి దాటే సూచనలు కనిపించాయి. దీన్ని గ్రహించిన పోలీసులు కత్తిపై నగర బహిష్కరణ వేటు వేశారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలోనే కొన్ని నెలలుగా కత్తి మహేష్ టీవీ చర్చల్లో సాగించే వాదనలు, చేసే వివాదాస్పద వ్యాఖ్యలను పోలీసులు విశ్లేషించారు. టీవీ చర్చల్లో ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు, దానిపై సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చపై పోలీసులు ప్రత్యేకదష్టి పెట్టారు. కత్తి మహేష్ డిస్కషన్లు, చర్చా వేదికల్లో ఆయన చేస్తున్న ప్రసంగాలు, ప్రకటనలు, వ్యాఖ్యలను విశ్లేషించారు. అంతేకాదు ఏకంగా రాముడిపైనే విద్వేష పూరిత వ్యాఖ్యలు చేయడంతో తలెత్తిన పరిణామాలపైనా చర్చించారు. హిందూ సంఘాల నుంచి విమర్శలు వెల్లువెత్తిన తర్వాత కూడా కత్తి మహేష్ తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ వ్యాఖ్యలు చేయడాన్ని డిజిపి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. సోషల్ మీడియాలో కామెంట్లు, కౌంటర్లపైనా కన్నెర్రజేశారు. ఈ పరిస్థితులకు కారకుడైన కత్తి మహేష్‌పై ఇప్పటికే హైదరాబాద్ బంజారాహిల్స్‌తో పాటు పలు పోలీస్ స్టేషన్లలో పలువురు కేసులు పెట్టారు. నోటీసులు జారీచేశారు. ఆ తర్వాత కూడా కత్తి రియాక్షన్‌ను పరిశీలించారు.
నిర్ణయం వెనుక కారణాలు
తెలంగాణ ఆవిర్భావం తర్వాత హైదరాబాద్ లోనూ, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా సాఫీగా ఉందని డిజిపి మహేందర్ రెడ్డి ప్రకటించారు. దేశంలోనే ప్రశాంత నగరాల్లో హైదరాబాద్ ముందు వరుసలో నిలిచిందన్నారు. అయితే హిందువుల ఆరాధ్య దైవమైన రాముడిపై కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో అలజడి సష్టించేలా ఉన్నాయని సోషల్ మీడియాల పోస్టులు, చర్చల ద్వారా తెలుస్తోందని చెప్పారు. ప్రశాంత నగరమైన హైదరాబాద్‌లో ఈ పరిణామం కల్లోలం సష్టించే అవకాశం కనిపించ డంతో ఆయనపై బహిష్కరణ వేటు వేశామని డిజిపి మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. నిషేధం సమయంలో కత్తి మహేష్ హైదరాబాద్‌కు వస్తే అరెస్ట్ చేస్తామన్నారు. వేరే ఎక్కడి నుంచైనా విద్వేష పూరితంగా సోషల్ మీడియాలో పోస్టులు చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. పరిస్థితులను బట్టి అవసరమైతే ఈ నిషేధాన్ని తెలంగాణ అన్ని జిల్లాల్లోనూ అమలు చేస్తామన్నారు. అయితే కత్తి మహేష్‌ను చిత్తూరు జిల్లాలోని స్వగ్రామానికి తరలించడంపై ఏపి పోలీసులు కూడా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఇన్నాళ్లూ సాగించిన విద్వేషపూరిత కార్యకలాపాలు ఇకపై కత్తి మహేష్ చిత్తూరు కేంద్రంగా సాగించే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తపరిచినట్లు తెలుస్తోంది. దీనికి బదులు కర్నాటక వంటి పక్క రాష్ట్రాలకు పంపిస్తే ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడినట్లు కూడా చెప్పుకుంటున్నారు.
కొంతకాలం క్రితం వరకు కత్తి మహేష్ అంటే ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే బిగ్‌బాస్ షోలో సెలెక్ట్ అయ్యాడో అప్పటి నుంచి ఆయన కాస్త పాపులర్ అయ్యాడు. సబ్జెక్ట్‌తో సంబంధం లేకుండా టీవీ చర్చల్లో పాల్గొనడం.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలతో పబ్లిసిటీ స్టంట్‌ను అనుసరించాడు.
స్వామి పరిపూర్ణానంద గహ నిర్బంధం
ఇక అదేరోజు స్వామి పరిపూర్ణానంద తలపెట్టిన ధర్మాగ్రహ యాత్రకు పోలీసులు చివరి నిమిషంలో అనుమతి నిరాకరించారు. స్వామి పరిపూర్ణానంద బస చేసిన గహానికి పలువురు పోలీసు అధికారులు పెద్ద ఎత్తున చేరుకొని స్వామీజీని గహ నిర్బంధం చేశారు. కత్తి మహేష్ ఓ టీవీ ఛానల్ చర్చలో శ్రీరాముడిని దూషించడంతో పాటు సీతమ్మ పట్ల అత్యంత హేయంగా మాట్లాడటంపై స్వామి పరిపూర్ణానంద తీవ్రంగా స్పందించారు. సీనీ నటుడు నాగబాబు కూడా కత్తి వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నుంచి యాదాద్రికి పాదయాత్రను తలపెట్టారు పరిపూర్ణానంద. అటు కత్తి మహేష్‌కు నగర బహిష్కరణ శిక్ష విధించిన హైదరాబాద్ పోలీసులు ఇటు స్వామీజీ పాదయాత్రను కూడా అడ్డుకున్నారు.
స్వామి ససేమిరా..
ఈ వివాదానికి అసలు కారకుడైన కత్తి మహేష్‌కు నగర బహిష్కరణ విధించామని ఈ సమయంలో ధర్మాగ్రహ యాత్ర చేస్తే పరిస్థితులు ఉద్రిక్తంగా మారొచ్చని స్వామీజీకి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు. కానీ తాను తలపెట్టిన యాత్ర ఒక్క కత్తి మహేష్‌ను ఉద్దేశించి కాదని, హిందూమతంపై కుట్రపూరితంగా జరుగుతున్న దాడులను నివారించేలా స్వామివారిని వేడుకునేందుకు ఈ యాత్ర చేపట్టానని స్వామి పరిపూర్ణానంద స్పష్టం చేశారు. కానీ పోలీసులు మాత్రం స్వామీజీని యాత్రకు అనుమతించలేదు. అయితే.. తాను దీక్షలో ఉన్నందున సెక్రటేరియట్ పక్కనున్న మింట్ కాంపౌండ్ వద్ద గల పవర్ హనుమాన్ దేవాలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకుంటానన్న స్వామి పరిపూర్ణానంద ఆకాంక్షకు పోలీసులు సమ్మతించారు. అయితే.. పోలీసు పహారా మధ్యే స్వామీజీని దేవాలయానికి తీసుకెళ్లి తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. ఓ దశలో తన పాదయాత్రకు అనుమతించకుంటే ఆమరణ దీక్ష చేపడతానని స్వామి పరిపూర్ణానంద హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. అయితే పోలీసులు స్వామీజీని సంయమనం పాటించాలని అభ్యర్థించినట్లు సమాచారం.
అటు పరిపూర్ణానంద స్వామి హౌస్ అరెస్టును నిరసిస్తూ విహెచ్‌పి, భజరంగదళ్ కార్యకర్తలతో పాటు స్వామీజీ శిష్యులు, అభిమానులు ఆందోళనకు దిగారు. స్వామీజీ ఇంటికి చేరుకుని తమ నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో నిరసనకారుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
కత్తికి ఆ శిక్ష సరిపోదు
వాస్తవానికి కత్తి మహేష్ శ్రీరాముడు, సీతాదేవిపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటి నుంచే సోషల్ మీడియాలో అతనిపై ముప్పేట దాడి మొదలైంది. అయితే స్వామి పరిపూర్ణానంద పాదయాత్ర ప్రకటన చేయడంతో కత్తిపై వాగ్యుద్ధం ప్రకటించిన వాళ్లల్లో సంతోషం పెల్లుబికింది.
హిందూ మతంపై జరుగుతున్న దాడిని స్వామీజీ నాయకత్వంలో సమర్థవంతంగా ఎదుర్కోవచ్చన్న ధీమాలో పడిపోయారు సోషల్ మీడియా ఫాలోవర్లు. కానీ పోలీసుల తాజా చర్యలతో విమర్శలు విని పిస్తున్నాయి. కత్తి మహేష్‌కు తెలంగాణ పోలీసులు విధించిన శిక్ష చిన్నదే అని అతని తీరు, కుల, మతాలను రెచ్చగొట్టేలా ఉండే అతని వ్యాఖ్యలు, విద్వేషాలు రగిలించే మాదిరిగా చేసే ప్రసంగాలకు ఈ శిక్ష సరిపోదన్న వాదనలూ వ్యక్తమవుతున్నాయి.
– సప్తగిరి
http://www.jagritiweekly.com/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87%E0%B0%B7%E0%B0%A3/%E0%B0%B9%E0%B1%88%E0%B0%A6%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AC%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D%E2%80%8C-%E0%B0%AA%E0%B1%8B%E0%B0%B2%E0%B1%80%E0%B0%B8%E0%B1%81%E0%B0%B2-%E0%B0%85%E0%B0%A8%E0%B1%82%E0%B0%B9%E0%B1%8D/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి