29, నవంబర్ 2018, గురువారం

టీ కాంగ్రెస్‌లో గందరగోళం



టి-కాంగ్రెస్‌లో గందరగోళం

టి-కాంగ్రెస్‌లో గందరగోళం
‘ఎవరికి వారే యమునా తీరే’ అన్న చందంగా మారిన తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో ఎవరి వాదనలు వారే వినిపిస్తున్నారు. అధిష్టానానికి ఎవరు ఇచ్చే నివేదికలు వాళ్లు ఇచ్చేస్తున్నారు. దీంతో పార్టీలో గందరగోళం నెలకొంటోంది. ఏకంగా పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్‌ కూడా అసహనం వ్యక్తం చేసే పరిస్థితి రావడం ఇప్పుడు ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
మూడు విడతల బస్సుయాత్ర తర్వాత ఇటీవల జరిగిన ఆ పార్టీ కీలక సమావేశంలో టిపిసిసి కార్యవర్గంతో పాటు, అన్ని జిల్లాల డిసిసి అధ్యక్షులు పాల్గొన్నారు. సమావేశానికి పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్‌ కుంతియా కూడా హాజరయ్యారు. అయితే ఆయన సమక్షంలోనే టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన ప్రసంగం కొంతమంది సీనియర్లు, ఇతర నాయకులకు మింగుడు పడలేదని చెబుతున్నారు. పార్టీ ప్రయోజనాల దష్ట్యా నాయకులంతా సర్దుకుపోవాల్సిందేనని ఉత్తమ్‌ చెప్పడం సీనియర్లకు ఆగ్రహం తెప్పించిందంటున్నారు.
బస్సుయాత్ర వంటి పెద్ద కార్యక్రమం చేపట్టి నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయని, వాటిని పట్టించుకోవద్దని నాయకులకు ఈ సమావేశంలో ఉత్తమ్‌ సూచించారు. బస్సుయాత్ర సహా పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. మూడు విడతల్లో బస్సుయాత్ర జరిగిన తీరు, పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధత, టిఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రైతుబంధు పథకం అమలు తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. బస్సుయాత్రలో భాగంగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కటే సభ నిర్వహించడం సరికాదని, ఒక్కరిపైనే ఆర్థిక భారం పడుతోందని ఓ నాయకుడు సమావేశం దష్టికి తీసుకొచ్చారు. ఇక బస్సుయాత్రలో పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించటాన్ని మరోనేత తప్పుపట్టగా, కష్టపడుతున్న వారిని ప్రోత్సహిస్తే తప్పేమిటని మరికొందరు అభిప్రాయపడ్డారు.
అయితే టికెట్ల కేటాయింపు అంశం పూర్తిగా అధిష్టానమే చూసు కుంటుందని కుంతియా సర్దిచెప్పారు. బస్సుయాత్ర ద్వారా టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తేగలిగామని వ్యాఖ్యానించినట్లు సమాచారం. నాలుగో విడత బస్సు యాత్రకు ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రానున్నట్లు వెల్లడించారు. ప్రధానంగా బస్సు యాత్రపైనే ఎక్కువగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

కుంతియా
మరోవైపు.. అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు కూడా టి-కాంగ్‌ నేతలకు మింగుడు పడడం లేదని తెలుస్తోంది. జిల్లా కాంగ్రెస్‌ కమిటీల ప్రకటన అంశం కూడా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలను మరింత కలవరానికి గురిచేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 31 జిల్లాలు ఉన్నాయి. కాంగ్రెస్‌ పార్టీ 10 ఉమ్మడి జిల్లాలకు మాత్రమే అధ్యక్షులను ప్రకటించింది. పాత 10 జిల్లాలకే అధ్యక్షులను ప్రకటిస్తే పార్టీ బలోపేతం చేయడం ఎలా సాధ్యం ? అని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. పైగా ఒక్క హైదరాబాద్‌ మినహా మిగతా 9 జిల్లాలకు పాత అధ్యక్షులనే ప్రకటించడంపై కూడా చాలామంది నేతలు అసంతప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. డిసిసిలను పూర్తిగా ప్రక్షాళన చేయాలని, 31 జిల్లాలన్నింటికి డిసిసి కమిటీలు నియమించాలని డిమాండ్‌ చేస్తున్నారు. కేవలం పాత జిల్లాలకే అధ్యక్షులను నియమిస్తే పార్టీలో సమన్వయం దెబ్బతింటుందని జిల్లాల నేతలు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు.
అటు.. తెలంగాణ కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌ను మారుస్తారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరగడంపై ఈ సమావేశంలో కుంతియా అసంతప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కొత్త ఇంఛార్జ్‌గా గులాంనబీ ఆజాద్‌ వస్తున్నారని సోషల్‌ మీడియాలో హడావుడి చేస్తుండడంపై కుంతియా తీవ్ర అసహనం ప్రదర్శించారని తెలుస్తోంది. హైకమాండ్‌ నుంచి అధికారిక ప్రకటన రాకముందే సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఆయన ఆవేశంగా వ్యాఖ్యానించి నట్లు తెలుస్తోంది. ఇది తనను అవమానించడమే అని కుంతియా ఆవేదన చెందారని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఒకవేళ ఇదే ప్రచారం నిజమై ఆజాద్‌ను తెలంగాణ ఇంఛార్జ్‌గా నియమిస్తే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
– సప్తగిరి
http://www.jagritiweekly.com/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87%E0%B0%B7%E0%B0%A3/%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D%E2%80%8C%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%97%E0%B0%82%E0%B0%A6%E0%B0%B0%E0%B0%97%E0%B1%8B%E0%B0%B3%E0%B0%82/

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి