29, నవంబర్ 2018, గురువారం

టీ కాంగ్రెస్‌కు హోదా బెంగ




టి-కాంగ్రెస్‌కు హోదా బెంగ..

టి-కాంగ్రెస్‌కు హోదా బెంగ..
తెలంగాణ కాంగ్రెస్‌ నేతల్లో భయం మొదలైంది. తాజా పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో అన్న బెంగ పట్టుకుంది. జాతీయ నాయకత్వం ఆలోచనలు, సిడబ్ల్యూసి నిర్ణయం తెలంగాణలో ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్న చర్చ ప్రస్తుతం పార్టీలో జోరుగా సాగుతోంది.
కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో పట్టు సాధించేందుకు కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందుకోసం మాజీలను కూడా తిరిగి పార్టీలోకి చేర్చుకుంటోంది. పార్టీని గాడిలో పెట్టాలంటూ హైకమండ్‌ తెలంగాణకు ఏకంగా ముగ్గురు సీనియర్లను పంపించింది.
అలాగే ఏపిలో పునర్‌వైభవం కోసం కూడా ఆ పార్టీ అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే ఏపికి ప్రత్యేక హోదా కల్పిస్తామని పదేపదే ప్రకటిస్తోంది. తద్వారా ఆంధ్ర ప్రజలకు దగ్గర కావాలని చూస్తోంది. అయితే ఈ క్రమంలోనే 2019లో అధికారంలోకి వస్తే ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకుంది. రాహుల్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన తొలి సిడబ్ల్యూసిలో తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ కాంగ్రెస్‌లో కాక పుట్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామన్న రాహుల్‌ ప్రకటనతో తెలంగాణ నేతలు కలవరపడుతున్నారు.
టిఆర్‌ఎస్‌ వర్గాలు ఈ అంశాన్ని శరవేగంగా నెత్తికెత్తుకున్నాయి. కాంగ్రెస్‌పై తెలంగాణ మంత్రులు, టిఆర్‌ఎస్‌ నేతలు ఎదురుదాడి మొదలెట్టారు. తెలంగాణ ద్రోహులంటూ వారిని విమర్శిస్తున్నారు. ఏపికి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ పరిశ్రమలన్నీ అటువైపు తరలిపోయే ప్రమాదం ఉందని టిఆర్‌ఎస్‌ జోరుగా ప్రచారం చేస్తోంది. తెలంగాణకు అన్యాయం జరగడాన్ని టి కాంగ్రెస్‌ నేతలు సమర్థిస్తారా ? అని కొంతమంది అధికార పార్టీ నేతలు నేరుగా ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న కాంగ్రెస్‌కు ఈ వాదనతో గొంతులో పచ్చి వెలక్కాయ ఇరుక్కున్న మాదిరిగా తయారైంది. టిఆర్‌ఎస్‌ పార్టీ ఇదే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ఎన్నికల అస్త్రంగా మార్చుకోవచ్చని కాంగ్రెస్‌ నేతలు ఆందోళన చెందుతున్నారు.
అసలు ఉనికే కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌లో తిరిగి పాగా వేయడం కోసం హైకమాండ్‌ పెద్దలు చేస్తున్న ప్రకటనలు తెలంగాణలో ప్రమాదంగా మార నున్నాయని టి కాంగ్‌ నేతలు భయపడుతున్నారు. అయితే హైకమాండ్‌ మాత్రం ఈ విషయంలో కఠినంగా ఉండటంతో రాజకీయ పోరాటానికే సిద్ధమవుతున్నారు. టిఆర్‌ఎస్‌పై ఎదురుదాడి చేయాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ ఇచ్చింది.. తెచ్చింది కాంగ్రెస్సే అన్న అంశాన్ని మరింత ఉధృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు.
ఇక ఇప్పటికే రూపొందించిన షెడ్యూల్‌ ప్రకారం ఆగష్టులో రాహుల్‌ గాంధీ తెలంగాణలో నిర్వహించే బస్సు యాత్రలో పాల్గొననున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో రాహుల్‌ పర్యటిస్తారని రాష్ట్ర నేతలకు సమాచారం అందింది. ఈ జిల్లాల్లో ఏదో ఒకచోట జరగబోయే బహిరంగ సభలో కూడా ఆయన పాల్గొంటారని చెబుతున్నారు.
అవిశ్వాసంపై చిక్కని దొరకని టిఆర్‌ఎస్‌
కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై టిఆర్‌ఎస్‌ తనదైన వ్యూహాన్ని అనుసరించింది. చర్చలో పాల్గొని తెలంగాణ సమస్యల గురించి ప్రస్తావించి, విభజన చట్టంలో హామీల గురించి నిలదీసి సమయానికి టిడిపికి హ్యాండిచ్చి గోడమీద పిల్లి సామెతను గుర్తు చేసింది.
అవిశ్వాసంపై సభలో పార్టీ సభ్యులు అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ అధినేత, సిఎం కెసిఆర్‌ తనదైన శైలిలో మార్గనిర్దేశం చేశారు. కెసిఆర్‌ ఆలోచనలను ప్రతిబింబించేలా టిఆర్‌ఎస్‌ ఎంపిలు లోక్‌సభలో వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. ఎన్డీఏకి వ్యతిరేకంగా టిడిపి అవిశ్వాసం ప్రవేశ పెడితే ఆ పార్టీ సభ్యుల ప్రసంగాలకు టిఆర్‌ఎస్‌ నేతలు అడ్డుతగిలారు.
ఏపికి రావాల్సిన నిధులు, నెరవేర్చాల్సిన హామీలు, ప్రత్యేక హోదాపై టిడిపి ఎంపిలు మాట్లాడితే టిఆర్‌ఎస్‌ పక్కా వ్యూహంతో వాళ్లకే కౌంటర్‌ ఇచ్చింది. ఏపికి అన్యాయం జరిగిందంటూ టిడిపి సభ్యులు లేవనెత్తిన అంశాలపై తెలంగాణకు కూడా కేంద్రం మొండిచేయి చూపిందంటూ వీళ్లు మరో దారి పట్టారు.
అవిశ్వాసంపై చర్చను ఫాలో అయిన వాళ్లంతా టిఆర్‌ఎస్‌ వైఖరిని అర్థం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. టిఆర్‌ఎస్‌ బిజెపిని సమర్థిస్తుందా ? లేదంటే అవిశ్వాసానికి అనుకూలంగా వ్యవహరిస్తోందా ? టిడిపిని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తుందా ? అన్న సందిగ్ధం నెలకొంది. చర్చలో పాల్గొంటూనే ఓటింగ్‌ సమయంలో మాత్రం టిఆర్‌ఎస్‌ తటస్థంగా వ్యవహరించింది.
– సప్తగిరి, 98850 86126
http://www.jagritiweekly.com/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87%E0%B0%B7%E0%B0%A3/%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D%E2%80%8C%E0%B0%95%E0%B1%81-%E0%B0%B9%E0%B1%8B%E0%B0%A6%E0%B0%BE-%E0%B0%AC%E0%B1%86%E0%B0%82/

కాంగ్రెస్‌లో కుమ్ములాటలు – బిజెపి స్పెషల్‌ ఫోకస్‌


కాంగ్రెస్‌లో కుమ్ములాటలు – బిజెపి స్పెషల్‌ ఫోకస్‌

కాంగ్రెస్‌లో కుమ్ములాటలు – బిజెపి స్పెషల్‌ ఫోకస్‌
తెలంగాణ కాంగ్రెస్‌లో సమైక్యతా లోపం కొనసాగుతూనే ఉంది. పోయిన అధికారాన్ని తిరిగి దక్కించుకునే క్రమంలో ఇప్పటికైనా నేతలంతా సర్దుకుపోయే పరిస్థితులు కనిపించడం లేదు. వీటికి అధిష్టానం, స్థానిక నాయకుల వ్యవహారం ప్రధాన కారణమన్న వాదనలు సొంతపార్టీలోనే వినిపిస్తున్నాయి.
ఒకేరోజు.. మూడు ప్రాంతాలు..
ఈ నెల 16న హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో జరిగిన సమావేశాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. అధిష్టానం ముందే కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు గ్రూపులుగా విడిపోయాయి. నాయకులు, కార్యకర్తలు ఒకరినొకరు కొట్టుకున్నారు. కుర్చీలు విసిరేసుకున్నారు. నాయకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో అధిష్టానం ప్రతినిధులు విస్తుపోవాల్సి వచ్చింది. ఈ పరిణామంతో కాంగ్రెస్‌పార్టీ వర్గ సంస్కతి మరోసారి బయటపడిందన్న వాదనలు వినిపించాయి.
సికింద్రాబాద్‌లో..
సికింద్రాబాద్‌ నుండి పోటీ చేస్తానన్న అజహరుద్దీన్‌ ప్రకటనపై గాంధీభవన్‌లో జరిగిన హైదరాబాద్‌ నగర కార్యకర్తల సమావేశంలో అంజన్‌ కుమార్‌ యాదవ్‌ భగ్గుమన్నారు. ఆయనకు దమ్ముంటే హైదరాబాద్‌ నుండి పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. సమావేశంలో ఎఐసిసి కార్యదర్శి బోసు రాజు, టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పిసిసి మాజీ చీఫ్‌ వి.హనుమంతరావు, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీమంత్రి మర్రి శశిధర్‌రెడ్డి తదితర ముఖ్యనాయకులు పాల్గొన్నారు. అంజన్‌కుమార్‌ ప్రసంగాన్ని ప్రారంభిస్తుండగానే, ఆయన అనుచరులు సికింద్రాబాద్‌ సీట్‌ అంజన్‌దే అంటూ నినాదాలు చేశారు. దీంతో.. విహెచ్‌ అసహనం వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. సర్వే కూడా అంజన్‌కుమార్‌కు మద్దతు పలికారు.
నిజామాబాద్‌లో..
నిజామాబాద్‌లోనూ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ విస్తతస్థాయి సమావేశం రసాభాసగా మారింది. ఎఐసిసి కార్యదర్శి శ్రీనివాస కష్ణన్‌ ముందే పార్టీ శ్రేణులు పరస్పరదాడులకు సిద్ధపడ్డారు. ఒక దశలో ఎవరేం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ఒక వైపు జుక్కల్‌ నియోజవర్గానికి చెందిన మాజీ ఎంఎల్‌ఎలు గంగారామ్‌, అరుణతార వర్గాలు; మరోవైపు నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంఎల్‌సి అరికెల నర్సారెడ్డి, స్థానిక మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ నగేశ్‌ రెడ్డి వర్గాలు చేసిన నినాదాలతో సభా ప్రాంగణం హోరెత్తింది. ఈ నాయకుల అనుచరులు పరస్పరం వాగ్వాదానికి దిగారు. నిజామాబాద్‌ అర్బన్‌లో పార్టీ టికెట్‌ ఆశిస్తున్న నేతలంతా వేదికపై క్యూకట్టారు. ఎల్లారెడ్డికి చెందిన మూడు వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేశాయి. బాన్సువాడ నియోజక వర్గంలోను ఇద్దరు నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు పార్టీ సమావేశంలో స్పష్టంగా కనిపించింది. చివరికి భోజనాల వద్ద సైతం కార్యకర్తలు గలాట సష్టించారు.
భువనగిరిలో..
మరోవైపు.. కాంగ్రెస్‌ భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ సమావేశంలోనూ కార్యకర్తలు ఉత్తమ్‌, కోమటిరెడ్డి వర్గంగా విడిపోయి నినాదాలతో హోరెత్తించారు. ఎఐసిసి కార్యదర్శి సలీమ్‌ అహ్మద్‌, పిసిసి మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఉపాధ్యక్షులు డాక్టర్‌ మల్లు రవి, ఎంఎల్‌సి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, మాజీ ఎంఎల్‌ఏలు హాజరయ్యారు. సమావేశ ప్రారంభం లోనే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వర్గీయులు ఒకవైపు, ఉత్తమ్‌ వర్గీయులైన భిక్షమయ్యగౌడ్‌, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అనుచరులు మరోవైపు తమ నేతలకే టిక్కెట్లు ఇవ్వాలని వాగ్వాదానికి దిగారు. నకిరేకల్‌ నియోజకవర్గం మాజీ ఎంఎల్‌ఏ చిరుమర్తి లింగయ్య, ఉత్తమ్‌ వర్గీయుడు ప్రసన్నరాజ్‌ అనుచరులు తమ నేతలకే టిక్కెట్‌ ఇవ్వాలంటూ బాహాబాహీకి దిగారు. ఒకదశలో లింగయ్యను సైతం నెట్టేశారు. మునుగోడు నుండి తమకంటే తమకు అని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పాల్వాయి స్రవంతి వర్గీయులు పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. కార్యకర్తలు అల్లరి చేయవద్దని , తమ సమస్యలు ఏవైనా నిదానంగా చెప్పుకోవాలని ఎఐసిసి కార్యదర్శి సలీం అహ్మద్‌ పలుమార్లు విజ్ఞప్తి చేసినా, కార్యకర్తలు పట్టించుకోకుండా నినాదాలు చేస్తుండడంతో ఆయన సమావేశం నుండి వెళ్లిపోయారు.
అధిష్టానం ఏంచేస్తోంది ?
ఇలా.. ఒకేరోజు మూడు ప్రాంతాల్లో కాంగ్రెస్‌ నాయకుల మధ్య గొడవ, ఘర్షణలు రాష్ట్రమంతటా వైరల్‌ అయ్యాయి. అధికారం కోసం సొంత నేతలపైనే విమర్శలు చేసుకుంటుండడంతో ప్రజల్లోకి ఎలాంటి సిగ్నల్స్‌ వెళతాయో సులభంగా అర్ధం చేసుకోవచ్చని కిందిస్థాయి కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు.
బిజెపి స్పెషల్‌ ఫోకస్‌
ఇక.. ఇటు భారతీయ జనతాపార్టీ తెలంగాణపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. ఇప్పటికే మార్పు కోసం అంటూ బిజెపి చేపట్టిన జన చైతన్య యాత్ర విజయవంతం కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పుంజుకుంది. తొలి విడత యాత్ర సక్సెస్‌ ఫార్ములాతోనే మలివిడత యాత్రకు కూడా బిజెపి సిద్ధమవుతోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈ నెల 13న తెలంగాణలో పర్యటించారు. రెండు రోజల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎన్నికలకు పూర్తిగా సన్నద్ధం కావాలని సూచించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దష్టి సారించాలని, బూత్‌ కమిటీల నియామకంలో జాతీయ పార్టీ రూపొందించిన మార్గదర్శకాలు పాటించాలని సూచించారు. బూత్‌ స్థాయి కమిటీలను ఆగస్టు 15లోగా పూర్తిచేయాలని, అన్ని నియోజకవర్గాలు, గ్రామాల్లో పర్యటించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అమిత్‌షా చెప్పారు. పోలింగ్‌ బూత్‌లను ఏబీసీడీలుగా విభజించాలని, టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతిపై విస్తత ప్రచారం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
–   సప్తగిరి, 9885086126
http://www.jagritiweekly.com/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87%E0%B0%B7%E0%B0%A3/%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D%E2%80%8C%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%95%E0%B1%81%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B1%81%E0%B0%B2%E0%B0%BE%E0%B0%9F%E0%B0%B2/

హైదరాబాద్‌ పోలీసుల అనూహ్య నిర్ణయాలు



హైదరాబాద్‌ పోలీసుల అనూహ్య నిర్ణయాలు

హైదరాబాద్‌ పోలీసుల అనూహ్య నిర్ణయాలు
గడిచిన వారం హైదరాబాద్‌లో ఒకే రోజు చోటు చేసుకున్న రెండు పరిణామాలు తీవ్ర చర్చను లేవనెత్తాయి. చూడటానికి అవి వేరే అంశాలుగా కనిపించినా రాజకీయంగానూ కలకలం సష్టించాయి. వాటిలో ఒకటి హైదరాబాద్‌ నుంచి కత్తి మహేష్‌ బహిష్కరణ. రెండోది స్వామి పరిపూర్ణానంద ధర్మాగ్రహ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో పాటు స్వామీజీని గహ నిర్బంధంలో ఉంచడం. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిపై కత్తి మహేష్‌ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ స్వామి పరిపూర్ణానంద హైదరాబాద్‌ నుంచి యాదాద్రికి ధర్మాగ్రహ యాత్ర పేరిట పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఆ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. అటు కత్తి మహేష్‌ నగర బహిష్కరణ, ఇటు ధర్మాగ్రహ యాత్రకు అనుమతి నిరాకరణతో హైదరాబాద్‌లో కలకలం చెలరేగింది. అయితే ఈ రెండు పరిణామాలకు సంబంధం ఉండటం ఇక్కడ ప్రస్తావనార్హం.
కత్తి మహేష్‌ నగర బహిష్కరణ
ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై హైదరాబాద్‌ నగర బహిష్కరణ విధించారు. ఆరు నెలల పాటు ఆయన హైదాబాద్‌లో అడుగు పెట్టకూడదంటూ తెలంగాణ పోలీసు శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ‘ది తెలంగాణ ప్రివెన్షన్‌ ఆఫ్‌ యాంటీ సోషల్‌ అండ్‌ హజార్డస్‌ యాక్టివిటీస్‌ యాక్ట్‌ 1980 సెక్షన్‌ – 3’ కింద ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నగర బహిష్కరణే కాదు ఆయన్ను తన స్వస్థలమైన చిత్తూరు జిల్లాలో వదిలేసి వచ్చారు టాస్స్‌ఫోర్స్‌ పోలీసులు.
హైదరాబాద్‌ పోలీసుల నిర్ణయంపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. సాధారణంగా రౌడీషీటర్లపైనో, శాంతి భద్రతలను చేతుల్లోకి తీసుకునే అరాచకులపైనో పోలీసులు నగర బహిష్కరణ వంటి శిక్ష విధిస్తారు. చట్టంలో ఉన్న సెక్షన్లను వాటికోసం ఉపయోగించుకుంటారు. కత్తి మహేష్‌ను హైదరాబాద్‌ నుంచి బహిష్కరిస్తారని ఏ ఒక్కరూ ఊహించలేదు. అయితే అతను ఎంతటి ప్రమాదకరమైన వ్యక్తో పోలీసులే తేల్చేశారు. బయటకు కనిపించే అరాచకులు ఆయుధాలతో చెలరేగిపోతారు. అలజడులు సష్టిస్తారు. కానీ కత్తి మహేష్‌ తన వ్యాఖ్యలు, చేష్టలతో సమాజాన్ని రెచ్చగొడుతున్నాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రత్యేకంగా తెలంగాణ డిజిపి మహేందర్‌ రెడ్డి సీనియర్‌ పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు
ఇటీవల ఓ టీవీ ఛానల్లో జరిగిన చర్చలో శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు కత్తి మహేష్‌. దీంతో ఆయనపై హిందూ సంఘాల నేతలు, మఠాధిపతులు, పీఠాధిపతులు ధ్వజమెత్తారు. చట్ట పరంగా కఠినచర్యలు తీసుకోవాలంటూ స్వామి పరిపూర్ణానందతో పాటు పలువురు పీఠాధిపతులు ఏపి, తెలంగాణ ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. మరోవైపు కత్తి మహేష్‌ వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో పెద్ద యుద్ధమే సాగింది. అనుకూల, వ్యతిరేక వర్గాల పోస్టులు, కౌంటర్లతో పరిస్థితి చేయి దాటే సూచనలు కనిపించాయి. దీన్ని గ్రహించిన పోలీసులు కత్తిపై నగర బహిష్కరణ వేటు వేశారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలోనే కొన్ని నెలలుగా కత్తి మహేష్‌ టీవీ చర్చల్లో సాగించే వాదనలు, చేసే వివాదాస్పద వ్యాఖ్యలను పోలీసులు విశ్లేషించారు. టీవీ చర్చల్లో ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు, దానిపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న రచ్చపై పోలీసులు ప్రత్యేకదష్టి పెట్టారు. కత్తి మహేష్‌ డిస్కషన్లు, చర్చా వేదికల్లో ఆయన చేస్తున్న ప్రసంగాలు, ప్రకటనలు, వ్యాఖ్యలను విశ్లేషించారు. అంతేకాదు ఏకంగా రాముడిపైనే విద్వేష పూరిత వ్యాఖ్యలు చేయడంతో తలెత్తిన పరిణామాలపైనా చర్చించారు. హిందూ సంఘాల నుంచి విమర్శలు వెల్లువెత్తిన తర్వాత కూడా కత్తి మహేష్‌ తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ వ్యాఖ్యలు చేయడాన్ని డిజిపి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. సోషల్‌ మీడియాలో కామెంట్లు, కౌంటర్లపైనా కన్నెర్రజేశారు. ఈ పరిస్థితులకు కారకుడైన కత్తి మహేష్‌పై ఇప్పటికే హైదరాబాద్‌ బంజారాహిల్స్‌తో పాటు పలు పోలీస్‌ స్టేషన్లలో పలువురు కేసులు పెట్టారు. నోటీసులు జారీచేశారు. ఆ తర్వాత కూడా కత్తి రియాక్షన్‌ను పరిశీలించారు.
నిర్ణయం వెనుక కారణాలు
తెలంగాణ ఆవిర్భావం తర్వాత హైదరాబాద్‌ లోనూ, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా సాఫీగా ఉందని డిజిపి మహేందర్‌ రెడ్డి ప్రకటించారు. దేశంలోనే ప్రశాంత నగరాల్లో హైదరాబాద్‌ ముందు వరుసలో నిలిచిందన్నారు. అయితే హిందువుల ఆరాధ్య దైవమైన రాముడిపై కత్తి మహేష్‌ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో అలజడి సష్టించేలా ఉన్నాయని సోషల్‌ మీడియాల పోస్టులు, చర్చల ద్వారా తెలుస్తోందని చెప్పారు. ప్రశాంత నగరమైన హైదరాబాద్‌లో ఈ పరిణామం కల్లోలం సష్టించే అవకాశం కనిపించ డంతో ఆయనపై బహిష్కరణ వేటు వేశామని డిజిపి మహేందర్‌ రెడ్డి స్పష్టం చేశారు. నిషేధం సమయంలో కత్తి మహేష్‌ హైదరాబాద్‌కు వస్తే అరెస్ట్‌ చేస్తామన్నారు. వేరే ఎక్కడి నుంచైనా విద్వేష పూరితంగా సోషల్‌ మీడియాలో పోస్టులు చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. పరిస్థితులను బట్టి అవసరమైతే ఈ నిషేధాన్ని తెలంగాణ అన్ని జిల్లాల్లోనూ అమలు చేస్తామన్నారు. అయితే కత్తి మహేష్‌ను చిత్తూరు జిల్లాలోని స్వగ్రామానికి తరలించడంపై ఏపి పోలీసులు కూడా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఇన్నాళ్లూ సాగించిన విద్వేషపూరిత కార్యకలాపాలు ఇకపై కత్తి మహేష్‌ చిత్తూరు కేంద్రంగా సాగించే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తపరిచినట్లు తెలుస్తోంది. దీనికి బదులు కర్నాటక వంటి పక్క రాష్ట్రాలకు పంపిస్తే ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడినట్లు కూడా చెప్పుకుంటున్నారు.
కొంతకాలం క్రితం వరకు కత్తి మహేష్‌ అంటే ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే బిగ్‌బాస్‌ షోలో సెలెక్ట్‌ అయ్యాడో అప్పటి నుంచి ఆయన కాస్త పాపులర్‌ అయ్యాడు. సబ్జెక్ట్‌తో సంబంధం లేకుండా టీవీ చర్చల్లో పాల్గొనడం.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలతో పబ్లిసిటీ స్టంట్‌ను అనుసరించాడు.
స్వామి పరిపూర్ణానంద గహ నిర్బంధం
ఇక అదేరోజు స్వామి పరిపూర్ణానంద తలపెట్టిన ధర్మాగ్రహ యాత్రకు పోలీసులు చివరి నిమిషంలో అనుమతి నిరాకరించారు. స్వామి పరిపూర్ణానంద బస చేసిన గహానికి పలువురు పోలీసు అధికారులు పెద్ద ఎత్తున చేరుకొని స్వామీజీని గహ నిర్బంధం చేశారు. కత్తి మహేష్‌ ఓ టీవీ ఛానల్‌ చర్చలో శ్రీరాముడిని దూషించడంతో పాటు సీతమ్మ పట్ల అత్యంత హేయంగా మాట్లాడటంపై స్వామి పరిపూర్ణానంద తీవ్రంగా స్పందించారు. సీనీ నటుడు నాగబాబు కూడా కత్తి వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌ నుంచి యాదాద్రికి పాదయాత్రను తలపెట్టారు పరిపూర్ణానంద. అటు కత్తి మహేష్‌కు నగర బహిష్కరణ శిక్ష విధించిన హైదరాబాద్‌ పోలీసులు ఇటు స్వామీజీ పాదయాత్రను కూడా అడ్డుకున్నారు.
స్వామి ససేమిరా..
ఈ వివాదానికి అసలు కారకుడైన కత్తి మహేష్‌కు నగర బహిష్కరణ విధించామని ఈ సమయంలో ధర్మాగ్రహ యాత్ర చేస్తే పరిస్థితులు ఉద్రిక్తంగా మారొచ్చని స్వామీజీకి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు. కానీ తాను తలపెట్టిన యాత్ర ఒక్క కత్తి మహేష్‌ను ఉద్దేశించి కాదని, హిందూమతంపై కుట్రపూరితంగా జరుగుతున్న దాడులను నివారించేలా స్వామివారిని వేడుకునేందుకు ఈ యాత్ర చేపట్టానని స్వామి పరిపూర్ణానంద స్పష్టం చేశారు. కానీ పోలీసులు మాత్రం స్వామీజీని యాత్రకు అనుమతించలేదు. అయితే.. తాను దీక్షలో ఉన్నందున సెక్రటేరియట్‌ పక్కనున్న మింట్‌ కాంపౌండ్‌ వద్ద గల పవర్‌ హనుమాన్‌ దేవాలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకుంటానన్న స్వామి పరిపూర్ణానంద ఆకాంక్షకు పోలీసులు సమ్మతించారు. అయితే.. పోలీసు పహారా మధ్యే స్వామీజీని దేవాలయానికి తీసుకెళ్లి తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. ఓ దశలో తన పాదయాత్రకు అనుమతించకుంటే ఆమరణ దీక్ష చేపడతానని స్వామి పరిపూర్ణానంద హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. అయితే పోలీసులు స్వామీజీని సంయమనం పాటించాలని అభ్యర్థించినట్లు సమాచారం.
అటు పరిపూర్ణానంద స్వామి హౌస్‌ అరెస్టును నిరసిస్తూ విహెచ్‌పి, భజరంగదళ్‌ కార్యకర్తలతో పాటు స్వామీజీ శిష్యులు, అభిమానులు ఆందోళనకు దిగారు. స్వామీజీ ఇంటికి చేరుకుని తమ నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో నిరసనకారుల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు.
కత్తికి ఆ శిక్ష సరిపోదు
వాస్తవానికి కత్తి మహేష్‌ శ్రీరాముడు, సీతాదేవిపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటి నుంచే సోషల్‌ మీడియాలో అతనిపై ముప్పేట దాడి మొదలైంది. అయితే స్వామి పరిపూర్ణానంద పాదయాత్ర ప్రకటన చేయడంతో కత్తిపై వాగ్యుద్ధం ప్రకటించిన వాళ్లల్లో సంతోషం పెల్లుబికింది.
హిందూ మతంపై జరుగుతున్న దాడిని స్వామీజీ నాయకత్వంలో సమర్థవంతంగా ఎదుర్కోవచ్చన్న ధీమాలో పడిపోయారు సోషల్‌ మీడియా ఫాలోవర్లు. కానీ పోలీసుల తాజా చర్యలతో విమర్శలు విని పిస్తున్నాయి. కత్తి మహేష్‌కు తెలంగాణ పోలీసులు విధించిన శిక్ష చిన్నదే అని అతని తీరు, కుల, మతాలను రెచ్చగొట్టేలా ఉండే అతని వ్యాఖ్యలు, విద్వేషాలు రగిలించే మాదిరిగా చేసే ప్రసంగాలకు ఈ శిక్ష సరిపోదన్న వాదనలూ వ్యక్తమవుతున్నాయి.
– సప్తగిరి
http://www.jagritiweekly.com/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87%E0%B0%B7%E0%B0%A3/%E0%B0%B9%E0%B1%88%E0%B0%A6%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AC%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D%E2%80%8C-%E0%B0%AA%E0%B1%8B%E0%B0%B2%E0%B1%80%E0%B0%B8%E0%B1%81%E0%B0%B2-%E0%B0%85%E0%B0%A8%E0%B1%82%E0%B0%B9%E0%B1%8D/

రాష్ట్రంలో ‘మార్పు కోసం’ – బిజెపి జన చైతన్య యాత్ర



రాష్ట్రంలో ‘మార్పు కోసం’ – బిజెపి జన చైతన్య యాత్ర

రాష్ట్రంలో ‘మార్పు కోసం’ – బిజెపి జన చైతన్య యాత్ర
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కమలదళం వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే క్షేత్రస్థాయిలోకి దూసుకెళ్లింది. 14 రోజుల పాటు తొమ్మిది జిల్లాల పరిధిలోని 26 నియోజకవర్గాలు చుట్టొచ్చింది. జాతీయ నాయకత్వం దిశానిర్దేశంతో, వ్యూహాత్మక కార్యాచరణతో పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎట్టకేలకు సమరశంఖం పూరించింది.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి భాజపా దక్షిణాదిలో పట్టు సాధించింది. దాంతో అక్కడ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఉపయోగించిన ఎన్నికల ప్రచార రథాన్నే తెలంగాణలో నాయకులు జనచైతన్య యాత్రకు ఉపయోగిస్తున్నారు. తొలివిడత బస్సుయాత్ర పూర్తి అయింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ నేతృత్వంలో జనచైతన్య యాత్ర సక్సెస్‌ఫుల్‌గా సాగినట్లుగా తెలుస్తోంది.
జూన్‌ 23వ తేదీన మొదలైన ఈ జన చైతన్య యాత్ర ఈ నెల 6వ తేదీ వరకూ కొనసాగింది. హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని దుర్గామాత అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఈ యాత్ర మొదలైంది. అక్కడి నుంచి నేరుగా యాదాద్రి కొండకు చేరుకున్న డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ లక్ష్మీ నర్సింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత సాయంత్రం భువనగిరికి చేరుకొని బహిరంగసభ నిర్వహించారు. ఆ సభలో కేంద్ర, రాష్ట్ర ప్రముఖులు పాల్గొని బస్సుయాత్రకు పచ్చజెండా ఊపారు.
పటిష్ట వ్యూహంతో :
టిఆర్‌ఎస్‌ పాలన వైఫల్యాలు, హామీలను విస్మరించడంపై ధ్వజమెత్తుతూ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ వైఖరిని ఎండగడుతూ, తాము అధికారం లోకి వస్తే ఎలాంటి పరిపాలన అందిస్తామో వివరిస్తూ కమలనాథుల జనచైతన్యయాత్ర ముందుకు సాగింది. ముఖ్యంగా టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలకే పార్టీ నాయకులు ప్రాధాన్యం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం, తన పథకాలుగా ప్రచారం చేస్తోందని మొదటినుంచి విమర్శిస్తోన్న బిజెపి ఈ యాత్ర ద్వారా తమ వాదనను గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మరింత విడమరచి వివరించింది. రాష్ట్రంలో ‘మార్పు కోసం’ అంటూ సాగిన బస్సుయాత్రకు గ్రామీణ ప్రాంతాల్లో మంచి స్పందన వచ్చింది.
అవినీతి పాలన అంతమే లక్ష్యం :
టిఆర్‌ఎస్‌ అవినీతి పాలనను అంతమొం దించేందుకే బిజెపి జనచైతన్య యాత్రను చేపట్టిందని యాత్రలో డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ ఉద్ఘాటించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పనుల్లో అవినీతి కొనసాగు తుందని ఆరోపించారు. దళిత సిఎం మొదలుకొని, ఎన్నికల హామీలు, పరిపాలనా హామీలు తుంగలో తొక్కి తెలంగాణ ప్రజలను మోసం చేసిన సిఎం కెసిఆర్‌్‌ మాటలను ఎవరూ నమ్మే స్థితిలో లేరన్నారు. కుటుంబ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని దుయ్యబట్టారు. కెసిఆర్‌ కేవలం ప్రగతి భవన్‌, ఫాంహౌస్‌కు మాత్రమే పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి ప్రజల సంక్షేమం కోసం పని చేయడం లేదని తన కుటుంబ సంక్షేమం కోసం పని చేస్తున్నారని విమర్శించారు. సిఎం జవాబుదారితనంతో లేకుండా మాటల గారడీతో మభ్య పెడుతున్నారన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకు రావడానికే జనచైతన్య యాత్రను చేపట్టామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి సత్తా చూపిస్తామని, పార్టీ నాయకులు, కార్యకర్తలు శాయశక్తులా కృషి చేసి రాష్ట్రంలో బిజెపి జెండా ఎగురవేయాలని సూచించారు.
రూ.2 లక్షల రుణమాఫీ :
2019 ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం తోపాటు.. బ్యాంకుల్లో తీసుకున్న రుణాల వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందని లక్ష్మణ్‌ చెప్పారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసినా సిఎం అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. బీసీలకు గొర్రెలు, బర్రెలు, చేపలు పంపిణీ చేసి వాటిని మేపుకుని బతకాలని చెబుతూనే ఓసీలు మాత్రం రాజ్యమేలు తున్నారని విమర్శించారు. కొందరు బీసీ నాయకులు కెసిఆర్‌కు భజనలు చేస్తున్నారన్నారు. ఎంబిసి కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి వెయ్యి కోట్లు కేటాయించి నట్టు చెప్పి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయ లేదన్నారు. రజకులను ఎస్‌సి జాబితాలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో 4వేల 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. టిఆర్‌ఎస్‌ పతనానికి బిజెపి జన చైతన్యయాత్ర నాంది పలుకుతుందన్నారు.
బహిరంగ సభలు, రోడ్‌షోలు, సమావేశాలు, భారీ ర్యాలీలతో తెలంగాణ జిల్లాల్లో సాగిన ఈ జన చైతన్య యాత్రతో బిజెపి శ్రేణుల్లో కదనోత్సాహం ఉరకలు వేస్తోంది. ఈ బస్సుయాత్ర వచ్చే ఎన్నికల విజయయాత్ర కావాలనే జోష్‌ కనిపిస్తోంది.
జనచైతన్య కమిటీలు :
జనచైతన్య యాత్ర కోసం బిజెపి ప్రత్యేకంగా 17 కమిటీలను ఏర్పాటు చేసింది. ఇందులో కీలకమైన సలహా కమిటీని నలుగురితో ఏర్పాటు చేసింది. వీరిలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, ఎంపి బండారు దత్తాత్రేయ, బిజెఎల్పీ నేత కిషన్‌రెడ్డి, శాసన మండలిలో పార్టీ నేత రామచంద్రరావులు ఉన్నారు.
యాత్ర ప్రముఖ్‌, సహ ప్రముఖ్‌లుగా మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఆచారి, మనోహర్‌రెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, హెడ్‌ క్వార్టర్స్‌ ఇన్‌ఛార్జిగా చింతా సాంబమూర్తి వ్యవహరించారు. ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యేలు ఇంద్రసేనారెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, యెండల లక్ష్మీనారాయణ సహా 20 మందితో ఆర్గనైజింగ్‌ కమిటీ ఏర్పాటు చేశారు. ఆర్థిక విభాగం, రూట్‌ ఇన్‌ఛార్జి విభాగం, భోజన విభాగం, రాత్రి వసతి, ప్రోటోకాల్‌, మీడియా, ప్రకటనలు, రోడ్‌షోలు, మీటింగ్స్‌ వేదికలు, రథం, రక్షణ విభాగం, మహిళా విభాగం, సాంస్కృతిక జట్టు, వైద్య విభాగం, పబ్లిసిటీ మెటీరియల్‌, యాత్ర వాహన శ్రేణి జట్టు.. ఇలా పలు విభాగాలను ఏర్పాటు చేశారు.
కొనసాగనున్న యాత్ర :
రాష్ట్రంలో మార్పు కోసం అంటూ.. బిజెపి చేపట్టిన జనచైతన్య యాత్రలు ఎన్నికల వరకూ దశల వారీగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. తొలిదశ యాత్ర 14 రోజుల పాటు విజయవంతంగా పూర్తి చేసుకోగా తర్వాత కూడా మరిన్ని నియోజకవర్గాల్లో యాత్రకు రాష్ట్ర నాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
– సప్తగిరి
http://www.jagritiweekly.com/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87%E0%B0%B7%E0%B0%A3/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AA%E0%B1%81-%E0%B0%95%E0%B1%8B%E0%B0%B8%E0%B0%82-%E0%B0%AC/

తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి


తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి
రాజకీయ పార్టీల హడావిడి

ముందస్తుకు సై అంటే  సై :
-----------------------------
ముందస్తు ఎన్నికలకు సై అంటున్నారు కేసీఆర్‌. కేంద్రంలో ముందస్తు ఎన్నికలు ఖాయమన్న ప్రచారం ఊపందుకోవడంతో కేసీఆర్‌ కూడా కదన రంగంలో కాలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమా అంటూ కాంగ్రెస్‌ నేతలకు సవాల్‌ విసిరారు. ముఖ్యమంత్రి సవాలుకు కాంగ్రెస్‌ కూడా దీటుగానే స్పందించింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కేసీఆర్‌ సవాల్‌కు సై అన్నారు. తాము ఎప్పుడైనా ఎన్నికలకు సిద్ధమే అని ప్రకటించారు. దీంతో.. తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.

మొదట కేసీఆర్‌ సభలో ఆవేశంలో అలా వ్యాఖ్యానించాడేమో అనుకున్నారు. కానీ.. పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్యులు తనను కలిసినప్పుడు ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని సూచనలు చేశారు. అంతేకాదు.. ముందస్తు ఎన్నికలతో పార్టీకి గానీ.. ప్రస్తుత ప్రజా ప్రతినిధులకు గానీ.. ఏమాత్రం భయం అవసరం లేదని భరోసా ఇచ్చారు. దీంతో.. ఇది సీరియసే అని అందరికీ అర్థమైపోయింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. వందకు పైగా సీట్లు టీఆర్‌ఎస్‌వే అని కేసీఆర్‌తో పాటు.. కేటీఆర్‌, మంత్రులు పలు సందర్భాల్లో ప్రకటనలు చేస్తున్నారు.

అంతేకాదు.. కేసీఆర్‌ ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా ప్లాన్లు సిద్ధం చేసుకున్నారు. గద్వాలలో భారీ బహిరంగ సభతో ఎన్నికల ఊపును తెచ్చేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్‌ తాము బలంగా ఉన్నామని భావించే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆ పార్టీ కీలక నేత డీకే అరుణ నియోజకవర్గమైన గద్వాలలోనే టీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభతో వేడి మరింత పెరిగింది.

కాంగ్రెస్‌పార్టీలో ప్రక్షాళన షురూ :
--------------------------------
అటు.. కాంగ్రెస్‌ పార్టీలోనూ ప్రక్షాళన షురూ అయ్యింది. పార్టీని చక్కదిద్దేందుకు ఏకంగా అధిష్ఠానమే రంగంలోకి దిగింది. ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులను రాష్ట్రానికి పంపించింది. కేసీఆర్‌ ముందస్తు సవాల్‌ నేపథ్యంలో ఆగమేఘాలపై తెలంగాణలో దృష్టిపెట్టింది. ప్రధానంగా హస్తం పార్టీలో నేతల మధ్య విభేదాలు, సమన్వయ లోపమే ప్రధాన సమస్య. వీటిపై దృష్టి సారించిన హైకమాండ్.. పార్టీని గాడిలో పెట్టేందుకు సిద్ధమైంది. ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాసన్ కృష్ణన్, సలీమ్ అహ్మద్‌లను తెలంగాణకు ఇంచార్జ్‌లుగా నియమించింది. ఈ ముగ్గురికి పార్టీని చక్కబెట్టే బాధ్యతలను అప్పగించారు. ఒక్కొక్కరు నలభై నియోజక వర్గాల బాధ్యతలను చూడనున్నారు.

బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీకి సంబంధించిన అన్ని కమిటీలను నియమించడంలో ఇంచార్జి కార్యదర్శులదే కీలకపాత్ర. ఆయా నియోజకవర్గాల స్థాయిలో నాయకుల మధ్య విభేదాలు, సమన్వయలోపాల్ని పరిష్కరించడం.. అసంతృప్తులను బుజ్జగించడం, పార్టీలో చేరికలు ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపడతారు. వీళ్లు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే అభ్యర్థులకు టికెట్ల కేటాయింపు ఆధారపడి ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏ జిల్లాలో చూసినా ఒకే  వర్గం ఆధిపత్యం కొనసాగుతుందని కాంగ్రెస్‌పార్టీలో ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మొదట జిల్లాల్లో ఉన్న వర్గ విభేదాలకు పరిష్కారం జరిగితేనే పార్టీ బలోపేతం అవుతుందని కొత్తగా వచ్చిన ఇంచార్జ్‌లకు నేతలు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. మరోవైపు.. పార్టీని క్షేత్ర స్థాయి నుండి బలోపేతం చేస్తామని కొత్తగా వచ్చిన కార్యదర్శులు పార్టీ నేతలకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గంలో గెలిచే అభ్యర్ధులకే టికెట్స్ ఇస్తామని, అభ్యర్థుల రికమండేషన్స్ కు ఎలాంటి ప్రాధాన్యతను ఇవ్వమని భరోసా ఇచ్చినట్లు సమాచారం.

బీజేపీలో ప్రజా చైతన్య యాత్ర జోష్‌ :
----------------------------------
అటు.. కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తోన్న బీజేపీ కూడా తెలంగాణలో పాగా వేసేందుకు వ్యూహాలకు పదును పెడుతోంది. బిజెపి ప్రజా క్షేత్రం లోకి వెళ్లి తమ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది. ఈనెల 23వ తేదీన బీజేపీ ప్రజా చైతన్య యాత్ర పేరిట బస్సుయాత్ర మొదలైంది. పలు నియోజకవర్గాలన్నీ చుడుతూ బస్సుయాత్ర పరుగులు పెడుతోంది. కర్నాటక ఎన్నికల్లో ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, ఉపయోగించిన బస్సులోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ యాత్రను చేపడుతున్నారు. ఆయనతో పాటు పలువురు నేతలు కూడా బస్సుయాత్రలో పాల్గొంటున్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల‌ను ప్రజ‌ల‌కు వివ‌రిస్తూనే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌పై ప్రజ‌ల్లో అవ‌గాహన క‌లిగే విధంగా యాత్ర చేస్తున్నట్లు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ల‌క్ష్మణ్ చెబుతున్నారు. ఈ యాత్ర జూలై 6వ తేదీ వరకు 14 రోజుల పాటు కొనసాగనుంది. ప్రతిరోజూ రెండు నియోజకవర్గాలు కవర్‌ అయ్యేలా బీజేపీ బస్సుయాత్రను షెడ్యూల్‌ చేశారు. క్షేత్ర స్థాయిలో పార్టీ ని బలోపేతం చెయ్యటానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు. క్షేత్ర పార్టీని పటిష్టం చేయడంతో పాటు.. అధికార టీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ఎండగడుతూ బస్సుయాత్ర సాగుతోంది. బహిరంగ స‌భ‌లు, రోడ్ షోలు, స‌మావేశాలతో సాగుతున్న ఈ యాత్రతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ బస్ యాత్ర  వచ్చే ఎన్నికల విజయ యాత్ర కావాలనే జోష్ కనిపిస్తోంది.

- సప్తగిరి.జి
98850 86126

రాహుల్‌ సీక్రెట్‌ సర్వే తెలంగాణలో స్పెషల్ యాక్షన్ ప్లాన్



రాహుల్‌ సీక్రెట్‌ సర్వే తెలంగాణలో స్పెషల్ యాక్షన్ ప్లాన్

రాహుల్‌ సీక్రెట్‌ సర్వే తెలంగాణలో స్పెషల్ యాక్షన్ ప్లాన్
ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా, గత ఎన్నికల్లో ఊహించని రీతిలో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్‌ పార్టీ 2019లో మాత్రం స్పెషల్‌ యాక్షన్‌ ప్లాన్‌తో బరిలోకి దిగాలని యోచిస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ పెద్దలు టిపిసిసి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. రాహుల్‌ గాంధీ నేతత్వంలోని సర్వే టీమ్‌ రిపోర్ట్‌తో నేతల కదలికలపై, పార్టీ పరిస్థితిపై ఓ అంచనాకు వచ్చారని సమాచారం. టిపిసిసిలో బిసి నేతలకు పెద్దపీట వేసి గులాబి పార్టీకి చెక్‌ పెట్టేందుకు సిద్ధమవుతోందని ఢిల్లీ నుంచి లీకులు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీలో ఎన్నికలకు రథ సారధ్యం వహించేది ఎవరన్న దానిపైనా పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. కులాల వారీగా ఓట్లను విభజిస్తూ, టిఆర్‌ఎస్‌ ముందుకు సాగుతుండటంతో కాంగ్రెస్‌ ఢిల్లీ పెద్దలు సైతం బిసి కార్డుతో ముందుకు సాగేందుకు రెడీ అయ్యారు. వర్గపోరుతో గాంధీ భవన్‌, హైదరాబాద్‌కే పరిమితమవుతున్న నేతలను నియోజకవర్గ బాట పట్టేలా ప్లానింగ్‌ చేస్తున్నారు. పదికి పైగా సిఎం అభ్యర్థులమంటూ చెప్పుకునే కాంగ్రెస్‌లో నేతలను సమన్వయం చేస్తూ ముందుకు సాగేలా రాహుల్‌ టీమ్‌ కసరత్తు చేస్తోందని సమాచారం. యువరక్తం పేరిట ముందుకు సాగితే తెలంగాణలో సీనియర్‌ నేతల అలకలతో అసలుకే ఎసరు వస్తుందన్న భయంతో.. బిసి కార్డును తెరపైకి తెచ్చే యోచనలో ఉన్నారని చెబుతున్నారు. అలాగే.. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రచార కమిటీలో యువకులకు భాగస్వామ్యం కల్పించేలా పలువురి పేర్లు పరిశీలించి నట్లు తెలుస్తోంది.
119 నియోజకవర్గాల్లో 50 మంది అభ్యర్థుల లిస్టును ఉత్తమ్‌ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అభ్యర్థులను ఎన్నికలకు ఆరునెలల ముందుగానే ప్రకటిస్తే ఫలితాలు మెరుగవుతాయన్న ప్రతిపాదనను ఎఐసిసి ముందుంచినట్లు చెబుతున్నారు. మరోవైపు టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌పై సీనియర్లు గుర్రుగా ఉన్నట్లు పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి కోమటిరెడ్డి అయితే బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. మరికొందరు నేతలు ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. అటు రేవంత్‌రెడ్డి ప్రచార కమిటీ కన్వీనర్‌గా బాధ్యతలు తీసుకునేందుకు ఉత్సాహంగా ఉన్నా, ఉత్తమ్‌ చెక్‌ పెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మాజీ మంత్రులను ప్రచార కమిటీలోకి తీసుకొని జిల్లాల బాధ్యతలు అప్పగించాలని రాహుల్‌ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తమ్‌ కెప్టెన్సీలో ఎన్నికలకు వెళ్తే సీనియర్లు సహకరిస్తారా లేదా అన్న అంశంపై రాహుల్‌గాంధీ టీమ్‌ ఆరా తీసిందని, ఆ రిపోర్ట్‌ రాహుల్‌కు చేరడంతో తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారని సమాచారం. అయితే ఎన్నికల ఆర్థిక అవసరాలను సీనియర్‌ నేతలు ఎంతవరకు భరిస్తారన్న దానిపైనా నేతల నుంచి ఢిల్లీ దూతలు ఆరా తీశారన్న ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తానికి ఎన్నికల రథ సారథ్యం చివరకు జానాకు దక్కనుందని చెప్పుకుంటున్నారు. జానా వర్గంలో రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్‌ కీలకంగా మారనున్నారన్న ప్రచారం జరుగుతోంది.
మరోవైపు.. కెసిఆర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఆసక్తికర విధానంతో ముందుకెళుతోంది. ప్రజల్లో పెద్ద ఇమేజ్‌ను బిల్డప్‌ చేసుకున్న కెసిఆర్‌ను ఢీకొట్టేందుకు కీలక అంశాలను ఎంచుకుంది. అందుకు కెసిఆర్‌ నోటి మాటలనే ఆయుధాలుగా ఎంచుకుంది. గత ఎన్నికల సమయంలో కెసిఆర్‌ ఇచ్చిన హామీల్లో ఏవి నెరవేరలేదు, వేటిని అస్సలు పట్టించుకోనేలేదనే అంశాలను తీసుకుని వాటినే ఆయుధాలుగా చేసుకుంటున్నది. ఈ క్రమంలోనే ఎస్‌.సి., ఎస్‌.టి.ల విషయంలో కెసిఆర్‌ సీఎం కాకముందు అన్న ఒక మాటను పట్టుకుంది.
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ఎస్‌.సి.ని సిఎం చేస్తానని మొదట్లో చెప్పిన కెసిఆర్‌ మాట తప్పారంటూ దాడి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కెసిఆర్‌పై సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకురాలు, మాజీ లోక్‌సభ స్పీకర్‌ అయిన మీరా కుమార్‌ ఎస్‌.సి., ఎస్‌.టి. వ్యతిరేకి అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆమె ఎస్‌.సి., ఎస్‌.టి. నాయకురాలు కూడా కావడంతో అవి ఎస్‌.సి., ఎస్‌.టి. వర్గానికి నేరుగా తగులుతా యని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఎస్‌.సి., ఎస్‌.టి. వ్యక్తిని సిఎంగా చేస్తానని చెప్పిన కెసిఆర్‌ మాట తప్పి తానే ఎందుకు సిఎం అయ్యారని మీరా కుమార్‌ ప్రశ్నించారు.
దీనికి టిఆర్‌ఎస్‌ నుంచి సమాధానం లేదు. సమాధానం చెప్పడం కూడా కొద్దిగా కష్టమే. ఇక కాంగ్రెస్‌ కెసిఆర్‌పై ప్రయోగిస్తున్న రెండో ఆయుధం మైనార్టీలు. దీనికి కూడా మూలాన్ని ఎన్నికల హామీల నుంచే తీసుకున్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తానని చెప్పిన కెసిఆర్‌ ఎందుకు మాట నిలబెట్టుకోలేదని ప్రశ్నిస్తున్నారు. ఇది ముస్లింలను మోసం చేయడమేనని అంటున్నారు. దీంతో పాటు మరో అంశాన్ని కూడా కాంగ్రెస్‌ చెబుతోంది. బిజెపితో టిఆర్‌ఎస్‌ లోపాయికారీ ఒప్పందాన్ని చేసుకుందని, అలాంటి టిఆర్‌ఎస్‌తో ఎంఐఎం పొత్తు కొనసాగిస్తున్నదని విమర్శించారు.
ఇలా ఈ రెండు ప్రధానాంశాలతో కెసిఆర్‌పై కాంగ్రెస్‌ దాడి చేస్తోంది. అయితే కాంగ్రెస్‌ ఎక్కువగా ఆధారపడుతోంది మాత్రం తాను రైతులకిచ్చిన రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామనే హామీ పైనే. అంతపెద్ద మొత్తంలో రైతుకు రుణమాఫీ రాష్ట్రవ్యాప్తంగా ఎలా సాధ్యం చేస్తారని, వాస్తవంగా సాధ్యమవ్వదని టిఆర్‌ఎస్‌ అంటోంది. ఈ హామీ తమకు ఓట్లు రాబడుతుందని భావిస్తున్న కాంగ్రెస్‌ రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని, వారికి రుణ పరిమితి పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నది.
ఈ విధంగా ఎస్‌.సి., ఎస్‌.టి.లు, ముస్లింలు, రైతులే లక్ష్యంగా కాంగ్రెస్‌ ముందుకెళుతోంది. ఈ వ్యూహాలు వచ్చే ఎన్నికల్లో టి-కాంగ్రెస్‌కు ఎంతవరకు ఉపయోగపడతాయో చూడాలి.
– సప్తగిరి, 9885086126
http://www.jagritiweekly.com/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87%E0%B0%B7%E0%B0%A3/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B9%E0%B1%81%E0%B0%B2%E0%B1%8D%E2%80%8C-%E0%B0%B8%E0%B1%80%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D%E2%80%8C-%E0%B0%B8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B1%87/

టీ కాంగ్రెస్‌లో గందరగోళం



టి-కాంగ్రెస్‌లో గందరగోళం

టి-కాంగ్రెస్‌లో గందరగోళం
‘ఎవరికి వారే యమునా తీరే’ అన్న చందంగా మారిన తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో ఎవరి వాదనలు వారే వినిపిస్తున్నారు. అధిష్టానానికి ఎవరు ఇచ్చే నివేదికలు వాళ్లు ఇచ్చేస్తున్నారు. దీంతో పార్టీలో గందరగోళం నెలకొంటోంది. ఏకంగా పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్‌ కూడా అసహనం వ్యక్తం చేసే పరిస్థితి రావడం ఇప్పుడు ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
మూడు విడతల బస్సుయాత్ర తర్వాత ఇటీవల జరిగిన ఆ పార్టీ కీలక సమావేశంలో టిపిసిసి కార్యవర్గంతో పాటు, అన్ని జిల్లాల డిసిసి అధ్యక్షులు పాల్గొన్నారు. సమావేశానికి పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్‌ కుంతియా కూడా హాజరయ్యారు. అయితే ఆయన సమక్షంలోనే టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన ప్రసంగం కొంతమంది సీనియర్లు, ఇతర నాయకులకు మింగుడు పడలేదని చెబుతున్నారు. పార్టీ ప్రయోజనాల దష్ట్యా నాయకులంతా సర్దుకుపోవాల్సిందేనని ఉత్తమ్‌ చెప్పడం సీనియర్లకు ఆగ్రహం తెప్పించిందంటున్నారు.
బస్సుయాత్ర వంటి పెద్ద కార్యక్రమం చేపట్టి నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయని, వాటిని పట్టించుకోవద్దని నాయకులకు ఈ సమావేశంలో ఉత్తమ్‌ సూచించారు. బస్సుయాత్ర సహా పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. మూడు విడతల్లో బస్సుయాత్ర జరిగిన తీరు, పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధత, టిఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రైతుబంధు పథకం అమలు తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. బస్సుయాత్రలో భాగంగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కటే సభ నిర్వహించడం సరికాదని, ఒక్కరిపైనే ఆర్థిక భారం పడుతోందని ఓ నాయకుడు సమావేశం దష్టికి తీసుకొచ్చారు. ఇక బస్సుయాత్రలో పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించటాన్ని మరోనేత తప్పుపట్టగా, కష్టపడుతున్న వారిని ప్రోత్సహిస్తే తప్పేమిటని మరికొందరు అభిప్రాయపడ్డారు.
అయితే టికెట్ల కేటాయింపు అంశం పూర్తిగా అధిష్టానమే చూసు కుంటుందని కుంతియా సర్దిచెప్పారు. బస్సుయాత్ర ద్వారా టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తేగలిగామని వ్యాఖ్యానించినట్లు సమాచారం. నాలుగో విడత బస్సు యాత్రకు ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రానున్నట్లు వెల్లడించారు. ప్రధానంగా బస్సు యాత్రపైనే ఎక్కువగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

కుంతియా
మరోవైపు.. అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు కూడా టి-కాంగ్‌ నేతలకు మింగుడు పడడం లేదని తెలుస్తోంది. జిల్లా కాంగ్రెస్‌ కమిటీల ప్రకటన అంశం కూడా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలను మరింత కలవరానికి గురిచేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 31 జిల్లాలు ఉన్నాయి. కాంగ్రెస్‌ పార్టీ 10 ఉమ్మడి జిల్లాలకు మాత్రమే అధ్యక్షులను ప్రకటించింది. పాత 10 జిల్లాలకే అధ్యక్షులను ప్రకటిస్తే పార్టీ బలోపేతం చేయడం ఎలా సాధ్యం ? అని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. పైగా ఒక్క హైదరాబాద్‌ మినహా మిగతా 9 జిల్లాలకు పాత అధ్యక్షులనే ప్రకటించడంపై కూడా చాలామంది నేతలు అసంతప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. డిసిసిలను పూర్తిగా ప్రక్షాళన చేయాలని, 31 జిల్లాలన్నింటికి డిసిసి కమిటీలు నియమించాలని డిమాండ్‌ చేస్తున్నారు. కేవలం పాత జిల్లాలకే అధ్యక్షులను నియమిస్తే పార్టీలో సమన్వయం దెబ్బతింటుందని జిల్లాల నేతలు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు.
అటు.. తెలంగాణ కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌ను మారుస్తారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరగడంపై ఈ సమావేశంలో కుంతియా అసంతప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కొత్త ఇంఛార్జ్‌గా గులాంనబీ ఆజాద్‌ వస్తున్నారని సోషల్‌ మీడియాలో హడావుడి చేస్తుండడంపై కుంతియా తీవ్ర అసహనం ప్రదర్శించారని తెలుస్తోంది. హైకమాండ్‌ నుంచి అధికారిక ప్రకటన రాకముందే సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఆయన ఆవేశంగా వ్యాఖ్యానించి నట్లు తెలుస్తోంది. ఇది తనను అవమానించడమే అని కుంతియా ఆవేదన చెందారని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఒకవేళ ఇదే ప్రచారం నిజమై ఆజాద్‌ను తెలంగాణ ఇంఛార్జ్‌గా నియమిస్తే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
– సప్తగిరి
http://www.jagritiweekly.com/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87%E0%B0%B7%E0%B0%A3/%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D%E2%80%8C%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%97%E0%B0%82%E0%B0%A6%E0%B0%B0%E0%B0%97%E0%B1%8B%E0%B0%B3%E0%B0%82/