29, నవంబర్ 2018, గురువారం

టీ కాంగ్రెస్‌కు హోదా బెంగ




టి-కాంగ్రెస్‌కు హోదా బెంగ..

టి-కాంగ్రెస్‌కు హోదా బెంగ..
తెలంగాణ కాంగ్రెస్‌ నేతల్లో భయం మొదలైంది. తాజా పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో అన్న బెంగ పట్టుకుంది. జాతీయ నాయకత్వం ఆలోచనలు, సిడబ్ల్యూసి నిర్ణయం తెలంగాణలో ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్న చర్చ ప్రస్తుతం పార్టీలో జోరుగా సాగుతోంది.
కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో పట్టు సాధించేందుకు కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందుకోసం మాజీలను కూడా తిరిగి పార్టీలోకి చేర్చుకుంటోంది. పార్టీని గాడిలో పెట్టాలంటూ హైకమండ్‌ తెలంగాణకు ఏకంగా ముగ్గురు సీనియర్లను పంపించింది.
అలాగే ఏపిలో పునర్‌వైభవం కోసం కూడా ఆ పార్టీ అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే ఏపికి ప్రత్యేక హోదా కల్పిస్తామని పదేపదే ప్రకటిస్తోంది. తద్వారా ఆంధ్ర ప్రజలకు దగ్గర కావాలని చూస్తోంది. అయితే ఈ క్రమంలోనే 2019లో అధికారంలోకి వస్తే ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకుంది. రాహుల్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన తొలి సిడబ్ల్యూసిలో తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ కాంగ్రెస్‌లో కాక పుట్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామన్న రాహుల్‌ ప్రకటనతో తెలంగాణ నేతలు కలవరపడుతున్నారు.
టిఆర్‌ఎస్‌ వర్గాలు ఈ అంశాన్ని శరవేగంగా నెత్తికెత్తుకున్నాయి. కాంగ్రెస్‌పై తెలంగాణ మంత్రులు, టిఆర్‌ఎస్‌ నేతలు ఎదురుదాడి మొదలెట్టారు. తెలంగాణ ద్రోహులంటూ వారిని విమర్శిస్తున్నారు. ఏపికి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ పరిశ్రమలన్నీ అటువైపు తరలిపోయే ప్రమాదం ఉందని టిఆర్‌ఎస్‌ జోరుగా ప్రచారం చేస్తోంది. తెలంగాణకు అన్యాయం జరగడాన్ని టి కాంగ్రెస్‌ నేతలు సమర్థిస్తారా ? అని కొంతమంది అధికార పార్టీ నేతలు నేరుగా ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న కాంగ్రెస్‌కు ఈ వాదనతో గొంతులో పచ్చి వెలక్కాయ ఇరుక్కున్న మాదిరిగా తయారైంది. టిఆర్‌ఎస్‌ పార్టీ ఇదే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ఎన్నికల అస్త్రంగా మార్చుకోవచ్చని కాంగ్రెస్‌ నేతలు ఆందోళన చెందుతున్నారు.
అసలు ఉనికే కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌లో తిరిగి పాగా వేయడం కోసం హైకమాండ్‌ పెద్దలు చేస్తున్న ప్రకటనలు తెలంగాణలో ప్రమాదంగా మార నున్నాయని టి కాంగ్‌ నేతలు భయపడుతున్నారు. అయితే హైకమాండ్‌ మాత్రం ఈ విషయంలో కఠినంగా ఉండటంతో రాజకీయ పోరాటానికే సిద్ధమవుతున్నారు. టిఆర్‌ఎస్‌పై ఎదురుదాడి చేయాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ ఇచ్చింది.. తెచ్చింది కాంగ్రెస్సే అన్న అంశాన్ని మరింత ఉధృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు.
ఇక ఇప్పటికే రూపొందించిన షెడ్యూల్‌ ప్రకారం ఆగష్టులో రాహుల్‌ గాంధీ తెలంగాణలో నిర్వహించే బస్సు యాత్రలో పాల్గొననున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో రాహుల్‌ పర్యటిస్తారని రాష్ట్ర నేతలకు సమాచారం అందింది. ఈ జిల్లాల్లో ఏదో ఒకచోట జరగబోయే బహిరంగ సభలో కూడా ఆయన పాల్గొంటారని చెబుతున్నారు.
అవిశ్వాసంపై చిక్కని దొరకని టిఆర్‌ఎస్‌
కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై టిఆర్‌ఎస్‌ తనదైన వ్యూహాన్ని అనుసరించింది. చర్చలో పాల్గొని తెలంగాణ సమస్యల గురించి ప్రస్తావించి, విభజన చట్టంలో హామీల గురించి నిలదీసి సమయానికి టిడిపికి హ్యాండిచ్చి గోడమీద పిల్లి సామెతను గుర్తు చేసింది.
అవిశ్వాసంపై సభలో పార్టీ సభ్యులు అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ అధినేత, సిఎం కెసిఆర్‌ తనదైన శైలిలో మార్గనిర్దేశం చేశారు. కెసిఆర్‌ ఆలోచనలను ప్రతిబింబించేలా టిఆర్‌ఎస్‌ ఎంపిలు లోక్‌సభలో వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. ఎన్డీఏకి వ్యతిరేకంగా టిడిపి అవిశ్వాసం ప్రవేశ పెడితే ఆ పార్టీ సభ్యుల ప్రసంగాలకు టిఆర్‌ఎస్‌ నేతలు అడ్డుతగిలారు.
ఏపికి రావాల్సిన నిధులు, నెరవేర్చాల్సిన హామీలు, ప్రత్యేక హోదాపై టిడిపి ఎంపిలు మాట్లాడితే టిఆర్‌ఎస్‌ పక్కా వ్యూహంతో వాళ్లకే కౌంటర్‌ ఇచ్చింది. ఏపికి అన్యాయం జరిగిందంటూ టిడిపి సభ్యులు లేవనెత్తిన అంశాలపై తెలంగాణకు కూడా కేంద్రం మొండిచేయి చూపిందంటూ వీళ్లు మరో దారి పట్టారు.
అవిశ్వాసంపై చర్చను ఫాలో అయిన వాళ్లంతా టిఆర్‌ఎస్‌ వైఖరిని అర్థం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. టిఆర్‌ఎస్‌ బిజెపిని సమర్థిస్తుందా ? లేదంటే అవిశ్వాసానికి అనుకూలంగా వ్యవహరిస్తోందా ? టిడిపిని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తుందా ? అన్న సందిగ్ధం నెలకొంది. చర్చలో పాల్గొంటూనే ఓటింగ్‌ సమయంలో మాత్రం టిఆర్‌ఎస్‌ తటస్థంగా వ్యవహరించింది.
– సప్తగిరి, 98850 86126
http://www.jagritiweekly.com/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87%E0%B0%B7%E0%B0%A3/%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D%E2%80%8C%E0%B0%95%E0%B1%81-%E0%B0%B9%E0%B1%8B%E0%B0%A6%E0%B0%BE-%E0%B0%AC%E0%B1%86%E0%B0%82/

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి