29, ఏప్రిల్ 2019, సోమవారం
నూతనోత్సాహం
నూతనోత్సాహం
తెలంగాణ ఎన్నికల ముఖచిత్రంలో భారతీయ జనతా పార్టీ చరిత్ర సృష్టించబోతోందన్న వ్యాఖ్యా నాలు, విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీ రాష్ట్రంలో కింగ్ మేకర్‌గా అవతరించనుందని నిపుణుల మాట. క్షేత్రస్థాయిలో పరిస్థితులు, మారుతున్న రాజకీయ సమీకరణాలు, బీజేపీ జాతీయ స్థాయి నేతల పర్య టనలు, ప్రచార సభలు ఈ అంచనాలకు బలం చేకూరుస్తున్నాయి. బీజేపీ నిర్వహించే సభలకు హాజరయ్యే వాళ్లలో ప్రధానంగా యువకులు, మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉండటం అనుకూల వాతావరణానికి నిదర్శనమని కాషాయ శ్రేణులు చెప్పుకుంటున్నారు.
ఈసారి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు చాలా స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు, తాజా మాజీలకు, ఉద్ధండులకు కూడా గట్టి పోటీ ఇవ్వబోతు న్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో వాతావరణం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది. కొన్నిచోట్ల ఆ పార్టీ అభ్యర్థుల నామినేషన్ల ర్యాలీలోనే 20 నుంచి 30వేల మంది పాల్గొన్నారని చెబుతు న్నారు. ఈ పరిణామం.. భాజపాకి పెరుగుతున్న జనాదరణకు నిదర్శనమని అంటున్నారు.
గతంలో పొత్తులతో ప్రాంతీయ పార్టీల ప్రాధాన్య తకు పెద్దపీట వేసిన బీజేపీ జాతీయ నాయకత్వం ఇప్పుడు ఒంటరిగా సత్తా చూపేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే బలం పెరిగేలా స్టార్ క్యాంపెయి నర్లను నియమించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదలుకొని పెద్ద సంఖ్యలో కేంద్రమంత్రులను తెలంగాణ ఎన్నికల రంగస్థలంలోకి దింపింది. విస్తృతంగా ప్రచారం చేపడుతోంది. కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కేంద్రం వివిధ పథకాల కింద భారీస్థాయిలో మంజూరు చేస్తున్న నిధులను.. రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలకు వినియోగించుకుంటూ సొంతడబ్బా కొట్టుకోవడంపై ప్రజలకు, ముఖ్యంగా ఓటర్లకు క్లారిటీ ఇస్తున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వివిధ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా ఇతర కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి ముఖ్య నేతలు బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఏర్పాటుచేసిన సభల్లో సందేశాలు ఇస్తున్నారు. వాస్తవాలను విప్పి చెబుతు న్నారు. పలుచోట్ల ఎన్నికల ప్రచార ర్యాలీల్లోనూ పాల్గొంటున్నారు. ఇప్పటిదాకా ఆయా నియోజక వర్గాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో కేంద్రమంత్రులు సుష్మాస్వరాజ్, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, హన్స్‌రాజ్ గంగారాం, నితిన్ గడ్కరీ, జెపి నడ్డా, జువల్ ఓరంలతో పాటు.. ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్ సింగ్ కూడా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ బీజేపీకి అండగా నిలిస్తే తెలంగాణలో చేయబోయే అభివృద్ధిని కూడా జనానికి అర్థమయ్యే రీతిలో వివరిస్తున్నారు.
మరోవైపు ఆధ్యాత్మిక గురువు, శ్రీ పీఠం అధిపతి స్వామి పరిపూర్ణానందను తెలంగాణ బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా జాతీయ నాయకత్వం రంగంలోకి దించింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ప్రత్యేకంగా ఢిల్లీకి ఆహ్వానించి ఆయనకు పార్టీ సభ్యత్వం ఇచ్చారు అమిత్ షా. బీజేపీ జాతీయ భావాలు, పార్టీ విధానాలు, వ్యవహారాల గురించి పూర్తిస్థాయి అవగాహన ఉన్న స్వామీజీ పార్టీ అధిష్టానం కోరగానే కాషాయ కండువా ధరిం చేందుకు వెనుకంజ వేయలేదు. దీంతో ఓ ఆధ్యాత్మిక గురువు ప్రజలకు రాజకీయ నాయకత్వం వహించేం దుకు ముందుకురావడం మంచి పరిణామంగా చెప్పుకుంటున్నారు.
మెజార్టీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల తరపున స్టార్ క్యాంపెయినర్‌గా ఓటర్లను తమ పార్టీవైపు ఆకర్షించే బాధ్యతను పరిపూర్ణానంద స్వామి భుజస్కంధాలపై వేసింది పార్టీ. దీంతో స్వామీజీ ఆయా నియోజక వర్గాలను చుట్టేస్తూ తనదైన శైలిలో ప్రచార సందే శాలను ఇస్తున్నారు. హెలికాప్టర్‌లో పర్యటనలు సాగిస్తూ ఎన్నికల ప్రచార భేరీ మోగిస్తున్నారు. ప్రచార సభల సహజ శైలికి భిన్నంగా పరిపూర్ణానంద స్వామి సభలు, ప్రసంగాలు సాగుతున్నాయి. గతంలో ఎన్నడూ చూడని విధంగా రాజకీయ, ఆధ్యాత్మిక వాతావరణం కలబోసిన అరుదైన వాతావరణం ఈ సభల్లో కనిపిస్తోంది. జనం కూడా పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రధానంగా యువకులు, మహిళల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది.
వీటికితోడు తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేపట్టిన కిషన్‌రెడ్డి, డా.లక్ష్మణ్ తమవైన వ్యూహాలతో పార్టీని పరుగులు పెట్టిస్తున్నారు. లక్ష్మణ్, కిషన్‌రెడ్డి నేతృత్వంలో కొంతకాలంగా సంస్థాగతంగా ఫుల్‌టైమ్ కార్యకర్తలను వినియోగించుకోవడంతో పాటు ఎక్కడికక్కడ బూత్ స్థాయి కమిటీలు, శక్తికేంద్రాలు ఏర్పాటు చేయడంలో సక్సెస్ అయ్యారు.
ఓవైపు జాతీయస్థాయి నేతల విస్తృత పర్యటనలు, మరోవైపు రాష్ట్రస్థాయి నేతలకు తోడు స్వామి పరిపూర్ణానంద సభలు భారతీయ జనతాపార్టీ ప్రాధాన్యతను మరింత పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ ఓటుబ్యాంకు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ యవనికపై ఊహించని మార్పులకు బీజేపీ కారణం కాబోతోంది. చాలా నియోజకవర్గాల్లో బలమైన ప్రభావాన్ని చూపించనుంది. ఉత్తర తెలంగాణలో నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో కాషాయ జెండా పాగా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గణనీయమైన సంఖ్యలో సీట్లను గెలుచుకొని అధికార పీఠంపై ప్రభావం చూపించబోతున్నదన్న అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
– సప్తగిరి.జి, 9885086126
ప్రచార జోరు..
ప్రచార జోరు..
తెలంగాణ ఎన్నికల్లో ప్రధానమైన నామినేషన్ల ఘట్టానికి తెర పడింది. నియోజకవర్గాల్లో అన్ని పార్టీల అభ్యర్థులు పూర్తిగా ప్రచార పర్వంలో మునిగిపోయారు. దీంతో రాష్ట్రంలో నిజమైన ఎన్నికల వాతావరణం వచ్చి చేరింది. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడంలో ప్రధాన పార్టీల అభ్యర్థులంతా మునిగిపోయారు.
బహుముఖ పోటీ
ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఒంటరిగా బరిలో దిగుతుండగా, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ కూడా ఏ పార్టీతోనూ పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తోంది.
ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్, తెలుగుదేశం లీడ్ రోల్ పోషిస్త్తూ అధికార టీఆర్‌ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా జట్టుకట్టాయి. టీఆర్‌ఎస్, బీజేపీ మినహా తెలంగాణలో మనుగడలో ఉన్న పార్టీలను ఏకతాటి పైకి తెచ్చి ప్రజాకూటమి పేరిట ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి. ఇందులో కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జన సమితి, సీపీఐ పార్టీలున్నాయి. సీపీఎం ‘బహుజన లెఫ్ట్ ఫ్రంట్’ పేరిట చిన్నా చితక పార్టీలతో తనదైన ప్రచారం సాగిస్తోంది.
హ్యాండిచ్చిన కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషంలో మిత్రపక్షాలకు హ్యాండిచ్చింది. టీడీపీకి ఇస్తామని మాటిచ్చిన స్థానాలు, తెలంగాణ జనసమితి అభ్యర్థులు అప్పటికే నామినేషన్లు దాఖలు చేసిన స్థానాల్లోనూ ఆ పార్టీ చివరి నిమిషంలో బీ ఫామ్స్ ఇచ్చింది. పొత్తుల్లో భాగంగా కూటమి పార్టీలకు కేటాయించిన ఆరు స్థానాల్లోనూ కాంగ్రెస్ అదనంగా బీ-ఫారాలు ఇచ్చింది. దాదాపు నెలరోజుల పాటు సీట్ల పంపకాల విషయంలో కాలయాపన చేసిన కాంగ్రెస్ ఆఖరి నిమిషంలో గందరగోళ పరిస్థితులు సృష్టించిందని మిత్ర పక్షాలు తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశాయి. అయితే టీఆర్‌ఎస్ ఓటమే లక్ష్యమంటూ ఆ అసహనాన్ని బయటకు కనిపించకుండా మిత్రధర్మాన్ని పాటిస్తా మంటూ టీడీపీ, జనసమితి సర్దుకుపోయాయి.
స్నేహ పూర్వకం తప్పదా!?
మొత్తం 119 నియోజకవర్గాల్లో 25 స్థానాలను టీడీపీ, తెలంగాణ జనసమితి, సీపీఐకి కేటాయించగా కాంగ్రెస్ 94 స్థానాలకు పోటీ చేయాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ మొత్తం వంద స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చింది. టీడీపీ 13 నియోజకవర్గాల్లోనే పోటీ చేస్తోంది. పొత్తుల్లో భాగంగా ఈ పార్టీకి 14 స్థానాలు కేటాయించినప్పటికీ విడతల వారీగా స్పష్టత వచ్చిన 13 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది.
తెలుగుదేశం, సీపీఐకి కేటాయించిన స్థానాల్లో కాంగ్రెస్ బీ ఫారాలు ఇవ్వకున్నా అక్కడ ఆ పార్టీ తిరుగుబాటు అభ్యర్థులు బరిలోకి దిగారు. కాంగ్రెస్, తెలంగాణ జనసమితి మధ్య మాత్రం నేరుగా పోటీ నెలకొంది. సీట్ల సర్దుబాటుపై సుదీర్ఘంగా కసరత్తు చేసిన మహాకూటమి నేతలు చివరకు ఓ అంగీకారానికి రాలేక పరస్పరం పోటాపోటీగా బీ ఫారాలు ఇచ్చి నామినేషన్లు దాఖలు చేయించడంతో పదకొండు స్థానాల్లో కూటమి పార్టీల మధ్యే పోటీ నెలకొంది.
రికార్డు స్థాయిలో నామినేషన్లు
రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఆఖరి నిమిషం వరకూ ప్రధాన పార్టీల అభ్యర్థిత్వాల ఖరారు కొనసాగుతూనే ఉండటంతో ఒక్క నామినేషన్ల చివరి రోజే రికార్డు స్థాయిలో 2,087 నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,584 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇంత పెద్ద సంఖ్యలో నామినేషన్లు రావడం ఇదే తొలిసారి.
ప్రధాన పార్టీల పరంగా చూస్తే టీఆర్‌ఎస్ నుంచి 119 మంది, కాంగ్రెస్ నుంచి 135 మంది, బీజేపీ నుంచి 128 మంది, సీపీఎం నుంచి 28మంది, టీడీపీ నుంచి 20మంది, బీఎల్‌ఎఫ్ నుంచి 112 మంది, ఎంఐఎం నుంచి 13 మంది నామినేషన్లు సమర్పిం చారు. 2014 ఎన్నికల్లో 2,662 మంది నామినేషన్లు సమర్పించగా ఈసారి ఆ సంఖ్య 3,584కు పెరిగింది.
ఏ పార్టీ అయినా ఓకే..!
ఈ ఎన్నికల్లో మరో అంశం ఆసక్తికరంగా మారింది. టీఆర్‌ఎస్ పార్టీ అసెంబ్లీ రద్దు నాడే 105 మంది అభ్యర్థులను ప్రకటించడం, మహాకూటమి పేరుతో జట్టుకట్టిన కాంగ్రెస్, టీడీపీ నామినేషన్ల చివరి రోజు దాకా అభ్యర్థులను పూర్తిస్థాయిలో ఖరారు చేయకపోవడం వంటి అంశాల నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులు భారీగా చోటుచేసుకున్నాయి. అయితే కొంతమంది అలా పార్టీలోకి రాగానే ఇలా టికెట్లు దక్కించుకోవడం హైలైట్‌గా నిలిచింది. ‘పార్టీ ఏదైనా సరే టికెట్ కావాలంతే’ అన్నట్లుగా ఆశావహులైన అభ్యర్థులూ రాత్రికి రాత్రే కండువాలు మార్చి తాము కోరుకున్న స్థానాల్లో బరిలోకి దిగిపోయారు. పార్టీలు కూడా కొన్నేళ్లుగా పనిచేస్తున్న వారిని కాదని, గెలిచే అవకాశం ఉంటుందనో, గట్టి పోటీ ఇస్తారనో నమ్మకం కుదిరితే చాలు రాత్రికి రాత్రి కండువా కప్పి బీ ఫారం ఇచ్చేశాయి.
కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలే కాదు, బీజేపీ, సీపీఎం నేతృత్వంలోని బీఎల్‌ఎఫ్ కూడా ఇలాంటి వారికి వేదిక అయ్యాయి. అలా పది మందికిపైగా తాజా మాజీ ఎమ్మెల్యేలు, పలువురు నేతలు కూడా పార్టీలు మారి బీ ఫారాలు దక్కించుకున్నారు.
– సప్తగిరి.జి, 9885086126
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)