29, నవంబర్ 2018, గురువారం

హైదరాబాద్‌లో ఉగ్రవేట



హైదరాబాద్ లో ఉగ్రవేట - ఎన్ఐఏ సో దాలతో ఐఎస్ మూలాలు

- సప్తగిరి.జి

హైదరాబాద్ లో ఉగ్రవేట కొనసాగుతోంది. పాత బస్తీలో ఐఎస్ మూలాలు బయటపడుతూనే ఉన్నాయి. దేశంలో ఎక్కడ ఎలాంటి ఉగ్ర కుట్ర జరిగినా.. భాగ్యనగరంతో సంబంధం బట్టబయలవుతోంది. అంటే.. హైదరాబాద్ పాతబస్తీలో ఇంకా స్లీపర్ సెల్స్, ఉగ్రవాద సానుభూతి పరులు ఉన్నారన్న విషయం మరోసారి తేటతెల్లమైంది.

మరోసారి కుట్ర భగ్నం :
భారత్ ను టార్గెట్ చేసి విధ్వంసం సృష్టించాలనుకున్న ఐఎస్ కుట్రలను జాతీయ దర్యాప్తు సంస్థ - ఎన్ఐఏ మరోసారి భగ్నం చేసింది. హైదరాబాద్ లో ముష్కరుల సానుభూతి పరులను అరెస్ట్ చేసింది. హైదరాబాద్ ఎన్ ఐఏ అధికారులకు తోడు.. గుజరాత్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు కూడా ఒక్కసారిగా హైదరాబాద్ పాతబస్తీలో సోదాలు జరపడం తీవ్రకలకలం సృష్టించింది.  మరోసారి విధ్వంసక వాతావరణాన్ని హైదరాబాద్ వాసులకు గుర్తుచేసింది. ఏ పుట్టలో ఏ పాముందో అన్న చందంగా పాతబస్తీలోని ఏ ప్రాంతంలో ఏ ఉగ్రవాద సానుభూతి పరుడు ఉన్నాడో అన్న ఊహే జడుసుకునేలా చేసింది. అయితే.. ఎన్ఐఏ హైదరాబాద్ తో పాటు.. గుజరాత్ లోనూ ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది.

ఉగ్ర కదలికలపై దృష్టి :
  ప్రపంచాన్ని ఇస్లాం రాజ్యంగా మారుస్తామన్న ప్రధాన ఆశయంతో ఆవిర్భవించిన ఐసిస్..  ఆ తర్వాత ఇస్లామిక్ స్టేట్ - ఐఎస్ గా పేరు మార్చుకుంది. అప్పటినుంచి తమ మూకలో రిక్రూట్ మెంట్లను ఉధృతంగా సాగిస్తోంది. ప్రధానంగా భారత్ ను టార్గెట్ చేసిన ఐఎస్.. ఇక్కడి యువతను ప్రధానంగా ముస్లిం యువతను చేర్చుకోవడంపై దృష్టిపెట్టింది.  అందులో భాగంగానే.. పలుసార్లు ఐఎస్ స్థావరాలు, రిక్రూట్ మెంట్ సెంటర్లు, మధ్యవర్తులు ఎన్ఐఏకు పట్టుబడ్డారు.  ఈక్రమంలోనే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సమీపిస్తున్న వేళ.. దేశంలో ఉగ్రవాదుల కదలికలపై ఎన్ఐఏ దృష్టిసారించింది.

హైదరాబాద్ లో ఇద్దరు అరెస్ట్ :
ఇప్పటికే బోధగయ పేలుళ్లకు కుట్ర పన్నిన పలువురు ఉగ్రవాదులను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. బోధగయలో దాడులకు స్కెచ్ వేసిన ఉగ్రవాదులను పట్టుకుంటూనే హైదరాబాద్ వైపు దృష్టి  సారించారు ఎన్ఐఏ అధికారులు. పంద్రాగస్టు వేడుకలకు తొమ్మిదిరోజుల ముందు ఆగస్టు 6వ తేదీన హైదరాబాద్లోని షహీన్ నగర్, చాంద్రాయణగుట్ట, హఫీజ్ బాబానగర్ తదితర ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు . ఈ సోదాల్లో ఉగ్రవాద సంస్థల ప్రతినిధులుతో పలువురు యువకులు సంభాషణలు జరుపుతున్నట్టు ఆధారాలు సేకరించారు. దీంతో.. హైదరాబాద్ లో మరోసారి ఐఎస్ మూలాలు బయటపడ్డాయి. ఐఎస్ లో చేరేందుకు పలువురు యువకులు మొగ్గుచూపుతున్నట్టు గుర్తించిన ఎన్ఐఏ అధికారులు పక్కా ఆధారాలతో ఇద్దరిని అరెస్టు చేశారు.  వారం రోజులపాటు 20 మంది యువకులను ప్రశ్నించిన ఎన్ఐఏ అధికారులు.. హైదరాబాద్ హఫీజ్ బాబా నగర్ కు చెందిన అబ్దుల్ బాసిత్, చాంద్రాయణగుట్టకు చెందిన అబ్దుల్ ఖాదర్ అనే ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు.

2016 జనవరిలో ఐఎస్ ఉగ్రవాదుల షేక్ ఇస్లాం, మహమ్మద్ ఫర్హాన్, అధ్నన్ హసన్ లను ఎన్. ఐ. ఏ అరెస్ట్ చేసింది. ముస్లిం యువకులను టార్గెట్ గా చేసుకుని వారిని ఐసిస్ వైపు ఆకర్షితులను చేసి రిక్రూట్ చేస్తున్నారని వీరిపై అభియోగాలు మోపింది. జులై 2016 లో వీరిపై చార్జిషీట్ దాఖలు చేయడంతో షేక్ ఇస్లాం, మొహమ్మద్ ఫర్హాన్ లకు ఏడేళ్లపాటు జైలు శిక్ష పడింది. మరో ఉగ్రవాది అద్నాన్ హాసన్ ట్రయల్ ఇంకా కొనసాగుతోంది. ఈ విచారణ జరుగుతున్న క్రమంలోనే అధ్నాన్ హాసన్ తో టచ్ లో ఉన్న హైదరాబాద్ యువకుడు అబ్దుల్ బాసిత్ .. హాసన్  అనుచరులతో  నిరంతరం సంభాషణలు జరుపుతున్నట్టు ఎన్ఐఏ దృష్టికి వచ్చింది. రంగంలోకి దిగిన ఎన్ఐఏ అబ్దుల్ బాసిత్ పై దృష్టి సారించింది.

                 మొదట అబ్దుల్ బాసిత్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులకు.. చాంద్రాయణ గుట్టకు చెందిన అబ్దుల్ ఖాదర్ తోపాటు మరికొంతమంది యువకులు ఐఎస్ ఆపరేషన్లకు పనిచేస్తున్నట్టు ఆధారాలు లభించాయి. దీంతో హైదరాబాద్ ఎన్ ఐఏ కార్యాలయంలో  20 మంది యువకులను అధికారులు ప్రశ్నించారు. ఈ  విచారణలో అబ్దుల్ భాసిత్ తోపాటు అబ్దుల్ ఖాదర్ లు ఐఎస్ కు పనిచేస్తున్నట్టు నిర్ధారణ అయ్యిందని, ఐఎస్ సిద్ధాంతాలను హైదరాబాద్ లో ప్రచారంచేసేందుకు ప్రయత్నిస్తున్నారని  ప్రకటించిన ఎన్ఐఏ.. వీళ్లిద్దరినీ అరెస్ట్ చేసినట్లు ధృవీకరించింది.

ముష్కర మూకల కోడ్ లు డీకోడ్ :
ఇప్పటికే ఐఎస్ కు ఆకర్షితులైన వాళ్లు, ఐఎస్ కోసం పనిచేస్తున్న వాళ్ల వివరాలు, వాళ్ల సంభాషణల కోడ్ లు ఎన్ఐఏ సేకరించింది. ముష్కర మూకల కోడ్ భాషను ఎప్పటికప్పుడు డీ కోడ్ చేస్తూ ముందుకెళ్తోంది. ఇప్పటికే తమ దగ్గరున్న లిస్టులో కనిపించకుండా పోయిన వాళ్ల వివరాలు, వాళ్ల బంధువులు, కుటుంబసభ్యుల వివరాలను ఎప్పటికప్పుడు చెక్ చేస్తోంది. వాళ్లు ఎవరి ద్వారా ఉగ్రవాదానికి ఆకర్షితులయ్యారో, ఎవరెవరితో టచ్ లో ఉన్నారో అన్న అంశాలను కూడా విశ్లేషిస్తోంది. ఫలితంగా ఐఎస్ కార్యకలాపాలను భారత్ లో సమూలంగా నిర్మూలించే దిశగా కార్యాచరణ చేపడుతోంది. ఈ క్రమంలోనే ఎన్ఐఏ పక్కా ఆధారాలతో హైదరాబాద్ పాతబస్తీలో ఎటాక్ చేసింది.

- సప్తగిరి.జి
98850 86126

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి