15, నవంబర్ 2014, శనివారం

ప్రపంచానికి ఐ.ఎస్.ఐ.ఎస్. సవాల్





ఒసామాబిన్ లాడెన్ అంతం తర్వాత అల్ ఖైదా కనుమరుగైపోతుందనుకుంటున్న పరిస్థితుల్లో మరో ఇస్లామిక్ ముప్పు ముంచుకొస్తోంది. ఇప్పటిదాకా కనీవినీ ఎరుగని రీతిలో ఎంట్రీ ఇచ్చింది మరో ఉగ్రవాద సంస్థ. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఉగ్రవాద సంస్థగా స్థానం సంపాదించింది. దాని పేరు Islamic State of Iraq and Siria (ISIS).

నరరూప రాక్షసులు :


అల్ ఖైదాను మించిన మూర్ఖులు ISIS ఉగ్రవాదులు. అత్యంత ప్రమాదకరమైన నరరూప రాక్షసులు. ప్రపంచ దేశాలను గడగడలాడించే దిశగా కర్యకలాపాలు సాగిస్తోంది ISIS. దొరికిన వారిని కాల్చిచంపటం, పీకలు కోసేయడం వీరి హాబీ. తమ ఉనికి చాటుకునేందుకు అమెరికాకు చెందిన జర్నలిస్టులు స్టీవెన్ సొట్లాఫ్, జేమ్స్ ఫోలేలను తలలు నరికి చంపేశారు. ఆ వీడియోను ఇంటర్నెట్లో పెట్టారు. ఇక మరో బ్రటిన్ జర్నలిస్టు జాన్ కాంట్లీకి తుపాకి ఎక్కుపెట్టి ISIS కు అనుకూలంగా మూడు నిమిషాలపాటు ప్రసంగం చేయించింది. దానికి కూడా ISIS మీడియా విభాగమైన అల్ ఫర్కాన్ మీడియాకు విడుదల చేసింది. ఇండియన్ ముజాహిదీన్, జైషే మహ్మద్, హర్కత్, లష్కరే తోయిబా వంటి సంస్థలే ISISతో కలిసేందుకు ఉవ్విళ్ళూరుతున్నాయంటే ISIS ప్రభావమేంటో అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ లోని తాలిబన్లు ISISతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ఇప్పటికే ప్రకటించారు. మనదేశంలోని ఇండియన్ ముజాహిదీన్ కు అనుబంధ సంస్థ అయిన అన్సాట్ ఉట్ తవీద్ అనే సంస్థ కూడా ISIS గొడుగు కింద పనిచేస్తామని ప్రకటించింది.

సంపన్న ఉగ్రవాదం :


ISIS 2013లో ఏర్పాటైంది. అంతకుముందు వేర్వేరు పేర్లతో కొనసాగిన ముస్లిం ఉగ్రవాద సంస్థలు ISIS గొడుగు కిందకు చేరాయి. మహ్మద్ ప్రవక్త వారసుడినంటూ ప్రచారం చేసుకుంటున్న ఇరాక్ వాసి అబు-బకర్-అల్-బాగ్దాది దీనికి నాయకత్వం వహిస్తున్నాడు. తూర్పు సిరియాలోని చాలా భాగం, ఇరాక్ లోని పలుప్రాంతాలు ISIS అధీనంలో ఉన్నాయి. చమురు బావులను స్వాధీనం చేసుకున్న ISIS అంతర్జాతీయ స్థాయిలో ఆయిల్ వ్యాపారం చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఉగ్రవాద సంస్థగా అవతరించింది. ఇరాక్, సిరియాల్లో బ్యాంకులను సైతం లూటీ చేశారు. సౌదీ అరేబియా, ఖతార్, కువైట్ లలోని సున్నీలు పెద్దమొత్తాల్లో విరాళాలు పంపించారు. పలుదేశాలు ఆయుధాలను సరఫరా చేశాయి. సద్దాం సైన్యంలో అనుభవమున్న పలువురు అధికారులు ISIS లో చేరడం మరింత బలాన్నిచ్చింది. అరబ్ దేశాల్లోని రాజకీయ అస్థిరతను ఆసరాగా చేసుకొని ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగింది. ISIS లో 30వేల మంది సాయుధులున్నారు. ISIS ఉగ్రవాదులు అణ్వస్త్రాల పైనా కన్నేశారన్న సమాచారం ప్రపంచ దేశాల్లో గుబులు పుట్టిస్తోంది. ఇరాన్ లోని అణ్వస్త్రాల రహస్యాలు చేజిక్కించుకోవాలంటే ఇప్పటికే ISIS తన సభ్యులకు ఆదేశాలు జారీచేసిందన్న వాదనకు వాటి స్థావరాల్లో దొరికిన ప్రతాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

సున్నీల ప్రపంచమే లక్ష్యం :


ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ రాజ్యం స్థాపించడమే ISIS లక్ష్యం. ముందుగా ఇరాక్, సిరియాలలో సున్నీల రాజ్యం స్థాపించాలన్న వ్యూహంతో పావులు కదుపుతోంది. అమెరికా, బ్రిటన్, చైనా, ఇండియా, సోమాలియా, ఈజిప్ట్, ఇరాక్, ఇరాన్, ఫిలిప్పీన్స్, పాకిస్తాన్, మొరాకోలపై జిహాద్ ప్రకటించింది ISIS. ఇరాక్ లో ISIS దెబ్బకు తట్టుకోలేక సైన్యమే చేతులెత్తేసిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఉగ్రవాదులకు, సైన్యానికి మధ్య సాగుతున్న పోరులో నిత్యం వేలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ISIS అధినేత బాగ్దాది మరో లాడెన్ లా పరిణమించాడు.

భారత్ పై జిహాద్ :


ముస్లింలలోని షియా వర్గం ప్రజలు ఎక్కువగా నివసించే దేశాల్లో భారత్ ఒకటి. అందుకే మనదేశంపైనా ISIS గురిపెట్టింది. అంతేకాదు, బిజెపి అధికారంలోకి రావడం కూడా ISISకు ఇష్టం అఏదు. అందుకే భారతదేశంలో నివసిస్తున్నవారిని కూడా భారీగానే ఆకర్షిస్తోంది. దేశంలోని ఒక వర్గానికి చెందిన సుమారు వందమంది ఇప్పటికే ISISలో చేరారని ఇంటలిజెన్స్ బ్యూరో గుర్తించింది. ఏకంగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను, ఉన్నత విద్యావంతులనే చేర్చుకునేందుకే ISIS ప్లాన్ చేసిందంటే ISIS ఉగ్రవాదులు ఎంతగా బరితెగించారో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ కు చెందిన ఓ గూగుల్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సల్మాన్ ISISలో చేరేందుకు వెళ్ళబోతూ పోలీసులకు చిక్కాడు. సౌదీ అరేబియా మీదుగా వెళ్ళేందుకు ప్రయత్నించిన హైదరాబాద్ యువకులు సల్మాన్ ను పోలీసులు పట్టుకున్నారు.  దేశంలోని పలు ఉగ్రవాద సంస్థలతో కలిసి అరాచకం సృష్టించేందుకు ISIS ప్రయత్నిస్తోంది. దీపావళి పర్వదినాన దేశంలో ప్రశాంతంగా ఉన్న పలు నగరాల్లో బాంబుదాడులు చేసేందుకు కూడా కుట్ర పన్నింది ISIS. 

ఈ మధ్య ఇంటలిజెన్స్ బ్యూరో విడుదల చేసిన నివేదిక దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అంతేకాదు, అన్సాట్-ఉట్-తవీద్ ఉగ్రవాద సంస్థ బహిరంగ ప్రకటన, దీనికి కొనసాగింపుగా జమ్ముకాశ్మీర్ రాజధాని శ్రీనగర్ లో అల్లరిమూకలు రెండుమూడుసార్లు ISIS జెండాలు ఎగురవేయడం, రహదారులపై వాటిని పట్టుకొని ప్రదర్శనలు చేయడం తీవ్ర అలజడికి కారణమయ్యాయి.

 

పాముకు పాలు పోసి పెంచితే...


మరోవైపు ISIS పై అమెరికా యుద్ధం ప్రకటించింది. ఇరాక్ లో వారి అధీనంలో ఉన్న చమురు బావులపై అమెరికా బలగాలు దాడులు చేస్తున్నాయి. అగ్రరాజ్య అధ్యక్షుడు ఒబామా ISIS వ్యతిరేక పోరుకు మిగతా దేశాలన్ని కలిసిరావాలని ప్రతిపాదించారు. ISIS అక్రమాలను తిప్పికొట్టాలంటే ప్రపంచదేశాలన్నీ ఏకమవ్వాల్సిన అనివార్య పరిస్థితి. పాముకు పాలుపోసి పెంచితే ఎప్పటికైనా కాటేయక మానదన్న సత్యాన్ని గుర్తించి, ముందుగా ఆ సంస్థకు వస్తున్న నిధులను ఆగిపోయేలా చేయాలి.