27, జూన్ 2014, శుక్రవారం

గెయిల్‌ గ్యాస్‌ ఘోరంతో కుదేలైన నగరం - అగ్నికీలల్లో మాడిమసైపోయిన జనం




సహజ వాయువు అసహజ మరణాలకు కారణమైంది. కొబ్బరి చెట్ల కోనసీమలో లీకైన గ్యాసు అరకిలో మీటరంత బాంబై భయంకరంగా బద్దలైంది. తెలతెలవారే సమయంలో 15 బతుకులు తెల్లారిపోయాయి. రాకాసి నాలుకలు సాచిన అగ్నికీలలు ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే నిండు జీవితాలను నిలువునా కబళించాయి. ఉషోదయాన విషాద జ్వాలలు వికటాట్టహాసం చేశాయి. ఆకుపచ్చ నేలలో అగ్గి పుట్టింది. జీవితాల్లో వెలుగు నింపే సహజ వాయువే మనుషులను బొగ్గుల్లా మార్చేసింది. అధికారిక నిర్లక్ష్యం సామాన్యులకు మరణశాసనం లిఖించింది. తూర్పు గోదావరి జిల్లా మామిడి కుదురు మండలం నగరం గ్రామం నిప్పు గుప్పిట చిక్కుకొని నిలువునా మాడిపోయింది. ఊరు ఊరంతా వణికిపోయింది. తెల తెల వారుతుండగానే.. మొత్తం 15 మంది సజీవ దహనమయ్యారు. 30మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పదిమంది చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఇది గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా గెయిల్‌ కేజీ బేసిన్‌ చరిత్రలోనే అత్యంత ఘోరమైన ప్రమాదం. గెయిల్‌ గ్యాస్‌ పైప్‌ లైన్ పేలుడుతో నగరం గ్రామం స్మశానంలా మారింది. నలుదిక్కుల నుంచి మంటలు చుట్టుముట్టడంతో పడుకున్నోళ్లు పడుకున్నట్లే మాడి మసైపోయారు. మెలకువతో ఉన్న వారు ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగెత్తినా.. మృత్యువును తప్పించుకోలేకపోయారు. అయినవాళ్లు కళ్లెదుటే మంటల్లో కాలిపోవడం ప్రమాదం నుంచి బయటపడ్డవాళ్ల గుండెల్ని పిండేశాయి. నగరంలోని  టీకొట్టు యజమాని వాసు ఒక్క కుటుంబంలోనే మొత్తం ఆరుగురు చనిపోయారు. మరో కుటుంబం ముగ్గురిని కోల్పోయింది. ఎగసిపడ్డ అగ్ని కీలల ఎత్తుకు గుర్తుగా కాలిన కొబ్బరి చెట్టు కనిపిస్తున్నాయి.  దాదాపు రెండువేల కొబ్బరి చెట్లు పూర్తిగా కాలిపోయాయి.  కిలకిలరాగాలతో ఊరికి సంగీతాన్ని పంచిన వేలాది పక్షులు మంటల్లో మాడి మసైపోయాయి. అస్తిపంజరాల్లా మిగిలాయి. మరికొన్ని పక్షులు కాలిన గాయాలతో  రోదిస్తున్నాయి.