- వాతావరణ పరిరక్షణతోనే
మానవ రక్షణ
- మార్చి 23 ప్రపంచ
వాతావరణ దినోత్సవం
సప్తగిరి
గోపగోని
98850
86126
వాతావరణమంటే గాలి. భూమి
పైపొర. జీవ జాలానికి అనువైన భూ గ్రహంపై దాదాపు వెయ్యి కిలోమీటర్ల ఎత్తు వరకూ
వ్యాపించి ఉన్న గాలి పొరను వాతావరణం అని పిలుస్తారు. భూమిపై మనుషులు, జీవజాలం
బతకడానికి అవసరమైన ఆక్సిజన్ గానీ, చెట్లకు అవసరమైన కార్బన్‌డై ఆక్సైడ్ గానీ గాలిలోనే ఉంటాయి. గాలి ఓ మిశ్రమ పదార్థం. వాతావరణంలో 78శాతం
నైట్రోజన్, 21శాతం ఆక్సిజన్ ఉంటాయి. వీటితో పాటు.. కార్బన్ డయాక్సైడ్,
హైడ్రోజన్, హీలియం, నియాన్, క్రిప్టాన్, జినాన్ వంటి జడవాయువులు కూడా ఉంటాయి. గాలిలో
నీటిఆవిరి కూడా ఉంటుంది. వీటన్నింటిని ఇముడ్చుకున్న గాలికి బరువు ఉంటుంది.
స్థలాన్ని కూడా ఆక్రమిస్తుంది. వాతావరణం భూమిపై కొంత పీడనాన్ని కూడా
కలుగజేస్తుంది.
వాతావరణమంటే జీవ కారకం. భూమిపై
జీవులకు ఆధారం. కానీ వాతావరణానికే ఓ ప్రత్యేకమైన దినోత్సవాన్ని నిర్వహించుకోవాల్సి
వస్తుందంటేనే ఏదో ఓమూల కీడు శంకిస్తోంది. అంటే.. వాతావరణానికి ముప్పు పొంచి ఉందనే హెచ్చరిక
స్ఫురిస్తోంది.
గాలి కాలుష్యం – కారకాలు :
గాలిలో హానికర పదార్థాలు
ఎక్కువగా ఉండటాన్ని గాలి కాలుష్యం అంటారు. గాలి కాలుష్యం అంటే.. వాతావరణ కాలుష్యం
అన్నమాటే… ఇంధనాల వినియోగం, అడవుల
నరికివేత, వాహనాల నుంచి వెలువడే వాయువులు, పారిశ్రామికీ కరణ, ఆధునిక వ్యవసాయ
విధానాలు, అణు ధార్మికత, ధ్వని కాలుష్యం వంటి అనేక కారణాల వల్ల వాతావరణ కాలుష్యం
పెరిగిపోతోంది.
పరిశ్రమల వ్యర్థాలు – పారిశ్రామిక కాలుష్యం :
ఏ పరిశ్రమ ఏర్పాటు
చేయాలన్నా… ఆ పరిశ్రమ స్వభావాన్ని బట్టి
కొన్ని నిబంధనలు, తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు రూపొందించబడి
ఉంటాయి. ప్రధానంగా కాలుష్యాలు వెదజల్లే పరిశ్రమల విషయంలో ప్రత్యేకంగా కాలుష్య నియంత్రణ
మండలి పనిచేస్తుంది. కాలుష్య నియంత్రణ మండలి పరిధిలోకి వచ్చే పరిశ్రమలన్నీ విధిగా
మండలి నిబంధనలు పాటించడంతో పాటు.. కాల వ్యవధిని బట్టి ఎప్పటికప్పుడు కాలుష్యంపై నివేదికలను
మండలికి అందజేయాల్సి ఉంటుంది. నియంత్రణకు లోబడి కాకుండా కాలుష్యం పెరిగిందనిపిస్తే
వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే ఆ పరిశ్రమలపై కఠిన చర్యలు
తీసుకునే అధికారం కాలుష్య నియంత్రణ మండలికి ఉంటుంది. కానీ ఇటీవలి కాలంలో పరిశ్రమల
కాలుష్యంపైనా.. కాలుష్య నియంత్రణ మండలి పనితీరుపైనా తరచూ విమర్శలు రావడం
పరిపాటైంది.
పారిశ్రామిక కాలుష్యం పర్యవసానాలు :
భోపాల్
గ్యాస్ దుర్ఘటన దేశ ప్రజలెవరికీ తెలియనిది కాదు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్
సమీపంలోని యూనియన్ కార్బైడ్ పరిశ్రమలో సంభవించిన విస్ఫోటం కారణంగా టన్నుల కొద్దీ
మిథైల్ ఐసోసైనేట్ అనే ప్రమాదకర వాయువు లీకైంది. క్షణాల్లో అక్కడి వాతావరణంలో కలిసిన
ఈ మృత్యు వాయువు.. వేలాది నిండు ప్రాణాల్ని కబళించింది. కంటిచూపు పోయినవారు,
వూపిరితిత్తులకు తూట్లు పడ్డవాళ్లు, జీవచ్ఛవాలుగా మిగిలినవాళ్లెందరో లెక్కే
లేదు. పాతికవేలమంది నేల రాలిపోయారు.
అయిదున్నర లక్షల మందికిపైగా అనారోగ్య పీడితులయ్యారు. నేటికీ అక్కడి గాలిలో,
నీటిలో, భూగర్భంలో విషపదార్థ నిక్షేపాలు పుట్టబోయేవారినీ శాపగ్రస్తులు
చేస్తున్నాయి.
ఇక.. తెలుగు
రాష్ట్రాలకు వస్తే.. హైదరాబాద్ పరిసరాల్లో నగరం నలుమూలలా స్థాపించబడిన వేలాది
కాలుష్య కారక పరిశ్రమలు వెదజల్లుతున్న విషపు వాయువులు నిత్యం ఆ పరిసర ప్రాంతాల ప్రజలకు
సుపరిచితమే. అంతేకాదు.. తెలుగు రాష్ట్రాల్లోని అనేక పారిశ్రామిక వాడల్లో ఇదే
పరిస్థితి ఉంది. కాలుష్య నియంత్రణ మండలి
కళ్లకు గంతలు కడుతున్న పరిశ్రమలు.. స్థానికుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. జీడిమెట్ల,
బొల్లారం లాంటి పారిశ్రామిక వాడలకు వెళ్లిన కొత్తవారికి కొద్దిసేపు తొలుత ఊపిరాడదంటే..
అక్కడి వాతావరణం ఎంతగా కలుషితమైందో అర్థమైపోతుంది.
ఏ
పరిశ్రమ నెలకొ్ల్పినా. ఆ పరిశ్రమ స్వభావాన్ని బట్టి పలు నిబంధనలు రూపొందించబడి
ఉన్నాయి. ప్రధానంగా పరిశ్రమల నుంచి వెలువడే విషవాయువులు, వ్యర్థవాయువులతో కూడిన
పొగను బాహ్య వాతావరణంలో కలిపే ముందు పొగకు సరైన ఫిల్డర్లు వాడాలి. నిబంధనల మేరకు అవి వాడాల్సి ఉన్నా.. వ్యయంతో కూడినవి అయినందున
కంపెనీలు ఈ నిబంధనను అంతగా పట్టించుకోవడం లేదు. ఫలితంగా పరిశ్రమలు ఉండే పరిసరాలు,
గ్రామాల్లో కలుషిత వాయువులు కరాళనృత్యం చేస్తున్నాయి.
జల కాలుష్యం :
వాతావరణంలో మరో ముఖ్యమైనది
జలం. భూమిపై జీవనానికి గాలి తర్వాత నీరు కూడా అంతే ప్రధానమైనది. పెరుగుతున్న జనాభా
కారణంగా జలం కూడా కాలుష్యానికి గురవుతోంది. జలకాలుష్యం కారణంగా జనాన్ని అనేక
వ్యాధులు పట్టి పీడిస్తున్నాయి. తాగడానికి నీళ్లు కూడా దొరకని పరిస్థితిలో కొన్ని
ప్రాంతాల్లో కలుషిత జలమే దిక్కవుతోంది. మరోవైపు.. పరిశ్రమలనుంచి వెలువడే వ్యర్థ
జలాలు పరిసరాలను కలుషితం చేస్తున్నాయి. కొన్ని కంపెనీల నుంచి వెలువడే విష
వ్యర్థాలు జలంలో కలిసి బయటికి వదిలివేయబడుతుండటంతో ఆ పరిసరాల్లో కనీసం చెట్లు కూడా
మొలకెత్తే పరిస్థితి ఉండదు.
ఓజోన్ పొరపై ప్రభావం :
ఓవైపు
పారిశ్రామిక కాలుష్యం, మరోవైపు.. వాహన కాలుష్యం.. ఓజోన్ పొరకు ముప్పు వాటిల్లేలా
పరిణమించాయి. సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలను భూమిపైకి చేరకుండా మహత్తర
పాత్రను పోషిస్తోంది ఓజోన్ పొర. అయితే.. కాలుష్యం కారణంగా ఓజోన్ పొరకు చిల్లులు
పడితే భూగోళంపై ఉండే జీవులు హాహాకారం చేయడం తప్పదు.
అటవీ
నిర్మూలన :
వాతావరణానికి చెట్లు మిత్రులు. ఎందుకంటే
వాతావరణంలో ఎప్పటికప్పుడు చేరే కలుషిత వాయువును గ్రహించి ప్రాణవాయువులను
ఉత్పత్తిచేయగల గొప్ప శక్తి చెట్లకు మాత్రమే ఉంది. కానీ.. ప్రస్తుత కాలంలో సహజసిద్ధంగా
ఏర్పడిన అడవుల్లోని చెట్లను నరకడం, కాల్చివేయడం నిరంతరాయంగా సాగుతోంది. చెట్లు లేదా
వాటి నుంచి తీసే బొగ్గును మానవులు ఉపయోగించే ఒక సరుకుగా విక్రయిస్తున్నారు.
చెట్లను నరికిన తరువాత ఏర్పడిన ఖాళీ ప్రదేశాన్ని పచ్చిక బయలు, పంట భూములు, మానవ
నివాసాలకు ఉపయోగించుకుంటున్నారు. తగిన మోతాదులో మళ్లీ చెట్ల పెంపకం లేకుండా
అడవులను నిర్మూలించడంతో సహజావరణం దెబ్బతినడంతోపాటు, జీవవైవిధ్యానికి నష్టం
జరుగుతుంది. అటవీ నిర్మూలన జరిగిన ప్రదేశాల్లో భూమి కోతకు గురవడంతోపాటు, తరచుగా
ఇటువంటి ప్రదేశాలు బంజరుభూమిగా రూపాంతరం చెందుతాయి. అటవీ నిర్మూలనకు అనేక కారణాలు ఉన్నాయి, అవి
ప్రభుత్వ సంస్థల అవినీతి, అధికారం మరియు సంపద యొక్క అసమాన పంపిణీ, జనాభా పెరుగుదల,
అధిక జనాభా, మరియు పట్టణీకరణ ఇందులో ముఖ్యమైనవి. "అటవీ నిర్మూలన జనాభా
ఒత్తిడి, నిశ్చేష్టమైన ఆర్థిక, సామాజిక మరియు సాంకేతిక పరిస్థితుల వంటి వివిధ
అంశాల కలయిక ద్వారా జరుగుతుందని" 2000లో ఐక్యరాజ్యసమితిఆహార మరియు వ్యవసాయ
సంస్థ (FAO) గుర్తించింది.
అటవీ నిర్మూలన కొనసాగుతుండటం
వలన వాతావరణం మరియు భూగోళం ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. చెట్లు మరియు
ఇతర మొక్కలు వాటి సాధారణ శ్వాసప్రక్రియలో భాగంగా కిరణజన్య సంయోగక్రియ ద్వారా వాతావరణంలోని
కార్బన్‌ను తొలగించి ఆక్సిజన్‌ను తిరిగి
వాతావరణంలోకి విడుదల చేస్తాయి. చెట్ల క్షయం జరగడం లేదా వాటిని కాల్చడం వలన అది
నిల్వచేసుకున్న కార్బన్‌లో ఎక్కువ భాగం తిరిగి వాతావరణంలో కలుస్తుంది. అడవులు
కార్బన్‌ను గ్రహించేలా చేయడానికి, చెట్లను తిరిగి నాటడం చేయాలి. భూమిలో
నిక్షిప్తమైన కార్బన్ వాతావరణంలోకి విడుదల కావడానికి కూడా అటవీ నిర్మూలన కారణమవుతుంది.
భూమి కోసం అడవుల్లోని చెట్లను భస్మీకరణం చేయడం మరియు కాల్చివేయడం ద్వారా
టన్నులకొద్ది కార్బన్‌డయాక్సైడ్ వాతావరణంలోకి విడుదలవుతుంది, ఇది భూతాపానికి
కారణమవుతుంది.
అటవీ నిర్మూలన వలన జల చక్రం కూడా
ప్రభావితమవుతుంది. చెట్లు వాటి యొక్క వేర్లు ద్వారా భూగర్భజలాలను గ్రహించి,
వాతావరణంలోకి విడిచిపెడతాయి. అటవీ ప్రాంతం నిర్మూలించబడినప్పుడు, చెట్లు నీటిని
గాలిలోకి చేర్చలేవు, దీని వలన పొడి వాతావరణం ఏర్పడుతుంది. అటవీ నిర్మూలన వలన
వాతావరణంలో తేమ తగ్గిపోవడంతోపాటు, భూమిలో నీటి శాతం మరియు భూగర్భజలాల పరిమాణం కూడా
తగ్గిపోతుంది.అటవీ నిర్మూలన భూమి సంయోగాన్ని కూడా తగ్గిస్తుంది, దీని వలన
క్రమక్షయం, వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రమాదాలు జరుగుతాయి.
వాహన కాలుష్య నియంత్రణ :
నాగరిక ప్రపంచంలో
పెరుగుతున్న ఆధునికత వాహన వినియోగం విపరీతంగా పెరిగేందుకు కారణమవుతోంది. ఫలితంగా
చిన్నపాటి నగరాల్లోనూ ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఇక నగరాలు, మెట్రో
నగరాల పరిస్థితి చెప్పే అవసరమే లేదు. ప్రధాన రహదారిపై ఓ నాలుగు కిలోమీటర్ల దూరం
వెళ్లాల్సిన వాహనదారుడు కనీసం అరగంట,
ముప్పావుగంట ముందు ఇంటినుంచి బయలుదేరాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఫలితంగా సమయం
పెరగడంతో పాటు.. అదే స్థాయిలో గాలిలో కలిసే కాలుష్యం కూడా పెరుగుతోంది. అంతసేపూ
వాహనం ఇంజన్ ఆన్‌లోనే ఉండటం వల్ల నిరంతరాయంగా పొగ వాతావరణంలో కలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో రోడ్లపై నడిచే
కార్లకు సంబంధించి ‘సరి-బేసి’ విధానం అమలు చేయాలనే ఆలోచన వచ్చిందంటే.. పరిస్థితి
ఎంత ప్రమాదకర స్థాయికి చేరిందో ఊహించవచ్చు. సరిసంఖ్య ఉన్న వాహనాలు తిరగాల్సిన
రోజు.. బేసి సంఖ్య ఉన్న వాహనాలు రోడ్లపైకి వచ్చాయంటే ట్రాఫిక్ అధికారులు చలానా
వేయడం తప్పదు. అదే.. బేసి సంఖ్య ఉన్న వాహనాలు తిరగాల్సిన రోజు.. సరిసంఖ్య ఉన్న
కార్లు బయటికి తీస్తే అదే ట్రీట్‌మెంట్ ఉంటుంది. కార్లు ఉన్నవారికి ఇది
ఇబ్బందికరమే అయినా.. న్యాయస్థానం కూడా ఈ ప్రయోగాత్మక విధానాన్ని విమర్శించకపోవడం
గమనించదగ్గ విషయం.
కార్లు
వాడటం స్టేటస్‌గా భావించే ఈరోజుల్లో రోడ్లన్నీ కార్లతో నిండిపోతున్నాయి. ఫలితంగా
వాతావరణ కాలుష్యం నిత్యం పెరుగుతూనే ఉంది. దీనిని నియంత్రించేందుకు ఎవరికి వారు
బాధ్యతగా వ్వవహరిస్తే కొంతయినా కాలుష్యాన్ని తగ్గించడం ఖాయంగా చెప్పవచ్చు.
ప్రధానంగా ఒకే ఆఫీసులో పనిచేసేవారు గానీ, ఒకే మార్గంలో ప్రయాణించే వారు గానీ.. ఒకే
కాలనీకి చెందిన వారుగానీ.. ‘కార్ పూలింగ్’, ‘బైక్ పూలింగ్’ ను పాటిస్తే సగం
కాలుష్యాన్ని తగ్గించినట్లే.. ఒకే పనితో ‘స్వామి కార్యం స్వకార్యం ‘ నెరవేరుతుందన్నట్లు..
కార్ పూలింగ్ , బైక్ పూలింగ్ వల్ల సామాజిక బాధ్యతగా ఇటు కాలుష్యాన్ని
తగ్గించడంతో పాటు.. అటు ఇంధన వ్యయాన్ని కూడా పొదుపు చేసినవాళ్లవుతారు.
కాలుష్య నివారణకు మార్గాలు :
కాలుష్యం
కోరల్లో మనిషి జీవితం అతలాకుతలమవుతోంది. పర్యావరణాన్ని పరిరక్షించడం తద్వారా
కాలుష్యాన్ని తగ్గించి వాతావరణానికి మేలు జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రతి
ఒక్కరిదీ… అటవీ నిర్మూలనకు ఫుల్‌స్టాప్‌పడాలి. చెట్లు, అడవుల పెంపకం నిరంతరాయంగా
సాగాలి. ప్రతిఒక్కరూ మొక్కలు నాటడాన్ని అలవాటుగా చేసుకోవాలి. చెట్లు లేని ఇళ్లు
ఉండకుండా ప్రతి ఇంట్లోనూ చెట్లుఉండేలా కంకణం కట్టుకోవాలి. పెట్రోల్, డీజిల్
వినియోగించే వాహనాలకు బదులు సీఎన్‌జీతో నడిచే వాహనాలను వాడాలి. ఫ్యాక్టరీల్లో
వెలువడే వ్యర్థ, కాలుష్య, ప్రమాదకర వాయువులతో కూడిన పొగకు సరైన ఫిల్టర్‌లు
ఉపయోగించాలి. దీనికోసం నిరంతర నిఘా వ్యవస్థ పనిచేయాలి. ప్రత్యామ్నాయ ఇంధన వనరులను
ప్రోత్సహించాలి. ఇది ఉద్యమస్థాయిలో కొనసాగాల్సిన అవసరం ఉంది. సౌరశక్తి, బయోగ్యాస్,
బయోమాస్ ఎనర్జీ వంటి వాడకం పెరగాలి. సౌరశక్తితో విద్యుత్ ఉత్పత్తి ఇప్పుడిప్పుడే
ఉధృతంగా మొదలవుతోంది. దీనికి ప్రభుత్వాలు ప్రోత్సాహకాలను అందిస్తే.. పరోక్షంగా
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడినట్లు అవుతుంది.
Publised in Jaagriti Magazine