3, నవంబర్ 2015, మంగళవారం

సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు

 

        506 రోజుల పాటు సాగిన చెరకు తెరపడింది. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతికి సంకెళ్లు తెగిపోయాయి. తెలంగాణలో కొనసాగిన అనధికార నిషేధంపై సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ప్రసారాలను తక్షణమే పునరుద్ధరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎంఎస్‌వోలు, తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లను సుప్రీంకోర్టు ఆదేశించింది. అవసరమైతే కేబుల్‌ ఆపరేటర్లకు రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీచేసింది.

          సుప్రీంకోర్టు సమ్మెట దెబ్బకు.. సంకెళ్లు పటాపంచలయ్యాయి. అధికారం అండతో కేబుల్‌ ఆపరేటర్లను బెదిరించి అధికార పార్టీ హరించిన స్వేచ్ఛ మళ్లీ రెక్కలు విచ్చుకుంది. తెలంగాణలో ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ప్రసారాలపై కేసీఆర్‌ సర్కారు విధించిన దొడ్డిదారి నిషేధానికి తెరపడింది. ఏబీఎన్‌ ప్రసారాలనుపునరుద్ధరించి తీరాలని భారత సర్వోన్నత న్యాయస్థానం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, ఎంఎస్‌వోలను, తెలంగాణలోని పది జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ వేదికగానే చానెళ్లపై మండిపడిన వైనమే సర్కారీ తంత్రానికి నిదర్శనమని మందలించింది. ఎంఎస్‌వోల వెనుక ఉండి ఏబీఎన్‌ ప్రసారాలను నిలిపివేసింది ప్రభుత్వమే అని అభిప్రాయపడింది. తెలంగాణ ప్రభుత్వం ప్రోద్భలంతోనే ఎంఎస్‌వోలు చానెల్‌ ప్రసారాలు నిలిపివేశారంటూ ఏబీఎన్‌ దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను జస్టిస్‌ జగదీష్‌సింగ్‌ ఖేహార్‌, జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్‌, జస్టిస్‌ కురియన్‌ జోసఫ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. వాడివేడిగా సాగిన వాదనలను విన్న అనంతరం... తెలంగాణలో ఏబీఎన్‌ - ఆంధ్రజ్యోతి ప్రసారాలను పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం విస్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే... గత ఏడాది జూన్‌ 16వ తేదీన ఏబీఎన్‌ ప్రసారాలను నిలిపివేశారని చానల్‌ తరఫు న్యాయవాదులు గంగూలీ, జి.ప్రభాకర్‌ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ప్రసారాలు చేసిందనే సాకుతో.. ఏకపక్షంగా ఎంఎస్‌వోలపై ఒత్తిడి తెచ్చి ఏబీఎన్‌ను నిలిపి వేశారని అన్నారు. ఎంఎస్‌వోలపై ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తెచ్చినందుకే చానల్‌ ప్రసారాలు నిలిపివేశారని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. గతంలో జీ టెలీఫిలిమ్స్‌ లిమిటెడ్‌ వర్సెస్‌ కేంద్ర ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గంగూలీ ఉటంకించారు. చానల్‌ ప్రసారాలను నిలిపివేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని, కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌ (నియంత్రణ) చట్టం, 1995 ప్రకారం ఎంఎస్‌వోలకు ఆ అధికారం లేదని వాదించారు. దీంతో.. చానల్‌ను నిషేధించడమంటే ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని కోర్టు అభిప్రాయపడింది. వెంటనే చానల్‌ ప్రసారాలను పునరుద్ధరించాలని ధర్మాసనం అదేశించింది. అవసరమైతే ఎంఎస్‌వోలకు రక్షణ కల్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి, డీజీపీకి, సీఎస్‌కి ఆదేశాలిచ్చింది.

          సందర్భం వచ్చినప్పుడల్లా నిషేధంతో తమకేమీ సంబంధం లేదని చెప్పుకుంటున్న తెలంగాణ సర్కారుకు సుప్రీం మొట్టికాయ వేసింది. సర్వోన్నత న్యాయస్థానంలోనూ మాకు సంబంధం లేదన్న తెలంగాణ సర్కారు తరపు న్యాయవాది వాదనపై ధర్మాసనం మండిపడింది. చానెల్‌ ప్రసారాలు నిలిపివేయాలని స్వయంగా ముఖ్యమంత్రే అసెంబ్లీ వేదికగా చెప్పారని, ఎంఎస్‌వోలపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని అంతకంటే నిదర్శనం ఏం కావాలని జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్‌.. తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. హైకోర్టులో ఎంఎస్‌వోలు సమర్పించిన అఫిడవిట్‌లోనూ అదే అంశాన్ని ప్రస్తావించారని న్యాయస్థానం గుర్తు చేసింది. కేంద్రప్రభుత్వం తరపు న్యాయవాది కిరణ్‌ సూరి కూడా అసలు గుట్టు విప్పారు. అక్రమంగా చానెళ్ల ప్రసారాల నిలిపివేతపై 2014 జూలై 17వ తేదీనే కేంద్ర ప్రభుత్వం 37 మంది ఎంఎస్‌వోలకు నోటీసులు జారీచేసిందని, రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే తాము ఏబీఎన్‌ ప్రసారాలు నిలిపివేసినట్లు చాలామంది ఎంఎస్‌వోలు కేంద్రానికి తెలియజేశారని చెప్పారు. ఏబీఎన్‌ ప్రసారాలు పునరుద్ధరిస్తే తమపై దాడి జరిగే అవకాశం ఉందని ఎంఎస్‌వోలు హైకోర్టుకు వెల్లడించిన విషయాన్ని కూడా ఏబీఎన్‌ తరపు న్యాయవాది గంగూలీ సుప్రీం దృష్టికి తెచ్చారు.  సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చినదే తుది తీర్పు అని ఏబీఎన్‌ తరపు న్యాయవాది గుంటూరు ప్రభాకర్‌ తేల్చిచెప్పారు. తక్షణమే ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ప్రసారాలు పునరుద్ధరించాల్సి ఉంటుందన్నారు. ఈ తీర్పుపై ఎవరూ, ఎక్కడాఅప్పీల్‌ చేసే అవకాశం కూడా లేదన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి