26, జూన్ 2019, బుధవారం

నిబద్ధతకు నిలువుటద్దం..


నిబద్ధతకు నిలువుటద్దం..

నిబద్ధతకు నిలువుటద్దం..

నిబద్ధతకు నిలువుటద్దం..
కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా కిషన్‌రెడ్డి
సాధారణ కార్యకర్తగా మొదలైన ప్రస్థానం కేంద్ర మంత్రి స్థాయికి చేరుకుంది. నాలుగు దశాబ్దాల నమ్మిన సిద్ధాంతం.. నూతన అధ్యాయం దిశగా పయనించేందుకు దోహద పడింది. దేశ రాజకీయాల్లో కీలక స్థానాన్ని సంపాదించి పెట్టింది. గంగాపురం కిషన్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం తోటి కార్యకర్తలకు ఆక్సిజన్‌లా మారింది. మొత్తానికి భారతీయ జనతాపార్టీ సంస్కృతికి నిదర్శనంగా నిలిచింది.
ఎమ్మెల్యే పదవి తృటిలో చేజారి పోయినా ఎంపీ పదవి వెతుక్కుంటూ వచ్చింది. ఆ వెంటనే కేంద్ర సహాయమంత్రిగా అరుదైన అవకాశం లభించింది. పార్టీని, కార్యకర్తలను, ప్రజలను నమ్ముకున్న నాయకుడికి ఓటమే గెలుపుకు పునాది అవుతుందని నిరూపితమయ్యింది. 1999లో వాజ్‌పేయి ప్రభుత్వంలో తెలుగు వాడికి దక్కిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి.. మరోసారి నరేంద్రమోదీ హయాంలో ఇప్పుడు కిషన్‌రెడ్డిని వరించింది.
కిషన్‌రెడ్డి తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురంలో 1964, మే 15న స్వామిరెడ్డి, ఆండాలమ్మ దంపతులకు జన్మించారు. సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. టూల్‌ డిజైనింగ్‌లో డిప్లొమా చేశారు. 1995లో కావ్యను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు వైష్ణవి, తన్మయ్‌.
రాజకీయ ప్రస్థానం
1977లో జయప్రకాశ్‌ నారాయణ స్ఫూర్తితో జనతా పార్టీలో యువనాయకుడిగా ప్రవేశించారు కిషన్‌రెడ్డి. ఆ తర్వాత జాతీయ స్థాయిలో జరిగిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంతో బీజేపీలో చేరి అప్పటి నుంచి పార్టీకి తన సేవలు అందిస్తున్నారు.
కిషన్‌రెడ్డి 1980లోనే రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా యువమోర్చా కన్వీనర్‌ పదవి చేపట్టారు. 1983 నాటికి భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి అయ్యారు. 1984లో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 1985 నాటికి భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. ఆ తర్వాత 1992లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ కార్యదర్శిగా సేవలందించారు. 1992లో జాతీయ కమిటీ ఉపాధ్యక్ష పదవి, 1994లో యువమోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పదవులను పొందారు. 2001లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారిగా పనిచేశారు. 2004లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్ష పదవి కైవసం చేసుకున్నారు. సుదీర్ఘకాలం జనతా యువమోర్చాలో తనదైన శైలిలో బాధ్యతలు నెరవేర్చిన కిషన్‌రెడ్డి 2010, మార్చి 6న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014లో తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టి పార్టీకి సేవలందించారు.
పోరుయాత్ర
తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ తరఫున కిషన్‌రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో మహబూబ్‌నగర్‌ జిల్లా మాగనూరు మండలం కృష్ణా గ్రామం నుంచి జనవరి 19, 2012న ‘పోరుయాత్ర’ ప్రారంభించారు. 22 రోజులపాటు కొనసాగిన ఈ యాత్ర కిషన్‌రెడ్డిని ప్రజలకు మరింత దగ్గర చేసింది.
నిరంతరం ప్రజాసేవలో..
పార్టీ అనుబంధ యువమోర్చాలో ఎక్కువకాలం పనిచేసి రాష్ట్ర, జాతీయ స్థాయిలో సుదీర్ఘ కాలం పదవులు నిర్వర్తించిన కిషన్‌రెడ్డి 2004లో తొలిసారిగా హిమాయత్‌ నగర్‌ శాసనసభ స్థానం నుంచి విజయం సాధించి రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టారు. 2009 ఎన్నికలలో అంబర్‌పేట్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 27వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొంది వరుసగా రెండోసారి శాసనసభలో ప్రవేశించారు. శాసనసభలో భారతీయ జనతా పార్టీ పక్షనాయకుడిగా కూడా వ్యవహరించారు. 2014 ఎన్నికలలో మరోసారి అంబర్‌పేట్‌ అసెంబ్లీ నియోజక వర్గం నుండి 62వేల 598 ఓట్ల మెజారిటీతో వరుసగా మూడోసారి ఎన్నికై హ్యాట్రిక్‌ సాధించారు. 2018 డిసెంబర్‌ 7వ తేదీన జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న అంబర్‌పేట్‌ నియోజకవర్గం నుంచి 1016 ఓట్ల స్వల్పతేడాతో ఓటమి పాలయ్యారు. అయితే.. ఆ తర్వాత కేవలం ఐదు నెలల్లోనే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ స్థానం నుంచి 62వేల 144 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొంది అధికార పార్టీకి చుక్కలు చూపించారు. ఇప్పుడు ఏకంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవిని అధిష్టించారు.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఏకైక మంత్రిగా కిషన్‌రెడ్డికి చోటు దక్కింది. తొలిసారిగా ఎంపీగా ఎన్నికైనా జాతీయ స్థాయి నాయకుడిగా కిషన్‌రెడ్డికి దాదాపు రెండు దశాబ్దాలు పనిచేసిన అనుభవం ఉంది. అంతే కాకుండా ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రస్తుత కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలకు అత్యంత సన్నిహితుడు కూడా కావడంతో తెలుగు రాష్ట్రాల తరపున గళం వినిపించే అవకాశం కూడా లభించింది. కిషన్‌రెడ్డికి మంత్రిపదవి దక్కడంతో ఒక్క హైదరాబాద్‌కే కాదు.. తెలంగాణ మొత్తానికి ప్రాతినిథ్యం లభించినట్లయ్యింది.
నిజానికి, 2014 ఎన్నికల సమయంలోనే కిషన్‌రెడ్డి లోక్‌సభకు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అంతేకాదు.. ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రి పదవి కూడా ఖాయమని పార్టీలో చర్చ జరిగింది. కానీ.. అప్పుడు అసెంబ్లీకే పోటీచేసిన కిషన్‌రెడ్డి.. ఇప్పుడు మాత్రం అనూహ్యంగా లోక్‌సభ ఎన్నికల్లో హస్తిన మెట్లెక్కారు.
భాజపాయే ప్రత్యామ్నాయం
ఆరు నెలలక్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 118 స్థానాల్లో పోటీ చేసినా గోషామహల్‌లో మాత్రమే విజయం సాధించింది. కానీ.. ఇప్పుడు ఐదు నెలల్లోనే అనూహ్య రీతిలో పుంజుకుని లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. అధికార టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ పార్టీగా సంకేతాలను వెలువరించింది. ఈ క్రమంలోనే బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా వ్యూహాత్మకంగా కిషన్‌రెడ్డికి కేంద్రమంత్రి బాధ్యతలు భుజానికెత్తినట్లు స్పష్టమవుతోంది.
ప్రస్తుతం తెలంగాణ నుంచి బీజేపీ తరపున ఎంపీలుగా బండి సంజయ్‌ కుమార్‌-కరీంనగర్‌, ధర్మపురి అర్వింద్‌-నిజామాబాద్‌, కిషన్‌రెడ్డి- సికింద్రాబాద్‌, సోయం బాపూరావు-ఆదిలాబాద్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరంతా తొలిసారి ఎంపీలుగా ఎన్నికైన వాళ్లే. అయితే భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉండటం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించటం కిషన్‌రెడ్డికి కలిసి వచ్చిన అంశాలు. అంతేకాకుండా.. ఎప్పటి నుంచో తెలంగాణలో పాగా వేయాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీ కిషన్‌రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించడం సరైన నిర్ణయంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి సంబంధించిన బాధ్యతలను కూడా ఆయనకు కేంద్ర నాయకత్వం అప్పగించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు సైతం ఉత్సాహంగా పనిచేసే అవకాశాలున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ క్యాబినెట్‌లో మంత్రిగా ఉండడం సంతోషంగా ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. బీజేపీలో సాధారణ కార్యకర్తగా ఉన్న తాను మంత్రిని అయ్యానని.. ఇది గర్వకారణ మన్నారు. కేంద్ర మంత్రిగా తనపై ఉంచిన బాధ్యతలకు పూర్తి న్యాయం చేస్తానని ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన తెలిపారు. తనపై నమ్మకంతో మంత్రి పదవి ఇచ్చిన ప్రధానమంత్రి మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఐదేళ్లూ దేశాభివృద్ధి కోసం మోదీ నేతృత్వంలో సబ్‌ కా సాత్‌.. సబ్‌ కా వికాస్‌.. నినాదంతో ముందుకు వెళతామని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతానికి కృషిచేస్తానని చెప్పారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా ముందుకెళ్తామని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఐదో వ్యక్తి!
కేంద్ర హోంశాఖలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వారిలో ఐదో తెలుగు వ్యక్తి కిషన్‌రెడ్డి. గతంలో ఈ బాధ్యతలను కాసు బ్రహ్మానందరెడ్డి, పీవీ నరసింహారావు, పెండేకంటి వెంకట సుబ్బయ్య, సీహెచ్‌ విద్యాసాగర్‌రావు నిర్వర్తిం చారు. ఇందిరా గాంధీ మంత్రివర్గంలో 1974 అక్టోబరు నుంచి 1977 మార్చి 24 వరకు కేబినెట్‌ మంత్రి హోదాలో కాసు బ్రహ్మానందరెడ్డి పనిచేశారు. కేంద్రంలో ప్రతిష్టాత్మక పోర్టుఫోలియోగా చెప్పుకొనే హోంశాఖ బాధ్యతలు చేపట్టిన తొలివ్యక్తిగా కాసు బ్రహ్మానందరెడ్డి చరిత్రపుటలకెక్కారు. తర్వాత పీవీ నరసింహారావు రెండుసార్లు హోంశాఖ కేబినెట్‌ మంత్రిగా సేవలందించారు. రాజీవ్‌గాంధీ మంత్రి వర్గంలో 1984 జులై 19 నుంచి డిసెంబరు 31 వరకు ఒక విడత, 1986 మార్చి 12 నుంచి మే 12 వరకు రెండో విడత హోంశాఖ బాధ్యతలను పీవీ నిర్వర్తించారు. 1985లో రాజీవ్‌గాంధీ మంత్రివర్గంలోనే కర్నూలు జిల్లాకు చెందిన పెండే కంటి వెంకట సుబ్బయ్య హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 1999లో వాజ్‌పేయి మంత్రివర్గంలో ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సీహెచ్‌ విద్యాసాగర్‌రావు హోంశాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. ఇప్పుడు ఆ అవకాశం సికింద్రాబాద్‌ ఎంపీ కిషన్‌రెడ్డికి లభించింది.
– సుజాత గోపగోని, 6302164068

తెలంగాణలో బీజేపీకి గత వైభవం


తెలంగాణలో బీజేపీకి గత వైభవం

తెలంగాణలో బీజేపీకి గత వైభవం

తెలంగాణలో బీజేపీకి గత వైభవం

భారీగా పెరిగిన ఓట్ల శాతం

తెలంగాణలో తమకు తిరుగేలేదనుకుంటున్న టీఆర్‌ఎస్‌ లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆత్మపరిశీలనలో పడింది. ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదనుకున్న భారతీయ జనతాపార్టీ అనూహ్యంగా పుంజుకుంది. అధికార టీఆర్‌ఎస్‌కు వెన్నులో వణుకు పుట్టించే స్థాయికి ఎగబాకింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏకపక్షంగా ఏలుతున్న టీఆర్‌ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయం అని తేల్చి చెప్పేసింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.
సంఖ్యాపరంగా చూస్తే మిగతా పార్టీలకంటే టీఆర్‌ఎస్‌ ఎక్కువ స్థానాలు గెలిచినా.. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను, విపక్షాలు గెలిచిన స్థానాలను బట్టి గులాబీ పార్టీకి ఒకరకంగా చావుతప్పి కన్నులొట్టబోయిన విధంగానే చెబుతున్నారు విశ్లేషకులు. తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ నాలుగు స్థానాల్లో విజయ దుందుభి మోగించింది. కాంగ్రెస్‌ మూడు స్థానాలు గెలుచుకుంది. విపక్షాలకు ఒక్కసీటు కూడా రాదని కేసీఆర్‌ బల్లగుద్దిమరీ చెప్పినా టీఆర్‌ఎస్‌ 9 స్థానాలకే పరిమితమైంది. ఎంఐఎం పాతబస్తీలో తన సీటును కాపాడుకుంది. అయితే.. భారతీయ జనతాపార్టీ గెలుచుకున్న స్థానాలు సామాన్యమైనవి కాదు. టీఆర్‌ఎస్‌కి కంచుకోటలు. ప్రధానంగా నిజామాబాద్‌, కరీంనగర్‌ లోక్‌సభ స్థానాలు టీఆర్‌ఎస్‌ ఉనికికే అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటారు. కేసీఆర్‌ హ్యాట్రిక్‌ సాధించిన స్థానం కరీంనగర్‌ కాగా, ఆయన కూతురు ప్రాతినిథ్యం వహించిన స్థానం నిజామాబాద్‌. ఒకరకంగా తెలంగాణ రాష్ట్రసమితి నాయకత్వం రాష్ట్రంలోని మిగతా స్థానాలకన్నా ఈ రెండు నియోజకవర్గాలపైనే ప్రత్యేకంగా దష్టిపెట్టింది. తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు చివరిదాకా ప్రయత్నాలు చేశారు. కానీ.. వాళ్ల వ్యూహాలు అక్కడ బెడసికొట్టాయి.
కరీంనగర్‌ లోక్‌సభ స్థానంలో టీఆర్‌ఎస్‌ ఓడిపోయింది. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. ఇది టీఆర్‌ఎస్‌ పార్టీతో పాటు కేసీఆర్‌కు, కేటీఆర్‌కు పెద్ద షాక్‌ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ లోక్‌సభ స్థానం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సెగ్మెంట్‌. కేసీఆర్‌కు ఎంపీగా హ్యాట్రిక్‌ విక్టరీ అందించింది కరీంనగర్‌. తెలంగాణ ఉద్యమ సమయంలో 2001, 2006, 2008లో మూడు సార్లు కరీంనగర్‌ స్థానం నుంచే కేసీఆర్‌ ఎంపీగా విజయం సాధించారు. 2014లో బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఈ స్థానం నుంచి గెలుపొందారు. ఈసారి కూడా వినోద్‌ గెలుస్తాడని అంతా భావించారు. అంతేకాదు.. వినోద్‌కుమార్‌ను గెలిపిస్తే కేంద్రంలో మంత్రిపదవి కూడా దక్కుతుందని స్వయంగా కేసీఆర్‌ ప్రచారం చేశారు. కానీ.. ఓటర్లు మాత్రం వారికి షాకిచ్చారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కు భారీ ఆధిక్యం కట్టబెట్టి సంచలన తీర్పు ఇచ్చారు.
ఇక నిజామాబాద్‌ నియోజకవర్గం.. కేసీఆర్‌ కుమార్తె కవిత 2014లో ఇక్కడి నుంచి విజయం సాధించారు. కేసీఆర్‌ కుమార్తెగా పార్టీలో, నియోజక వర్గంలో కవితకు ప్రత్యేక స్థానం ఉంది. తన లోక్‌సభ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆమెకు పట్టు ఉంది. జగిత్యాలలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌రెడ్డిని ఎమ్మెల్యేగా ఓడించడం, నిజామాబాద్‌ జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలు గెలిపించడంలో ఆమె కీలకంగా వ్యవహరించారని చెబుతారు. అయితే ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్‌రెడ్డి ఎన్నికవడం కవితకు ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో ఆమె ఓడిపోవడం షాక్‌కు గురిచేసింది. వాస్తవానికి నిజామాబాద్‌ నియోజక వర్గంలో ప్రధానంగా పసుపు రైతులు ఎంపీ కవిత తీరు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఖరి పట్ల ఆగ్రహంతో
ఉన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో, కనీసం కేంద్రాన్ని ఒప్పించడంలో సఫలం కాలేకపోతున్నారన్న ఆలోచనలో ఉన్నారు. దీంతో ఈ ఎన్నికల్లో ఇక్కడి నుంచి రైతులు భారీ సంఖ్యలో పోటీచేశారు. 176 మంది రైతులతో కలిపి మొత్తం 185 మంది అభ్యర్థులు నిజామాబాద్‌ లోక్‌సభ స్థానంలో పోటీ చేశారు. ఈ పరిణామాలు టీఆర్‌ఎస్‌ అధినాయ కత్వాన్ని కాస్త కలవరపాటుకు గురిచేశాయి. దీంతో.. తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసినప్పుడు సహచరుడు, మాజీ మంత్రి, నిజామాబాద్‌ జిల్లాలో మంచి పట్టున్న మండవ వెంకటేశ్వర్‌రావును కేసీఆర్‌ కలిశారు. స్వయంగా ముఖ్యమంత్రి మండవ ఇంటికి వెళ్లి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. సామాజిక సమీకరణాలు కవిత గెలుపుకు దోహదపడతాయన్న వ్యూహంతోనే కేసీఆర్‌ అనూహ్యంగా ఈ ప్లాన్‌ అమలు చేశారు. కానీ.. ఆయన ఆలోచన తప్పింది. కవిత ఓటమి పాలయ్యింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ భారీ మెజార్టీతో విజయం సాధించారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీచేసిన బీజేపీ నేతల కన్నా ఎక్కువ ఓట్లు సాధించి కూడా కరీంనగర్‌ నుంచి బండి సంజయ్‌ ఓడిపోయారు. రెండో స్థానానికి పరిమిత మయ్యారు. ఈసారి ఎంపీ ఎన్నికల్లో గెలిచి ముందు వరుసలో నిలిచారు. ఇప్పుడు కూడా తెలంగాణలో నాలుగు స్థానాల్లో గెలుపొందిన బీజేపీ అభ్యర్థుల్లో ఎక్కువ మెజార్టీ వచ్చింది బండి సంజయ్‌కే కావడం విశేషం. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌ కుమార్‌పై సంజయ్‌ 89 వేల 508 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నిజామాబాద్‌ నుంచి గెలిచిన ధర్మపురి అర్వింద్‌కు 70 వేల 875 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇక సికింద్రాబాద్‌ నుంచి గెలిచిన కిషన్‌రెడ్డికి 62 వేల 114 ఓట్ల మెజార్టీ.. ఆదిలాబాద్‌ నుంచి విజయం సాధించిన సోయం బాపూరావు 58 వేల 560 ఓట్ల మెజార్టీ సాధించారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీకి ఏడుశాతం ఓట్లు పోలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీకి పోలైన 14 లక్షల 50 వేల 456 ఓట్లలో హైదరాబాద్‌ గోషామహల్‌ నుంచి గెలిచిన రాజాసింగ్‌కు 61 వేల 854 ఓట్లు రాగా.. అంబర్‌ పేట నుంచి పోటీ చేసి ఓడిపోయిన కిషన్‌రెడ్డికి 60 వేల 542 ఓట్లు వచ్చాయి. కరీంనగర్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బండి సంజయ్‌కి 66 వేల 9 ఓట్లు పోలయ్యాయి. అలా అప్పుడు కూడా బీజేపీలోనే టాప్‌గా నిలిచారు బండి సంజయ్‌. కరీంనగర్‌ జిల్లా బీజేపీకి కొత్త జవసత్వాలు నింపిన నాయకుడిగా ఈయనకి పేరుంది. కార్యకర్తల్లో భరోసా నింపుతూ, తాను ఉన్నానంటూ ధైర్యం చెబుతూ పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సంజయ్‌ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. యూత్‌, హిందూత్వం, బీజేపీ వాదం, గతంలో ఓడిపోయారన్న సానుభూతి, వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్‌.. ఇవే బండి సంజయ్‌ ప్లస్‌ పాయింట్స్‌గా బీజేపీ కార్యకర్తలు చెబుతున్నారు. ఆయన వ్యక్తిగత ఇమేజ్‌ కారణంగా… ఎన్నడూ బీజేపీ వైపు చూడని ఇతర పార్టీల ఓటు బ్యాంక్‌ ఈసారి కమలం వైపు తిరిగిందని కొంతమంది చెప్పు కుంటున్నారు.
20శాతానికి చేరిన బీజేపీ ఓటు బ్యాంక్‌
తెలంగాణలో బీజేపీకి ఓట్లు శాతం భారీగా పెరిగింది. ఒకప్పుడు 4 శాతంగా ఉన్న ఓటింగ్‌ ఇప్పుడు ఏకంగా 19శాతానికి ఎగబాకింది. ప్రత్యమ్నాయ శక్తిగా బీజేపీ తెలంగాణలో ఎదుగుతోందన్న సంకేతాలకు ఇదే నిదర్శనమని విశ్లేషకులు కూడా చెబుతున్నారు. గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో చూస్తే.. బీజేపీ అభ్యర్థులకు 7శాతం ఓట్లు పోలయ్యాయి. అప్పుడు ఒకేఒక్క ఎమ్మెల్యే సీటును బీజేపీ గెలుచుకుంది. కానీ.. ఇప్పుడు ఓట్లతో పాటు.. సీట్ల సంఖ్య కూడా పెరిగింది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు 19.45శాతం ఓట్లు పోలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 118 స్థానాల్లో పోటీ చేయగా ఒక్క గోషామహల్‌లోనే గెలిచింది. 105 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. 14,94,554 ఓట్లు (7%) సాధించింది. లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఓట్లు శాతం ఏకంగా 19.45కి ఎగబాకింది. 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 33,43,808 ఓట్లు సాధించింది. 4 స్థానాల్లో గెలిచింది. కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, ఆదిలాబాద్‌, చేవెళ్ల, మెదక్‌ నియోజకవర్గాల్లో పార్టీ పుంజుకుంది. ఇక మజ్లిస్‌ కంచుకోటగా ఉన్న హైదరాబాద్‌ నియోజకవర్గంలో రెండో స్థానంలో నిలవగా, పెద్దపల్లి, భువనగిరి, మెదక్‌, నల్లగొండ, ఖమ్మం, మల్కాజిగిరి, జహీరాబాద్‌, వరంగల్‌, మహబూబాబాద్‌, చేవెళ్లలో మూడో స్థానంలో నిలిచింది.
కేటీఆర్‌ ప్లాఫ్‌ – హరీష్‌ సక్సెస్‌!
లోక్‌సభ ఎన్నికల్లో కేటీఆర్‌ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యారన్న వాదనలు సొంత పార్టీలోనే వినిపిస్తు న్నాయి. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులందరినీ గెలిపించుకుంటానని ప్రకటించా రాయన. కానీ.. కేటీఆర్‌ బాధ్యత తీసుకున్న నియోజకవర్గాల్లో అభ్యర్థులు చిత్తుగా ఓడిపోయారు. ఆయన స్వంత నియోజకవర్గం సిరిసిల్ల ఉన్న కరీంనగర్‌ లోక్‌సభ సీటును సైతం గెలవలేకపోవడం షాక్‌ ఇచ్చింది. మరోవైపు.. హరీష్‌రావును పార్టీలో పక్కనబెట్టారు. ప్రాధాన్యం పూర్తిగా తగ్గించారు. కానీ.. తాను ఇంచార్జీగా ఉన్న మెదక్‌ ఎంపీ అభ్యర్థిని 3 లక్షల పైచిలుకు మెజారిటీతో ఆయన గెలిపించు కున్నారు. ఈ పరిణామాలు హరీష్‌ సక్సెస్‌.. కేటీఆర్‌ ఫెయిల్‌ అని పార్టీలో చర్చకు దారితీస్తున్నాయి. ఒకప్పుడు తన మామ కేసీఆర్‌కు కుడిభుజంగా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిచిన హరీష్‌రావు పార్టీని బలోపేతం చేయడంలో కీలక భూమిక పోషించారు. కేసీఆర్‌ అప్పగించిన అన్ని బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించి పార్టీలో ట్రబుల్‌ షూటర్‌గా గుర్తింపు పొందారు. పార్టీకి కీలకమైన ఉపఎన్నికలు, నియోజకవర్గాల బాధ్యతలను తీసుకున్న హరీష్‌ అన్నింటా సక్సెస్‌ అయ్యారు. అయితే, గత కొన్ని రోజులుగా.. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చాక పార్టీలో హరీష్‌ ప్రాధాన్యం తగ్గుతూ వస్తోంది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌కు బాధ్యతలు ఇవ్వడం, హరీష్‌రావుకు మంత్రి పదవి సైతం ఇవ్వకపోవడంతో ఆయన సిద్ధిపేటకే పరిమితం అయ్యారు. ఇదే సమయంలో కేటీఆర్‌ ప్రాధాన్యం పార్టీలో బాగా పెరిగింది. అయితే ఈ ఎన్నికలు మాత్రం ఆయనకు షాక్‌ ఇచ్చాయి. సారు.. కారు.. పదహారు నినాదంతో వెళ్లి 16 సీట్లూ టీఆర్‌ఎస్‌ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నించారు కేటీఆర్‌. కానీ, ఆయనకు మింగుడు పడని ఫలితాలు వచ్చాయి. 16 గెలుస్తారనుకుంటే కేవలం 9 స్థానాలకే టీఆర్‌ఎస్‌ పరిమితం అయ్యింది. ఓ సమయంలో ఆయన సరదాగా హరీష్‌రావుకు మెదక్‌లో ఎక్కువ మెజారిటీ వస్తుందా? కరీంనగర్‌లో వస్తుందా? చూసుకుందామని సవాల్‌ చేశారు. కరీంనగర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చిత్తుగా ఓడిపోతే.. మెదక్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. మొత్తంగా కేసీఆర్‌ కూతురు కవిత, కుమారుడు కేటీఆర్‌కు లోక్‌సభ ఫలితాలు చేదు అనుభవాన్ని మిగల్చగా హరీష్‌రావు సక్సెస్‌ రేటును మరింతపెంచాయి.
– సుజాత గోపగోని, 6302164068

సారు.. కారు.. బేజారు..

సారు.. కారు.. బేజారు..

సారు.. కారు.. బేజారు..
– తెలంగాణలో కమల వికాసం
– గులాబీ కోటలకు బీటలు
తెలంగాణ లోక్‌సభ ఫలితాల్లో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు భారతీయ జనతా పార్టీ భారీ షాక్‌ ఇచ్చింది. రాష్ట్రంలో గులాబీ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీయేనన్న సంకేతాలు కనబరిచింది. లోక్‌సభ ఎన్నికల్లో వెలువడిన ఫలితాలతో ఈ కొత్తశకానికి బీజం పడింది. కాంగ్రెస్‌ పార్టీ కూడా తనవంతు కోత పెట్టడంతో టీఆర్‌ఎస్‌కు ఊహించని దెబ్బ తగిలింది. 16 ఎంపీ సీట్లు తమకే దక్కుతా యని కేసీఆర్‌ పెట్టుకున్న ధీమా నిజం కాలేదు. అత్యధిక స్థానాలను గెలుచుకొని చరిత్ర సష్టించాలన్న టీఆర్‌ఎస్‌ ప్రయత్నానికి బీజేపీ, కాంగ్రెస్‌లు బ్రేకులు వేశాయి. టీఆర్‌ఎస్‌ అత్యంత కీలకంగా భావించే లోక్‌సభ స్థానాల్లో భాజపా పాగా వేసింది. చివరకు అధికార పార్టీ 9 స్థానాలకే పరిమిత మయ్యింది. ఎంఐఎంకు వచ్చే ఒక్క సీటుకు తోడు.. తాము సాధించే 16 స్థానాలతో ఢిల్లీలో చక్రం తిప్పుతానని కేసీఆర్‌ బహిరంగంగానే ప్రకటించారు. కానీ.. ప్రజా తీర్పుతో ఆయన ఆశలు అడియాశలయ్యాయి.
గత యేడాది డిసెంబర్‌ మొదటివారంలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తిరుగులేని విజయం సాధించింది. మొత్తం 119 శాసనసభా స్థానాలకు గానూ ఆ పార్టీకి చెందిన 88 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఆ తర్వాత కేసీఆర్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌ కారణంగా అసెంబ్లీలో ఆ పార్టీ బలం సెంచరీ దాటింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగి నాలుగు నెలలే కావడంతో సార్వత్రిక ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ హవా కొనసాగుతుందని కేసీఆర్‌ బలంగా విశ్వసించారు. కానీ.. ఆయన అంచనా తప్పింది. ప్రజాతీర్పులో ఎదురుదాడి వ్యక్తమయ్యింది. దీంతో ఇన్నాళ్లుగా విజయకేతనం ఎగురవేస్తూ వస్తున్న టీఆర్‌ఎస్‌కు ఊహించని ప్రతిఘటన ఎదురైంది.
రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలు గెలవబోతున్నా మంటూ కేసీఆర్‌, కేటీఆర్‌ ఎన్నికల ప్రచార సభల్లో ధీమాగా చెప్పారు. కానీ.. ఓట్ల లెక్కింపు మొదలైన తొలి రౌండ్‌ నుంచే ఆ పార్టీకి ఎదురుగాలి వీచింది. భారతీయ జనతాపార్టీ అభ్యర్థులు నాలుగు స్థానాల్లో మొదటి నుంచీ ఆధిక్యత కొనసాగించారు. అటు.. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు కూడా మరో నాలుగు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. అయితే లెక్కింపు పూర్తయ్యే సమయానికి బీజేపీ నాలుగు స్థానాలను దక్కించుకోగా, కాంగ్రెస్‌ పార్టీ మూడు స్థానాల్లో గెలుపొందింది. ఈ మిశ్రమ ఫలితాలు గమనిస్తే టీఆర్‌ఎస్‌కు ప్రజల్లో వ్యతిరేకత మొదలైనట్లుగా స్పష్టమవుతోందని విశ్లేషకులు సైతం వ్యాఖ్యా నిస్తున్నారు. అయితే.. మొదటి నుంచీ ఆ పార్టీకి బలంగా ఉన్న కరీంనగర్‌, నిజామాబాద్‌ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చను లేవనెత్తింది.
కరీంనగర్‌ గడ్డపై కాషాయ జెండా!
కరీంనగర్‌ లోక్‌సభ స్థానం తెలంగాణ రాష్ట్ర సమితికి కంచుకోట. ఒక్కసారి మినహా కేసీఆర్‌.. ప్రతిసారీ ఆ స్థానం నుంచే పోటీచేసి తెలంగాణ నినాదాన్ని పార్లమెంటులో వినిపించారు. తర్వాత పార్టీ సీనియర్‌ నేత, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన బోయినపల్లి వినోద్‌ కుమార్‌కు ఆ స్థానం కేటాయించారు. 2014లో ఇక్కడి నుంచి గెలుపొందిన వినోద్‌ ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ కుమార్‌ చేతిలో 90 వేల ఓట్ల తేడాతో ఘోర ఓటమి పాలయ్యారు.
ఇందూర్‌లో అర్వింద్‌ జయకేతనం
ఇక దేశవ్యాప్తంగా అందిరి దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ఓటమి కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌కు మింగుడు పడటం లేదు. ఇక్కడ భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ కేసీఆర్‌ కుమార్తె కవితపై అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఈ నియోజక వర్గంలో పసుపు-ఎర్రజొన్న రైతుల సమస్యలు పరిష్కరించడంలో సిట్టింగ్‌ ఎంపీ కవిత నిర్లక్ష్యం వహించారు. రైతు సమస్యలకు సంబంధించిన పోరాటాల్లో ఎప్పుడూ ముందుండే అర్వింద్‌ తనను గెలిపిస్తే కేంద్రంలో పసుపు-ఎర్రజొన్న బోర్డు ఏర్పాటు చేసేందుకు వందశాతం సహకరిస్తానని హామి ఇచ్చారు. అంతేకాకుండా ఈయన గతంలో చెరకు రైతుల సమస్యల పరిష్కారం కోసం 150 కిలోమీటర్లు పాదయాత్ర కూడా చేశారు. దీంతో మార్పు కోరుకుంటున్న ఇందూరు ఓటర్లు అర్వింద్‌ నాయకత్వానికే పట్టం కట్టారు.
కారు స్పీడుకు బ్రేకులు
రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ 9, బీజేపీ 4, కాంగ్రెస్‌ 3, ఎంఐఎం ఒక్క స్థానంలో గెలుపొందాయి. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 11 స్థానాలు రాగా.. ఈ ఎన్నికల్లో రెండు స్థానాలు తగ్గాయి. శాసనసభకు జరిగిన ఎన్నికల పోరులో దెబ్బతిన్న కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో మూడు పార్లమెంట్‌ స్థానాల్ని కైవసం చేసుకొని ఊపిరి పీల్చుకుంది. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడిన బీజేపీ అనూహ్యంగా పుంజుకొని తెరాస కంచు కోటల్ని బద్దలుకొట్టింది. కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, సికింద్రాబాద్‌లలో కమలం వికసించింది. మెదక్‌, నాగర్‌ర్నూలు, మహబూబ్‌ నగర్‌, వరంగల్‌, మహబూబాబాద్‌, జహీరాబాద్‌, ఖమ్మం, పెద్దపల్లి, చేవెళ్ల నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ విజయకేతనం ఎగురవేయగా.. మల్కాజ్‌గిరి, భువనగిరి, నల్గొండలో కాంగ్రెస్‌ విజయ దుందుభి మోగించింది. హైదరాబాద్‌లో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్‌ ఒవైసీ విజయం సాధించారు.
ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అన్ని స్థానాల్లోనూ పోటీ చేసింది. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానంలో ఎంఐఎంతో స్నేహపూర్వక పోటీ కాగా, మిగిలిన 16 స్థానాలను దక్కించుకోవడానికి ‘కారు..సారు..16’ నినాదంతో ముమ్మర ప్రచారం చేసింది. కానీ.. ఫలితాల్లో దాదాపు సగానికే పరిమితమయ్యింది. ఆ పార్టీకి కంచుకోట లాంటి కరీంనగర్‌లో సిట్టింగ్‌ ఎంపీ బి. వినోద్‌ కుమార్‌, నిజామాబాద్‌లో ప్రస్తుత ఎంపీ, కేసీఆర్‌ కుమార్తె కవిత, అలాగే భువనగిరి సిట్టింగ్‌ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, ఆదిలాబాద్‌ ఎంపీ గోడెం నగేశ్‌లు పరాజయం పాలయ్యారు. భాజపా చేతుల్లో ఓటమి పాలు కావడం, కాంగ్రెస్‌లో ముఖ్య నాయకులు మూడు లోక్‌సభ స్థానాలు గెలవడం తెరాస వర్గాలను విస్మయానికి గురిచేశాయి.
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మొత్తానికి ఆసక్తిని రేకెత్తించాయి. అనూహ్య రీతిలో వచ్చిన మిశ్రమ ఫలితాలు ఓ వైపు విశ్లేషకులను కూడా విస్తుపోయేలా చేస్తే… మరికొన్ని అంశాలు ప్రత్యేకంగా నిలిచాయి. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చను లేవనెత్తాయి. ప్రధానంగా గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీచేసి ఓడిపోయిన విపక్షాలకు చెందిన ఐదుగురు నేతలు ఇప్పుడు ఎంపీలుగా విజయం సాధించారు. అధికార టీఆర్‌ఎస్‌కు ఈ పరిణామం సవాల్‌గా మారింది. పైగా.. మూడు నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లను మట్టికరిపించడం రాజకీయంగా కలకలం రేపింది. మరో స్థానంలోనూ పోటీలో సిట్టింగ్‌ ఎంపీకి బదులు ఆయన బంధువును నిలబెట్టగా ఆ అభ్యర్థి కూడా ఓటమి పాలయ్యారు.
ఫైర్‌బ్రాండ్‌
కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎంపీ బోయినపల్లి వినోద్‌ కుమార్‌పై బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ కుమార్‌ భారీ మెజారిటీతో గెలుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే అసెంబ్లీ స్థానం నుంచి సంజయ్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గంగుల కమలాకర్‌పై స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోగా.. ఈ ఎన్నికల్లో గెలిచి చరిత్ర సృష్టించారు. ప్రజా సమస్య లపై చురుగ్గా స్పందించడం.. పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉండటం.. ఎటువంటి పరిస్థితులెదురైనా ఆత్మవిశాస్వసం కోల్పోకుండా ముందుకు సాగడమే సంజయ్‌ గెలుపుకు కారణమని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి.
పార్లమెంట్‌కి తొలిసారిగా!
సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట్‌ నియోజక వర్గం నుంచి పోటీచేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చేతిలో అతి తక్కువ ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు సికింద్రాబాద్‌ నుంచి.. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమారుడు తలసాని సాయికిరణ్‌ యాదవ్‌పై 51 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొం దారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కిషన్‌రెడ్డి ఈసారి పార్లమెంట్‌లో అడుగుపెట్ట బోతున్నారు.
మరోవైపు.. ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన సోయం బాపూరావు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎంపీ గోడెం నగేష్‌పై 50వేల పైచిలుకు మెజార్టీ సాధించారు. ఈయన గత అసెంబ్లీ ఎన్నికల్లో బోథ్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు.
అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌ నియోజక వర్గం నుంచి ఓటమి పాలైన తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి.. ఈ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డిపై 6వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ ఎన్నికల్లో భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీ సిట్టింగ్‌ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ను ఓడించారు.
ఈ ఎన్నికల్లో గెలుపొందిన విపక్షాల అభ్యర్థులు అధికార తెలంగాణ రాష్ట్రసమితికి చెందిన సిట్టింగ్‌ ఎంపీలను, ఆ పార్టీ అభ్యర్థులను ఓడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన టీఆర్‌ఎస్‌.. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో సిట్టింగ్‌లను కోల్పోవడం, కేవలం 10 స్థానాలతోనే సరిపెట్టుకోవడం.. పైగా.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వాళ్ల చేతుల్లోనే ఇప్పుడు తమపార్టీ ఎంపీ అభ్యర్థులు ఓడిపోవడంపై గులాబీ పార్టీ సమీక్షించుకుంటోంది.
– సుజాత గోపగోని, 6302164068

ఫ్రంట్‌కు డీఎంకే షాక్‌.. కేసీఆర్‌ చెన్నై టూర్‌ అట్టర్‌ఫ్లాప్‌!


ఫ్రంట్‌కు డీఎంకే షాక్‌.. కేసీఆర్‌ చెన్నై టూర్‌ అట్టర్‌ఫ్లాప్‌!

ఫ్రంట్‌కు డీఎంకే షాక్‌.. కేసీఆర్‌ చెన్నై టూర్‌ అట్టర్‌ఫ్లాప్‌!

ఫ్రంట్‌కు డీఎంకే షాక్‌.. కేసీఆర్‌ చెన్నై టూర్‌ అట్టర్‌ఫ్లాప్‌!
తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌కు ఆదిలోనే హంసపాదు ఎదురవుతోందా? ఫ్రంట్‌ గురించి తాను ప్రతిపాదిస్తే.. ఎదుటివాళ్లు తనకే ఉచిత సలహాలు ఇస్తున్నారా? ఇటువంటి పరిస్థితుల్లో ఆ ప్రయత్నం వృథా ప్రయాసే అవుతుందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం అవుననే వినిపిస్తోంది.
గత కొన్ని రోజులుగా కాంగ్రెస్సేతర, బీజేపీయేతర ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు కోసం టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే గతంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిశా ముఖ్యమంతి నవీన్‌ పట్నాయక్‌, ఎస్‌పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ తోనూ ఆయన సమావేశం అయ్యారు. అయితే ఆ పర్యటనల్లో ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ వెల్లడిస్తూ.. మీడియా ముందు మాట్లాడిన కేసీఆర్‌.. తన తాజా దక్షిణాది పర్యటనల నేపథ్యంలో చర్చల సారాంశాన్ని బహి రంగంగా చెప్పకపోవడం దేనికి సంకేతం? ఈ సమావేశాల తర్వాత బయటకు వస్తున్న లీకులు దేనికి నిదర్శనం? ప్రస్తుతం అంతటా ఇదే విషయం చర్చనీయాంశంగా మారుతోంది. ఫెడరల్‌ ఫ్రంట్‌ భవితవ్యంపై సందిగ్ధాన్ని లేవనెత్తుతోంది.
కాంగ్రెసేతర, బీజేపీయేతర ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటూ చెబుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి చెన్నై వెళ్లారు. ఆళ్వార్‌పేటలోని డీఎంకే అధినేత నివాసానికి వెళ్లి అక్కడ స్టాలిన్‌ను కలిశారు. సుమారు గంటన్నర పాటు ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆవశ్యకతను తనదైన శైలిలో వివరించారు. దక్షిణాది ఎంపీలంతా కలిస్తే కేంద్రంలో చక్రం తిప్పవచ్చని ప్రతిపాదించారు. కేబినెట్‌ పదవులతోనే సరిపెట్టుకోవద్దని, మరింత ఉన్నత పదవిని సాధించాలని, విధాన నిర్ణయాల్లోనూ మన మాట చెల్లుబాటు కావాలని చెప్పుకొచ్చారు. గవర్నర్ల నియామకంలోనూ ప్రాంతీయ పార్టీల పాత్ర ఉండాలని వివరించారు. కేబినెట్‌ మంత్రులకన్నా మరింత ఉన్నత పదవి దక్కేలా ప్రయత్నించాలన్న కేసీఆర్‌ అంతర్గతంగా ఉపప్రధాని ఆకాంక్షపై సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే ‘ఉపప్రధాని’ పదవిపై గులాబీ అధినేత కన్నేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
కొత్త ప్రతిపాదన
అయితే, యూపీఏకు మొదటినుంచీ మద్దతు ఇస్తున్న డీఎంకే నేత స్టాలిన్‌.. ఇప్పటికే రాహుల్‌గాంధీ ప్రధాని కావాలంటూ రెండుసార్లు బహిరంగంగా ప్రకటించారు. దీంతో.. ఇప్పుడు కేసీఆర్‌ చేసిన బీజేపీ, కాంగ్రెసేతర ఫ్రంట్‌ ప్రతిపాదనపై స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది. అంతేకాదు.. కేసీఆర్‌ ఫ్రంట్‌ కోసం చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావిస్తూ.. ఫ్రంట్‌ తరపున కాంగ్రెస్‌ నేతత్వంలోని యూపీఏకు మద్దతు తెలపాలని కొత్త ప్రతిపాదన తెచ్చినట్లు సమాచారం. స్టాలిన్‌ చేసిన ఈ ప్రతిపాదనను కేసీఆర్‌ ఖండించ లేదని, అంటే.. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకునేలా.. తన అభిప్రాయాన్ని రిజర్వ్‌ చేశారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందుకే ఇరువురి సమావేశం తర్వాత ఎవరూ మీడియాతో మాట్లాడలేదని తెలుస్తోంది.
ట్వీట్‌ ట్రూత్‌ ?
స్టాలిన్‌తో భేటీ తర్వాత తెలంగాణ ఎంపీలతో కలిసి కేసీఆర్‌ కారెక్కి వెళ్లిపోయారు. డీఎంకే మాజీ ఎంపీ టీఆర్‌ బాలు, కోశాధికారి దురై మురుగన్‌ సైతం సమావేశ వివరాలను విలేకరుల ఎదుట వెల్లడించకుండా మౌనం పాటించారు. అనంతరం, కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగానే స్టాలిన్‌ కలుసుకున్నా రని డీఎంకే అధిష్టానం క్లుప్తంగా ఓ ప్రకటన జారీ చేసింది. కానీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి శరవణన్‌ అన్నాదురై మాత్రం సమావేశ సారాంశాన్ని ఒక్క మాటలో తేల్చి చెప్పేశారు. కాంగ్రెస్‌ నేతత్వంలోని సంకీర్ణానికి మద్దతు తెలిపేలా.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను స్టాలిన్‌ ఒప్పించారని, ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక ప్రాంతీయ నాయకులే హీరోలు అంటూ ఆయన ట్విట్టర్‌లో స్పందించారు. మరోవైపు.. యూపీఏలో చేరాలన్న స్టాలిన్‌ ప్రతిపాదనను కేసీఆర్‌ తోసిపుచ్చలేదని జాతీయ మీడియా పేర్కొంది.
ఫలించని ప్రయత్నం !
అయితే, అటు డీఎంకే వర్గాలు, ఇటు టీఆర్‌ఎస్‌ వర్గాలను ఉటంకిస్తూ స్టాలిన్‌-కేసీఆర్‌ భేటీపై జాతీయ పత్రికలు, చానళ్లు, వెబ్‌సైట్లలో రకరకాల విశ్లేషణలు వెలువడ్డాయి. కాంగ్రెస్‌, డీఎంకే మధ్య బలమైన బంధం కారణంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ చర్చలు అసంపూర్తిగానే ముగిశాయని విశ్లేషణలు సాగాయి. ఫెడరల్‌ ఫ్రంట్‌లో చేరబోమని, కాంగ్రెసతో తమ బంధం చాలా పటిష్టమైనదని డీఎంకే స్పష్టం చేసినట్లు పేర్కొన్నాయి. బీజేపీతో పోరాడడానికి కాంగ్రెస్‌ కూటమితో చేతులు కలిపే విషయాన్ని పరిశీలించా లని డీఎంకేనే కేసీఆర్‌ను కోరిందన్న చర్చ సాగింది. కేసీఆర్‌ ఎంతగా ఒప్పించేందుకు ప్రయత్నించినా యూపీఏతోనే ఉంటానని స్టాలిన్‌ స్పష్టం చేశారని, ఆయననే కాంగ్రెస్‌ కూటమిలోకి ఆహ్వానించారని జాతీయ మీడియా పేర్కొంది. స్టాలిన్‌ను ఫెడరల్‌ ఫ్రంట్‌లోకి ఆహ్వానించాలన్న కేసీఆర్‌కు నిరాశే మిగిలిందని, ఆయన ప్రతిపాదనను స్టాలిన్‌ తిరస్క రించారని తెలిపింది. జాతీయ పార్టీల సహకారంతో ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, ఇందుకు వామపక్షాలు కూడా మద్దతు పలుకుతాయని కేసీఆర్‌ ప్రతిపాదించారని, అయితే, యూపీఏకే పరిస్థితి సానుకూలంగా ఉందని డీఎంకే నేతలు తెలిపారని ఇరుపార్టీల నేతలను ఉటంకిస్తూ కథనాలు వెలువడ్డాయి.
భేటీ వెనక రహస్యం ?!
తన ‘ఉప ప్రధాని ఆకాంక్ష’పై కేసీఆర్‌ స్టాలిన్‌కు చాలా సంకేతాలు ఇచ్చినా ఫలితం దక్కకపోవ డంతో.. గులాబీ బాస్‌ చిన్నబుచ్చుకున్నట్లు చెబుతున్నారు. స్టాలిన్‌ తిరస్కరణతో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు ఆదిలోనే హంసపాదు ఎదురైనట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే.. కొద్ది రోజుల కిందట కేసీఆర్‌తో భేటీకి నిరాకరించిన స్టాలిన్‌ ఇప్పుడు ఎందుకు కలిశారు ? కాంగ్రెస్‌తోనే కలిసి సాగాలని నిర్ణయించుకున్న తర్వాత కూడా ఈ భేటీకి ఎందుకు అంగీకరించారు? అన్న ప్రశ్నలు జాతీయ స్థాయిలో చర్చను లేవనెత్తాయి. కేసీఆర్‌ మనసులో ఏముందో తెలుసుకునే ఉద్దేశంతో కాంగ్రెస్‌ సలహాతోనే స్టాలిన్‌ ఈ భేటీకి అంగీకరించి ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అయితే.. స్టాలిన్‌ను కలిసిన మరుసటిరోజే కేసీఆర్‌కు షాక్‌ తగిలింది. దేశంలో మూడోఫ్రంట్‌కు అవకాశమే లేదని స్టాలిన్‌ ప్రకటన చేశారు. దీంతో.. కేసీఆర్‌ చెన్నై టూర్‌ వథా అయ్యిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. కేసీఆర్‌ ప్రస్తుతం తనకు బద్ధ విరోధిగా భావిస్తున్న చంద్రబాబును.. డీఎంకే నేత దొరై మురుగన్‌ కలిశారు. అమరావతి వచ్చిన మురుగన్‌ చంద్రబాబుతో భేటీ అయ్యారు. కేసీఆర్‌ చెన్నై వెళ్లి స్టాలిన్‌ను కలిసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం రాజకీయంగా ఆసక్తిని లేవనెత్తింది. నిజానికి మూడో కూటమిపై స్టాలిన్‌కు మొదటి నుంచీ ఆసక్తి లేదు. ఇందుకు కారణం గతంలో థర్డ్‌ ఫ్రంట్‌ ప్రయోగం రెండుసార్లు విఫలం కావడమే అన్నది ఆయన అభిప్రాయం.
రాయభారం విఫలం
మొత్తానికి కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ చెన్నై రాయభారం విఫలమైంది. ఫ్రంట్‌ కోసమే, ఫ్రంట్‌ గురించే స్టాలిన్‌ను కలిసేందుకు వెళ్లిన కేసీఆర్‌.. సక్సెస్‌ కాలేకపోయారు. పైగా.. అసలు కేసీఆర్‌ మనసులో ఏముందో, ఆయన వైఖరి ఏంటో, అవసరమైతే భవిష్యత్తులో కాంగ్రెస్‌తో కలిసి వస్తారో లేదో అన్న అంశాలను గ్రహించేందుకు డీఎంకే నేతలు ప్రయత్నించారు. తమ ప్రతిపాదనలను కేసీఆర్‌ ముందు ఉంచారు. మరుసటిరోజే మూడోఫ్రంట్‌కు అవకాశమే లేదని బహిరంగ ప్రకటన చేశారు.
– సుజాత గోపగోని, 6302164068

గులాబా దృష్టి ఎర్రబడుతోందా !


‘ఇంటర్‌’ నిరసనలపై నీళ్లు !


‘ఇంటర్‌’ నిరసనలపై నీళ్లు !

‘ఇంటర్‌’ నిరసనలపై నీళ్లు !

‘ఇంటర్‌’ నిరసనలపై నీళ్లు !
బీజేపీ నేత లక్ష్మణ్‌ దీక్ష భగ్నం
తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డులో జరిగిన అవకతవలపై భాజపా సమరశంఖం పూరించింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఏదో కంటితుడుపు చర్యగా స్పందించడం మినహా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం, సమస్యకు శాశ్వత పరిష్కారం గురించి ఆలోచించకపోవడంపై భారతీయ జనతా పార్టీ కన్నెర్ర జేసింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ ఏప్రిల్‌ 29వ తేదీన హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాల యంలో నిరవధిక నిరాహారదీక్షకు దిగారు. ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలపై సిట్టింగ్‌ జడ్జీతో విచారణ చేపట్టాలన్నారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని తొలగించాలని డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అయితే, దీక్ష చేపట్టిన కొద్దిసేపటికే పోలీసులు లక్ష్మణ్‌ను అరెస్టు చేశారు. ఆయనను తొలుత గోషామహల్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో పోలీసులు, భాజపా కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసు కోవడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో భాజపా మహిళా కార్యకర్త ఒకరు సొమ్మసిల్లి పడిపోయారు. అలాగే, మరో 50 నుంచి 60 మంది నేతలు, కార్యకర్తల్ని సైతం పోలీసులు అరెస్టు చేసి గోషామహల్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడినుంచి లక్ష్మణ్‌ను నిమ్స్‌కు తరలించారు. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా, అరెస్టులు చేసినా ఇంటర్‌ విద్యార్థులకు న్యాయం జరిగే దాకా ఆందోళనలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా లక్ష్మణ్‌ తెలిపారు.
ఇంటర్మీడియట్‌ బోర్డు ఫెయిల్‌!
సాధారణంగా పరీక్షలు రాసిన విద్యార్థుల్లో కొందరు పాసవుతారు, మరికొందరు ఫెయిలవు తారు. పాసైన వాళ్లల్లో కొందరు టాపర్లుగా నిలుస్తారు. ఈ వ్యవహారమంతా సంబంధిత బోర్డు చూసుకుంటుంది. విద్యార్థులకు ఎక్కడా అన్యాయం జరగకుండా, నిష్పక్షపాతంగా, అత్యంత అప్ర మత్తంగా సాగుతుందీ తంతు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు నిర్వహించే ఇంటర్‌బోర్డే ఫెయిలయ్యింది. సక్రమంగా పరీక్షలు రాసిన విద్యార్థులను పాస్‌ చేయాల్సిన బోర్డు ఊబిలో కూరుకుపోయింది. చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ ఇంటర్‌బోర్డు అపఖ్యాతిని మూట గట్టుకుంది. లక్షల మంది విద్యార్థులను మానసిక వేదనకు గురిచేసింది. వేలాదిమంది విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులను బాధపెట్టింది. పైగా మొదట్లో పొరపాట్లను అపోహలంటూ కొట్టిపారేసింది. కనీసం సమస్య చెప్పుకునేందుకు వచ్చినవాళ్ల మాటలు కూడా వినే ప్రయత్నం చేయలేదు. బాధితులకు సమాధానం చెప్పకుండా పోలీసులను ఉసిగొల్పింది. బోర్డు పరిసరాల్లో భయానక వాతావరణాన్ని సృష్టించింది.
3 లక్షల మంది ఫెయిల్‌
తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 9 లక్షల 70వేల మంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలు రాశారు. వారిలో మూడు లక్షల 24వేల మంది ఫెయిలయినట్లు ఆన్‌లైన్‌ రికార్డులు చూపించాయి. ఇది సాంకేతిక తప్పిదమా? మానవ తప్పిదమా? అన్నది ఇంకా తేల్చలేదు. ఇంటర్‌బోర్డు వ్యవహారశైలితో చక్కగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటామని ఎంతో భరోసాగా ఉన్న విద్యార్థులు ఫలితాలు వెలువడిన తర్వాత తీవ్ర షాక్‌కు గురయ్యారు. వాళ్ల తల్లిదండ్రుల ఆశలు ఆవిరయ్యాయి. ఫలితంగా అంతటా ఆవేదన అలుముకుంది. కన్నీళ్లు ప్రవాహంలా కారిపోయాయి. అధికారుల తీరు, పోలీసుల శైలి వాళ్లల్లో మరింత ఆగ్రహావేశాలకు కారణమయ్యాయి.
ఇవేం ఫలితాలు?
ఫస్టియర్‌లో మండల టాపర్‌గా నిలిచిన అమ్మాయికి సెకండియర్‌లో సున్నా మార్కులు కనిపించాయి. మరుసటిరోజు సాయంత్రానికే సున్నా మార్కులు 99 మార్కులుగా మారిపోయాయి. ఓ విద్యార్థిని సిద్ధిపేటలో తన హాల్‌టికెట్‌ ఎంటర్‌ చేస్తే ఫెయిల్‌ మెమో కనిపించింది. అదే హాల్‌టికెట్‌ నెంబర్‌ను హైదరాబాద్‌లో ఆన్‌లైన్‌లో పరిశీలిస్తే పాస్‌ మెమో కనిపించింది. ఓ విద్యార్థి మొదటిసారి చెక్‌చేస్తే ఫెయిల్‌మెమో దర్శనమిచ్చింది. రెండోసారి ఆన్‌లైన్‌లో చూసుకుంటే పాస్‌ మెమో కనిపించింది. మూడోసారి తిరిగి పరిశీలిస్తే ఫెయిల్‌మెమో వచ్చింది. ఇంకో విద్యార్థికి 17 మార్కులొస్తేనే పాస్‌ అయినట్లు చూపించింది. ఇవి ఈసారి ఇంటర్‌బోర్డు తప్పిదాల్లో కొన్ని మాత్రమే.
వారి ప్రాణాలు తిరిగొస్తాయా?
టాపర్లుగా నిలుస్తామనుకున్న వాళ్లు, కచ్చితంగా పాసై తీరతామన్న ధీమాతో ఉన్నవాళ్లు తీరా ఫెయిలయినట్లు చూపించడంతో తట్టుకోలేక పోయారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏప్రిల్‌ 27వ తేదీనాటికి 19మంది ఇంటర్‌ విద్యార్థులు పరీక్షల్లో ఫెయిలయ్యామని బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో, ఫలితాల గందరగోళంలో అసలు ఎవరు పాసయ్యారో, ఎవరు ఫెయిలయ్యారో కూడా పూర్తిస్థాయిలో క్లారిటీ లేదు. మరోవైపు తమ పిల్లలు ఎక్కడ అఘాయిత్యాలకు పాల్పడతారోనని రాత్రీ పగలూ క్షణక్షణం కనిపెట్టుకొని చూసుకుంటున్నారు తల్లితండ్రులు. ఒకవేళ రీవాల్యుయేషన్‌ తర్వాత చనిపోయిన చిన్నారుల్లో ఎవరైనా పాసయినట్లు తేలితే వాళ్ల ప్రాణాలు తిరిగొస్తాయా? దీనికి బాధ్యులెవరు? విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యారంగ నిపుణులు, విశ్లేషకులు సంధిస్తున్న ప్రశ్న ఇది.
భయానక వాతావరణం!
ఇంటర్‌ ఫలితాల్లో ఇంతకుముందెన్నడూ లేని విధంగా తేడాలతో షాక్‌ తిన్న విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని ఇంటర్‌ బోర్డు బాట పట్టారు. అధికారులెవరైనా కనికరిస్తారని, పోలీసుల చట్రాలు దాటుకొని బోర్డు కార్యాలయంలోకి వెళ్లే అవకాశం దొరుకుతుందని, లేదంటే కనీసం అధికారులే తమ వేదనను అర్థం చేసుకొని బయటకు వచ్చి సమాధానం చెబుతారని రోజుల తరబడి ఎదురుచూశారు. పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాల్సిన విద్యార్థులు బోర్డు దగ్గర పడిగాపులు కాశారు. విద్యార్థుల తల్లిదండ్రులు పనులన్నీ వదులుకొని సమస్య పరిష్కారం కోసం తాపత్రయపడ్డారు. ఓ దశలో సహనం కోల్పోయి పోలీసులతో వాగ్వాదాలకు దిగారు. అయితే పోలీసులు మాత్రం కనికరం చూపలేదు. విద్యార్థులు, విద్యార్థినులన్న తేడా లేకుండా తమ ప్రతాపం చూపించారు. తల్లిదండ్రులు మరింత క్షోభ పడేలా ప్రవర్తించారన్న విమర్శలు ఆ సమయంలో సర్వత్రా వినిపించాయి. ఇంటర్‌బోర్డు నిర్వాకంపై రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు నిరసనలు చేపట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చాయి. అయితే పోలీసులు ఎక్కడికక్కడ.. ఎప్పటికప్పుడు ఆయా పార్టీలు, సంఘాల నేతలను అరెస్టులు చేశారు. ఏకంగా ఇంటర్‌బోర్డు కార్యాలయాన్నే తమ అదుపులోకి తీసుకున్న పోలీసు బలగాలు, ఆ ప్రాంతలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణాన్ని సష్టించారు.
గ్లోబరీనాతోనే గందరగోళం !
అసలు ఈ తలనొప్పికి ప్రధాన కారణం గ్లోబరీనా కంపెనీయే అన్న విమర్శలు మొదటినుంచీ వినిపిస్తున్నాయి. తొలుత హాల్‌టికెట్ల జారీ సమయం లోనే బోలెడన్ని తప్పులు దొర్లాయని, ఆ సమయం లోనే విద్యార్థులు ఇంటర్‌బోర్డు ఎదుట ఆందోళనకు దిగిన విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. ఏమాత్రం అర్హతలు, సాంకేతిక నైపుణ్యం లేని సంస్థకు ఈ బాధ్యత అప్పగించడమే దీనికంతటికీ ప్రధాన కారణమన్న విమర్శలు సర్వత్రా వస్తున్నాయి. ఒక్కోసారి ఒక్కో తరహా మార్కుల మెమో చూపిం చడం దేనికి నిదర్శనమని విద్యారంగ నిపుణులు సీరియస్‌గా ప్రశ్నిస్తున్నారు.
తప్పును ఎత్తిచూపిన త్రిసభ్య కమిటీ
ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలపై ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇంటర్‌బోర్డు సహా పరీక్షల వాల్యుయేషన్‌ వంటి బాధ్యతలు నిర్వర్తించిన గ్లోబరీనా కంపెనీల్లో సోదాలు, తనిఖీలు చేసి నివేదికను అందజేసింది. ఆ నివేదిక ప్రకారం ఫలితాల్లో తప్పులు వాస్తవమే అని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ప్రకటించారు. 531 మంది జాగ్రఫీ విద్యార్థులకు ప్రాక్టికల్‌ మార్కులు పడలేదని కమిటీ గుర్తించినట్లు తెలిపారు. 496 మంది విద్యార్థుల విషయంలో పరీక్షా కేంద్రం కేటాయింపులో పొరపాట్లు జరిగాయని అందువల్లే ‘ఆబ్‌సెంట్‌-పాస్‌’ అనే గందరగోళం ఏర్పడిందని వివరించారు. ఓఎంఆర్‌ పత్రంలో సరిగ్గా బబుల్‌ చేయకపోవడం వల్ల 99 మార్కులకు బదులు సున్నా మార్కులు వచ్చాయని అన్నారు. దీనికి సంబంధించిన అధికారిపై తక్షణం చర్యలు తీసుకుంటామని చెప్పారు.
హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
ఇంటర్‌ ఫలితాల్లో బోర్డు అవలంభించిన నిర్లక్ష్య వైఖరిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం ఏంటని ప్రశ్నించింది. ఇంటర్‌ పరీక్ష ఫలితాల రీవాల్యుయేషన్‌పై నిర్ణయం తెలుపాలని ఇంటర్‌ బోర్డును ఆదేశించింది. ఫలితాల్లో జరిగిన అవకతవకలపై బాలల హక్కుల సంఘం దాఖలుచ చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారించి.. ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇంటర్‌ ఫలితాల్లో 3 లక్షల మంది వరకు ఎలా ఫెయిల్‌ అవుతారని కోర్టు ప్రశ్నిం చింది. విద్యార్థుల, తల్లిదండ్రుల డిమాండ్‌ మేరకు రీవాల్యుయేషన్‌పై బోర్డు నిర్ణయం తెలుపాలని హైకోర్టు ధర్మాసనం కోరింది. ప్రశ్నాపత్రాల పునర్‌ మూల్యంకనం కోసం ఎంత సమయం పడుతుందని ప్రశ్నించింది. అయితే రీవాల్యుయేషన్‌కు రెండునెలల సమయం పడుతుందని ఇంటర్‌బోర్డు కోర్టుకు విన్నవించింది. దీంతో న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం విద్యార్థుల ఫలితాలు వెల్లడించేందుకు నెలరోజుల సమయం పడితే 3 లక్షల మంది విద్యార్థుల రీవాల్యుయేషన్‌కు రెండు నెలలు ఎలా పడుతుందని నిలదీసింది.
ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు
ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై జాతీయ మానవ హక్కుల సంఘం కూడా స్పందించింది. మీడియా ప్రచురించిన వార్తలను సుమోటోగా స్వీకరించిన హక్కుల సంఘం ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనకు బాధ్యులుగా గుర్తించిన వారిపై తీసుకున్న చర్యలతో పాటు బాధిత కుటుంబాలకు ఎలాంటి సాయం అందించారనే విషయాలను కూడా వెల్లడించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని సూచించింది.
దిగొచ్చిన ప్రభుత్వం
ఈ పరిణామాలతో కంగుతిన్న రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది. ఫెయిలైన విద్యార్థుల జవాబు పత్రాలన్నీ ఉచితంగా రీవాల్యుయేషన్‌ చేస్తామని ప్రకటించింది. అయితే, రీవాల్యుయేషన్‌ తర్వాత కూడా ఇలాంటి సమస్యలు తలెత్తవన్న భరోసా ఏంటన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. సాంకేతిక తప్పిదా లంటూ తప్పించుకునే ప్రయత్నం చేయకుండా ఈసా రైనా పకడ్బందీగా రీవాల్యుయేషన్‌ చేయాలని తల్లి దండ్రులు, విద్యారంగ నిపుణులు కోరుతున్నారు.
– సుజాత గోపగోని, 6302164068

వరుస ఎన్నికల కోలాహలం..


వరుస ఎన్నికల కోలాహలం..

వరుస ఎన్నికల కోలాహలం..

వరుస ఎన్నికల కోలాహలం..
తెలంగాణలో వరుసగా ఎన్నికల పండుగలు వస్తున్నాయి. మొన్నటికి మొన్న డిసెంబర్‌లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు పూర్తయ్యాయి. అధికార టీఆర్‌ఎస్‌ అత్యధిక మెజార్టీతో మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. నిన్నటికి నిన్న లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాయి. ఫలితాలు ఇంకా వెలువడలేదు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నందున జాతీయ స్థాయిలో అన్ని దశల పోలింగ్‌ ముగిసిన తర్వాత మే 23వ తేదీన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే.. ఇదే సమయంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తంతు మొదలైంది.
తెలంగాణ వ్యాప్తంగా 538 జెడ్పీటీసీ స్థానాలు; 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ నున్నాయి. మొత్తం మూడు విడతల్లో పోలింగ్‌ ప్రక్రియ సాగనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. మే 6వ తేదీన తొలివిడత పోలింగ్‌, మే 10వ తేదీన మలి విడత పోలింగ్‌, మే 14వ తేదీన తుది విడత పోలింగ్‌ జరుగుతుంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు విడుదల చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మే 23వ తేదీన వెలువడనుండగా.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఎన్నికల ఫలితాలు మే 27వ తేదీన విడుదల చేయనున్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు పూర్తిస్థాయిలో ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో ఈవీఎంలతో నిర్వహించగా.. స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం బ్యాలెట్‌ పద్ధతిలో చేపడుతున్నారు. జెడ్పీటీసీ ఎన్నికకు గులాబీ రంగు బ్యాలెట్‌ పేపర్‌, ఎంపీటీసీ ఎన్నికకు తెలుపురంగు బ్యాలెట్‌ పేపర్‌ కేటాయించారు.
మూడుదశల పోలింగ్‌ ఇలా…
మొదటి విడత పోలింగ్‌ కోసం ఈనెల 22వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. మే 6వ తేదీన మొదటి విడత ఎన్నికకు పోలింగ్‌ నిర్వహించ నున్నారు. మొదటి విడతలో 212 జడ్పీటీసీలు, 2వేల 365 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా ఏప్రిల్‌ 26వ తేదీన రెండో దశ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేశారు. మే 10వ తేదీన రెండో విడత పోలింగ్‌ నిర్వహిస్తారు. ఈ విడతలో 199 జెడ్పీటీసీ, 2వేల 109 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ చేపట్టనున్నారు. ఇక ఏప్రిల్‌ 30న మూడోదశ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి తుదివిడత పోలింగ్‌ మే 14వ తేదీన జరగనుంది. ఈ విడతలో 127 జెడ్పీటీసీ, ఒక వెయ్యి 343 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. జెడ్పీటీసీ అభ్యర్థులు 4 లక్షల రూపాయల వరకు ఎన్నికల్లో ఖర్చు చేయవచ్చు. ఎంపీటీసీ అభ్యర్థులు గరిష్టంగా ఒక లక్షా 50 వేల రూపాయల వరకు ఖర్చు చేసేందుకు అవకాశం ఉంది.
స్థానిక సంస్థలకు జరుగుతున్న ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోబోతున్న మొత్తం ఓటర్ల సంఖ్య 1,56,11,474 మంది. వీరిలో పురుష ఓటర్లు 77,34,800 కాగా.. మహిళా ఓటర్లు 78,76,361, ఇతరులు 313 మంది ఉన్నారు. వీళ్లంతా ఈ మూడుదశల్లో జరిగే ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు మొత్తం 32,042 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌కు లక్షా 47వేల మంది సిబ్బందిని వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా 54 వేల మంది భద్రతా సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ప్రజలు ప్రత్యక్ష పద్ధతిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను ఎన్ను కుంటారు. ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీనీ, జెడ్పీటీసీ సభ్యులు జెడ్పీ చైర్మన్‌ను ఎన్నుకుంటారు.
ఒక జెడ్పీటీసీ, 40 ఎంపీటీసీ స్థానాలు మినహా…
రాష్ట్రంలో ఇటీవల కొత్తగా ఏర్పాటైన నాలుగు మండలాలకు కూడా రిజర్వేషన్లు ఖరారవ్వడంతో.. అక్కడ కూడా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. నిజామా బాద్‌ జిల్లాలోని చండూరు మండల జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. మోస్రా మండలం జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను జనరల్‌ క్యాటగిరీ చేశారు. అటు సిద్ధిపేట జిల్లా నారాయణ రావుపేట మండల జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు, మేడ్చల్‌ జిల్లా మూడుచింతపల్లి మండలం జెడ్పీటీసీ స్థానాన్ని జనరల్‌ క్యాటగిరీకి కేటాయించారు. ఇక ఎంపీపీ స్థానాన్ని బీసీ జనరల్‌కు కేటాయిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా ఏర్పాటైన ములుగు జిల్లా మంగపేట ప్రాంతంలో రిజర్వేషన్ల వివాదం కోర్టు పరిధిలో ఉన్నందున అక్కడ ఎన్నికలను వాయిదా వేశారు. మంగపేట జెడ్పీటీసీ స్థానంతో పాటు ములుగు జిల్లాలోని 14 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 40 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించట్లేదని ఎన్నికల కమిషనర్‌ తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లా… జడ్చర్లలోని 15 ఎంపీటీసీ స్థానాలకు వచ్చే ఏడాది మే నెలలో గడువు ముగుస్తుందని.. భద్రాచలం జిల్లాలోని బుర్గంపాడులో 11 ఎంపీటీసీ స్థానాలకు వచ్చే ఏడాది జులైతో పదవీకాలం ముగుస్తుందని.. ఆ స్థానాల్లో ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం లేదని స్పష్టం చేశారు.
ఆన్‌లైన్‌లోనూ నామినేషన్లు
ఎన్నికలకు సంబంధించిన ఓటరు జాబితా, రిజర్వేషన్ల ప్రక్రియ, బందోబస్తు, సిబ్బంది తదితర ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి చేశారు. స్థానికంగా రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు, ఎన్నికల సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు ఇప్పటికే పూర్తిచేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఎన్నికల సన్నద్ధతపైనా పూర్తి క్లారిటీతో నోటిఫికేష్‌ జారీచేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనూ నామినేషన్‌ దాఖలు చేసే అవకాశాన్ని ఈసారి ఎన్నికల సంఘం కల్పిస్తోంది. అయితే, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన అభ్యర్థులు.. ఓ కాపీని రిటర్నింగ్‌ అధికారికి తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.
లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ముగియగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతించా లని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇదివరకే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. భారత ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణకు సుముఖత వ్యక్తం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ఈ కోడ్‌ ముగిసేలోగానే స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వ హించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీచేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న స్థానిక సంస్థల పదవీకాలం వచ్చే జూన్‌లో ముగియనుంది.
జెడ్పీ చైర్మన్‌ పదవికి తీవ్రపోటీ
మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలను సైతం అధికార పార్టీ సీరియస్‌గా తీసుకున్న నేపథ్యంలో ఆ పార్టీలో జెడ్పీ చైర్మన్‌ పదవికి తీవ్ర పోటీ నెలకొన్న ట్లుగా తెలుస్తోంది. గత సంవత్సరం డిసెంబర్‌ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నాయకులు, టిక్కెట్‌ ఆశించి భంగపడ్డ ఆశావహులు, ఇతర పార్టీల నుంచి ఫిరాయించిన పలువురు సీనియర్‌ నేతలు సైతం తమకు జెడ్పీ చైర్మన్‌ పదవి ఇవ్వాలని పార్టీ అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు.
2014లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో జిల్లాల విస్తరణ కూడా ఒకటి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే నాటికి 10 జిల్లాలు మాత్రమే ఉండగా, 2016 కేసీఆర్‌ జిల్లాల సంఖ్య 31కి పెంచారు. ఇటీవల డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరో రెండు జిల్లాల (ములుగు, నారాయణపేట) ఏర్పాటుకు సైతం ముఖ్యమంతి ఆమోదం తెలిపారు. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం జిల్లాల సంఖ్య 33కి చేరింది. ప్రతి జిల్లాకు ఒక జెడ్పీ చైర్మన్‌ ఉంటారు. వీరిని జెడ్పీటీసీ సభ్యులు ఎన్నుకుంటారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది జెడ్పీటీసీలను గెలుపించుకొని రాష్ట్రంలోని అన్ని జెడ్పీ చైర్మన్‌ స్థానాలను దక్కించుకోవాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది.
ఒకప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ పదవులకు పెద్దగా పోటీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఏ పదవీ లేకుండా ఖాళీగా ఉండి ప్రజలకు దూరంగా ఉండటం కంటే ఏదో ఒక పదవిలో ఉండి ప్రజాక్షేత్రంలో ఉంటూ తమ అస్థిత్వాన్ని కాపాడుకోవాలని రాజకీయ నాయకులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
– సప్తగిరి.జి, 9885086126

గణనీయంగా తగ్గిన పోలింగ్‌ శాతం


గణనీయంగా తగ్గిన పోలింగ్‌ శాతం

గణనీయంగా తగ్గిన పోలింగ్‌ శాతం

గణనీయంగా తగ్గిన పోలింగ్‌ శాతం
– రాజధాని చరిత్రలోనే అత్యల్పం !
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ శాతం ఈసారి గణనీయంగా తగ్గిపోయింది. ఈ నెల 11వ తేదీన దేశవ్యాప్తంగా జరిగిన మొదటి విడత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించారు. 2014 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే.. 9శాతం తక్కువగా.. నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ శాతంతో పోలిస్తే.. ఏకంగా 13శాతం తగ్గిపోయింది. పోలింగ్‌ శాతాల్లో ఈ స్థాయిలో తేడా నమోదు కావడం వెనుక అనేక కారణాలున్నాయి.
ఐదేళ్ల క్రితం రాష్ట్రంలో అసెంబ్లీకి, లోక్‌సభకు ఒకేసారి జరిగిన ఎన్నికల్లో 69శాతం పోలింగ్‌ నమోదయ్యింది. 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 73.37శాతం పోలింగ్‌ నమోదయ్యింది. అయితే.. ఇప్పుడు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం.. పోలింగ్‌ 60.57 శాతానికే పరిమితమైంది. దీంట్లో ఖమ్మం నియోజకవర్గంలో అత్యధికంగా పోలింగ్‌ నమోదు కాగా.. రాష్ట్ర రాజధాని కేంద్రంలోని సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో అత్యల్ప పోలింగ్‌ నమోదయ్యింది.
ఎన్నికల కమిషన్‌ అధికారికంగా వెలువరించిన నివేదిక ప్రకారం చూస్తే.. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లోనూ గతంలో కంటే ఈసారి తక్కువ మంది ఓటేసినట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రవ్యాప్త నిష్పత్తి చూస్తే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు, ఇప్పటికీ కూడా చాలా వ్యత్యాసం నమోదయ్యింది. రాజధాని లోని రెండు నియోజకవర్గాల్లో 40శాతం లోపే పోలింగ్‌ నమోదు కావడం ఓటర్ల నైరాశ్యానికి అద్దం పట్టింది. హైదరాబాద్‌లో 39. 49శాతం, సికింద్రా బాద్‌లో 39.20శాతం మంది మాత్రమే ఓటేశారు. అంటే, వందలో దాదాపు 40మంది కూడా ఓటు హక్కును వినియోగించుకోలేదు. అదీ ఎక్కడో మారుమూల ప్రాంతంలోనో, రిమోట్‌ ఏరియాలోనో కాదు.. రాష్ట్ర రాజధాని నగరంలోని రెండు ప్రధాన నియోజకవర్గాలు ఇవి. అంతర్జాతీయ నగరంగా పేరొందిన హైదరాబాద్‌ మహానగరంలో నివసిస్తున్న ఓటర్లు మరీ ఇంత హీనస్థితిలో ఓటుహక్కును వినియోగించుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇక పోలింగ్‌ శాతం పక్కనబెడితే.. ఎన్నికలు మాత్రం ప్రశాంతంగా ముగిశాయి. ఎక్కడా ఏ చిన్న సంఘటన కూడా తలెత్తకుండా, ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పోలింగ్‌ ముగిసింది. దీంతో అధికార యంత్రాంగం, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే, ఒకరకంగా రాష్ట్రంలో దాదాపు ఎన్నికల వాతావరణమే కనిపించలేదు. సాధారణంగా ఎన్నికలంటే నెలరోజుల ముందు నుంచే హడావుడి.. ప్రచార పర్వం.. పోటాపోటీ సభలు, ర్యాలీలు వేడిని పెంచేవి. కానీ.. ఈసారి మాత్రం పెద్దగా ప్రచారం పర్వం సాగలేదు. అడపాదడపా సభలు, ప్రచారాలు తప్ప ఇంటింటి ప్రచారాలు దాదాపుగా కనిపించలేదు.
రాష్ట్రంలో గత డిసెంబర్‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లు ఉత్సాహం చూపించారు. గతంలో కన్నా ఎక్కువగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. అభ్యర్థుల ప్రచారం ¬రెత్తించింది. కానీ.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు కావడం, నియోజకవర్గాల సంఖ్యా తక్కువే కావడం ఓటింగ్‌ శాతం తగ్గడానికి కారణమన్న వాదన లున్నాయి. అంతేకాకుండా.. లోక్‌సభ నియోజక వర్గాల పరిధి ఎక్కువగా ఉండటం.. అభ్యర్థులు తమ నియోజకవర్గం మొత్తం తిరిగే అవకాశం లేకపోవడం, ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటం వంటి పరిణామాలు కూడా ఓటింగ్‌ శాతంపై ప్రభావం చూపాయి. ఇందులోనూ పల్లెల్లో ఉత్సాహంగా ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల బాట పట్టగా.. నగరాల్లోనే పోలింగ్‌ శాతం భారీగా తగ్గింది. నగర ఓటర్లు ఓటేసేందుకు అంతగా ఉత్సాహం చూపించలేదు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నియోజకవర్గాల్లో చరిత్రలోనే తొలిసారిగా అతితక్కువ పోలింగ్‌ శాతం నమోదయ్యింది.
భానుడి ప్రభావం
ఎండ తీవ్రత కూడా పోలింగ్‌పై ప్రభావం చూపింది. కొద్దిరోజులుగా ఎండలు మండిపోతుండ టంతో నగరాల్లో ఉండే ఓటర్లు ఓటు వేసేందుకు అంతగా ఉత్సాహం చూపించలేదు. పైగా నగరాలు, పట్టణాల్లోనే ఎక్కువగా నివసించే ప్రైవేటు రంగాల ఉద్యోగులు.. ఓటు వేసేందుకు ఆసక్తి కనబరచలేదు. హైదరాబాద్‌ శివార్లలోని పోలింగ్‌ కేంద్రాలైతే ఓటర్లు లేక బోసిపోయాయనే చెప్పాలి. ఈ పరిస్థితి పోలింగ్‌ సిబ్బందిని సైతం నిరాశకు గురిచేసినట్లుగా తెలుస్తోంది. అయితే.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఓటర్లు ఎండ తీవ్రత తగ్గిన తర్వాత పోలింగ్‌ కేంద్రాల బాట పట్టడం కనిపించింది. పోలింగ్‌ వాస్తవానికి ఐదు గంటల వరకే కొనసాగినా.. కొన్ని కేంద్రాల్లో ఆ సమయంలోగా వచ్చిన ఓటర్లు రాత్రి ఎనిమిది గంటల దాకా తమ ఓటుహక్కును వినియోగించు కున్నారు.
నగరం ఖాళీ.. ఖాళీ..
ఆంధ్రప్రదేశ్‌లో ఓటుహక్కు ఉన్నవాళ్లు.. ఓటేసేందుకు తమ స్వరాష్ట్రం వెళ్లడం కూడా హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి నియోజక వర్గాల్లో పోలింగ్‌ శాతం భారీగా తగ్గిపోవడానికి ప్రధాన కారణంగా నిలిచింది. ఏపీలో ఓటు హక్కు కలిగి ఉండి హైదరాబాద్‌లో నివసిస్తున్న దాదాపు 13 లక్షల మంది వారి సొంత ఊళ్లో ఓటు వేసేందుకు వెళ్లారని లెక్కగట్టారు. దీంతో ఈ ప్రభావం పోలింగ్‌ శాతంపై పడింది.
ఇక పోలింగ్‌ సరళి ప్రధాన పార్టీల్లో గెలుపు అంచనాలపై సందిగ్ధానికి కారణమైంది. ఓటర్లు ఎటువైపు మొగ్గారో తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది. పోలింగ్‌శాతం తగ్గడం అధికార పార్టీకి మైనస్‌ అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పోలింగ్‌ కేంద్రానికి ఓటర్లను రప్పించడంలో అన్ని రాజకీయ పార్టీలు విఫలమయ్యాయని చెబుతున్నారు. ఈ క్రమంలోనే పోలింగ్‌శాతం తగ్గడంపై అన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అందరి దృష్టి అటువైపే!
దేశంలోనే అత్యధికంగా 185 మంది అభ్యర్థులు బరిలో దిగిన నిజామాబాద్‌ లోక్‌సభ నియోజక వర్గంలో గంటసేపు అదనంగా సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది. ఆ లోపు క్యూలైన్లలో నిలుచున్న వారికి ఓటేసే అవకాశం కల్పించారు. నిజామాబాద్‌ పోలింగ్‌ను ఛాలెంజ్‌గా తీసుకున్నామని ఎన్నికల అధికారులు చెప్పారు. ఉన్న వనరులను వినియోగించుకొని భారీస్థాయిలో అభ్యర్థులు పోటీ పడినా.. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించామని తెలిపారు. దీన్ని గిన్నిస్‌ రికార్డు పరిశీలనకు నివేదిస్తున్నట్లు ప్రకటించారు.
గెలుపుపై ధీమా!
మరోవైపు.. పోలింగ్‌ ముగియడంతో రాజకీయ నాయకులు ఎవరికి వారు గెలుపుపై ధీమాగా ఉన్నట్లుగా తెలుస్తోంది. పోలింగ్‌ శాతం తగ్గడాన్ని గమనిస్తే అధికార పార్టీ పట్ల ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టమవుతోందని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు తప్పకుండా అత్యధిక సీట్లు కట్టబెడతారని ఆ పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్‌ శాతం తగ్గినా.. పెరిగినా ప్రజలు టీఆర్‌ఎస్‌ అమలుపరచే సంక్షేమ పథకాల పట్ల సంతృప్తికరంగా ఉన్నారని.. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు చీకటి రోజులొచ్చాయని.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర ఓటమి పాలవుతుందని, మరోసారి రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరబోతోందని టీఆర్‌ఎస్‌ భరోసాగా ఉంది.
……………………………………………………….
నియోజకవర్గాల వారీగా నమోదైన పోలింగ్‌శాతం
………………………………………………….
లోక్‌సభ                     2014         2019
ఆదిలాబాద్‌                75.4%       66.76%
భువనగిరి                  81.2%       68.25%
చేవెల్ల                        60.2%      53.80%
హైదరాబాద్‌               53.3%      39.49%
కరీంనగర్‌                  72.6%      68%
ఖమ్మం                     82.1%      67.96%
మహబూబాబాద్‌       81.0%      59.9%
మహబూబ్‌నగర్‌        71.5%      64.99%
మల్కాజ్‌గిరి              50.9%      42.75%
మెదక్‌                      77.5%       68.60%
నాగర్‌కర్నూల్‌           75.1%        57.12%
నల్గొండ                    79.5%       66.11%
నిజామాబాద్‌            69.1%       54.20%
పెద్దపల్లి                    71.7%        59.24%
సికింద్రాబాద్‌             53.0%       39.20%
వరంగల్‌                   76.4%       60%
జహీరాబాద్‌              75.8%      67.80%
తెలంగాణ వ్యాప్తంగా   69%        60.57%
……………………………………………
– సప్తగిరి.జి, 9885086126

సంచలన ప్రకటనలు ఓట్లు రాలుస్తాయా?


సంచలన ప్రకటనలు ఓట్లు రాలుస్తాయా?

సంచలన ప్రకటనలు ఓట్లు రాలుస్తాయా?

సంచలన ప్రకటనలు ఓట్లు రాలుస్తాయా?
సమయం చూసి, సందర్భాన్ని బట్టి జనం నాడిని పట్టుకొని ప్రసంగించడంలో దిట్టగా పేరున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచార సభల్లో బాంబుల మీద బాంబులు పేల్చారు. అధికార వర్గాల్లో కలకలం సృష్టించారు. రెవెన్యూ వ్యవస్థనే రద్దు చేస్తామని, అవసరమైతే పేరును మారుస్తామని ప్రకటించారు. అంతేకాదు కలెక్టర్‌ల వ్యవస్థ కూడా అవసరం లేదని.. కలెక్టర్‌ పేరును జిల్లా పాలనాధి కారిగా మారుస్తామన్నారు. తానే ప్రతి జిల్లాలో ప్రజా దర్బార్‌లు నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు.
దేశమే ఆశ్చర్యపోయేలా కొత్త చట్టాన్ని తెలంగాణలో అమలులోకి తీసుకొస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాక.. జూన్‌ తర్వాత కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి తీసుకు రానున్నామని చెప్పారు. ప్రతి గుంట లెక్క తేలేలా రైతులకు పూర్తి యాజమాన్య హక్కు కల్పించ బోతున్నామని తెలిపారు. గిరిజనులు, పోడు భూముల సమస్యలు పరిష్కారం కావాలని అన్నారు. భూ సమస్యల పరిష్కారానికి రైతులు ఎవరికీ లంచం ఇవ్వొద్దని సూచించారు. పహాణి నకలు మార్చేశా మన్నారు. మొత్తానికి లంచం ఇచ్చే పరిస్థితి లేకుండా కొత్త రెవెన్యూ చట్టం తెస్తామని కేసీఆర్‌ చెప్పారు. తొలుత నిర్మల్‌ జిల్లా కేంద్రంలో జరిగిన సభలో కేసీఆర్‌ ఈ ప్రకటన చేశారు. అయితే.. ఈ ప్రకటన రెవెన్యూ వర్గాల్లో పెనుచర్చకు దారితీసింది. ఆ విభాగంలో భయాందోళనకు బీజం వేసింది.
అంతకుముందే మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ రైతు కుటుంబానికి సంబంధించిన భూ వివాదంపై కేసీఆర్‌ స్పందించారు. ఎన్నడూ లేని విధంగా.. రైతుకు నేరుగా ఫోన్‌చేసి మాట్లాడారు. క్షేత్రస్థాయిలో తాను పడుతున్న ఇబ్బందులను పేర్కొంటూ ఓ రైతు.. ఫేస్‌బుక్‌లో వీడియోను పోస్ట్‌ చేస్తే.. దానికి స్పందించిన సీఎం కేసీఆర్‌.. నేరుగా ఆ రైతుకు ఫోన్‌ చేసి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. స్వయంగా జిల్లా కలెక్టర్‌ను రైతు ఇంటికి పంపించి సమస్యను పరిష్కరించేలా ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరిణామం చర్చనీయాంశమైంది. అయితే ఆ రైతుతో మాట్లాడుతున్న సమయంలో రెవెన్యూ విభాగంలో నెలకొన్న అవినీతిపై సీఎం పలు విమర్శలు చేశారు. దానిపై రెవెన్యూ అధికారులు, ఉద్యోగ సంఘాలు నిరసన ప్రకటించాయి. వర్క్‌ టు రూల్‌ చేపట్టాయి. కేసీఆర్‌ వైఖరిపై బహిరంగంగానే తమ అసంతృప్తి వెళ్లగక్కారు రెవెన్యూ అధికారులు.
నిర్మల్‌ సభలో పై ప్రకటన చేసిన తర్వాత మరికొన్ని సభల్లోనూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేసీఆర్‌. రాష్ట్రంలో గుంటభూమి కూడా వివాదాస్పదం కాకుండా సంపూర్ణంగా భూప్రక్షాళన చేయాలని నిర్ణయించామన్నారు. రెవిన్యూశాఖనే ప్రక్షాళన చేస్తానని.. అసలు ఆ పేరే మార్చివేస్తానని కేసీఆర్‌ ప్రకటించారు. రెవిన్యూ కలెక్షన్‌లే లేనప్పుడు కలెక్టర్‌ వ్యవస్థ కూడా అక్కరలేదని కలెక్టర్‌ పేరును జిల్లా పరిపాలన అధికారిగా మారుస్తామన్నారు. తనకు ఎవరిపైనా నమ్మకం లేదని అవసరమైతే జిల్లాకు రెండు, మూడు రోజులు కేటాయించి తానేస్వయంగా ప్రజా దర్బార్‌ నిర్వహిస్తానని కేసీఆర్‌ వెల్లడించారు. ప్రతి రైతుకు అది పోడుభూమి అయినా, వారసత్వంగా సంక్రమించిందైనా మరేరకమైన భూమి అయినా కంక్లూజివ్‌ టైటిల్‌ను అందజేస్తానని ప్రకటించారు.
అయితే, ఇక్కడ మనం ఒక విషయం గమనించాల్సి ఉంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మొదటి సారి అధికారం చేపట్టిన తర్వాత పెద్ద ఎత్తున భూముల ప్రక్షాళన చేపట్టింది. ఇందులో భాగంగానే రైతుల పట్టాదారు పాసుపుస్తకాలను డిజిటలైజేషన్‌ చేసింది. ఈ క్రమంలోనే రెవెన్యూ అధికారులు తమ చేతివాటం చూపించి అక్రమ వసూళ్లకు పాల్పడి నట్లుగా తెలుస్తోంది. కొంతమంది రెవెన్యూ అధికారులు అవినీతి సొమ్ముకు ఆశపడి డిజిటలైజేషన్‌ పేరుతో వేల సంఖ్యలో పట్టాలను రికార్డుల్లోంచి తొలగించినట్లుగా అప్పట్లో కొన్ని వార్తలు వినిపించాయి. దీంతో రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. పాసుపుస్తకంలో తప్పులు దొర్లాయని ఒకరు, తమ భూమిని రికార్డుల నుంచి తొలగించారని మరొకరు ఇలా.. ఎందరో రైతులు ఎమ్మార్వో ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగు తున్నారు. అసలు దీనంతటికి కారణం కేసీఆర్‌ ప్రభుత్వం చేపట్టిన భూ ప్రక్షాళనే అని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. భూ ప్రక్షాళన సమయం లోనే ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకొని ఉండి ఉంటే రైతులకు ఇలాంటి సమస్యలు తలెత్తేవి కావని చెబుతున్నారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారుల వాదన మరో రకంగా ఉంది. భూ ప్రక్షాళన సమయంలో తాము శ్రమకు మించి.. నిద్రాహారాలు మానుకొని కష్టించి పనిచేశామని.. పాసుపుస్తకాలను డిజిటలైజేషన్‌ చేసే క్రమంలో పూర్తిగా సాంకేతికతపైనే ఆధారపడటం వల్ల కొన్ని తప్పులు దొర్లి ఉండవచ్చని.. అంతేకాని తాము అవినీతి సొమ్ముకి ఆశపడి ఉద్దేశపూర్వకంగా ఏ తప్పులూ చేయలేదని చెబుతున్నారు. తమ కష్టానికి గుర్తింపు ఇవ్వకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రే రెవెన్యూ శాఖపై ఆరోపణలు చేయడాన్ని వారు తీవ్రంగా తప్పుపట్టారు.
ఇక కేసీఆర్‌ ఇటీవల చేసిన మరో సంచలన ప్రటకన.. జిల్లా కలెక్టరు పేరును జిల్లా పరిపాలనాధి కారిగా మార్చడం. ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లుగా సేవలందిస్తున్న వారు కేంద్రం నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌ ద్వారా ఉత్తీర్ణులైన ఐఏఎస్‌ అధికారులు.. అంటే వారి అధికారాల్ని గానీ.. అధికార హోదాని గాని మార్చడం అనేది పూర్తిగా కేంద్రం పరిధిలోని అంశం. రాష్ట్రాలకు ఎటువంటి అధికారాలు ఉండవు. ఇది అందరికీ తెలిసిన విషయమే.. కానీ కేసీఆర్‌ కలెక్టర్‌ పేరును మారుస్తానని చెప్పడం ప్రజా స్వామ్యాన్ని అవహేళన చేసి ప్రజల్ని గందరగోళంలోకి నెట్టడమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో కేసీఆర్‌ మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తనకు ఓటు వేయలేదని, సామాన్య, మధ్యతరగతి ఓటర్లే తెలంగాణ రాష్ట్రసమితికి అండగా నిలబడ్డారని, వాళ్ల ఓట్ల వల్లే గెలిచామని ప్రకటించి మరో చర్చకు కారణ మయ్యారు. అంతేకాదు.. నిర్మల్‌ సభలోనే మరో వివాదాస్పద ప్రకటన చేశారు కేసీఆర్‌. తెలంగాణకు ఆదిలాబాద్‌ జిల్లా కశ్మీర్‌ లాంటిదన్నారు. ఈ వ్యాఖ్యలు కూడా రాజకీయంగా చర్చకు దారితీశాయి.
మరోవైపు.. కేంద్రంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ నినాదాన్ని ఎత్తుకున్న కేసీఆర్‌ కాంగ్రెస్‌, బీజేపీలపై తనదైన శైలిలో విమర్శల వర్షం కురిపించారు. కనీసం ఇప్పటిదాకా ఓ రూపు కూడా లేకున్నా ఫెడరల్‌ ఫ్రంట్‌ వస్తే జాతీయస్థాయిలోనూ టీఆర్‌ఎస్‌దే హవా అని జనంలో ఉత్తేజం నింపే ప్రయత్నం చేశారు. దేశానికి దిక్సూచిలా తెలంగాణను రూపొందిస్తామని ప్రకటించారు.
అయితే.. ఇటీవల కాలంలో సీఎం కేసీఆర్‌కు రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులు చిత్తుగా ఓడిపోయారు. ఆ పరిణామం టీఆర్‌ఎస్‌కు తగ్గిన ఆదరణకు నిదర్శనంగా నిలిచిందని రాజకీయ చర్చలు నడిశాయి. అయితే… ఓటర్లు కొట్టిన ఆ దెబ్బ నుంచి బయటపడేందుకు మంచిర్యాల జిల్లాకు చెందిన రైతుతో ఫోన్లో మాట్లాడి పత్రికల్లో పతాక శీర్షికల్లో నిలిచారు. ఆ రైతు సమస్యను ఒక్కరోజులోనే పరిష్కరించారు. కానీ.. మరుసటిరోజే.. ఎదుటి పక్షానికి చెందిన వాళ్లు ఆడియో రికార్డును సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి.. కేసీఆర్‌ ఏకపక్షంగా వ్యవహరించిన తీరును ఎండగట్టారు. ఒకరి వాదనే విని అదే న్యాయమని ఎలా నిర్ధారిస్తారని నేరుగా సీఎంనే ప్రశ్నించారు. ఇలా.. ఈ పరిణామం కూడా కేసీఆర్‌కు బూమరాంగ్‌ అయ్యిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
ఈ రెండు పరిణామాల తర్వాత క్షేత్రస్థాయిలో ప్రచారం అత్యావశ్యకమని గ్రహించిన కేసీఆర్‌.. ఎన్నికల వేళ తెలంగాణ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు సాగించారు. ఆరు రోజుల్లో 13 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 11 సభలు నిర్వహిం చేందుకు ప్రణాళికలు రూపొందించారు. అయితే.. హైదరాబాద్‌లో మాత్రం కేసీఆర్‌ తలపెట్టిన సభను రద్దు చేసుకున్నారు. ఆశించినంత జనం రాలేదన్న కారణంగా ఆ సభను రద్దు చేసినట్లుగా తెలుస్తోంది. కారు.. సారు.. పదహారు నినాదంతో రాష్ట్రంలోని 16 లోక్‌సభ స్థానాల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా రూపొందించుకున్న కార్యాచరణ మేరకు కేసీఆర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే అంతటా తానై ప్రచార సభల్లో పాల్గొన్నారు. కానీ.. జనం నాడి ఎలా ఉండబోతోందో మే 23 దాకా ఆగితే గానీ తేలే పరిస్థితి లేదు.
– సప్తగిరి.జి, 9885086126

ఆత్మవిశ్వాసమా? అతివిశ్వాసమా?


ఆత్మవిశ్వాసమా? అతివిశ్వాసమా?

ఆత్మవిశ్వాసమా? అతివిశ్వాసమా?

ఆత్మవిశ్వాసమా? అతివిశ్వాసమా?
అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన సంతోషంలో ఉన్న కేసీఆర్‌ ఇప్పుడు.. లోక్‌సభ ఎన్నికల్లో తనదైన జోరును కొనసాగిస్తు న్నారు. మాటల దాడిని పెంచారు. ఎదుటి పార్టీలపై విమర్శల స్థాయికి కూడా పదును పెంచారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో కీలక పార్టీ అయిన బీజేపీపై తనదైన శైలిలో విమర్శలు కురిపిస్తున్నారు. మరో అడుగు ముందుకేసి అసలు కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే చక్రం తిప్పబోతు న్నాయని, వాటికి తానే నేతృత్వం వహిస్తానని కూడా చెప్పుకుంటున్నారు.
ఉద్యమకాలంలో కేసీఆర్‌ ప్రసంగాలకు జనం నుంచి భారీగా రియాక్షన్‌ ఉండేది. భావోద్వేగ అంశం కావడంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సాగుతున్న పోరాటం సమయంలో కేసీఆర్‌ తనదైన భాషలో విరుచుకుపడేవారు. తెలంగాణ మాండలికంలో ఉద్వేగంగా చేసే ప్రసంగం జనాల్లోకి నేరుగా చొచ్చుకుపోయేది. రెచ్చగొట్టే ప్రసంగాలతో ముఖ్యంగా యూత్‌లో ఫాలోయింగ్‌ సంపాదించు కున్నారు. అయితే.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలిసారిగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ తెచ్చిన పార్టీగా జనం ప్రత్యేక రాష్ట్ర పగ్గాలు కేసీఆర్‌కు అప్పగించారు. ఆ తర్వాత ఒక ముఖ్యమంత్రిగా హుందాగా ప్రసంగించే ప్రయత్నాలు చేసినా.. అప్పుడప్పుడూ ఉద్యమ కాలంనాటి ప్రసంగం ఆనవాళ్లు కూడా కనిపించేవి. అయితే.. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విజయం సొంతం చేసుకున్న తర్వాత.. మిగిలిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీవైపు తిప్పుకొనే ప్రయత్నాలు విజయవంతంగా సాగిస్తున్న నేపథ్యంలో.. అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌ బలం సెంచరీ దాటి పోవడంతో కేసీఆర్‌లో ఉత్సాహం మరింత పెరిగింది. ఒక్క కేసీఆర్‌ మాత్రమే కాదు.. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా మాటల దాడికి పదును పెంచారు.
ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల ప్రచారం మారుమోగి పోతోంది. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్న కేసీఆర్‌, కేటీఆర్‌ తమకు ఎదురే లేదన్న ధీమాతో ప్రసంగాలు సాగిస్తున్నారు. విపక్షాలతో పాటు.. కేంద్రంలో పాలక పక్షమైన బీజేపీపైనా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ పైనా నేరుగా విమర్శలు కురిపిస్తు న్నారు. అంతేకాదు.. విమర్శల స్థాయి కాస్త శ్రుతి మించుతోందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశంలో ప్రాంతీయ పార్టీలదే హవా అని, ఫెడరల్‌ ఫ్రంట్‌లో టీఆర్‌ఎస్‌దే కీలకపాత్ర అని చెప్పుకుంటున్నారు. కానీ.. ఎన్నికల ప్రచారం తెలంగాణ రాష్ట్రం దాటిపోవడం లేదు. తెలంగాణలో తప్ప మరెక్కడా ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ గానీ కేటీఆర్‌ గానీ పాల్గొనడం లేదు. కేవలం తెలంగాణలోని 16 లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సంఖ్యతో ఏం చేయలేమన్న సందేహం అవసరం లేదని, దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలన్నీ తమతోనే కలిసి వస్తాయని జనంలో నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా తెలంగాణలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనడాన్ని ప్రస్తావిస్తూ.. విమర్శలు చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని బీజేపీ పగటి కలలు కంటోందని కూడా ఎద్దేవా చేస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. ఈ ఐదేళ్లలో దేశానికి బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు.. ప్రధాని మోదీ స్థాయిని దిగజార్చేలా విమర్శలు చేస్తున్నారు. నరేంద్రమోదీ మాట్లాడినట్లు ఓ గ్రామంలో ఉండే సర్పంచ్‌ కూడా మాట్లాడరంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ స్థాయి ఏంటో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శమని ఎటాక్‌ చేస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో 118 సీట్లలో బీజేపీ ఒక్క స్థానంలో మాత్రమే గెలిచిందని, 103 స్థానాల్లో డిపాజిట్‌ దక్కలేదని ఆరోపించారు.
అంతేకాదు.. సర్జికల్‌ దాడుల గురించి కేసీఆర్‌ సరికొత్త వాదన తెరపైకి తెచ్చారు. బీజేపీ ప్రభుత్వం సర్జికల్‌ దాడుల గురించి గొప్పగా చెప్పుకుంటుందని విమర్శించారు. యూపీఏ హయాంలో తాను కేంద్రంమంత్రిగా ఉన్న సమయంలో 11 సార్లు సర్జికల్‌ దాడులు జరిగాయంటున్నారు. సర్జికల్‌ దాడులను మోదీ తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని కేసీఆర్‌ ఆరోపించారు. ఇటీవల జరిగిన మెరుపుదాడుల్లో 300 మంది ఉగ్రవాదులు చనిపోయారంటూ డొల్ల ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ చీఫ్‌ మసూద్‌ అజర్‌ అక్కడ చీమ కూడా చావలేదంటు న్నాడని ఎద్దేవా చేశారు. ‘ఇలాంటి ప్రచారాలతో మీరు ఓట్లు అడుగుతారా? ఇదేనా దేశాన్ని నడిపించే తీరు’ అని మోదీని ఉద్దేశించి కేసీఆర్‌ ప్రశ్నించారు.
ఇక.. హిందూత్వ అంశాన్ని కూడా వివాదం చేసేలా కేసీఆర్‌ ప్రసంగాలు సాగుతున్నాయి. మొన్నటికి మొన్న నిజమైన హిందువులం తామే అని ప్రకటించిన ఆయన.. మరుసటిరోజు హిందూగాళ్లు – బొందూగాళ్లు ఓట్లడిగేందుకు వస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ అంశంపై విమర్శల దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు. తామే హిందువులమని గొప్పలు చెప్పుకోవడం కాదని.. బీజేపీ వారు చెబితేనే ఇళ్లల్లో ప్రజలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారా? చనిపోతే తద్దినాలు పెట్టుకుంటారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు.. కేసీఆర్‌ కుమారుడు, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా అదేస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఢిల్లీ గులాములు కావాలో తెలంగాణ గులాబీలు కావాలో నిర్ణయించు కోవలసింది ప్రజలేనంటూ ఎదుటిపార్టీలపై విమర్శల దాడిని తీవ్రం చేశారు. 16 లోక్‌సభ స్థానాల్లో గెలిపిస్తే ఢిల్లీ మెడలు వంచుతామంటూ తనదైన రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ, ఒడిశాలో నవీన్‌ పట్నాయక్‌, యూపీలో మాయావతి, అఖిలేష్‌యాదవ్‌, ఏపీలో జగన్‌ తమకే మద్దతు ఇస్తున్నారని ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరో అడుగు ముందుకేసి.. బీజేపీ సాగిస్తున్న చౌకీదార్‌ క్యాంపెయిన్‌ను కూడా ఎద్దేవా చేసేలా ప్రసంగిస్తు న్నారు. ఈ దేశానికి కావాల్సింది చౌకీదారో.. టేకీదారో కాదని.. ఒక జోర్దార్‌, ఒక ధమ్‌దార్‌, ఒక ఇమామ్‌దార్‌.. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దేశానికి ఒక కేసీఆర్‌ కావాలంటూ కేటీఆర్‌ పేర్కొంటున్నారు.
అయితే.. కేటీఆర్‌ ఓటర్లను తప్పుదారి పట్టిస్తున్నారని బీజేపీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి దత్తాత్రేయ ప్రకటించారు. కేటీఆర్‌ ఎన్నికల ప్రచారాల్లో చెబుతున్న మమత బెనర్జీ, నవీన్‌ పట్నాయక్‌, మాయావతి, అఖిలేశ్‌ యాదవ్‌, జగన్‌ వంటి నేతల్లో అత్యధికులు మోదీ ప్రధానిగా ఏర్పడే ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతిచ్చే అవకాశం ఉందని చెప్పారు. హిందుత్వ అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. యూపీఏ ప్రభుత్వంలో తాను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు 11 సార్లు మెరుపు దాడులు జరిగాయన్న కేసీఆర్‌ వ్యాఖ్యలను ఆక్షేపించారు. ‘కేంద్రమంత్రిగా ఒక్క కేబినెట్‌ సమావేశానికి వెళ్లలేదు. పార్లమెంట్‌లో ఒక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. ఆ దాడుల గురించి నీకేం తెలుసు? భాజపా నేతలు దొంగ హిందువులు అంటున్నావు. నువ్వు హిందుత్వవాదివి అయితే అయోధ్యలో రామమందిర నిర్మాణం కట్టాలా? వద్దా? నీ వైఖరి చెప్పు. ఇంకా నీ మాటల గారడి చెల్లదు’ అంటూ దత్తాత్రేయ ధ్వజమెత్తారు. తెలంగాణ అభివృద్ధిని ప్రధాని విస్మరించారన్న తెరాస వ్యాఖ్యల్లో నిజం లేదని, తెలంగాణకు మోదీ ప్రభుత్వం రూ.2.25లక్షల కోట్లు ఇవ్వడం అభివృద్ధి కాదా? అని ప్రశ్నించారు. ‘తెరాసను 16 సీట్లలో ఎందుకు గెలిపించాలి. కేంద్రంలో వచ్చేది భాజపా ప్రభుత్వం. భాజపా అభ్యర్థులను 16 సీట్లలో గెలిపిస్తే ఎవరి మెడలూ వంచాల్సిన అవసరం లేకుండా కేంద్రం నుంచి అత్యధిక నిధులు తెస్తాం’ అని దత్తాత్రేయ భరోసా ఇచ్చారు.
అయితే.. ప్రస్తుత ఎన్నికల్లో ఓ వైపు కేసీఆర్‌, మరోవైపు కేటీఆర్‌ సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో చూపిస్తున్నది ఆత్మవిశ్వాసం కాదని, అతివిశ్వాసం అని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఆ అతివిశ్వాసం కాస్తా బోల్తాకొట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
– సప్తగిరి.జి, 9885086126