స్తబ్దుగా గులాబీ.. హుషారులో కమలం..
తెలంగాణలో ముందస్తు ఎన్నికల శంఖారావం మోగిన తర్వాత పరిణామాలు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. జనంలో ముఖ్యంగా ఓటర్లలో పలు సందేహాలకు కారణమవుతున్నాయి. ఎన్నికలు ముంచుకొస్తున్నాయన్నట్లుగా అసెంబ్లీ రద్దునాడే ప్రకటన చేసిన కేసీఆర్ ఆ తర్వాత స్తబ్దుగా ఉండిపోయారు. హుస్నాబాద్ సభ మినహా ప్రగతిభవన్ నుంచి అడుగు కూడా బయటపెట్టడం లేదు. దేశంలోనే అత్యంత పెను విషాదంగా నమోదైన కొండగట్టు ఘాట్‌రోడ్డుపై ప్రమాదంలో 62మంది అమాయకులు బలైనా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ¬దాలో ఉన్న కేసీఆర్ వారిని పరామర్శించలేదు. ఈ ఘోర ప్రమాదం జరిగిన రోజు మతుల కుటుంబాలకు ఐదులక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామన్న ప్రకటన తప్ప ఆ తర్వాత అంతా మర్చిపోయారు.
ఎన్నికల వేళ నాయకులు జనాల్లో తిరగడం అన్నది పరిపాటి. తెల్లవారితే ఓటర్లతో మమేకం కావడమన్నది ఎన్నేళ్లనుంచో వస్తున్న ఓ పరిణామం. ఎన్నికల సమయంలో ఏ అవకాశాన్ని నాయకులు వదులుకునే ప్రసక్తి ఉండదు. ప్రజలకు అండగా ఉంటామన్న ఆనవాళ్లు కనిపించేలా ప్రచారం చేసుకోవడం సర్వ సాధారణం. ఇప్పుడు ఓ వైపు వినాయక నవరాత్రోత్సవాలు కొనసాగుతున్నాయి. వచ్చేనెలలో శరన్నవరాత్రోత్సవాలున్నాయి. ఓవైపు జనం, వివిధ సంఘాలు, కాలనీలు రాజకీయ నాయకులను చందాలు, నవరాత్రోత్సవాల ఏర్పాట్లకోసం సంప్రదిస్తున్నారు. అసలే ఎలక్షన్ సీజన్ కావడంతో తమ స్థాయికి మించి కూడా నాయకులు అందరినీ సంతప్తి పరుస్తున్న పరిస్థితి ఉంది. కానీ.. సీఎం కేసీఆర్ మాత్రం దేన్నీ పట్టించుకోవడం లేదు. కొండగట్టు ఘోర విషాదాన్ని కూడా లెక్క చేయలేదన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు.
లోటు పూడ్చుకునే ప్రయత్నం
మరో విషయం ఏమంటే తెలంగాణ అసెంబ్లీని రద్దుచేసిన తర్వాత 50 రోజుల్లో వంద సభలు నిర్వహిస్తానని చెప్పారు కేసీఆర్. ఆ సభలను హుస్నాబాద్‌తో మొదలు పెడతానని అట్టహాసంగా ప్రకటించుకున్నారు. అసలే ప్రగతి నివేదన సభ అంచనాలు బోల్తా కొట్టడంతో నియోజకవర్గాలు, జిల్లాల వారీ సభలతో ఆ లోటును పూడ్చుకోవాలని భావిస్తున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరిగింది. కానీ హుస్నాబాద్ సభ తర్వాత కేసీఆర్ తిరిగి ప్రగతిభవన్‌కే పరిమితమయ్యారు. కనీసం ఆయన దినచర్య ఏమిటి..? రాజకీయ వ్యూహాలు ఎలా సాగు తున్నాయో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు.
దూరంగా ట్రబుల్ షూటర్
ఈ తాజా పరిణామాలతో సొంత పార్టీలోనే తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రసమితి ఆవిర్భావం నుంచి ప్లానింగ్‌లోగానీ, కార్యకర్తలతో సంబంధాల విషయంలో గానీ ఏ స్థాయి సభలనైనా సక్సెస్ చేయడంలో సిద్ధహస్తుడిగా, ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీష్‌రావు కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌కు మహాబలంగా చెప్పుకుంటారు. అయితే కొన్నాళ్లుగా కేటీఆర్‌కు రాష్ట్ర బాధ్యతలు అప్పగించి కేంద్రంలో చక్రం తిప్పుదామనుకుంటున్న కేసీఆర్ ప్రగతి నివేదన సభతో ఆ కార్యానికి శ్రీకారం చుట్టేందుకు ప్రయత్నించారు. అప్పటిదాకా పార్టీ వ్యవహారాలన్నింటిలోనూ చురుగ్గా ఉన్న హరీష్ రావును పక్కనబెట్టి ప్రగతి నివేదన సభకు కేటీఆర్‌నే సర్వస్వంగా చూపించారు.
అయితే ఊహించిన స్థాయిలో ఆ సభ సక్సెస్ కాకపోవడం పట్ల ఏకంగా కేసీఆర్ కొందరు ముఖ్య నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారన్న వాదనలు బలంగా వినిపించాయి. దీంతో కాస్త వెనక్కి తగ్గిన కేసీఆర్ తిరిగి హరీష్‌రావును ప్రగతిభవన్‌కు పిలిపించి మరీ ప్రజా ఆశీర్వాద సభలను భుజానవేసుకోవాలని బాధ్యతలు అప్పగించినట్లు చెప్పుకున్నారు. ఆ క్రమంలోనే మొదటగా హుస్నాబాద్‌లో నిర్వహించిన ప్రజాశీర్వాదసభ సక్సెస్ అయ్యింది. రాత్రికిరాత్రే రంగంలోకి దిగిన హరీష్‌రావు తనదైన వ్యూహాలతో హుస్నాబాద్‌లో చక్రం తిప్పారు. నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన సభకు రాష్ట్రస్థాయిలో జనం తరలివచ్చారని కేసీఆరే స్వయంగా సభావేదికపై నుంచి సంతోషం వ్యక్తం చేశారు.
99 సభల లోగుట్టు ఏంటి..?
ఆ తర్వాత సోషల్ మీడియాలో టీఆర్‌ఎస్‌పై విమర్శలు, వ్యంగ్యస్త్రాలు ఎక్కువయ్యాయి. సభ సక్సెస్ కావడమంటే ట్వీట్లు పోస్ట్‌చేసినంత సులభం కాదంటూ విపక్షాలే కాదు స్వపక్షంలోని హరీష్ వర్గీయులు కూడా ప్రచారం సాగించారు. హుస్నాబాద్ సభ తర్వాత ఆ ప్రచారం మరింత ఉధతంగా సాగింది. అంతేకాదు కేసీఆర్ ముందుగా చెప్పినట్లు 50 రోజుల్లో వంద సభల పరిస్థితి ఏంటని తెలంగాణ వ్యాప్తంగా ఇటు రాజకీయ వర్గాల్లో, అటు జనంలోనూ చర్చ తీవ్రంగా సాగుతోంది. అంటే హుస్నాబాద్ తరహాలో మిగతా 99 సభలూ సక్సెస్ అయితే కేటీఆర్‌కు ఈమాత్రం ఉన్న ఆదరణ తగ్గిపోతుందని.. తాత్కాలికంగా ఆశీర్వాద సభలకు ఫుల్‌స్టాప్ పెట్టారేమో అన్న చర్చ అంతర్గతంగా సాగుతోంది. ఫలితంగా టీఆర్‌ఎస్‌లో కుమారుడు వర్సెస్ మేనల్లుడు తరహాలో ఆధిపత్యపోరు కొనసాగుతోందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది.
అభ్యర్థుల ఎంపికలోనూ లెక్కలేదు
కేసీఆర్ ప్రకటించిన 105 మంది అభ్యర్థుల్లో హరీష్‌రావు మాటకు, ఆయన వర్గానికి చోటు ఇవ్వలేదని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. హరీష్‌రావు వర్గంగా గుర్తింపు పొందిన వాళ్లను అసలు పరిగణనలోకి తీసుకోలేదని అంటున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీలోనూ ఈ అభ్యర్థుల ఖరారుపై అసంతప్తి నెలకొందన్నది బహిరంగ రహస్యమే. దాదాపు 50 మంది అభ్యర్థులను ద్వితీయశ్రేణి నాయకులు వ్యతిరేకిస్తున్నారని పార్టీ ముఖ్యనేతలే చెప్పుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో బాల్కసుమన్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన టీఆర్‌ఎస్ నేత గట్టయ్య హైదరా బాద్‌లో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో హరీష్‌రావు కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తు న్నారు. లేదంటే ఇలాంటి సంక్షోభాలు, అసంతప్తులు తలెత్తినప్పుడు స్వయంగా రంగంలోకి దిగి హరీష్ రావు పరిస్థితిని చక్కదిద్దేవారు. ఇప్పుడు ఆ బాధ్యత కేటీఆర్ చూస్తున్నా బుజ్జగింపులు సంతప్తికరంగా సాగడం లేవన్న ప్రచారం పార్టీలోనే జరుగుతోంది.
పుంజుకున్న కాషాయ దళం
అధికార టీఆర్‌ఎస్ పరిస్థితి ఇలా ఉంటే కాషాయదళం మాత్రం పుంజుకుంది. పాలమూరులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా శంఖారావ సభతో ఎన్నికల రణరంగంలోకి దూకారు రాష్ట్రపార్టీ నేతలు. అంతేకాదు ఎప్పుడూ లేని విధంగా ఈసారి మజ్లిస్ కంచుకోట హైదరాబాద్ పాతబస్తీ నుంచే కమల దళపతి అమిత్‌షా శంఖారావం పూరించారు. లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని పాలమూరు ఎన్నికల ప్రచార సభకు బయలుదేరి వెళ్లడం ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపింది. అంతేకాదు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా ఎంఐఎంకు సవాల్ విసిరారు. అసదుద్దీన్‌పై హైదరాబాద్‌లో సామాన్య కార్యకర్తను పోటీకి దించి ఓడిస్తామని, ఇంట్లో కూర్చుని ట్వీట్ చేయడం కాదని.. దమ్ముంటే ఎన్నికల మైదానంలో దిగాలని లక్ష్మణ్ సూచించారు. పాతబస్తీలో 10 సీట్లలో పోటీ చేయడమే కాదు.. రాష్ట్రంలోని అన్ని సీట్లలో పోటీ చేసినప్పుడే ఎవరి బలం ఎంతో తేలిపోతుందని కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపు చేసే ప్రయత్నం చేశారు.
దిశానిర్దేశం
ముందస్తు ఎన్నికల తరుణంతో తెలంగాణపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రత్యేక దష్టి పెట్టారు. 20 రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగుర వేసినట్లుగానే తెలంగాణలోనూ బీజేపీని అధికారం లోకి తెచ్చేందుకు వ్యూహరచన చేస్తున్నారు. పార్టీ బలోపేతం, అధికారమే లక్ష్యంగా కనీసం 50 భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా కూడా సభలు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఆ క్రమంలోనే మహబూబ్ నగర్ సభ తర్వాత శంషా బాద్‌లో బీజేపీ రాష్ట్ర బాధ్యులు, జిల్లా ఇన్‌ఛార్జులు, జిల్లా అధ్యక్షులతో సమావేశమై ఎన్నికల వ్యూహాలపై అమిత్‌షా దిశానిర్దేశం చేశారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో ఉంటే ప్రజలకు మరింత మేలు జరుగు తుందనే నినాదంతో ముందుకెళ్లాలని సూచించారు.
‘మార్పుకోసం బీజేపీ శంఖారావం’ నినాదంతో నిర్వహించిన అమిత్‌షా సభ కాషాయ శ్రేణులలో ఉత్సాహం నింపింది. అనుకున్న దానికంటే రెట్టింపు స్థాయిలో జనం తరలిరావడం శుభ పరిణామంగా పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఎన్నికల హామీలు, అమిత్‌షా ప్రసంగం జనాన్ని ఆకట్టుకోవడం మరింత అనుకూలించే అంశంగా భావిస్తున్నారు. ఈ సభకు మహబూబ్‌నగర్ జిల్లా నుంచే కాక సమీపంలోని వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి కూడా జనం తరలివచ్చారు.
నెలాఖరులో కరీంనగర్‌లో నిర్వహించే బహిరంగ సభకు కూడా అమిత్‌షా హాజరుకానున్నారు. టీఆర్‌ఎస్‌కు బీజేపీ ఒక్కటే ఎదురొడ్డి నిలుస్తుందం టున్న రాష్ట్ర నేతలు టీఆర్‌ఎస్ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతోందని, బీజేపీ బలం పెరుగు తోందని అంటున్నారు. ఎన్నికలకు తాము సంసిద్ధంగా ఉన్నామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రకటించారు. వచ్చే నెలాఖరులోపు రాష్ట్రంలో 50 చోట్ల బహిరంగ సమ్మేళనాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమ్మేళనాలకు కేంద్ర మంత్రులు హాజరుకానున్నారని చెప్పారు. మహిళా సంఘాలతో ఈ నెల 27న హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి స్మతిఇరానీ సమావేశం కానున్నారని ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడగానే అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు.
– సప్తగిరి.జి, 9885086126
http://www.jagritiweekly.com/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87%E0%B0%B7%E0%B0%A3/%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%AC%E0%B1%8D%E0%B0%A6%E0%B1%81%E0%B0%97%E0%B0%BE-%E0%B0%97%E0%B1%81%E0%B0%B2%E0%B0%BE%E0%B0%AC%E0%B1%80-%E0%B0%B9%E0%B1%81%E0%B0%B7%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి