2, జులై 2019, మంగళవారం

ఆవిష్కృతమైన అపూర్వఘట్టం


ఆవిష్కృతమైన అపూర్వఘట్టం

ఆవిష్కృతమైన అపూర్వఘట్టం

ఆవిష్కృతమైన అపూర్వఘట్టం
తెలంగాణ నీటిపారుదల వ్యవస్థ చరిత్రలో అపూర్వఘట్టమైన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఈ నెల 21వ తేదీన అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్రంలోని బీడు భూములను నీటి ఎద్దడి నుంచి కాపాడే అద్భుత నిర్మాణం.. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్ట్‌. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో మొదలైన తెలంగాణ ఉద్యమం.. ప్రత్యేక రాష్ట్రం కల సాకార మయ్యేదాకా ఉధృతంగా కొనసాగింది. ప్రధానమైన మూడు నినాదాల్లో మొదటిది నీళ్లు. తెలంగాణలోని 20 జిల్లాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన కాళేశ్వరం బహుళార్ధసాధక ప్రాజెక్ట్‌ అత్యంత వేగంగా నిర్మాణమవుతోంది. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్‌ ఈనెల 21వ తేదీన ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. మేడిగడ్డ పంప్‌హౌస్‌లోని 6వ నంబర్‌ మోటార్‌ను ఆన్‌ చేయడం ద్వారా గోదావరి ఎత్తిపోత లకు శ్రీకారం చుట్టారు. గవర్నర్‌ నరసింహన్‌, ఏపీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, దేవేంద్ర ఫడ్నవిస్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ప్రాజెక్టు స్వరూపం
తెలంగాణ జలదాహం తీర్చే లక్ష్యంతో జయ శంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండలం లోని కన్నేపల్లి గ్రామం వద్ద గోదావరి నదిపై నిర్మిత మవుతోంది కాళేశ్వరం ప్రాజెక్టు. మూడు బ్యారేజీలు, 20 రిజర్వాయర్లు, 19 పంప్‌ హౌజ్‌లు, 22 ఎత్తిపోతల కేంద్రాలు, 88 పంపులు, 1832 కిలో మీటర్ల జలప్రయాణం.. ఈ ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్‌ సరఫరా చేసేందుకు 14 సబ్‌స్టేషన్లు. ఇదీ సమగ్రంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ప్రత్యేకత. ఈ ప్రాజెక్టులో భాగంగా వందల కిలోమీటర్ల దూరం కాలువలు, సొరంగ మార్గాలు నిర్మిస్తున్నారు. దేశం లోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకమే కాకుండా.. ఆసియాలోనే అతి పెద్ద సర్జిపూల్‌ నిర్మిస్తున్నారు. సర్జ్‌ పూల్‌ను భూమికి 127 మీటర్ల కింద నిర్మిస్తున్నారు. భూమి కింద నిర్మిస్తున్న భారీ పంపు హౌజులు నీటిని కాలువలోకి తోడి పోస్తాయి. ఆ పంపులకు 139 మెగావాట్ల సామర్థ్యం ఉంది. కాలువల్లోకి నీటిని తోడటం కొరకు అవసరమైన విద్యుత్‌కోసమే ప్రత్యేకంగా 2 ఎకరాల స్థలంలో 440 కేవీల భూగర్భ సబ్‌ స్టేషన్‌ నిర్మిస్తున్నారు. దాదాపు 203 కిలోమీటర్ల మేర భూగర్భ కాలువలను తవ్వుతున్నారు. భూమి లోపల సొరంగం ద్వారా నీళ్లు ప్రవహించి చెరువులు, రిజర్వాయర్లలోకి చేరుతాయి. కాలువను నిర్మించడం కష్టంగా ఉన్న ప్రాంతాల్లో ఇలా సొరంగాలు నిర్మిస్తున్నారు. గోదావరి నది మీద నిర్మించే బ్యారేజీల ద్వారా సాగు నీరు ముందుగా కాలువలకు వెళ్లి.. అక్కడి నుంచి చెరువులు, రిజర్వాయర్లకు వెళ్తుంది.
18.25 లక్షల ఎకరాలకు సాగునీరు
రోజుకు కనీసం రెండు టీఎంసీల చొప్పున 90 రోజుల పాటు.. మొత్తం 180 టీఎంసీల నీళ్లను ఎత్తిపోసి తెలంగాణ ప్రాంతంలోని దాదాపు 18 లక్షల 25వేల ఎకరాలకు అదనంగా సాగునీరు అందివ్వా లన్నదే కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 80, 500 కోట్ల రూపాయలు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం 80వేల ఎకరాలను సేకరించింది తెలంగాణ ప్రభుత్వం. అందులో అటవీ భూమి 3050 హెక్టార్లు. ఎత్తిపోతల కోసం 6వేల 200 కుటుంబాలు నిర్వాసితులుగా మారాయి. అయితే సాగునీటి కోసమే కాకుండా హైదరాబాద్‌లో తాగునీటికి 30 టీఎంసీల నీళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటికి 10 టీఎంసీల నీళ్లను ఈ ప్రాజెక్టు నుంచి మళ్లించనున్నారు. పారిశ్రామిక అవసరాలకు మరో 16 టీఎంసీల నీటిని వినియోగించనున్నారు.
12 బ్లాకులు
కాళేశ్వరం ప్రాజెక్టును మొత్తం 12 బ్లాక్‌లుగా విభజించారు. అవి.. మేడిగడ్డ బ్యారేజి, మేడారం బ్యారేజి, మేడారం ఎత్తిపోతలు, అన్నారం బ్యారేజి, అన్నారం ఎత్తిపోతలు, సుందిళ్ల బ్యారేజి, సుందిళ్ల ఎత్తిపోతలు, ఎల్లపల్లి నుంచి నంది మేడారం వద్ద గల మేడారం బ్యారేజికు నీటీని మళ్లించడం, మేడారం రిజర్వాయర్‌ నుంచి సొరంగ మార్గం, రాగంపేట వద్ద పంప్‌హౌస్‌ నిర్మాణం, మిడ్‌మానేరు నుంచి అప్పర్‌ మానేరుకు నీటి మళ్లింపు, మధ్య మానేరు నుంచి అప్రోచ్‌ కాలువ తవ్వి హెడ్‌ రెగ్యులేటర్‌ నిర్మాణం, అనంతగిరి రిజర్వాయర్‌ నుంచి అప్రోచ్‌ కాలువ నిర్మాణం, రంగనాయక సాగర్‌ నుంచి అప్రోచ్‌ కాలువ నిర్మాణం. వీటిలో ఆరో ప్యాకేజీలో భాగంగా ఈ యేడాది ఏప్రిల్‌ 24వ తేదీన ధర్మారం మండలం నందిమేడారం అండర్‌ టన్నెల్‌లోని మొదటి మోటర్‌ ద్వారా నందిమేడారం రిజర్వాయర్‌లోకి 0.01 టీఎంసీల నీటిని 105 మీటర్ల ఎత్తుకు లిఫ్టు చేశారు. నందిమేడారం పంప్‌ హౌస్‌లోని 124.4 మెగావాట్ల తొలి మోటర్‌వెట్‌ రన్‌ను ప్రారంభించడంతో సర్జ్‌పూల్‌ నుంచి నీటిని ఎత్తిపోసే ప్రయోగం విజయవంతమైంది. మరోవైపు ఈ ప్రాజెక్టులో భాగంగా సిద్ధిపేట దగ్గరి మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ కోసం చేపట్టిన భూసేకరణ క్లిష్టంగా మారింది. అక్కడి నిర్వాసితులు దీనిపై కోర్టుకు వెళ్లారు. ఇంకా ఈ వివాదం న్యాయస్థానం పరిధిలోనే ఉంది.
20 జిల్లాలకు సాగునీరు
ఈ బహుళార్థసాధక ప్రాజెక్టుతో రాష్ట్ర దశ, దిశ మారబోతోందని, తెలంగాణ జీవధారగా ఇది మారబోతోందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. దీని ద్వారా ఎక్కువగా లబ్ధి పొందే జిల్లా సిద్ధిపేట. మొత్తం 20 కొత్త జిల్లాల ఆయకట్టుకు ఈ ప్రాజెక్టు ద్వారా నీరందుతుంది. కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్‌, మేడ్చల్‌, యాదాద్రి, నల్లగొండ, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట, జనగామ, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, వరంగల్‌ అర్బన్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, వరంగల్‌ రూరల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం, సూర్యాపేట జిల్లా లకు ఈ ప్రాజెక్ట్‌ వరప్రదాయినిగా మారబోతోంది.
ప్రాణహిత-చేవెళ్ల రీడిజైన్‌!
వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపా దించిన ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్‌ ప్రభుత్వం రీడిజైన్‌ చేయించింది. ముందుగా అనుకున్నట్టు ప్రాణహిత నదిపై కాకుండా దానికి దిగువన, ప్రాణహిత నది గోదావరిలో కలిసిన తరువాత ప్రధాన నిర్మాణం సాగేలా భారీ బహుళార్ధసాధక ప్రాజెక్టుగా రీడిజైన్‌ చేశారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లోని గోదావరి నుంచి హైదరాబాద్‌, చిట్యాల, షామీర్‌పేట వరకు నీళ్లొచ్చేలా ఈ కొత్త డిజైన్‌కు రూపకల్పన చేశారు. కొత్త ఆయకట్టు కాకుండా అంతకుముందే ఉన్న శ్రీరాంసాగర్‌, నిజాం సాగర్‌, మిడ్‌మానేరు, లోయర్‌ మానేరు, అప్పర్‌ మానేరు ప్రాజెక్టులను ఈ ప్రాజెక్టుతో అనుసంధానించడానికి కొత్తగా కాలు వలు, సొరంగాలు, పంపుహౌజులు ఏర్పాటు చేశారు.
కొత్త బ్యారేజీలు
నదిలో నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి బ్యారేజీలు నిర్మిస్తారు. ఆ నదిలోనే నీటి నిల్వకోసం జలాశయాలు నిర్మిస్తారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి నిర్మాణాలు నాగార్జున సాగర్‌ డ్యామ్‌, ప్రకాశం బ్యారేజ్‌ ఉన్నాయి. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఇప్పుడు వీటికి భిన్నంగా గోదావరి నదిపై మూడుచోట్ల మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారంలలో బ్యారేజ్‌లు నిర్మిస్తున్నారు. ఒక బ్యారేజ్‌లో నిల్వ ఉన్న నీటిని పంపుహౌజు నుంచి తోడి కాలువ ద్వారా మరో బ్యారేజ్‌కు గోదావరి ప్రవాహానికి వ్యతిరేక దిశలో ఎగువకు నీటిని పంప్‌ చేస్తారు. ఇలా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకూ నీటిని గోదావరి ఎగువకు తరలిస్తారు. అంటే.. గోదావరి నీటిని కాలువలోకి మళ్లించి, గోదావరి ప్రవాహానికి వ్యతిరేక దిశలో వెనక్కు తీసుకెళ్లి మళ్లీ గోదావరిలోనే కలుపుతారు. అక్కడి నుంచి కాలువల ద్వారా నీటిని పంపింగ్‌ చేస్తారు. అలా నీరు సొరంగాలు, కాలువల్లో ప్రవహించి, పంపుహౌజ్‌ల్లో లిఫ్టు చేసి భూమి లోపల, బయట ప్రయాణించి వేర్వేరు కొత్త, పాత జలాశయాలను కలుపుతూ దక్షిణ తెలంగాణ వరకూ వస్తుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణమంతా లింకులు, ప్యాకేజీలుగా జరుగుతుంది. మొత్తం ప్రాజెక్టును 7 లింకులు, 28 ప్యాకేజీలుగా విభజించి నిర్మాణాలు సాగిస్తున్నారు. కొత్త బ్యారేజీల వల్ల గోదావరిలో దాదాపు 150 కిలోమీటర్ల మేర ఎప్పుడూ నీరుంటుంది.
రికార్డు
నిర్మాణంలోనే అనేక రికార్డులను సొంతం చేసుకుంది కాళేశ్వరం ప్రాజెక్టు. శంకుస్థాపన చేసిన తరువాత, అతి తక్కువ సమయంలో పనులు పూర్తయిన ప్రాజెక్టుగా ఇది విన్నర్స్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్స్‌ రికార్డ్స్‌, కంట్రీ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకుంది. అత్యంత భారీ ప్రాజెక్టుగా, అత్యాధునిక టెక్నాలజీతో దీన్ని నిర్మిస్తున్నారు. సాధారణంగా సాగునీటి ప్రాజెక్టు లను నేరుగా నీటిపారుదల శాఖ చేపడుతుంది. కానీ, కాళేశ్వరం మాత్రం కార్పొరేషన్‌ కింద చేపట్టారు. ఇందుకోసం కాళేశ్వరం ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ లిమిటెడ్‌ సంస్థను ఏర్పాటు చేసారు. దేశంలోని మిగిలిన సాగునీటి ప్రాజెక్టులతో పోలిస్తే ఎక్కువ ఖర్చుతో ఒక రాష్ట్రం సొంతంగా నిర్మిస్తోన్న ప్రాజెక్టు ఇది. నిర్మాణ దశలోనే ఉన్న ఈ ప్రాజెక్టుకు ఊహించని స్థాయిలో పేరొచ్చింది. దీంతో ఇది పర్యటక ప్రాంతంగానూ మారింది. కాళేశ్వరం ప్రాజెక్టును చూసేందుకు పర్యటకులు క్యూ కడుతున్నారు. తెలంగాణ టూరిజం కార్పొరేషన్‌ ఇటీవల ఒక కొత్త టూరిస్ట్‌ సర్వీస్‌ను కూడా ప్రారంభించింది.
కానరాని కార్యనిర్వాహకుడు!
కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెబితే వినిపించే పేరు హరీష్‌రావు. తెలంగాణ మొదటి మంత్రివర్గంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్‌రావు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రేయింబవళ్లు శ్రమిం చారు. అర్ధరాత్రిళ్లు కూడా టన్నెల్స్‌లోకి వెళ్లి పనులను పరిశీలించిన సందర్భాలున్నాయి. నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను సమన్వయం చేసుకుంటూ రికార్డు సమయంలోనే ఈ ప్రాజెక్టు నిర్మాణం పలు దశలు పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది మొదలు.. పనుల్లో వేగం పెంచేందుకు, అనుమతులు దక్కించుకునేందుకు ఆయన పడ్డ కష్టం మామూలుది కాదు. అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ, పనుల్లో జాప్యం జరిగితే హెచ్చరిస్తూ ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేశారు. ఒక సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన గవర్నర్‌ నరసింహన్‌ పనులు అత్యంత వేగంగా జరగడంపై హరీష్‌రావును ‘కాళేశ్వర్‌రావు’ అంటూ అభినందనల్లో ముంచెత్తారు కూడా.
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల తర్వాత మంత్రి వర్గంలో హరీష్‌రావుకు స్థానం దక్కలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు గానీ, సమీక్షలకు గానీ ఆయన పూర్తి దూరంగా ఉన్నారు. కుటుంబంలో, పార్టీలో, ప్రభుత్వంలో నెలకొన్న అంతర్గత కారణాలతో ఈ పరిణామాలు చోటు చేసుకున్నా యన్న వాదనలు ప్రచారంలో ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ దశలో సింహభాగం పర్యవేక్షించిన ఆయన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కనీసం పాల్గొనలేదు. అయితే ఆ కార్యక్రమానికి ముందురోజు హరీష్‌రావు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ సస్యశ్యామలం కావాలని ఆకాంక్షించారు. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలల ప్రాజెక్టు అని అభివర్ణించారు. తెలంగాణలో ప్రతిపల్లెలో ఈ పండుగ చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ఈ ప్రకటన వెలువడినప్పుడే ఆయన ప్రారంభోత్సవానికి హాజరు కావడం లేదన్న విషయం స్పష్టమైంది. పైగా ఆనాడు.. ప్రపంచ యోగ డే సందర్భంగా సిద్ధిపేటలో ఆయన యోగ చేస్తూ గడిపారు. ఈ పరిణామం తెలంగాణవ్యాప్తంగా హరీష్‌రావు అభిమానుల్లో, టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో అసహనానికి కారణమైంది. కాళేశ్వరం నిర్మాణంలో హరీష్‌రావు మార్క్‌ చెరిపి వేయలేనిదైనా పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులను భాగస్వాములను చేసిన కేసీఆర్‌.. హరీష్‌రావును మాత్రం దూరం పెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ‘కేసీఆర్‌ సాధకుడే కావచ్చు.. కార్యనిర్వాహకుడు మాత్రం హరీష్‌రావే’ అంటూ నెటిజన్లు సోషల్‌ మీడియాలో నిరసనలు తెలిపారు.
– సుజాత గోపగోని, 6302164068

తెలంగాణ కాంగ్రెస్‌ దారెటు ? కమలమే ప్రత్యామ్నాయమా ?