29, నవంబర్ 2018, గురువారం

రాష్ట్రంలో ‘మార్పు కోసం’ – బిజెపి జన చైతన్య యాత్ర



రాష్ట్రంలో ‘మార్పు కోసం’ – బిజెపి జన చైతన్య యాత్ర

రాష్ట్రంలో ‘మార్పు కోసం’ – బిజెపి జన చైతన్య యాత్ర
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కమలదళం వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే క్షేత్రస్థాయిలోకి దూసుకెళ్లింది. 14 రోజుల పాటు తొమ్మిది జిల్లాల పరిధిలోని 26 నియోజకవర్గాలు చుట్టొచ్చింది. జాతీయ నాయకత్వం దిశానిర్దేశంతో, వ్యూహాత్మక కార్యాచరణతో పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎట్టకేలకు సమరశంఖం పూరించింది.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి భాజపా దక్షిణాదిలో పట్టు సాధించింది. దాంతో అక్కడ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఉపయోగించిన ఎన్నికల ప్రచార రథాన్నే తెలంగాణలో నాయకులు జనచైతన్య యాత్రకు ఉపయోగిస్తున్నారు. తొలివిడత బస్సుయాత్ర పూర్తి అయింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ నేతృత్వంలో జనచైతన్య యాత్ర సక్సెస్‌ఫుల్‌గా సాగినట్లుగా తెలుస్తోంది.
జూన్‌ 23వ తేదీన మొదలైన ఈ జన చైతన్య యాత్ర ఈ నెల 6వ తేదీ వరకూ కొనసాగింది. హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని దుర్గామాత అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఈ యాత్ర మొదలైంది. అక్కడి నుంచి నేరుగా యాదాద్రి కొండకు చేరుకున్న డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ లక్ష్మీ నర్సింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత సాయంత్రం భువనగిరికి చేరుకొని బహిరంగసభ నిర్వహించారు. ఆ సభలో కేంద్ర, రాష్ట్ర ప్రముఖులు పాల్గొని బస్సుయాత్రకు పచ్చజెండా ఊపారు.
పటిష్ట వ్యూహంతో :
టిఆర్‌ఎస్‌ పాలన వైఫల్యాలు, హామీలను విస్మరించడంపై ధ్వజమెత్తుతూ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ వైఖరిని ఎండగడుతూ, తాము అధికారం లోకి వస్తే ఎలాంటి పరిపాలన అందిస్తామో వివరిస్తూ కమలనాథుల జనచైతన్యయాత్ర ముందుకు సాగింది. ముఖ్యంగా టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలకే పార్టీ నాయకులు ప్రాధాన్యం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం, తన పథకాలుగా ప్రచారం చేస్తోందని మొదటినుంచి విమర్శిస్తోన్న బిజెపి ఈ యాత్ర ద్వారా తమ వాదనను గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మరింత విడమరచి వివరించింది. రాష్ట్రంలో ‘మార్పు కోసం’ అంటూ సాగిన బస్సుయాత్రకు గ్రామీణ ప్రాంతాల్లో మంచి స్పందన వచ్చింది.
అవినీతి పాలన అంతమే లక్ష్యం :
టిఆర్‌ఎస్‌ అవినీతి పాలనను అంతమొం దించేందుకే బిజెపి జనచైతన్య యాత్రను చేపట్టిందని యాత్రలో డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ ఉద్ఘాటించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పనుల్లో అవినీతి కొనసాగు తుందని ఆరోపించారు. దళిత సిఎం మొదలుకొని, ఎన్నికల హామీలు, పరిపాలనా హామీలు తుంగలో తొక్కి తెలంగాణ ప్రజలను మోసం చేసిన సిఎం కెసిఆర్‌్‌ మాటలను ఎవరూ నమ్మే స్థితిలో లేరన్నారు. కుటుంబ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని దుయ్యబట్టారు. కెసిఆర్‌ కేవలం ప్రగతి భవన్‌, ఫాంహౌస్‌కు మాత్రమే పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి ప్రజల సంక్షేమం కోసం పని చేయడం లేదని తన కుటుంబ సంక్షేమం కోసం పని చేస్తున్నారని విమర్శించారు. సిఎం జవాబుదారితనంతో లేకుండా మాటల గారడీతో మభ్య పెడుతున్నారన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకు రావడానికే జనచైతన్య యాత్రను చేపట్టామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి సత్తా చూపిస్తామని, పార్టీ నాయకులు, కార్యకర్తలు శాయశక్తులా కృషి చేసి రాష్ట్రంలో బిజెపి జెండా ఎగురవేయాలని సూచించారు.
రూ.2 లక్షల రుణమాఫీ :
2019 ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం తోపాటు.. బ్యాంకుల్లో తీసుకున్న రుణాల వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందని లక్ష్మణ్‌ చెప్పారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసినా సిఎం అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. బీసీలకు గొర్రెలు, బర్రెలు, చేపలు పంపిణీ చేసి వాటిని మేపుకుని బతకాలని చెబుతూనే ఓసీలు మాత్రం రాజ్యమేలు తున్నారని విమర్శించారు. కొందరు బీసీ నాయకులు కెసిఆర్‌కు భజనలు చేస్తున్నారన్నారు. ఎంబిసి కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి వెయ్యి కోట్లు కేటాయించి నట్టు చెప్పి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయ లేదన్నారు. రజకులను ఎస్‌సి జాబితాలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో 4వేల 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. టిఆర్‌ఎస్‌ పతనానికి బిజెపి జన చైతన్యయాత్ర నాంది పలుకుతుందన్నారు.
బహిరంగ సభలు, రోడ్‌షోలు, సమావేశాలు, భారీ ర్యాలీలతో తెలంగాణ జిల్లాల్లో సాగిన ఈ జన చైతన్య యాత్రతో బిజెపి శ్రేణుల్లో కదనోత్సాహం ఉరకలు వేస్తోంది. ఈ బస్సుయాత్ర వచ్చే ఎన్నికల విజయయాత్ర కావాలనే జోష్‌ కనిపిస్తోంది.
జనచైతన్య కమిటీలు :
జనచైతన్య యాత్ర కోసం బిజెపి ప్రత్యేకంగా 17 కమిటీలను ఏర్పాటు చేసింది. ఇందులో కీలకమైన సలహా కమిటీని నలుగురితో ఏర్పాటు చేసింది. వీరిలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, ఎంపి బండారు దత్తాత్రేయ, బిజెఎల్పీ నేత కిషన్‌రెడ్డి, శాసన మండలిలో పార్టీ నేత రామచంద్రరావులు ఉన్నారు.
యాత్ర ప్రముఖ్‌, సహ ప్రముఖ్‌లుగా మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఆచారి, మనోహర్‌రెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, హెడ్‌ క్వార్టర్స్‌ ఇన్‌ఛార్జిగా చింతా సాంబమూర్తి వ్యవహరించారు. ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యేలు ఇంద్రసేనారెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, యెండల లక్ష్మీనారాయణ సహా 20 మందితో ఆర్గనైజింగ్‌ కమిటీ ఏర్పాటు చేశారు. ఆర్థిక విభాగం, రూట్‌ ఇన్‌ఛార్జి విభాగం, భోజన విభాగం, రాత్రి వసతి, ప్రోటోకాల్‌, మీడియా, ప్రకటనలు, రోడ్‌షోలు, మీటింగ్స్‌ వేదికలు, రథం, రక్షణ విభాగం, మహిళా విభాగం, సాంస్కృతిక జట్టు, వైద్య విభాగం, పబ్లిసిటీ మెటీరియల్‌, యాత్ర వాహన శ్రేణి జట్టు.. ఇలా పలు విభాగాలను ఏర్పాటు చేశారు.
కొనసాగనున్న యాత్ర :
రాష్ట్రంలో మార్పు కోసం అంటూ.. బిజెపి చేపట్టిన జనచైతన్య యాత్రలు ఎన్నికల వరకూ దశల వారీగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. తొలిదశ యాత్ర 14 రోజుల పాటు విజయవంతంగా పూర్తి చేసుకోగా తర్వాత కూడా మరిన్ని నియోజకవర్గాల్లో యాత్రకు రాష్ట్ర నాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
– సప్తగిరి
http://www.jagritiweekly.com/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87%E0%B0%B7%E0%B0%A3/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AA%E0%B1%81-%E0%B0%95%E0%B1%8B%E0%B0%B8%E0%B0%82-%E0%B0%AC/

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి