29, నవంబర్ 2018, గురువారం

కాంగ్రెస్‌లో కుమ్ములాటలు – బిజెపి స్పెషల్‌ ఫోకస్‌


కాంగ్రెస్‌లో కుమ్ములాటలు – బిజెపి స్పెషల్‌ ఫోకస్‌

కాంగ్రెస్‌లో కుమ్ములాటలు – బిజెపి స్పెషల్‌ ఫోకస్‌
తెలంగాణ కాంగ్రెస్‌లో సమైక్యతా లోపం కొనసాగుతూనే ఉంది. పోయిన అధికారాన్ని తిరిగి దక్కించుకునే క్రమంలో ఇప్పటికైనా నేతలంతా సర్దుకుపోయే పరిస్థితులు కనిపించడం లేదు. వీటికి అధిష్టానం, స్థానిక నాయకుల వ్యవహారం ప్రధాన కారణమన్న వాదనలు సొంతపార్టీలోనే వినిపిస్తున్నాయి.
ఒకేరోజు.. మూడు ప్రాంతాలు..
ఈ నెల 16న హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో జరిగిన సమావేశాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. అధిష్టానం ముందే కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు గ్రూపులుగా విడిపోయాయి. నాయకులు, కార్యకర్తలు ఒకరినొకరు కొట్టుకున్నారు. కుర్చీలు విసిరేసుకున్నారు. నాయకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో అధిష్టానం ప్రతినిధులు విస్తుపోవాల్సి వచ్చింది. ఈ పరిణామంతో కాంగ్రెస్‌పార్టీ వర్గ సంస్కతి మరోసారి బయటపడిందన్న వాదనలు వినిపించాయి.
సికింద్రాబాద్‌లో..
సికింద్రాబాద్‌ నుండి పోటీ చేస్తానన్న అజహరుద్దీన్‌ ప్రకటనపై గాంధీభవన్‌లో జరిగిన హైదరాబాద్‌ నగర కార్యకర్తల సమావేశంలో అంజన్‌ కుమార్‌ యాదవ్‌ భగ్గుమన్నారు. ఆయనకు దమ్ముంటే హైదరాబాద్‌ నుండి పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. సమావేశంలో ఎఐసిసి కార్యదర్శి బోసు రాజు, టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పిసిసి మాజీ చీఫ్‌ వి.హనుమంతరావు, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీమంత్రి మర్రి శశిధర్‌రెడ్డి తదితర ముఖ్యనాయకులు పాల్గొన్నారు. అంజన్‌కుమార్‌ ప్రసంగాన్ని ప్రారంభిస్తుండగానే, ఆయన అనుచరులు సికింద్రాబాద్‌ సీట్‌ అంజన్‌దే అంటూ నినాదాలు చేశారు. దీంతో.. విహెచ్‌ అసహనం వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. సర్వే కూడా అంజన్‌కుమార్‌కు మద్దతు పలికారు.
నిజామాబాద్‌లో..
నిజామాబాద్‌లోనూ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ విస్తతస్థాయి సమావేశం రసాభాసగా మారింది. ఎఐసిసి కార్యదర్శి శ్రీనివాస కష్ణన్‌ ముందే పార్టీ శ్రేణులు పరస్పరదాడులకు సిద్ధపడ్డారు. ఒక దశలో ఎవరేం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ఒక వైపు జుక్కల్‌ నియోజవర్గానికి చెందిన మాజీ ఎంఎల్‌ఎలు గంగారామ్‌, అరుణతార వర్గాలు; మరోవైపు నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంఎల్‌సి అరికెల నర్సారెడ్డి, స్థానిక మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ నగేశ్‌ రెడ్డి వర్గాలు చేసిన నినాదాలతో సభా ప్రాంగణం హోరెత్తింది. ఈ నాయకుల అనుచరులు పరస్పరం వాగ్వాదానికి దిగారు. నిజామాబాద్‌ అర్బన్‌లో పార్టీ టికెట్‌ ఆశిస్తున్న నేతలంతా వేదికపై క్యూకట్టారు. ఎల్లారెడ్డికి చెందిన మూడు వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేశాయి. బాన్సువాడ నియోజక వర్గంలోను ఇద్దరు నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు పార్టీ సమావేశంలో స్పష్టంగా కనిపించింది. చివరికి భోజనాల వద్ద సైతం కార్యకర్తలు గలాట సష్టించారు.
భువనగిరిలో..
మరోవైపు.. కాంగ్రెస్‌ భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ సమావేశంలోనూ కార్యకర్తలు ఉత్తమ్‌, కోమటిరెడ్డి వర్గంగా విడిపోయి నినాదాలతో హోరెత్తించారు. ఎఐసిసి కార్యదర్శి సలీమ్‌ అహ్మద్‌, పిసిసి మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఉపాధ్యక్షులు డాక్టర్‌ మల్లు రవి, ఎంఎల్‌సి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, మాజీ ఎంఎల్‌ఏలు హాజరయ్యారు. సమావేశ ప్రారంభం లోనే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వర్గీయులు ఒకవైపు, ఉత్తమ్‌ వర్గీయులైన భిక్షమయ్యగౌడ్‌, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అనుచరులు మరోవైపు తమ నేతలకే టిక్కెట్లు ఇవ్వాలని వాగ్వాదానికి దిగారు. నకిరేకల్‌ నియోజకవర్గం మాజీ ఎంఎల్‌ఏ చిరుమర్తి లింగయ్య, ఉత్తమ్‌ వర్గీయుడు ప్రసన్నరాజ్‌ అనుచరులు తమ నేతలకే టిక్కెట్‌ ఇవ్వాలంటూ బాహాబాహీకి దిగారు. ఒకదశలో లింగయ్యను సైతం నెట్టేశారు. మునుగోడు నుండి తమకంటే తమకు అని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పాల్వాయి స్రవంతి వర్గీయులు పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. కార్యకర్తలు అల్లరి చేయవద్దని , తమ సమస్యలు ఏవైనా నిదానంగా చెప్పుకోవాలని ఎఐసిసి కార్యదర్శి సలీం అహ్మద్‌ పలుమార్లు విజ్ఞప్తి చేసినా, కార్యకర్తలు పట్టించుకోకుండా నినాదాలు చేస్తుండడంతో ఆయన సమావేశం నుండి వెళ్లిపోయారు.
అధిష్టానం ఏంచేస్తోంది ?
ఇలా.. ఒకేరోజు మూడు ప్రాంతాల్లో కాంగ్రెస్‌ నాయకుల మధ్య గొడవ, ఘర్షణలు రాష్ట్రమంతటా వైరల్‌ అయ్యాయి. అధికారం కోసం సొంత నేతలపైనే విమర్శలు చేసుకుంటుండడంతో ప్రజల్లోకి ఎలాంటి సిగ్నల్స్‌ వెళతాయో సులభంగా అర్ధం చేసుకోవచ్చని కిందిస్థాయి కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు.
బిజెపి స్పెషల్‌ ఫోకస్‌
ఇక.. ఇటు భారతీయ జనతాపార్టీ తెలంగాణపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. ఇప్పటికే మార్పు కోసం అంటూ బిజెపి చేపట్టిన జన చైతన్య యాత్ర విజయవంతం కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పుంజుకుంది. తొలి విడత యాత్ర సక్సెస్‌ ఫార్ములాతోనే మలివిడత యాత్రకు కూడా బిజెపి సిద్ధమవుతోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈ నెల 13న తెలంగాణలో పర్యటించారు. రెండు రోజల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎన్నికలకు పూర్తిగా సన్నద్ధం కావాలని సూచించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దష్టి సారించాలని, బూత్‌ కమిటీల నియామకంలో జాతీయ పార్టీ రూపొందించిన మార్గదర్శకాలు పాటించాలని సూచించారు. బూత్‌ స్థాయి కమిటీలను ఆగస్టు 15లోగా పూర్తిచేయాలని, అన్ని నియోజకవర్గాలు, గ్రామాల్లో పర్యటించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అమిత్‌షా చెప్పారు. పోలింగ్‌ బూత్‌లను ఏబీసీడీలుగా విభజించాలని, టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతిపై విస్తత ప్రచారం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
–   సప్తగిరి, 9885086126
http://www.jagritiweekly.com/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87%E0%B0%B7%E0%B0%A3/%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D%E2%80%8C%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%95%E0%B1%81%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B1%81%E0%B0%B2%E0%B0%BE%E0%B0%9F%E0%B0%B2/

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి