29, నవంబర్ 2015, ఆదివారం

మేకిన్‌ ఇండియా స్ఫూర్తితో... 'మేకిన్‌ తెలంగాణ-మేడిన్‌ తెలంగాణ'

మేడిన్ ఇండియా ప్రతి భారతీయుడు స్వప్నించాల్సిన అవసరం. 'మేకిన్ ఇండియా' ప్రతి భారతీయుడు గర్వంగా తలెత్తుకొని చాటాల్సిన నినాదం. ప్రపంచ దేశాలకు ఎందులోనూ మేమేమీ తీసిపోలేమన్న వాస్తవాన్ని చాటిచెప్పగలిగే లక్ష్యం. ఇప్పటికే కొన్ని దేశాలు సాధించే విజయాలు, అరుదైన ఆవిష్కరణల వెనుక భారత సంతతి మేథా సంపత్తి దాగి ఉన్నదన్నది అక్షర సత్యం. అయితే.. ఆ పరిస్థితి నుంచి మీరే మా దేశంలో ఉత్పత్తులు చేయండి.. సకల రంగాల ఆవిష్కరణలకు, అవసరాలకు అనువైన వేదిక భారత్. అన్న ఆశయంతో దేశ ప్రధాని నరేంద్ర మోదీ మొదలు పెట్టిన అరుదైన యజ్ఞం మేకిన్ ఇండియా. ప్రకటించిన అనతి కాలంలోనే అనేక విదేశీ కంపెనీలు భారత్ కు క్యూ కట్టడం మన సమర్థతకు, గొప్పతనానికి నిదర్శనం. ప్రఖ్యాత పరిశ్రమలు నెలకొల్పేందుకు అనువైన రాష్ట్రాలను, నగరాలను పారిశ్రామిక వేత్తలు ఎంచుకుంటున్నారు. అందులో హైదరాబాద్ ను మొదటి వరుసలో ఉన్న నగరంగా ప్రముఖంగా చెప్పుకోవచ్చు.

    ఇప్పటికే అంతర్జాతీయస్థాయిలో వెలుగొందుతున్న హైదరాబాద్ ను ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన 'మేకిన్ ఇండియా' నినాదాన్ని అనుకూలంగా మలచుకొని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు, భారీగా పరిశ్రమలను నెలకొల్పేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే  తెలంగాణ ప్రభుత్వం.. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని సొంత రాష్ట్రంలో మరిన్ని రెట్లు పెంచేలా 'మేకిన్ ఇండియా'కు అనుగుణంగా కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందించింది.  దానికి ఇప్పటికే హైదరాబాద్ నగరానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ తోడయ్యింది. ఫలితంగా అంతర్జాతీయ స్థాయి కంపెనీల రాక మొదలైంది 'మేకిన్ ఇండియా' నినాదాన్ని అనుకూలంగా మలచుకున్న తెలంగాణ ప్రభుత్వం 'మేకిన్ తెలంగాణ-మేడిన్ తెలంగాణ' అంటూ పారిశ్రామిక వేత్తలను రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తోంది.

టీఎస్ ఐపాస్ (Telangana State Industrial Project Approval and Self Certification System) :


    ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగ ఉపాధి అవకాశాల పెంపుదలకు ప్రధాన వాహకం పారిశ్రామిక రంగం. కొత్త రాష్ట్రమైన తెలంగాణలో ఈ అవసరాలను గుర్తించిన ప్రభుత్వం.. తెలంగాణలో అత్యంత ఆర్భాటంగా నూతన పారిశ్రామిక విధానం - టీఎస్ ఐపాస్ (తెలంగాణ స్టేట్‌ ఇండస్ట్రియల్‌ ప్రాజెక్ట్‌ అప్రూవల్‌ అండ్‌ సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ సిస్టం)ను ఆవిష్కరించింది. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలకు ఆహ్వానం పలికింది. టీఎస్ ఐపాస్ ఆవిష్కరణోత్సవానికి మైక్రోసాఫ్ట్, టాటా, ఐటీసీ, షాపూర్ జీ - ఎల్లోంజీ, ఇన్ఫోసిస్ తదితర కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. అమెరికా, కెనడా, స్వీడన్, గల్ఫ్ దేశాలకు చెందిన రాయబారులు కూడా పాల్గొన్నారు.

    నిజానికి 'మేకిన్ ఇండియా' మార్గదర్శకాలను, స్థానిక అవసరాలు, వనరులు, అవకాశాలకు అనుగుణంగా రూపొందించిందే తెలంగాణ పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్. రాష్ట్రం మొత్తంలో చూస్తే 'మేకిన్ ఇండియా'కు ప్రభావితమయ్యేది ప్రధానంగా హైదరాబాద్ నగరం, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలు మాత్రమే అని చెప్పవచ్చు. అందుకు కారణం.. ప్రభుత్వరంగ పరిశ్రమలు మినహా.. తెలంగాణ ప్రాంతంలో పరిశ్రమలకు సంబంధించి మొదటి నుంచీ అంతగా వికేంద్రీకరణ లేకపోవడమే.

    పారిశ్రామిక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. దేశంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ టి-హబ్ ను ఏర్పాటు చేసింది. గచ్చిబౌలి లోని ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఈ టి-హబ్ ప్రారంభోత్సవం ఈనెలలోనే జరగబోతోంది. ఇప్పటికే టి-హబ్ కు స్టార్టప్ ల నుంచి పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి 400 దరఖాస్తులు వచ్చాయి. నిజానికి టి-హబ్ కు 1500కు పైగా దరఖాస్తులు రావొచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. టి-హబ్ ప్రారంభోత్సవం తర్వాత దరఖాస్తుల వెల్లువ పెరుగుతుందని భావిస్తోంది. ఇందుకోసం కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని నిర్ణయించింది. పరిశ్రమలకు అనుమతులకు సింగిల్ డెస్క్ విధానాన్ని అమలు చేస్తోంది.

    పారిశ్రామిక పార్కుల్లో విద్యుత్‌ సబ్‌స్టేషన్లు, పోలీస్‌ అవుట్‌ పోస్టులు, ఫైర్‌స్టేషన్లు, ఈ-సేవా కేంద్రాలు, బ్యాంకులు, పెట్రోల్‌ బంకులు మొదలైన వాటికోసం కొంత భూమిని ప్రత్యేకంగా కేటాయిస్తారు.

ఆరంభంలోనే అదరగొట్టారు :


    టీఎస్‌ ఐపాస్‌ ఆవిష్కరించిన తెలంగాణ ప్రభుత్వం తొలిదశలోనే శుభారంభం చేసింది. రూ.1500 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టే 17 కంపెనీలకు ప్రభుత్వం నిర్దేశించిన గడువుకు ముందే అనుమతులు మంజూరు చేసింది. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా అనుమతులు మంజూరు, వసతుల కల్పన, రాయితీలు ఆశాజనకంగా ఉండటంతో పలు దేశ, విదేశీ కంపెనీలు హైదరాబాద్‌లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. తొలివిడతలో 17 కంపెనీలకు గడువుకు ముందే అనుమతులిచ్చిన ప్రభుత్వం.. రెండో విడతలో మరో 16 కంపెనీలకు వేగంగా అనుమతులిచ్చింది. వాటిలో మైక్రో మ్యాక్స్‌ సెల్‌ఫోన్ల తయారీ, హెలికాప్టర్‌ కేబిన్ల తయారీ, ఎయిర్‌క్రాఫ్ట్‌ విడిభాగాల తయారీ పరిశ్రమలు ఉండటం విశేషం.

    విద్యుత్ ఉత్పత్తి రంగంలోనూ ప్రైవేటు కంపెనీలను ప్రోత్సహించాలని తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు నూతన పారిశ్రామిక విధానం కింద టీఎస్ఐఐసీ ద్వారా మూడు దశల్లో మొత్తం 37 కంపెనీలకు అనుమతులిచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థలే కాకుండా విద్యుత్ ఉత్పత్తిలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. నాలుగో దశలో విద్యుత్ కంపెనీలకు అనుమతులు మంజూరు చేసేందుకు రంగం సిద్ధం చేసింది.

