తెలంగాణలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ప్రముఖమైన పండుగ బతుకమ్మ. ఆశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి మహర్నవమి వరకు తొమ్మిది రోజుల పాటు ఈ వేడుకలు జరుపుకుంటారు. ప్రతియేటా సెప్టెంబర్ లేదా అక్టోబర్ మాసాల్లో జరుపుకునే జంట పండుగలు బతుకమ్మ, దసరా (విజయదశమి). తెలంగాణలో ఇవే అతిపెద్ద పండుగలు. అందుకే ఈ పండుగల సమయంలో ఇక్కడి సమాజమంతా కోలాహలంగా మారిపోతుంది.
శిబ్బి అని పిలవబడే పాత్రలో గానీ, తాంబాలం అని పిలవబడే పెద్ద రాగిపళ్లెంలో గానీ రంగు రంగుల పూలను త్రికోణాకారంలో.. ఒక్కో వరుసలో రంగులు మారుస్తూ పేర్చి బతుకమ్మను అలంకరిస్తారు. సాయంత్రం వేళ కూడళ్లలో బతుకమ్మలన్నీ ఉంచి వాటి చుట్టూ చప్పట్లు కొడుతూ వలయాకారంలో తిరుగుతూ లయబద్దంగా పాడే పాటలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. ఆ తతంగాన్ని స్వయంగా చూసి తీరాల్సిందేగానీ, వర్ణించడం కష్టం. తొలుత బొడ్డెమ్మతో మొదలై తొలిరోజు పేర్చే బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అని పిలుస్తారు. చివరి రోజు అంటే దసరా ముందు రోజు గానీ, రెండ్రోజుల ముందుగానీ సద్దుల బతుకమ్మగా వర్ణిస్తారు. సద్దుల బతుకమ్మలు ఎత్తులో, అందంలో ఒకదానితో ఒకటి పోటీ పడతాయి. చివరిరోజు బతుకమ్మలను ఎంత భారీగా పేరిస్తే అంత గొప్పగా భావిస్తుంటారు. బతుకమ్మలు ఆడిన తర్వాత చివరగా వాటిని నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు. నీటి ప్రవాహం అందుబాటులో లేని ప్రదేశాల్లో, నగరాల్లో బతుకమ్మలు నిమజ్జనం చేసేందుకే ప్రత్యేకంగా ట్యాంకులు నిర్మిస్తారు.
బతుకమ్మ పండుగ వర్షాకాలం చివరిలో.. శీతాకాలపు తొలిరోజుల్లో వస్తుంది. అప్పటికే చెరువులన్నీ నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు, రంగు రంగులలో అలరిస్తూ ఉంటాయి. వీటిలో గునగ పూలు, తంగేడు పూలు, బంతి, చేమంతి, నందివర్ధనం వంటి పూలతో బతుకమ్మలను పేరుస్తారు. గునగపూలకు ఆకర్షణీయమైన రంగులు కూడా అద్దుతారు. చివరిగా పసుపుతో చేసిన గౌరమ్మను గానీ, గుమ్మడి పూల గౌరమ్మను గానీ బతుకమ్మపై అలంకరిస్తారు. ఆఖరున బతుకమ్మపై అగరువత్తులు ముట్టించి కూడళ్లకు తీసుకెళ్తారు. ఆ తర్వాత దీపాలతోనూ బతుకమ్మను అలంకరిస్తారు. దాదాపు అర్థరాత్రి దాకా వలయాకారంలో తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడతారు. సద్దుల బతుకమ్మ నాడు పెద్ద పెద్ద బతుకమ్మలు పేర్చడం వల్ల మగవారు వాటిని నిమజ్జనం చేస్తారు. ఆతర్వాత మహిళలు వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు. ఇదే క్రమంలో ఇళ్ల నుంచి తీసుకొచ్చిన సత్తుపిండిని, మలీద ముద్దలను పంచుకుంటారు. మొక్కజొన్నలు, పల్లీలు, పెసలను వేయించి నెయ్యి కలిపి... చక్కెర పాకంతో గానీ, బెల్లం పాకంతో గానీ సత్తుపిండి తయారు చేస్తారు.
కూడళ్లలో బతుకమ్మలు ఆడటం పూర్తయిన తర్వాత వాటిని తలపై పెట్టుకొని చెరువులుగానీ, నీటి ప్రవాహాల దగ్గరకు గానీ పాటలు పాడుతూనే తీసుకెళ్తారు. భక్తిశ్రద్ధలతో బతుకమ్మలను నీళ్లల్లో నిమజ్జనం చేస్తారు. సాయంత్రం కూడళ్ల నుంచి మొదలు.. నిమజ్జనం చేసేదాకా బతుకమ్మ పాటలు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులూ ఈ తతంగం కొనసాగుతుంది. ఇప్పుడు నగరాల్లో, పట్టణాల్లో ఎక్కువగా తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ, చివరిరోజు సద్దుల బతుకమ్మలు మాత్రమే పేరుస్తున్నారు.
బతుకమ్మ పాటల్లో కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు పల్లవిస్తాయి. చాలా వినసొంపుగా ఉండే బతుకమ్మ పాటలు వింటూంటే మైమరిచిపోవడం ఖాయం. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ.
బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే అతిపెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృద్ధిగా పొంగిపొర్లే సమయంలో బతుకమ్మ పండుగ భూమితో, జలంతో చిరకాలం ఉండే మానవ అనుబంధాన్ని చాటిచెబుతుంది.
బతుకమ్మ పండుగకు ఆడపడుచులంతా అత్తింటినుంచి పుట్టింటికి వెళ్లడం ఆనవాయితీ. పుట్టింట్లోనే తొమ్మిదిరోజులూ బతుకమ్మ వేడుకలు జరుపుకొని, దసరా పండుగ జరుపుకొని తిరిగి వెళ్తారు.
బతుకమ్మ పండుగను తెలంగాణలో శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. అయితే.. ఈ సంప్రదాయం ఎలా మొదలైందన్న దానికి మాత్రం రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. నవాబులు, భూస్వాముల పెత్తందారీ తనంలో నలిగిపోయిన తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి ఆకృత్యాలకు నలిగిపోయిన వారిని తలచుకొని..తోటి మహిళలు వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకవమ్మా.. బతుకు అమ్మా.. అని దీవిస్తూ పాటలు పాడేవారని చెబుతారు. ఓ బాలిక భూస్వాముల ఆకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటే.. ఆమెను ఆ ఊరి ప్రజలు చిరకాలం బతుకమ్మా అని ఆశీర్వదించారట. ప్రతియేడూ ఆమెను తలచుకుంటూ బతుకమ్మ పండుగ జరుపుకునే వారని అంటారు. స్త్రీలు ఎటువంటి ఆపదలూ రావొద్దనీ, తమ పతులు, కుటుంబం చల్లగా ఉండాలని గౌరమ్మను ప్రార్థిస్తారు. మరో కథలో.. దక్షిణ భారతాన్ని పాలించిన చోళ వంశ చక్రవర్తి ధర్మాంగదుడు సంతానం లేక అనేక పూజలు చేయగా.. ఆయన భార్య లక్ష్మీదేవి అనుగ్రహంతో ఓ కూతుర్ని కన్నది. పసిబిడ్డ అయిన లక్ష్మి అనేక గండాలు గట్టెక్కిందని.. ఆమె తల్లిదండ్రులు బతుకమ్మ అని నామకరణం చేశారు. అప్పటినుంచి యువతులు మంచి భర్తను ప్రసాదించాలని కోరుతూ బతుకమ్మను కొలవడం ఆనవాయితీ అయ్యిందని కూడా కథ నానుడిలో ఉంది. ఇక మరో కథ చూస్తే.. ఓ ముద్దుల చెల్లికి ఏడుగురు అన్నదమ్ములున్నారు. అందరూ వీరాధివీరులే. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. అన్నలకు చెల్లెలంటే పంచ ప్రాణాలు కానీ.. వదినలకు మాత్ర అసూయ.ఆ బంగారు బొమ్మను బాధపెట్టేవారు. ఓరోజు వేటకెళ్లిన అన్నలు ఎంతకాలమైనా తిరిగి రాలేదు. అదే సమయంలో వదినలు సూటిపోటి మాటలతో వేధించడంతో చెల్లెలు ఇల్లు వదిలి వెళ్లిపోయింది. ఆ తర్వాత అన్నలు వచ్చి చెల్లెలు ఎక్కడని భార్యల్ని నిలదీశారు. విషయమై అర్థమైన అన్నలు.. తిండీ తిప్పలు లేకుండా, నిద్రాహారాల్లేకుండా చెల్లె కోసం వెదుకుతారు. ఓ ఊరి పొలిమేర దగ్గర బావిలో దాహం తీర్చుకుంటుండగా పెద్ద తామర పూవు కనిపించింది. వాళ్లను చూడగానే నీటిలో తేలుతూ వచ్చింది. ఆ తర్వాత కొంతసేపటికి ఆ రాజ్యాన్ని ఏలే రాజు వచ్చాడు. ఆ పూవును తీసుకెళ్లి తన తోటలోని కొలనులో వేశాడు. కొలనుచుట్టూ దట్టంగా తంగేడు మొక్కలు మొలిచాయి. కొంతకాలానికి విష్ణుమూర్తి దిగొచ్చి తామరను మనిషిగా చేశాడు. ఆమె శ్రీలక్ష్మి అవతారమని ప్రకటించాడు. పువ్వులకు బతుకుదెరువు చూపింది కాబట్టి బతుకమ్మ అయ్యింది. ఇదో జానపద గాథ. మహిషాసురుని చంపిన తర్వాత అలసి సొలసి మూర్చపోయిన అమ్మవారికి మహిళలంతా కలిసి పాటలతో స్పృహ తెప్పించే ప్రయత్నం చేశారని మరో ఐతిహ్యం. ఆత్మ త్యాగంతో తెలంగాణలోని ఓ పల్లెను వరద బారి నుంచి కాపాడిన త్యాగమూర్తే బతుకమ్మ అనేవారూ ఉన్నారు.
తెలంగాణ ఉద్యమంలోనూ బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైంది. ఉద్యమంలో బతుకమ్మతో చేసిన ఊరేగింపులు, కార్యక్రమాలు తెలంగాణ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించాయి.
ఇక సద్దుల బతుకమ్మ మరుసటిరోజు జరుపుకునే దసరా పండుగరోజు వాహనాలను కడిగి పూలు, కంకణాలతో అలంకరిస్తారు. వృత్తిపనుల వారు పనిముట్లకు పూజలు చేస్తారు. కొత్తవ్యాపారాలు కూడా మొదలు పెడతారు. ఇళ్ల నిర్మాణానికి ముగ్గు పోయడం, గృహప్రవేశాలు,దుకాణాల ప్రారంభం కూడా దసరా నాడు చేస్తారు.