28, మే 2018, సోమవారం

టి-కాంగ్రెస్‌లో కులకుంపట్లు


టి-కాంగ్రెస్‌లో కుల కుంపట్లు


టి-కాంగ్రెస్‌లో కుల కుంపట్లు
తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో ఏం జరుగు తోంది? అంతర్గతంగా సమన్వయం ఎలా సాగు తోంది? సమీపిస్తున్న సార్వత్రిక ఎన్నికలకు పార్టీ సంసిద్ధమవుతోందా? లేదా? ఈ ప్రశ్నలన్నింటికి ఆ పార్టీలో ఉన్నవాళ్లకే సమాధానాలు దొరకడంలేదు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బస్సుయాత్ర మినహా కాంగ్రెస్‌పార్టీ చెప్పుకోదగ్గ రీతిలో కార్యాచరణ సిద్ధం చేయడం లేదంటూ సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వస్తున్నాయి. హస్తినలో తనకున్న పలుకుబడితో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మిగతా నాయకులకు, సీనియర్లకు రాహుల్‌గాంధీ ద్వారా చెక్‌ పెట్టించారన్న ఆరోపణ లున్నాయి. రాహుల్‌ కోటరీలోని రాష్ట్ర పార్టీ ఇంఛార్జ్‌ రామచంద్ర కుంతియా అండదండలతో పార్టీలో తనదైన ముద్రవేసుకునే క్రమంలో పావులు కదుపు తున్నట్లు చెప్పుకుంటున్నారు. అందులో భాగంగానే పార్టీలో మిగతా నేతలు తలపెట్టిన పాదయాత్రలు, ఇతర సభలు, సమావేశాలకు రాహుల్‌గాంధీతో చెక్‌ పెట్టించారన్న వాదనలున్నాయి.
ఈ పరిణామాలతో కాంగ్రెస్‌ సీనియర్లు, ఇతర నాయకుల నుంచి అధిష్టానానికి పలు ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు, జరిగిన సంఘటనలను ప్రస్తావిస్తూ అధిష్టానం ముందు పంచాయతీ పెట్టినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్‌ అగ్రనేతలు రాష్ట్రంలో పరిణామాలపై సునిశితంగా దష్టిపెట్టినట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా కర్ణాటక ఏపిసోడ్‌తో బిజీగా ఉన్న అధిష్టానం అక్కడ పరిస్థితులు కుదురు కున్న తర్వాత తెలంగాణ పిసిసిపై దష్టి పెట్టనున్నట్లు పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
ప్రధానంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ రామచంద్ర కుంతియాను తప్పించే అవకాశాలున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. పార్టీలో ఓ బలమైన సామాజికవర్గం చెప్పిన మాటలు మాత్రమే వింటూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఈ క్రమంలో కుంతియాను తప్పించేందుకు సహేతుక మైన కారణాలు కూడా అధిష్టానం ముందుకు వెళ్లాయని చెబుతున్నారు.
రాహుల్‌గాంధీ కోటరీలో ఉండటంతో నేత లందరిని కుంతియా సమన్వయం చేస్తారని పార్టీ నేతలంతా భావించారు. కాలక్రమేణా ఆయన టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అదే సామాజిక వర్గానికి చెందిన నేతల మాటలకే విలువ ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రానికి వచ్చిన సమయంలో ఆ సామాజికవర్గంతోనే మాట్లాడుతున్నట్టు, పలు విషయాలు చర్చిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. బిసి నేతలు చెప్పిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోవడం, తమ బాధలను కూడ వినకపోవడంతో వారంతా కుంతియా పట్ల అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రజా చైతన్య బస్సుయాత్రలో టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. వాటిలో అత్యధికం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉండటం గమనార్హం. బిసి అభ్యర్థులు ఉన్నప్పటికి వారి అభిప్రాయాలు తెలుసుకోకుండా అభ్యర్థులను ప్రకటించడం వెనక కుంతియా హస్తం ఉన్నట్టు నేతలు చెబుతున్నారు. నర్సంపేట దొంతి మాధవరెడ్డి, పాలకుర్తి జంగా రాఘవరెడ్డి, నిర్మల్‌ మహేశ్వరరెడ్డి, ఆర్మూర్‌ కెఆర్‌ సురేష్‌రెడ్డి, హుస్నాబాద్‌కు ప్రవీణ్‌రెడ్డిని ప్రకటించారు. ఇబ్రహీంపట్నం అభ్యర్థిగా క్యామమల్లేష్‌ ఉండగా, మల్‌రెడ్డి రంగారెడ్డికి కూడా హామీ ఇచ్చారు. మరి బస్సుయాత్రలో బాల్కొండ, ములుగు, ఇల్లెందు, పెద్దపల్లి వంటి నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎందుకు ప్రకటించలేదని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తు న్నారు. ఒక్కొక్క చోట ఇద్దరు లేదా ముగ్గురు అభ్యర్థులు కూడా బరిలో ఉండగా కేవలం ఆ సామాజికవర్గానికి చెందిన పేర్లు ప్రకటించడానికి కుంతియా ఎలా అనుమతి ఇస్తారని మిగతా నేతలు ఆరోపిస్తున్నారు. అభ్యర్థుల ప్రకటనపై ఉత్తమ్‌ కుమార్‌ను మందలించడం గానీ దానిపై వివరణ ఇవ్వడం గానీ చేయకపోవడంతో పార్టీలో సీనియర్లు, ప్రధానంగా బిసి నేతలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్‌ ఛైర్మన్‌గా కాంగ్రెస్‌లో ఒబిసి విభాగం కొనసాగు తుండగానే కుంతియా అనుమతి మేరకు టిపిసిసి నాయకత్వం బిసి సాధికారిత కమిటీ ఏర్పాటు చేసింది. దీంతో ఒబిసి వర్సెస్‌ బిసి సాధికారత కమిటీలను నియమించి బిసిల మధ్య చిచ్చు పెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అంతర్గత కుమ్ములాటలు, గ్రూపుల కొట్లాటలతో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్‌కు కొత్తగా బిసి కుంపటి తలనొప్పిగా మారింది.
అంతేకాకుండా తెలంగాణలో కర్ణాటక తరహా పరిణామాలు ఉత్పన్నమైతే కుంతియా డీల్‌ చేయలేరనే చర్చ కూడా పార్టీ నేతల్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మార్పు ఉండొచ్చు అని పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా కర్ణాటక ఏపిసోడ్‌ తర్వాత దీనిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. కర్ణాటకలో వెలువడిన ఫలితాలతో దక్షిణాది రాష్ట్రాల్లో అవసరమైతే పిసిసి అధ్యక్షులను తప్పించి కొత్తవారికి అవకాశం కల్పించే పరిస్థితి ఉందని కూడా ఆ పార్టీ సీనియర్‌ నేతలు అంటున్నారు.
– సప్తగిరి

కాంగ్రెస్‌లో కుర్చీ కొట్లాట షురూ... (May 21-27 issue)


కారగ్రెస్‌లో కుర్చీ కొట్లాట షురూ


కారగ్రెస్‌లో కుర్చీ కొట్లాట షురూ
తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో కుర్చీ లొల్లి షురూ అయ్యింది. ఎన్నికలకు ఇంకా ఏడాది గడువుండగానే ఆ పార్టీ నాయకులు సిఎం పదవి గురించి ఎవరికి వారే యమునా తీరే అన్న మాదిరిగా ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్రంలో అధికార టిఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వగలిగే పార్టీ కాంగ్రెస్‌ మాత్రమే అని ఆపార్టీ బిల్డప్‌ ఇస్తోరది. కానీ నాయకుల వర్గపోరు, సిఎం కుర్చీ కోసం పాకులాట ఆ పార్టీకి ఇబ్బందిగా పరిణమించింది.
టార్గెట్‌ ఏంటి ?
ముఖ్యమంత్రి పదవి కేంద్రంగా కాంగ్రెస్‌ నేతలు ఇటీవలి కాలంలో వరుసగా చేసిన ప్రకటనలతో ఆ పార్టీలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలంతా ఏకతాటిపై ఉండి అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాడటానికి బదులు అప్పుడే సిఎం పదవిపై మాట్లాడటమేంటని కాంగ్రెస్‌ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొంతమంది కిందిస్థాయి నేతలు, కార్యకర్తలు ఈ విషయం పట్ల తీవ్ర నిరాశకు, అసహనానికి గురవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అవకాశాలను అందిపుచ్చుకొని అధికారంలోకి వచ్చేందుకు కలిసికట్టుగా పోరాడకుండా పదవుల కోసం కుమ్ములాడుకోవడమేంటన్న ఆగ్రహం వ్యక్తమవు తోంది. నేను సిఎం అవుతానంటే.. నేనంటూ.. నేతలు సవాళ్లు విసురుకోవడం ప్రస్తుతం పార్టీలో ఆందోళన కలిగిస్తోంది.
సిఎం కుర్చీ ప్రస్తావన వచ్చినప్పుడల్లా అడపా దడపా తన మనసులోని మాటను బయటపెట్టే సీనియర్‌ నేత జానారెడ్డి ఇటీవలే సిఎల్పి భేటీ సమయంలో మరోసారి తన కోరికను కుండబద్దలు కొట్టారు. సిఎం అయ్యే అర్హతలన్నీ తనకున్నాయని, తనకన్నా పార్టీలో ఆ పదవిని అధిష్టించే నేతలు ఎవరున్నారంటూ ఎదురు ప్రశ్నించారు. గతవారం రేవంత్‌రెడ్డి చేసిన ఓ ప్రకటన ఆ పార్టీలో ప్రకంపనలే సష్టించింది. ఇటీవలే తెలుగుదేశం నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఆయన సిఎం కావడమే తన లక్ష్యమంటూ బాహాటంగా ప్రకటించారు. తనకు మంత్రి పదవి ఇచ్చినా తీసుకోనని, కాంగ్రెస్‌లో చేరేటప్పుడు తనకు చాలా హామీలిచ్చారని అధిష్టానంపై నెపం నెట్టేశారు. ఈ వ్యాఖ్యలు కలకలం సష్టించడంతో మరుసటిరోజే ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. రేవంత్‌రెడ్డికి పార్టీలో ప్రాధాన్యమున్న ఓ పదవిని కేటాయించడం ద్వారా ఎన్నికల ఏడాదిలో క్రియాశీలం చేయాలన్న యోచనలో అధిష్టానం ఉన్న సమయంలోనే రేవంత్‌ బాంబు పేల్చారని సీనియర్లు అంటున్నారు.
మరోవైపు శాసనమండలిలో విపక్షనేత షబ్బీర్‌ అలీ కూడా సిఎం పదవిని ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. తాను సిఎం రేసులో లేనని, తనకు తోకలేమీ లేవని చెప్పడం ఆయన మాటల్లోని వ్యంగ్యాన్ని ప్రస్ఫుటించింది. అయితే ఇలాంటి పరిణామాలే అధికార పక్షమైన టిఆర్‌ఎస్‌కు ఆయువుపట్టుగా నిలుస్తాయన్న అభిప్రాయాలు కొంతమంది కాంగ్రెస్‌ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే తమకు ఎదురే లేదన్న రీతిలో వ్యవహరిస్తున్న టిఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌లోని ఈ అంతర్గత విభేదాలు మరింత ఆసరాగా పనికొస్తున్నాయంటున్నారు.
అప్పుడూ ఇదే తీరు
2014 ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్‌ నుంచి ఏడెనిమిది మంది నేతలు సిఎం పదవి కోసం పోటీ పడినట్లు ప్రచారం జరిగింది. ఎన్నికలపై కాకుండా సిఎం పదవిపైనే దష్టిపెట్టి పార్టీ గెలుపును మర్చిపోయారని, అందుకే గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ తీవ్రంగా నష్టపోయిందని చెబుతున్నారు.
నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం
అంతే కాదు.. కాంగ్రెస్‌ పార్టీని ఇప్పుడు మరో సమస్య కూడా వేధిస్తోంది. కొంతమంది నాయకుల తీరు పార్టీకి శరాఘాతంగా మారింది. ఆధిపత్య పోరు కారణంగా నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. 2019లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వ్యూహాలు పన్నుతున్న కాంగ్రెస్‌ అధిష్టానం ఇతర పార్టీల నుంచి జనామోదం ఉన్న నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తుండగా స్థానిక నేతలు మాత్రం అడ్డుపుల్లలు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి రాకను ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకించిందని, అలాగే నల్గొండ జిల్లాలో పిసిసి ముఖ్యనేత తన అనుచరుడి కోసం జిట్టా బాలకష్ణారెడ్డిని, ఉమా మాధవరెడ్డిని అడ్డుకున్నారని, అందుకే ఉమా మాధవరెడ్డి గులాబీ గూటికి చేరారని తెలుస్తోంది. కంచర్ల భూపాల్‌రెడ్డి హస్తం వైపు చూసినా కోమటిరెడ్డి బ్రదర్స్‌ అడ్డు కోవడంతో ఆయన కూడా కారెక్కారని సమాచారం. వేముల వాడ నేత ఆది శ్రీనివాస్‌ కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నించిన సమ యంలో పిసిసి సభ్యుడొకరు రాకుండా ఆయన్ను అడ్డుకున్నారని, నిర్మల్‌లో ఓ లాయర్‌ కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తే ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడు అడ్డుకున్నారని పార్టీలోనే ప్రచారం జరుగుతోంది.
మరోవైపు సొంత పార్టీ నేతల మధ్య నడుస్తున్న మాటల యుద్ధం కూడా కాంగ్రెస్‌ పార్టీకి ఇబ్బందిగా మారిందంటున్నారు విశ్లేషకులు. ఒకరిని డమ్మీ చేసేలా మరొకరు కౌంటర్లు ఇవ్వడం, విమర్శలు చేసుకోవడం, వ్యంగ్యాస్త్రాలు సంధించుకోవడం ఆ పార్టీలో రాజకీయంగా ప్రతికూలతలకు దారితీస్తున్నాయి.
– సప్తగిరి
(http://www.jagritiweekly.com/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b2%e0%b1%87%e0%b0%b7%e0%b0%a3/%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b1%86%e0%b0%b8%e0%b1%8d%e2%80%8c%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%95%e0%b1%81%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9a%e0%b1%80-%e0%b0%95%e0%b1%8a%e0%b0%9f%e0%b1%8d/)

18, మే 2018, శుక్రవారం

ఫ్రంట్‌ ప్రయత్నమా ? ప్రచార ఆర్భాటమా ? (14-20 May 2018 Issue)


ఫ్రంట్‌ ప్రయత్నమా ? ప్రచార ఆర్భాటమా ?

ఫ్రంట్‌ ప్రయత్నమా ? ప్రచార ఆర్భాటమా ?

ఫ్రంట్‌ ప్రయత్నమా ? ప్రచార ఆర్భాటమా ?
దేశంలో గుణాత్మక మార్పు తీసుకొస్తానంటూ రెండు నెలలుగా వల్లె వేస్తున్న తెలంగాణ సిఎం కెసిఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ కేవలం ప్రచార ఆర్భాటమేనా ? ఇప్పటిదాకా సాగిన పర్యటనలు, జరిగిన చర్చల్లో స్పష్టత కొరవడిందా ? దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఒకేతాటిపైకి రావడమన్నది సాధ్యం కాని పనా ? ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం దాదాపుగా అవుననే వినపడుతోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ హైదరాబాద్‌ నుంచి పిలుపునిచ్చిన ఫెడరల్‌ ఫ్రంట్‌పై గందరగోళం ఏర్పడుతోంది. ఇప్పటివరకు కెసిఆరే స్వయంగా వెళ్లి పలువురు ప్రాంతీయ పార్టీల నేతల్ని కలిస్తే మరి కొందరు హైదరాబాద్‌ వచ్చి ఆయన్ను కలిశారు. అయితే కెసిఆర్‌తో భేటీ తర్వాత ఉమ్మడిగా నిర్వహించిన విలేకరుల సమావేశాల్లో వెల్లడించే అంశాలకు, ఆ తర్వాత ఆయా నేతలు చెబుతున్న మాటలకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు.
ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రకటన తర్వాత పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతాబెనర్జీ తనకు ఫోన్‌ చేశారని, ఫ్రంట్‌కు మద్దతు తెలిపారని కెసిఆర్‌ చెప్పారు. అయితే ఆ మరుసటిరోజే అక్కడి ఓ ఆంగ్లపత్రిక తెలంగాణ సిఎం కెసిఆరే మమతకు ఫోన్‌ చేసి మద్దతు కోరినట్లు ప్రచురించిన కథనం సంచలనం రేపింది. జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, జెఎంఎం నేత హేమంత్‌ సోరెన్‌ కూడా మొదట్లో సిఎం కెసిఆర్‌కు మద్దతు తెలిపినా ఆ మరుసటిరోజే మాటమార్చి తాము కాంగ్రెస్‌ వెంటే ఉంటామని చెప్పారు.
ఇటీవల ముఖ్యమంత్రి కెసిఆర్‌ తన బందంతో కలిసి చెన్నై వెళ్లారు. డిఎంకె నేతలు కరుణానిధి, స్టాలిన్‌, కనిమొళితో సమావేశం అయ్యారు. జాతీయ స్థాయిలో ఫ్రంట్‌ ఏర్పాటుపై తాము చర్చించినట్లు కెసిఆర్‌ తెలిపారు. అయితే ఆ తర్వాత ఎంపి కనిమొళి అందుకు భిన్నంగా స్పందించి కెసిఆర్‌కు షాక్‌ ఇచ్చారు. డిఎంకె కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ భేటీ సందర్భంగా మూడో కూటమి అంశం ప్రస్తావనకు రాలేదని కనిమొళి తెలిపారు. చెన్నై విమానాశ్రయంలో ఆమె విలేకర్లతో మాట్లాడుతూ కెసిఆర్‌, స్టాలిన్‌ భేటీ రాజకీయ కూటమి దష్టితో జరగలేదని, రాష్ట్ర హక్కుల గురించే చర్చించారన్నారు. పైగా కాంగ్రెస్‌తో తాము కటీఫ్‌కు సుముఖంగా లేమని కూడా సంకేతాలు ఇవ్వడం కలకలం రేపింది.
మరోవైపు హైదరాబాద్‌కు వచ్చి కెసిఆర్‌తో భేటీ అయిన ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పి అధినేత అఖిలేశ్‌యాదవ్‌ కూడా కెసిఆర్‌ పాలనను పొగడటం పైనే ఎక్కువగా ఫోకస్‌ చేశారు. కెసిఆర్‌ నేతత్వంలో తెలంగాణ ముందుకు వెళ్తోందని, దేశంలో పేదలు, రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, బిజెపి సర్కారును ప్రాంతీయ పార్టీలే నిలువరించగలుగుతా యన్నారు అఖిలేష్‌. దేశంలో మార్పు కోసం కెసిఆర్‌ చేస్తున్న ప్రయత్నం చాలా మంచిదని, దీనివల్ల దేశానికి మంచి జరుగుతుందని అఖిలేష్‌ చెప్పారు. కెసిఆర్‌ స్పష్టంగా బిజెపి, కాంగ్రెస్‌లపైనే జాతీయ స్థాయిలో పోరాటమని ప్రతిసారీ చెబుతుండగా అఖిలేష్‌ మాత్రం కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తావన ఎక్కడా తీసుకురాలేకపోవడాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. మరోవైపు ఫ్రంట్‌ పేరిట వ్యక్తిగత ప్రచారం పెంచుకునేందుకే కెసిఆర్‌ ప్రాధాన్యం ఇస్తున్నారన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
అయితే కెసిఆర్‌ ఫ్రంట్‌ ప్లాన్‌కు కర్ణాటక ఎన్నికల ఫలితాలు కీలకమని కొంతమంది అంటున్నారు. ప్రాంతీయ పార్టీ అయిన జెడిఎస్‌ అక్కడ విజయం సాధిస్తేనే ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని, అందుకే కెసిఆర్‌ బెంగళూరు వెళ్లి దేవెగౌడను, కుమారస్వామిని కలిశారన్న ప్రచారం జరుగుతోంది. అయితే గులాబీ బాస్‌ బెంగళూరు పర్యటనలో అనేక రాజకీయ కోణాలు దాగున్నాయని పలువురు నాయకులు భావిస్తున్నారు. కెసిఆర్‌తో దేవెగౌడ ఏం మాట్లాడారు ? అసలు వారి మధ్య కూటమి ప్రస్తావన వచ్చిందా ? ఫ్రంట్‌ ఏర్పాటుపై దేవెగౌడ కెసిఆర్‌కు హామీ ఇచ్చారా ? అన్న సందేహాలకు స్పష్టత కరువైంది. భేటీ అనంతరం విలేకరుల సమావేశంలో మాత్రం దేవెగౌడ కూటమి మాటను దాటేసి మాట్లాడారు. తెలంగాణలో జనరంజక పాలన సాగుతోందని, అద్భుతమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని సిఎం కెసిఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. కెసిఆర్‌ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి కూడా దేవెగౌడ మద్దతు ఇచ్చారన్నారు. అంతే తప్ప ఫ్రంట్‌పై దేవెగౌడ నుంచి కెసిఆర్‌కు కచ్చితమైన హామీ లభించలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
జాతీయ రాజకీయాల్లో బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలకు ప్రత్యామ్నాయంగా, ప్రాంతీయ పార్టీలతో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటే లక్ష్యమంటున్న కెసిఆర్‌ కేవలం యుపిఎ భాగస్వామ్యపక్షాలను మాత్రమే కలుస్తు న్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. పైగా కెసిఆర్‌ మూడో కూటమి ఓ కుట్ర అంటూ మొదటి నుంచీ విమర్శిస్తున్న తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు పలువురు నేతలకు లేఖలు కూడా రాసినట్లు చెబుతున్నారు. దేవెగౌడ, మాయావతి, మమతా బెనర్జీ, నవీన్‌ పట్నాయక్‌, అఖిలేష్‌ యాదవ్‌, హేమంత్‌ సోరెన్‌, స్టాలిన్‌ తదితరులకు రాసిన లేఖల్లో తన అసమర్థ పాలన, అవినీతి నుంచి ప్రజల దష్టి మళ్లించేందుకే ఫెడరల్‌ ఫ్రంట్‌ నాటకానికి కెసిఆర్‌ తెర తీశారని కాంగ్రెస్‌ లేఖల్లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఆ లేఖల ప్రభావం కూడా కెసిఆర్‌ పర్యటనల తర్వాత ఆయా పార్టీల నేతల ప్రతి స్పందనపై ఉంటోందంటున్నారు.
మరోవైపు కెసిఆర్‌ ఎక్కడికి వెళ్లినా తన టీమ్‌లో కనీసం 30 మంది దాకా ఉంటున్నారని వాళ్లందరికీ విమానయాన ఖర్చు, తిండి, ఇతర ఖర్చులన్నీ తెలంగాణ సర్కారు ఖజానాపై పడుతున్నాయన్న విమర్శలూ వినపడతున్నాయి. వాస్తవానికి కెసిఆర్‌ చేస్తున్న ఫ్రంట్‌ ప్రయత్నాలు రాజకీయ సంబంధమై నవి. ఆ తరహా యాత్రలు, చర్చలు, సమావేశాలు, భేటీలన్నీ పార్టీ తరపున చేస్తున్న కార్యక్రమాల కిందకు వస్తాయి. కానీ ఇప్పుడు కెసిఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ కోసం చేస్తున్న పర్యటనలకు సంబంధించిన ఖర్చు అంతా అధికారిక ఖాతాలోకి వెళ్తోంది.
– సప్తగిరి

11, మే 2018, శుక్రవారం

ఒక్క సభ.. రెండు లక్ష్యాలు... (7th May)


ఒక్క సభ… రెండు లక్ష్యాలు…

ఏప్రిల్‌ 27వ తేదీన హైదరాబాద్‌ శివారులోని కొంపల్లిలో జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ప్లీనరీలో ‘ఒక్కదెబ్బకు రెండు పిట్టలు’ అన్న సామెతను కళ్లకు కట్టించారు ఆ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌. ఇటు వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తమ పార్టీని ఎదురులేని శక్తిగా నిలుపు కోవడంతో పాటు, అటు జాతీయ రాజకీయాల్లోనూ నిర్ణయాత్మక శక్తిగా ఎదిగే క్రమాన్ని నిర్దేశించు కున్నారు. అంతేకాదు బహిరంగంగా అందరి ఆమోదాన్ని అందుకోవడంలో తాను ముందస్తుగా తయారుచేసుకున్న స్కెచ్‌లో కెసిఆర్‌ సఫలమయ్యారనే చెప్పాలి. ప్లీనరీ వేదికగా తన సరికొత్త రాజకీయ వ్యూహానికి వేగం పెంచారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరిట కేంద్ర ప్రభుత్వం, జాతీయ రాజకీయ పార్టీలపై సమరశంఖం పూరించిన కెసిఆర్‌ ఆ దిశగా మరో అడుగు ముందుకేశారు.
స్కెచ్‌ రెడీ
రాజకీయ చతురతలో తిరుగులేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న కెసిఆర్‌ ఏదైనా అంశం మీద పోరు మొదలెట్టారంటే దాని వెనుక పటిష్టమైన పునాది, అధ్యయనం, దీర్ఘకాలిక ప్రయోజనం ఉండేలా ప్రణాళికలు రూపొందించుకుంటారని రాజకీయ విశ్లేషకులు చెబుతారు. అలా ఇప్పుడు జాతీయ రాజకీయాల విషయంలోనూ కెసిఆర్‌ తనదైన స్టైల్‌లో దూసుకు పోయేందుకు టాప్‌గేర్‌ వేసుకున్నారు. ప్రధానంగా 2019 ఎన్నికలే లక్ష్యంగా ఇటు తెలంగాణలో, అటు జాతీయ స్థాయిలో తిరుగులేని ఆధిపత్యానికి పక్కా స్కెచ్‌ రెడీ చేసుకుంటున్నారు.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014 ఎన్నికలలో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టిన కెసిఆర్‌ గడిచిన నాలుగేళ్లలో పార్టీని తిరుగులేని శక్తిగా కనీసం బలమైన ప్రతిపక్షం కూడా తయారు కాకుండా రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సొంత పార్టీ సమ్మతితో, హైదరాబాద్‌ గడ్డపై నుంచే జాతీయ స్థాయిలో ఫెడరల్‌ ఫ్రంట్‌కు మార్గం సుగమం చేసుకున్నారు. ఈ క్రమంలోనే టిఆర్‌ఎస్‌ ప్లీనరీలో జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టే అంశాన్నే మొట్టమొదటి తీర్మానంగా ప్రవేశపెట్టించారు.
హైదరాబాద్‌ నుంచే హస్తిన పాలిటిక్స్‌
ప్లీనరీలో తన భవిష్యత్‌ వ్యూహానికి సంబంధిం చిన తీర్మానం ఆమోదం పొందిన వెంటనే కెసిఆర్‌ సుదీర్ఘ ప్రసంగం చేశారు. హైదరాబాద్‌ నుంచే భూకంపం సష్టిస్తానన్నారు. దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తానని స్పష్టం చేశారు. భారత ఆత్మగౌరవ బావుటా తానే ఎగరేస్తానని చెప్పుకొచ్చారు. ‘హర్‌ ఎకర్‌కో పానీ.. హర్‌ ఖేత్‌కో పానీ’ (ప్రతి ఎకరాకూ, ప్రతి పొలానికీ నీరు) అన్నదే ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రధాన నినాదంగా ప్రకటించారు. ఫ్రంట్‌ పేరుతో ఢిల్లీ వెళ్తున్నా అని ఎవరూ అనుకోవద్దని, హైదరాబాద్‌ నుంచే దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తానని ‘జై తెలంగాణ-జై భారత్‌’ అని నినదించారు.
మొదలైన కార్యాచరణ
‘మొండిగా భూకంపం సృష్టించి రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా నిజం చేశానో రాబోయే రెండు, మూడు నెలల్లో పక్షిలా తిరిగి, ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి దేశంలో గుణాత్మక మార్పు కోసం అంతే కృషి చేస్తాను’ అన్నారు కెసిఆర్‌. అంతకుముందే ఫ్రంట్‌ కోసం దేశమంతా తిరుగుతానని చెప్పిన కెసిఆర్‌ మొట్టమొదటిగా కోల్‌కతా వెళ్లి పశ్చిమబెంగాల్‌ సిఎం మమతాబెనర్జీని కలిశారు. ఆ తర్వాత బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడకు ఫ్రంట్‌ ఉద్దేశాలు వివరించారు. ఈ క్రమంలోనే కెసిఆర్‌ కుమారుడు కెటిఆర్‌ లక్నో వెళ్లి యుపి మాజీ సిఎం అఖిలేష్‌ యాదవ్‌ను కలిసి వచ్చారు. ప్లీనరీ జరిగిన రెండోరోజే కెసిఆర్‌ చెన్నై వెళ్లి డిఎంకె అధినేత కరుణానిధి, స్టాలిన్‌ను కలిశారు. మరోవైపు జార్ఖండ్‌ ముక్తి మోర్చా అధినేత శిబూసోరేన్‌తోనూ ఫ్రంట్‌పై చర్చలు సాగించారు. మే నెలలో ఒడిశా వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి నవీన్‌ పట్నాయక్‌ను కూడా కలిసేందుకు కెసిఆర్‌ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని కొంత మంది చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు తిరిగి ప్రాంతీయ పార్టీలను ఫెడరల్‌ ఫ్రంట్‌వైపు ఆకర్షించడమే కెసిఆర్‌ ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.
టిఆర్‌ఎస్‌ను గద్దెదించుతామన్న టిజెఎస్‌
ఇదిలా ఉంటే మరోవైపు టిఆర్‌ఎస్‌ ప్లీనరీ జరిగిన రెండోరోజే ఏప్రిల్‌ 29న తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భంచింది. ఏప్రిల్‌ మొదటివారంలోనే పార్టీని ప్రకటించిన కోదండరాం తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభను సరూర్‌నగర్‌ స్టేడియంలో అట్టహాసంగా నిర్వహించారు. కెసిఆర్‌ను గద్దె దించడానికే తాము బయలుదేరామని కుండబద్దలు కొట్టారు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పూరించిన ఈ శంఖారావంతో నవతెలంగాణ నిర్మించడమే లక్ష్యమన్నారు. తెలంగాణ జనం ఓట్లతో గెలిచిన కెసిఆర్‌ తన కుటుంబ పెత్తనం సాగిస్తున్నాడని ఆక్రో శించారు. ప్రభుత్వం ప్రజల మీద పరాన్నభుక్కుగా జీవిస్తోందని విరుచుకుపడ్డారు. ప్రగతిభవన్‌ పాఠక్‌ తీయరని, సచివాలయానికి రారని, ఇదేం పాలన ? అని ప్రశ్నించారు. 2019లో రాజ్యాధికారమే లక్ష్యంగా బరిలోకి దిగుతామన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రాజెక్టుల్లో అవినీతిపై విచారణ జరిపిస్తామన్నారు. వ్యవసాయమే టిజెఎస్‌ ప్రధాన అజెండా అని కోదండరాం స్పష్టం చేశారు. డబ్బులతో రాజకీయాలు చేయడం తమకు రాదని, సామాన్యుల పక్షాన నిలబడేందుకే పార్టీ జెండా ఎగురవేశామని స్పష్టం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అధికారాన్ని దుర్వినియోగం చేసేవారిని నిలదీద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం ఉద్యమాలు చేసి నిరసనల్లో పాల్గొని జైలుకు వెళ్లిన వాళ్లు రౌడీషీటర్లు అయ్యారని, ఉద్యమకారులను అణచివేసిన, ఉద్యమానికి అప్పుడు ద్రోహం చేసిన వాళ్లు తెలంగాణ స్వరాష్ట్రంలో మంత్రులై రాష్ట్రాన్ని ఏలుతున్నారని దుయ్యబట్టారు.
– సప్తగిరి

హైకోర్టు మొట్టికాయలు (30th April)


గుట్టువిప్పిన కాగ్‌ (9th April)


హైకోర్టు మొట్టికాయలు



తెలంగాణ ప్రభుత్వానికి గతవారం రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. అసెంబ్లీలో సంపూర్ణ మెజారిటీ ఉందని, విపక్షాల్లో సరైన నాయకులు లేరని, వచ్చే ఎన్నికల్లోనూ తమదే విజయమని కలలు కంటున్న టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఓ రెండు నిర్ణయాలు తలబొప్పికట్టించేలా మారాయి. ఆ రెండూ న్యాయస్థానాల్లో తగిలిన ఎదురుదెబ్బలే కావడం గమనార్హం. 2019 ఎన్నికల్లో తమకు ఎదురే లేదన్న అత్యుత్సాహంతో దూసుకెళ్తోన్న టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ పరిణామాలతో కాస్త ఆలోచనలో పడినట్లు కనిపిస్తోంది. ఈ విషయంలో రాజకీయంగా ఎలాంటి కార్యాచరణ చేపట్టని కెసిఆర్‌ సర్కారు ప్రస్తుతం వచ్చే నెలలో రైతులకు పెట్టుబడి పథకం కింద నాలుగువేల రూపాయలు అందించే ‘రైతుబంధు’ పథకంపై దష్టిపెట్టింది.
ఎంఎల్‌ఏల బహిష్కరణ ఎత్తివేత
ఎంఎల్‌ఏల అనర్హత వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లకు హైకోర్టులో ఊరట లభించింది. వారిపై తెలంగాణ అసెంబ్లీ విధించిన బహిష్కరణ వేటును రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఎత్తేసింది. వారి శాసనసభ సభ్యత్వాలను పునరుద్ధరించాలని ఆదేశాలు జారీచేసింది. వారు తప్పు చేశారని భావిస్తే ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు గానీ, అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం సరికాదని ప్రభుత్వానికి న్యాయస్థానం మొట్టికాయలు వేసింది.
తెలంగాణ బడ్జెట్‌ సమావేశాల తొలి రోజున గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా కాంగ్రెస్‌ సభ్యులు సభలో ఆందోళన చేశారు. గవర్నర్‌ ప్రసంగం ప్రతులను చించేశారు. అదే సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెడ్‌ఫోన్‌ను విసరగా అది శాసనమండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ కంటికి తగిలినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం సభలో క్రమశిక్షణా రాహిత్యంగా ప్రవర్తించా రంటూ కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏలు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, సంపత్‌కుమార్‌పై బహిష్కరణ విధించింది. వారి శాసన సభ్యత్వాలు రద్దయినట్లు అధికారిక ప్రకటన జారీచేసింది. మరో అడుగు ముందుకేసి ఎంఎల్‌ఏల బహిష్కరణతో ఖాళీ అయిన నల్గొండ, అలంపూర్‌ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సిందిగా ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసింది. అంతేకాకుండా బడ్జెట్‌ సమావేశాలకు హాజరుకాకుండా జానారెడ్డి సహా కాంగ్రెస్‌ శాసనసభ్యులందరిపై సస్పెన్షన్‌ వేటు వేసింది. అయితే ఈ బహిష్కరణ ఉదంతంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లు హైకోర్టును ఆశ్రయించారు. తమను అసెంబ్లీ నుంచి బహిష్కరించడం ప్రజాస్వామ్య విరుద్ధమని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం చేసిన ఆరోపణలకు సంబం ధించిన ఆధారాలను ఇవ్వాలని కోర్టు ఎన్నిసార్లు కోరినా ప్రభుత్వం ఇవ్వలేదు. దీంతో పలుమార్లు వాదనలు విన్న హైకోర్టు కాంగ్రెస్‌ సభ్యులకు ఊరట కలిగిం చేలా తీర్పు వెలువరించింది. కోమ టిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ కుమార్‌లు యథా విథిగా తమ పదవుల్లో కొనసాగొచ్చని స్పష్టం చేసింది. కోర్టు తీర్పుతో ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలన్నీ రద్దయ్యాయి. దీంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు.
మరోవైపు హైకోర్టు సింగిల్‌బెంచ్‌ తీర్పుపై టిఆర్‌ఎస్‌ అప్పీల్‌కు వెళ్లింది. రాజకీయ కోణంలో భాగంగా అధికార పార్టీకి చెందిన 12 మంది ఎంఎల్‌ఏలతో తీర్పును సమీక్షించాలంటూ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయించింది. హైకోర్టు తీర్పును డివిజన్‌ బెంచ్‌ సమీక్షించాలని కోరుతూ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ‘సభ్యుల కంటే సభ గౌరవం అత్యంత ముఖ్యం. సభ గౌరవానికి ఎవరు భంగం కలిగించినా చర్యలు ఉండాల్సిందే. భవిష్యత్‌కు ఆ మేరకు సంకేతం ఉండాలి’ అని టిఆర్‌ఎస్‌ వాదిస్తోంది. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి కెసిఆర్‌ గవర్నర్‌ నరసింహన్‌తో రాజ్‌భవన్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ సభ్యుల బహిష్కరణ, హైకోర్టు తీర్పు, ప్రభుత్వ ఆలోచనలపై గవర్నర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ సభ్యులపై వేటు నిర్ణయం సభ తీసుకుంది కాబట్టి న్యాయస్థానం తీర్పును చర్చించడానికి అసెంబ్లీని సమావేశపరచా లన్న ఆలోచన కూడా వచ్చినట్లు చెబుతున్నారు.
కోదండరాం సభకు కోర్టు అనుమతి
తెలంగాణ జనసమితి పార్టీకి కూడా హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 29న ఆ పార్టీ నిర్వహించే సభకు కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మూడు రోజుల్లోగా అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. టిజెఎస్‌ వ్యవస్థాపకుడు కోదండరాం ఏప్రిల్‌ 29న సరూర్‌నగర్‌ గ్రౌండ్‌లో తెలంగాణ జనసమితి పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఆ సభకు అనుమతి ఇవ్వలే మని పోలీసులు, సరూర్‌నగర్‌ గ్రౌండ్‌ నిర్వాహకులు చెప్పారు. నగరంలో ఏదో ఒక స్టేడియంలో గానీ, ఖాళీస్థలంలో గానీ అనుమతి ఇచ్చినా సరేనని టిజెఎస్‌ కోరినా ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో తెలంగాణ జనసమితి నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు సభకు అనుమతి ఇవ్వాలని ఆదేశించింది.
కోర్టు నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో స్టేడియంలో ఏర్పాట్లకు టిజెఎస్‌ నేతలు సిద్ధ మయ్యారు. పార్టీ ఆవిర్భావ సభ ద్వారా రాజకీయ మార్పుకు శ్రీకారం చుట్టాలని కోదండరాం కార్య కర్తలకు విజ్ఞప్తి చేశారు. సభ నిర్వహణ బాధ్యతలను చూసేందుకు పలు కమిటీలను సైతం ఏర్పాటు చేశారు.
పంచాయతీ ఎన్నికల కసరత్తు షురూ
గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రంలో గ్రామ పంచాయతీల ఎన్నికల కసరత్తును తెలంగాణ ఎన్నికల కమిషన్‌ వేగవంతం చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పంచాయతీల పరిధిలో ఓటర్ల జాబితా కార్యాచరణను మే 17కల్లా సిద్ధం చేయాలని స్పష్టం చేసింది. దాని ప్రకారం ఈ నెల 30న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటిస్తారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. మే నెల 1న ఎన్నికల సంఘం అధికారులు జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీలతో, 3న మండల స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తారు. ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు మే 1 నుంచి 8వ తేదీ వరకు అవకాశం కల్పిస్తారు. ఈ అభ్యంతరాలను మే 10వ తేదీలోపు పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. వార్డుల విభజనతో సహా ఫొటోలతో కూడిన తుది ఓటర్ల జాబితాను మే 17న ప్రకటిస్తారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేలోపు మార్పులు, చేర్పులకు అవకాశం ఉంటుంది. పంచాయతీరాజ్‌ చట్టం-2018కి అనుగుణంగా ఈ ఎన్నికలుంటాయని తెలంగాణ ఎన్నికల సంఘం పేర్కొంది.
– సప్తగిరి (http://www.jagritiweekly.com/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b2%e0%b1%87%e0%b0%b7%e0%b0%a3/%e0%b0%b9%e0%b1%88%e0%b0%95%e0%b1%8b%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81-%e0%b0%ae%e0%b1%8a%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%bf%e0%b0%95%e0%b0%be%e0%b0%af%e0%b0%b2%e0%b1%81/) 
(Index, latestnews, ప్రాంతీయం, విశ్లేషణ)

బాలారిష్టాల్లో కోదండరాం పార్టీ

బాలారిష్టాల్లో కోదండరాం పార్టీ
కెసిఆర్‌ను గద్దె దించడమే లక్ష్యమంటూ ఆవిర్భవించిన ‘తెలంగాణ జన పార్టీ’ కి ఆదిలోనే కష్టాలు ఎదురవుతున్నాయి. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన టి జెఏసి ఛైర్మన్‌ కోదండరాం ఇటీవల ‘తెలంగాణ జన సమితి’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. అయితే కోదండరాం నూతన పార్టీకి టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అడుగడుగునా అడ్డుపడుతోంది.
తెలంగాణ జన సమితి వ్యవస్థాపకుడు ప్రొఫెసర్‌ కోదండరాం ఈ నెల 29వ తేదీన హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ గ్రౌండ్‌లో భారీ ఎత్తున పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సభకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిని నిరాకరించింది. దీంతో సభకు అనుమతి కోసం ఆ పార్టీ ప్రారంభంలోనే కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది.
టి జెఏసి ఆధ్వర్యంలో ఆ మధ్యన ‘కొలువుల కొట్లాట’ పేరుతో ఓ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని కోదాండరాం భావించారు. అయితే దానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో జెఏసి నేతలు కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నారు. ట్యాంక్‌ బండ్‌పై ‘మిలియన్‌ మార్చ్‌ స్ఫూర్తి సభ’ ను వేలాది మందితో నిర్వహించాలని ఆయన భావించారు. దీనికి కూడా ప్రభుత్వం అడ్డుపడింది. ఆ సభ నిర్వహిస్తే నగరంలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతా యని నాయకులను ముందుస్తు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా రాజకీయ స్వేచ్ఛ లభించడం లేదని, రాష్ట్రంలో రాచరికపుపాలన రాజ్యమేలుతోందని తెలంగాణ జన సమితి పార్టీ నేతలతో సహా పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నాడు సమైక్య రాష్ట్రంలో టిజెఏసి ఉద్యమ సంస్థగా ఉన్నప్పుడు అనుమతులు నిరాకరించడం గురించి అంతగా చర్చ జరగకున్నా ఒక రాజకీయ పార్టీ సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపై తెలంగాణ వ్యాప్తంగా తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని ప్రజలు భావిస్తున్నారు.
టిజెఏసి నేతలు కోర్టులకు వెళ్లడం.. అను మతులుతెచ్చుకోవడం.. కొత్తేమీకాదు. కాని తెలం గాణ రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి కొన సాగుతోండటం ఆక్షేపణీ య మంటున్నారు టిజెఏసిని మద్దతుదార్లు.
సమైక్య రాష్ట్రంలో ఎదుర్కొన్న సమస్యలే సొంత రాష్ట్రం లోనూ మరింత ఎక్కువ కావడంతో టిఆర్‌ఎస్‌ను రాజకీయంగానే ఢీకొనాలని కోదండరాం భావించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ జన సమితి పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు. ఏప్రిల్‌ 29వ తేదీన సరూర్‌నగర్‌ గ్రౌండ్‌లో ఆవిర్భావ సభను గ్రాండ్‌గా నిర్వహించా లనుకున్నారు. హైదరాబాద్‌లో సభ నిర్వహిస్తే ట్రాఫిక్‌, వాతావరణ సమస్యలు తలెత్తుతాయని పోలీసులు పలు కారణాలు చెప్పి సభకు అనుమతిని నిరాకరిం చారు. అయితే ఇటీవల ఎల్బీ స్టేడియంలో ఓ సినిమా ఫంక్షన్‌ను గ్రాండ్‌గా నిర్వహించారని, అప్పుడు జరగని పొల్యూషన్‌ తాము నిర్వహించే సభ వల్లే జరుగుతుందా ? అని కోదండరాం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం తమకు ఇష్టం లేనివారి పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదని, సభలు, మీటింగ్‌లు పెట్టుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కని, ఆ హక్కును కెసిఆర్‌ కాలరాస్తున్నారని పలువురు తెలంగాణ జన సమితి నాయకులు మండిపడుతున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కోర్టులకు వెళ్లి సభలకు అనుమతులు తెచ్చుకుంటే ఇపుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అదే తంతు కొనసాగడంపై పలువురు ఉద్యమకారులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్‌ భూముల్లో సభ నిర్వహణకు సంబంధించి సాధ్యా సాధ్యాలను కూడా టిజెఎస్‌ నేతలు పరిశీలిస్తున్నారు.
మరోవైపు పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఆవిర్భావ సభ నిర్వహించుకునేందుకు కేంద్ర రక్షణ శాఖకు దరఖాస్తు చేసింది టిజెఎస్‌. కేంద్రం నుంచి అనుమతి వస్తే పరేడ్‌గ్రౌండ్స్‌లో ఈ నెల 29న తెలంగాణ జనసమితి పార్టీ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించాలను కుంటున్నారు.
ఇదిలా ఉంటే టిజెఎస్‌ ఆవిర్భావ సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరణపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు స్పందించారు. తెలంగాణలో దొరల పాలన నడుస్తుందని ఆయన ఆరోపించారు. సినిమా వాళ్ళ సభలకు అనుమతి ఇచ్చి తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి సభకు అనుమతి ఇవ్వరా? అని విహెచ్‌ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
– సప్తగిరి
(http://www.jagritiweekly.com/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b2%e0%b1%87%e0%b0%b7%e0%b0%a3/%e0%b0%95%e0%b1%8b%e0%b0%a6%e0%b0%82%e0%b0%a1%e0%b0%b0%e0%b0%be%e0%b0%82-kodandaram-2/)(Index, latestnews, ప్రాంతీయం, విశ్లేషణ)