    మొత్తం 1800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రైవేటు కంపెనీలకు అనుమతులు ఇవ్వనుంది. రూ.1239 కోట్ల రూపాయల వ్యయంతో నెలకొల్పే ఈ కంపెనీలు 1900 మందికి ఉపాధి చూపనున్నాయి. పనిలో పనిగా రాష్ట్రంలో విద్యుత్ కొరత తీరనుంది. విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పేందుకు ముందుకొచ్చిన ఈ కంపెనీలు మెదక్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో 50 మెగావాట్ల సోలార్ విద్యుత్ ను, ఆదిలాబాద్ జిల్లాలో 130 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ను ఉత్పత్తి చేయనున్నాయి. అంతేకాదు.. సహజవనరులున్న వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో మరిన్ని విద్యుత్ ఉత్పత్తి సంస్థలు నెలకొల్పేందుకు ప్రైవేటు కంపెనీలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇండస్ట్రియల్‌ కారిడార్‌ :


ఆచి తూచి అనుమతులు :

    హైదరాబాద్‌ శివారులో నెలకొల్ప తలపెట్టిన ఫిల్మ్‌సిటీ, స్పోర్ట్‌సిటీల్లో కూడా భారీగా విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న రాచకొండ గుట్టల్లోని 42వేల ఎకరాల ప్రభుత్వ భూములను ఇండస్ట్రియల్‌ కారిడార్‌గా అభివృద్ధి చేసేందుకు సర్కారు ప్రణాళికలు రచిస్తోంది.


    తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం (టీఎస్‌ ఐపాస్‌) ద్వారా పెట్టుబడి దారులకు ఎర్రతివాచీ పరుస్తున్న ప్రభుత్వం.. భూముల కేటాయింపుల్లో పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో భూ కేటాయింపుల ప్రక్రియ వివాదాస్పదమైన నేపథ్యంలో ఆచి తూచి అనుమతులు ఇస్తోంది. సింగిల్‌ విండో ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు పక్షం రోజుల్లోనే అనుమతులు ఇస్తామని ప్రకటించినా.. మెగా ప్రాజెక్టుల విషయంలో దరఖాస్తులను జాగ్రత్తగా వడపోస్తోంది. కంపెనీ శక్తి సామర్థ్యాలను మదింపు చేయడంతో పాటు వాటి చిత్తశుద్ధిని అంచనా వేయడం.. వాస్తవంగా ఆ ప్రాజెక్టుకు ఎంత భూమి అవసరం ఉంటుందన్న అంశంపై సాంకేతిక నిపుణులతో నిర్ధారణ చేయనుంది. రెండేళ్లలో ఉత్పత్తి ప్రారంభించని కంపెనీల నుంచి భూములు వెనక్కి తీసుకోనున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఏ సమయంలోనైనా అగ్రిమెంట్‌ రద్దు చేస్తారు.

    యూపీఏ హయాంలోని ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్‌లు) చాలాచోట్ల విఫలమైన పరిస్థితులను జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం బేరీజు వేస్తోంది. అలాగే.. తెలంగాణలోనూ సెజ్‌ల వైఫల్యాలు పునరావృతం కాకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తద్వారా విమర్శలకు, అనవసర ఆరోపణలకు తావివ్వకుండా జాగ్రత్తపడుతోంది.

మూడు సంస్థల ద్వారా కేటాయింపులు :


    పరిశ్రమలకు భూ కేటాయింపులు చేసే బాధ్యత మూడు రకాల సంస్థలకు అప్పగించారు. రూ.200 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టే మెగా ప్రాజెక్టులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని రాష్ట్రస్థాయి ఇండస్ట్రియల్‌ ప్రమోషన్‌ కమిటీ (ఎస్‌ఐపిసి)అనుమతులు ఇస్తుంది. రూ.5కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు టీఎస్‌ఐఐసీ ఎండీ నేతృత్వంలోని స్టేట్‌ లెవెల్‌ అలాట్‌మెంట్‌ కమిటీ (ఎస్‌ఎల్‌ఎసి) అనుమతులు మంజూరు చేయనుంది. సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు కలెక్టర్‌ నేతృత్వంలోని డిస్ట్రిక్ట్‌ ఇండస్ట్రియల్‌ ప్రమోషన్‌ కమిటీ (డిఐపిసి) అనుమతులు ఇస్తుంది.

    ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు.. ఇప్పటికే పేరొందిన భాగ్యనగరం ఖ్యాతి తోడవుతోంది. మౌలిక సదుపాయాల కల్పన, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల్లో గత యేడాది తెలంగాణ రాష్ట్రానికి 'ఇండియా టుడే' ఉత్తమ అవార్డు లభించింది.

    'మేకిన్‌ ఇండియా' నినాదంతో ప్రధాని మోదీ విస్తృతంగా విదేశీ పర్యటనలు చేస్తూ పారిశ్రామిక వేత్తలను, పెట్టుబడి దారులను ఆకర్షిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా చైనాలో పర్యటించారు. 'మేకిన్‌ ఇండియా' స్ఫూర్తితో రూపొందించిన టీఎస్‌ ఐపాస్‌ గురించి విస్తృతంగా ప్రచారం చేశారు.

    అంతేకాదు.. అక్టోబర్‌ తొలివారంలో ఢిల్లీలో జరిగిన 'మీట్‌ ది స్టేట్స్‌' కార్యక్రమంలో రాష్ట్రం నుంచి ప్రతినిధి బృందం హాజరైంది. 'మేకిన్‌ ఇండియా'లో భాగంగా ప్రపంచ దేశాల రాయబారులను, ప్రతినిధులను దేశంలోని అన్ని రాష్ట్రాలకు పరిచయం చేసేలా కేంద్రం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. 45 దేశాల రాయబారులు, ప్రతినిధుల సమక్షంలో తెలంగాణలో ఉన్న పెట్టుబడుల అవకాశాల గురించి ప్రతినిధుల బృందం వివరించింది. తెలంగాణలో ఆవిష్కరించిన నూతన పారిశ్రామిక విధానం వల్ల సెప్టెంబర్‌ చివరి నాటికే పదివేల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు వచ్చాయని, అవినీతి లేని, సింగిల్‌ విండో పారిశ్రామిక విధానం వల్ల 15రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేస్తున్నామని విశదీకరించారు.

విమర్శలు - అడ్డంకులు :


    సహజంగానే విపక్షాలు, ప్రధానంగా కమ్యూనిస్టు పార్టీలు 'మేకిన్‌ ఇండియా'పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. 40యేళ్ల కిందట వచ్చిన 'మేడిన్‌ ఇండియా' నినాదం ఎంతోమంది యువ పారిశ్రామిక వేత్తల్లో స్ఫూర్తి నింపిందని, ఇప్పుడు భారత్‌లో విదేశీ ఉత్పత్తులు కారుచౌకగా తయారుచేయించేందుకే.. మోదీ 'మేకిన్‌ ఇండియా' జపం చేస్తున్నారని వామపక్షాలు విమర్శిస్తున్నాయి. కార్మిక చట్టాల అడ్డు తొలగించుకోవడానికే 'మేకిన్‌ ఇండియా'ను తెరపైకి తెస్తున్నారని ఆరోపిస్తున్నాయి.

ప్రపంచస్థాయి సదస్సుకు ఏర్పాట్లు :


    'మేకిన్‌ ఇండియా'ను ఉద్యమస్థాయిలో ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ప్రత్యేకంగా సదస్సులు కూడా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోనూ ఫ్యాప్సీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు భారీ సదస్సు నిర్వహించారు. దేశంలోనే పెట్టుబడులకు తెలంగాణను కేంద్రంగా తీర్చి దిద్దుతామని ప్రభుత్వం తరచూ ప్రకటిస్తోంది. అందులో భాగంగానే  రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు వచ్చే జనవరిలో ప్రపంచస్థాయి సదస్సు నిర్వహించేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పారిశ్రామిక అభివృద్ధే లక్ష్యంగా వాటర్‌ గ్రిడ్‌ ద్వారా వచ్చే మూడేళ్లలో పరిశ్రమలకే 3 టీఎంసీల నీటిని సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది.

    టీఎస్‌ ఐపాస్‌ కింద ఇప్పటివరకు మూడు దశల్లో మొత్తం 37 ప్రముఖ కంపెనీలకు అనుమతులిచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇవన్నీ ఒక్కో కంపెనీ కనీసం వెయ్యి కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టేవే కావడం చెప్పుకోవాల్సిన విషయం. ఒక్కో కంపెనీలో వెయ్యిమందికి తగ్గకుండా ఉపాధి లభిస్తుందని అంచనా.

     మొత్తానికి విశ్వనగరంగా వర్థిల్లుతున్న హైదరాబాద్‌ ప్రాముఖ్యతను మరింత పెంచేందుకు 'మేకిన్‌ ఇండియా' ఓ వాహకంగా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు.


- సప్తగిరి.జి

98850 86126.

26, నవంబర్ 2015, గురువారం

మన్‌కీబాత్‌లో అవయవదానాన్ని నొక్కి చెప్పిన మోదీ




ప్రజల భాగస్వామ్యంతోనే దేశాన్ని నడిపించాలన్న మహోన్నత లక్ష్యం మోదీ మన్కీ బాత్ కార్యక్రమము. తాజాగా అక్టోబర్25 తేదిన నిర్వహించిన మన్కీబాత్ కార్యక్రమంలో పలు అంశాలపై మోదీ మనసు విప్పి ముచ్చటించారు. అవయవదానాన్ని ఉద్యమంలా చేపట్టాల్సిన ఆవశ్యకతను నరేంద్రమోదీ గుర్తుచేశారు. దేశంలో అవసరమైన అవయవ దానాలు జరగడం లేదని చింతిస్తూనే దాన్ని అధిగమించడానికి చేయాల్సిన ప్రయత్నాలను విశదీకరించారు. ప్రతి సంవత్సరం దేశంలో రెండున్నర లక్షలకంటే ఎక్కువగా మూత్రపిండాలు, గుండె, కాలేయదానం అవసరం ఉండగా కేవలం ఐదువేల అవయవ మార్పిడులే జరుగుతున్నాయని చెప్పారు. లక్ష కళ్ళకు చూపు అవసరమవుతుండగా 25 వేల వరకే చేయగుగుతున్నారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన వాళ్ళ అవయవలను కూడా దానం చేయవచ్చని, ఇందుకోసం చట్టపరమైన అడ్డంకులను తొలగించే ప్రయత్నం చేస్తున్నామని మోదీ చెప్పుకొచ్చారు. అవయవదానం పట్ల స్ఫూర్తి కలిగేలా కేరళలోని చిత్తూర్లో ఉన్న సెయింట్ మేరీ పాఠశాల విద్యార్థులు వేలిముద్రతో తయారు చేసిన భారతమాత చిత్రాన్ని తనకు పంపించారని.. వారిని అభినందించారు. మహారాష్ట్రకు చెందిన వసంతరావు సుడ్కే గురూజీ అవయవదానం పట్ల సాగిస్తున్న ఉద్యమానికి అభినందనలు తెలిపారు. అవయవదానం ఒక వృత్తి, ప్రవృత్తిలాగా మారాలని ఆకాంక్షించిన మోదీ దేశంలో అవయవదానాన్ని ప్రోత్సహించేందుకు ఆర్గన్ అండ్ టిష్యూ ట్రాన్స్ఫ్లాంట్ ఆర్గనైజేషన్ (నోటో)ను స్థాపించామని చెప్పారు.
ఇండో ఆఫ్రికన్ సమ్మిట్ కోసం ఉత్తరప్రదేశ్కు చెందిన విద్యార్థిని రాసిన కవితను మోదీమన్కీబాత్కార్యక్రమంలో కొంత భాగాన్ని చదివి వినిపించారు. ఈసారి మోదీ మన్కీబాత్ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ప్రముఖుల ప్రస్తావని తీసుకురావటం విశేషంగా చెప్పకోవచ్చు. విజయనగరం జిల్లాకు చెందిన కేంద్రమంత్రి అశోక్గజపతిరాజు ద్వారపూడి గ్రామ పంచాయతీని ఆదర్శగ్రామంగా ఎంపిక చేసుకొని సృజనాత్మకమైన పనిచేపట్టారని ప్రధాని ప్రశంసించారు. గ్రామంలోని 550 మంది నిరాక్షరాస్యులైన తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలే రోజూ సాయంత్రం గ్రామంలోని పాఠశాలలో చదువు చెబుతున్నారని, ఎలాంటి బడ్జెట్, సర్క్యులర్, ఆదేశాలు, ప్రత్యేక వ్యవస్థ లేకుండానే. కేవలం సంకల్పబలంతో ఇంత పెద్ద పరిణామం తీసుకొచ్చారని నరేంద్రమోదీ ప్రశంసించారు. అలాగే స్వచ్ఛ భారత్ ఉద్యమంలో భాగంగా ఈనాడు, ఈటీవీ గ్రూప్స్ అధినేత రామోజీరావు ప్రజల్లో తెస్తున్న చైతన్యాన్ని ప్రధానమంత్రి కొనియాడారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రముఖ మీడియా సంస్థలైన ఈనాడు, ఈటీవీ గ్రూప్స్ పరిశుభ్రత కార్యక్రమాన్ని మిషన్లాగా చేపట్టాయని ప్రశంసించారు.అలాగే ఏబీసీ న్యూస్ ఛానెల్, ఎన్డీటీవీ, దైనిక్ జాగరణ్, జీ నెట్వర్క్ మీడియా సంస్థలను ప్రస్తావిస్తూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగస్వాములవుతున్న తీరును ప్రస్ఫుటించారు ప్రధానిమోది. దేశంలోని దాదాపు అన్ని మీడియా సంస్థలు పరిశుభ్రతపై ప్రచారం చేపట్టాయని చెప్పారు. అతిచిన్న ఈశాన్య రాష్ట్రమైన మిజోరం నుండి లోక్సభకు ప్రాతినథ్యం వహిస్తున్న సి.ఎల్.రువాలా.. అక్కడి రువాం గ్రామంలో మార్చి 11 తేదిన చెరుకు ఉత్సవాన్ని నిర్వహించడం ద్వారా అమ్మకాలు పెరిగి గ్రామ ఆర్థికస్థితి మెరుగుపడిందని మోదీ మన్కీ బాత్లో తెలిపారు. ఇక పేదవాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలకు ఇంటర్వూ సమయంలో సిఫార్సు పేరిట నష్టపోతున్నారన్న వాదన నేపథ్యంలో.. వచ్చే జనవరి1 నుంచి గ్రూప్`డి, గ్రూప్`సి, గ్రూప్`బి నాన్గెజిటెడ్ ఉద్యోగా భర్తీలో ఇంటర్వ్యూలు రద్దు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. అదే విధంగా బంగారాన్ని నగదుగా మార్చుకునే పథకాన్ని తీసుకొచ్చామన్న మోదీ.. పథకం నేపథ్యం, వివరాలను అందరికీ అర్థమయ్యేలా వివరించారు. ఇకపై 5గ్రాముల, 10గ్రాముల, 20గ్రాముల బంగారునాణాలు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఇప్పటిదాకా బంగారంపై విదేశీ ముద్రలే ఉన్న కారణంగా స్వదేశీ ముద్ర ఎందుకు ఉండొద్దన్న భావనతో అశోకచక్రంతో కూడిన బంగారు నాణేలు తయారు చేస్తున్నామన్నారు. దీపావళి మరునాడు తన బ్రిటన్ పర్యటన గురించి కూడా మోదీ ప్రస్తావించారు. లండన్లో డాక్టర్ అంబేద్కర్ నివశించిన నివాసం ఇప్పుడు భారత సంపద అయ్యిందని దాన్ని ప్రారంభించేందుకు బ్రిటన్ వెళ్తున్నానన్నారు. బ్రిటన్కు పైచదువు కోసం వెళ్ళే భారతీయులకు అంబేద్కర్ నివాసం పుణ్యక్షేత్రం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అంబేద్కర్ ప్రేరణతో భారతీయ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పథకాలు, లక్ష్యాలు, కార్యక్రమాలే కాకుండా వ్యక్తిగత భావనను కూడా నరేంద్రమోదీ వెలిబుచ్చా రు. దీపావళి పర్వదినం సమీపిస్తున్నందున పండుగ సంబరాన్ని పూర్తిగా ఆస్వాదించాలని, పిల్లలు టపాకాయలు కాల్చే విషయంలో తల్లిదండ్రులు జాగరూకత వహించాలని జాగ్రత్త చెప్పారు. తర్వాత రోజు పండుగ వ్యర్థాలు శుభ్రం చేయాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 25 జరిగిన మోదీ మన్కీబాత్ యేడాది పూర్తిసుకుంది.

-  లోకహితం మాసపత్రిక (నవంబర్‌ 2015)లో ప్రచురితం



3, నవంబర్ 2015, మంగళవారం

సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు

 

        506 రోజుల పాటు సాగిన చెరకు తెరపడింది. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతికి సంకెళ్లు తెగిపోయాయి. తెలంగాణలో కొనసాగిన అనధికార నిషేధంపై సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ప్రసారాలను తక్షణమే పునరుద్ధరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎంఎస్‌వోలు, తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లను సుప్రీంకోర్టు ఆదేశించింది. అవసరమైతే కేబుల్‌ ఆపరేటర్లకు రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీచేసింది.

          సుప్రీంకోర్టు సమ్మెట దెబ్బకు.. సంకెళ్లు పటాపంచలయ్యాయి. అధికారం అండతో కేబుల్‌ ఆపరేటర్లను బెదిరించి అధికార పార్టీ హరించిన స్వేచ్ఛ మళ్లీ రెక్కలు విచ్చుకుంది. తెలంగాణలో ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ప్రసారాలపై కేసీఆర్‌ సర్కారు విధించిన దొడ్డిదారి నిషేధానికి తెరపడింది. ఏబీఎన్‌ ప్రసారాలనుపునరుద్ధరించి తీరాలని భారత సర్వోన్నత న్యాయస్థానం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, ఎంఎస్‌వోలను, తెలంగాణలోని పది జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ వేదికగానే చానెళ్లపై మండిపడిన వైనమే సర్కారీ తంత్రానికి నిదర్శనమని మందలించింది. ఎంఎస్‌వోల వెనుక ఉండి ఏబీఎన్‌ ప్రసారాలను నిలిపివేసింది ప్రభుత్వమే అని అభిప్రాయపడింది. తెలంగాణ ప్రభుత్వం ప్రోద్భలంతోనే ఎంఎస్‌వోలు చానెల్‌ ప్రసారాలు నిలిపివేశారంటూ ఏబీఎన్‌ దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను జస్టిస్‌ జగదీష్‌సింగ్‌ ఖేహార్‌, జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్‌, జస్టిస్‌ కురియన్‌ జోసఫ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. వాడివేడిగా సాగిన వాదనలను విన్న అనంతరం... తెలంగాణలో ఏబీఎన్‌ - ఆంధ్రజ్యోతి ప్రసారాలను పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం విస్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే... గత ఏడాది జూన్‌ 16వ తేదీన ఏబీఎన్‌ ప్రసారాలను నిలిపివేశారని చానల్‌ తరఫు న్యాయవాదులు గంగూలీ, జి.ప్రభాకర్‌ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ప్రసారాలు చేసిందనే సాకుతో.. ఏకపక్షంగా ఎంఎస్‌వోలపై ఒత్తిడి తెచ్చి ఏబీఎన్‌ను నిలిపి వేశారని అన్నారు. ఎంఎస్‌వోలపై ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తెచ్చినందుకే చానల్‌ ప్రసారాలు నిలిపివేశారని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. గతంలో జీ టెలీఫిలిమ్స్‌ లిమిటెడ్‌ వర్సెస్‌ కేంద్ర ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గంగూలీ ఉటంకించారు. చానల్‌ ప్రసారాలను నిలిపివేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని, కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌ (నియంత్రణ) చట్టం, 1995 ప్రకారం ఎంఎస్‌వోలకు ఆ అధికారం లేదని వాదించారు. దీంతో.. చానల్‌ను నిషేధించడమంటే ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని కోర్టు అభిప్రాయపడింది. వెంటనే చానల్‌ ప్రసారాలను పునరుద్ధరించాలని ధర్మాసనం అదేశించింది. అవసరమైతే ఎంఎస్‌వోలకు రక్షణ కల్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి, డీజీపీకి, సీఎస్‌కి ఆదేశాలిచ్చింది.

          సందర్భం వచ్చినప్పుడల్లా నిషేధంతో తమకేమీ సంబంధం లేదని చెప్పుకుంటున్న తెలంగాణ సర్కారుకు సుప్రీం మొట్టికాయ వేసింది. సర్వోన్నత న్యాయస్థానంలోనూ మాకు సంబంధం లేదన్న తెలంగాణ సర్కారు తరపు న్యాయవాది వాదనపై ధర్మాసనం మండిపడింది. చానెల్‌ ప్రసారాలు నిలిపివేయాలని స్వయంగా ముఖ్యమంత్రే అసెంబ్లీ వేదికగా చెప్పారని, ఎంఎస్‌వోలపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని అంతకంటే నిదర్శనం ఏం కావాలని జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్‌.. తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. హైకోర్టులో ఎంఎస్‌వోలు సమర్పించిన అఫిడవిట్‌లోనూ అదే అంశాన్ని ప్రస్తావించారని న్యాయస్థానం గుర్తు చేసింది. కేంద్రప్రభుత్వం తరపు న్యాయవాది కిరణ్‌ సూరి కూడా అసలు గుట్టు విప్పారు. అక్రమంగా చానెళ్ల ప్రసారాల నిలిపివేతపై 2014 జూలై 17వ తేదీనే కేంద్ర ప్రభుత్వం 37 మంది ఎంఎస్‌వోలకు నోటీసులు జారీచేసిందని, రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే తాము ఏబీఎన్‌ ప్రసారాలు నిలిపివేసినట్లు చాలామంది ఎంఎస్‌వోలు కేంద్రానికి తెలియజేశారని చెప్పారు. ఏబీఎన్‌ ప్రసారాలు పునరుద్ధరిస్తే తమపై దాడి జరిగే అవకాశం ఉందని ఎంఎస్‌వోలు హైకోర్టుకు వెల్లడించిన విషయాన్ని కూడా ఏబీఎన్‌ తరపు న్యాయవాది గంగూలీ సుప్రీం దృష్టికి తెచ్చారు.  సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చినదే తుది తీర్పు అని ఏబీఎన్‌ తరపు న్యాయవాది గుంటూరు ప్రభాకర్‌ తేల్చిచెప్పారు. తక్షణమే ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ప్రసారాలు పునరుద్ధరించాల్సి ఉంటుందన్నారు. ఈ తీర్పుపై ఎవరూ, ఎక్కడాఅప్పీల్‌ చేసే అవకాశం కూడా లేదన్నారు.