22, జూన్ 2015, సోమవారం

విశ్వ'యోగా' భవ


  • మీ ఆరోగ్యం బాగుపడాలంటే యోగా చేయండి - ఒక డాక్టర్‌ సూచన...
  • మీ మనసు స్థిమితంగా ఉండాలంటే యోగ సాధన చేయండి - ఒక సైకాలజిస్ట్‌ సలహా...
  • మీరు అందంగా ఉండాలనుకుంటున్నారా? మంచి శరీరాకృతి కావాలనుకుంటున్నారా... అయితే యోగా చేయండి - ఒక బ్యుటీషియన్‌ సమాధానం...
  • మీ కంపెనీలో ఉద్యోగులు చక్కగా, సమర్థంగా పని చేయాలంటే వారికి యోగా నేర్పించండి - ఒక వ్యక్తిత్వ వికాస నిపుణుడి మాట...
  • మీ విద్యాసంస్థలో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలంటే వారికి యోగ నేర్పించండి - ఒక ఉన్నత విద్యా నిపుణుడి సూచన...
  • మీరు మీ ఆటలో ఏకాగ్రతతో ఉంటూ విజయం సాధించాలంటే యోగ సాధన ఒక్కటే మార్గం - క్రీడాకారులకు ఒక కోచ్‌ హెచ్చరిక...



ఇలా ఆరోగ్యానికి, అందానికి, సంపాదనకు, విద్యకు అన్ని వర్గాల వారికి నేడు యోగ అవసరమైంది. అందరూ యోగ చేయమంటున్నారు. ఏదైనా పని సమర్థంగా జరగాలన్నా, ఎవరైనా వారి వారి పనులలో నిపుణు లవ్వాలన్నా యోగను ఆశ్రయిస్తున్నారు. ఇన్ని రకాలుగా నేడు యోగ ప్రాచుర్యం పొందింది.
అసలు యోగ అంటే ఏమిటి? అది ఎలా వచ్చింది? ఎవరు కనిపెట్టారు? ఎక్కడ ఆవిర్భవించింది? ఈ యోగ చేయడం వలన అంత శక్తి ఎందుకు వస్తుంది? వంటి ప్రశ్నలన్నిటికి సమాధానం కావాలంటే మనం కూడా యోగ సాధన చేయాల్సిందే.
యోగ అంటే ఏమిటి?
యోగ అనేది మనిషి మనుగడలో ఒక భాగం. మనిషిని వత్తిడి నుంచి దూరం చేసి, శరీరానికి విశ్రాంతి నిచ్చి, మనస్సును స్థిరం చేసే ఒక ప్రక్రియ. వత్తిడికి గురైతే వ్యవస్థలు సక్రమంగా పనిచేయక శరీరం రోగమయం అవుతుంది. శరీరం రోగమయం అయితే మనస్సు అల్లకల్లోలం అవుతుంది. అప్పుడు ఏ పనిమీద మనసు లగ్నం చేయలేక, ఏ పనిలోను నైపుణ్యం సాధించలేక వెనుకబడిపోతాం. కొంతమంది దురలవాట్లకు బానిసై తమ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. వీటన్నింటికి విరుగుడు యోగ సాధన.
యోగ ఎక్కడ పుట్టింది? దీనికి కర్త ఎవరు?
యోగ భారతీయుల మానసపుత్రిక. భారతీయుల జీవన విధానం. ప్రపంచానికి మనమిచ్చిన ఒక వరం. ప్రాచీనకాలం నుండి మనదేశంలో విలసిల్లింది. పతంజలి మహర్షి యోగకు కర్త అని చెబుతారు. ఎందుకంటే పతంజలి మహర్షి అంతకుముందే ఉన్న యోగ సూత్రాలను ఒక క్రమపద్ధతిలో కూర్చి, సామాన్య మానవునికి అర్థమయ్యే రీతిలో భాష్యాలను వ్రాసి, దానికి ఒక క్రియను ఏర్పరచారు.
యోగ సాధన అంటే ఏం చేయాలి ?
‘యోగ’ నిజానికి ‘అష్టాంగ యోగ’ నుండి వచ్చింది. ఈ అష్టాంగ యోగలో 8 రకాల విభాగాలు, అభ్యాసాలు ఉన్నాయి. వీటిని విభాగాలు అనటం కన్నా ‘స్థాయి’ (మెట్లు) అనటం బాగుంటుంది. ఒక్కొక్క స్థాయి యోగసాధకుడిని ఒక్కొక్క మెట్టు పైకి తీసుకెళుతుంది. యోగ సాధకుడు పైస్థాయికి చేరుకున్నప్పుడు సాక్షాత్తూ పరమపదాన్ని చేరుకున్నట్లే.
అష్టాంగ యోగ 
  1. యమ : అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము. ఈ ఐదు కలిగినట్టిది యమ. యోగసాధకుడు అనుసరించవలసిన మొదటిమెట్టు ఇది.
  2. నియమ : శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిదానము. ఇది రెండవ మెట్టు. అంటే యోగసాధకుడు మొదట తన మనస్సును అదుపులో పెట్టుకోవాలని అర్థం. అంటే యమ, నియమాలను పాటించాలి.
  3. ఆసన : ఇది శారీరిక క్రియ. దీనిలో ఆసనాలు అభ్యాసం చేయాలి. నిలుచుని, కూర్చుని, వెల్లకిలా పడుకొని, బోర్లా పడుకొని ఇలా అనేక స్థితుల్లో చేసే 100 రకాల ఆసనాలను పతంజలి మహర్షి చెప్పారు. వీటిలో నుంచి నిత్యం అభ్యాసం చేయడానికి కొన్ని ఆసనాలను కలిపి ‘సూర్యనమస్కారాలు’ అనే క్రియ తయారైంది. ఆసన ప్రక్రియనే హఠయోగ అని కూడా అంటారు. కేవలం ఈ హఠయోగ సాధన నిత్యం చేసే మానవుడు 200 సంవత్సరాలపాటు ఎటువంటి రోగాలు లేకుండా జీవించగలడని స్వామి వివేకానంద చెప్పారు. ఆసన అభ్యాసం వలన అనేక రోగాలు తగ్గుముఖం పడతాయి.
  4. ప్రాణాయామం : ఇది శ్వాసకు సంబంధించిన ఉచ్చ్వాస, నిశ్వాసల ప్రక్రియ. మన శ్వాసను నియంత్రించడం ద్వారా శరీరాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించడమే ఈ ప్రాణాయామ ఉద్దేశ్యం. ప్రాణాయామం కూడా అనేక రోగాలకు విరుగుడుగా పనిచేస్తుంది. ఈ ఆసన ప్రాణాయామాలు శరీరానికి బలం చేకూర్చుతాయి. యోగ సాధకునికి ఇవి మూడు, నాల్గవ మెట్లు.
  5. ప్రత్యాహార : ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడం. ఆరోగ్యంగా ఉన్న మానవుడు ఇంద్రియాలను అదుపులో పెట్టుకోగలడు. ఇది ఐదవ మెట్టు.
  6. ధారణ : మనస్సును స్థిరపరచడం. ఇంద్రియాలను అదుపులో పెట్టుకొన్నవారికి మనస్సు స్థిరమవుతుంది. ఇది ఆరవ మెట్టు.
  7. ధ్యాన : మనస్సును ఒక బిందువుపై లగ్నం చేయడం. దీనినే ధ్యానం అంటారు. ఇది ఏడవ మెట్టు.
  8. సమాధి : పై ఏడు స్థితులలోను (మెట్లు) అంతరాయం లేకుండా ఉన్న యోగసాధకునికి ఈ ఎనిమిదవ స్థితి సాధ్యమవుతుంది. సమాధి స్థితిలోకి వెళ్ళడమంటే యోగసాధకునికి ఇది పరాకాష్ట అవుతుంది. అంటే ఇదే ఆధ్యాత్మిక సాధనలో చివరిమెట్టు. ఇది మనసును నిశ్చల స్థితిలోకి తీసుకెళ్ళి మనిషిని తన బాహ్య స్పృహ కోల్పోయేటట్లు చేస్తుంది. ఇదే పరమపద స్థితి అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ మనిషిలోని జ్ఞాన చక్షువు తెరచుకుంటుంది. సహస్రారం పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈ స్థితిలో మానవుడు తాను ఎక్కడ నుంచి వచ్చినదీ, ఎక్కడికి పోతున్నదీ, ఆత్మ, పరమాత్మ, దైవం ఇత్యాది ఆధ్యాత్మిక విషయాలన్నీ అతనికి అవగతమౌతాయి. దీనినే నిశ్చల స్థితి అనీ, నిర్వికార స్థితి అనీ అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మానవునికి దైవత్వం సిద్ధించినట్లే.
ఈ 8 అంగములతో కూడినది అష్టాంగ యోగ. ఈనాడు అందరూ పై 8 అంగాలలోని ఆసన్‌, ప్రాణాయామం, ధ్యానం వంటి మూడిరటిని మాత్రమే చేస్తూ కేవలం ఇదే యోగ అని భావిస్తుంటారు. ఇవి కేవలం బాహ్య క్రియలు మాత్రమే. వీటికి అంతరక్రియలైన మిగతావి తోడైతే యోగసాధకుడు పరిపూర్ణుడవుతాడు.
చరిత్రలో సంధికాలం
ఇంత మహత్తరమైన యోగ విద్యను ప్రాచీనకాలం నుండి మన గురుకులాల ద్వారా ప్రతి విద్యార్థికి, ప్రతి పౌరునికి గురువులు నేర్పేవారు. ఆధునిక యుగం 7వ శతాబ్దం తరువాత విదేశీయుల దండయాత్రల వలన భారతదేశ చరిత్రలో వచ్చిన విపరిణామాలతో యోగకు ప్రాధాన్యం తగ్గింది. మనిషి ప్రాణానికే భద్రత కరువైంది. బ్రిటిష్‌వారి రాకతో, వారి కుట్రలతో, కుతంత్రాలతో, మెకాలే విద్యావిధానంతో మన ప్రాచీన సంస్కృతి, సంప్రదాయ విద్య మరుగున పడిరది. దానితో యోగవిద్య కూడా కొందరికే పరిమితమైంది. సంస్కారాలకు సంధికాలం ఏర్పడిరది. దానితో ప్రపంచమే శాంతికి దూరమైంది.
మళ్ళీ పూర్వ వైభవం


భారతదేశం స్వతంత్రమైన తరువాత మరల యోగకు ప్రాధాన్యం ఏర్పడిరది. యోగవిద్య అందరికి చేరువలోకి వచ్చింది. భారతీయుల మానస పుత్రిక నేడు ప్రపంచం మొత్తానికి మార్గదర్శనం చేస్తోంది.
ఐక్యరాజ్యసమితి గుర్తింపు
యోగకు ప్రపంచ సమర్ధన కూడా లభించింది. ప్రధాని నరేంద్రమోది సెప్టెంబరు 27, 2014న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తూ యోగ విశిష్టతను తెలియపరచి అంతర్జాతీయ యోగ దినం జరుపవలసిన ఆవశ్యకతను విపులీకరించారు. ఆ సూచనను ఐక్యరాజ్యసమితి గుర్తించింది. జూన్‌ 21 అంతర్జాతీయ యోగ దినోత్సవంగా 170 సభ్యదేశాల ఆమోదంతో ప్రకటించింది.
ఇటువంటి మహత్తర సమయంలో భారతీయుల మానస పుత్రిక యోగకు పూర్వవైభవం తేవాలంటే దీనిని అందరం సాధన చేయాలి. యోగ సాధన వలన పోయేదేముంది, అనారోగ్యం, విచారం, ఈతిబాధలు తప్ప. కాబట్టి భారతీయులారా, లేవండి, యోగ సాధన చేయండి. జూన్‌ 21 నాడు ప్రతి ఇంటినుండి, ప్రతి వీథి నుండి, ప్రతి పాఠశాల నుండి, కళాశాల నుండి, ప్రతి ఒక్కరూ యోగసాధన చేయండి. ఆ రోజున ప్రపంచానికి మన యోగ అంటే చూపించండి. విజయోస్తు.
జై యోగ దివస్‌..! జై భారత్‌..!
- సూర్యతేజ