21, డిసెంబర్ 2013, శనివారం

పార్టీల మధ్య సంకుల సమరం

ఇదీ వాస్తవం !
 
 
ఐదు రాష్ట్రాల ఎన్నికలు
పార్టీల మధ్య సంకుల సమరం
2014 పీఠమే పార్టీలకు ప్రధానం
సెమి ఫైనల్స్ లా తలపడుతున్న దృశ్యం
ఓడితే బొక్కబోర్లా పడటం తథ్యం

యూపిఎ ప్రచార బరిలో రాహుల్
ఎన్డీఎ పక్షాన మోడీ
ఎవరిని వరిస్తుందో సెమీఫైనల్ కిరీటం
ఇరు పక్షాల్లో నెలకొన్న సందిగ్ధం

అధికార పక్షంపై మోడీ విమర్శల వర్షం
అదేస్థాయిలో యూపిఏ నేతల ధ్వజం
ప్రచారంలో హద్దులు దాటుతున్న విమర్శల పర్వం
ఎన్నికల్లో గెలవడమే ముందున్న ఏకైక లక్ష్యం

మోడీ సభలపై బుసకొడుతున్న ఉగ్రవాదం
పాట్నాలో పేలుళ్లు...  జమ్మూలో దాడుల పుకార్లు
ఎన్డీఏ అస్తిత్వాన్ని దెబ్బతీయాలన్న నైజం
ఏనాటినుంచో వేళ్లూనుకున్నదన్నది సత్యం

- హంసినీ సహస్ర

28, అక్టోబర్ 2013, సోమవారం

దేశానికి ఎవరు దిక్కు?


ప్రధానమంత్రి...
భారత ఔన్నత్యాన్ని చాటే పదవి
దేశ ప్రజలందరికీ ప్రతినిధి
పాలనాపరంగా ఉండాలి...
ప్రజలందరికీ జవాబుదారీ

పెద్దదిక్కు...

అవినీతి ఆరోపణలు వస్తే...
ఆర్థిక వ్యవస్థ పతనమైతే...
సమస్యలతో సందిగ్ధం నెలకొంటే...
దారిలో పెట్టడం ఆయన విధి

తగ్గారు...

నేర చరితులపై వేటుకు...
సుప్రీంకోర్టు ఆదేశం
దీనిపై ఆర్టినెన్స్‌కు ప్రయత్నించిన ప్రభుత్వం
రాత్రికి రాత్రే వెనక్కి తగ్గిన మన్మోహన్‌

లోగుట్టు...

ఆర్డినెన్స్‌ను చింపేయాలన్న రాహుల్‌
శరవేగంగా స్పందించిన పీఎం
ఆలోచన విరమించుకున్న UPA సర్కార్‌
చివరకు బుట్టదాఖలైన ఆర్డినెన్స్‌

కోల్‌గేట్...

దేశాన్ని కుదిపేసిన కోల్‌ కుంభకోణం
ప్రత్యక్ష సంబంధం లేదన్న మన్మోహన్‌
తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నం
ఒడిశా సీఎంపైకి నెపం నెట్టేందుకు యత్నం

కాలింది...

 మాజీ కోల్‌సెక్రెటరీపై CBI కేసు
తనతో పాటు ప్రధానినీ ప్రశ్నించాలన్న పరేఖ్‌
ఉలిక్కిపడ్డ ప్రధాని మన్మోహన్‌
ప్రశ్నిస్తే సిద్ధమేనంటూ మాట మార్చిన వైనం

జవాబుదారీ...

కొన్నాళ్లనుంచి వరుస పరిణామాలు
అయినా.. మౌనమే నాదారి అంటున్నారు
ఓ పార్టీ చేతిలో కీలుబొమ్మగా మారారన్న వాదనలు
సోనియాకు జవాబుదారీగా ఉంటున్నారన్న ఆరోపణలు

మన్మోహన్‌ జీ...

సమర్థుడు, సౌమ్యుడు అన్న అభిప్రాయం
వ్యక్తిగతంగా అందరికీ గౌరవం
వ్యవహారశైలితో మారుతోంది గళం
అసమర్థుడంటూ విమర్శల వర్షం

- హంసినీ సహస్ర

23, అక్టోబర్ 2013, బుధవారం

దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు...

ఇదీ వాస్తవం !



దొంగలు, దొంగలు ఊళ్లు పంచుకున్నారట
దానికి రాజకీయ పార్టీలూ పోటీ పడుతున్నాయట
'నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు' అన్న చందంగా
ఎవరికి వారే సర్ది చెప్పుకుంటున్నారట

రాజకీయాలను గాడిలో పెట్టాలన్నారు జనం
ఆ ఆకాంక్షకు న్యాయస్థానం ఇచ్చిందో రూపం
నేర చరితులకు చెక్ పెట్టే కీలక ఆయుధం
కోర్టు ఆదేశాలనూ ధిక్కరించిన నాయకగణం

పణంగా పెడుతున్నారు పార్లమెంటు గౌరవం
ఆర్డినెన్స్ రూపంలో తప్పించుకునే ప్రయత్నం
చట్టసభల అధికారాన్ని చేస్తున్నారు దుర్వినియోగం
సుప్రీం తీర్పు పైనా వెళ్లగక్కారు ఉక్రోషం

రాష్ట్రపతి తీసుకున్నారు భేషైన నిర్ణయం
ఆర్డినెన్స్ ను వెనక్కు తిప్పి పంపిన వైనం
ఆర్డినెన్స్ చింపేయాలంటూ రాహుల్ అసహనం
ఎట్టకేలకు వెనక్కు తగ్గిన ప్రభుత్వం

ప్రజలకు తెలుసు నాయకుల పగటివేషం
మూడోకన్ను తెరుస్తారు ఎన్నికలవేళ ఇది నిజం
 

- హంసినీ సహస్ర

18, సెప్టెంబర్ 2013, బుధవారం

హుస్సేన్‌సాగర్‌కు కంఠాభరణంలా గణపయ్యలు



హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ తీరాన్ని గణనాథులు ఆక్రమించేశారు. సాగర్‌ చుట్టూ విఘ్నేశ్వరుని విగ్రహాలు కంఠాభరణంలా కనిపిస్తున్నాయి. జంటనగరాల్లోని కాలనీలు, వీధులు, రోడ్లన్నీ గణేశుని శోభాయాత్రలో మునిగిపోయాయి. హుస్సేన్‌ సాగర్‌ వద్ద ఏర్పాటు చేసిన భారీ క్రేన్లకు తోడు.. మొబైల్‌ క్రేన్లతో వినాయకుడి విగ్రహాలను హుస్సేన్ ‌సాగర్‌లో నిమజ్జనం చేస్తున్నారు. ఉదయం నుంచి కాస్త మందకొడిగా తరలివచ్చిన గణనాథులు.. సాయంత్రానికి హైదరాబాద్‌ రోడ్లను ఆక్రమించేశారు. ప్రధాన శోభాయాత్ర మార్గం ఇసకేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. భక్తుల భజనలు, యువతుల కోలాటాలు, యువకుల సందడి మధ్య గణేశులు ముందుకు సాగుతున్నారు. మరోవైపు.. సాయంత్రం హైదరాబాద్‌ నగరాన్ని కుండపోత వర్షం ముంచెత్తింది. రోడ్లన్నీ వరద నీటితో నదులను తలపించాయి. అయినా.. భారీ వర్షంలోనే భక్తులు శోభాయాత్రలో పాల్గొన్నారు. తెల్లవార్లూ గణేశ నిమజ్జనోత్సవం ఉధృతంగా సాగనుంది. ఇటు.. నిమజ్జనం సందర్భంగా నగరంలోని అన్ని రోడ్లలో ట్రాఫిక్‌ను మళ్లించారు. ప్రత్యేకంగా కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటుచేశారు. శోభాయాత్రలోని ప్రధాన కూడళ్లు, హుస్సేన్‌సాగర్‌ చుట్టూ సిసి కెమెరాలు అమర్చిన పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

17, సెప్టెంబర్ 2013, మంగళవారం

రూపాయి - పాపాయి


ఇదీ వాస్తవం !


చేతులు కాలాక ఆకులు పట్టుకుందాం
అదిగో పిలుస్తున్నారు ప్రధాని మన్మోహన్
ఇదే యూపీఏ తాజా నినాదమట
కానీ చేతులు ఇప్పటికే బొబ్బలెక్కాయి

ప్రధాని వయసుతో పరుగుతు తీస్తోన్న రూపాయి
అంతుచిక్కని అగాథం వైపు జారిపోతున్న పాపాయి
మేకపోతు గాంభీర్యం భరోసా ఇవ్వడం లేదోయి
మొత్తానికి పరిస్థితులు గాలిలో దీపంగా మారాయి

గతమెంతో ఘనమని మన్మోహన్ కు పేరు
1991లో ముంచెత్తిన ఆర్థిక సంక్షోభం ఆనాడు
సంస్కరణలతో అదుపులోకి వచ్చిన పగ్గాలు
దీర్ఘకాలంలో చూపిస్తున్నాయి ప్రతికూల ఫలితాలు

రూపాయి పతనానికి చిహ్నం ఒక కారణమట
ఆ చిహ్నం మారిస్తే ఫలితం ఉంటుందట
వాస్తు నిపుణుల పరిశీలనలో తేలిన వాస్తవమట
నష్ట నివారణ దిశగా ఉద్ధండుల మథనమట
 

- హంసినీ సహస్ర

16, ఆగస్టు 2013, శుక్రవారం

వర్షాంధ్రప్రదేశ్‌

బంగాళాఖాతంలో ఏర్పడినఅల్పపీడన ద్రోణి ప్రభావంతో  రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. వరదల ధాటికి నాలుగు జిల్లాల్లో ఐదుగురు గల్లంతయ్యారు. చత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు  కోస్తాంధ్ర మీదుగా అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుండటంతో మరో రెండు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతారణ శాఖ అధికారులు తెలిపారు.  

15, ఆగస్టు 2013, గురువారం

హైందవ సంకేతం...!

 

 

- భారతదేశం హైందవ సంస్కృతీ సమ్మేళనం
- లౌకిక భావమే హైందవ సంస్కృతి విశేషం
- ముస్లింను రాష్ట్రపతిని చేసిన ఘనత మన సొంతం
- విశ్వానికే అది మన ఘనమైన సందేశం

ఇప్పుడు...
- కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆరాటం
- తన గురించి ఏకరువు పెట్టిన దిగ్విజయ్ వైనం
- తాను హిందువునే అని చెప్పకోవడం
- తప్పుడు సంకేతాలు వెళ్తాయని భయమా?
- దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనా?

ఇక...
- రెండు దశాబ్దాల తర్వాత మనసు విప్పిన ములాయం
- 90వ దశకాన్ని చేసుకున్నారు మననం
- కరసేవకులపై కాల్పుల కలకలం
- చింతిస్తున్నానంటూ ప్రకటించటం
- ఇది రాజకీయమా? పరిస్థితుల ప్రాబల్యమా?

ఇదీ వాస్తవం...
- హిందువులమని గర్వంగా చెప్పుకుంటున్న నాయకగణం
- హిందూత్వ ఆవశ్యకతను గుర్తిస్తున్న వాతావరణం
- నాడు సంకుచిత భావంతో దాచారు మన సంస్కృతిని
- ఆ గతానికి చెల్లిపోతోంది కాలం
- గత అభిప్రాయాలను పాతరేస్తున్న వర్తమానం
- భవిష్యత్ భారతానికి నిలువెత్తు సంకేతం
 
- హంసినీ సహస్ర

14, ఆగస్టు 2013, బుధవారం

పార్లమెంటు సమావేశాల్లోపే కేబినెట్‌ నోట్‌
కేబినెట్‌ నోట్‌పై వేగంగా కసరత్తు సాగుతోంది. పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపే నోట్‌ పూర్తయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు.. ఆంటోనీ కమిటీ సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోంది. నిన్న తెలంగాణ ప్రాంత కేంద్రమంత్రులు, ఎంపీలతో కమిటీ సభ్యులు చర్చలు జరిపారు. వారి అభిప్రాయాలు స్వీకరించారు. ఇవాళ సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, ఎంపీలతో ఆంటోనీ కమిటీ భేటీ కానుంది.


15, జులై 2013, సోమవారం

హస్తిన చుట్టూ క్షిపణి కవచం


భివృద్ధి చెందుతున్న టెక్నాలజీకి అనుగుణంగా భారతదేశం శత్రుదుర్భేద్యంగా మారుతోంది. శత్రు దేశాల క్షిపణులను సైతం ఎదుర్కొనేలా దేశం రూపుదిద్దుకొంటోంది. ఇందుకోసం మన శాస్త్రవేత్తలు పూర్తిస్థాయి నైపుణ్యాన్ని వినియోగించుకుంటున్నారు. అత్యాధునిక రాడార్ లు, శత్రు నిరోధక క్షిపణులను అమర్చగలిగే సాంకేతిక నైపుణ్యాన్ని అభివృద్ధి చేశారు. వీటిని వలయాకారంగా అమర్చడం ద్వారా శత్రు క్షిపణులను ఎదుర్కోగలిగే రక్షణ కవచం ఏర్పడుతుంది. 

ఇప్పుడున్న టెక్నాలజీతో 2 వేల కిలోమీటర్ల దూరం నుండి వచ్చే క్షిపణులను కూడా అడ్డుకొని ధ్వంసం చేయగలిగే సామర్ధ్యం మనకుంది. బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ అని పిలిచే ఈ టెక్నాలజీలో భాగంగా రెండు దశల్లో ఈ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసేందుకు డి.ఆర్.డి.ఎ. సిద్ధంగా ఉంది. తొలిదశ ఇప్పటికే పూర్తి కాగా, రెండో దశ కూడా పూర్తయితే 5 వేల కిలోమీటర్ల నుండి దూసుకొచ్చే క్షిపణులను కూడా నిరోధించగలిగే అవకాశం ఉంటుంది. ముందుగా ఈ క్షిపణి కవచాన్ని దేశ రాజధాని ఢిల్లీ చుట్టూ మోహరించేందుకు డి.ఆర్.డి.ఎ. సిద్ధంగా ఉంది.   

- హంసినీ సహస్ర

ఉత్తరాఖండ్ ప్రళయం వెనుక...?


గంగమ్మ ఉగ్రరూపం దాల్చింది. తన బిడ్డల పైనే కన్నెర్ర చేసింది. ఊళ్లకు ఊళ్లనే తుడిచిపెట్టేసింది. వేలాది మందిని తనలో కలుపుకొని సమాధి చేసింది. పటపటా పళ్లు కొరుకుతూ అడ్డువచ్చిన కొండలనూ పిండి చేసేసింది. కేదారేశ్వరుడిని ప్రళయ ప్రవాహంతో అభిషేకించింది. కళకళలాడే క్షేత్రాన్ని ఒక్కరోజులోనే మరుభూమిగా మార్చేసింది. యుగాలుగా ప్రవహిస్తున్నగంగమ్మ తల్లికి అంత కోపం ఎందుకొచ్చింది? భక్తులనే మింగేసేంత ఆగ్రహం ఎందుకు కట్టలు తెంచుకుంది? అంతా స్వయంకృతాపరాధమేనన్న వాస్తవాన్ని జనానికి తెలిసి వచ్చేలా, పాలకులు కళ్లు తెరిచేలా ఉగ్ర గంగ పోటెత్తింది.

అభివృద్ధి పేరిట వెర్రితలలు :  

నాగరికతకు ప్రతీకగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న వేళ ప్రకృతినీ, పర్యావరణాన్నీ కూడా దెబ్బతినకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. తద్విరుద్ధ పరిస్థితులు నెలకొన్నప్పుడు ప్రకృతికి తగిలిన గాయం అదను చూసి లావాలా పెల్లుబుకుతుంది. శతాబ్దాలుగా చోటుచేసుకుంటున్న విలయాలు, ప్రళయాలే ఇందుకు సాక్ష్యం. తాజాగా తలెత్తిన విపత్తూ అదే కోవలోకి వస్తుంది. ఇంతటి విలయానికి దారితీసిన పరిస్థితులను విశ్లేషించుకుంటే అభివృద్ధి పేరిట హిమాలయాలను మనం (అంటే ప్రభుత్వం, పాలకులు, పారిశ్రామికవేత్తలు) ఎంతగా విధ్వంసం చేస్తున్నామో కళ్లకు కడుతుంది. మానవ తప్పిదమే ఈ మహోగ్ర రూపానికి కారణమన్న వాస్తవం బోధపడుతుంది.

హిమాలయాల గర్భంలో గునపం :  

ఉత్తరాఖండ్ యావత్తూ పర్వతాలతో కూడిన రాష్ట్రం. ఈ రాష్ట్రంలో 93 శాతం పర్వతాలే. మరోవైపు ఈ పర్వతాలు, లోయల మీదుగా గంగ, యమున, భాగీరథీ, అలకనంద,పదుల సంఖ్యలో వాటి ఉప నదులు శరవేగంతో పరుగులు పెడుతుంటాయి. దీంతో ప్రైవేటు విద్యుత్ సంస్థలు రాబందుల్లా అక్కడ వాలాయి. చిన్నస్థాయి జలవిద్యుత్ ప్రాజెక్టులు పర్యావరణానికి మేలు చేస్తాయన్న ప్రభుత్వ ఆలోచనతో పుట్టగొడుగుల్లా జలవిద్యుత్ ప్రాజెక్టులు వెలిశాయి. ఇక్కడి నదీ ప్రవాహ మార్గాల్లో ప్రతీ ఐదారు కి.మీటర్లకూ ఓ జలవిద్యుత్, గనుల ప్రాజెక్టుల వంటివి మొత్తం 220కి పైగా ఉంటాయని అంచనా. వీటికి తోడు తాజాగా 37 జలవిద్యుత్ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులిచ్చింది. మరో 70 ప్రాజెక్టులు కూడా అనుమతి కోసం వేచి చూస్తున్నాయి. వీటి నిర్మాణం కోసం సొరంగ మార్గాల పేరిట హిమాలయాలను తొలుస్తున్నారు. అడవులను నరికేస్తున్నారు. రిజర్వాయర్ల కోసం విచ్చలవిడిగా పేలుళ్లకు పాల్పడుతున్నారు. దీనితో వృక్ష, జంతుజాలం అంతరించిపోతోంది. మరోవైపు జలవిద్యుత్ ప్రాజెక్టుల కోసం నదులను సొరంగాల ద్వారా మళ్లిస్తుండడంతో వాటి సహజసిద్ధ ప్రవాహ స్వరూపం మారిపోయి ఒత్తిడి పెరుగుతోంది. రిజర్వాయర్లలో నీటి నిల్వలతో ఉపరితల ఉష్ణోగ్రతలు వేడెక్కి వాతావరణ మార్పులకు కారణమవుతోంది.

మొట్టికాయ వేసినా... :  

ఇటువంటి పరిణామాలను, పర్యవసానాలను ముందే ఊహించిన కాగ్ మూడేళ్ల క్రితమే హెచ్చరించింది. ఉత్తరాఖండ్ లో కొనసాగుతున్న విధ్వంసం వల్ల నదులకు తీవ్ర ముప్పు పొంచి ఉందని తేల్చింది. అయినా ప్రభుత్వం గానీ, పరిశ్రమలు గానీ కనీసం వినిపించుకోలేదు.

ఆధ్యాత్మిక ముసుగులో పర్యాటకం :  

మరోవైపు శతాబ్దాలుగా ఎంతో పవిత్రంగా భక్తి విశ్వాసాలతో అలరారుతున్న చార్ ధామ్ ఆలయాలను ఆధ్యాత్మిక యాత్రల ముసుగుతో పర్యాటక ప్రాంతాలుగా మార్చేశారు. ఎంతో పవిత్రమైన, మరెంతో సున్నితమైన హిమాలయాల పర్వతాలు పరిమిత సంఖ్యలో జన కాలుష్యాన్ని మాత్రమే తట్టుకోగలవు. దైవభూమిగా పిలుచుకునే ఈ శిఖరాలను అపవిత్రం చేయడమే కాదు, యాత్రల పేరిట పరిమితికి మంచి జనాన్ని ఒక్కసారిగా తీసుకెళ్తున్నారు. అటు ఆంక్షలు విధించవలసిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం, ఇటు ధనార్జనే ధ్యేయంగా వెలిసిన ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాల అత్యాశ వెరసి ఇంతటి ఘోర విపత్తుకు కారణమయ్యాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. యాత్రికుల సంఖ్య గడిచిన మూడు దశాబ్దాలలో దాదాపు 50 రెట్లు పెరగడం సామాన్యమైన విషయం కాదు. జన కాలుష్యం, జన వ్యర్థాలు హిమాలయాల సహజత్వాన్ని దెబ్బతీస్తున్నాయి. అలాగే పుణ్యక్షేత్రాలు, నదుల చుట్టూ పట్టణాలు ఏర్పడటం, కొండలపైనే ప్రమాదకర స్థాయిలో భారీ భవనాలు నిర్మించడం వంటివి మరింత ఆజ్యం పోశాయి.

చెక్కుచెదరని విశ్వాసం :

చివరిగా చెప్పుకోవాల్సినదేంటంటే ఇంతటి ప్రళయంలోనూ కేదారేశ్వరుని ఆలయం గానీ, అందులోని మహాదేవుడు గానీ చెక్కు చెదరక పోవడం తరతరాల విశ్వాసానికి తిరుగులేని ప్రతీక.  
- హంసినీ సహస్ర

10, జులై 2013, బుధవారం

సినిమా ముసుగులో మరోసారి ఇస్లామీల విధ్వంసం

లిబియాలో హత్య కాబడ్డ అమెరికా దౌత్యవేత్త క్రిస్టర్స్ స్టీవెన్స్
"ఇన్నోసెన్స్ ఆఫ్ ముస్లిమ్స్" సినిమాపై వ్యతిరేకత వెర్రితలలు వేస్తోంది. ఆగ్రహం దేశాల సరిహద్దులు దాటింది. ఆగడాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆందోళనలు హద్దు దాటుతున్నాయి. అత్తమీద కోపం దుత్తమీద తీర్చుకొన్నట్లుగా ఎక్కడో, ఎవరో, ఏదో కారణంతో చేసిన దానికి ముస్లిములు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు, ఎలా తోస్తే అలా నిరసనల పేరుతో విధ్వంసానికి దిగుతున్నారు. ప్రాణాలు తీస్తున్నారు. ఆస్తులకు నష్టం కలిగిస్తున్నారు. అంతర్జాతీయ జిహాదీ బీభత్సకాండను తలపింప చేస్తున్నారు. 
ముస్లిం సినిమా ముసుగులో ఇటీవల ఇస్లాం మతస్తులు తెగబడ్డ ఘటనలు ఒకసారి చూద్దాం.
ముస్లింల వెర్రి వేషం లిబియాలో అమెరికా దౌత్యవేత్త క్రిస్టర్స్ స్టీవెన్స్ ను బలి తీసుకుంది. మరో ముగ్గుర్ని సజీవదహనం చేసింది.
ఆఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 12 మంది దుర్మరణం చెందారు.
యెమన్ రాజధాని సనాలో ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పులలో ఒకరు చనిపోయారు.
ఇండోనేషియా రాజధాని జకార్తాలో వందలాది మంది నిరసనకారులు రాళ్ళు రువ్వడంతో ఓ పోలీసు అధికారి గాయపడ్డారు.
ఆఫ్రికా దేశం సూడాన్ లోనూ ముస్లింలు రాజధాని కర్తోమ్ లోని అమెరికా ఎంబసీపై దాడికి విఫల ప్రయత్నం చేశారు.
కైరోలో ఆందోళనకారుల దాడుల్లో 70 మంది గాయపడ్డారు.
ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో వేలమంది ఆందోళనకారులు భారీ ర్యాలీ నిర్వహించారు.
లండన్ లోని అమెరికా రాయబార కార్యాలయం ముందు సుమారు రెండు వందల మంది ముస్లింలు నిరసన తెలిపారు.
సూడాన్ లో రాయబార కార్యాలయం ఆందోళనకారుల దాడులతో దద్దరిల్లింది.
ఖర్దుంలోని జర్మన్ ఎంబసీ కూడా నిరసనలకు దగ్ధమైంది.
ట్యునీషియా, ఇరాక్, మొరాకో, సూడాన్, జర్మనీ, బ్రిటన్, ట్యునిష్, ఈజిప్టు, యెమన్, లెబనాన్, పాకిస్తాన్ దేశాలు ఆందోళనలతో అట్టుడికిపోయాయి.
భారత్ కూ పాకిన ఈ ఇస్లాం చిచ్చు సామాన్యులకు ప్రాణసంకటంగా మారింది.
కాశ్మీర్ లో హింస చోటు చేసుకుంది. వేలాదిమంది ర్యాలీగా వచ్చి ఉప ముఖ్యమంత్రి నివాసం వద్ద ఓ ప్రభుత్వ వాహనానికి నిప్పు పెట్టారు.

సుమారు 300 మంది ముస్లిములు చెన్నైలోని అమెరికా రాయబార కార్యాలయంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు.
ఒకవేళ చిత్రంలో అసభ్యకర సన్నివేశాలుంటే వాటిని తొలగించాలని శాంతియుత ప్రదర్శన జరపడం రాజ్యంగ పధ్ధతి. ప్రజాస్వామ్యం వ్యవస్థీకృతమై ఉన్న అమెరికాలోని ముస్లింలు ఆ మాధ్యమాన్ని ఎంచుకోవచ్చు. లేదా న్యాయస్థానాలలో పిటిషన్లు వేసి చిత్రాన్ని నిషేధింపచేయవచ్చు. అమెరికా దౌత్య సిబ్బందిని హత్య చేయడం ద్వారా ఒసామా లాడెన్ వధకు ప్రతీకారం తీర్చుకోవాలన్నది జిహాదీల వ్యూహమా? అన్ని దేశాలలోనూ బీభత్సకాండను సృష్టించడం ద్వారా ప్రభుత్వాలను అస్థిరత్వానికి గురి చేయడం జిహాదీల ప్రస్తుత పన్నాగమన్నట్లు తెలుస్తోంది.
ఓ వైపు ఇంతగా ఆందోళనకారులు రెచ్చిపోతున్నా, మరోవైపు అమెరికా వ్యతిరేక నిరసనలు ఇంకా ముమ్మరం చేయాలంటూ లెబనాన్ షియా సంస్థ హిజ్బుల్లా పిలుపునిచ్చింది. ఈ చిత్ర దర్శకుడు శ్యాంబేసిల్ ను అమెరికాలో నిర్బంధించారు. 

- హంసినీ సహస్ర

రాష్ట్రంలో స్తంభించిన పరిపాలన - నిద్రావస్థలో పాలనా వ్యవస్థ

ముందెన్నడూ లేని విధంగా  రాష్ట్రంలో పాలన స్తంభించింది. అన్ని ప్రాంతాల ప్రజలకు మెరుగైన పాలన అందించాల్సిన మంత్రులు ప్రాంతాల వారీగా విడిపోయే వాళ్ళకు వాళ్ళే గిరిగీసుకున్నారు. ముఖ్యమంత్రికి, మంత్రులకు సమన్వయము లోపించింది. అసలు రాష్ట్ర ప్రభుత్వం ముక్కలు చెక్కలైంది. ప్రజా ప్రతినిధుల పరిస్థితి 'ఎవరికి వారె యమునా తీరే' అన్నట్లుగా ఉంది. 
 సచివాలయంలో గాని, పాలకుల్లో గాని, అభివృద్ధికి సంబంధించిన అంశాలేవీ చర్చకు రావడం లేదు. అసలు అభివృద్ధి గురించి ఆలోచించే ప్రజా ప్రతినిధులే  కరువయ్యారు. కనీసం మంత్రులందరూ ఒక చోటికి చేరి సమావేశమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ప్రాంతీయ విభేదాలతో వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటున్నారు. ఒకరి చరిత్ర మరొకరు తవ్వి తీస్తున్నారు. 
రెండు నెలలకు పైగా కేబినేట్ మీటింగ్ జరగలేదంటే... పాలన ఏ విధంగా సాగుతుందో అర్ధం చేసుకోవచ్చు. మంత్రులే ముఖ్యమంత్రికి డిమాండ్ల చిట్టాలు, సవాళ్ళ పట్టాలు విసురుతున్నారు. సచివాలయానికి రాబోమని తెగేసి చెప్పారు. చివరకు రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటి సారిగా సిఎం క్యాంప్ ఆఫీస్ లో  'కేబినేట్ మీటింగ్' ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. సచివాలయంలో కేబినేట్ మీటింగ్ పెడితే తెలంగాణా ప్రాంతానికి  చెందిన మంత్రులు హాజరు కారనే భయమే సిఎం ఆ నిర్ణయం తీసుకునేలా చేసింది.  
కేంద్ర ప్రభుత్వం రెండేళ్ళ కింద చేసిన ఓ ప్రకటన పర్యవసానమే ఇప్పుడున్న పరిస్థితి. కనీసం రాష్ట్ర పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం కూడా కేంద్ర ప్రభుత్వం చేయలేకపోవడం అందరినీ ఆలోచింప చేస్తోంది.  కానీ అక్కడ కేంద్రం కూడా అవినీతి ఆరోపణల ఊబిలో కురుకుని పోయి, తనను తాను కాపాడుకొనేందుకే సకల ఉపాయాలూ వెతుకుతోంది. సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో సంక్షోభంలో కూరుకుపోయిన సర్కారును పట్టించుకునేందుకు కేంద్రానికి కూడా సమయం దొరకడం లేదు.
- హంసిని

మెల్లగా మునుగుతున్న టైటానిక్ నౌక - అమెరిక ఆర్థిక వ్యవస్థ

అమెరికా అంటే భూతల స్వర్గం. ఆ దేశ కరెన్సీ 'డాలర్' చేతిలో ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా ధీమాగా తిరగొచ్చు. నిశ్చింతగా ఉండొచ్చు. 30 , 40 ఏళ్ళపాటు ప్రపంచాన్ని అమెరికా శాసించిన తీరుకు అద్దం పట్టే వ్యాఖ్యలివి. ఇప్పుడు దిర్బేధ్యమనుకున్న అమెరికా కోటకు బీటలు వారుతున్నాయి. జార్జి బుష్ హయంలోనే అమెరికా పతనం మొదలైంది. బుష్... ఆసియాలో యుద్ధాలకు దిగి... ట్యాక్స్ రేట్లు తగ్గించడం వల్ల ఖర్చులు పెరిగిపోయాయి. బడ్జెట్ లోటు ఎక్కువైంది. ఆ మేరకు ఆదాయం పెరగలేదు. ఫలితంగా 2007 లో భయంకరమైన ఆర్ధిక సంక్షోభం అమెరికాను చుట్టుముట్టింది. బరాక్ హుస్సేన్ ఒబామా వచ్చేనాటికి పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. గడ్డుకాలం నుండి గట్టెక్కిస్తాడనుకున్న అమెరికన్ల ఆశలు అడియాసలవుతున్నాయి.

ఒబామా అధ్యక్ష పీఠం చేపట్టినప్పటి నుంచి చోటు చేసుకున్న నాలుగు ప్రధాన ఘట్టాలు :

1 ) గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో చమురు భారీ ఎత్తున సముద్రం పాలైంది. అక్కడి పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లింది. నష్ట నివారణలో ఒబామా సమర్ధంగా వ్యవహరించలేకపోయారు.  

2 ) అమెరికా ఆరోగ్య రంగంలో ఒబామా చేపట్టిన సంస్కరణలు పెనుమార్పులు తీసుకొస్తాయని, భారీ సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని అంచనా వేశారు. కానీ అవి ఏవీ నిజం కాలేదు. 

3 ) మూడో అతిపెద్ద ఘట్టం ఏమిటంటే ఒసామాబిన్ లాడెన్ ను మట్టుబెట్టడం, ఈ ఒక్క కారణంతో ఒబామా పోగొట్టుకున్న కీర్తిని కొంతమేరకు తిరిగి పొందారు. 

4 ) నాలుగో అతిపెద్ద ఘటన రుణ పరిమితి పెంపు. AAA రేటింగ్ కోల్పోవడం వలన అమెరికా రుణాలమీద చెల్లించాల్సిన వడ్డీ పెరుగుతుంది. దీనివల్ల అమెరికా ఆర్ధిక వృద్ది రేటు తిరోగమనంలోకి వెళ్ళే అవకాశముంది. అంటే 2007 నాటి ఆర్ధిక మాంద్యం మరోసారి అమెరికాను చుట్టుముట్ట వచ్చన్నది  విశ్లేషకుల అంచనా. అమెరికా తిరోగమనానికి స్పష్టమైన సంకేతం ఆ దేశపు రేటింగ్. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అమెరికా రేటింగ్ డౌన్ గ్రేడ్ అయ్యింది. రేటింగ్ తగ్గి పోవడంతో ఆ దేశ ఆర్ధిక వ్యవస్థ పెనం మీది నుంచి పొయ్యిలోకి పడ్డట్లయింది. 

AAA రేటింగ్ ప్రపంచంలోని అత్యుత్తమ రేటింగ్. ఈ రేటింగ్ కోసం దేశాలు, కంపెనీలు కలవరిస్తాయి. AAA రేటింగ్ ఉన్న దేశాలు భద్రతకు మారుపేరుగా ఉంటాయి. వీటికి అప్పు ఇచ్చేందుకు ఏ దేశమూ, ఏ సంస్థా వెనుకాడదు. ప్రపంచంలో కేవలం 20 దేశాలకు మాత్రమే ఈ టాప్ రేటింగ్ ఉంది. అమెరికా ఇప్పుడు ఆ రేటింగ్ ను కోల్పోయింది. 

ప్రపంచానికి పెద్దన్నగా పేరు తెచ్చుకున్న అమెరికా రేటింగ్ తగ్గితే ఆ ప్రభావం ప్రపంచంలోని అన్ని దేశాల మీదా ఉంటుంది. అమెరికా నుండి ఇతర దేశాలకు బిజినెస్ తగ్గిపోతుంది. ఇండియన్ ఐటి కంపెనీలకు కూడా ఆదాయం తగ్గే అవకాశం ఉంది.

టైటానిక్ నౌక మెల్లగా సముద్రంలో మునుగుతున్నట్లుగా ఉంది అమెరికా ప్రస్తుత పరిస్థితి. స్థూల జాతీయోత్పత్తిలో అమెరికా అప్పులు 99 శాతానికి చేరుకున్నాయి. అమెరికా గడ్డు పరిస్థితికి ఈ గణాంకాలే నిదర్శనం.  
- హంసిని

పాక్-బంగ్లాలలో అనిశ్చిత స్థితిలో ప్రజాస్వామ్యం


అఖండ భారతదేశం నుండి విడిపోయిన రెండు ఇరుగు పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో జరుగుతున్న పరిణామాలు మనకు ఆందోళన కలిగిస్తునాయి. ఈ దేశాల్లో తరచూ తలెత్తుతోన్న అంతర్గత సంక్షోభాలు మనదేశంపై కూడా ప్రభావం చూపే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కారణంగా మనకు సంబంధం లేకున్నా భవిష్యత్ పరిణామాల దృష్ట్యా వాటి గురించి చర్చించుకోవడం అనివార్యంగా కనిపిస్తోంది.  

అటు పాకిస్తాన్ లోనూ, ఇటు బంగ్లాదేశ్ లోనూ ప్రజాస్వామ్యం అంతగా పరిడవిల్లిన  దాఖలాలు చాలా తక్కువ. ఈ రెండు దేశాల్లోనూ పౌరపాలన కన్నా సైన్యందే పైచేయి. ఆ సైన్యంలోనూ జీహాదీ వంటి మతోన్మాద శక్తులదే పైచేయిగా ఉంటోంది. బంగ్లాదేశ్ లో పౌర ప్రభుత్వాన్ని కూల్చే కుట్రకు పాల్పడింది ఓ ప్రముఖ మతోన్మాద సంస్థతో సంబంధం ఉన్న సైనికాధికారులే. ఆ సైనికాధికారుల్లోని విభేదాలతో అదే సైన్యం ఈ కుట్రను బట్టబయలు చేసింది.

1999లో జరిగిన కార్గిల్ యుద్ధానికి ప్రధాన కారకులు సైనిక పాలకులే. అంతకుముందు పౌర ప్రభుత్వంతో భారత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని తుంగలో తొక్కిన సైన్యం కార్గిల్ చొరబాట్లకు పాల్పడింది. వీటన్నింటి వెనుకా ఇస్లామిక్ తీవ్రవాదుల కుయుక్తులున్నాయనడం బహిరంగ రహస్యమే. ఎందుకంటే ఐ.ఎస్.ఐ. అనేది పాకిస్తాన్ సైన్యంలోని ఒక విభాగం. 

పాక్ సైన్యం జిహాదీ ఉగ్రవాదులతో చేయి కలిపిందన్నది బహిరంగ రహస్యమే. గతేడాది అమెరికా సైన్యం తుదముట్టించిన లాడెన్ స్థావరం పాక్ సైనిక స్థావరానికి అతి సమీపంలో ఉండడమే దీన్ని బలపరుస్తోంది. ఈ పరిణామంతో పాక్ సైన్యం పరిస్థితి కాలుగాలిన పిల్లిలా తయారైంది. పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం కన్నా మతోన్మాదమే బలంగా పని చేస్తోందన్న దానికి ఉదాహరణలు కోకొల్లలు. దేశ పాలకులనే ఆదేశించే స్థాయిలో పాక్ సైన్యం ఉందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అక్కడ పౌర ప్రభుత్వాలను దెబ్బతీసే ప్రయత్నాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి.

పాకిస్తాన్ సైనిక పాలనలో మ్రగ్గిన కాలఖండం : 

1958లో మొదటిసారి పాకిస్తాన్ లో సైన్యం తిరుగుబాటు చేసి పాలన చేజిక్కించుకుంది.
  • 1958-71 - మొదట అయూబ్ ఖాన్, ఆ తదుపరి ఆయాఖాన్ పాలన కొనసాగించారు.
  • 1978-88 - జియా-ఉల్-హక్ పాలించాడు.
  • 1999-2002 - పర్వేజ్ ముషారఫ్ అధికారం చెలాయించాడు.
  • 2012లో మరోసారి సైనిక పాలన దిశగా పాకిస్తాన్ అడుగులు వేస్తున్నది. 
తాజాగా ఆపరేషన్ లాడెన్ కు ప్రస్తుత పౌర ప్రభుత్వం పూర్తిగా సహకరించిందని పాక్ సైన్యం దానిపై ఆగ్రహంతో ఉంది. అందుకే తమ ప్రాతినిధ్యాన్ని కాపాడుకొనేందుకు మరోసారి సైనిక పాలన కోసం ప్రయత్నిస్తోంది.
ఈ పరిస్థితులు మనదేశంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఎందుకంటే ఇస్లామిక్ తీవ్రవాదుల టార్గెట్ భారత్. ఆ శక్తులకు అండదండలు అందిస్తున్నవారు పాక్, బంగ్లాదేశ్ సైన్యాధికారులు. వారి వల్లనే అంతర్యుద్ధాలు చోటు చేసుకుంటున్నాయి. పాకిస్తాన్ లో పాలకుల, సైనికాధికారుల బలం భారత్ ను వ్యతిరేకించడంలో ఉంది. భారత్ లోని రాజకీయ పార్టీలు తాము అధికారంలోకి రావాలంటే మైనార్టీ వర్గాలను సంతృప్తి పరచటం, వారిని తమ వైపు ఉంచుకోవాలనే భ్రమలో ఉన్నారు. అటు పాక్ పాలకులు, ఇతి భారత్ పాలకుల వ్యవహారంతో భారత్ భద్రతకు ఎప్పుడూ సవాళ్ళు ఎదురవుతూనే ఉన్నాయి. 
- హంసిని 

అధికార పార్టీ వత్తిడులకు తలొగ్గుతున్న మీడియా ?

నేటి సమాచార విప్లవంలో మీడియా అత్యుత్సాహంతో పాటు అచేతన స్థితిని కూడా ప్రస్తావించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. అనవసర అంశాలు, ప్రాధాన్యత లేని విషయాలపై చెవులు ఊదర గొట్టేలా అత్యుత్సాహం ప్రదర్శించడం ఒకప్రక్క, మరోప్రక్క కుంభకోణాలు, అవినీతి, అక్రమాలకూ సంబంధించిన అంశాలపై నాన్చుడు ధోరణి ప్రదర్శించడం పలు అనుమానాలకు దారి తీస్తున్నది. 
2జి కేసులో మీడియా ప్రశంసనార్హమైన పాత్రనే పోషించినా.. దాని వెనుక జనతా పార్టీ అధ్యక్షులు సుబ్రహ్మణ్య స్వామి చొరవ ఎంత ఉందో కనీస జ్ఞానం ఉన్నవారెవరైనా చెప్పేస్తారు. అనివార్యంగా మీడియాలో ఈ కేసు గురించి ప్రాధాన్యత ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే అందులోనూ కేంద్ర మంత్రి రాజా వెనకున్న పెద్దల గురించి మీడియా పట్టించుకున్న పాపాన పోలేదు.
అలాగే తాజాగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ వ్యవహారం ఎంత తీవ్రమైనదో తెలిసికూడా మీడియా నోరు మెదపలేదంటే అందరూ ముక్కున వేలేసుకోవాల్సిందే. అభిషేక్ సింఘ్వీ ఒక మహిళతో శృంగారంలో పార్గొన్న వీడియో ఇంటర్ నెట్ లో షికార్లు చేసినా ప్రభుత్వం గానీ, సంబంధిత అధికారులు గానీ పోలీసులు గానీ కనీసం స్పందించలేదు. అధికార పార్టీలో ప్రముఖ హోదాలో కొనసాగుతూ ఇలాంటి నీచమైన పనులకు ఒడిగట్టడం దేశ ప్రతిష్టను దిగజార్చడమే అన్నది నిర్వివాదాంశం. అయినా దానికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత మీడియా ఇవ్వక పోవడం వెనుక కారణాలేమై ఉంటాయో ఎవరికీ వారే ప్రశ్నించుకోవడం తప్ప మరోమార్గం లేదు. మరో రెండు రోజుల్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతాయనగా  ఈ తతంగం బట్టబయలు కావడంతో యుపిఎ హడావిడిగా నష్ట నివారణ చర్యలు చేపట్టింది. సింఘ్వీచే అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేయించి, ఈ అంశాన్ని కప్పి పుచ్చేందుకు శత విధాలా ప్రయత్నించి ఫలితం సాధించింది.
ఇక బిజెపి నేత బంగారు లక్ష్మణ్ అంశానికి వస్తే మీడియా మరోసారి జూలు విదిల్చింది. పదేళ్ళ క్రితమే ఈ ఘటనపై ఊదరగొట్టిన మీడియా ఇప్పుడు మళ్ళీ కోర్టు తీర్పు వెలువడగానే కొత్తగా ఈ ఘటన బయట పడినంత హడావిడి చేసింది. అనవసర ప్రాధాన్యత నిచ్చింది.
ఈ పరిణామాల వెనుక ప్రభుత్వ పెద్దల, మీడియా పెద్దల హస్తం దాగున్నదని నిపుణుల మాట. మనకు తెలియకుండానే ఓ వర్గంపై, మెజార్టీ జనం ఆకాంక్షలపై రహస్య దాడులు జరుగుతున్న సూచనలు గోచరిస్తున్నాయి.
- హంసినీ సహస్ర

నరరూప రాక్షసులు పాక్ సైనికులు

లాన్స్ నాయక్ హేమరాజ్, లాన్స్ నాయక్ సుధాకర్ సింగ్
పాకిస్తాన్ మరోసారి దుశ్చర్యకు తెగబడింది. అదనుచూసి దొంగదెబ్బ తీసింది. ఊహించడానికి వీలుకాని రీతిలో అత్యంత పాశవిక చర్యకు ఒడిగట్టింది. జనవరి 8వ తేదీన సరిహద్దుల్లో దేశ రక్షణ బాధ్యతల్లో నిమగ్నమైన ఇద్దరు భారత జవాన్లను అత్యంత కిరాతకంగా హత్య చేయించింది. పాకిస్తాన్ ముష్కర సైనికులు అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించి, మనదేశ సరిహద్దుల్లోకి జొరబడి హేమరాజ్, సుధాకర్ సింగ్ అనే ఇద్దరు జవాన్ల తలలు నరికారు. ఒక జవాను తలను తమవెంట తీసుకెళ్లారు. ఈ సంఘటనతో భారతజాతి యావత్తూ నిశ్చేష్ఠురాలైంది. అంతేకాదు, సరిహద్దుల్లో కొద్దిరోజులపాటు నిత్యం కాల్పులకు తెగబడింది.
నిద్రమత్తులో సర్కారు 
భారత ప్రభుత్వం మాత్రం ఇంతటి ఘోర పరిణామాలపై స్పందించేందుకు మీనమేషాలు లెక్కించింది. జవాన్లు హత్యకు గురై, సరిహద్దుల్లో తరచూ కాల్పుల ఘటనలు చోటుచేసుకున్న దాదాపు రెండు వారాల తరువాత తాపీగా స్పందించింది. అదీ స్వదేశంలో విపక్షాలు, సామాన్య పౌరులు, ప్రజా సంఘాల నుంచి పెల్లుబికిన నిరసనల తరువాత. అంతేగాక ఈ సంఘటనకు సంబంధించి పాకిస్తాన్ సైనికుల పాశవిక చర్యలపై ఆధారాలూ లభ్యమయ్యాయి. దీంతో ఈ కిరాతకం ఆపకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పాకిస్తాన్ ను గట్టిగా హెచ్చరించింది. అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ ను దోషిగా నిలబెట్టింది. దీంతో దాయాది దేశం తలవంచింది. పరిస్థితి అదుపు తప్పుతోందని భావించిన పాకిస్తాన్ నెమ్మదిగా రాజీకి వచ్చింది. నిజంగానే భారత్ కన్నెర్ర చేస్తే పరిస్థితులు చేజారిపోతాయన్న భయంతో అప్పటికైతే తమ సైనికులను వెనక్కి తగ్గాల్సిందిగా పాకిస్తాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంటే భారత్ పై కవ్వింపులకు పాల్పడుతున్నది వాస్తవమేనని పరోక్షంగా అంగీకరించింది. కానీ, భారత ప్రభుత్వం మాత్రం కంటితుడుపు చర్యలతో మమ అనిపించుకుంది. ఆ దేశంతో కుదుర్చుకున్న సులభతర వీసా ఒప్పందాన్ని నిలిపివేసింది. ఇటు శివసేన, బిజెపితో పాటు పలు సంస్థల నిరసనలకు తలొగ్గిన ప్రభుత్వం హాకీ ఇండియా లీగ్ నుండి 9 మంది పాకిస్తాన్ క్రీడాకారులను వారి దేశానికి పంపించింది.
దేశ సరిహద్దుల్లో పాక్ సైనికుల అక్రమాలను బలంగా ఎదుర్కొంటామని సైనికాధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజకీయ నిర్ణయం ఖరారైతే తప్ప ఏమీ చేయలేని స్థితిలో ఉన్నామన్న సంకేతాలు కేంద్రప్రభుత్వ ఉదాసీన వైఖరిని తేటతెల్లం చేస్తున్నాయి.
ఉల్లంఘన నిత్యకృత్యం 
సరిహద్దుల్లో గతేడాది నుంచి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ విచ్చలవిడిగా ఉల్లంఘిస్తోంది. భారత భూభాగంలో మందుపాతరలు పెట్టి పేల్చడాన్ని కూడా భారత సైన్యం ఆధారాలతో సహా నిరూపించింది. ఓ వైపు సైనికుల అమానుష హత్య తరువాత ఇరుదేశాల ఉన్నత సైన్యాధికారులు సమావేశమైన సమయంలో కూడా పాక్ సైన్యాలు సరిహద్దుల్లో మూడుచోట్ల కాల్పులకు పాల్పడటం వారి కండకావరానికి నిదర్శనంగా నిలుస్తోంది. భారత్ లోకి ఉగ్రవాదులను జొప్పించేందుకు పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలను భారత్ సమర్థవంతంగా ఎదుర్కోవడంతో, పాకిస్తాన్ నిస్పృహతో ఇటువంటి కుట్రలకు పాల్పడుతోందని సైనికాధికారులు అభిప్రాయపడుతున్నారు. 
- హంసినీ సహస్ర

నరరూప రాక్షసుల నెత్తుటి దాహం

నరరూప రాక్షసుల నెత్తుటి దాహం


భాగ్యనగరం దద్దరిల్లింది. నిలువెల్లా గాయమై వణికింది. ముష్కర చర్యకు మూగసాక్షిగా నిలిచింది. ఐదేళ్ల కిందటి అమానుష నెత్తుటి క్రీడకు మరోసారి వేదికైంది. ఆనాటి గోకుల్ ఛాట్. లుంబినీ పార్కు పేలుళ్లు ఇంకా కళ్లల్లో కదలాడుతుండగానే ముష్కర మూకలు దిల్ సుఖ్ నగర్ రద్దీ కూడలిలో జంట బాంబులు పేల్చి మరోసారి రక్తదాహాన్ని తీర్చుకున్నాయి. పదుల సంఖ్యలో సామాన్యులను క్షతగాత్రులుగా మార్చారు. ఎంతోమందిని అంగవికలురుగా మార్చేశారు. మొత్తానికి మానవత్వం తల్లడిల్లేలా అమానుష కాండకు తెగబడ్డారు. 

2013 ఫిబ్రవరి 21వ తేదీ రాత్రి 7 గంటల ఒక్క నిమిషం. నిత్యం మాదిరిగానే జనం ఎవరి హడావిడిలో వాళ్లున్నారు. కొందరు ఆఫీసుల్లో పనులు ముగించుకొని ఇళ్లకు తిరుగు పయనంలో ఉన్నారు. యువకులు కోచింగ్ క్లాసుల నుంచి హాస్టళ్లకు, రూములకు బయలు దేరారు. వాళ్లలో కొందరు అనారోగ్యంతో ఆస్పత్రి పనుల మీద వస్తే, మరికొందరు బంధువుల ఇళ్లకు వెళ్లే పనిలో ఉన్నారు. ఇంకొందరు అయితే అలా దారిలో వెళ్తున్నారు. వీళ్లెవరికీ మత విద్వేషాలు లేవు. ఎవరికీ ఎవరిమీదా పగ, ద్వేషం లేదు. ఉగ్రవాదులంటే ఎవరో కూడా చాలామందికి తెలియదు. అందరూ అమాయకులే. వాళ్లలో చాలామంది ఇక్కడే పుట్టిపెరిగిన వాళ్లు కాదు. ఏదో రాష్ట్ర రాజధాని కదా, అవకాశాలు, అవసరాల కోసం ఇక్కడికి వచ్చిన వాళ్లు. వాళ్లకు తెలిసి ఏ పాపం చేసి ఉండరు. కానీ! ఆ క్షణంలో ఆ పరిసరాల్లో ఉండటమే వాళ్లు చేసిన పాపం. ఒక్కసారిగా చెవులు చిల్లులు పడేలా శబ్దం. చుట్టుపక్కల కొద్ది దూరం వరకూ భారీ శబ్దం. ఏం జరిగిందో తెలియదు. కానీ ఏదో జరిగింది. అంతలోనే ఆర్తనాదాలు. అరుపులు కేకలు. నెత్తుటి ముద్దలై చెల్లాచెదురుగా పడిపోయిన మృతదేహాలు. అంత భయానక పరిస్థితుల్లోనూ సమీపంలో ఉన్న వాళ్లంఆ బాంబు పేలిన శబ్దం వచ్చిన వైపు పరుగులు తీశారు. ఏం జరిగిందో అర్థమయ్యేలోగానే, ఆ సమీపంలోనే మరో భారీ శబ్దం. పేలిన మరో బాంబు. అక్కడున్న కొద్దిమందిలో తప్ప చాలామందిలో వణుకుగానీ, జణుకుగానీ లేదు. చనిపోయిన వాళ్లు కళ్లముందే కనిపిస్తున్నారు. బీతావహ దృశ్యాలు కలచివేస్తున్నాయి. అయినా బాధతో అరుస్తున్న వాళ్లను రక్షించే యత్నం. దగ్గర ఏ వాహనం కనబడితే ఆ వాహనంలో క్షతగాత్రులను తీసుకొచ్చి పడేస్తున్నారు. మరోవైపు 108 వాహనాల్లోనూ ఇంకొందరు క్షతగాత్రుల తరలింపు. అంతా ఓ రకంగా సినీ ఫక్కీలో జరిగిపోయింది.

2007లో జరిగిన పేలుళ్ల సమయంలోనే దిల్ సుఖ్ నగర్ ను ఓ లక్ష్యంగా చేసుకున్నారు. ఉగ్రవాదులు, గోకుల్ చాట్, లుంబినీ పార్కుల్లో బాంబులు పేల్చిన తరువాత అదే తరహా బాంబును దిల్ సుఖ్ నగర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద ఇప్పుడు అమర్చినట్లే ఓ సైకిల్ కు బాంబును తగిలించారు టెర్రరిస్టులు. అయితే ఆ సమయంలో ఆ కూడలిలో ఉన్న వాళ్లెందరికో భూమిమీద నూకలు ఉండబట్టి ముందే పసికట్టారు. బాంబు నిర్వీర్య బృందం అక్కడ పెట్టిన బాంబును పేలకుండా చేయడంలో సఫలీకృతమైంది. నరరూప రాక్షసుల ఆ నెత్తుటి దాహం ఇప్పుడు ఇలా తీరింది. దిల్ సుఖ్ నగర్ లక్ష్యం పూర్తి అయింది.

ఈ బాంబు పేలుళ్ల ఘటన దేశవ్యాప్తంగా అలజడి సృష్టించింది. జాతీయ భద్రతా దళాలు దర్యాప్తు రంగంలోకి దిగాయి. ఘటన జరిగిన కాసేపటికే రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను పరామర్శించారు. ఇంకోవైపు ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా హైదరాబాద్ కు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. అయితే.. ఇవన్నీ చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా తయారయ్యాయని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పేలుళ్లకు అవకాశాలున్నట్లు తాము ముందే హెచ్చరించామని కేంద్రం చెబితే, అవి నిత్యం వచ్చే సాదారణ హెచ్చరికలుగా భావించామని రాష్ట్రం చెబుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేదనే విషయం ఇలా అనేక సందర్భాలలో ఋజువయ్యింది. ఇప్పుడు కూడా అదే కనబడుతోంది. ఉగ్రవాద నిర్మూలన వంటి అతి భయంకర జాతీయ సమస్యపై కూడ ఇలా పొంతన లేనితనంతో వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వాలను ప్రజలు నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- హంసినీ సహస్ర