29, నవంబర్ 2018, గురువారం

తెలంగాణాలో పోలింగ్‌ హీట్‌


తెలంగాణాలో పోలింగ్‌ హీట్‌

తెలంగాణాలో పోలింగ్‌ హీట్‌
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్‌ విడుద లయ్యింది. దీంతో అనుమానాలు, సందేహాలకు తెర పడింది. నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణకూ ఎన్నికలు నిర్వహిస్తారని కొందరు వాటికంటే ముందే తెలంగాణలో పోల్‌ బెల్‌ మోగుతుందని మరికొందరు సార్వత్రిక ఎన్నికలతో పాటే తెలంగాణలోనూ పోలింగ్‌ జరుగుతుందని ఇంకొందరు ఇలా ఎవరికి వారే వాదనలు ప్రచారం చేశారు. సామాన్య జనం నుంచి మొదలుకొని రాజకీయ పార్టీల నేతలు కూడా తమకు తోచిన రీతిలో అంచనాలు వేసుకున్నారు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం అన్ని సందేహాలకూ తెరదించింది.
డిసెంబర్‌ 7న పోలింగ్‌
ఎన్నికల కమిషన్‌ చెప్పిన వివరాల ప్రకారం.. రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరాంలతో పాటే తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 119 నియోజక వర్గాల్లోనూ ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహించ నున్నారు. నామినేషన్లు దాఖలు చేయడానికి తుది గడువును నవంబర్‌ 19గా నిర్ణయించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు నవంబర్‌ 22. అదే నెల 28వ తేదీన నామినేషన్లు పరిశీలించి పోటీ చేయబోయే అభ్యర్థుల తుది జాబితా సిద్ధం చేస్తారు. డిసెంబర్‌ 7వ తేదీన ఒకే విడతలో తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్‌ 11వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.
కూసిన కోడ్‌
అసెంబ్లీ రద్దయిన రాష్ట్రాలకు ఆర్నెల్ల లోపు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు పేర్కొన్నదని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రావత్‌ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన సమయంలో చెప్పారు. సెప్టెంబర్‌ 6న తెలంగాణ అసెంబ్లీ రద్దు కావడంతో ఎన్నికల కోడ్‌ అమలులో ఉందని తెలిపారు. డిసెంబర్‌ 15నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రచార ఖర్చు 28 లక్షల రూపాయలకు మించకూడదని ఈసీ పేర్కొంది.
న్యాయస్థానం ఆక్షేపణ
తెలంగాణలో ఓటర్ల జాబితాకు సంబంధించి హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అంతేకాదు ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా అసెంబ్లీని రద్దుచేసే అధికారం ఎవరిచ్చా రంటూ కాంగ్రెస్‌ సభ్యులు హైకోర్టులో సవాల్‌ చేశారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాధాకష్ణన్‌ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని ఆక్షేపించారు. ఐదేళ్లు ఎమ్మెల్యేలుగా కొనసాగాల్సిన ప్రతిపక్ష సభ్యులు, స్వతంత్య్ర సభ్యులపైనా సర్కారు రద్దు నిర్ణయం ప్రభావం చూపిస్తోందని వ్యాఖ్యానించారు. వారి అభిప్రాయం కోరకుండా, వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గడువు తీరకముందే వారి సభ్యత్వాలతో ముడిపడిన శాసనసభను ఏకపక్షంగా రద్దు చేయడం సరైన విధానం అవుతుందా? అని ప్రశ్నించారు.
కేసీఆర్‌ గొంతులో పచ్చి వెలక్కాయ
తెలంగాణలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిం దంటేనే ప్రభుత్వం ఎటువంటి ప్రకటనలు కానీ, పథకాలు కానీ, కానుకలు కానీ ప్రకటించకూడదు. ముందస్తు ఊపులో రెండు ప్రధాన పథకాలు తనకు ఓట్లను కురిపిస్తాయనుకున్న కేసీఆర్‌కు ఈ నిబంధనలు గొంతులో పచ్చివెలక్కాయ పడ్డ చందంగా మారాయి. గతేడాది నుంచి దసరాకు కేసీఆర్‌ సర్కార్‌ మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోంది. కానీ ఈసారి చీరల పంపిణీకి బ్రేక్‌ పడింది. ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో చీరల పంపిణీకి ఈసీ బ్రేక్‌ వేసింది. మొదట రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి బతుకమ్మ చీరల పంపిణీపై అభ్యంతరం లేదని ప్రకటించినా కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయంలో ఝలక్‌ ఇచ్చింది. మరో కీలక పథకమైన రైతుబంధుకు మాత్రం ఐదు షరతులతో ఈసీ ఓకే చెప్పింది. ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని, రైతులకు చెక్కులు పంపిణీ చేయకుండా బ్యాంకు అకౌంట్లలో రైతుబంధు మొత్తాన్ని జమ చేయాలని సూచించింది. అయితే ఈ పరిణామాలను కూడా టీఆర్‌ఎస్‌ తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటోంది. కాంగ్రెస్‌ నేతల కారణంగానే బతుకమ్మ చీరలు పంచలేక పోతున్నామని విమర్శల దాడి చేస్తోంది.
తీర్మానాల పరంపర
మరోవైపు తెలంగాణలో ఎన్నికలు సమీపించిన వేళ వివిధ గ్రామాల్లో, ప్రార్థనా స్థలాల్లో ‘ఓటు ప్రతిజ్ఞ’లు సర్వసాధారణంగా మారాయి. ప్రధానంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఓట్లు వేస్తామంటూ పలు గ్రామాల ప్రజలు ప్రతిజ్ఞలు చేయడంతో పాటు ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. కులసంఘాలు కూడా ఫలానా నాయకుడికే ఓటు అంటూ తీర్మానాలు చేశాయి. అయితే ఇలాంటి తీర్మానాలు కోడ్‌ ఉల్లంఘన కిందికే వస్తాయన్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వీటిపై ఫిర్యాదులు వస్తే కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఇలాంటి చర్యలు నైతికంగా సరి కాదని, అయితే సాంకేతికంగా, చట్టపరంగా ఇలాంటి తీర్మానాలను తప్పు అని నిరూపించలేమని విశ్లేషకులు అంటున్నారు.
ఎవరి వాదన వారిదే
మొత్తానికి మరో నెలా పదిహేను రోజుల్లో తెలంగాణ ఓటరు తన తీర్పేంటో స్పష్టం చేయనున్నాడు. ఈ సమయం అన్ని పార్టీలకు ఎంతో కీలకం కానుంది. ఈసీ ప్రకటనతో తెలంగాణలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీల్లో సందడి మొదలైంది. అయితే, ముందస్తును ముప్పుగా భావిస్తున్న కొన్ని పార్టీలకు ఈ ప్రకటన కాస్త ఇబ్బందికరంగా పరిణమించింది. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసుకుని ముందస్తుకు సిద్ధమైన అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మహాకూటమి ప్రచార సునామీలో కొట్టుకుపోతుందని విపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి. బీజేపీ హవా ముందు అధికార టీఆర్‌ఎస్‌ మాత్రమే కాదు, కూటమిగా జట్టుకట్టిన పార్టీలన్నీ తుడిచిపెట్టుకుపోతాయని భారతీయ జనతాపార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
– సప్తగిరి.జి, 9885086126
http://www.jagritiweekly.com/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87%E0%B0%B7%E0%B0%A3/ts-2/

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి