పంచాంగ పీఠిక
కలియుగ ప్రమాణము 4 లక్షల 32 వేల సంవత్సరములు. శ్వేత వరాహకల్పమునందలి ఏడవదైన వైవస్వత మన్వంతరములోని 28వ మహాయుగమునందలి కలియుగ ప్రథమ పాదములో 5115వది, ప్రభవాది 60 సంత్సరాలలో 28వది యైన ఈ సంత్సరమును చాంద్రమానమున స్వస్తిశ్రీ జయ నామ సంవత్సరంగా చెప్పబడుతున్నది.కలియుగ శతాబ్దములు – 5115
శ్రీ ఆది శంకరాచార్యాబ్దములు – 2085
శాలివాహన శతాబ్దములు – 1936
ఫసలీ శతాబ్దములు – 1422– 23
హిజరీ శతాబ్దములు – 1434 – 35
శ్రీ రామానుజాబ్దములు – 997
క్రీస్తు శకము – 2014-15
రాజాధి నవనాయక నిర్ణయం.
మన
ప్రభుత్వాలకు ఎలా అయితే మంత్రి మండలి ఉంటుందో, ప్రతి సంవత్సరానికి అలా
రాజాధి నవ నాయకులు ఉంటారు. ఈ జయ నామ సంవత్సరానికి రాజు మరియు మంత్రి
చంద్రుడు, సేనాధిపతి, అర్ఘాధిపతి మరియు మేఘాధిపతి సూర్యుడు, సస్యాధిపతి
మరియు నీరసాధిపతి బుధుడు, రసాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి కుజుడు.జయ నామ సంవత్సర ఫలం
రాజు మరియు మంత్రి చంద్రుడు అవటం వలన ఈ సంవత్సరం పరిపాలనలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. చంద్రుడు మార్పులకు, అస్థిరత కు కారకుడు కాబట్టి పాలకుల విషయంలో, నిర్ణయాల విషయంలో ఈ విధమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నది. అహారోత్పత్తులు పెరుగుతాయి కానీ ధరలు నిలకడగా ఉండవు. గోధుమలు, వరి, చెరుకు పంటలు అధికంగా పండుతాయి. ప్రజలకు విద్యావిషయాలపైన ఆసక్తి పెరుగుతుంది.
సూర్యుడు సేనాధిపతి అయినందున రాజుల మధ్య యుద్ధకాంక్ష పెరిగి పరస్పరం యుద్ధాలకు దిగుతారు. ఎరుపు రంగు ధాన్యం అధికంగా పండుతుంది. వర్షపాతం తక్కువగా ఉంటుంది. సూర్యుడు అధికారానికి, దర్పానికి కారకుడు కాబట్టి పాలకుల మధ్య అధికార దాహం పెరిగి పోతుంది, తద్వారా ప్రభుత్వ సుస్థిరత దెబ్బతినే అవకాశం ఉంటుంది. రవి అర్ఘాధిపతి అవటం వలన ధరలు తగ్గుముఖం పడతాయి. వర్షపాతం తక్కువగా ఉంటుంది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సరైన అవగాహన ఉండక పోవటం వలన సమ్మెలు లేదా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు ప్రజలు దిగే అవకాశం ఉంటుంది. మేఘాధిపతి కూడా సూర్యుడే అవటం మూలాన ఈ సంవత్సరం వర్షపాతం తక్కువగా ఉంటుంది. అయితే శుభ పరిణామం ఏమిటి అంటే తుపాన్ లు కానీ, పంట నష్టం కలిగించే అకాల వర్షాలు కానీ ప్రజలను బాధించవు.
ఈ సంవత్సరం సస్యాధిపతి బుధుడు అవటం మూలాన పెసర్లు మొదలైన ఆకు పచ్చని ధాన్యాలు అధికంగా పండుతాయి. వర్షపాతం తక్కువగా ఉండుంది. గాలులు అధికంగా వీస్తాయి. ఈ గాలుల కారణంగా కొంత పంట నష్టం జరిగే అవకాశం ఉంటుంది. నీరసాధిపతి కూడా బుధుడే అవటం మూలాన వివిధ రకములైన ధాన్యములు సమృద్ధిగా పండుతాయి.
ఈ సంవత్సరం శుక్రుడు రసాదిపతి అవటం మూలాన క్షార వస్తువులు, కంద మూలాలు, రస వస్తువులు అధికంగా ఉత్పత్తి జరుగుతాయి. గృహోపకరణాల కొనుగోళ్లు, విలాస వస్తువుల కొనుగోళ్లు పెరుగుతాయి.
ధాన్యాధిపతి కుజుడు అవటం మూలాన కందులు, పల్లి, గోధుమలుమొదలైన ఫంటలు అధికంగా పండుతాయి. ఎర్రనేలల్లో దిగుబడి అధికంగా వస్తుంది. ధరల్లో ఆకస్మిక పెచ్చుతగ్గులుంటాయి. కొనుగోళ్లు పెరుగుతాయి.
ఈ సంవత్సరం గురువుకు దేనిపైన కూడా ఆధిపత్యం రాలేదు. ఇది కొంత ఆందోళన కలిగించే అంశం. దీని కారణంగా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సమన్వయం ఉండక పోవటం అలాగే ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తి పెరగటం జరగవచ్చు.
మేషాధి రాశులకు ఆదాయ, వ్యయాది నిర్ణయం
రాశులు | ఆదాయం | వ్యయం | రాజపూజ్యం | అవమానం |
మేషం | 14 | 2 | 4 | 5 |
వృషభం | 8 | 11 | 7 | 5 |
మిథునం | 11 | 8 | 3 | 1 |
కర్కాటకం | 5 | 8 | 6 | 1 |
సింహం | 8 | 2 | 2 | 4 |
కన్య | 11 | 8 | 5 | 4 |
తుల | 8 | 11 | 1 | 7 |
వృశ్చికం | 14 | 2 | 4 | 7 |
ధనుస్సు | 2 | 11 | 7 | 7 |
మకరం | 5 | 5 | 3 | 3 |
కుంభం | 5 | 5 | 6 | 3 |
మీనం | 2 | 11 | 2 | 6 |
గమనిక: ఇవి కేవలం స్థూలంగా సంవత్సర శుభాశుభాలనే చెపుతుంది తప్ప మనకు వచ్చే ఆదాయ, వ్యయాలు కాదని మనవి.
నక్షత్రం | కందాయం |
అశ్విని | 4-2-1 |
భరణి | 7-0-3 |
కృత్తిక | 2-1-0 |
రోహిణి | 5-2-2 |
మృగశిర | 0-0-4 |
ఆరుద్ర | 3-1-1 |
పునర్వసు | 6-2-3 |
పుష్యమి | 1-0-0 |
ఆశ్రేషా | 4-1-2 |
మఖ | 7-2-4 |
పుబ్బ | 2-0-1 |
ఉత్తర | 5-1-3 |
హస్త | 0-2-0 |
చిత్త | 3-0-2 |
స్వాతి | 6-1-4 |
విశాఖ | 1-2-1 |
అనురాధ | 4-0-3 |
జ్యేష్ట | 7-1-0 |
మూల | 2-2-2 |
పూర్వాషాఢ | 5-0-4 |
ఉత్తరాషాఢ | 0-1-1 |
శ్రవణం | 3-2-3 |
ధనిష్టా | 6-0-0 |
శతభిషం | 1-1-2 |
పూర్వాభాద్ర | 4-2-4 |
ఉత్తరాభాద్ర | 7-0-1 |
రేవతి | 2-1-3 |
శ్రీ జయనామ సంవత్సర రాశి ఫలాలు (2014-15)
(పుట్టిన నక్షత్రం ఆధారంగా)
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1 పాదం) ఆదాయం – 14 వ్యయం – 2
రాజపూజ్యం – 5 అవమానం- 5
ఈ ఏడాది మేషరాశి వారు వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలమైన మార్పులు చోటుచేసుకుంటాయి. స్థిర, చరాస్తులు పెంపొందించుకుంటారు. కాంట్రాక్టులు, ఒప్పందాలు లాభిస్తాయి. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. స్నేహ, బాంధవ్యాలు పెంపొందుతాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేందుకు అనుకూలం. వృత్తిపరంగా స్థానచలనానికి అవకాశం వుంది. న్యాయ, రాజకీయ, ప్రచురణ, మార్కెటింగ్, రవాణా, కన్సల్టెన్సీ, ఏజెన్సీలు, విద్యారంగంలోని వారికి ప్రోత్సాహకరం. డిసెంబర్ 9 నుంచి ఉగాది వరకు గురువు వక్రించిన కారణంగా విద్యార్థుల్లో అశ్రద్ధ పెరుగుతుంది. వాహనాలు నడిపే సందర్భంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఏడాది గురు గ్రహం జూన్ 18 వరకు మిథునంలో, ఆ తరువాత కర్కాటకంలో సంచరిస్తుంది. ఫలితంగా దూరప్రయాణాలకు అనుకూలం. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. సోదరీసోదరుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బదిలీలకు అనుకూలం సమయం. వాహనాల కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో మార్పులు చేర్పుల వల్ల ప్రయోజనాలు సాధిస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో మాత్రం కొంత జాగ్రత్త అవసరం. గృహారంభం, గృహప్రవేశాలకు అనుకూలం. స్థలసేకరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వారసత్వ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. గురువు వక్రించిన జనవరి నుంచి మార్చి వరకు, ఆ తరువాత డిసెంబర్ మాసంలో వృత్తి, వ్యాపారాల్లో కొంత నిరుత్సాహకంగా వుంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. కుటుంబ విషయాల్లో కొన్ని చిక్కులు ఎదురవుతాయి. సోదరీసోదరుల విషయాల్లో మాటపడాల్సి రావచ్చు. శని ఈ ఏడాది నవంబర్ 2 వరకు తులలో, సంవత్సరాంతం వరకు వృశ్ఛికంలో సంచారం చేస్తాడు. ఫలితంగా ప్రత్యర్థులు సైతం మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు. బకాయిలు వసూలవుతాయి. దాంపత్యం సంతోషదాయకంగా సాగుతుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాల్లో సమస్యలు తలెత్తే అవకాశం వుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఉగాది నుంచి జూలై 20 వరకు శని వక్రించినందున ప్రత్యర్థుల విషయంలో అప్రమత్తంగా వుండాలి. శ్రీవారు, శ్రీమతి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. సకాలంలో డబ్బు చేతికి అందక ఇబ్బంది పడతారు. 7,6 స్థానాల్లో రాహు సంచారం కారణంగా వృత్తి వ్యాపారాల్లో చికాకులు అధికం. కృషికి తగిన ఫలితం అందక నిరుత్సాహ పడతారు. షేర్ల లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. భాగస్వాములతో అనుబంధాలు బెడిసికొట్టే అవకాశం వుంది. ఆరోగ్యం మందగిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారు ఆచితూచి అడుగు వేయాలి. కేతువు 1, 12 స్థానాల్లో సంచరించడం వల్ల అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆర్థికంగా ప్రోత్సాహకరంగా వున్నప్పటికీ డబ్బు చేతిలో నిలవదు. ఆర్థిక విషయాల్లో ఆలోచించి ముందడుగు వేయాలి. ఆర్థిక విషయాల్లో మధ్యవర్తిత్వం తగదు. రుణాలు ఇస్తే తిరిగి రావడం కష్టం. ఆంజనేయ స్వామి ఆరాధన ఈ సంవత్సరం సత్ఫలితాలను ఇస్తుంది.
వృషభం (కృత్తిక 2,3,4 రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
ఆదాయం – 8 వ్యయం – 11
రాజపూజ్యం – 7 అవమానం- 5
గురు, శని, రాహుకేతువులు సంచారం ఆధారంగా వృషభ రాశి వారికి ఈ ఏడాది ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా వుంటుంది. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తారు. ప్రమోషన్‌లపై వేరే ప్రాంతాలకు వెళ్లే అవకాశం వుంది. ఉద్యోగం చేసుకుంటూ అదనపు ఆదాయం కోసం మరేదైనా ప్రాజెక్టు చేపట్టే అవకాశం వుంది. ఆస్తి వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. రుణ సమస్యలు తొలగిపోతాయి. విద్యార్థులు పట్టుదలతో కృషి చేసి సత్ఫలితాలు సాధిస్తారు. వ్యవసాయం, పరిశ్రమలు, వైద్యం, హోటల్ రంగాల వారు అదనపు బాధ్యతలు తలెత్తుకోవాల్సి వస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. 2,3 స్థానాల్లో గురుగ్రహ సంచారం కారణంగా ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా వుంటుంది. స్థిర, చరాస్తులు, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. అనుబంధాలు బలపడతాయి. కుటుంబం విస్తరిస్తుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలకు, ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశం ఉంది. దానధర్మాలకు, ఆధ్యాత్మిక విషయాలకు ఖర్చు చేస్తారు. బోధకులు, శాస్త్రవేత్తలు, వస్త్రాభరణ వ్యాపారులు, రాజకీయ, కళాసారస్వత రంగాలలోని వారికి ఆదాయం పెరుగుతుంది. విద్యాసంస్థలు, కన్సల్టెన్సీ, ఏజెన్సీల వారికి శుభప్రదం. జూన్ 19 నుంచి నుంచి సోదరులు, సన్నిహితులతో సదవగాహన ఏర్పడుతుంది. సంకల్పించిన పనులు పూర్తవుతాయి. ప్రభుత్వ సంస్థలు, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకర సమయం. స్వల్ప సమస్యలు ఎదురైనప్పటికీ ఏకాగ్రతతో పనులు పూర్తి చేస్తారు. ఈ ఏడాది 6, 7 స్థానాల్లో శని సంచారం కారణంగా పని ఒత్తిడి అధికం అవుతుంది. అదనపు బాధ్యతలు మోయాల్సి వస్తుంది. పైఅధికారుల నుంచి చిక్కులు ఎదురవుతాయి. అయితే కష్టపడి పనిచేసి గుర్తింపు తెచ్చుకుంటారు. చేపట్టిన పనులు బాధ్యతతో పూర్తి చేస్తారు. రుణాలు ఇచ్చిపుచ్చుకోవడంలో జాగ్రత్త అవసరం. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్య విషయంలో చిన్నపాటి చికాకులు ఎదురయ్యే అవకాశం వుంది. శస్త్ర చికిత్స అవసరం కావచ్చు. భారీ స్థాయిలో వ్యాపారాలు చేసేందుకు, కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి అనుకూల సమయం కాదు. మనసు చికాకుగా వుంటుంది. రావలసిన డబ్బు సకాలంలో అందక ఇబ్బంది పడతారు. సంవత్సరాంతంలో భాగస్వామి విషయాల్లో చిక్కులు ఎదురౌతాయి. శని వక్రగమనంలో వున్న ఉగాది నుంచి జూలై వరకు వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా వుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారికి శుభప్రదం. 6,5 స్థానాల్లో రాహు సంచారం కారణంగా విద్యార్థులు అశ్రద్ధ కారణంగా నష్టపోతారు. ఆరోగ్యం మందగిస్తుంది. ప్రేమ వ్యవహారాలు బెడిసికొడతాయి. విదేశీయాన ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. 12, 11 స్థానాల్లో కేతుగ్రహ సంచారం కారణంగా ఈ ఏడాది ఖర్చులు అంచనాలు మించుతాయి. తీర్థయాత్రలు, విహారయాత్రల పట్ల ఆసక్తి చూపిస్తారు. గృహనిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. షేర్ల లావాదేవీలు లాభాలనిస్తాయి. ఈశ్వరుడిని ఆరాధించడం వల్ల ఈ ఏడాది శుభఫలితాలు సాధిస్తారు.
మిథునం (మృగశిర 3,4 ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
ఆదాయం – 11 వ్యయం – 8
రాజపూజ్యం – 3 అవమానం- 1
మిథునం వారికి ఈ ఏడాది ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా వుంటుంది. వ్యక్తిగత ప్రతిష్ఠ పెరుగుతుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. ప్రమోషన్లు, బదిలీలకు అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. జీతభత్యాలు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సృజనాత్మక ప్రతిభతో వినూత్నమైన ప్రాజెక్టులు చేపడతారు. గృహనిర్మాణం, స్థలసేకరణకు అనుకూలం. ప్రముఖులతో పరిచయాలు పురోగతికి ఉపయోగపడతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగం చేసుకుంటూ అదనపు అర్హతలు సంపాదించేందుకు ప్రయత్నిస్తారు. ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. వైవాహిక జీవితంలో చికాకులు తొలగిపోయి ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. రాజకీయ సినీరంగాల వారికి ప్రోత్సాహకరం. డిసెంబర్ నుంచి నాలుగు మాసాల పాటు గురువు వక్రించినందున ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. అలర్జీలు బాధిస్తాయి. శుభాలనిచ్చే గురుగ్రహం ఈ ఏడాది జూన్ 18 వరకు మీ జన్మరాశిలోనూ ఆ తరువాత 2వ రాశిలోనూ సంచరిస్తున్నది. ఫలితంగా గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆత్మ విశ్వాసంతో అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారు. మీ మాట చెల్లుబాటు అవుతుంది. చక్కని ఆలోచనలు స్ఫురిస్తాయి. నూతన పథకాలకు కార్యరూపం ఇవ్వగలుగుతారు. సంతతి విషయంలో శుభపరిణామాలు సంభవం. విద్య, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల వారికి పురోగతి కనిపిస్తుంది. ఆదాయంలో అభివృద్ధి కనిపిస్తుంది. స్థిర, చరాస్తులు, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. అనుబంధాలు బలపడతాయి. కుటుంబం విస్తరిస్తుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలకు, ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశం ఉంది. దానధర్మాలకు, ఆధ్యాత్మిక విషయాలకు వెచ్చిస్తారు. కన్సల్టెంట్లు, టీచర్లు, శాస్త్రవేత్తలు, వస్త్రాభరణ వ్యాపారులు, రాజకీయ, కళా సారస్వత రంగాలలోని వారికి ఆదాయం పెరుగుతుంది. 5,6 స్థానాల్లో శని కారణంగా చదువుల పట్ల శ్రద్ధ చూపిస్తారు. ఉన్నత విద్యా విషయాలకు అనుకూలం. స్నేహబాంధవ్యాలు, ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. స్నేహాల వల్ల చదువుల పట్ల కొంత అశ్రద్ధ చూపే అవకాశం వుంది. స్థిరచరాస్తి విషయాల్లో చికాకులు తలెత్తే అవకాశం వుంది. ప్రేమ వ్యవహారాల్లో చిక్కులు, ఆటంకాలు ఎదురైనా ఓరిమితో అందరినీ ఒప్పించి అభీష్ఠ సిద్ధి కోసం ప్రయత్నిస్తారు. శని వక్రించిన ఏప్రిల్ – జూలై మాసాల మధ్య ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సన్నిహితులు కూడా శత్రువులుగా మారే అవకాశం వుంది. చిన్నారులు, ప్రియతముల ప్రవర్తన మనస్తాపం కలిగిస్తుంది. సంతానం విషయంలో ప్రతికూలం ఎదురవుతుంది. 5,4 స్థానాల్లో రాహు సంచారం చేస్తున్న కారణంగా చదువులపై అశ్రద్ధ పెరుగుతుంది. ప్రేమ విషయాల్లో చికాకులు ఎదురవుతాయి. రుణబాధలు పెరుగుతాయి. ఆస్తి తగాదాల వల్ల చిక్కులు ఎదుర్కొంటారు. కుటుంబ పరమైన ఒత్తిళ్ల కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. 11,10 స్థానాల్లో కేతుగ్రహ సంచారం కారణంగా ఉద్యోగ ప్రయత్నాలు నిదానంగా ఫలిస్తాయి. ఆర్థిక స్థిరత్వం లోపిస్తుంది. విలాసాలు, ప్రయాణాలకు ఖర్చులు అధికం. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ సంవత్సరం శుభఫలితాలను ఇస్తుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆదాయం – 5 వ్యయం – 8
రాజపూజ్యం – 6 అవమానం- 1
కర్కాటక వారికి ఈ ఏడాది వృత్తి, వ్యాపారాల్లో అనుకూలంగా వుంటుంది. ప్రమోషన్లు అందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయ. విదేశీ గమనం, ఉన్నత విద్యాభ్యాస ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రమోషన్ మీద వేరే చోటకు బదిలీ అవుతారు. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు, చేర్పులకు అనుకూలం. స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే డిసెంబర్ 9 నుంచి నాలుగు మాసాల పాటు గురువు వక్రించినందున ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా వుంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని చిక్కులు ఎదురవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. 12-1 స్థానాల్లో గురు సంచారం ఫలితంగా పొరుగు రాష్ట్రాలు, విదేశీ గమనానికి, విదేశాలలో చదువులకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తుల మూలంగా ఆదాయం లభిస్తుంది. మీ లక్ష్యసాధనలో గత అనుభవం తోడ్పడుతుంది. పుణ్యకార్యాలు, తీర్థయాత్రలకు, పరోపకారాలకు ఖర్చు చేస్తారు. ఆధ్యాత్మిక దృక్పథం అలవడుతుంది. జూన్ నుంచి మీ వైఖరిలో మార్పు వస్తుంది. గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. విశ్వాసంతో అనుకున్న పనులు నిరాటంకంగా పూర్తిచేయగలుగుతారు. కొత్తఆలోచనలు స్ఫురిస్తాయి. నూతన పథకాలకు కార్యరూపం ఇవ్వగలుగుతారు. రాజకీయ, విద్యా రంగాల వారు, సినీరంగంలోనివారు, కన్సల్టెంట్‌లు, కళా, సాహిత్య రంగాలు, ట్రావెల్ ఏజెన్సీ నిర్వాహకులు, ఎగుమతులు, దిగుమతుల రంగాల వారికి శుభప్రదం. సంతతి విషయంలో శుభపరిణామాలు సంభవం. డిసెంబర్ నుంచి ప్రయాణాల్లో అసౌకర్యం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. చదువుల పట్ల శ్రద్ధ చూపించాలి. విలాసాలకు ఖర్చులు అధికం. బోధన, రాజకీయ, కళాసాంస్కృతిక రంగాలు, సినిమా, ఫొటోగ్రఫీ, రంగాలవారికి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. నవంబర్ 2 వరకు శని 4వ స్థానంలో, ఆ తరువాత 5వ స్థానంలో సంచారం చేస్తాడు. ఫలితంగా పెద్దలు అనారోగ్యం పాలవుతారు. ముఖ్యంగా తల్లి ఆరోగ్యం మందగిస్తుంది. ఆస్తి విషయంలో చికాకులు తలెత్తుతాయి. కుటుంబంలో కలతలు ఎదురవుతాయి. భూ క్రయవిక్రయాల్లో అన్ని విషయాలూ సరిచూసుకుని అగ్రిమెంట్లు కుదుర్చుకోవాలి. వాహనాలు నడిపేవారు జాగ్రత్తగా ఉండాలి. భూమిపరమైన వివాదాలు చోటుచేసుకునే అవకాశం వుంది. శని వక్రగమనంలో ఉన్న ఏప్రిల్ – జూన్ మాసాల మధ్య పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆస్తి విషయంలో సమస్యలు పరిష్కారమవుతాయి. గృహారంభ, ప్రవేశాలకు అనుకూలం. రాహు, కేతువుల సంచారం వల్ల బదిలీలు అసంతృప్తి కలిగిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల చిరాకులు పెరుగుతాయి. ఖర్చులు అంచనాలు మించుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు నెమ్మదిగా నెరవేరతాయి. పై అధికారుల నుంచి ఒత్తిళ్లు ఎదురవుతాయి. విదేశీ ప్రయత్నాలకు ఆటంకాలు తప్పకపోవచ్చు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపార రంగంలో వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నష్టపోయే అవకాశం వుంది.నృసింహ స్వామి ఆరాధన శుభప్రదం.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదము)
ఆదాయం – 8 వ్యయం – 2
రాజపూజ్యం – 2 అవమానం- 4
సిింహ రాశి వారికి ఈ ఏడాది అన్నివిధాలా లాభదాయకంగా వుంటుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తుంది. జీవితం ఆనందమయంగా సాగుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగంలో స్థిరత్వం సాధిస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. వినోద, విలాసాలకు సమయం వెచ్చిస్తారు. దంపతుల మధ్య సదవగాహన నెలకొంటుంది. డిసెంబర్ 9 నుంచి సంవత్సరాంతం వరకు గురువు వక్రించిన కారణంగా ఆర్థిక వ్యవహారాల్లో నిరుత్సాహకరంగా ఉంటుంది. బృంద కార్యక్రమాల్లో అనవసరమైన ఖర్చులు అధికం. మనశ్శాంతి లోపిస్తుంది. విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ధ లోపిస్తుంది. గురువు ఈ ఏడాది లాభ, వ్యయ స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఫలితంగా ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంకల్పం సిద్ధిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. వ్యాపార విస్తరణకు అనుకూలం. పిల్లల విషయంలో అభివృద్ధికి, శుభకార్యాలకు అవకాశం ఉంది. వివాహ యత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక, విద్య, వైజ్ఞానిక, ప్రచురణలు, ప్రకటనలు, బోధన, న్యాయ, సినీ, రాజకీయ రంగాలలో ఉన్నవారికి ప్రోత్సాహం లభిస్తుంది. స్నేహ సంబంధాలు విస్తరిస్తాయి. విదేశీ గమనానికి, విదేశాలలో చదువులకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. టెక్స్‌టైల్స్, చలనచిత్రాలు, మత్స్య, రవాణా, టైల్స్, ఫొటోగ్రఫీ రంగాల వారికి ప్రోత్సాహకరం. జయనామ సంవత్సరం చివరి ఐదు మాసాలు గురువు వక్రించినందున ఈ కాలంలో పెద్దవారి ఆరోగ్యం మందగిస్తుంది. స్నేహానుబంధాలు బెడిసికొట్టే అవకాశం వుంది. వృత్తి, వ్యాపారాల్లో ప్రయోగాలకు దూరంగా వుండాలి. ఖర్చులు అంచనాలు మించుతాయి. ఈ ఏడాది శని 3, 4 స్థానాల్లో లో సంచారం చేస్తాడు. ఫలితంగా సోదరీ, సోదరులు, సన్నిహితుల బాధ్యతలు మోయాల్సి రావచ్చు. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం మందగించే అవకాశం ఉంది. కుటుంబపరమైన గొడవలు తలెత్తుతాయి. అశాంతికి లోనవుతారు. చదువుల పట్ల శ్రద్ధ లోపించటం వల్ల సత్ఫలితాలు సాధించలేకపోతారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగంలో మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. పెట్టుబడుల్లో జాగ్రత్త వహించాలి. ఇల్లు మరమ్మత్తు పనులకు ఖర్చులు అధికం. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కివస్తాయి. శని వక్రగమనంలో వుండే ఏప్రిల్ – జూలై మాసాల మధ్య పట్టుదలతో కృషి చేసి చదువుల్లో రాణిస్తారు. వృత్తి, వ్యాపారాలకు సంబంధించి అనుకూల సమాచారం అందుకుంటారు. కుటుంబం, ఆస్తులు, ఆరోగ్య విషయాల్లో కొంత మెరుగైన వాతావరణం కనిపిస్తుంది. 3,2 స్థానాల్లో రాహువు, 9,8 స్థానాల్లో కేతువు సంచారం వల్ల బదిలీల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒత్తిళ్లు అధికం. సమయానికి డబ్బు చేతికి అందక ఇబ్బంది పడతారు. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. సూర్య గ్రహ ఆరాధన వల్ల ఈ సంవత్సరం సత్ఫలితాలు చేకూరుతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2 పాదాలు)
ఆదాయం – 11 వ్యయం – 8
రాజపూజ్యం – 4 అవమానం- 5
కన్యా రాశిలో పుట్టిన వారు ఈ ఏడాది వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ప్రమోషన్లు, ఉన్నత పదవులకు అవకాశం ఉంది. ఆర్థిక విషయాలపై ఎక్కువగా దృష్టి సారిస్తారు. రాజకీయ, ప్రభుత్వ, సహకార రంగాలకు చెందిన వారికి ప్రోత్సాహకరం. ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. అనుబంధాలు బలపడతాయి. చిన్నారులు, ప్రియతముల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. వైవాహిక జీవితం ఉల్లాసంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శత్రువు కూడా మిత్రులవుతారు. డిసెంబర్ నుంచి నాలుగు మాసాల పాటు గురువు వక్రించినందున పెద్దల ఆరోగ్యం కలవర పెడుతుంది. వృత్తి వ్యాపారాల్లో బాధ్యతలు అధికం అవుతాయి. రుణబాధలు ఎక్కువ అవుతాయి. ప్రియతముల మధ్య ఎడబాట్లు తప్పవు. స్థలమార్పిడి అవకాశాలు అధికం. పెట్టుబడులు ఆశించనంతగా లాభించకపోవచ్చు. మనశ్శాంతి లోపిస్తుంది. విస్తరణ కారకుడైన గురువు ఈ ఏడాది మీ 10,11 స్థానాల్లో సంచరిస్తున్నాడు. కాబట్టి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార రంగంలోని వారికి ఊహించన విధంగా లాభాలు వస్తాయి. అధికారం, హోదా, గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. పలుకుబడిగలవారు, ఉన్నత పదవులలో ఉన్నవారు మీ వృత్తి, ఉద్యోగాలలో సహకరిస్తారు. తల్లిదండ్రుల విషయంలో శుభ పరిణామాలు కనిపిస్తాయి. రాజకీయ రంగంలోని వారికి ఉన్నత పదవులు, గౌరవ, కీర్తిప్రతిష్ఠలు లభిస్తాయి. ప్రకటనలు, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక, న్యాయ, బోధనా రంగాలలోని వారికి, కన్సల్టెంట్లు, రాజకీయ నాయకులు, జ్యుయలరీ వ్యాపారులకు శుభప్రదం. లాభస్థానంలో గురు సంచారం వల్ల ఆదాయం, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంకల్పం సిద్ధిస్తుంది. పిల్లల విషయంలో అభివృద్ధికి, శుభకార్యాలకు అవకాశం ఉంది. వివాహ యత్నాలు ఫలిస్తాయి. గృహారంభ, ప్రవేశాలకు అనుకూలం. గురువు వక్రగమనంలో ఉన్న డిసెంబర్ నుంచి నాలుగు మాసాల పాటు బదిలీలు, మార్పులు చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో చికాకులు, ఒత్తిళ్లు అధికం. తొందర పాటు నిర్ణయాలు తగవు. ర్థికపరమైన సమస్యలు తలెత్తే అవకాశం వుంది. రుణబాధ పెరుగుతుంది. ఆర్థిక సమస్యల కారణంగా మనస్తాపానికి గురవుతారు. 2,3 స్థానాల్లో శని సంచారం వల్ల ఆర్థిక విషయాల్లో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. మంచికి పోతే చెడు ఎదురవుతుంది. అధిక శ్రమ, ప్రయోజనం స్వల్పంగా వుంటుంది. సౌకర్యలేమితో ఇబ్బంది పడతారు. రుణబాధలు అధికం అవుతాయి. పెట్టుబడుల్లో తొందరపాటు తగదు. ఆర్థిక విషయాల్లో నిదానం అవసరం. ఏప్రిల్ – జూలై మాసాల మధ్య సినీరాజకీయ రంగాల వారికి శుభప్రదం. ఆలస్యాలను, వైఫల్యాలను లెక్కచేయకుండా ప్రయత్నాలు కొనసాగించి లక్ష్యాలు సాధిస్తారు. ఆర్థిక విషయాలు కొంత ఆశాజనకంగా వుంటాయి. స్థిరచరాస్తులు సమకూర్చుకుంటారు. వారసత్వ విషయాలు లాభిస్తాయి. రాహు, కేతు సంచారం కారణంగా వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ప్రియతములకు దూరంగా వెళ్లాల్సి రావచ్చు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. రాఘవేంద్ర స్వామి ఆరాధన వల్ల శుభఫలితాలు కనిపిస్తాయి.
తుల (చిత్త 3,4 స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
ఆదాయం – 8 వ్యయం – 11
రాజపూజ్యం – 7 అవమానం- 1
ఈ ఏడాది గురు, శని, రాహు, కేతు సంచారం పరిశీలిస్తే తులారాశి వారు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. పై చదువులు, విదేశీ గమనానికి అనుకూలం. కొత్త వ్యాపారానికి, పరిశ్రమల ప్రారంభానికి తగిన సమయం. ఉద్యోగంలో మార్పు కోరుకుంటారు. విద్యార్థులు, క్రీడారంగంలోని వారికి శుభప్రదం. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. స్థలమార్పిడికి, ప్రమోషన్లకు అవకాశం ఉంది. రాజకీయ, కళా, సినీ, రవాణా, విద్య, ఐ.టి. రంగాల వారికి ప్రోత్సాహకరం. గురువు వక్రగమనంలో వుండే డిసెంబర్ 9 నుంచి నాలుగు మాసాల పాటు ఆందోళనలు అధికం అవుతాయి. వృత్తిపరమైన ఒత్తిడులకు లోనవుతారు. న్యాయ, ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. 9, 10 స్థానాల్లో గురు సంచారం వల్ల ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. వృత్తి, వ్యాపారాల్లో శుభపరిణామాలు సంభవం. ప్రమోషన్లు సాధిస్తారు. వ్యాపార విస్తరణకు తగిన సమయం. న్యాయ, ఆధ్యాత్మిక, బోధన, పత్రికలు, రాజకీయ రంగాలలో ఉన్నవారికి ప్రోత్సాహకరం. సంతానప్రాప్తి, విద్యావిషయాలు, న్యాయ పోరాటాలలో విజయం సాధిస్తారు. కళాసాంస్కృతిక, బోధన, ఉన్నత విద్య, విదేశీ వ్యవహార రంగాల వారికి ప్రోత్సాహకరం. ఆదాయం పెంచుకునేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. ప్రభుత్వ సంస్థలు, రాజకీయ రంగంలోని వారికి ఉన్నత పదవులు, గౌరవ, కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. వ్యవసాయ రంగంలోని వారికి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. సంవత్సరం ప్రారంభం నుంచి మార్చి 6 వరకు డిసెంబర్ 9 నుంచి సంవత్సరాంతం వరకు గురువు వక్రించిన కారణంగా వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యం. బదిలీలు అసౌకర్యం కలిగిస్తాయి. మీ పురోగతి చూసి అసూయ పడేవారి సంఖ్య పెరుగుతుంది. చికాకులు పెరుగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. పెట్టుబడుల్లో జాగ్రత్త వహించాలి. జనవరి నుంచి నవంబర్ వరకు మీ జన్మరాశిలో ఆ తరువాత మీ ద్వితీయ రాశిలో శని సంచారం జరుగుతుంది. ఫలితంగా ఈ కాలంలో ఆరోగ్యం మందగిస్తుంది. మనశ్శాంతి లోపిస్తుంది. కుటుంబ సభ్యులతో ఎడబాటు తప్పకపోవచ్చు. అపనిందలు ఎదుర్కొంటారు. పోలీసు, రక్షణ రంగాల వారికి చిక్కులు ఎదురవుతాయి. ప్రతిపనిలో ఆటంకాలు, అసంతృప్తి ఎదురవుతుంది. ఎముకలకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు. ఏప్రిల్ – జూలై మాసాల మధ్య శని వక్రించి ఉన్న కారణంగా క్రమశిక్షణతో వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఆటంకాలు ఎదురయినప్పటికీ పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి నిదానంగా మంచి ఫలితాలు వస్తాయి. 1, 12 – 7,6 స్థానాల్లో రాహుకేతువుల సంచారం వల్ల వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మనశ్శాంతి లోపించిన కారణంగా మరిన్ని పొరపాట్లు చేస్తారు. పైఅధికారుల నుంచి మాటపడాల్సి వస్తుంది. వేంకటేశ్వరస్వామి ఆరాధన వల్ల ఈ ఏడాది శుభఫలితాలు సాధిస్తారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
ఆదాయం – 14 వ్యయం – 2
రాజపూజ్యం – 7 అవమానం- 4
వృశ్ఛికరాశిలో జన్మించిన వారు ఈ ఏడాది ఉగాది నుంచి జూలై వరకు ఆ తరువాత నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఆస్తి పాస్తులు పెంపొందించుకుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారసత్వ విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలలో పనిచేసే వారికి, రాజకీయ, కళా, సాంస్కృతిక రంగాలు, ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. జూలై 21 నుంచి నవంబర్ 2 వరకు ఆర్థిక, ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. బాధ్యతలు పెరుగుతాయి. ఇచ్చిన రుణాలు తిరిగి వసూలు కావడం కష్టం. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. గురు సంచారం ఫలితంగా ఈ ఏడాది ఆగస్టు నుంచి అక్టోబర్ మాసాలు మినహా మిగిలిన కాలంలో స్థిరచరాస్తులు సమకూర్చుకోగలుగుతారు. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి ఉద్యోగాలలో శుభ పరిణామాలు సంభవం. న్యాయ, ఆధ్యాత్మిక, బోధన, పత్రికలు, రాజకీయ రంగాలలో ఉన్న వారికి ప్రోత్సాహకరం. ఉద్యోగులు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రకటనలు, మీడియా రంగంలోని వారికి శుభప్రదం. వైద్యరంగంలోని వారికి చక్కటి పురోగతి కనిపిస్తుంది. శత్రువులతో విబేధాలు సమసిపోతాయి. విద్యార్థులకు ఆటంకాలు తొలగిపోయి లక్ష్యాలు సాధిస్తారు. స్నేహబాంధవ్యాలు బలపడతాయి. పైచదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. జూలై 21 నుంచి నవంబర్ 2 వరకు రాజకీయ రంగంలోని వారికి నిరాశ ఎదురవుతుంది. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ పూర్వానుభవంతో, యుక్తితో నెమ్మదిగా పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులు అంచనాలు మించుతాయి. కోర్టు వ్యవహారాల్లో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. మానసిక అశాంతికి గురయ్యే అవకాశం ఉంది. 12, 1 స్థానాల్లో ఈ సంవత్సరం శని సంచారం జరుగుతుంది. ఫలితంగా మనశ్శాంతి లోపిస్తుంది. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలు, కళలు, సినిమాలు, వినోదం, పర్యాట రంగాల వారు ఆశించన ఫలితాలు అందక నిరుత్సాహపడతారు. పైచదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. రహస్య కార్యకలాపాల కారణంగా అప్రతిష్ఠకు గురవుతారు. ఆరోగ్యం మందగిస్తుంది. కుటుంబ బాధ్యతలు, వృత్తిపరమైన పనులు ఒకేసారి మీద పడడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. చిరాకు అధికం అవుతుంది. ఏప్రిల్ – -జూన్ మాసాల మధ్య శని వక్రగమనంలో ఉన్నాడు. ఆ సమయంలో భాగస్వామి సహకారం లభిస్తుంది. క్రమశిక్షణతో, ఓరిమితో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ప్రత్యర్థులు కల్పించే చిక్కుల నుంచి బయటపడతారు. విద్య, వృత్తి కారణాలవల్ల ఇంటికి దూరంగా ఉండాల్సి రావచ్చు. 12, 1 – 6,5 స్థానాల్లో రాహు-కేతువుల సంచారం ఫలితంగా రుణబాధలు అధికం అవుతాయి. సకాలంలో డబ్బు చేతికి అందకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. విద్యార్థుల్లో శ్రద్ధ లోపిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో చిక్కులు ఎదురవుతాయి. సన్నిహితుల్లో ఒకరికి అనారోగ్యం వచ్చే అవకాశం వుంది. లక్ష్మీ దేవి ఆరాధన వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
ధనస్సు (మూల, పూర్వాషాఢ, త్తరాషాఢ 1వ పాదము)
ఆదాయం – 2 వ్యయం – 11
రాజపూజ్యం – 7 అవమానం- 7
ధనుస్సు రాశి వారికి ఈ ఏడాది కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. జనసంబంధాలు విస్తరిస్తాయి. న్యాయ విషయాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. పెట్టుబడులు, పొదుపు పథకాలు లాభిస్తాయి. సన్నిహితులను కలుపుకొని పదిమందికీ ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతారు. డిసెంబర్ నుంచి ఈ ఏడాది చివరి నాలుగు మాసాల పాటు శ్రీవారు, శ్రీమతి లేదా భాగస్వాముల మధ్య అపోహలు తలెత్తే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో చికాకులు పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. లక్ష్య సాధనలో ఆలస్యాలు, ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు అంచనాలను మించిపోతాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి జూన్ 18 వరకు శ్రీవారు, శ్రీమతి విషయాలలో పురోగతి కనిపిస్తుంది. స్నేహితులు, బంధువులు, అభిమానులు మీ లక్ష్యసాధనలో సహకరిస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వివాహయత్నాలు ఫలిస్తాయి. జనసంబంధాలు మెరుగుపడతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఉమ్మడి వ్యాపారం లాభిస్తుంది. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. విద్యార్థులకు శుభప్రదం. విదేశీ ప్రయాణాలు చేస్తారు. సంతానం లేని వారికి ఈ ఏడాది శుభప్రదం. ఆస్తులు పెంపొందించుకుంటారు. రాజకీయాలు, ప్రకటనలు, ఏజెన్సీ రంగాల వారికి ప్రోత్సాహకరం. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. జూలై నుంచి సంవత్సరాంతం వరకు విధి నిర్వహణలో ఒత్తిళ్లు అధికమౌతాయి. భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. శస్త్ర చికిత్స అవసరం కావచ్చు. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. పూర్వానుభవంతో, యుక్తితో నెమ్మదిగా పనులు పూర్తి చేస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆర్థిక, ఆరోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. ఆటంకాలు, వివాదాలు బాధిస్తాయి. ప్రత్యర్థుల పట్ల మెలకువగా ఉండాలి. పిల్లల పట్ల అశ్రద్ధ చూపి, ఆ తరువాత పశ్చాత్తాప పడతారు. ఈ సంవత్సరంలో 11,12 స్థానాల్లో శని సంచారం ఫలితంగా బాధ్యతలతోపాటు, ఒత్తిడులు కూడా అధికమౌతాయి. ప్రశాంతత లోపిస్తుంది. ఆలస్యాలు, ఆటంకాలు, న్యూనత, వైఫల్యాల వల్ల అసంతృప్తి, అశాంతికి లోనవుతారు. అతి స్వల్ప ఫలితాలకు అధిక శ్రమపడాల్సి వస్తుంది. వాహనాలు నడిపే సమయంలో ఏకాగ్రత అవసరం. క్రయవిక్రయాల్లో చిక్కులు ఎదురవుతాయి. చెడు స్నేహాల వల్ల నష్టపోయే అవకాశం వుంది. ఉగాది నుంచి జూలై వరకు శని వక్రించిన కారణంగా రియల్ ఎస్టేట్ రంగంలోని వారి పరిస్థితి మెరుగుపడుతుంది. బాధ్యతాయుతమైన కార్యక్రమాలు చేపడతారు. స్వయంకృషి, కార్యదీక్ష, ఓరిమి, ఏకాగ్రత, నిదానం, పట్టుదలతో అవరోధాలను అధిగమించి లక్ష్యాలు సాధిస్తారు. నూనెలు, ఇనుము, భూములు, ఖనిజాల వ్యాపారులకు ప్రోత్సాహకరం. రాహు, కేతువుల సంచారం కారణంగా పైఅధికారుల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. సకాలంలో పనులు పూర్తికాక అశాంతికి గురవుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్నేహబాంధవ్యాలు విస్తరిస్తాయి. సోదరీసోదరుల మధ్య చిన్నపాటి తగాదాలు తెలెత్తే అవకాశం వుంది. దుర్గాదేవి ఆరాధన వల్ల ఈ సంవత్సరం సత్ఫలితాలు పొందుతారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)
ఆదాయం – 5 వ్యయం – 5
రాజపూజ్యం – 3 అవమానం- 3
ఈ ఏడాది మకర రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగులు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు సాధిస్తారు. వ్యాపారరంగాల వారు అధిక లా భాలు గడిస్తారు. ఆస్తిపాస్తులు సమకూర్చుకుంటారు. వైవాహిక జీవితం సుఖమయంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. వైద్య రంగాల వారికి శుభప్రదం. శత్రువులపై విజయం సాధిస్తారు. జన సంబంధాలు విస్తరిస్తాయి. రాజకీయ రంగంలోని వారికి విజయం చేకూరుతుంది. అయితే డిసెంబర్ నుంచి సంవత్సరంలో చివరి నాలుగు మాసాల్లో లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాల్సి వస్తుంది. శత్రుబాధఅధికం. ఆర్థిక వ్యవహారాల కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. మధుమేహం సమస్య ఉన్న వారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఆరు, ఏడవ స్థానాల్లో గురు సంచారం ఫలితంగా ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా మొత్తం మీద పురోగతి కనిపిస్తుంది. ఆత్మ విశ్వాసం ధైర్య సాహసాలతో చేసే ప్రయత్నాలు జయప్రదం అవుతాయి. ఆటంకాలను లెక్క చేయకుండా ముందుకు సాగుతారు. హోటల్, ఆహార ఉత్పత్తులు, ఔషధాలు, ఆస్పత్రులు, కేటరింగ్, నిత్యావసరాల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. విలాసాలకు, మంచి పనులకు వెచ్చిస్తారు. పొరుగు రాష్ట్రాలు, విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. జనసంబంధాలు మెరుగుపడతాయి. ప్రత్యర్ధులపై విజయం సాధిస్తారు. ఉమ్మడి వ్యాపారం లాభిస్తుంది. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. డిసెంబర్ 9 నంఉచి గురువు వక్రించిన ఫలితంగా ప్రత్యర్థుల నుంచి చిక్కులు ఎదురవుతాయి. వైవాహిక జీవితంలో చిక్కులు ఎదురవుతాయి. శత్రుబాధ అధికం. అనాలోచితంగా పక్కవారి సలహాలు పాటించడం వల్ల నష్టపోతారు. బాగా కష్టపడితే కానీ ఫలితాలు సాధించలేరు. ఈ సంవత్సరంలో 11,12 స్థానాల్లో శని సంచారం చేస్తాడు. ఫలితంగా ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ప్రభుత్వ రంగంలోని వారికి ప్రోత్సాహకరంగా వుంటుంది. సన్నిహితులు, బంధువుల భాగస్వామ్యంతో కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధించి పేరు తెచ్చుకుంటారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుర్తింపు కోసం చేసే ప్రయత్నాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. ఏప్రిల్ -జూలై మాసాల మధ్య పై అధికారుల నుంచి ఒత్తిళ్లకు గురవుతారు. మీ ప్రతిష్ఠకు భంగం కలిగే పరిణామాలు చోటుచేసుకుంటాయి. పెద్దల ఆరోగ్యం కలవరపెడుతుంది. రాజకీయ రంగంలోని వారికి ఆశాభంగం కలుగుతుంది. ఫలితంగా మంచి మనసుతో మీరు చేపట్టే పనులు సైతం బెడిసికొట్టే ప్రమాదం ఉంది. రాజకీయ రంగంలోని వారు అనాలోచిత వైఖరి వల్ల ఇబ్బందులు పడతారు. తల్లిదండ్రుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. 10,9 లో రాహువు, 4,3 స్థానాల్లో కేతుగ్రహ సంచారం కారణంగా వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. ఒత్తిడికి లోనవుతారు. ధ్యాస తగ్గడంతో పనులు పూర్తి చేయడంలో సమయం వృధా అవుతుంది. మనశ్శాంతి లోపిస్తుంది. పార్వతీ దేవి ఆరాధన వల్ల ఈ ఏడాది శుభఫలితాలు సాధిస్తారు.
కుంభం (ధనిష్ఠ 3,4 శతభిషం,పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
ఆదాయం – 5 వ్యయం – 5
రాజపూజ్యం – 3 అవమానం- 9
కుంభ రాశి వారికి ఈ ఏడాది చదువులు, ఆర్థిక విషయాలు, వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. గురువు 5-6 స్థానాల్లో సంచరిస్తున్న కారణంగా ఈ ఏడాది మొదటి ఆరు మాసాల్లో విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. కుటుంబం విస్తరిస్తుంది. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తివిద్యా కోర్సులకు అనుకూలం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పేరుప్రఖ్యాతులు గడిస్తారు. ప్రమోషన్లకు, వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది. డిసెంబర్ 9 తరువాత నాలుగు మాసాల పాటు ప్రేమవ్యవహారాలు బెడిసికొట్టే ప్రమాదం ఉంది. ప్రియతములు దూరమవుతారు. వృత్తి వ్యాపారాల్లో ఒత్తిళ్లు అధికం. శ్రమకు తగిన ఫలితం అందకపోవడంతో నిరుత్సాహపడతారు. గురుసంచారం కారణంగా ఈ ఏడాది సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. స్నేహ సంబంధాలు పెంపొందుతాయి. ఇంటి కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. విద్య, వైజ్ఞానిక రంగాలలో విశేష ప్రోత్సాహం లభిస్తుంది. మీ విద్యార్హతలు, నైపుణ్యానికి తగిన సదవకాశాలు లభిస్తాయి. పిల్లల విద్య, వృత్తి, వివాహం విషయాలలో అభివృద్ధి, శుభ పరిణామాలు కనిపిస్తాయి. ఏడాది ద్వితీయార్థంలో ఆరోగ్యం మందగిస్తుంది. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురవుతాయి. అనారోగ్యం, పనుల్లో ఆలస్యం, ఆర్థిక ఇబ్బందులు, అనవసర వ్యయం ఉంటాయి. వృత్తిలో పెద్దల నుంచి ఒత్తిళ్లు. అపనిందలు తప్పవు. గృహ విషయాల్లో సామరస్య ధోరణి కొరవడుతుంది. విద్యార్థులకు ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాల్లో చిక్కులు ఎదురవుతాయి. డిసెంబర్ 9 నుంచి వృత్తి వ్యాపారాల్లో పరిస్థితి మెరుగుపడుతుంది. లక్ష్యాలు సాధిస్తారు. ఈ ఏడాది నవంబర్ 3 వరకు 9వ స్థానంలో, ఆ తరువాత మీ 10వ స్థానంలో శని సంచారం జరుగుతుంది. ఫలితంగా న్యాయపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. బాధ్యతాయుతంగా వ్యవహరించి మంచి పేరు తెచ్చుకుంటారు. రాజకీయ, ప్రభుత్వ రంగాల వారికి, టీచింగ్, బ్యాంకింగ్ రంగాల వారికి శుభప్రదం. వృత్తిపరంగా గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెట్టుబడులకు అనుకూలం. శని వక్రించిన ఏప్రిల్ – జూలై మాసాల మధ్య న్యాయ, బోధన, కళా, రాజకీయ రంగంలోని వారు అనాలోచిత వైఖరి వల్ల ఇబ్బందులు పడతారు. చదువులు విదేశీ వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆస్తిపాస్తుల విషయాల్లో చిక్కులు ఎదురవుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కొత్త పరిచయాల వల్ల కష్టనష్టాలు ఎదురవుతాయి. అప్పులు ఇచ్చిపుచ్చుకొనే విషయంలో సమస్యలు ఎదురవుతాయి. 9,8లో రాహువు, 3,2లో కేతువు సంచారం కారణంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు. ఆర్థిక సహాయం చేసే విషయంలో ముందు వెనుకలు ఆలోచించండి. చదువుల్లో ఆశ్రద్ధ కారణంగా వైఫల్యాలు ఎదురవుతాయి. కామాక్షీ దేవి ఆరాధన వల్ల ఈ ఏడాది మెరుగైన ఫలితాలు కలుగుతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదాయం – 2 వ్యయం – 11
రాజపూజ్యం – 9 అవమానం- 2
ఈ ఏడాది గురు, శని, రాహుకేతువుల సంచారం ఆధారంగా మీనరాశి వారు స్థల సేకరణ, గృహనిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగాల్లో పురోగతి సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు, ఉన్నత విద్యాభ్యాసానికి అనుకూలం. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. పరిచయాలు లాభిస్తాయి. సొంత ఇంటి కల ఫలిస్తుంది. వాహనయోగం కలుగుతుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. అయితే ఉగాది నుంచి జూలై వరకు అన్ని విషయాల్లోనూ ఖర్చులు అధికంగా ఉంటాయి. బంధువుల తాకిడి అధికంగా ఉంటుంది. అన్నీ ఉన్నప్పటికీ ఏదో తెలియని వెలితి వెంటాడుతుంది. ఆస్తుల క్రయవిక్రయాల్లో ఊహించని చిక్కులు ఎదురవుతాయి. ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. 4,5 స్థానాల్లో గురు సంచారం జరుగుతున్నది. ఫలితంగా కుటుంబం విస్తరిస్తుంది. మాతృవర్గీయులు, బంధువుల సహకారం లభిస్తుంది. వారి విషయాల్లో శుభ పరిణామాలు, అభివృద్ధి సంభవం. విలువైన వస్తువులు, ఆభరణాలు, స్థిరచరాస్తులు సమకూర్చుకుంటారు, ఇంట్లో వేడుకలు, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. స్థల సేకరణ, గృహ నిర్మాణం, గృహప్రవేశానికి అనుకూలం. ఆదాయం పెరుగుతుంది. విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి. విద్య, సారస్వత కార్యక్రమాలలో, వివాదాలలో విజయం సాధిస్తారు. గౌరవ మన్ననలు లభిస్తాయి. విద్య, వైజ్ఞానిక రంగాల వారికి విశేష ప్రోత్సాహం లభిస్తుంది. మీ విద్యార్హతలు, నైపుణ్యానికి తగిన సదవకాశాలు లభిస్తాయి. విద్య, వృత్తి, వివాహం విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. గురువు వక్రగమనంలో ఉన్న డిసెంబర్ 9 నుంచి సంవత్సరాంతం వరకు ఆర్థిక విషయాల్లో ప్రతికూలత కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. గృహరుణాలు అందడంలో ఇబ్బందులెదురవుతాయి. ప్రేమలు బెడిసికొట్టే ప్రమాదం ఉంది. పొదుపు పథకాలు ఆశించిన ఫలితం ఇవ్వకపోవచ్చు. ఈ ఏడాది నవంబర్ 2 వరకు 8వ స్థానంలో ఆ తరువాత 9వ స్థానంలో శని సంచారం వల్ల ఆర్థిక విషయాల్లో చిక్కులు ఎదుర్కొంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. డబ్బు విషయంలో మాటపడాల్సి రావచ్చు. రుణబాధ అధికం అవుతుంది. ఎముకలు, కీళ్లకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మానసిక అశాంతి బాధిస్తుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బీమా, మ్యూచ్యువల్‌ఫండ్స్‌లో పనిచేసే వారు ఆశించిన ఫలితాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం విషమించవచ్చు. రావలసిన నిధులు సకాలంలో అందక ఇబ్బంది పడతారు. ఉమ్మడి నిధుల నిర్వహణలో అపనిందలు ఎదుర్కొంటారు. నవంబర్ నుంచి ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాల విషయంలో ఆటంకాలు ఎదురైనా చివరకు మంచి ఫలితాలు సాధిస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. స్నేహబాంధవ్యాలు విస్తరిస్తాయి. శని వక్రగమనంలో ఉన్న ఉగాది నుంచి – జూలై వరకు దీర్ఘకాలిక పెట్టుబడులు లాభిస్తాయి. రుణప్రయత్నాలు ఫలిస్తాయి. పాతబకాయిలు వసూలవుతాయి. కానుకలు, బహుమతులు అందుకుంటారు. పెద్దల సహకారంతో ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. రాహు-కేతు గ్రహాల సంచారం ఫలితంగా ఆరోగ్యం మందగిస్తుంది. వైవాహిక జీవితంలో చికాకులు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురౌతాయి. ఖర్చలు అంచనాలు మించుతాయి. గణపతిని ఆరాధించడం వల్ల శుభఫలితాలు సాధిస్తారు. —***—
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి