29, నవంబర్ 2018, గురువారం

అమిత్‌ షా ఆల్‌రౌండ్‌ ఎటాక్‌


అమిత్‌ షా ఆల్‌రౌండ్‌ ఎటాక్‌

అమిత్‌ షా ఆల్‌రౌండ్‌ ఎటాక్‌
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా పర్యటనతో తెలంగాణలో పొలిటికల్‌ సీన్‌ ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటివరకు అమిత్‌ షా రెండు దఫాలుగానే పర్యటించినా ఎన్నికల వేడిని రగిల్చేలా ప్రసంగాలు సాగించారు. బీజేపీ సైలెంట్‌ గానే ఉన్నా సందర్భం వస్తే ఎలా దూసుకుపోతుందో జన సమీకరణే తేల్చేసింది. తన వ్యాఖ్యలు, విమర్శల తీరుతో అమిత్‌ షా తనదైన శైలిలో రాష్ట్ట్ర నేతలకు అస్త్ర శస్త్రాలను అందించారు. కరీంనగర్‌ సభలో అమిత్‌ ఆల్‌రౌండ్‌ ఎటాక్‌తో అధికార పక్షంతో పాటు, మిగతా విపక్షాలకు సెగ తగిలింది. పనిలో పనిగా మజ్లిస్‌ పైనా మాటల తూటాలు పేల్చిన షా రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టత ఇచ్చారు.
లేట్‌గా అయినా లేటెస్ట్‌గా
తెలంగాణలో అసెంబ్లీ రద్దు తర్వాత జాతీయ నాయకత్వ వ్యూహం, ఎన్నికల ప్రచార సరళిపై మార్గదర్శనం కోసం వేచి చూసిన బీజేపీ రాష్ట్ర నేతలు కొన్నాళ్లు మౌనంగా పరిస్థితులను అంచనా వేస్తూ వచ్చారు. అంతర్గతంగా పోరుకు సమాయత్త మవుతూనే, సమీక్షలు నిర్వహిస్తూనే, సరళిని విశ్లేషిస్తూనే కేంద్ర కమిటీ ఆదేశాలతో ప్రచార వ్యూహాన్ని కార్యాచరణలో పెట్టారు. అయితే అటు ప్రభుత్వాన్ని రద్దు చేసిందో లేదో ఆ మరుక్షణమే తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల వేడిని రగిల్చే నిర్ణయాలు, ప్రచార సభలు వెంటవెంటనే ప్రకటించే సింది. మరోవైపు కాంగ్రెన్‌ పార్టీ కూడా ఆలస్యం చేస్తే సమయం సరిపోతుందో! లేదో! అన్న ఆలోచనతో ప్రచార రంగంలోకి దూకేసింది. కానీ బీజేపీ మాత్రం ఆచి తూచి పరిస్థితులను అంచనా వేసుకొని, జాతీయ నాయకత్వం సూచనలతో లేటుగానే అయినా లేటెస్టుగా ప్రచార గోదాలోకి దిగింది.
కరీంనగర్‌ సభతో మారిపోయిన పరిస్థితి
ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధాన పోటీ అధికార టీఆర్‌ఎస్‌కు, విపక్ష కాంగ్రెస్‌కు మధ్యే ఉంటుందన్న విశ్లేషణలు సాగాయి. కానీ బీజేపీ నేరుగా జాతీయ అధ్యక్షుడితోనే ఎన్నికల సమర శంఖం పూరించడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మహబూబ్‌నగర్‌ సభతో బీజేపీకి కాస్త ఊపు వచ్చినా కరీంనగర్‌ సభ తర్వాత ఆ ఊపు రెట్టింపయ్యింది. క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి ఉత్సాహం పెరిగింది. దీంతో ఇన్నాళ్లుగా కాంగ్రెస్‌ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌గా ఉన్న పరిస్థితి కాస్తా బీజేపీ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌గా మారిపోయిందని విశ్లేషకులే వ్యాఖ్యానించారు.
ఒక్కదెబ్బకు మూడు పిట్టలు
దీనికి కారణం అమిత్‌ షా ప్రసంగం ఓ జాతీయ నాయకుడి మాదిరిగా కాకుండా తెలంగాణతో ఎంతో అనుబంధం ఉన్న నేతగా సాగింది. పేరుకు తగినట్లే బీజేపీ సమరభేరిని మోగించారు. ప్రధానంగా టీఆర్‌ఎస్‌ మజ్లిస్‌తో అంటకాగడాన్ని ఎత్తిచూపి తెలంగాణ ప్రజలను అటువైపుకు ఆలోచించేలా చేయడంలో ఆయన సఫలమయ్యారు. అసదుద్దీన్‌ ఓవైసీని లక్ష్యంగా చేసుకొని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రజాకార్ల దురాగతాలను తెలంగాణ సమాజం మరచిపోగలదా? అని బీజేపీ అధ్యక్షుడు ప్రశ్నించారు. ఒవైసీకి భయపడే కేసీఆర్‌ సర్కార్‌ తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను పక్కనబెడుతోందని ఆరోపించారు. సమరయోధుల త్యాగాలను అవమానపరుస్తోందని ప్రజలను ఆలోచనలో పడేశారు. ఓవైసీకి వ్యతిరేకంగా పోరాడే దమ్ము టీఆర్‌ఎస్‌కు, కాంగ్రెస్‌కు, టీడీపీకి లేదని దుయ్యబట్టారు. ఎంఐఎంను ఎదిరించే సత్తా ఉన్న పార్టీ ఒక్క బీజేపీనే అని పేర్కొన్నారు. బీజేపీకి పట్టంకట్టి తెలంగాణ రాష్ట్రానికి ఒవైసీ బారి నుంచి విముక్తి కల్పించాలని అన్నారు. ఒక్క దెబ్బకు మూడు పిట్టలన్నట్లు. అటు అధికార టీఆర్‌ఎస్‌.. ఇటు మహాకూటమిగా జట్టుకట్టిన పార్టీలు, మరోవైపు మజ్లిస్‌కు సెగ తగిలేలా అమిత్‌ షా ప్రసంగం సాగిందన్న చర్చ జరుగుతోంది.
కూటమి వస్తే కుర్చీల కొట్లాట !
బీజేపీ, టీఆర్‌ఎస్‌ మినహా మిగతా అన్ని పార్టీలనూ కలుపుకొని జట్టుకట్టిన మహాకూటమి పరిస్థితి దినదినం సందిగ్ధంగానే తయారైంది. మేనిఫెస్టో రూపకల్పన దగ్గర్నుంచి సీట్ల పంపకాలు, అభ్యర్థుల ప్రకటనలు అన్నీ ఎవరూ స్వతంత్రంగా వెంట వెంటనే నిర్ణయం తీసుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కూటమికి గనుగ అధికారం వస్తే అందులోని నేతల మధ్యే కుర్చీల కొట్లాట సాగుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కూటమిలో జట్టుకట్టిన నేతలు ఎవరికి వారే.. ఎవరి ఎజెండా వారిదే అన్న రీతిలో వేర్వేరు ఆలోచనలతో, వేర్వేరు వ్యూహాలతో ముందుకెళ్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇది కాస్త గందరగోళానికి కారణ మవుతోందని అంటున్నారు. ప్రధానంగా మహా కూటమిలో కాంగ్రెస్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తోంది. తెలుగు దేశం పార్టీకి అంతగా ఆదరణ లేకపోవడం, జన సమతి ఉద్యమ పార్టీయే అయినా.. కొత్తగా ఏర్పడిన పార్టీ కావడంతో పాటు… వనరుల సమీకరణ సమస్యతో కాంగ్రెస్‌ లీడర్‌ షిప్‌ను బలవంతంగా అయినా ఒప్పుకోవాల్సి వస్తోందని ఆ పార్టీ నేతలే అనుకుంటు న్నారు. మిగతా పార్టీలు అంతగా ప్రభావం చూపించే స్థితిలో లేకపోవచ్చని చెబుతున్నారు.
మొత్తానికి తెలంగాణలో ఎన్నికల వేడి ఊపందుకుంది. పోటా పోటీ ప్రచారం కొనసాగు తోంది. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో త్రిముఖ పోటీ తప్పదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు భయం పట్టుకుంది. మహాకూటమికి ప్రధానంగా సీట్ల సర్దుబాటుతో పాటు భాగస్వామ్యంగా ఉన్న పార్టీల అంతర్గత వ్యూహాలు, విభేదాలు, అభిప్రాయ భేదాలు మైనస్‌ అంటున్నారు విశ్లేషకులు. ఇక మొదటి నుంచీ చెబుతున్నట్లు ఒంటరిగానే అన్ని స్థానాల్లో పోటీకి సై అంటున్న బీజేపీ ఎలా దూసుకుపోతుందో చూడాలి.
– సప్తగిరి.జి, 9885086126
http://www.jagritiweekly.com/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87%E0%B0%B7%E0%B0%A3/amit-shah-3/

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి