29, నవంబర్ 2018, గురువారం

తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి


తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి
రాజకీయ పార్టీల హడావిడి

ముందస్తుకు సై అంటే  సై :
-----------------------------
ముందస్తు ఎన్నికలకు సై అంటున్నారు కేసీఆర్‌. కేంద్రంలో ముందస్తు ఎన్నికలు ఖాయమన్న ప్రచారం ఊపందుకోవడంతో కేసీఆర్‌ కూడా కదన రంగంలో కాలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమా అంటూ కాంగ్రెస్‌ నేతలకు సవాల్‌ విసిరారు. ముఖ్యమంత్రి సవాలుకు కాంగ్రెస్‌ కూడా దీటుగానే స్పందించింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కేసీఆర్‌ సవాల్‌కు సై అన్నారు. తాము ఎప్పుడైనా ఎన్నికలకు సిద్ధమే అని ప్రకటించారు. దీంతో.. తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.

మొదట కేసీఆర్‌ సభలో ఆవేశంలో అలా వ్యాఖ్యానించాడేమో అనుకున్నారు. కానీ.. పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్యులు తనను కలిసినప్పుడు ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని సూచనలు చేశారు. అంతేకాదు.. ముందస్తు ఎన్నికలతో పార్టీకి గానీ.. ప్రస్తుత ప్రజా ప్రతినిధులకు గానీ.. ఏమాత్రం భయం అవసరం లేదని భరోసా ఇచ్చారు. దీంతో.. ఇది సీరియసే అని అందరికీ అర్థమైపోయింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. వందకు పైగా సీట్లు టీఆర్‌ఎస్‌వే అని కేసీఆర్‌తో పాటు.. కేటీఆర్‌, మంత్రులు పలు సందర్భాల్లో ప్రకటనలు చేస్తున్నారు.

అంతేకాదు.. కేసీఆర్‌ ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా ప్లాన్లు సిద్ధం చేసుకున్నారు. గద్వాలలో భారీ బహిరంగ సభతో ఎన్నికల ఊపును తెచ్చేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్‌ తాము బలంగా ఉన్నామని భావించే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆ పార్టీ కీలక నేత డీకే అరుణ నియోజకవర్గమైన గద్వాలలోనే టీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభతో వేడి మరింత పెరిగింది.

కాంగ్రెస్‌పార్టీలో ప్రక్షాళన షురూ :
--------------------------------
అటు.. కాంగ్రెస్‌ పార్టీలోనూ ప్రక్షాళన షురూ అయ్యింది. పార్టీని చక్కదిద్దేందుకు ఏకంగా అధిష్ఠానమే రంగంలోకి దిగింది. ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులను రాష్ట్రానికి పంపించింది. కేసీఆర్‌ ముందస్తు సవాల్‌ నేపథ్యంలో ఆగమేఘాలపై తెలంగాణలో దృష్టిపెట్టింది. ప్రధానంగా హస్తం పార్టీలో నేతల మధ్య విభేదాలు, సమన్వయ లోపమే ప్రధాన సమస్య. వీటిపై దృష్టి సారించిన హైకమాండ్.. పార్టీని గాడిలో పెట్టేందుకు సిద్ధమైంది. ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాసన్ కృష్ణన్, సలీమ్ అహ్మద్‌లను తెలంగాణకు ఇంచార్జ్‌లుగా నియమించింది. ఈ ముగ్గురికి పార్టీని చక్కబెట్టే బాధ్యతలను అప్పగించారు. ఒక్కొక్కరు నలభై నియోజక వర్గాల బాధ్యతలను చూడనున్నారు.

బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీకి సంబంధించిన అన్ని కమిటీలను నియమించడంలో ఇంచార్జి కార్యదర్శులదే కీలకపాత్ర. ఆయా నియోజకవర్గాల స్థాయిలో నాయకుల మధ్య విభేదాలు, సమన్వయలోపాల్ని పరిష్కరించడం.. అసంతృప్తులను బుజ్జగించడం, పార్టీలో చేరికలు ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపడతారు. వీళ్లు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే అభ్యర్థులకు టికెట్ల కేటాయింపు ఆధారపడి ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏ జిల్లాలో చూసినా ఒకే  వర్గం ఆధిపత్యం కొనసాగుతుందని కాంగ్రెస్‌పార్టీలో ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మొదట జిల్లాల్లో ఉన్న వర్గ విభేదాలకు పరిష్కారం జరిగితేనే పార్టీ బలోపేతం అవుతుందని కొత్తగా వచ్చిన ఇంచార్జ్‌లకు నేతలు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. మరోవైపు.. పార్టీని క్షేత్ర స్థాయి నుండి బలోపేతం చేస్తామని కొత్తగా వచ్చిన కార్యదర్శులు పార్టీ నేతలకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గంలో గెలిచే అభ్యర్ధులకే టికెట్స్ ఇస్తామని, అభ్యర్థుల రికమండేషన్స్ కు ఎలాంటి ప్రాధాన్యతను ఇవ్వమని భరోసా ఇచ్చినట్లు సమాచారం.

బీజేపీలో ప్రజా చైతన్య యాత్ర జోష్‌ :
----------------------------------
అటు.. కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తోన్న బీజేపీ కూడా తెలంగాణలో పాగా వేసేందుకు వ్యూహాలకు పదును పెడుతోంది. బిజెపి ప్రజా క్షేత్రం లోకి వెళ్లి తమ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది. ఈనెల 23వ తేదీన బీజేపీ ప్రజా చైతన్య యాత్ర పేరిట బస్సుయాత్ర మొదలైంది. పలు నియోజకవర్గాలన్నీ చుడుతూ బస్సుయాత్ర పరుగులు పెడుతోంది. కర్నాటక ఎన్నికల్లో ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, ఉపయోగించిన బస్సులోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ యాత్రను చేపడుతున్నారు. ఆయనతో పాటు పలువురు నేతలు కూడా బస్సుయాత్రలో పాల్గొంటున్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల‌ను ప్రజ‌ల‌కు వివ‌రిస్తూనే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌పై ప్రజ‌ల్లో అవ‌గాహన క‌లిగే విధంగా యాత్ర చేస్తున్నట్లు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ల‌క్ష్మణ్ చెబుతున్నారు. ఈ యాత్ర జూలై 6వ తేదీ వరకు 14 రోజుల పాటు కొనసాగనుంది. ప్రతిరోజూ రెండు నియోజకవర్గాలు కవర్‌ అయ్యేలా బీజేపీ బస్సుయాత్రను షెడ్యూల్‌ చేశారు. క్షేత్ర స్థాయిలో పార్టీ ని బలోపేతం చెయ్యటానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు. క్షేత్ర పార్టీని పటిష్టం చేయడంతో పాటు.. అధికార టీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ఎండగడుతూ బస్సుయాత్ర సాగుతోంది. బహిరంగ స‌భ‌లు, రోడ్ షోలు, స‌మావేశాలతో సాగుతున్న ఈ యాత్రతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ బస్ యాత్ర  వచ్చే ఎన్నికల విజయ యాత్ర కావాలనే జోష్ కనిపిస్తోంది.

- సప్తగిరి.జి
98850 86126

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి